రాత్రి పది గంటలైంది. నేను నా క్లినిక్ లో కూర్చుని మెడికల్ జర్నల్ చదువుతున్నాను. ఉన్నట్టుండి తలుపు తెరుచుకుంది. ఒకాయన ఒక పిల్లాడిని తీసుకుని లోపలికి వచ్చాడు. నాకు అలా తలుపు తెరిచి ఉంచినందుకు నాకు నర్స్ పైన కోపం వచ్చింది. నేను రోగులను చూసే సమయం ఎప్పుడో గడిచి పోయింది అతనికి అదే చెప్పాను. “నేను రోగులను చూసే సమయం దాటిపోయింది. ఉదయమన్నా రండి లేదా మరో డాక్టర్ దగ్గరికన్నా వెళ్ళండి” కొద్ది పాటి విసుగ్గా అన్నాను అతని వైపు పరీక్షగా చూస్తూ.
మనిషి కొంచెం పొట్టిగా ఉన్నా దేహం మాత్రం కసరత్తు చేసినట్లు ధృడంగా ఉంది. అతని చేతిలో పసివాడు ఎగరొప్పుతున్నాడు. బహుశా న్యుమోనియా వచ్చినట్లు ఉన్నది. మెడ పక్కకి వాల్చేసి పిల్లాడు పోయేటట్లే
ఉన్నాడు. అతడు ఆందోళన నిండిన గొంతుతో “మేడమ్ కావలిస్తే ఫీసు తీసుకోండి అంత కంటే మీకేం కావాలి చెప్పండి” అన్నాడు. నాకు మహా చిరాకేసింది. ఫీసు తీసుకోవడం గురించి పెద్ద ఆలోచన ఏమీ లేకపోయినా అతనామాట అనేసరికి నాకు కోపం వచ్చింది. “ఫీసు తీసుకోకుండా ఏ డాక్టర్ అయినా చూస్తాడా ఎక్కడైనా., అది కాదు నా డ్యూటి టైమ్ అయిపోయింది. ఇది డాక్టర్లు విశ్రాంతి తీసుకునే సమయం అని నీకు ముందే తెలిసి ఉండాలి. రెండో విషయం ఏంటంటే నీ కొడుకు పరిస్థితి అస్సలు బాగా లేదు.” నా మాటలింకా పూర్తి కానే లేదు.”అందుకేగా తెచ్చింది. నా మరదలు కొడుక్కి కూడా అస్సలు బాగా లేకపోతే మీరే ఠీక్ చేశారు” అన్నాడు. అతని మాట తీరు అదీ కాస్తంత మర్యాదగానే ఉంది. “నాతోనే చూపించుకోవాలంటే కొంచెం ముందుగా రావద్దా”నేను విసుగ్గా అన్నాను.
“నేను తప్ప వీడిని ఇక్కడకి తెచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు మేడమ్. పైగా నేను కాస్త ఆలస్యంగా వచ్చాను” అన్నాడతను. అతని కంటికి, చెవికి మధ్య లోతైన గాయం ఉంది. ఖచ్చితంగా ఎవరితోనూ గొడవ పడి వచ్చి ఉంటాడు. సందేహమే లేదు. పిల్లాడు బలహీనంగా ఏ క్షణమో చచ్చి పోతాడేమో అన్నట్లు ఏడవసాగాడు. నా మనసు కరిగిపోయింది. నేను నా అధికార దర్పాన్ని పక్కన పెట్టేసి ఆ పిల్లాడికి చికిత్స ఇవ్వడానికి సిద్దం అయిపోయాను. ఆ మనిషి వెంటనే తన జేబులో ఉన్న పది రూపాయల నోటు తీసి అక్కడ ఉన్న టేబుల్ పైన పెట్టాడు. నేను వెంటనే “ఇప్పుడై తే నేనొక ఇంజెక్షన్ ఇచ్చేస్తాను. కానీ ఇదే ఇంజెక్షన్ ప్రతీ నాలుగు గంటలకొకసారి మరో నాలుగు రోజుల వరకూ ఇవ్వాలి. దాని కోసం ఏర్పాట్లు చేసుకోండి” అన్నాను. అతని బీద స్థితి తెలుస్తూనే ఉంది నాకు. “చూడండీ ఫీసు అవసరం లేదు. ఇంజెక్షన్ ఖరీదు నేను పెట్టుకుంటాను. కానీ మిగతా మందుల సంగతి మీరు చూసుకోండి” అన్నాను. అతను వెంటనే కోపంగా “మీ ఉచిత చికిత్స., మెహర్బానీ నాకేమీ అక్కరలేదు” రోషంగా అంటూ తన కుర్తాలో చేయిపెట్టి ఒక చిన్న దస్తీ లాంటి గుడ్డను బయటకు తీశాడు. ఇంతలో ఫోన్ మోగింది. నేను అతని వైపు చూస్తూనే రిసీవర్ ఎత్తాను. అతను ఆ మూట ముడి విప్పుతుంటే నేను కొద్దిగా ఆందోళన పడ్డాను. ఇంతలో అతను ముడి పూర్తిగా విప్పి వత్తుగా ఉన్న ఐదు వందల రూపాయల మూటను టేబుల్ మీద పెట్టాడు. దాదాపు ఒక ఐదువేల వరకూ ఉంటాయి అవి. మిగతావి అన్నీ పది రూపాయల నోట్లు. “ఇవి చాలా., ఇంకా కావాలా” అతను అడిగాడు ఒక రకమైన పొగరుతో. నేను ఫోన్ లో అవతలి వైపు నుండి వస్తున్న ప్రశ్నలకు అవును., అవునంటూ సమాధానం ఇస్తూనే అతని వైపు తిరిగి “నీ పేరేంటి ”? అనడిగాను. “కమ్మన్” అంటూ కొంచెం బెదురుతూ చెప్పాడు. “కమ్మన్” ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందే అనుకున్నా. హా., గుర్తుకొచ్చింది . ఇన్స్పెక్టర్ ఇక్కడకి దొంగని వెతకడానికి వచ్చినప్పుడు ఈ కమ్మన్ పేరు వాడారు. అలాగే అతని చెవికి, కంటికి మధ్య ఒక గాయం గుర్తు కూడా ఉందని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారప్పుడు. నేను అతని వైపు పరీక్షగా చూశాను. అతను నిర్లక్ష్యంగా ఎటో చూస్తూ ఉన్నాడు. నేను ఇంజెక్షన్ తయారు చేస్తూ “ఏం చేస్తుంటావు”? అనడిగాను. ఆయన జవాబు ఇచ్చే లోపల నేనే అన్నాను “బండి నడుపుతుంటావు కదా” అని.
“మీకెలా తెలుసు”? అతను కొద్దిగా ఖంగారుగా అంటూనే “మీరెక్కడ చూశారు నన్ను నేను ఇక్కడికి ఎప్పుడూ రానే లేదు” అన్నాడు. నేను సిరంజీ లో మందు నింపుతూ “కమ్మన్ నువ్వు మర్చిపోయావు. రెండు నెలల క్రితం నువ్వు మా ఇంటికి వచ్చి ఇల్లు మొత్తం శుభ్రంగా ఊడ్చుకు పోయావు. అసలు నువ్వు దొంగతనాలు ఎందుకు చేస్తావు”? అని అడిగాను. ఎందుకు చేస్తారో తెలియనట్లే. ఈ సారి అతను తొణక్కుండా “మేడమ్ ఎవరి వృత్తి వాళ్లది” అన్నాడు. ఖంగారు పడడం ఈసారి నా వంతు అయింది. “ముందు ఇది చెప్పండి. నా పేరు ఎవరు చెప్పారు మీకు? అతనడిగాడు. “ఇక్కడికి నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాళ్ళు నీ పేరు తీసుకుని మాట్లాడుకున్నారు. అంతే కాదు నువ్వు చేసిన మహత్కార్యాలనూ ఏకరువు పెట్టారులే” అన్నాను నేను.
కమ్మన్ వెంటనే పోలీసులపై తిట్ల దండకం ఎత్తుకున్నాడు. “ఈ పోలీసులు ఉన్నారు చూడండి., మహా బద్మాషులు. ముందు వాళ్ళ హిస్సా(భాగం) వాళ్ళు వసూలు చేసుకున్నాకే మాకు మిగతాది దక్కుతుంది. “బెహన్ ,. ఈ పోలీసు మాదర్ చోదులు మమ్మల్ని బదనామ్ చేస్తారు. దొంగతో నువ్వు దొంగతనం చేయవోయ్ అంటారు. కానీ వీళ్ళేమో పెద్ద మనుషుల్లాగా “ఈ దొంగలున్నారే ., అంటే మేమన్నమాట ., పూర్తిగా ఇళ్ళు లూటీ చేసేస్తారు” అంటూ నాటకాలు ఆడతారు. ఇన్స్పెక్టరూ .. నా కొడకా నీ పని నేను తరువాత చెప్తా. మా ఇంటికి మా మేమ్ సాహెబ్ ఏడాదిలో వందల సార్లు కబురు లేకుండానే ఆదాటున అద్దె వసూలు కోసం వస్తుంటుంది. కానీ ఈ పోలీసు వాళ్ళున్నారే వసూళ్ల కోసం నాకు ముందుగానే కబురు చేసి మరీ వస్తారు. అయినా నేను వాళ్ళకి పట్టు బడ్డా కానీ., నన్నేం ఏళ్లు కాదు కదా నెలల తరబడి కూడా జైల్లో బంధించలేదు. నా మీద ఐదేళ్ల అరెస్ట్ వారంట్ ఉంది. కానీ అల్లాహ్ దయవల్ల నేనిప్పటిదాకా పట్టు బడలేదు.” అతడు ఏదో సంజాయిషీ ఇస్తున్నట్లే చెప్తూ పోతున్నాడు. నేను పిల్లాడికి ఇంజెక్షన్ ఇవ్వడానికి వాడి కాలు పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే వాడు గింజుకుంటూ ఏడవసాగాడు. కమ్మన్ మాత్రం చెప్పడం ఆపలేదు.
“ఆ దొంగ నా కొడుకులు ఎలాంటి వాల్లో తెలుసా మేడమ్ ., వాళ్ళే అరెయ్ దొంగ బచ్చాల్లారా వెతకడానికి వస్తున్నాం కాస్త సర్దుకొండిరా ఎక్కడికక్కడ” అని మాకు ముందే చెబుతారు. మేడమ్ ., ఈ పోలీసులు మాకు సహకరించక పోతే ఇక్కడ ఏ ఇలాకాలో కూడా రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండలేము. మీది కెళ్ళి వీళ్ళే మమ్మల్ని బద్నాం చేస్తారు”
“కాస్త పిల్లాడిని కదల కుండా పట్టుకుంటావా” నేను అతని మాటలకి అడ్డు పడుతూ అన్నాను.
“సగానికి సగం వాళ్ళే తినేస్తారు. మాకేమీ మిగలదు . కష్టం మాది ఫలితమేమో వాళ్లది. ఒక వేళ పట్టు బడ్డామనుకోండి. వాళ్లకేం హాయిగా ఉంటారు. మేమే జైల్లో పప్పు రుబ్బుతూ బతకాలి. ఈ పోలీసు నా కొడుకులేమో కష్టం లేకుండా పుణ్యానికి సంపాదించింది తింటూ హాయిగా ఇళ్ళల్లో ఉంటారు” అతని మొఖం కోపంతో ఎరుపెక్కింది. మెల్లిగా పెరుగుతూ పోతున్న పిల్లాడి ఏడుపుని కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. నేను పిల్లాడిని లేపి టేబుల్ పైన కూర్చోపెట్టి వీపు మెల్లిగా తట్ట సాగాను. అతనికి, నాకూ మధ్య మునుపటి సంకోచం ఏదో తగ్గినట్లు అనిపించింది. నేను కూడా అతనితో మాట్లాడాలి అనుకున్నా. ఎందుకో తొలిసారి ఒక దొంగతో మాట్లాడాలి అనిపించింది విచిత్రంగా. అదీ మా ఇల్లు శుభ్రం చేయడానికి వచ్చి శుభ్రంగా దొంగతనం చేసిన దొంగతో. “కమ్మన్ నువ్వు దొంగ తనం చేస్తావు. మా ఇంట్లో కూడా పూర్తిగా ఏమీ మిగలకుండా దొంగతనం చేశావు. కనీసం వేసుకునే బట్టలు కూడా మిగుల్చకుండా. నీకు అలా ఎలా చేయాలనిపించింది ఇంత కూడా జాలి, దయ లేకుండా చెప్పు? ఇంటి అద్దాలని కూడా వదల్లేదు ఏమంత వస్తుంది నీకు అధ్ధాలు అమ్మితే చెప్పు? అసలు అద్ధా లతో ఏం పని నీకు”? అనడిగాను. “ఏదీ వృధా కాదు మేమ్ సాహెబా” గొంతులో ఒక రకమైన ధీమాతో తొట్రుపడకుండా అంటూన్న అతన్ని ఆశ్చర్యంగా చూశాను నేను. “పోనీ మా అమ్మీ ఒక్కగానొక్క నిషానీ దుపట్టా అది కూడా తీసుకున్నావు ఏం చేశావు దాన్ని? అడిగాను బాధగా .
“ఇతన్ని పోలీసులకి పట్టిస్తే”? మనసులోనే అనుకున్నాను.
“ఎలా ఉంటుంది అది” కమ్మన్ అడిగాడు.
“ఎలా గుర్తు పడతావు దాన్ని ఎన్నో దొంగతనాలు చేస్తూ ఉంటావు కదా నువ్వు? అదే తెల్లనిది, జాలీలు జాలీలుగా ఉంటుంది” అన్నాను ఏదో కొద్ది ఆశ నాలో. నేనతన్ని మాటల్లో పెట్టె ప్రయత్నం చేస్తున్నాను. “నువ్వసలు ఈ దొంగతనాలు ఎప్పటి నుంచీ మొదలెట్టావేంటి”? అడిగాను నేను.
“చాలా చిన్న వయసులోనే మొదలెట్టానులే. ఎలా అంటారా అందరూ ఎలా చేస్తారో అలానే ., మా ఉస్తాద్ దగ్గర నేర్చుకున్నాలే” నిర్లక్ష్యంగా అన్నాడు కమ్మన్ .
“ఉస్తాదు ల నుంచా .. దొంగతనం నేర్పడానికి కూడా ఉస్తాదులుంటారా “? నేను ఒకింత ఆశ్చర్యంగా అడిగాను.
“మరి ., ఏమనుకున్నారు మీరు డాక్టర్ చదువు ఎక్కడ నేర్చుకున్నారు”? వ్యంగ్యంగా అడుగుతున్నాడా ., ఏమో?
“నేను మెడికల్ కాలేజీ లో చేరి నేర్చుకున్నాను.” గంట కొట్టనా వద్దా., ఆలోచిస్తున్నాను నేను.
“మాకు కూడా కాలేజీలుంటాయ్” కమ్మన్ నవ్వుతూ అన్నాడు. మళ్ళీ తానే “అవును నిజమే నా కాలేజీ జైలే మరి. ఒక దెబ్బలాటల కేస్ లో ఆరు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. అక్కడే ఉస్తాదు పరిచయం అయ్యాడు.” కమ్మన్ ఇంక ఏదో చెప్పబోయాడు. ఇంతలో పిల్లాడు మళ్లీ ఏడుపు షురూ చేశాడో లేదో తలుపులు ధడాలుమని తెరుచుకోవడం, మిలిటరీ డ్రెస్సు లో ఉన్న నా తమ్ముడు లోపలికి వచ్చేయడం జరిగిపోయాయి. నా తమ్ముడు నడుముకు రివాల్వర్ కూడా వేలాడుతున్నది. మనిషి కమ్మన్ కంటే కూడా బలంగా, ధృడంగా ఉన్నాడు. కమ్మన్ నా దగ్గరికి వస్తున్ననా తమ్ముణ్ణి చూసి ఖంగు తిన్నాడు. వెంటనే పిల్లాడిని ఎత్తుకుని తలుపు వైపు నడవసాగాడు. పట్టివ్వనా వద్దా అన్న సందిగ్ధంలో ఉండిపోయిన నేను కమ్మన్ నా కన్సల్టేషన్ ఛాంబర్ దాటి బయటకు ఎప్పుడూ వెళ్లాడో కూడా అర్థం కాలేదు.
“దీదీ ఏమైంది ఏదో పరేషానిలొ ఉన్నట్లున్నావు” నా తమ్ముడు అడిగాడు.
“ఇప్పుడు బయటకు వెళ్ళింది ఎవరనుకున్నావు ., నా ఇంట్లో దొంగతనం చేసిన దొంగ కమ్మన్” అన్నాను
“నీకె లా తెలిసిండీ విషయం”? తమ్ముడు ఆశ్చర్యంగా అన్నాడు.
“ఇతనితో మాట్లాడాను కదా అప్పుడు అర్థం అయింది”అన్నాను.
“తెలిసీ ఎందుకు వదిలేసావు మరి”? అంటూనే తమ్ముడు తలుపు వైపు పరిగెత్తి బయట అటూ ఇటూ చూశాడు. అక్కడ ఎవరూ కనిపించక పోయేసరికి మరింత ముందుకు వెళ్ళి వీధి మలుపులోకి తొంగి చూశాడు. ఊహూ., వాడికి అక్కడ కూడా కమ్మన్ కనిపించలేదు.
వెనక్కి వచ్చిన తమ్ముడు కాస్త కోపంగా “భలే ఉన్నావే దీదీ నువ్వు? చేతికి దొరికిన దొంగానెలా వదిలేశావసలు? గూర్ఖాని నౌఖరిలో ఎందుకు పెట్టుకున్నట్లు చెప్పు? అతన్ని కేకేసి పిలవక పోయావా., కనీసం నేను వచ్చినప్పుడైనా నాకెందుకు చెప్పకుండా గమ్మున ఉన్నావెందుకు” ? అంటూ తన చేతిని రెవాల్వర్ మీద పెట్టి “నేనైతే వాణ్ణి వదిలి వుండే వాణ్ణే కాదు” అన్నాడు నిరాశ నిండిన మొఖంతో. నా తమ్ముడు మంచి వేటగాడు కూడా. చేతికి చిక్కిన జంతువు చిక్కి నట్లే చిక్కి జారిపోతే కలిగే కోపం అతని మొఖం లో కనిపించింది.
“దునియాలో ఎవరైనా., ఎక్కడైనా ఇలా చేతికి చిక్కిన దొంగని వదిలేసిన వాళ్ళు ఉండి ఉంటారా అసలు”? మళ్ళీ తానే అన్నాడు.
నేనేం మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయాను.
“ఏమైనా అనుకో దీదీ., నీది చాలా జాలి గుణం. అతనికి పిల్లలు ఉన్నట్లున్నారేమో కరిగిపోయి వదిలివేశావు నాకు తెలుసులే. హమ్మ్ ., చూడు వీడి ధైర్యం., ఇక్కడ ఇరవై రూపాయలు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇవి కూడా దొంగతనం చేసి సంపాదించిన డబ్బులయి ఉంటాయి” అన్నాడు
నేను ఊరుకోకుండా “అతని దగ్గర ఐదువందల నోట్లు ఆరు దాకా ఉన్నాయి” అన్నాను. చూశాను కదా నేను అతను రోషం తో టేబుల్ మీద డబ్బు పెట్టినప్పుడు.
“ ఓహ్హ్ అల్లాహ్ ., దీదీ నువ్వు నా కంటే వయసులో పెద్దానివే వొప్పుకుంటా. కానీ నువ్వో మూర్ఖురాలివి” అన్నాడు తమ్ముడు కాస్త కోపంగా బోలెడంత ఆశ్చర్యం తో.
ఇప్పుడు అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. నా ఇంట్లో దొంగతనం చేసిన దొంగ నా క్లినిక్ క్కే వచ్చి నాతో ట్రీట్మెంట్ చేయించుకుని మరీ రాజాలా వెళ్లాడని. నేను అతన్ని అవకాశం దొరికినా పట్టివ్వలేదనీను. అందరూ నన్ను ఎగతాళి చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు కానీ ఎవ్వరూ కూడా నా హృదయంలో జరిగిన అలజడిని, ఘర్షణని అర్థం చేసుకోలేక పోయారు. ఇప్పటిదాకా నాకు కూడా అర్థమే కాలేదు నేను ఎందుకు అలా ఆ దొంగని వదిలేశానో., నిజంగా అతను అంత పెద్ద గజ దొంగనా., తప్పు చేశానా ఏమో? నా దోస్తు ఒకాయన పోలీసు ఆఫీసర్.“మీరేం చేశారో మీకు తెలుసా? అరెస్ట్ వారెంట్ ఉన్న దొంగ దొరికాక కూడా వదిలేయడం చట్ట రీత్యా నేరం”? నేను నేరం చేశానా?
నిజమేనేమో బహుశా ., కానీ నేను ఆలోచిస్తున్నది పూర్తిగా వేరు. ఏ నిజమైన దొంగల మీద అయితే అరెస్ట్ వారెంట్ లేదో., ఇక ఎప్పటికీ ఉండబోదో వాళ్ళ గురుంచి ఆలోచిస్తున్నా. అసలు వాళ్ళనెవరు పట్టించాలి. మీరే చెప్పండి? చట్టానికి చిక్కకుండా,. అరెస్ట్ వారెంట్ లను తప్పించుకుంటూ ఉండే వాళ్ళని ?
చెప్పుకోడానికి చాలా రకాల దొంగతనాలు ఉన్నాయి. జేబులు కత్తిరించడం, ఇళ్ళ మీద దాడులకి దిగి భయపెట్టి దోపిడీ చేయడం, ఎత్తుకు పోవడం, ఇతరుల కష్టాన్ని ఏదో ఒక రూపంలో దోచుకుని ఇళ్ళల్లో దాచుకోవడం, విదేశీయులని లూటీ చేసి మింగేయడం అబ్బో ఎన్ని రకాల దొంగతనాలున్నాయని? ఇవన్నీ దొంగతనాలు కావా?
ఈ లోకుల మాటలను నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ చుట్టూ పక్కల వాళ్ళు నేను దొంగని విడిచి పెట్టి చాలా పెద్ద తప్పు చేస్సినట్లు మజాక్ చేస్తుంటే, నన్ను చూసి నవ్వుకుంటుంటే నాలో ఆగ్రహం పెల్లుబిక్కింది. నేను నిజంగా కమ్మన్ అనే దొంగని వదిలేసి చేయకూడని తప్పు చేశానా అనే సందేహం వచ్చేసింది. మనశ్శాంతి లేకుండా పోయింది.
చూడండీ నేను ఈ నగరం లో ఒక పౌరురాలిని. నాకూ ప్రతీ పౌరునికి ఉండే బాధ్యతలు ఉంటాయి. నేను వాటిని నిర్వర్తించకుండా ప్రభుత్వం పట్ల ద్రోహం చేశానా? ఈ సందేహాలు నన్ను నిలవనీయలేదంటే నమ్మండి. అప్పుడు నాలో చాలా కొత్త ప్రశ్నలు రేగాయి. ఇక నా దృష్టి నాలుగు వైపులా పరి గెత్తింది. ఇక్కడ చాలా మంది దొంగలు బాజాప్త బహిరంగంగా తిరుగుతారు.కాకపోతే వాళ్ళు కమ్మన్ లాగా పూరి గుడిసెల్లో., మురికి వాడల్లో కాకుండా వాళ్ళు పెద్ద పెద్ద బంగాళాల్లో ఉంటారు. పెద్ద పెద్ద విమానాల్లో తిరుగుతూ ఉంటారు. చాలా పెద్ద మొత్తంలో డబ్బు తింటారు., తినిపిస్తారు కూడా. ఇక్కడ కమ్మన్ ఏదో తన కుటుంబ క్షేమం కోరి, తప్పించుకోవడానికి పోలీసులకి కొద్ది లంచం ఇస్తుండవచ్చు వాళ్ళతో భవిష్యత్తులో ఏ ప్రమాదం రాకుండా. కానీ ఈ పెద్ద మనుషులంతాఈ నేరం చేయడంలో కమ్మన్ కంటే ఘోరంగా ఉన్నారు. దేశం లో ఉన్న పోలీసు, మిలిటరీ వ్యవస్థ మొత్తం ఈ బీద, నిస్సహాయ కమ్మన్ సంపాదించే డబ్బు వెనుక పడింది. పాపం కమ్మన్ తన 500 రూపాయల నోట్లను దాచుకుని బయటకి మొండిగానో.. గర్వంగానో తన దొంగ తనం గురించో, తను పోలీసులకి ఇస్తున్న లంచాల గురించో, తను తెలివిగా తప్పించుకోవడం గురించో వొట్టి ప్రగల్భాలు మాట్లాడి ఊరుకుంటాడు కావచ్చు. కానీ ., వీళ్ళున్నారే ఈ ముసుగులేసుకున్న పెద్ద మనుషులు? పెద్ద మొత్తాల్లో లంచం తినీ, ఇచ్చీ అహంకారంతో మాట్లాడడమే కాదు.. నీతిమంతులైన మర్యాదస్తులలాగా నటిస్తూ ఆదేశాలు కూడా ఇస్తారు. నీతులు కూడా బోధిస్తారు. ఇదీ వీళ్ళ అసలు రంగు. ఇక మీరే చెప్పండి నేను కమ్మన్ న్ని ఎందుకు పట్టివ్వలేదో.. మా తమ్ముడన్నట్లు నేను మూర్ఖురాలినా., వీళ్ళంతా వెక్కిరిస్తున్నట్లు నేను తప్పు చేశానా ., నేరస్థురాలినా చెప్పండి !

very good