చచ్చిపోయిన తాంబేలు
మల్ల బతికి తల విదిలించింది
బాయి నీళ్లను తన్నుకుంట
కొప్పు ముడివేసింది
నడుమును వంకర చేసి నవ్వింది
తలెలో..మిణుగుర్లను వెదజల్లింది
లాలాగూడ రైలు పట్టాల మీద
ఆగిన మాల్గాడి వెన్నెల్ల
ముచ్చట్లు మొదలుపెట్టిందీ..
మధ్యాహ్నం
కండ్లు తెరుచుకుని ఆడిన నిద్ర
బాయితో..
దానిది కుటంచోరు ధ్యానం
కుటంచోరు మౌనం
అటుపొంటి ఇటుపొంటి
పొర్లుకుంట
ఎల్లమ్మ బాయిలో
మల్లా నన్ను అరుసుకుంటనే..
మా అవ్వ తాంబేలు
నా చింత చితుకుల మీద
నా గుండెను బెణికిస్తున్నది
బాయి మొత్తం
పాత బెల్లం వాసన
పాత వాన వాసన
తాంబేలు మీద
నా పాత పుస్తకమొకటి
పడుకొని నిద్రపోతున్నది
ఎన్నుపూసలోని తల్లి
ఎల్లమ్మ
బాయిల తాంబేలును
నన్నూ...
ఊయలూపుతున్నదీ
మాయగొలుపుతున్నదీ

కవి సిద్ధార్థ
కవి సిద్ధార్థ తెలంగాణ అగ్రశ్రేణి కవులలో ఒకరు.
గతంలో దీపశిల, బొమ్మలబాయి కవితా సంపుటాలు తెచ్చారు. సినిమారంగంలో పని చేస్తున్నారు.
స్వగ్రామం నల్గొండజిల్లా పోచంపల్లి దగ్గర చినరావులపల్లి. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
