యుగానికి ఒక్కడు
నా దృష్టిలో ఓ గొప్ప సినిమా…
ఈ సినిమా కథని నవలగా రాస్తే, భారతీయ సాహిత్యంలోనే ఓ అధ్బుతమైన నవల అయ్యుండేది.
డైరెక్టర్ సెల్వ రాఘవన్ కి చాలామంది ఇదే మాట చెప్పారట.
If it can be written
It can be filmed also
అని ఆయన నమ్మారు.
సినిమా రిలీజ్ అయ్యే టైమ్ కి నేను చాలా చిన్నవాడిని… అంటే ఓ ఆరేడేళ్లు ఉండొచ్చు.
అప్పుడు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత కూడా రెండు మూడుసార్లు చూసినా అర్థం కాలేదు. బహుశా సినిమా అనే మీడియం తాలూకూ విస్తృతి నాకు అప్పటికి తెలీదు. కొంత ఎదిగాక, సినిమా అనేది ఎల్లలు లేని ఒక ఆర్ట్ ఫాం అని అర్థం అయ్యాక ఈ సినిమా చూసి నా ఆశ్చర్యానికి అంతు లేదు.
ఈ సినిమా ఒక చారిత్రక నాటకంలా ప్రారంభం అవుతుంది. చరిత్రలో ఎంతో ప్రసిద్ధి చెందిన చోళ, పాండ్య రాజ వంశాల శత్రుత్వాన్ని చూపిస్తూ చోళ వంశ యువరాజుని పాండ్య రాజుల దాడి నుంచి తప్పించి, సముద్రాల అవలికి పంపించి ‘ఇక్కడ రాజ్యంలో పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి రాజ్యానికి తీసుకురావడానికి దూతని పంపిస్తానని, అప్పటిదాకా ఎదురుచూడవలసిందే’ అని చోళ రాజు చెప్తాడు.
కట్ చేస్తే కొన్నేళ్ళు కాదు కొన్ని శతాబ్దాలు..
ప్రస్తుతం మనం ఉన్న కాలంలో కథ మొదలు అవుతుంది. పారిపోయిన చోళ యువరాజుని వెతుక్కుంటూ ఓ దళం బయలుదేరుతుంది. ఒక treasure hunt లాంటి కాన్సెప్ట్ అనిపిస్తుంది. హీరో చాలా సాధారణమైన ఓ కార్మికుడు. గుంటలు తవ్వడం, బరువులు మొయ్యడం అతని పని. వియత్నాం దగ్గర సముద్రంలో ఉన్న ఏదో దీవిలో వాళ్ళు వెతుకుతున్న చోటు ఉందని అక్కడికి వెళ్తారు. అక్కడికి చేరిన దగ్గర్నుంచి అడుగడుగునా ఆటంకాలు. కాదు ప్రమాదాలు.
మనుషుల్ని తినేసే రాకాసి పీతలు,
రాత్రిపూట కాటేసి చంపేసే విషసర్పాలు,
నిర్దాక్షిణ్యంగా నరికి చంపేసే ఆటవికులు…
ఇన్ని దాటాక అంతూ దరీ లేని ఓ ఎడారి….. ఒరి నాయనో….
ఆ ఎడారిలో హీరో(కార్తీ), ఓ లేడీ ఆర్కియాలజిస్ట్(ఆండ్రియా), ఓ లేడీ ఆఫీసర్( రీమా సేన్)
నానా తిప్పలూ పడి(ఎడారిలో నిలువుగా నిలబెట్టిన రాళ్ళు సూర్యోదయం సూర్యాస్తమయాల్లో ఇసుకలో నటరాజ స్వామి నీడని ఏర్పరుస్తాయి. చోళులు శైవులు కదా అందుకే నటరాజ స్వామి detailing…అందులోనే నడవాలి. మిగతా అంతా ఊబి) ఎట్టకేలకు ఆ చోటు చేరుకుంటారు. మధ్యలో ఆకలి, దాహం వాళ్లలో మృగలక్షణాల్ని మొల్కొలుపుతాయి. ఏమైతేనేం ఆ చోటుకి చేరుకుంటారు. ఇక్కడే సినిమాలో బుర్రతిరిగిపోయే ట్విస్ట్ వాళ్లు వెతుకుతూ వచ్చిన చోటులో ఆ చోళ యువరాజు వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. తనకు వంశాగతంగా దక్కవలసిన రాజ్యం కోసం, పట్టాభిషేకం కోసం కాలాలను దాటి, వయః పరిమితిని జయించి ” దూత వచ్చేదాకా ఎదురుచూడమని” చోళ మహారాజు చెప్పిన మాటను నమ్మి అతను ఎదురుచూస్తూ ఉన్నాడు. అతనే కాదు, అతనితో పాటూ తరలి వచ్చిన అతని పరివారం అంతా…
ఇక్కడ ఈ సినిమా కమర్షియల్ లెక్కలను దాటుకొని కళ స్థాయికి చేరింది అనిపిస్తుంది. ఈ సినిమా ఒక treasure hunt కాన్సెప్ట్ కాదు. ఈ కాన్సెప్ట్ పేరు ఎంటో తెలీదు. కానీ నాకు ఇది ఎదురుచూపులో ఉండే ఓ పట్టుదలనీ, ఒక నమ్మకం వెనుక ఉండే ఓ మొండితనాన్ని ఎంతో గొప్పగా అవిష్కరించిన కాన్సెప్ట్…
నిరీక్షణ, veer Zara సినిమాల్లో జైలు నుంచి విడుదల అయి వచ్చే హీరో కోసం హీరోయిన్ వృద్దాప్యంలో ఎదురుచూసే ఆ సీన్ లలో, చూస్తున్న ప్రేక్షకుడి మనసులో కలిగించే ఫీలింగే నాకు ఇక్కడ కూడా కలిగింది.
అయితే ఈ సినిమా ఇక్కడే ఆగిపోదు. ఇది రెండు రాజ వంశాల కాలాతీతమైన శతృత్వం గురించిన కథగా మారుతుంది. అతన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆ టీమ్ పాండ్య వంశ వారసులుగా రివీల్ అవుతుంది. యుగాలు గడిచిపోయినా వాళ్లు ఎందుకు ఆ శత్రుత్వాన్ని విడిచిపెట్టలేదు. ఇక్కడ దర్శకుడు ఓ గొప్ప historical nuance ని వాడుకున్నాడు. అది ఏమిటంటే ఒకప్పుడు ఒక రాజు మరో రాజ్యం మీద దండయాత్ర చేసి గెలిస్తే అతని సంపదనే కాకుండా అతని రాణుల్ని కూడా చెరబట్టి తన రాజ్యానికి తెచ్చుకునేవాడు. అయితే కొన్నిసార్లు ఓడిపోయిన రాజు కులదేవతని కూడా తెచ్చి తన రాజ్యంలో ప్రతిష్టించుకునేవాడు. ఓడిపోయిన రాజుకే కాదు అతని వంశానికే అది అప్రతిష్ట. తమ కులదేవతని వెనక్కి తెచ్చుకోవడం కోసం పాండ్య వంశ వారసుల పోరాటంగా సినిమా మలుపు తిరుగుతుంది.
అయితే సినిమా ఇక్కడ కూడా ఆగిపోదు. అన్ని శతాబ్దాలు ఎదురుచూసిన ఆ యువరాజు ఎదురుచూపులకి అర్థం ఏమిటీ? అతనికి రాజ్యాభిషేకం జరగదా?
దూతగా వచ్చిన హీరో చోళ యువరాజుని రాజ్యానికి తీసుకెళ్లడానికి భుజానికి ఎత్తుకోవడంతో సినిమా ముగుస్తుంది.
తమిళంలో ఆయిరత్తిల్ ఒరువన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో యుగానికి ఒక్కడు పేరుతో డబ్ అయింది. అయితే ఇది అప్పుడు అంత పెద్ద హిట్ కాలేదు. జనాలకి ఆ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాలేదు. మ్యూజిక్ పెద్ద హిట్. ఉన్ మేలే ఆసదా…(నీ మీదే ఆశగా) అనే పాటని ధనుష్ పాడాడు. With అప్పటి అతని కాబోయే, ఆ తర్వాత అయిన, మొన్న విడాకులు తీసుకున్న అతని భార్య రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తో…
మ్యూజిక్ డైరెక్టర్ అప్పటికి టీనేజర్ ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న… అనిరుద్ కాదు, జీ వీ ప్రకాష్…
ఏ ఆర్ రెహమాన్ మేనల్లుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయి ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాక హీరోగా కుడా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు.
హీరో కార్తీ కి ఇది రెండో సినిమా… ఈ సినిమా తర్వాత అతను చాలా తొందరగానే మంచి సినిమాలు చేసి స్టార్ గా ఎదిగాడు. తన అన్నయ్య సూర్యా లాగే తెలుగులో కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇంకా చెప్పాలంటే తెలుగులో అతని అన్నయ్యకే డబ్బింగ్ చెప్పేంత బాగా తెలుగులో మాట్లాడతాడు.
దర్శకుడు సెల్వ రాఘవన్ హీరో ధనుష్ కి అన్నయ్య. దర్శకుడిగా ఎన్నో మంచి సినిమాలు తీశాడు. 7/G బృందావన్ కాలనీ నా వయసు వాళ్ళందరికీ బాగా గుర్తు ఉండిపోయే సినిమా, తెలుగులో వెంకటేష్ తో ఆయన తీసిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ‘ చాలా మంచి సినిమా… అందులో కోటా శ్రీనివాసరావు గారికీ హీరో వెంకటేశ్ కి తండ్రీ కొడుకుల సంబంధాన్ని భలే చూపిస్తాడు.
ఇప్పుడిప్పుడు తెలుగులో అలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు వస్తున్నాయి.
సెల్వ రాఘవన్ ఇప్పుడు పూర్తి స్థాయి నటుడిగా మారిపోయాడు. ‘సానికాయుదం ‘ అనే సినిమాతో కీర్తి సురేష్ అన్నయ్యగా మర్చిపోలేని performance. ఆశ్చర్యంగా అతని తమ్ముడు ధనుష్ హీరో నుంచి డైరెక్టర్ గా మారాడు. గతంలో పవర్ పాండి… ప్రస్తుతం raayan అనే సినిమా త్వరలో ఆతని దర్శకత్వంలో రాబోతుంది.
ఆ మధ్య ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత అది ఆగిపోయింది. ఆ సీక్వెల్ ఎప్పుడు వచ్చినా అందులో చోళ యువరాజు పాత్ర ధనుష్ చేస్తాడని సెల్వ రాఘవన్ చెప్పాడు. రాజ్యానికి తీసుకువెళ్ళే దూతగా కార్తీ కూడా ఉంటాడుగా.
ఇన్ని చెప్పి ఈ సినిమాలో ముఖ్య పాత్ర అయిన చోళ యువరాజు క్యారెక్టర్ చేసిన నటుడు పార్తిబన్ గురించి మాట్లాడుకోకపోతే పాపం అవుతుంది. అతని నటన ఒక పురాతన మానవుడిని గుర్తుకు తెస్తుంది. వేల ఏళ్ళక్రితం ఈ నేల మీద రాజ్యాన్ని ఏలిన ఒకానొక రాజు ఇలాగే ఉండేవాడిమో… అతని హావభావ ముఖాభినయాలు ఇలాంటివెనేమో… అతని నటన కళ్ళలో నీళ్ళు తెప్పిస్తుంది. Hats off sir…