శవపేటికలు చేసేవాడు

Spread the love

శవపేటికలు తయరుచేసే అడ్రియన్ ప్రొఖోరోవ్ మిగిలిన వస్తువులన్ని శవయాత్ర వాహనంలోకి ఎక్కించి, నలుగవసారి వాహనాన్ని బస్మాన్నియా నుండి నికిట్స్కేయా వీధి వైపు పరుగెత్తించాడు. అడ్రియన్ ప్రొఖోరోవ్ తన ఇంటిని నికిట్స్కేయా వీధికి మార్చుతున్నాడు.ఇప్పుడున్న షాపుకి తాళం వేసి, గేటుకి “ఈ షాపు అమ్మబడును / అద్దెకు ఇవ్వబడును” అనే బోర్డు తగిలించి, కొత్త ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడు.ఎన్నో రోజుల నుండి కలలు కన్న చిన్న పసుపు రంగు ఇల్లును, దాచి పెట్టిన డబ్బుతో అతను సొంతం చేసుకున్నాడు. ఇన్నేళ్ళ కల నిజమైనందుకు ఈ పాటికి ఆనందంలో తను ఎగిరి గంతులేస్తాడేమో అనుకున్నాడు. కానీ అలాంటి అనుభూతి  ఏమి లేకుండా సాధరణంగా ఉండడంతో  అడ్రియన్ ప్రొఖోరోవ్ ఆశ్చర్యపోయాడు. కొత్త గుమ్మంలో కాలు పెడుతూ, పద్దెనిమిది ఎళ్ళుగా శిధిలావస్థకుచేరిన చిన్న ఇంట్లో అతను జీవితాన్ని ఎలా నెట్టూకొచ్చాడో గుర్తుచేసుకున్నాడు.కొత్త ఇంటిని సర్ధడంలో చురుకుదనం లేకుండా నెమ్మదిగా పనిచెస్తున్నారని తన ఇద్దరు అమ్మయిలను, పనిమనిషిని తిట్టాడు. తరువాత అతనే వాళ్ళకి సహాయం చేసాడు. త్వరగా ఇల్లు సర్దేసారు. దేవుడి పటాలు వేలాడదీసారు, కప్‌బోర్డులో వంట పాత్రలు, డైనింగ్ టేబుల్, సోఫా, మూలకి మంచం, వంట గది-లివింగ్ రూమ్‌లో అడ్రియన్ ప్రొఖోరోవ్ చేత్తో చెక్కిన శవపేటికలు అన్నీ రంగులసైజులలో నింపేసారు. అలాగే కప్‌బోర్డు మీద అంత్యక్రియలకు వాడే టోపీ, పైతొడుగు, టార్చి అమర్చారు. గేటుకి  బొద్దుగా ఉన్న క్యుపిడ్ చేతిలో టార్చ్ బొమ్మ వేసి ఉన్న బోర్డు తగిలించారు. ఆ బోర్డు మీద “ఇచ్చట సాధరణ, పెంటింగ్ చెయ్యబడిన శవపేటికలు అమ్మబడును. శవపేటికల లోపల సాటిన్, వెల్వెట్, క్రేప్‌లతో అలంకరించబడును. పాత శవపేటికలు రిపైర్ చెయ్యబడును, అద్దెకు ఇవ్వబడును” అని రాసి ఉంది.ఇద్దరు అమ్మయిలు వాళ్ళ రూమ్‌కి వెళ్ళారు. అడ్రియన్ ఒకసారి ఇల్లంతా కలియజూసి, కిటికీ పక్కన కూర్చుని, టీని తీసుకురమ్మని పనిమనిషికి చెప్పాడు. షేక్స్పియర్, వాల్టెర్ స్కాట్ ఇద్దరూ శవాలుపాతిపెట్టడానికి గోతులు తీసే వాళ్ళని దయా, సరదా వ్యక్తులుగా చిత్రికరించారు.

కాని వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నిజానికి ఈ శవపేటికలు తయారు చెయ్యడం విసుగు వ్యవహారం. ఇది తాయారు చేసే వాళ్ళు కూడా ఎప్పుడూ చికాకుగా చిర్రుబుర్రులాడుతుంటారు. అడ్రియన్ ప్రొఖోరోవ్ కూడా చికాకుగా ఎదో ఒకటి ఆలోచిస్తుంటాడు. ఎక్కువగా మాట్లాడడు. తన కూతుళ్ళు ఉట్టిగా కూర్చున్నప్పుడు తిట్టడానికో, చావు బేరం గట్టిగా మాట్లాడడానికో తప్ప నోరు తెరవడు. అడ్రియన్ ప్రొఖోరోవ్ కిటికీ పక్కన కూర్చుని, ఏడవ కప్పు టీ తాగుతూ ఎప్పటిలాగే విచారంగా గతాన్ని తవ్వుతున్నాడు. గతవారం రిటైర్డ్ బ్రిగేడియర్ అంత్యక్రియల్లో కుండపోత వాన పడింది. ఆ అంత్యక్రియల్లో అడ్రియన్ ప్రొఖోరోవ్ షాపు నుండి అద్దెకి ఇచ్చిన కోట్లు వానలో నాని కుచించించుకుపోయాయి, ఇక టోపీలు అయితే వాటి రూపాన్ని కోల్పోయి ముడతలు తేలాయి. అపారమైన నష్టం వాటిల్లింది. అయితే ప్రొఖోరోవ్ ఇది ముందే ఊహించాడు. తన షాపులో ఉన్న స్టాక్ చాలా పాతది కావడంతో ఇలాంటి ఒకరోజు వస్తుందని అతనికి ముందే తెలుసు. ఈ నష్టాన్నంత షాపు ఓనర్ భార్య తృఖినా అంత్యక్రియలతో భర్తీ చేయాలనుకున్నాడు. తృఖినా సంవత్సరం నుండి ఇవాళో రేపో అనేలా చావుకు దగ్గరగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు తృఖినా రజ్గులైలో చనిపోయింది. రజ్గులై చాలా దూరం కాబట్టి అతనికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా, తృఖినా  వారసులు  వాళ్ళ ఊర్లోనే ఎవరో ఒకరికి అంత్యక్రియల కాంట్రాక్టు ఇస్తారేమో అని  ప్రొఖోరోవ్ భయపడ్డాడు.

ఇంతలో ఒక అపరిచిత వ్యక్తి తలుపు తట్టడంతో ప్రొఖోరోవ్ ఆలోచనల నుండి బైటికి వచ్చాడు.

“ఎవరది?”  అని అడిగాడు ప్రొఖోరోవ్.

నెమ్మదిగా తలుపు తెరుచుకుంది.చూడడానికి జర్మన్ శిల్పిలా ఉన్న వ్యక్తి లోపలి వస్తూ, ఎంతో సంతోషంగా శవపేటిక తయారు చేసే ప్రొఖోరోవ్ దెగ్గరికి వెళ్ళాడు.

“క్షమించండి. నేను మీ ఇంటి పక్కనే ఉంటాను.”అని రష్యన్ యాసలో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ” మిమల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి. నన్ను మీకు త్వరగా  పరిచయం చేసుకుంటాను. నా పేరు గొట్టాలిబ్ షుల్ట్జ్, నేను షూలు తయారుచేస్తుంటాను. ఇదిగో ఈ కిటికీకి ఎదురుగ ఉన్న ఇంట్లోనే నేను ఉంటాను. రేపు మా ఇరవైఅయిదవ పెళ్లి రోజు వేడుకల సందర్భంగా మిమల్ని ఆహ్వానిద్దామని వచ్చాను. మీరు మీ కూతుళ్ళతో తప్పకుండ భోజనానికి రావాలి.”

ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించాడు ప్రొఖోరోవ్. వచ్చి కొంచెం సేపే అయినా వాళ్ళని గుర్తించినందుకు గొట్టాలిబ్ షుల్ట్జ్ కి  కృతజ్ఞతలు తెలిపాడు . త్వరగా వారి మధ్య మాటలు కలిసాయి. శవపేటిక తయారీదారుడు, షూ తయారీదారుడు కలిసి టీ కోసం ఎదురుచూస్తూ సోఫాలో కూర్చున్నారు.

“మీ వ్యాపారం ఎలా ఉంది?” అడిగాడు ప్రొఖోరోవ్ .

“ఎదో అంతంతమాత్రం ఉంది. అలాగని కారణాలేమీ చెప్పలేను. నా వ్యాపారం మీలాగా కాదు.

బతికున్న వాళ్ళు షూ లేకుండా అయినా బతకగలరు. కానీ చనిపోయినవాళ్ళెవరైనా శవపేటిక లేకుండా వెళ్ళరు కదా!” అన్నాడు షుల్ట్జ్.

“నిజమే. కానీ బతికున్నవ్యక్తి దెగ్గర షూ కొనడానికి డబ్బులు లేకపోతే ఉట్టి కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నా వ్యాపారం అలా కాదు కదా. రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాడు చనిపోతే డబ్బులు లేకపోయినా, ఇచ్చేవాళ్ళు లేకపోయినా నేను శవపేటిక పంపాల్సిందే.డబ్బు ఉన్నా లేకున్నా శవాలపై శవపేటిక ఇవ్వాల్సిందే.” అన్నాడు ప్రొఖోరోవ్.ఇలా వారిద్దరి మధ్య కొంత సేపు సంభాషణ జరిగింది.కొంతసేపటికి షూ తయారీదారుడు లేచి, తప్పకుండ రమ్మని మళ్ళీ ఒకసారి చెప్పి వెళ్ళిపోయాడు.

మరుసటిరోజు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు  శవపేటిక తయారీదారుడు, అతని కూతుళ్ళు కలిసి కొత్తగా కొన్న ఇంటి గుమ్మమునుండి బైటికి వచ్చి, పక్కనున్న ఇంటివైపు అడుగులు వేశారు. సహజంగా

రష్యన్ వ్యక్తులు ఏదైనా ముఖ్యమైన సందర్భాలలో తొడుగుకునే పసుపు రంగు కోట్, ఎర్ర షూలు వాళ్ళందరూ వేసుకున్నారు.

షూ తయారీదారుడి చిన్న ఇల్లు మొత్తం అతిధులతో నిండిపోయింది. అక్కడున్న అతిధుల్లో ఎక్కువశాతం జర్మన్ శిల్పులు, సూపర్ వైజర్లు కుటుంబాలతో వచ్చారు. రష్యన్ అతిధుల్లో అందరిని దృష్టిని ఆకర్షింది యూరికో ది ఫిన్. యూరికో వాచ్ మాన్ (వాచ్ మాన్ – అని పిలుస్తారు) అయినప్పటికీ అక్కడి అందరి చూపును అతని వైపు తిప్పుకున్నాడు. అతను ఇరవైఐదు ఏళ్ళు  రష్యన్ గుర్రాలకు ట్రైనింగ్ ఇచ్చి, నిజాయితీని కార్యదక్షతకు మంచి పేరు తెచ్చుకున్నాడు. 1812 లో జరిగిన విధ్వంసంలో, రాజధాని నగరం అంతా ఆహుతి కాగా, అందులో తన చిన్న పసుపు రంగు ఇల్లు నామరూపాల్లేకుండా పోయింది. వెంటనే ప్రతిఘటించిన రష్యా, శత్రు సేనాని తరిమికొట్టింది. పసుపు రంగు ఇల్లు ఉన్న ప్రదేశంలో ఒక కొత్త బూడిద రంగు ఇల్లు, తెల్లని స్తంభాలతో వెలిసింది. యూరికో ఈ కొత్త ఇంటి ముందు గొడ్డలి, ఇనుప కవచం ధరించి అక్కడే కాపలాకి తిరిగాడు. నీకిట్స్కేయా గేట్ దగ్గర  నివసించిన జెర్మనులందరికి యూరికో సుపరిచితం. కొంతమంది జర్మన్లు అతని ఇంట్లో తలదాచుకున్నారు కూడా.

త్వరలో తన అవసరం ఉంటుందని గ్రహించి ప్రొఖోరోవ్ వడివడిగా యూరికోను పరిచయం చేసుకున్నాడు. అతిధులందరూ డైనింగ్ టేబుల్ దగ్గర పక్కపక్కన కూర్చున్నారు. షుల్ట్జ్, అతని భార్య, వాళ్ళ పదిహేడేళ్ల కూతురు లోట్చెం, కూర్చున్నవాళ్లందరికి వడ్డిస్తూ అతిధి

మర్యాదలు చేస్తున్నారు. బీర్ ఏరులై పారింది. నాలుగు తినే తిండి యూరికో  ఒక్కడే తిన్నాడు. ప్రొఖోరోవ్, అతని కూతుళ్ళు మాత్రం పద్దతిగా కొంచెం మాత్రమే తిని తమ గౌరవాన్ని నిలుపున్నారు. ఎక్కువమంది జర్మన్లు ఉండడం వాళ్ళ అందరు జర్మన్ భాషలో మాట్లాడడం మొదలుపెట్టారు. రానురాను మాటలు కాస్త పెద్ద పెద్ద చర్చలుగా సాగుతున్నాయి. అంతా హడావిడిగా ఉంది. వీటికి అంతరాయం కలిగిస్తూ షుల్ట్జ్ చేతిలో ఒక షాంపెయిన్  బాటిల్ పట్టుకుని, గట్టిగ రష్యన్ భాషలో ” నా లూయిస్ ఆరోగ్యం కోసం ” అని అరుస్తూ షాంపెయిన్ని పొంగించాడు. తన భార్య నుదిటిన చిన్న ముద్దు పెట్టాడు. అక్కడికొచ్చిన అతిధులు కూడా లూయిస్ ఆరోగ్యం కోసం అని అరిచి చేతిలో ఉన్న గ్లాస్ బీర్ తాగారు.

“ఇది నా ఇంటికొచ్చిన అతిధుల ఆరోగ్యం కోసం.” అని అరిచి రెండవ బాటిల్ మూత తీసాడు. అతిధులందరూ ధన్యవాదాలు తెలిపి, మళ్ళీ ఇంకో గ్లాస్ బీర్ తాగారు.

అక్కడున్న ఒక్కొక్క అతిధుల ఆరోగ్యం కోసం; మాస్కో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని; కొన్ని జర్మన్ ప్రదేశాలు సుభిక్షంగా ఉండాలని; కార్పొరేషన్లు బాగుండాలని; మాస్టర్లు, సూపర్ వైజర్లు బాగుండాలని ఇలా ఒకటి తరువాత మరొక నినాదాలతో మందుతాగుతూ అక్కడి వాతావరణం అంత హోరెత్తింది. ప్రొఖోరోవ్  కూడా చాలా ఉల్లాసంగా తాగుతూ అతని కస్టమర్ల ఆరోగ్యం బాగుండాలని కొంటె నవ్వుతో అన్నాడు. ఇంతలో ఒక లావాటి బేకర్, అతని గ్లాస్ పైకి లేపి ;

“మనం ఎవరికోసం అయితే పనిచేస్తున్నామో, అదే మన కస్టమర్ ఆరోగ్యం కోసం.” అని అరిచాడు.

అందరు సాదరంగా ఒప్పుకుని మందు తాగారు. ఇక అతిధులందరూ ఒకరికొకరు సెల్యూట్ పెట్టుకోవడం కృతజ్ఞతలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. టైలర్ షూ తయారీదారుడికి, షూ తయారీ దారుడు టైలర్ కి, బేకర్ వాళ్ళిద్దరికీ, అక్కడున్నవాళ్లంతా బేకర్ కి ఇలా కొనసాగింది.

ఈ పరస్పర కృతజ్ఞతలలో యూరికో తన పక్కనున్న వ్యక్తి వైపు తిరిగి ” ముందుకురండి ! మీ శవాల ఆరోగ్యం కోసం ఒక గ్లాస్ తాగండి” అని అన్నాడు.

అక్కడున్నవాళ్ళంతా విరగబడి నవ్వారు. కానీ శవపేటిక తయారీదారుడికి అదొక అవమానంలా అనిపించి ముఖం చిట్లించాడు. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అందరు తాగడంలో మునిగిపోయారు.

వాళ్లంతా టేబుల్ వదిలి లేచేసరికి రాత్రి తొమ్మిది గంటల ప్రార్ధన వినిపించింది.

అతిధులంతా వెళ్లేసరికి దాదాపు అర్ధరాత్రి అయ్యింది. దాదాపు అందరూ చాలా సంతోషంగా కనిపించరు. లావాటి బేకర్, బుక్ బైండర్ మొఖం మాత్రం ఎర్రగా కమిలిపోయింది. వాళ్ళిద్దరూ యూరికో భుజాల్లో భుజాలు వేసి పట్టుకుని అతన్ని కొత్త బూడిద రంగు ఇంటికి తీసుకెళ్ళారు. వెళ్తూ వెళ్తూ ” మనకు మంచి చేసిన వారికి తిరిగి మనం మంచి చెయ్యాలి” అని అన్నారు.

శవపేటిక తయారీదారుడు మాత్రం తాగి కోపంతో ఇంటికి వచ్చాడు.

“ఎందుకు?” అని గట్టిగా అరిచాడు “ఎందుకు నా వ్యాపారం మిగతావాటిలాగా నిజాయితీగా లేదా? శవపేటిక తయారు చేసేవాళ్ళు హంతకులా? మరి ఆ అల్పులందరూ ఎందుకు  నవ్వుతున్నారు ? శవపేటిక తయారీదారుడేమన్నా జోకరా ? నేను వాళ్ళందరిని ఈ కోతఇంటికి పిలిచి విందు ఇద్దామనుకున్నాను.కానీ ఇప్పుడవేం చెయ్యను.వాళ్ళెవ్వరికి ఆ అర్హత లేదు. వాళ్ళని పిలిచేబదులు, నేను ఎవరికోసం అయితే పని చేస్తానో వాళ్ళనే ఈ ఇంటికి విందుకి  పిలుస్తాను. అవును నేను చనిపోయిన ఆత్మలని పిలుస్తాను.”

ఈ మాట విని బూట్లు విప్పుతున్న పనిమనిషి వెంటనే పరిగెత్తుకొచ్చి ” ఏమైంది అయ్యా? ఎందుకిలా ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు దేవుడికి స్తోత్రములు చెప్పుకోండి. సిలువ వేసుకోండి. చనిపోయిన ఆత్మలను ఇంటికి పిలుస్తారా? పిచ్చి కాకపోతే!!” అంది.అతని మాటలు విన్న శవపేటిక తయారీదారుడు అక్కడినుండి వెళ్ళి మంచం మీద పడుకుని నిద్రలోకి జారుకున్నాడు. అతని గురక శబ్దం గట్టిగా వినిపిస్తుంది.

మధ్య రాత్రిలోనే ప్రొఖోరోవ్ నిద్రనుండి మేల్కొన్నాడు. షాపు ఓనర్ భార్య తృఖినా ఆ రాత్రి చనిపోయింది.ఈ వార్త ప్రొఖోరోవ్ కు చేరవేయడానికి ఆమె లాయర్ ఒక ప్రత్యేక దూతను గుర్రంపై పంపాడు. శవపేటిక తయారీదారుడు బ్రాందీ కొనడానికి సరిపడా డబ్బును దూతకి ఇచ్చాడు. వీలైనంత త్వరగా బట్టలు మార్చుకుని రజ్గులైకి బయలుదేరాడు. చనిపోయిన ఆమె  ఇంటి గుమ్మంలో పోలీసులు అప్పటికే వచ్చేసి ఉన్నారు. వ్యాపారస్తులు శవాన్ని వాసనా చూసే కాకుల్లాగా గుంపుగా ముందుకి వెనక్కి వెళ్తున్నారు. చనిపోయిన తృఖినాని ఒక టేబుల్ మీద పడుకోబెట్టారు, చూడడానికి పసుపు మైనం ముద్దలా ఉంది ఆ శరీరం. ఇంకా కుళ్లిపోలేదు కాబట్టి శవం ఆకారం బాగానే ఉంది.

ఆమె చుట్టూ బంధువులు , ఇంటిపక్కన వాళ్ళు, ఇంటి పనివాళ్ళు నించున్నారు. కిటికీలన్నీ తెరిచి ఉంచారు, కొవ్వుత్తులు వెలుగుతున్నాయి, చర్చి ఫాదర్ శవం దగ్గర ప్రార్ధన చేస్తున్నారు.  తృఖినా మేనల్లుడు యువకుడు, సర్టు అనే ధనవంతుల కోట్ వేసుకుని పైనుండి జరగవలసిన కార్యక్రమాలు చూస్తుకుంటున్నాడు. ప్రొఖోరోవ్ పైకి వెళ్ళి అతన్ని కలిసి అంత్యక్రియలకు కావాల్సిన శవపేటిక, మైనపు కొవ్వొత్తులు, శవపేటిక మీద కప్పే పాల్ అనే వస్త్రం తదితర సామాన్లు వెంటనే పంపిస్తానని చెప్పాడు. మేనల్లుడు బాధలోనే ఉన్న కూడా  అతనికి కృతజ్ఞతలు చెప్పి, ఖర్చు విషయంలో ఎలాంటి బేరం ఆడనని కానీ మనసాక్షికి కట్టుబడి పని చేయాలనీ చెప్పాడు. శవపేటిక తయారీదారుడు

‘అస్సలు ఎవ్వరి నుండి అణా పైసా కూడా ఎక్కువ తీసుకోనని’ ఎప్పటిలాగే సునాయాసంగా చెప్పి, లాయర్ కి సైగలతో సమాచారమిచ్చి సామాన్లు తీసుకురావడానికి బయలుదేరాడు.

ఆరోజంతా రజ్గులై నుండి నీకిట్స్కేయా గేటుకి వెళ్ళి రావడంతోనే సరిపోయింది. సాయంత్రానికి అంత్యక్రియలు అయిపోయాయి. డ్రైవర్ ని  వద్దని చెప్పి అతను నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. మంచి వెన్నెల రాత్రి కావడంతో శవపేటిక తయారీదారుడు భద్రంగానే నీకిట్స్కేయా గేటు చేరుకున్నాడు. చర్చి దగ్గరికి రాగానే యూరికో అతన్ని పలకరించి గుడ్ నైట్ చెప్పాడు. రాత్రి చాలా ఆలస్యమైంది. శవపేటిక తయారీదారుడు ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఎవరో ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఇంటి గేటు తెరిచి రెప్పపాటులో అదృశ్యమయ్యాడు.

“ఏమై ఉంటుంది? నాకోసమే వచ్చి ఉంటారా? ఎవరై ఉంటారు? ఒకవేళ దొంగనా? లేదా నా కూతుళ్ళలో ఎవరికైనా లవర్ ఉండి, అతను కలవడానికి వచ్చాడా? ఏదైనా మంచిది కాదు ఇది. నాకు ఎందుకో భయంగా ఉంది.” అని ప్రొఖోరోవ్  అనుకున్నాడు.

శవపేటిక తయారీదారుడు భయంతో యూరికోని సహాయంకోసం పిలవలనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఒక వ్యక్తి గేట్ దెగ్గరికి వచ్చి ప్రొఖోరోవ్ ని చూసి, లోపలికి వెళ్ళకుండా అక్కడే నిలబడి, అతని మూడు వంకులు కలిగిన టోపీ తీసాడు. అతన్ని చూడగానే ప్రొఖోరోవ్కి తెలిసిన వ్యక్తిలాగానే ఉన్నాడు కానీ కంగారులో ఎవరని గుర్తుపట్టలేకపోయాడు.

“మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ లోపలి రండి” అన్నాడు ప్రొఖోరోవ్

“నాకోసం ఇక్కడ నిల్చోకండి. మీ గురించే విందుకు వచ్చిన వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. మీరు లోపలి వెళ్ళండి. నేను వెనకాలే అనుసరిస్తాను.” అన్నాడు ఆ వ్యక్తి.

ప్రొఖోరోవ్ కి ఆలోచించుకునే సమయంలేదు. గేటు తెరచి ఉంది. అందరిని అనుసరిస్తూ అతను లోపలి వెళ్ళాడు. ప్రొఖోరోవ్ కి తన గదిలో ఎవరెవరో నడుస్తున్నట్లు  శబ్దాలు వినిపిస్తున్నాయి. “ఏంటిది దయ్యలా కొంపలా ఇంత చెత్తగా ఉంది ఇల్లు” అనుకుంటూ లోపలి వెళ్ళాడు. కానీ లోపలున్న దృశ్యాలు చూసిన తరువాత అక్కడి నుండి పారిపోవాలనుకున్నాడు, అతని కాలు కదలట్లేదు.

గది నిండా శవాలు ఉన్నాయి. కిటికీల నుండి వచ్చిన వెన్నెల వెలుగులో శవాల మొఖాలు పసుపు, నీలం రంగుల్లో కనిపిస్తున్నాయి, కింది దవడ లేనట్టుగా జారిపోయిన నోరు, జీవంలేని సగం తెరిచినా కళ్ళు, ముందుకు కొచ్చగా సాగిన ముక్కుతో శవాలు చూడడానికి భయంకరంగా ఉన్నాయి. ప్రొఖోరోవ్ భయంతో వణికిపోతూ, అక్కడున్న శవాలన్నిటిని గుర్తుపట్టాడు. ఇవన్నీ అతనే స్వయంగా దెగ్గరుండీ అంత్యక్రియలు జరిపి పూడ్చిపెట్టిన శవాలు. గేటు దగ్గర ప్రొఖోరోవ్ని పలకరించింది బ్రిగేడియర్- కుండపోత వాన రోజు పూడ్చిన శవం బ్రిగేడియర్ దే.

అక్కడున్న ఆడ మగ శవాలన్నీ శవపేటిక తయారీదారుడి చుట్టూ చేరి సెల్యూట్ చేస్తూ, వంగి వంగి దండాలు పెడుతున్నారు. కానీ ఒక్క శవం మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉంది. అది ఉచితంగా పూడ్చిన బిచ్చగాడి శవం. ఆత్మగా కూడా కురచ బట్టలు వేసుకున్నతన స్థాయిని తలుచుకుని బాధపడుతూ ఒక మూలన కూర్చుంది ఆ బిచ్చగాడి శవం. మిగతా శవాలన్నీ మంచి బట్టలతో ఉన్నాయి. ఆడ శవలైతే రిబ్బన్లు, టోపీలు ధరించారు, ఆఫీసర్లు యూనిఫామ్లో ఉన్నారు కానీ వాళ్ళు గడ్డం గీసుకోలేదు, వ్యాపారస్తులు వదులైన హాలిడే బట్టల్లో ఉన్నారు.

“చూడు ప్రొఖోరోవ్ ” అంటూ అందరి తరపున మాట్లాడడం ప్రారంభించాడు బ్రిగేడియర్. “మేమందరం నీ ఆహ్వానం మేరకు వచ్చాము. కేవలం ఎముకలు మాత్రమే మిగిలి కండ లేని, ముక్కలు ముక్కలు అయినా వాళ్ళు మాత్రం రాలేకపోయారు. కానీ వాళ్ళ మనసులో కూడా ఇక్కడికి రావాలని నిన్ను చూడాలని ఎంతో ఆత్రుత ఉంది…”అని మాట్లాడుతుండగా ఒక చిన్న అస్థిపంజరం ఉన్న వ్యక్తి  గుంపులో తోసుకుంటూ ప్రొఖోరోవ్ వైపు వచ్చాడు. అసలు మాంసమే లేని ముఖంతో ప్రొఖోరోవ్ ని చూసి నవ్వాడు. ఎర్రని ,పచ్చని చీలికలున్న కుళ్ళిన నారబట్టలు అతని మీద అక్కడక్కడా ఎదో స్థంభం మీద వేసినట్టు  వేలాడుతున్నాయి. పెద్ద జాక్ బూట్లలో అతని కాళ్ళ ఎముకలుతో నడుస్తుంటే రోలులో రోకలి పెట్టి ఆడించినట్లు ఉంది.

” నువ్వు నన్ను గుర్తుపట్టలేదా ప్రొఖోరోవ్ ? రిటైర్డ్ గార్డ్స్ సార్జెంట్, పీటర్ పెట్రోవిచ్  కౌరిల్కిన్

గుర్తున్నాడా నీకు? అదే 1799 లో  మొట్టమొదటి శవపేటిక అమ్మావు కదా , అదికూడా ఓక్ చెక్కతో చేసిన శవపేటిక కాకుండా, డేకోలంతో చేసిన శవపేటిక ఇచ్చావు?” అని అడిగి హత్తుకోవడానికి ఎముకల చేతులు ముందుకు చాచాడు ఆ వ్యక్తి.

ప్రొఖోరోవ్ అతి కష్టం మీద ఉన్న బలాన్నంతా కూడదీసుకుని ఆ వ్యక్తిని దూరంగా నెట్టేశాడు. పీటర్ పెట్రోవిచ్ అస్థిపంజరం కుప్పకూలిపోయి, ముక్కలు ముక్కలుగా విడిపోయింది. శవాలన్నీ ఆగ్రహావేశాలతో గొణగడం మొదలుపెట్టాయి. తమ తోటి శవానికి జరిగిన అవమానానికి నిరసన తెలిపాయి. ప్రొఖోరోవ్ ని శవాలన్నీ కలిసి బెదిరింపులతో ముంచెత్తాయి.పాపం ప్రొఖోరోవ్ ఆ అరుపులు వినలేక చెవులు చిల్లులుపడిపోయి, భయంతో  దాదాపు చావు అంచులదాకా వెళ్ళాడు,చివరికి స్పృహకోల్పోయి కుప్పకూలిన అస్థిపంజరం ఎముకలమీద కూలబడ్డాడు.

ప్రొఖోరోవ్  పడుకున్న మంచం మీద కొంత సేపటి నుండి  సూర్యుని వెలుగు పడుతూ ఉంది.ప్రొఖోరోవ్  నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ముందు పనిమనిషి టీ తో నించోవడం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నిన్న రాత్రి జరిగిన విషయాలన్నిటిని గుర్తుచేసుకున్నాడు తృఖినా, బ్రిగేడియర్, సార్జంట్, కౌరిల్కిన్, రోజ్ వాగులై అతని కానీ ముందు మెదిలారు. కొంతసేపు మౌనంగా కూర్చున్నాడు. పనిమనిషి మాటలు మొదలుపెడితే రాత్రి జరిగింది చెప్పాలనుకుని ఎదురుచూస్తున్నాడు.

“రాత్రి నిద్ర ఎలా పట్టింది అయ్యా ?” అని అడిగింది ఆక్సినియా. ప్రొఖోరోవ్  చేతిలో బట్టలు పెడుతూ, ” మన పక్కింటి టైలర్, వాచ్ మాన్ ఇక్కడికి వచ్చారు. ఇవాళ అతని ఇంట్లో ఎదో వేడుకట. కానీ మీరు గాఢ నిద్రలో ఉన్నారని మేము లేపలేదు” అంది.

” ఎవరైనా నాకోసం దివంగత తృఖినా ఇంటి నుండి వచ్చారా?”

“దివంగతనా? అంటే ఆమె చనిపోయిందా?”

“నీకేమన్నా పిచ్చా? నిన్ననే కదా ఆమె అంత్యక్రియల ఏర్పాటుకోసం నువ్వు కూడా నాకు సహాయం చేసావు?”

“నాకు పిచ్చిఏమి లేదు. ముందు మీరు సరిగ్గా ఉన్నారా? మీకేమైంది అయ్యా? ఏదైనా ఒంట్లో బాగోలేదా, లేదంటే నిన్నటి హ్యాంగోవర్ నుండి ఇంకా బైటికి రాలేదా? నిన్న ఎవరి అంత్యక్రియలు జరిగాయి? నిన్నంతా మీరు ఆ జర్మన్ ఇంట్లో పార్టీకి వెళ్ళి, ఫుల్లుగా తాగి వచ్చి ఈ బెడ్ మీద పడుకున్నారు అంతే! అప్పుడు పడుకున్న మీరు ఇదిగో ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం లేచారు. “

“నిజమా?” అడిగాడు శవపేటిక తయారీదారుడు.

“అవును” అన్నాడు పనిమనిషి.

“మంచిది.అయితే నాకు త్వరగా టీ తీసుకుని రా, నా పిల్లలని కూడా పిలువు ఒకసారి.” అన్నాడు

అఖిల
అలెగ్జాడర్ పుష్కిన్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *