ప్రతి సూర్యోదయం
ప్రకృతి పడే ప్రసవ వేదనకు మూల్యం
ప్రతి అస్తమయం రేపటికై పరితపించే
పరీక్షనాళికలోనీ ప్రయోగనిరీక్షణ
చంద్రగమనం చీకటికి జరిగే
శస్త్ర చికిత్సకు చిహ్నం
పగలూరేయి బరువుల కావడది
భుజాల మార్పిడికీ వంతుల ఆర్భాటం
నిశ్శబ్దనీడలను కదిలిస్తూ
నడకకు ప్రాణం పోసే ప్రవాహం
నిద్రపోని శక్తిని అలారమై మేల్కొల్పును
పంచభూతాల వేషధారి ప్రకృతి
ఉద్వేగాల పరీక్షలకు ఓపెన్ డిబేట్ను పెట్టి
శ్రామికశక్తికి తొలి వేదికగా నిలబడ్డ
నివేదికల సమర్పణకు నిండు దర్పణం
ఋతువులు కాలం ముఖంపై
గీసిన ప్రకృతి బొమ్మలు
అందమైన ఊహలకు తావులుగా
నవ్వుల పొదల్లోకి లాక్కెళ్లే
నవరసాలకు పుట్టినిండ్లు
నింగీనేల అముడాలపిల్లలై
కాలం ఊయలలో కలవని సోదరులై
చరిత్రసృష్టికి వారసులై గైడ్ చేస్తున్నవి
రోజులు లోకం పోకడకు
అభ్యుదయ చక్రాలై
కాలం మార్పులను బట్వాడా చేస్తూ
పోస్టుచేయని ఉత్తరాలుగా
చరిత్రకు వారధికట్టినవి
కాలం కర్తవ్యదీక్షలో
విశ్వాన్ని అశ్వమై నడుపుతుంటే
తీరిక లేని సమయంకు
అతిథిగా విచ్చేసిన మనిషి
వింత పోకడలతో కాలాన్ని వృథాచేస్తున్నడు
పరిష్కారాన్వేషణ కాలమే చూపాలి!

