ఆ సాయంత్రం బీరుషాపుకి అనుకోకుండా వెళ్లాను. అప్పటికే బాగా ముసురుపట్టింది. సన్నగా జల్లు పడుతోంది. అలముకున్న మంచుపొరల్లో దుకాణాలనుంచి వచ్చే లేత వెలుగు కాలిబాటకొక వింత కాంతినిస్తోంది.
నేను ఫలానా చోటికెళ్లాలని బయల్దేరలేదు. భోజనం చేశాక, కాసేపు అలా తిరిగి రావటం నా అలవాటు. ఆ షాపులో జనం ఎక్కువగా లేనిచోట ఒకతని పక్కనే కూర్చున్నాను. చాలా వయసున్నవాడిలా కనిపిస్తున్నాడు. ఒక చౌకబారు మట్టిపైపు అతని నోట్లో ఉంది. ఆ వాలకాన్ని బట్టి, అతనెంత బీరు తాగాడో అర్ధమవుతోంది. షాపు తెరిచే సమయానికొచ్చి మూసేదాకా వుండేవాళ్లలో ఒకడని తెలిసిపోతూనే వుంది.
నేనతని దగ్గర కూర్చోగానే “విశేషాలేమిట”ని అడిగాడు. “బహుశా నువ్వు నన్ను గుర్తుపట్టి వుండవు. నీ కాలేజీ మిత్రుడిని. దే బేరెక్స్‌ని”
ప్రాణస్నేహితుడ్ని గుర్తించనందుకు సిగ్గుపడుతూ, ఆత్మీయంగా అతని చేయి అందుకుని అడిగాను “నీ గురించి చెప్పు”
“నా గురించా! ఏముంది చెప్పటానికి? ” అన్నాడు.
“ప్రస్తుతం ఏం చేస్తున్నావు”?
“చూస్తూనేవున్నావుగా” అంటూ గట్టిగా పొగ పీల్చి వదిలాడు. “వెయిటర్! బీరు” అంటూ అరిచాడు.
వెంటనే వెయిటర్ నురగలు కక్కుతున్న బీరును బల్లమీదుంచి వెళ్లాడు.
ఒకే గుటకలో బీరంతా తాగేసి, మీసాలకంటిన తడిని నాలుకతో నాకాడతను.
“ఏవైనా కొత్త వార్తలుంటే చెప్పు”అన్నాడు.
“అలాంటివేం లేవు. నాకు కొత్త, పాత వార్తలంటూ వుండవు. నేనొక మామూలు వ్యాపారిని”
“ఈ పని నీకు సంతృప్తికరంగా వుందా? “
“తృప్తి వున్నా లేకపోయినా, ఏదో ఒకటి చేయాలిగా. సరే కానీ నువ్వేం చేస్తుంటావు”?
“నేనేమీ చేయను. పైపు నోట్లో పెట్టుకొని, “వెయిటర్! ఇంకో బీర్” అంటూ అరవడమే నా పని. నా కళ్లముందు జరిగే వాటిని చూస్తూ వుంటాను. ఇలాగే ముసలివాడ్నయిపోతాను. చనిపోయేటప్పుడు కూడా నేను దేని గురించీ ఆలోచించను, పశ్చాత్తాప పడను. ఈ చోటు తప్ప నాకేదీ గుర్తుండదు. భార్యాబిడ్డలూ లేరు, చింతలూ చికాకులూ వుండవు. ఇంతకంటే హాయి మరేముంది”?
“నువ్వు మొదటినుంచీ ఇలా లేవు కదా? ”
“కాలేజీ వదిలేసిన దగ్గరనుంచీ, ఇలాగే వున్నాను”
“ఫెండ్! జీవించే పద్ధతి ఇది కాదు. సరే, ఆ సంగతి వదిలేయి. ఇంతకీ నువ్వు ఎవరినైనా ప్రేమించావా? కొత్త స్నేహాలు ఏర్పడ్డాయా”?
“లేదు. ఏ స్నేహాలూ ఏర్పడలేదు. నేను మధ్యాహ్నం నిద్ర లేచి ఇక్కడికొస్తాను. కాస్తంత ఆహారం తీసుకుని, ఆ వెంటనే బీరు తాగుతాను. సాయంత్రం వరకూ ఇక్కడే వుంటాను. రాత్రి భోజనం ముగించి మళ్లీ బీరు తాగి అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంటికెళ్తాను. ఎందుకంటే, అప్పుడు ఈ హోటల్ మూసేస్తారు కనుక ! తర్వాత నాకు టైమ్ గడవటమే కష్టం. గత పదేళ్లలో ఆరేళ్లు ఇదే… ఈ బెంచీమీదే కూర్చొని గడిపాను. నాలుగేళ్లు బెడ్‌మీద. ఇదీ నా దినచర్య, ఇందులో ఏ మార్పూ లేదు”
నన్ను ఫూల్ చేస్తున్నాడేమో అనిపించింది. “సరే మిత్రమా! స్పష్టంగా చెప్పు నువ్వు ప్రేమలో మోసపోయి వుంటావు. అవునా? అందుకే నీ మనసు గాయపడి వుంటుంది. ఏమంటావ్? అసలింతకీ నీ వయసెంత”?
“ముప్పయి ఐదు. అయినా వయసు మళ్ళిన వాడిలా వుంటాను”
నేనతన్ని పరీక్షగా చూశాను. ముఖమంతా ముడతలు.
అతన్ని చూసిన వారెవరైనా ముసలివాడనే అనుకుంటారు. ఒత్తయిన కనుబొమలు, గుబురు మీసాలు, పొడవాటి గడ్డం.
“నువ్వు నీ వయసుకన్నా పెద్దవాడిలా కనిపిస్తున్నావన్నది నిజం. నీకేదో పెద్ద బాధే కలిగి వుంటుంది”
అతనన్నాడు “అలాంటిదేమీ లేదు. అసలు నేనెన్నడూ బయట తిరగను. అందుకే ఇలా వున్నాను”
నేనతని మాటలు నమ్మలేదు. “నీకు పెళ్లయు వుంటుంది. కానీ నీ జీవితం మాత్రం సుఖంగా లేదు. అందుకే ఇలా తయారయి వుంటావు” అన్నాను.
“పెళ్ళా? నాకంతటి అదృష్టమా? “ అంటూనే “వెయిటర్! మరో బీర్ “ అని ఆరిచాడతను.
“నీ మాటలు నాలో ఏదో ఆసక్తిని రేపుతున్నాయి. నీ జీవితం ఇలా మారటానికి కారణమంటూ వుండే వుంటుంది. నీ బతుకు మామూలుగా లేదు. చాలా తేడాగా వుంది. ఎందుకిలా వుంది? తెలుసుకోవాలని వుంది నాకు”
“చిన్నప్పుడే నా మనసుకు పెద్ద దెబ్బ తగిలింది. జీవితమంతా చీకటిగా మారిపోయింది. అదే.. ఆ బాధే.. నన్ను చనిపోయేదాకా వెంటాడుతూ వుంటుంది”
“అసలేం జరిగింది”?
“తెలుసుకోవాలని వుందా? అయితే విను. చిన్నప్పుడు నేనున్న ఆ మహల్‌ని నువ్వు చూసే వుంటావు. అది చెట్ల మధ్య ఉండేది. నా తల్లిదండ్రులు ఆడంబరంగా ఉండేవారు. అన్యోన్యంగా ఉన్నట్లు నటించే వారు! కానీ, అమ్మంటే నాకు ప్రాణం. మా నాన్నంటే మటుకు నాకు చాలా అనుమానాలుండేవి. అయినా ఇద్దరినీ అభిమానించేవాడిని. సంఘంలో మా నాన్నకు మంచి పేరుంది. నాకప్పుడు పదమూడేళ్లు. అవి సెప్టెంబరు నెల చివరి రోజులు. స్కూలు హాస్టలు నుంచి నేను మా ఇంటికొచ్చి కొద్ది రోజులే అయింది. ఓ రోజున చెట్టెక్కి, ఒక కొమ్మమీదనుంచి మరో కొమ్మమీదకి దూకుతున్నాను. క్రమంగా చీకటి అలుముకుంటోంది. అప్పుడే గాలి బాగా వీస్తోంది. ఆ తాకిడికి చెట్లు ఊగుతున్నాయి. అదే సమయంలో మా అమ్మా నాన్నా కలిసి నేనున్న వైపుగా వస్తున్నారు. వాళ్లని ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తాలని, ఆ కొమ్మల మధ్యగా జారుతూ వెళ్లాను. కానీ అకస్మాత్తుగా నన్ను భయం ఆవహించింది. వాళ్లకి కొద్దిదూరంలోనే ఆగిపోయాను. అంతలో మా నాన్న “నాకు డబ్బు చాలా అవసరం. నువ్వు ఈ కాగితం మీద సంతకం చెయ్యాల్సిందే” అన్నారు.
మా అమ్మ వెంటనే అంది “సంతకం చెయ్యను. ఇది నా కుమారుడి భవిష్యత్తుకు చెందిన విషయం. మీరు మీ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తినంతా మీ ఉంపుడుగత్తెకే ధారపోశారు. ఇది కూడా ఆమెకివ్వడం నేను సహించలేను. దీనికి ఎంత మాత్రం ఒప్పుకోను.”
అంతే… నాన్న మండిపడుతూ మా అమ్మ జుట్టు పట్టుకుని గొడ్డును బాదినట్లు బాదారు. దెబ్బల నుండి తప్పించుకోవటానికి ఆమె ఎంతగానో ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. ఇదంతా చూసిన నాకు.. ప్రపంచమే తలకిందులైనట్లు అనిపించింది. నా లేత మనసులో తుపానులు చెలరేగాయి. దుఃఖాన్ని ఆపుకోలేక బిగ్గరగా అరిచాను. అది విన్న మా నాన్న నా వైపు రాసాగారు. నన్ను కూడా కొట్టేస్తారనే భయంతో పారిపోయాను. అలా పరుగెత్తుతూనే వున్నాను. ఎదురుదెబ్బ తగిలి, కిందపడ్డాను. లేచాను. నాలో అంతులేని భయం, బాధ. దయనీయంగా మారింది. నాకు చలేస్తోంది. మరో వైపు ఆకలి. తెల్లారాక ఇంటికెళ్లాలంటే, నాకు ధైర్యం చాలటంలేదు. ఇంటికెళ్తే నాన్న కనిపిస్తారు. ఇక జన్మలో ఆ మొహం చూడగూడదనుకున్నాను. అంతలో మా ఇంటి నౌకరొకడు నన్ను వెదుక్కుంటూ అక్కడికొచ్చాడు. అతనే గనక నన్ను ఇంటికి తీసుకెళ్లకుండా వుంటే, నేను అక్కడే ప్రాణాలు వదిలే సేవాడిని! తర్వాత, అమ్మా నాన్నా మామూలుగా ఉండటం గమనించాను. ఆ రోజు అమ్మ నాతో అంది. “అప్పుడు నన్ను భయపెట్టేశావు కదా” అని. ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. ఏడుపొచ్చేసింది. పదిరోజుల తర్వాత హాస్టల్లో చేరాను నేను. ఆ సంఘటన నా జీవితాన్ని కుదిపేసింది. తర్వాత నాకెక్కడా మంచి అన్నదే కనిపించలేదు. మనసులో భయం గూడుకట్టుకుపోయింది. ఏదో బరువైన భావం నన్ను కప్పేసింది. దేనిమీదా నాకు ఆసక్తి లేకుండా పోయింది. ప్రేమ లేదు, ఆశ లేదు, కోరికలేదు. అమ్మను నాన్న కొట్టిన దృశ్యమే ఎప్పుడూ నా కళ్ళముందు కనిపించేది. కొన్నాళ్లకు అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఇప్పటిదాకా నాన్నని నేను చూడనే లేదు”
“వెయిటర్! ఇంకో బీర్!” మళ్లీ అరిచాడతను.
దాన్ని ఒక్క గుటకలో తాగేసి, పైపుని మళ్లీ నోట్లో పెట్టుకునే సమయంలో చేయి వణికింది.
చేతిలోని పైపు నేలమీద పడిపోయింది.
అంతలోనే అతని ముఖం భయంకరంగా మారింది. “వెధవది! ఇదే నాకన్నిటికంటే పెద్ద బాధ. ఈ పైపుని కొని నెలైనా కాలేదు” బిగ్గరగా అన్నాడతను.
పొగ, మద్యం తాగేవాళ్లతో నిండిపోయిన ఆ హాలంతా ఆ కేకతో అదిరిపోయింది “వెయిటర్! మరో బీర్, కొత్త పైపుకూడా తీసుకురా!”