చిద్దా వాళ్ళమ్మ

Spread the love

ఈసారి వేసవి సెలవులు గడపడానికి  నేను మా మామ ఇంటికి వెళ్ళాను. మామ వాళ్ళమ్మని మేమంతా చిద్దా వాళ్ళమ్మ అంటాము. ఆమె నవాబుల ఇళ్ళల్లో  విసనకర్ర వీచే నౌఖరీలో ఉండేది. ఆమె పంఖా తిప్పుతూనే అందరితో మాట్లాడుతూ ఉండేది. నేను కూడా బేగం ఇంటికి వెళుతూ ఉండేదాన్ని. నా పేరు ఆయేషా . ఒక రోజు ఆమె ముమానీ జాన్‌తో ‘‘బేగం చిద్దాకి నాలుగు రోజులు శెలవు ఇవ్వండి ఊరెళదామనుకుంటున్నాడు.’’ అంది.

‘‘మొన్నే కదా వెళ్ళి వచ్చింది? రోజూ కావాలేంటి శెలవు?’’ నిద్రలోకి వెళుతున్న ముమానీజాన్‌ ఉలిక్కిపడి అడిగింది ‘‘ఎందుకు వెళ్తున్నాడు?’’ నిద్ర ఆపుకుంటూ  అడిగింది. 

‘‘ఏం చెప్పాలి మేమ్‌సాబ్‌! నా చిన్నమరిది వచ్చాడు. చనిపోయిన ఛజ్బూ భార్యని ఇంట్లోకి పిల్చుకోవాలి. ఇంటి మట్టి (స్త్రీ) ఇంట్లో ఉంటేనే మంచిది కదా.’’

‘‘ఎంత మంది భార్యలను ఈ చిద్దాగాడు ఇంట్లోకి తెచ్చుకుంటాడేంటి?’’

‘‘దీంట్లో చిద్దా తప్పేం ఉంది చెప్పండి? వాడి అదృష్టమే బాగోలేదు ముందున్న భార్య కూడా అంతే ’’

‘‘నీ కైతే అందరూ చెడ్డవాళ్ళగానే కనిపిస్తారు. ఏ కోడలు వచ్చినా గానీ వాళ్ళ మెదళ్ళల్లో పురుగులు నింపేస్తుంది. ఏ కోడల్ని కూడా మనశాంతిగా  ఉండనివ్వదు కదా’’ ముమాని జాన్‌ అంది.

‘‘వెళ్ళు శెలవు గిలవు ఏమీ దొరకదు ఫో’’ అంది ముమానీ జాన్ చిరాగ్గా. చిద్దీ వాళ్ళమ్మ నిశ్శబ్దంగా ఉండిపోయింది.

ముమాని జాన్‌ నిద్రపోవడానికి కళ్ళు మూసుకోబోతుంటే… ‘‘బేగం సాహెబా  నేను సత్యం చెబుతున్నా… ఆమె  దొడ్డికెళ్లాక ముడ్డి కూడా సరిగా కడుక్కోని చేత్తో  అలాగే  ఉండడం  తెలుసా మీకు ? ఒక పదిసార్లైనా  ఈ విషయం లో ఆమెని కొట్టి ఉంటాను.’’ చిద్దా  వాళ్లమ్మ అంది.

‘‘ఇంకో వందసార్లు కొడుకుతో కోడల్ని కొట్టించి ఉంటుంది.’’ ముమానీ బేగం కోపంగా  అంది.

‘‘అది కాదు బేగం సాహెబ్‌’’ చిద్దా వాళ్ళమ్మ నోరు విప్పింది.

ఆమె ఇలా పెద్దగా నోరువిప్పి మాట్లాడుతుంటే మూడు పసుప్పచ్చటి పళ్లు బయటకు కనపడుతాయి. దానివలన ఆమె వికారమైన మొఖం మరింత భయంకరంగా కనిపిస్తుంది. రాత్రి పూట ఆమె ముఖం చూస్తే నా లాగే ముమానీ జాన్‌ కూడా భయపడె  ఉంటుంది.

 హాఁ… ఆమె చాలా అందమైన దేవదూత  మరి! ఎప్పుడైనా నీ మొఖం ఎప్పుడైనా చూస్కున్నావా…దెయ్యం ముఖమూ నువ్వూనూ! అంటూ ముమానీ జాన్‌ నవ్వసాగింది. “దెయ్యం లాంటి ముఖం నీది చిద్దా… పిల్లలు కూడా చూడగానే భయపడతారు. నువ్వే  బయలు దేరావా వేరే వాళ్ళని అందమైన వాళ్ళు కాదు   అనటానికి మరీ చోద్యం కాకపోతే? నిజం చెబుతున్నా  చూడు అమ్మాయీ  ఆయేశా., అసలు ఎంత అమాయకమైన ముఖం చిద్దా వాళ్లమ్మ కక్ష గట్టి వెళ్ళగొట్టిన  కోడలిది” ? అంది  బేగం.

చిద్దా  వాళ్ళమ్మ నవ్వింది. తరువాత విసనకర్రని మరో చేతికి మారుస్తూ ‘‘అదే కదా బేగం… కోడలి మొఖం అందమైందా లేదా అని  చూస్తాం కానీ  ఆడది పిల్లల్ని కనలేనిదయిందనుకో ఆ  మాట అనడానికి ఏమైనా ధైర్యం చేస్తామా చెప్పు?ఆడది పిల్లల్ని కన్నప్పుడు .,ఆవు ఈనినప్పుడే అందంగా ఉంటాయి”. అంది చిద్దా వాళ్లమ్మ. 

“మూడు నెలలుంది కదా కోడలు నీ ఇంట్లో  పిల్లాడు ఎందుకు అవరు  చెప్పు”? మూమానీ  బేగం కోపంగా అంది.

– – –

కానీ చిద్దా వాళ్ళమ్మ చాలా మొండిగా ఉందీ విషయంలో ‘‘అయితే బేగమ్‌… చిద్దా రేపు బయలుదేరచ్చు కదా?’’

ముమానీ బేగం పై ప్రాణాలు పైనే పోయాయి. చిద్దా లేకపోతే ఇంట్లో చాలా పనులు ఆగిపోతాయి మరి. కూజాలో నీళ్ళు గ్లాసులో ఒంపుకుని గుటగుటా తాగి గోడకానుకుని నోరు తెరిచింది. ‘‘కొన్నేళ్ళుగా నువ్వు చిద్దా కోసం దాదాపు ఎనిమిది సంబంధాలు తెచ్చి ఉంటావు. ప్రతీ ఒకళ్ళల్లలో ఏదో ఒక లోపాన్ని వెతుకుతూ ఉంటావు నీవు కోడల్ని తెచ్చుకుంటావు బాగుంది. అయితే అసలు విషయం ఏమంటే..నాకు తెలిసీ ఖాన్దాన్ లో., లోకంలో జనం  ఏమనుకుంటారో అని తెస్తావు అంతే! కానీ ఒక్క దురదృష్టవంతురాలిని కూడా ఇంట్లో ప్రశాంతంగా  కుదురుకోనీయవు , ఉండనీయవు. సవతులని చూస్తూ అసూయతో రగిలిపోతుంటావు.నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థం అవుతుందా? నీ కొడుకు జీవితం నాశనం చేస్తున్నావు’’ అని ఆగి కోపంగా ‘‘అసలు ఒక విషయం చెబుతున్నా., ఇదిగో కాస్త  స్పష్టంగా విను, చిద్దాకి కూడా చెప్పు ఈసారి గనక కోడల్ని వదిలేసాడనుకో నేనే వాడిని  ఇంట్లోంచి గెంటేస్తాను.’’

చిద్దా  వాళ్ళమ్మ ఇకిలిస్తూ… విసనకర్రను మరో చేతికి మారుస్తూ ‘‘వ్వాహ్… వాహ్ బేగం…భలే మాట్లాడుతున్నారే ఇదేమైనా కొత్త విషయమా ! ఈ దునియాలో ఎంత మంది భార్యలను మన మగ పిల్లలు వదిలేయలేదని చెప్పండి కాస్త? చిద్దా మీకు మాత్రం కొడుకు కాదా మరి… తండ్రి వదిలేసినట్లే కొడుకూను!’’ చిద్దా వాళ్లమ్మ అదేదో దునియాలో జరిగే చాలా సాధారణమైన విషయంలా చెబుతుంటే మామూనీ జాన్ తో పాటు నాకూ  చాలా కోపం వచ్చింది. 

ముమాని జాన్‌ కోపం వచ్చినా రాజీపడినట్లే ముఖం పెట్టి,. ‘‘మరి చిద్దా ఎప్పుడు వెళుతున్నాడు ఊరికి?’’ అంది.

చిద్దా  వాళ్ళమ్మ గెలిచినట్లే  నవ్వుతూ… ‘‘నీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నాను’’ అంది.

‘‘రేపైతే అన్నయ్య వస్తున్నాడు. బండి అవసరం పడచ్చు, ఎల్లుండి వెళ్ళిపోతాడు. శెలవు రెండు రోజుల కంటే ఎక్కువ దొరకదు. ఎక్కువ రోజులు డుమ్మా కొడితే జీతంలో కోత ఉంటుంది. ఎప్పుడూ జరిగే ఈ గొడవ నాకు ఇష్టం లేదు. ఎంత మంది ఆడవాళ్ళని భార్యలుగా తెచ్చాడో లెక్కేమన్నా ఉందా. అయినా వాడినని ఏం లాభం? నువ్వుండనిస్తే కదా మొదలు? చిద్దాదేముంది నువ్వు చెప్పినట్లే చేస్తాడు.

ముసలి చిద్దా ఉబ్బిపోయింది. ‘లేదు బేగం మొదటిదైతే చాలా కంత్రీది. అందరికంటే పెద్దది మళ్ళీ. ఆమె వయసు ఆడపిల్లలకి ఒక్కొక్కళ్లకి ఇద్దరేసి పిల్లలు పుట్టేస్తారు. దీనికైతే నా సవితి ఇంట్లోని ఎలుక పిల్ల కూడా పుట్టలేదు’’ అంది. “అందుకేనా ఆ అమాయకురాలిని అంతలా కొట్టావు? కోపంగ అంది బేగం.

“బేగం నేను నిజం చెప్పనా? ఆమెనెందుకు గెంటెయ్యద్దు చెప్పు? ఆమె తండ్రి చాలా మోసం చేసాడు నన్ను. శ్రావణ మాసంలో తీసుకెళ్ళాడా… మళ్ళీ తిరిగి పంపనే లేదు… ఇంకెక్కడికో తీస్కెళ్ళాడు.” అంది చిద్దావాళ్ళమ్మ చిర చిరలాడుతూ .

‘‘మంచి పని చేసాడు. అలాగైనా ఆ అమాయకురాలు  నీ నుంచైతే రక్షించబడింది.  నీకింకా తెలిసిందో లేదో మోహల్లాలో జుబేదా  కోడలు తాను గర్భవతినని చెబుతోంది’’ అంది ముమాని ఖాన్‌.

‘‘అవునా సరేలే.. నాకెందుకా విషయం ముందైతే నా కోడలి కథ విను బేగం. చివరికి రాజ్‌ఘాట్‌ మేలాలో దొరికింది. నన్ను చూసి తన మొఖం తిప్పేసుకుంది. దాన్నీ, దాని అబ్బాని ఇద్దరినీ జైల్లో వేయించేదాన్నే. చూడండి వాళ్ళ కథ ఎలా ఉందో? నా పైసలిచ్చి ఖుష్‌ చెయ్యాలి. అవి తీస్కోని ఎటో పోయి హుక్కా పానీ తాగాలి… ఇదేమన్నా నవ్వులాటా మేమ్‌సాహెబ్‌ మీరే చెప్పండిక.. బేగం ఆమె పేరు  తీస్కోవడం కూడా  ఇష్టం లేదు. ఇంట్లో ఇట్లా కాలు పెట్టిందో లేదో చిద్దా వాళ్ళ నాన్నను గుటుక్కున మింగింది” మూతి విరుస్తూ  అంది చిద్దా వాళ్ళమ్మ.

‘‘ఎందుకలా అంటావు ఆమె ఏమన్నా విషప్పామా?’’ ముమానీ  జాన్‌ అడిగింది.

‘‘బేగం… పాము కోరలకి మంత్రాలున్నాయి. కానీ పిశాచి కోరలకేం ఉండవు’’ అంది చిద్దా.

‘‘ఎలా కాటేస్తుందేంటి పిశాచి’’ ముమానీ జాన్‌ నవ్వుతూ వెటకారంగా అడిగింది.

‘‘ఓహ్… బీబీ…అయినా  నీకెందుకమ్మా ఇవన్నీ? నువ్వు బడిలో చదవలేదా… అది పిశాచమ్మా… పిశాచి ! అది కోడలిగా వచ్చిన మూడురోజులకే  మా ఆయనకి జ్వరం వచ్చి ఇక విడవనే లేడ్అంటే నమ్ము. మూడు ఆదివారాల తర్వాత చనిపోయారు’’ చిద్దా వాళ్ళమ్మ బాధగా కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది ‘‘ఛల్‌… దెయ్యం…కథలాపి ఇక ఫో…’’ ముమానీ జాన్‌ సగం నిద్రలోకి జారుతూ అంది.

‘‘ఆమె.. అదే నా కోడలు గుటుక్కున మింగకపోతే మా షోహర్‌ ఊరికెనే చనిపోయాడా ఏంటి? ఎంత మంది డాక్టర్లకు చూపించామో తెలుసా… మూడ్నాలుగు రోజులు కిందా మీదా అయ్యాక జ్వరం పట్టుకుంది. అంతా దయ్యం పట్టిందన్నారు’’ అంది చిద్దా వాళ్ళమ్మ.

‘‘ఛల్‌ ముసలిదానా.. ఆ పిశాచి అంత వెర్రిదేమీ కాదు. మింగాలనుకుంటే నన్ను కదా మింగాల్సింది? మీ ఆయన్ని తింటే దానికేం లాభం? అతనిది విషజ్వరం. డాక్టర్‌ దగ్గరికి తీస్కెళ్ళమంటే.,తీస్కెళ్ళారా మీరు? కోపంగా అంది ముమానీజాన్‌.

‘‘లేదు విష జ్వరమేమీ కాదు ఆ కోడలు పిశాచే తినేసింది”. ముసల్ది ఒక్కసారి గట్టిగా శ్వాస తీస్కుని వదిలింది.

“మీకు అర్థం కాదు బేగం. మా ఆయన కంటి చూపు కూడా మందగించింది.  జ్వరం అస్సలు తగ్గకపోతే మౌల్వీగారు కళ్ళకి ఏమైనా కనపడుతుందా లేదా అని అడిగితే ఏమీ కనపడ్డం లేదు అన్నాడాయన. అంత దుర్మార్గమైన పిశాచం అది. గదిలోకి రాగానే ఈన పెద్దగా అరిచి బయటకు పరిగెత్తేవాడు. అది పోగానే శాంతించేవాడు. నాకేం తెలుసు ఇదంతా? నేను పోయి కోడలా వెళ్ళి గ్లాసులో పాలు తీసుకు రమ్మనేదాన్ని నా షోహార్ {భర్త} ఆమె తెచ్చిన పాలగ్లాసు  విసిరికొట్టేవాడు. నేను ఇస్తే మటుకు చుప్‌చాప్‌ తాగేసేవాడు. ఆమె చేత్తో నీళ్ళిచ్చినా తాగకుండా భయంతో అరిచేసేవాడు. ఇంకా బీబీ విను! ఆ పిశాచి కోడలు చిద్దా మీద నా మీద మాయ చేసింది. నా భర్తనైతే పూర్తిగా గుడ్డివాణ్ణి చేసింది. ప్రతిక్షణం ఆమె పేరునే జపించసాగాడు. ఇంకెంతమందిని తింటుందీ పిశాచం? నాకు ఇక రాత్రిళ్ళు నిద్దరే రాలేదంటే నమ్ము బీబి, ఎవరికీ తెలీకుండా చిద్దాకి  ఇచ్చిన మాట వల్ల వాళ్ళ  ఇంటికి వెళ్ళాను. వాళ్ళా  చాలా పెద్ద మనుషులాయే.  నేను వాళ్ళ కాళ్ళ మీద పడి ‘‘నా కొడుకుని ఎలా అయినా రక్షించండి. మీ రుణం ఉంచుకోను’’ అంటూ వేడుకున్నాను.

ఇక మటరూ చెప్పిందే చేసాను ఏం చేసానా బడ్‌ బడ్‌ షా దర్గా మొక్కు తీర్చుకున్నా అక్కడ్నించి తెచ్చిన సుర్‌మా (కాటుక) చిద్దాకి తెలీకుండా కళ్ళకు పెట్టాలి. ఇక అపుడు చిద్దాకి ఈ కోడలు నిజమైన రాక్షసి రూపంలో కనిపించడం మొదలు పెడుతుంది  అని ఆ పెద్ద మనుషులు చెప్పారు. నా ఖర్మ కాకపోతే ఎంతో చెప్పండి? పొరపాటున ఆ సుర్మా ఆ రాక్షసి పెట్టుకుంది ఇంకేం..చిద్దా ఇంకా పిచ్చోడు అయిపోయాడు. తిరిగి మమ్మల్నే కొట్టడం మొదలుపెట్టాడు. ఇక మళ్ళీ నేను మటరూ దగ్గరికి వెళ్ళాను. ‘‘ఈ రాక్షసి ఊరికెనే పోదు ఈ పొడి తీస్కెళ్ళి చిద్దాకి అన్నంలో కలిపి ఇవ్వు’’ అన్నాడు. ఆ పొడితో అన్నం తిన్న చిద్దాకి కడుపునొప్పి వచ్చి రక్తపు వాంతులు చేస్కున్నాడు బీబీ. అంతేకాదు మటరూ నాకు కాళ్ళూ చేతులపైన సూదులు గుచ్చిన చెక్కబొమ్మ కూడా ఇచ్చాడు. కోడలికి తెలీకుండా ఎక్కడైనా కనిపించే జాగాలో పెట్టమన్నాడు.

తర్వాత అందరికీ తెలిసేలా గొడవ చేయమన్నాడు. చుట్టుపక్కల ఉన్న జనానికి నీ కోడలు మంత్రగత్తె అని అర్థం కావాలి. ఒకళ్ళనైతే తినేసింది. ఇప్పుడు ఇంకొకళ్ళని ఖతమ్‌ చేయడానికి బయలు దేరింది” అన్నాడు మటరు.  ఇక చూస్కోండి. నేను మటరు చెప్పినట్లే బజారెక్కి అరవడం మొదలుబెట్టాను. బజారులోని నౌఖర్లు, ఇళ్ళల్లోని వాళ్ళూ బయటకు  వచ్చేసారు. అక్కడ మటరు  ఇచ్చిన సూదులు గుచ్చిన చేతబడి బొమ్మని చూసారు. ఇక వెంఠనే చిద్దాని పిలిచి ‘‘బాబూ ఇలాంటి మంత్రగత్తెని ఇంట్లో పెట్టుకోకు… ఇది నిన్ను కూడా తినేస్తుంది’’ అన్నారు. చిద్దా భయపడిపోయారు”అని అ చిద్దా వాళ్లమ్మ … ఆయాసపడ్తూ కాస్త ఆగింది. నేను కొంచెం భయపడ్డాను ఈ మంత్ర తంత్రాలు ఏంటి అని .

‘‘ఈమె మాటలు కొంచెం విను ఆయేశా …అవ్వల్  నంబర్‌ బద్మాష్‌ ఈమె… తానే తన కొడుక్కి విషం ఇచ్చింది. వాడి ఆరోగ్యం బాగా పాడవడంతో వాళ్ళ మామ వచ్చి పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంటే ఇస్తా అని బెదిరిస్తే కానీ ఈ చిద్దా వాళ్ళమ్మ… బద్మాష్‌ది దవాఖానాకి తీస్కెళ్ళలేదు అంది ముమాని బేగం కోపంగా అక్కడే ఉన్ననాతో.

చిద్దా వాళ్ళమ్మ కొంచం తడబడింది. ‘‘అవునవును దవాఖానాలో రెండు వారాలు ఉన్నాడు నిజంగా’’ అంది.

దవాఖానాలో కాదు శ్మశానంలో ఉన్నాడు అన్నటే చెబుతోంది ఈ ముసలిది అనుకుంది ముమాని బేగం.

‘‘వారు సచ్చిపోయేట్లు నువ్వే చేసావు వాళ్ళ మామ  ఉరుకులు పరుగులలో దవాఖానాలో చేర్చాడు కాబట్టే వాడు బతికాడు పాపం’’ అంది ముమాని బేగం.

‘‘లేదు బేగం… ఎలా చస్తాడో అన్నది మాత్రం నాకు మటరూ పూర్తిగా చెప్పాడు’’ అంది చిద్దా వాళ్ళమ్మ చాలా నమ్మకంగా.

“అవునా బుద్ధిలేని దానా ఉండు నేను చిద్దాకి చెప్పకపోతే చూడు. నువ్వుసలు చిద్దాకి విషం ఇచ్చిన సంగతే తెలీదు” అంది ముమానీ బేగం కోపంగా.  ఆమె తన నౌఖర్ల జీవితాల్లో ఏం జరుగుతుందో ప్రతీ ఒక్కటీ తెలుసుకుంటుంది. ముమానీ జాన్‌ నవ్వుతూ ఆయేషా వైపు తిరిగి ‘‘మంత్రగత్తే  అసలు  ఈ చిద్దా వాళ్ళమ్మనా లేక ఆ అభాగ్యురాలైన కోడలా కాస్త చెప్పు’’ అంది.

అది విని కాస్త అలిగినట్లే ముఖం పెట్టి అంది చిద్దా “నిజం చెప్పనా బేగమ్‌ సాహెబ్‌? చిద్దా వాళ్ళ వెంట బాగా తిరిగాడు. వాళ్ళ ఊరు వెళ్ళాడు. వాళ్ళని కలిసాడు. అక్కడి వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి రాజీపడ్డాడు. కానీ ఆమెనే రాలేదు. ఆమెకోసం చద్దా నాతో ఇప్పటికీ గొడవ పడుతూనే ఉంటాడు. నేనైతే చెప్పేసాను బేగం! ఒరే చిద్దా నువు నన్ను చంపు, నరుకు ఏమన్నా చెయ్యి కానీ ఈ మంత్రగత్తెతో నువ్వు ఉండడానికి వీలు లేదని’’ చిద్దా వాళ్ళమ్మ ఏదో ఖచ్చితంగా మాట్లాడుతున్నట్లు చెప్పింది.

‘‘కానీ ఉన్నట్లుండి ఆమె మంత్రగత్తే, రాక్షసి ఎలా అయిపోయింది నాకర్థమే కాని విషయం ఇది’’ అన్నాను నేను.

‘‘నీకు తెలీదు బేగమ్‌ ఆమె ముందు నించీ పిశాచమే’’ అంది చిద్దా వాళ్ళమ్మ.

‘‘అదే., ఎలా అయ్యిందో చెప్పుమన్నాగా’’  రెట్టించినట్లే అంది ముమాని బేగం .

‘‘అరే ఆయేషా.. ఈ చదువు కోని మూర్ఖురాలిలో ఎందుకు వాదించి నీ బుర్ర పాడు చేసుకోవాలి నువ్వు  చెప్పు? పొండి అంతా వెళ్ళి నిద్రపొండి… మళ్ళీ సాయంత్రం నిద్ర లేవకుండా సతాయిస్తావు’’ ముమానీ జాన్‌  నా మీద  అరిచింది. నాకు చిద్దా వాళ్లమ్మ , అంటే మా అత్త ముమానీ జాన్ తో కోడళ్ళ గురుంచి  చెప్పే కబుర్లు భలే ఆసక్తిగా ఉండేవి.

– – –

నాలుగు రోజుల తర్వాత చిద్దా కొత్త భార్య వచ్చేసింది. మంచి కండ పుష్టి ఉన్న అమ్మాయి. ముఖం మీద మశూచికపు మచ్చలున్నాయి. అయినా కానీ నవ్వు ముఖంతో చక్కగా ఉంది. వచ్చిన రోజే చిద్దా వాళ్ళమ్మ కోడల్ని ముమానీ జాన్‌ సలామ్‌ చేయించడానికి తీసుకుని వచ్చింది. ముమానీజాన్‌ ఆమె కోడలి చేతిలో ఒక రూపాయి కానుకగా పెడ్తూ ‘‘ఒక్క ఏడాదిలో ఇంత మంది కోడళ్ళు వస్తూ పోతుంటే ఎంత మందికని నేను ఇలా  కానుకలు  ఇస్తూ పోవాలి చెప్పు? నా ఖజానా ఖాళీ అవుతోంది. కనీసం ఈమెనన్నా మనశ్శాంతిగా ఉండనివ్వు” అంది ముమానీ జాన్‌.

‘‘హు విన్నావా… బేగమ్‌ సాహిబా ఏమన్నదో నేను వెళ్ళగొడతానో లేక ఈమెగారి పిచ్చిపనులే ఈమెను ఇంటి నుంచి వెళ్ళగొడతాయో చూద్దాం’’ చిద్దా వాళ్ళమ్మ వెటకారంగా అంది.  

……                                                                                          ఇక ఇప్పుడు చిద్దా కొత్త భార్య తన అత్తగారికి రెండు గంటల నించి విసనకర్ర వూపుతూనే ఉంటుంది. మేమిద్దరం అంటే నేనూ చిద్దా భార్య  ఒకరికొకరం విచిత్రమైన జంట. ఒకరి లోకం ఇంకొకరికి అసలు తెలీదు. ఆమె నా కాలేజీ విషయాలు విని ఆశ్చర్యపోయేది. నేను ఆమె ఊరి విషయాలు, వాళ్ళ జీవితాలు వింటూ హైరాన పడిపోయేదాన్ని. హిందుస్థాన్‌లో ఉంటూనే నేను నా దేశం గురించి ఏమీ తెలీని దానిలా అయిపోయాను. వాళ్ళమ్మను చూసాక కానీ అర్థం కాలేదు. రాత్రంతా మేమిద్దరం గుసగుసగా మాట్లాడుతూనే ఉండేవాళ్ళము. ముమానీ జాన్‌ని కూడా నిద్రపోనిచ్చే వాళ్ళం కాదు. ఆమె ‘‘అబ్బా నిశబ్దంగా ఉండండి నిద్రపోనివ్వండి నన్ను’’ అని విసుక్కుని మళ్ళీ నిద్రపోయేది. మేము ఆమెను వదిలి మళ్ళీ మా బాతాఖానీలో పడిపోయే వాళ్ళం.

నాకు ఆమె మాటలు వింటూ ఉంటే భలే మజా వచ్చేది. ఒక రోజు ఆమె వచ్చింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖం ఉబ్బి ఉంది. గాజులు విరిగి ఉన్నాయి. చేతుల మీద అక్కడక్కడా రక్తపు మరకలున్నాయి. ఏమైందని నేను అడిగిన వెంఠనే ఆమె కదిలి కదిలి ఏడుస్తూ చిద్దా చావబాదాడని చెప్పింది. ముసల్ది ఎప్పుడూ అరుస్తూనే ఉంటుందనీ ఎప్పుడూ చూడూ కొడుకుతో తన గురించి చెడ్డగా చాడీలు చెప్తూ ఉంటుందనీ చెప్తూ ఏడ్చింది.  తన అత్త ఉడుకుతున్న పప్పులో దొంగతనంగా  ఉప్పు ఎక్కువ  వేస్తుంది. పప్పు ఉప్పు కషాయం చేస్తుంది, చేసిన రొట్టెల్ని పాడు చేస్తుంది. ఎప్పుడూ తను చేసే ప్రతీ పనిలో తల దూర్చి ఆ పని పాడు చేస్తుందని చెప్తు ఏడ్చిందా కోడలు. కానీ కోడల్ని కొడుకు ఏమీ అనటం లేదు. తను కోరుకుంటున్నట్లు తిట్టటం కొట్టటం లేదు. అందుకే ఈసారి చిద్దా వాళ్ళమ్మ కొత్త కుట్ర పన్నింది. ఆ రోజు కొడుకు ఇంట్లో కాలుపెట్టగానే చిద్దా వాళ్ళమ్మ కోడల్ని పట్టుకుని కొట్టసాగింది. ‘‘ఈ దరిద్రపుది పక్కింటి ఈదు గాడితో తో కల్సి కులుకుతోంది’’ అంటూ. ఇక చిద్దా కూడా తల్లితో కలిసి ఆ భార్యని చావగొట్టాడు. చిద్దా భార్య చాలాసేపటి వరకూ ఏడుస్తూ ఉండిపోయింది. పాపం నాలుగు రోజుల వరకూ బయట పడకుండా మౌనంగానే ఉంది. కానీ విధవరాలైన ఆమెకి తనకి రెండో సారి  జరిగిన పెళ్ళి కొంత ఆనందాన్నిచ్చింది. ఈ ఒక్క విషయం వల్ల ఆమె ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేది. కానీ అత్తా, భర్తా అంత దారుణంగా కొట్టాక ఆమె ముఖంలోంచి చిరునవ్వే మాయం అయిపోయింది. అత్తని చూస్తూనే ఆమె ముఖం మాడిపోయి… పక్కకి తిప్పుకునేది. ప్రతీ రోజూ ఒక కొత్త కథ వినిపిస్తూ ఉండేది. ఇక కాలేజీలు తెరిచారు. నేను ముమానీ జాన్ ఇంటి నుంచి నా ఇంటికి తిరిగి వచ్చేసాను. చిద్దా, వాళ్ళమ్మ, ఆమె కోడల్ని పూర్తిగా మర్చిపోయాను. ముమానీ జాన్‌ని కూడా చాలా రోజుల వరకూ కలవలేకపోయాను. మా అన్న పెళ్ళికి ముమానీ జాన్‌ మా ఇంటికి వచ్చింది అప్పుడే నాకు చిద్దా భార్య గుర్తుకు వచ్చింది. వెంఠనే చిద్దా భార్య ఎలా ఉంది అని అడిగాను. ముమానీ జాన్‌ ఒక్కసారిగా నవ్వేసి, ‘‘హుఁ ఆమెని కూడా చిద్దా ఎప్పుడో వదిలేశాడు’’ అంది. నేను వెంఠనే ‘‘మీరెందుకు ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటారు మరి?’’ అని, అడిగాను. ‘‘బిడ్డా ఎవరెవరిని పనిలోంచి తీసేయ్యాలి చెప్పు? చాకలి వాడు వేరే ఊరికి వెళ్ళిపోయాడు. తోటమాలీ కూడా అంతే. తెలుసా  ఈడు గాడు కూడా ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చేసాడు. హుం.. ఇలా ఊరికే భార్యలకు తలాఖ్ ఇవ్వడం ఉంది చూశావూ .. ఇదెవ్వరికీ చెడ్డ పనిగా అనిపించదు. ఈ దేశంలో నిస్సహాయ స్త్రీలు ఇంత తక్కువ ధరకే  దొరుకుతుంటే మనమేం చేస్తాం చెప్పు? చిద్దా పుట్టటమే ఇంట్లో పుట్టాడు. కాన్పు కష్టమై.. వాడికి వైద్యం అందక వాడికేం రోగం ఉందో ఎవరికి తెలుసు? వాడి స్వభావం కూడా మంచిదే కానీ ఏం చేస్తాం? ముమానీ జాన్‌ నిట్టురుస్తూ అంది. ‘‘చిద్దా వాళ్ళమ్మ ఎట్లా ఉంది’’ అడిగాను నేను ఆశక్తిగా బతికుందో లేదో తెలీదు నాకు మరి. ‘‘ఆమెక్కడ ఛస్తుందీ ఇప్పుడే? హాఁ కానీ ఇప్పుడొచ్చిన ఇంకో  కొత్త కోడలు ఆమెను తిక్క కుదిర్చి దార్లో పెట్టిందిలే’’ అంది ముమానీ జాన్‌.ముసల్ది ఈ కోడలిని కూడా పాత కోడళ్ళల్లాగే సతాయించింది. కానీ కొత్త కోడలు ఆమెని మించిపోయింది. ఒక రోజు అత్తను పట్టుకొని ఘడాయించి పడేసింది. పాత కోడళ్ళందరి తరఫునా కక్ష్య తీర్చుకుంది అనుకో.

ఏమందో తెలుసా అత్తతో… ‘‘నేను ఈ ఇల్లు వదిలి ఎటూ పోను. ఏమనుకున్నావ్ ? భయపడి  వెళ్ళిపోయిన పాత కోడళ్ళలాగా పిరికిదాన్ని కాదు నేను. పాపం వెళ్ళిపోయిన వాళ్ళంతా ఎక్కడికి పోయారో…వాళ్ళ గతేమైందో ? ఈ ఇంట్లో ఉండాలంటే బుద్ధిగా ఉండు లేకపోతే… నీ దారిన నువ్వు వెళ్ళిపో’’ అంది.

ఇంకేం చేస్తుంది ? ముసల్ది మూడు రోజుల వరకూ నా దగ్గరే ఉంది. ఇంత కాలం  ఎన్నెన్నినాటకాలూ మాయలూ చేయాలో అన్నీ చేసింది కానీ ఇప్పుడు పిల్లిలా అయిపోయింది. కోడలికి ఎంత భయపడుతుందంటే నాకే ఒక్కోసారి జాలి పుడుతుంది”. అన్నది ముమానీజాన్‌.  మళ్ళీ తనే ‘‘ఇక చిద్దాగాడైతే భార్యకు బానిసైపోయాడు ఇదే కదా  ఆ ముసల్ది సహించలేక పోయింది? కానీ బిడ్డా అసలు నిజం ఏంటంటే స్త్రీలంతా ఒకటే స్వభావంతో ఉండరు… ఒక్కోరు ఒక్క స్వభావంతో ఉంటారు. ఈ ఐదో కోడలు భలే ధైర్యవంతురాలు  ఏమంటావ్‌?’’ అంది.ముమానీ జాన్‌ ! ఏమంటాను… నిజమే  కదా?

డా. రాషీద్ జహాన్

డా. రాషీద్ జహాన్ ప్రముఖ ప్రగతిశీల ఉర్దూ రచయిత్రి. డా. రాషీద్ జహాన్ ఆగస్ట్ 25, 1905లో ఆలీఘర్ లో జన్మించారు. రాషీద్ జహాన్ స్రీ వైద్య నిపుణురాలు.{gynaecologist } ప్రజాపక్ష మేధావి, కమ్యూనిస్ట్ నాయకురాలు. అభ్యుదయ కథా రచయత్రి.  తొలి  కమ్యూనిస్ట్ ముస్లిం డాక్టర్ & సర్జన్ గా ఎన్నో వైద్య సేవలు అందించారు .

గీతాంజలి

Dr. Bharati : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. రచనలు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). ''బచ్ఛేదాని' (కథా సంకలనం). 'పహెచాన్' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం ' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *