ఎన్నిసార్లు తరిమానో దానిని
నా నీరవ నిశ్శబ్ద సముద్రాల పైనో
నా సమూహ కోలాహాల జలపాతాల పైనో
నా కనుల కొసల అశ్రు కొనల పైనో
నా పెదవి చివర మెరిసే చిరునవ్వుల పైనో
దుఃఖపు జీరవలె, ఆనంద భాష్పం వలె
ఒక దిగులు పక్షి వచ్చి వాలుతుంది
వెలుగు చీకట్ల సయ్యాటలాడే
ప్రభాత, సాయం సంధ్యల వర్ణాలను
నా బాల్యం నుండీ ఈ నాటి వరకూ సంభ్రమాశ్చర్యాలతో తదేకంగా చూస్తాను
ఆ పక్షి అప్పుడే నాతో సంభాషించిన
పురా జ్ఞాపకం తటాలున మెరుస్తుంది
దేనిలోనైనా కేవలం రెంటినే చూసే వారికి
పక్షుల్ని తరిమివేయడాన్ని ఎన్నడో నేర్చుకున్న మనుషులకి
నా మీద వచ్చి వాలే ఆ పక్షి గురించి చెప్పబోతాను
నా వైఫల్యాలన్నీ ముందుగానే
ఎరిగిన జ్ఞానులవలె
వాళ్ళు ఎగతాళిగా నవ్వుతారు
పక్షులను ఎలా వెళ్లగొట్టాలో పదే పదే
పాఠాలు చెబుతారు
అనేక మార్లు
వాళ్ళు చెప్పినట్లే దాన్ని తరమబోతాను
ఎక్కడికి పోతుందది?
గాయపడిన పక్షికి నీళ్లు తాపి, సేద తీర్చి
మళ్ళీ ఆకాశంలోకి ఎగరేసిన సిద్ధార్థుడే నేమో ఆ దిగులు పక్షి
చింతలే ఎరుగని నా అమాయకపు బాల్యంలోనే
బహుశా నా కలలలోనో
నా అంతః చేతనలోనో ఎన్నడో అది
నా లోపలే ఒక వెచ్చటి గూడు కట్టుకున్నదేమో
ఈ దిగులు దుఃఖాల ఏకాకితనాల
వెతుకులాటలన్నీ
నేను, నాది అనే వాటి కన్నా వేరైన
మరేదో నే నెరుగని ఒక తాత్విక అన్వేషణల తపన కాబోలు
తీర్పరులైన మనుష్యల ఎదుట నిలిచి
నాది కాని ఇతరుల దుఃఖానికి కూడా
నేను దుఃఖిస్తానే మాట చెప్పడం కన్నా వ్యర్థం మరేముంటుంది?
వారి వారి స్వీయ కల్పనల సాలెగూళ్ల
భద్ర భవన నిర్మాణాలతో తీరిక లేని వాళ్ళకి
పూల పుప్పడి వలే రాలిపోయిన
సీతాకోక చిలుకల రంగులు కనపడవు
వాటి విరిగిన రెక్కల చప్పుడో
నిశి రాత్రి దిగులు పక్షి పాడే మానవుల విషాద గీతాలో ఎన్నడూ వినపడవు
లోలోపల ఆనందం నాట్యం చేస్తున్న వేళలలోనూ నాకెందుకో
ఆ పక్షి దిగులు పాట వినపడుతుంది
పక్షులని తరిమే అదేదో ఆ అద్భుత
విద్య నాకు వద్దనుకున్నాక
ఇప్పుడు ఆ దిగులు పక్షి రాల్చిన
ఈకల పైన నేను నాదైన కవిత్వాన్ని రాస్తాను
విమల
28.3.2025
Super poem