“​పట్టా… వాటాల పట్టా ఎక్కేనా?”

Spread the love

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రేగళ్ళపాడు గ్రామంలో శంకరయ్య గౌరవప్రదమైన రైతు. కష్టపడి సంపాదించిన ఐదెకరాల పొలమే ఆయన ప్రపంచం. ఆయనకు ఇద్దరు సంతానం—కొడుకు రామారావు, కూతురు సరళ. రామారావు ఉద్యోగరీత్యా నగరంలో స్థిరపడి, అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు. పట్నం పోయాక రామారావుకు ఊరి వ్యవహారాలు పట్టించుకునే తీరిక దొరకలేదు. శంకరయ్య అకస్మాత్తుగా మరణించినప్పుడు ఆస్తి పంపకాల గురించి ఎలాంటి వీలునామా రాయలేదు.

​తల్లి సావిత్రమ్మకు చదువు సంధ్యలు లేవు, ఆస్తిపాస్తుల అవగాహన అస్సలే లేదు. భర్త చనిపోయిన పదిహేనేళ్లకు ఆమె కూడా కాన్సర్‌ వ్యాధితో కన్నుమూసింది. తల్లి అంత్యక్రియలు ముగించుకుని రామారావు మళ్లీ నగరానికి వెళ్లిపోయాడు.

​సరళ పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి అదే గ్రామంలో స్థిరపడింది. తల్లి కూడా చనిపోవడంతో ఆమె చూపు తండ్రి ఆస్తిపై పడింది. అన్న నగరంలో ఉంటున్నాడు, ఎలాగూ రాడు అనే ధీమాతో… చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను ఆసరాగా చేసుకుంది. అన్నకు గానీ, తల్లి బతికున్నప్పుడు ఆమెకు గానీ తెలీకుండా స్థానిక రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి, తండ్రి భూమినంతటినీ రహస్యంగా తన పేరున పట్టా మార్పిడి (Mutation) చేయించుకుంది.

​కాలక్రమేణా ఆ నోటా ఈ నోటా ఈ రహస్యం పొక్కి, గ్రామంలో గుసగుసలుగా మారింది. చివరకు నగరంలో ఉన్న రామారావు చెవిన పడేసరికి జరగకూడని నష్టం జరిగిపోయింది.

​రామారావు ఒకసారి గ్రామానికి వచ్చి విచారించేసరికి ఆస్తి మొత్తం సరళ పేరున పట్టా అయిపోయింది. ప్రభుత్వం మారడంతో వచ్చిన కొత్త డిజిటల్ రెవెన్యూ రికార్డుల విధానం (ధరణి వంటి చట్టాలు) సరళ చేసిన మార్పిడికి మరింత బలాన్ని చేకూర్చాయి. “కోర్టుకు వెళ్తే తోబుట్టువుల మధ్య గొడవలు బజారున పడతాయి, కుటుంబ పరువు పోతుంది” అని రామారావు లోలోపలే నిస్సహాయతతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. సరళను నిలదీసినప్పుడు, స్వార్థం కళ్లకు కప్పిన ఆమె సమాధానం చెప్పలేక ముఖం చాటేసింది.

​కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా!

​శంకరయ్య చేతులతో కట్టుకున్న నలభై ఏళ్ల నాటి పాత పెంకుటిల్లు ఒక పక్క కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. సరళ ఆ ఇంటిని పట్టించుకోకుండా, మర్యాద కోసం రామారావును అడిగి, వేరే స్థలంలో కొత్త ఇల్లు కట్టుకుంది. చివరకు ఆ పాత ఇల్లు కూలిపోయినప్పుడు కేవలం రెండు వేల రూపాయల పాత కలప మాత్రమే మిగిలింది.

​”అదే ఇల్లు కూలకముందే అమ్మి ఉంటే లక్ష రూపాయలు వచ్చేవి, లేదా ఆ కొత్త ఇంటికి పెట్టిన ఖర్చుతో దీన్ని బాగు చేస్తే ఇంకో నలభై ఏళ్లు నిలబడేది” అని గ్రామస్తులు మాట్లాడుకున్నారు. ఆ పాత పెంకుటిల్లు కూలిపోయినట్లే, కుటుంబ అనుబంధం కూడా కూలిపోవడం రామారావు మనసును మరింత గాయపరిచింది.

​కానీ, విధి ఆడిన వింత నాటకంలో సరళ జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఆమెకు మెదడులో కణతి (Brain Tumor) ఉన్నట్లు తెలిసింది. శస్త్రచికిత్స జరిగినా ఆమె మూగబోయింది. కేవలం చూపులు, సైగలు, కాగితంపై రాసే ఒకటి రెండు అక్షరాలకే ఆమె జీవితం పరిమితమైంది. ఐసీయూలో పది రోజులు మృత్యువుతో పోరాడి పునరావాస కేంద్రానికి చేరింది. భర్త ఆరోగ్యం క్షీణించింది, పిల్లలు చిన్న ఉద్యోగాలతో ఇల్లు గడవడం గగనమైంది. వైద్య ఖర్చులు కొండలా పేరుకుపోయాయి.

​మంచాన పడ్డ సరళలో పశ్చాత్తాపం మొదలైంది. అన్నకు చేసిన ద్రోహం ఆమెను నిద్రపోనివ్వలేదు. వారం రోజుల తర్వాత రామారావు ఆసుపత్రికి వచ్చాడు. చెల్లెలి దీనస్థితి చూసి ఆయన మనసు ద్రవించింది. ఆమె వణుకుతున్న చేతులతో కాగితంపై “క్షమించు” అని రాసి కన్నీరు కార్చింది. రామారావు కళ్లు చెమ్మగిల్లాయి.

​”చెల్లీ! ఇవన్నీ మర్చిపో, నువ్వు కోలుకోవడమే నాకు ముఖ్యం. నీ ఆరోగ్యం జాగ్రత్త.. మళ్లీ నాలుగు రోజుల తర్వాత వస్తాను” అని ఓదార్చి, నగరానికి తిరుగుముఖం పట్టాడు.

​కానీ, వాస్తవ ప్రపంచం భావోద్వేగాలతోనే ఆగదు కదా!

​సరళ వైద్య ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. అప్పులు తీరడానికి, వైద్యానికి డబ్బుల కోసం… తన పేరున ఉన్న ఆ తండ్రి భూమిని అమ్మేయాలని కొడుకుకు సైగ చేసింది సరళ. అయితే, “మనం భూమి అమ్మితే మామయ్య కోర్టుకు వెళ్తాడేమో” అన్న భయంతో సరళ కొడుకు రామారావుకు ఫోన్ చేసి, భయపడుతూనే విషయం చెప్పాడు.

​రామారావుకు అప్పుడు ముళ్లు గుచ్చుకున్నట్లయింది. ఎంత చెల్లెలైనా, తన న్యాయబద్ధమైన సగం వాటాను వదులుకుంటే తన పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి? మంచితనానికి పోతే తనకేం మిగులుతుంది? ఇన్నాళ్లు వారసత్వ హక్కును తేల్చుకోకపోవడం చట్టపరంగా ఇరకాటమే. కానీ ఇప్పుడు ఆమె భూమి అమ్మేస్తే తన హక్కు శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతుంది. ఒకవేళ న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎలా?

​అయోమయంలో పడ్డ రామారావు ತನಗೆ తెలిసిన సీనియర్ సివిల్ లాయర్ ప్రసాద్‌ను కలిసి జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పాడు.

​లాయర్ ప్రసాద్ పత్రాలన్నీ పరిశీలించి, నవ్వి ఇలా అన్నాడు:

​”రామారావు గారూ, కంగారు పడకండి. మీ చెల్లెలు తాహశీల్దారును ప్రలోభపెట్టి పట్టా మార్పిడి చేయించుకున్నంత మాత్రాన మీ వారసత్వ హక్కు పోదు. హిందూ వారసత్వ చట్టం (సవరణ) 2005 ప్రకారం తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తిలో కొడుకు, కూతురు ఇద్దరికీ సమానమైన హక్కులు ఉంటాయి. రెవెన్యూ రికార్డులలో పేరు మారినంత మాత్రాన యాజమాన్య హక్కులు (Title) మారిపోవు. పైగా ఆమెకు ఆపరేషన్ అయి, ప్రస్తుతం శారీరకంగా సంతకం పెట్టే స్థితిలో లేదు. ఇప్పుడు ఆమె కొడుకు ఆ భూమిని అమ్మాలనుకున్నా ఆమె సమ్మతి పత్రం లేదా కోర్టు అనుమతి లేకుండా అమ్మలేరు. మీరు వెంటనే ఇంజంక్షన్ ఆర్డర్ కోసం నోటీస్ పంపవచ్చు. కానీ, మీ చెల్లెలి పరిస్థితి దయనీయంగా ఉంది కాబట్టి, కోర్టుల చుట్టూ తిరగకుండా దీనికో సులువైన పరిష్కారం ఉంది.”

​లాయర్ చెప్పిన ఉపాయం రామారావుకు నచ్చింది. ఆయన సరళ భర్తను, కొడుకును లాయర్ సమక్షానికి పిలిపించాడు.

​లాయర్ సలహా మేరకు… కోర్టుల చుట్టూ తిరిగి కాలం, డబ్బు వృధా చేసుకోకుండా వారు ఒక “ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్” (కుటుంబ రాజీ ఒప్పందం) కుదుర్చుకున్నారు.

​ఆ ఒప్పందం ప్రకారం: మొత్తం ఐదెకరాల భూమిలో రామారావుకు చెందాల్సిన రెండున్నర ఎకరాల వాటాను ఆయన పేరు మీదకు రిజిస్టర్ చేశారు. మిగిలిన రెండున్నర ఎకరాల భూమి సరళకు దక్కింది. అయితే, సరళ వైద్య ఖర్చుల కోసం అత్యవసరంగా డబ్బు కావాలి కాబట్టి… సరళ వాటాకు వచ్చిన ఆ రెండున్నర ఎకరాల భూమిని రామారావే ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేశాడు. ఆ డబ్బును నేరుగా సరళ వైద్య నిధికి, ఆమె కుటుంబ అవసరాలకు అందజేశాడు.

​ఈ ఒప్పందంతో సరళ వైద్యానికి అవసరమైన భారీ మొత్తం చేతికి అందింది. అటు రామారావుకు తన తండ్రి ఆస్తి మొత్తం తిరిగి దక్కడంతో పాటు తన న్యాయబద్ధమైన హక్కు నెరవేరింది.

​పాత పెంకుటిల్లు కూలినట్లే… సరళ మనసులోని స్వార్థం, అహంకారం కూలిపోయాయి. మిగిలింది పశ్చాత్తాపం, అన్నపై గౌరవం మాత్రమే. చట్టం తన పని తాను చేసింది, అంతకంటే మిన్నగా కుటుంబ బంధం, మానవత్వం గెలిచాయి.

​కాలం సృష్టించిన గాయానికి, కాలమే ‘న్యాయాన్ని’ తీర్పుగా ఇచ్చింది!

కపిల రాంకుమార్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *