కల్లి

Spread the love

కల్లి నన్ను అనుసరిస్తూ ఎనిమిది మైళ్ళు 
నడిచింది అంగడి దాకా –
అక్కడ ఆవులూ మేకలూ ఎద్దులూ ఒంటెలూ...
పశువుల కొనుగోళ్ళూ అమ్మకాలూ జరుగుతాయి
బానిసల క్రయ విక్రయాల్లా –

కల్లి - ఆరేళ్ల యుక్త వయస్సున్న నీటి గేదె
నల్లగా అందంగా వుంది –
వొట్టి పోయింది.
మరో సారి గర్భం దాల్చొద్దని నిర్ణయించుకున్నదా
అన్నట్లు ఎద్దులను దగ్గరికి రానీయదు

ఇక పోషించడం కష్టమై దాన్ని
నాయిన అమ్మేయదలచాడు
ఆ సంగతి కల్లీకి అర్థమైనట్లుంది
ఇనుప గొలుసు ఒక చివరను దాని మెడకు కట్టి
రెండో కొసను నేను పట్టుకుని ముందుకు
నడుస్తూంటే అది సమ్మతంతో నాతో వచ్చింది
నాకు పదిహేనేళ్ళు . అంగడికి చేరుకోగానే
దాని వ్యాకులత మాయమైంది

అంగట్లో క్రయదారులు వాళ్ళ వాళ్ళ చోట్లలో
కూర్చున్నారు
ఓ పెద్ద వారపత్రికలో కొలువు దీరిన వివాహ ప్రకటనల్లా –
ముఖంలో ఏ భావోద్వేగమూ లేకుండా కల్లి
కూర్చింది నిర్వాణానికి దగ్గరైన సన్యాసి లాగా –

ఎవరూ పట్టించుకోని దూడలాగా నేను
కూర్చుంటూ నిలబడుతూ అటూ ఇటూ తిరుగుతూ
వున్నా –
ఎవ్వరూ కల్లీని కొనలేదు
తిరిగి ఇంటికి చేరుకోవడానికి
నాతో పాటు అది మళ్ళీ ఎనిమిది మైళ్ళు నడిచింది
కళ్ళల్లో ఏ ప్రశ్నల ఆనవాళ్ళు లేకుండా –

కల్లిని మళ్ళీ చూసిన నాయిన
విచారించాడా సంతోషించాడా - నాకు తెలియదు
రైలు తప్పిపోతే తిరిగొచ్చిన
ఇంటిమనిషిని చూసినట్లు
దాన్ని చూశాడంతే .


****
పంజాబీ మూలం & ఆంగ్లానువాదం : ఆజ్మీర్ రోడ్
తెలుగు సేత : దర్భశయనం శ్రీనివాసాచార్య

దర్భశయనం శ్రీనివాసాచార్య

కవి, విమర్శకుడు. అనువాదకుడు, “కవిత్వం “ వార్షిక సంకలనాలకు సంపాదకుడు .1961లో వరంగల్ లో జననం . ఇప్పటివరకు 12 తెలుగు కవితాసంపుటాలు, ఒక ఆంగ్ల కవితాసంపుటి (Scents of the Soil), ఒక విమర్శ గ్రంథం (ఇష్ట వాక్యం ), పిల్లల కోసం “బాలల కోసం బాటసారి పదాలు” అనే సంపుటిని వెలువరించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *