ఎల్లమ్మ, మల్లమ్మల గోస.. సదివి కండ్ల నీళ్ళు కుక్కుకోకపోతే ఒట్టు!

Spread the love

నూర శ్రీనివాస్ సర్ అన్నట్టు ఈ కథల్ల కమురు వాసన, కనరు వాసన, నెనరు వాసన మస్తుగ ఉన్నది. మట్టిని ముద్దాడిన కథలు. తెలంగాణను అమిరిచ్చుకున్న కథలు. తెలంగాణ ఏరువడ్డా ఇంకా గోస తప్పని బతుకు కథలు.

‘దేశం ఎలిగిపోతున్నది’ అని సోకాల్డ్ నేతలు దినాం ఊదరగొడుతున్నరు. అయ్యా.. సారూ.. జర మీరు పెయ్యన్ని కండ్లు జేసుకొని సూడాలె. ఎలక్షన్లప్పుడే గాదు దినాం గరీబోళ్ళ ఇండ్లను దర్శించుకోర్రి జర. ఇండ్లు లేనోళ్ళకు ఇండ్లు, పనులు, పథకాలు వాళ్ళదాకా చేర్చుర్రి తండ్రీ. దేశంల శానా పేదరికం ఉందయ్యా. మీకు సూడ సమయం లేకపోతే కనీసం ఈ ‘జిట్టపులి’ కథలు సదువుర్రి అని ఈ పుస్తకం సదివినోళ్ళు ఖచ్చితంగా సర్కారుకు సవాల్ ఇసురుతరు.

దునియా ఎంత మారినా మన ఎల్లవ్వ, మల్లవ్వ, లచ్చవ్వ, రాజవ్వ, శ్వేత, శేఖర్ ల బతుకులు మారయి?

రవి మంచి జర్నలిస్ట్. కథకునిగా నాకు ముల్కనూర్ కథలపోటీల్లనే పరిచయం. అటు జర్నలిస్టుగా, ఇటు కథకునిగా బహోత్ బడియా సఫర్ జేస్తున్నడు అనిపిచ్చింది. యాసను ఎంత ముద్దుగ రాస్తడో. షీర్ ఖూర్మాల నానవెట్టి ఏసిన కర్బూజ్ గింజల రుచిని మొదాలు నుంచి లాష్టుదాంక సూస్తం.

తెలంగాణ పెద్దవ్వలు, తాతలను ఎంత మంచిగ చిత్రిస్తడో తన కథల్ల. ప్రముఖ సీనియర్ రచయిత కేవీ.నరేందర్ సర్ ముందుమాట రాసుడుతోనే అర్థమైతది ఇవి ఉత్త కథలు గావు ఉత్తమ కథలని. జర్నలిస్ట్ నూర శ్రీనివాస్ సర్, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి గార్లు రాసిన మరికొన్ని మాటలు ఈ కథలు సదవాల్సిందేననే జిద్దును కలిగిచ్చినయి.

తన పిల్లల పేర్లు శ్రామిక, కర్షక్ అని పెట్టుకున్న గొప్ప ‌సిద్ధాంతకర్త అనిపిస్తడు రవి నాకు. శ్రామిక, కర్షక్ పేర్లు మరవనట్టే ఈ కథలను సదివి అస్సలు మరిచిపోలేం. అంత అద్భుతంగ ఉన్న కథలివి. హంట్ జేసే కథలు. తెలంగాణ ప్రజలు గోసలను కండ్లకు కట్టే రియలిస్టిక్ కథలు.

ఇంకా ఏం గోసల్రా నాయనా.. అని కొందరు సో కాల్డ్ పోష్ పర్సన్స్ అంటుంటరు. ఎంత ఆధునిక సమాజం అవతరించినా రైతు పండించిన గింజే మన కడుపు నింపుతుందనేది కాదనలేని సత్యం. ఆ రైతులు, రైతు కూలీలు పల్లెల నిండా ఉన్నరు. పల్లె గర్భంల వాళ్ళు నిత్యం పురిటి నొప్పుల బాధను అనుభవిస్తున్నరు. ఆ మట్టి మనుషుల వెతలను ప్రపంచానికి చెప్పాలె. మట్టి కథే అంతర్జాతీయ పురస్కారాలను తెస్తదని దిగ్దర్శకుడు శ్యాం బెనెగల్ నిరూపించిండు.

ఇగ ఈ పుస్తకం సూడంగనే రెండే రెండు అంశాలు నన్ను ఆయస్కాంతం లెక్క గుంజినయ్. ఒకటి జిట్టపులి పేరు, కవర్ పేజ్. పుస్తకం పట్టుకోంగనే 8వ కథగా ఉన్న దాన్నే ముందుగాల్ల సదివిన. కదిలిచ్చిన కథ. పులి వేరే జీవిని ఒకటేపారి సంపే‌స్తది గనీ మనిషి ప్రకృతిని ఎట్ల జరజర్రంత సంపుతున్నడో కండ్లకు కట్టిన కథ. క్వారీలు అని జంగల్లను అమ్మి పారేస్తుంటే జంగల్ల ఉన్న జీవి మనుషుల నడ్మకు రాకుంట ఎటువోతది?

పులిని పెట్టుకోనీకి రమేష్ మాటు వెట్టినట్టే నేనూ ఈ కథ సదువుకుంట జిట్టపులిని పట్టుకున్న. రవి యాస ఎంత సక్కదనమంటే అంబలిల తొక్కుల మామిడికాయ బద్దను సప్పరిచ్చినట్టు మస్తుంటది. యాసలనే రాసినా యాడ ఇంతగూడ ఆగకుంట సదువుకుంట పోవుడే ఈ కథల తరువాయి.

పుస్తకంల ఉన్న మొదటి కథ ‘యాపచెట్టు’. ఈ కథ చదువుతుంటే చిన్నప్పుడు నేను చూసిన జీవితాలు కండ్లకు కట్టినయి. అప్పుల ఊబిల ఎంతోమంది రైతులు చెట్లకు ఉరి వెట్టుకొని సచ్చిపోతుంటే ఈ కథల రైతు మల్లయ్య మాత్రం పాణం ధరించకపోయినా ఆ యాపచెట్టును అమ్మేసుకుంటడు. పాయిరంగ పెంచుకున్న మమకారాన్ని నిలువు నిస్తారం సంపుకుంటడు. దాన్ని నరికేటప్పుడు మన మనసు మీద గూడ గొడ్డలి గాట్లు పడి తునకలు తునకలు అయితది.

ఈ కథల సన్నివేశాలను అస్సలు మరిచిపోలేం. కాథంటే గుండెల పచ్చబొట్టోలే గుర్తుండిపోవాలి. అర్థంకాని అల్లికలతోని తీవ్ర గందరగోళంగా, భారంగా, తికమకగా అస్సలు ఉండొద్దు. శైలి, శిల్పాల కోసం కాకుంట ఒక జీవితంను కండ్లకు కట్టగలిగితే ఆ కథ అజరామరం. రవి మ్యాకం పెన్నుల ఆ పవర్ ఉంది.

గుట్టలు, చెరువులు సిటీల ఎట్ల కబ్జాలకు గురైతున్నయో సూస్తున్నం. అభివృద్ధి పేర ప్రకృతిని ఎట్లా ధ్వంసం చేస్తున్నమో ‘గొల్ల మల్లన్న’ కథల శానా యాథార్థంగ చెప్పిండు. అడవులు, కొండలు, చెరువులు, పశు పక్ష్యాదులు ఎంత అవసరమో ఈ కథ సదివితే తెలుస్తది.

కాంట్రాక్టర్ల మీద లీడర్లు, వాళ్ళ చేతుల్ల పోలీసుల జులుంతోని విధ్వంసం ఎట్ల రచింపబడుతదో, చివరికి కులవృత్తులు ఎట్లా మాయమైతయో, జీవరాశులు బతకలేక పోతయో సదువుతుంటే గుండె దేవినట్టు అయితది. ప్రభుత్వాలు చెరువులు, గుట్టలు, అడవుల సంరక్షణకు పాటు పడాల్సిన అవసరంను ఎరుక జేసిన కథ. అట్లనే కులవృత్తులను కాపాడనీకి సర్కార్ ఎసుంటి మతలబులు చెయ్యాల్నో ఆలోచించాలె. లేకపోతే గుట్టలు, చెరువులు, అడవులు చివరికి ప్రకృతే పాఠంగా, పాఠంలోని బొమ్మల లెక్క అయిపోతది పరిస్థితి?

అవన్నీ ప్రతీ మనిషి ఆస్తులు. ఆటికోసం అందరూ గొల్ల మల్లన్నలై గట్టిగ నిలవడాల్సిన అవసరాన్ని ఇషారా ఇస్తున్న కథ.

క్యాంపస్ కష్టాలను, చేతిల డిగ్రీలు ఉన్నా దొరకని కొలువులు, లంచాలు, పట్టిచ్చుకోని ప్రభుత్వాలు, అమ్మానాయినల బాధలు ‘బలిదానం’ కథ నిండా. శేఖర్ వెన్ను సూపకుంట ఇంకా పోరాడి గెల్వనీకి కోషిశ్ చేస్తే బాగుండు అనిపిచ్చింది. శేఖర్ సదువు కో‌సం అమ్మానాయినలు పడ్డ కష్టం ఒక క్షణిక నిర్ణయంతోని మట్టిగొట్టుకుపోయింది.

ఆదెరువు అయితడు అనుకున్న కొడుకు బోడిగడ్డకు పోతే వాళ్ళెట్ల బతుకుతరు? ఈ కథకు ముగింపు ప్రభుత్వాలను నిలదీస్తున్నట్టే ఉంది గనీ సమస్యకు పరిష్కారం సావు గాదు అనే సత్యంను గూడా బోధిస్తున్నది. శేఖర్ అసుంటి నిర్ణయం తీసుకుంటే నాకైతే కోపం వచ్చింది. తలుపులన్నీ మూసుకుపోయినా యాడనో ఒక జాగల చిన్న కిటికీ రెక్క అయినా తెర్సుకుంటది గదా. డిగ్రీకి కొలువే కొలమానం గాదు. దునియా పనులు ఉన్నయి. పనిజేసి బతకనీకి నామోషీ ఎందుకు? సదువు కష్టవడే పనిని తక్కువ అంచనా ఏస్తదా? ఇట్లాంటి ప్రశ్నలు బలిదానం కథ సదువుతే రీడర్స్ కు తలెత్తుతయ్.

దేశం బోయిన కొడుకు కోసం ఎదురుసూశే తల్లి కథ ‘ఎదురు చూపులు’. ఈ కథను ఎంత హృద్యంగా రాసిండో రవి. సదువుతుంటే ఎక్కడా ఆగలేదు. లాష్టుకు వచ్చేసరికి మల్లమ్మ లెక్క నా గుండె గూడ చిక్కవట్టుకున్నది. ఆమె రంది నా రంది అయింది.

తెలంగాణల ఇసొంటి తెల్లారని బతుకులెన్నో. ఆ బతుకులను ఇట్లా అక్షర రూపంల చెప్పాల్సిన అవుసరం ఉంది. మట్టి మనుషుల కష్టాలు తెలుసుకోవాల్సిన నెనరు ఉండాల్సిందే. పత్తేరబోయిన మల్లమ్మ దేశం వోయిన కొడుకు కోసం గుండె వల్గుతుంటది. ఇంట్ల మొగుడు సచ్చిండు. కొడుకు దేశంల ఉన్నడు. ఒక్కతే ఆ ఇంట్ల చేతగాకపోయినా ఆత్మాభిమానాన్ని సంపుకోక కూలీ పనిజేస్తున్న మల్లమ్మల నాకు అసలుసిసలైన తెలంగాణ తల్లి కనిపిచ్చింది.

పరిస్థితులను సరిదిద్దనీకి పడే పాట్లు, పోగొట్టుకునే జీవితం, తెంపుకునే బంధాలు, చేదయ్యే బతుకు తీపి.., ఎన్ని కష్టాలు పల్లె తల్లులకు? ఇంట్ల ఒక్కతే కొడుకును యాజ్జేసుకుంట ఉండుడు ఎంత నరకం? అసుంటి తల్లులందరికీ జేజేలు.

‘వాన కుర్సిన రాత్రి’ కథ సదివినంక కండ్ల నీళ్ళు కుక్కుకోకపోతే ఒట్టు. ఎంతటి దైన్యం? అవ్వా ఎల్లవ్వా ఏం కష్టమే నీది? ఏం గోసనే నీది? శెడగొట్లాన నీ బతుకును పొదువుకున్న గుడిసెను ఎట్ల చిల్లంచిత్తం జేసిందో? ఏం కష్టమే నీది? 75 ఏండ్ల స్వతంత్ర భారతంల నీ నొష్టరాత మారదానె అవ్వా?

ఆకలికి అల్లాడుతున్న బిడ్డలు, దెయ్యం వట్టినట్టు ముసురుకున్న వాన, చీకట్ల ‘ఆకలి.. ఆకలి..’ అని అల్లాడుతున్న బుడ్డోళ్ళను తీసుకొని స్మశానంలకు పోతివానె ఎల్లక్కా? బుక్కెడు బువ్వ వెట్టలేని నీ నిస్సహాయత జూశి కండ్లు ధారగట్టినయే. మీ బతుకులు మారుస్తమని అవద్దాలాడే పాలకుల మీద తుప్పుమని ఉమ్మాలనిపిచ్చిందే ఎల్లక్కా.

వానల తడుసుకుంట ముంచెత్తుకొస్తున్న వరద నుంచి పోరగాండ్లను కాపాడుకునాలె. పోరలు అప్పటికే ఆకలి ఆకలి అని అల్లాడుతున్నరు. వాళ్ళకు బువ్వ వెట్టలేని నీ పోరాటం జూశి గుండె చెరువైందే ఎల్లక్కా. పేదరికంతోని నీ పోరాటం రికాం లేనిదేనాయె ఎల్లక్కా?

ఒక దిక్కు షోకేసు బంగ్లాలు. అండ్ల ఉన్నోళ్ళకు నీ గోస ఏం ఎర్క? ఎచ్చగ మల్సుకొని పంటరు. నీకు తల దాసుకున ఇంత సోటు, కడుపు నింపుకున బుక్కెడు మెతుకులు కరువాయె!?

ఈ కథ సదివి నేనైతే చలించిపోయిన. రవి ఈ జీవితాలను దగ్గరగా సూశిండు గావట్టే అంత గాఢంగ రాసిండు.

అడవి బిడ్డలు గొత్తికోయిల కథ ‘జంగుబాయి’. గుండెను ఆడివట్టే కథ. ఫారెస్ట్ పోలీసుల అఘాయిత్యాలు ఏ రేంజుల ఉంటయో కండ్లకు కట్టిండు రవి. సదువు రాని ఆ అమాయకుల మీద సదువున్న దద్దమ్మల్లాగ ఇర్సుకపడే పోలీసుల దౌర్జన్యం జూశి కన్నెర్రవడ్తది.

వాళ్ళు పావు పావు పేర్చుకున్నట్టు జీవితాలను దిద్దుకుంటుంటే పిడుగొచ్చి పడ్డట్టు పడే పోలీసుల క్రూరత్వం. లాష్టుకు జంగుబాయి సచ్చిపోతది. భార్య శవంను సూస్కుంట భర్త కిందవడి బొర్లుకుంట ఏడుస్తే మనసు మార్మానం వోతది.

గ్రామం నుంచి సిటీకి వచ్చి ఇక్కడ ఇమడలేక ఇబ్బందులు వడే రాజవ్వ కథ ‘కంటెగోడ’. కాయాకష్టం జేసుకొని, ఊర్ల ఇంత మాట ముచ్చటతోని పొద్దెల్లదీసే పల్లె తల్లులు పట్నం వచ్చి తల్లడం మల్లడం అయితుంటరు. వాళ్ళకు కడుపు నిండ బువ్వ, మందు గోలీలు ఇస్తున్నం గదా ఇంకేం గావాలే అనుకునే కొడుకులు, కోడండ్లంతా ఈ కథ సదివి పెద్ద మనుషుల మనసును అర్థం జేసుకునాలె.

వాళ్ళను తెచ్చుకొని ఇంట్ల పారేసినమా కాదు వాళ్ళకు మనసు వడ్తున్నదా? మనసు వట్టాల్నంటే ఏం జెయ్యాలె? ఎట్ల మసులుకునాలె? వాళ్ళు బతికిన బతుకు చీప్ కాదు, ఎంతో గొప్పది! వాళ్ళతోని మనసిప్పి మనస్ఫూర్తిగా మాట్లాడాలె, వాళ్ళ నుంచి మట్టితనాన్ని ఆవాహనం చేసుకోవాలె…, ఇట్ల అనేక ఎరుకలు కలగుతయి ఈ కథ సదివితే.

ఎండనకా, వాన, సలి అనక ఆరుగాలం పంటను కండ్లల్ల వెట్టుకొని కాపాడుకున్న రైతులు. అప్పుసప్పులు జేసి పెట్టుబడి పెట్టి పంటను కాపాడుకొని వచ్చిన రాబడిని బైరి పిట్టోలే ఎవడో వచ్చి దోసుకపోతే? కష్టపడ్డ చెమట ఫలితాన్ని ఎవడో ఇడ్డుకపోతే? ఆ బాధ ఎంత కల్లివిల్లి జేస్తదో తెల్వాల్నంటే ‘బుడ్డశనగ’ కథ సదవాల్సిందే.

ఆడమనిషి పొలాన్ని దుక్కి దున్ని పంట పండిచ్చుకుంటే దాన్ని దొంగలు దోసుకున్నప్పుడు ఆమె వడే వేదన శానా లైవ్లీగ ఉంది.

‘ఎండి గద్దెలు’ కథల పల్లె నుంచి పట్నం వచ్చి ఇక్కడ అద్దె ఇంట్ల ఉండే బాధలు సూపెట్టిండు. అద్దె ఇంట్లకు పీన్గును తేనియ్యని కాట్కు మనుషుల తీరు. దీంతోని రేపు తాను సచ్చిపోతే గిదే గతి వడ్తదని అప్పు జేసి ఊర్ల కొత్తిల్లు కడుతుంటడు. ఇల్లు అయిపోతది ఆయింత సచ్చిపోతడు.

చివర్కి ఇల్లు పూర్తైతే సమ్మక్క-సారక్కల దెగ్గర్కి పోయి ఎండి గద్దెలు సమర్పిద్దామనుకుని ఆ మొక్కు తీర్సుకోకుంటనే సచ్చిపోతడు. సిటీల సొంతిల్లు, కులమతాల ఫీలింగ్ మీద నేను గూడ ఒక కథ రాసుంటి. ఇంకొంతమంది గూడా ఈ పాయింట్ మీద కథలు రాసిర్రు. ఆ ఛాయలు ఈ కథల కనిపిచ్చినా ఈ కథ నడిశిన తీరు వేరు.

రవి కథల్ల నాకు బగ్గ నచ్చింది ఈ లైవ్లీనెస్. రియలిజం స్ట్రక్చర్ లో కథలు మనల్ని కట్టడి చేస్తయి, కలవర వెడ్తయి, కల్లిబిల్లి జేస్తయి, ఎంటాడుతయి, పొలమారుతయి, యాదికుండిపోతయి.

లాష్టు కథ ‘అర్థరాత్రి ఫోన్ కాల్’ కంపిన్ల దాష్టికాలను కండ్లకు కట్టింది. కంపిన్లల్ల పనిజేసేటోళ్ళ పట్ల ఆ కంపినోళ్ళు ఎంత పర్వతోని ఉంటరో వివరించిన కథ. అనుకోని ప్రమాదాల బారినవడి జీవిడ్శే కష్టజీవుల జీవితాలు ఎట్ల ఆగం అయితయి? పెండ్లాం, పిల్లల భవిష్యత్తు ఏంది అనేది సదువుతుంటే గుండెల దేవినట్టైంది. కంపిన్లల్ల పనిజేసేటోళ్ళ దీనస్థితి మీద కంపెనీ పెద్దల తీరు బాధాకరమే.

మ్యాకం రవికుమార్ దిల్ వెట్టి, ఎంతో ఆర్థ్రంగా రాసిన ఈ జిట్టపులి పుస్తకంల ఉన్న 12 కథలు ప్రతీ ఒక్కరూ సదవాలె. పల్లె జీవితాల్ల ఉన్న కష్టాలను తడమాలె. తెలుసుకోవాలె. స్వతంత్ర భారతంల వాళ్ళ బతుకులు తేటుగానీకి ఏం జెయ్యాల్నో ఇషారా జెయ్యాలె.

Humayun Sangheer

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *