సెల్వం బ్యాలెన్స్ తప్పుంటే సినిమా చెత్తబుట్టే!

ఇప్పటికే ప్రముఖ తెలుగు దర్శకులు మెచ్చుకొని ఆకాశానికి ఎత్తేశారు. ‘బాగుంది.. బాగుంది’ అనే మౌత్ టాక్ అంతా పాకిపోయింది. ముగింపు మాత్రం చాలా కొత్తగా ఉంటుంది అని ఊదరగొట్టారు. విజయ్ సేతుపతి నటన గురించి తెలిసిందే కాబట్టి సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అని అందరూ ఒక అంచనాకు వచ్చారు. పైగా విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా అవడం మరో ప్రత్యేకత.
తన కెరియర్‌లో 50వ సినిమా అంటే సేతుపతి ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు? ప్రేక్షకులు తన మీద పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం డిసప్పాయింట్ చెయ్యకుండా మంచి కథనే ఎంచుకుంటాడు కదా? అచ్చంగా అదే జరిగింది మహారాజా కథను సేతుపతి ఒప్పుకోవడంలో. ఈమధ్య రెగ్యులర్‌గా వస్తున్న క్రైమ్ థ్రిల్లర్లకు కాస్త భిన్నమైన సబ్జెక్టు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ‘దృశ్యం’ సినిమా స్థాయిని గుర్తు చేస్తుంది ఈ సినిమా. ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే బాలీవుడ్ దిగ్దర్శకుడు అనురాగ్ కశ్యప్, లెజెండరీ దర్శకుడు భారతీరాజా కూడా నటించడం!
తమిళులు చాలా నేచురల్ కథలను ఎంచుకుంటారు అనడానికి ఈ సినిమా మరో ఉదాహరణగా నిలుస్తుంది. ఇందులో విజయ్ బార్బర్ షాపులో పనిచేస్తాడు. అక్కడ ఉస్తాద్‌గా భారతీరాజా కూడా క్షవరం చేస్తాడు. మంగలివాళ్ల జీవితాలను అద్దం పట్టేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. కానీ పూర్తిగా వారి జీవితాల్లోని లోతుల్ని ఈ చిత్రం చూపించలేకపోయింది.
ముందుగా విజయ్ కూతురు జ్యోతి వాయిస్ ఓవర్‌తో కథలోని పాత్రలను, వృత్తిని పరిచయం చేస్తాడు దర్శకుడు. ఇందులో విజయ్ సేతుపతి పాత్ర పేరు మహారాజా. తర్వాత చెత్తబుట్ట దొంగిలించబడిందని మహారాజా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తాడు. అలా సిల్లీగా కథను ప్రారంభించిన దర్శకుడు సినిమాను సీరియస్‌నెస్ వైపు మళ్లిస్తాడు.
అయితే ఈ కథలో అనురాగ్ పాత్రను మరింత నెగెటివ్ చేసే క్రమంలో దర్శకుడు ఆ పాత్రను రేపిస్టు స్థాయికి గనుక దిగజార్చుంటే పాలల్లో విషం చుక్క కలిపినట్టు అయ్యేది. సినిమా మొత్తం దెబ్బెట్టేది. అందుకే ఆ పాత్రకు ఆ ఒక్క దుర్లక్షణం లేకుండా జాగ్రత్త పడ్డాడు. 2017 లో ‘కురుంగు బొమ్మై’ అనే సినిమా తీసి ఆ తర్వాత ఏడేళ్లకు ఈ సినిమా తీశాడు దర్శకుడు నితిలన్ స్వామినాథన్. అయితే తన మొదటి సినమాలో కూడా భారతీరాజాను ఒక పాత్రలో నటింపజేసి ఆ సాంప్రదాయాన్ని ఈ సినిమాలో కూడా కొనసాగించాడు.
కథేంటి?
2010లో నడిచే మహారాజా, సెల్వం అనే ఇద్దరు తండ్రుల కథ ఇది. మహారాజా బార్బర్ కాగా సెల్వంగా నటించిన అనురాగ్ కశ్యప్ ఎలక్ట్రిక్ షాప్ పెట్టుకుంటాడు. ఎవరి జీవితాలు వాళ్లవి. భార్యాపిల్లలతో ఆనందంగా ఉంటారు. ఒక్క ఘటన వాళ్లను ఏ తీరాలకు చేర్చిందనేది అసలైన స్క్రీన్ ప్లే. మహారాజా తన వృత్తి జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. కానీ సెల్వం పేరుకు మాత్రమే షాపు పెట్టుకుని శబరి, సహా మరో పోలీస్ ఆఫీసర్‌తో కలిసి ముఠాగా ఏర్పడి రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటారు. ముసుగులతో దొంగతనానికి వెళ్లి ఇంటివాళ్లను బంధించి, ఆ ఇంట్లోనే తాపీగా వంట చేసుకొని తినేసి, దోచేసుకొని, ఆడవాళ్లుంటే వాళ్లను రేప్ చేసి, ఆ ఇంట్లోని గ్యాస్‌ను లీక్ చేసి పేల్చేస్తారు. అలా ఎవరికీ అనుమానం రాకుండా తమ దొంగతనాలను కొనసాగిస్తుంటారు. తనకున్న కూతురుకి మంచి లైఫ్ ఇవ్వాలని అతను దొంగతనాలు కొనసాగిస్తుంటాడు. అయితే ఇక్కడ సెల్వం రేపులు మాత్రం చెయ్యడు. శబరి, ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రమే చేస్తుంటారు.
ఈ క్రమంలో పోలీసులకు వీళ్ల గురించి తెలుస్తుంది. విచారణ ప్రారంభిస్తారు. దాని తాలూకు వార్త పత్రికలో వస్తుంది. ఆరోజు తన కూతురు బర్త్ డే ఉంటుంది. నీట్‌గా షేవ్ చేసుకుందామని మహారాజా ‘రామ్‌కీ’ సెలూన్‌కు వస్తాడు సెల్వం. బ్యాటరీ కోసం బయటకు వెళ్లిన మహారాజా వచ్చేలోపు అక్కడున్న పేపర్లో దొంగతనాల గురించి వార్త చదివి కంగారుగా శబరితో మాట్లాడుతుంటాడు. వెనకనుంచి అతని మాటలు విన్న మహారాజా పోలీసులకు సమాచారం అందిస్తాడేమోనని అనుమానిస్తాడు సెల్వం.
అయితే అతను కంగారుగా వెళ్తూ కూతురికి గిఫ్టుగా ఇద్దామనుకున్న గోల్డెన్ చైన్‌ను సెలూన్‌లోనే మరిచిపోతాడు. దాన్ని తిరిగి ఇచ్చేద్దామని మహారాజా సెల్వం ఇంటికి వెళ్తాడు. అప్పటికే పోలీసులు వచ్చి సెల్వంను అరెస్ట్ చేస్తారు. దీంతో తన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించింది మహారాజానే అనుకుంటాడు సెల్వం. జైల్లో పగతో రగిలిపోతాడు. మహారాజాను దెబ్బకొట్టాలని భావిస్తాడు. పదమూడేళ్లు జైలుశిక్ష అనుభవిస్తాడు.
జైలు నుంచి బయటకు వచ్చాక మహారాజా మీద పగ తీర్చుకునే క్రమంలో ఒకరోజు రాత్రిపూట మహారాజా ఇంట్లో లేనప్పుడు అతని ఇంటికి వెళ్తాడు. ఇంట్లో ఉన్న కూతురు జ్యోతిని రాడ్డుతో కొట్టి తీవ్రంగా గాయపరుస్తారు. మిగతా ఇద్దరు కామాంధులు ఆమె మీద అత్యాచారం చేస్తారు. జ్యోతిని చంపేద్దాం అనుకున్నవారు కాస్తా చంపకుండా వదిలేస్తారు.
ఇంటికొచ్చి కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసి చలించిపోతాడు మహారాజా. కూతురి మీద ఈగ వాలినా, స్కూల్లో ప్రిన్సిపాల్ తన కూతురు తప్పు లేకపోయినా తిట్టాక సారీ చెప్పకపోతే తీవ్రంగా స్పందించే గుణమున్న మహారాజా.. తన కూతురు మీద ఇంత అఘాయిత్యం జరిగాకా ఎలా ఊరుకుంటాడు?
కాస్త ‘సర్పయాగం’ సినిమాను గుర్తుచేసేలా ఉంటుంది. ఆ ముగ్గర్ని ఎలా కనుక్కున్నాడు? వాళ్లను ఎలా మట్టుబెట్టాడు? అనే సస్పెన్స్ అంతా చెత్తబుట్ట నుంచి ప్రారంభం అవుతుంది. చెత్తబుట్ట పేరు లక్ష్మీ. దాని కోసం పోలీసుల గాలింపు నవ్వు తెప్పించినా చివరికి అది సీరియస్ అవుతుంటుంది.
అలా ఆ ముగ్గురిలో ఒక్కొక్కరిని మహారాజా ఎలా చంపాడు అన్నది టైట్ స్క్రీన్ ప్లే బేస్డ్‌లో సాగుతుంది. పోలీసుల్లోనే ఉన్న ఆ నేరగాణ్ని పట్టుకునేందుకు మహారాజా చెత్తబుట్ట డ్రామా క్రియేట్ చేస్తాడు. చివరికి కనుక్కుంటాడు. అప్పటివరకు నెగెటివ్‌గా కనిపించిన మిగతా ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు పాజిటివ్‌గా మారి మహారాజాకు సపోర్ట్ చేస్తుంటారు. ఆ తర్వాత చివరగా సెల్వంను ఎలా చంపాడు? చంపాక అతనికి జ్యోతి వల్ల తెల్సిన నిజం ఏంటి? అనేది తెర మీద చూస్తేనే బాగుంటుంది. చివరి ట్విస్ట్ మాత్రం అస్సలు ఎవ్వరూ ఊహించరు? ప్రమోషన్స్‌లో వాళ్లు అన్నట్టుగానే చివరి ట్విస్ట్ ఉంది. ఎవరూ ఊహించని విధంగానే ఉంది.
సెల్వం జైలుకెళ్లాక ఓ లారీ ఇంట్లోకి చొచ్చుకు వచ్చిన యాక్సిడెంట్‌లో మహారాజా భార్య, కూతురు, సెల్వం భార్య చనిపోతారు. కానీ చెత్తబుట్ట సెల్వం కూతురు చనిపోకుండా పైన రక్షణ కవచంలా పడి కాపాడుతుంది. అప్పటినుంచి పాప ప్రాణాలు కాపాడిన చెత్తబుట్ట పేరు లక్ష్మీ అని పెట్టుకుంటారు.
కొన్ని లాజిక్స్ పక్కన పెట్టి, నాన్ లీనియర్‌గా ఉన్నా అతని చెవి మీద ఉన్న పట్టీని బట్టి సినిమాను అర్థం చేసుకొని చూడొచ్చు. సున్నితమైన సబ్జెక్టును చాలా సమర్థవంతంగా, జాగ్రత్తగా డీల్ చేశాడు దర్శకుడు. మమతా మోహన్ దాస్ ఆసిఫా అనే పీఈటీ టీచర్‌గా, అభిరామి, సెల్వం భార్యగా చాలా తక్కువగా కనిపిస్తారు. ఏదో సెట్ ప్రాపర్టీస్ మాదిరే ఉంటాయి వారి పాత్రలు. ఇది కేవలం మహారాజా, సెల్వంల చుట్టూనే తిరిగే కథ. సస్పెన్స్ థ్రిల్లర్లు ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.

Humayun Sangheer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *