ఇవాళ అమ్మకు
గుడ్ నైట్ చెప్పలేదు
పిచ్చిది
అలిగినట్టుంది పాపం
పిచ్చిదే కానీ
అలకతో కూడా
అందంగా జో కొడుతుంది
గర్భశోకాన్ని మోస్తూ
•
మట్టిలో.. శాశ్వతంగా నిద్రిస్తున్న నాకు
ఎలా తెలిసింది అంటారా
నేల మీద అమ్మ స్పర్శలు
భూగర్భ జలానిక్కూడా తెలుస్తుంటాయి
నిత్యం
అమ్మలో ఊరుతున్న కన్నీళ్ళే
-వంతెన.
•••
మట్టిలో నేను
స్వచ్ఛమైన కన్నీళ్ళతో నిర్మాణమవుతున్నాను
కొత్త శ్వాసలతో
మళ్ళీ చిగురించడానికి.
ఇక
అమ్మకు
గుడ్ నైట్ చెప్పాలి.
ఒక ఆలీవ్ మొక్కనై!