ఇకమతులు

Spread the love

ఒక్కసారి..ఒకే ఒక్కసారి 
నేల పైకి దిగివచ్చి
నా లోకి ఇంకి చూడు..!
నీ ఎగుడు దిగుడు రీతుల నీతులు
నీ కపటపూరిత గోతులు
ఎంత అమానవీయమో
కాసింతన్నా చూస్తవ్

ఒక్కసారి..
కాసేపైనా నువ్వు నేనుగా
జీవించి చూడు
ఆదిమ జాడల నీడలు చెప్పి
నా నోరు నొక్కి.
తొక్కిపెట్టే నీ కుతంత్రం
ఎంత అహేతుకమో
ఇసుమంతన్నా అనుభూతిస్తవ్ ..!

ఒక్కసారి
క్షణమాత్ర మైనా సరే
నా స్థానంలో నిలబడి చూడు
నువ్వు పరచిన ముళ్లతొవ్వ
ఎంత హేయమైందో
ఎంతటి గాయం చేస్తుందో
ఓ ఇంచుకన్నా తెలుస్తుంది

అయినా..
అనుకుంటాను గానీ,
మసిబూసి మారేడు చేసే
నీ టక్కు టమారాల ఇకమతులు
నన్ను కాలరాసేందుకేనని
రంగు పులుముకున్న
నీ అంతరంగానికి తెలియదనా .!

నువ్.. రెక్క విచ్చి ఎగిరిందే
ఈ చేతుల్లోంచి
మూలాలను మరచి హీనంగా
మసలుకుంటే
పుట్టగతులు ఉండవనేది మరవొద్దు.!
నాంపల్లి సుజాత

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *