సప్తవర్ణాలు

Spread the love

నలుపూ తెలుపూ, ఇటూ అటూ, ఆడా మగా, మంచీ చెడూ, ఇవే ద్వంద్వాలు. ఇవే మనకు తెలిసిన మార్గాలు. ఇవే మన కంఫర్ట్ జోన్స్. మూడో రంగు మనకొద్దు. అటూ ఇటూ కాని కొత్త దారి అంటే మనకి భయంతో కూడిన అభద్రత. అందుకే మనకు కొన్ని సాధారనీకరణలు వుంటాయి. ఇది ఇలాగే వుండాలి. అందరూ ఇటే నడవాలి. మరో మార్గంలో నడిచే వాళ్ళంటే మనకి ఇష్టం వుండదు. వాళ్ళ ఇష్టంతో వాళ్ళ కష్టంతో మనకి పని లేదు. మనం చెప్పినట్టే వాళ్ళు వినాలి. లేకపోతే మనం వాళ్ళని కలుపుకోము, చీదరించుకుంటాం, వెక్కిరిస్తాం, వేలివేస్తాం, అడుగడుగునా అడ్డు తగులుతాం. కష్టాలు పెడతాం, కడతేరుస్తాం కూడా. మూసలో ఇమడని వాళ్ళు నిలబడాలంటే, నిలదొక్కుకోవాలంటే ఎన్ని కంచెలు దాటాలి? ఎంత వేదన పడాలి?

సృష్టిలో రెండే రంగులు లేవు. ఇంద్రధనుస్సుకున్న ఏడు రంగులకీ అనేక ఛాయలున్నాయి. మానవ ప్రకృతిలో కూడా అనేక ఛాయలున్నాయి. ఆలోచనల్లో వైవిధ్యాలున్నాయి. అభిరుచుల్లో భిన్నత్వాలున్నాయి. సాంకేతికత, మనో విజ్ఞానం పెరిగినా మన మనసు విశాలం కాలేక పోవడం కొత్త పరిణామాలను అంగీకరించలేక పోవడం చరిత్రలో మామూలే.

ఇప్పుడు మనం విస్తృతంగా చర్చిస్తున్నది, అంగీకరించవలసినది కలుపుకో వలసినది (include), సహానుభూతితో అర్థం చేసుకోవలసినది క్వియర్ వ్యక్తులని. వారిని అవమానాలకి అవహేళనకి గురిచెయ్యకుండా సహవ్యక్తులుగా గౌరవించడం ఇవ్వాళ్టి సమాజపు కనీస విధి.

ఒక ట్రాన్స్‌వుమన్‌గా మారిన రేవతి ఆత్మకథను అనువాదం చేసి ఆమెతో మాట్లాడిన తరువాత నేను ఆ పుస్తకాన్ని చాలామంది యువతీయువకులతో చదివించాను. కొంతమందికి ట్రాన్స్‌వుమన్ మీద ఉన్న అభిప్రాయాల విన్నాక యుగాల ముందు “పేడితో యుద్ధం చెయ్యను” అన్న భీష్ముడికీ, బస్సులో ‘‘తేడా మనిషి పక్కన కూర్చొను’’ అని లేచిపోయిన విద్యార్థినికీ తేడా కనిపించలేదు నాకు. అట్లాగే సంప్రదాయ ఆలోచనాపరుడైన విశ్వనాథ సత్యనారాయణగారు ‘‘గే’’ సంబంధాన్ని సమర్థిస్తున్నట్లు వ్రాసిన “ఇంకొకవిధము” అన్న కథ చదివి ఆశ్చర్యపడ్డాను. ఈ సంబంధాలు ఎప్పటినుంచో వున్నాయని ప్రాచీన సాహిత్యంలో కూడా ప్రస్తావించబడ్డాయని ఇందులో మోహిత వ్రాసిన ఒక కథలో పేర్కొన్నది. మానవ స్వభావంలోని వైచిత్రిని మనం ఎప్పటికీ సహానుభూతితో అర్థం చేసుకోలేము. ఎందుకంటే మనది మూస ఆలోచన. చట్రాలలో బిగుసుకు పోయిన దృక్పథం.

అపర్ణ సంకలనం చేసిన ఈ కథా గుచ్చంలో అనేక మంది క్వియర్ వ్యక్తుల కథలున్నాయి. ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ, ఇద్దరు స్త్రీలమధ్య ప్రేమ. స్త్రీపురుషు లిద్దరినీ ప్రేమించే తత్త్వం, లోక సహజంగానే ఈ సంబంధాలను వ్యతిరేకించే కుటుంబం వాళ్ళను విడిచిపెట్టడం జరుగుతుంది. అనేక వ్యతిరేకతలను ఎదుర్కొంటూ నిలబడదానికి ఆర్థిక సామర్థ్యం వుండాలి. దానికన్నా కూడా సామాజిక వ్యతిరేకతను తట్టుకోడం కష్టం. బిడ్డల ఈ అసాధారణ (లోకం దృష్టిలో) ప్రవర్తనను తల్లితండ్రులు అవమానంగా భావిస్తారు. ఒక తల్లి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తుంది. ఒక స్త్రీ ఒక పురుషుడూ వున్న సంబంధం కాని దానిని ఎవరూ సమ్మతించరు. తమ కుటుంబంలో సభ్యులుగా చూడరు. వాళ్ళ సమస్యలకు సహకరించరు. ఈ విషయంగా ఎంత సాహిత్యం వచ్చినా ప్రభుత్వం చట్టాలు తెచ్చినా ఈ మైనారిటీ జంటలను ఆదరించే సహృదయం ఇంకా అలవడనే లేదు పాపినేని శివశంకర్ వ్రాసిన స్పర్శ కథలో. గే అయిన ఒక ఉన్నతాధికారి తన క్రింద ఉద్యోగిని లోబరుచుకుని చివరికి అతని ఉద్యోగానికి కూడా ఎసరు పెడతాడు. తను కోరుకున్న అమ్మాయికోసం అతను ఉద్యోగం మానుకుంటాడు. ఈ రకమైన దోపిడీ కూడా పైస్థాయిలో జరుగుతుంది. తమ కూతురు మరొక అమ్మాయితో సహజీవనం చేస్తున్నదని ఆమెని బహిష్కరించిన తల్లితండ్రులు అందులో ఒకమ్మాయి అదృశ్యం కాగా, ఆ అమ్మాయిలిద్దరూ కలిసి కట్టుకున్నఇంటికోసం ఆస్తికోసం పోటీ పడ్డం కుప్పిలి పద్మ వ్రాసిన ‘‘మౌన’’ కథలో చూస్తాం. స్వలింగ సంపర్కంలో వున్నా స్త్రీలలో మాతృత్వ కాంక్ష బలంగా వుంటుంది. దానికోసం నూతన సాంకేతికతను ఉపయోగించుకోవడం అవతీర్ణ కథ.

ఈ సంబంధాలను అట్లా వుంచితే ఇంక ట్రాన్స్‌జెండర్‌ల సంగతి చెప్పనే లేము. ఒక తప్పుడు దేహంలో తాము ఇరుక్కుపోయామనే భావన కలిగినప్పటి నుంచీ వాళ్ళు పడే వేదన కుటుంబం దగ్గరినుంచీ, మిత్రుల నుంచీ చుట్టుపక్కల వారి నుంచీ అవహేళనలు, వాళ్ళను ఇల్లు విడిచి పోయేలా తరుముతాయి. తరువాతి పరిస్థితులు మనం నిత్యం చూసేవే. ట్రాన్స్జెండర్లలో తాము స్త్రీలమనే భావన ఒకటే ప్రత్యేకం గాని మానవ సహజమైన ప్రేమాభిమానాలు దయా వుంటాయని చెప్పే కథలు సోలోమోన్ విజయకుమార్, వెంకటకృష్ణ వ్రాసారు. చాలా కథలలో ట్రాన్స్వుమన్గా మారే ముందు కౌమారంలో బాలురు ఎదుర్కునే సమస్యలు పడే శారీరక మానసిక ఇబ్బందులు, సర్జరీలకోసం నాటు డాక్టర్ల దగ్గరకు వెళ్ళడం ఆపైన జరిగే క్రతువులు, ఏ ఉద్యోగమూ దొరకక బిక్షాటన, వ్యభిచారానికి దిగడం వుంటుంది. కుటుంబం వాళ్ళని అర్థం చేసుకోడం శాస్త్రీయంగా సర్జరీలు చేయించుకునే స్తోమత, దానిని గురించిన అవగాహన, సైంటిఫిక్ ప్రొసీజర్ మొదలైనవి వాళ్లకి అందుబాటులోకి రావాలి. అందుకోసం వాళ్ళ యుద్ధం వాళ్ళే చేసుకుంటున్నారు. అందుకు కుటుంబం, సమాజం సహకరిస్తే, స్త్రీత్వాన్ని ప్రకటించడానికి అతిగా అలంకరించుకుని తప్పట్లు చరుస్తూ అడుక్కునే బాధ వాళ్లకి వుండదు. ఆ పరిస్థితి వాళ్లకి కల్పించినందుకు సిగ్గుపడే ఆవసరం సమాజానికి వుండదు. సరి అయిన సమయంలో ఈ సంకలనం తెస్తున్న అపర్ణకు, క్వియర్ వ్యక్తుల జీవితాలను కళ్ళకు కట్టించిన రచయితలకు అభినందనలు.

పి. సత్యవతి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *