ఓ డాక్టర్ పఠనాత్మకథ

Spread the love

‘నా చదువు కథ’ అని శీర్షిక వినగానే, ఎవరికైనా రచయిత్రి తన విద్యాభ్యాసం, పాఠశాల–కళాశాల రోజుల గురించి చెప్పబోతున్నారేమో అనిపిస్తుంది. కానీ రచయిత్రి
డాక్టర్ భార్గవి పుస్తకం ప్రారంభంలోనే ఆ భ్రమను తొలగిస్తారు. “ఇది నా ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి కాదు. సాహిత్యంతో నా పరిచయం గురించీ, పుస్తకాలతో నా ప్రయాణం గురించీ…” అంటూ ఈ పుస్తకానికి సరైన దారిదీపం చూపిస్తారు. ఏ రచయిత అయినా ఒక అంశాన్ని లేదా ఇతివృత్తాన్ని ఎంచుకోవడంలోనే వారి ప్రతిభ కనిపిస్తుంది. ఆ ఇతివృత్తానికి తమైదన శైలిని జోడించి, జనరంజకంగా చెప్పడమన్నది ఆ రచయిత యొక్క నేర్పరితనానికి, సృజనకు గొప్ప ఉదాహరణ. అలాంటి ఒక సృజనశీలి డాక్టర్ భార్గవి రొంపిచర్ల. ఎలాంటి పుస్తకాలు చదవాలో తెలియని, తేల్చుకోలేని నేటితరానికి భార్గవి గారి ‘చదువు కథ` కచ్చితంగా దిశానిర్దేశం చేస్తుంది.

ఒక వైద్యురాలుగా ఆమె జీవిత ప్రయాణం కాదు ఈ పుస్తకం; ఒక పాఠకురాలిగా ఆమె ఎదుగుదలకు నిదర్శనం. చిన్ననాడే చందమామ నుండి మొదలైన పఠన దాహం… తాను పెద్దయ్యాక చదివిన మహారచయితల వరకూ, ఆయా పుస్తకాలు ఆమె వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయో చెప్పే పఠనాత్మకథ ఇది. భార్గవి గారు ఒకవైపు వైద్య సేవతో నిమగ్నమై ఉంటూనే, మరోవైపు సంగీతం, సాహిత్యం పట్ల అపూర్వమైన మక్కువతో తన చదువును కొనసాగించారు. తెలుగు అక్షరాలు పరిచయమైనప్పటి నుంచి చదివిన పుస్తకాలు, వాటి అనుభవాలూ, అనుభూతులు ఈ పుస్తకంలో వివరించారు. నాటి పత్రికలు, పుస్తకాలను తాను గుర్తు చేసుకోవడమేగాకుండా… తెలుగు సాహిత్యంపై చెరగని ముద్రవేసిన అనేక మంది రచయితలను, వారి రచనలను విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఈ పుస్తక రచయిత్రి చేసిన ఈ కృషి… సాధారణ చదువరులకు, చదవాలని వున్నా… సమయాభావం పేరు చెప్పి చదువలేకపోతున్న వారికి కచ్చితంగా ఒక కదలికను తెస్తుంది.

ఈ పుస్తకమంతా ఒక తరం పాఠకుల అనుభూతులకు ప్రతిరూపంలా ఉంటుంది. అరుగు మీద కూర్చొని చదివిన రోజులు, లైబ్రరీలో పుస్తకాల మధ్య గడిపిన గంటలకొద్ది సమయం, ఇంటర్మీడియట్ తర్వాత విరామ సమయంలో లైబ్రరీలోని పుస్తకాలన్నీ చదివేయాలన్న తపన – అన్నీ చదువుతున్న తమ స్వంత జ్ఞాపకాల వైపు తీసుకెళ్తాయి.

చందమామ వంటి పత్రికలు ఆమె బాల్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో, ఆ తర్వాత పత్రికల్లో వచ్చిన ధారావాహికలు, నవలలు ఆమె చదువును ఎలా విస్తరించాయో
వివరించారు. ఒక చిన్న పుస్తకం నుండి పాదుకొన్న ప్రేరణ ఎలా ఒక జీవితకాల పఠనాసక్తి క్రమంగా.. మహావృక్షంగా ఎదిగిందో ఈ కథలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఏ రచననైనా పదికాలాల పాటు నిలిపివుంచేవి స్థలకాలాలు. ఈ చిన్న పుస్తకంలో గొప్ప రచయితల జ్ఞానసంపదను అందించడం ద్వారా వారితో కలిసి మనమూ పయనించేలా చేస్తారు రచయిత్రి. ముఖ్యంగా భార్గవి గారు పరిచయం చేసిన రచయితల పుస్తకాలు అత్యంత అమూల్యమైనవి. తెలుగు నుడికారాన్ని, వ్యవహారిక తెలుగును, ఆయా రచయితల శైలిని- చక్కని సరళమైన తెలుగులో అందించారు భార్గవి గారు.

కొడవటిగంటి కుటుంబరావు, చలం, బుచ్చిబాబు, చండీదాసు, త్రిపుర వంటి రచయితల ప్రభావం భార్గవి గారు లోతుగా విశ్లేషిస్తారు. ముఖ్యంగా కుటుంబరావు తన ఆలోచనా ధోరణిని ఎలా తీర్చిదిద్దారో చెప్పే సందర్భాలు ఈ పుస్తకానికి ప్రాణం. ‘చెడిపోయిన మనిషి’ నవలలోని మాటలను ఉదహరిస్తూ ఆమె ఇలా అంటారు – “నిజంగా ఈ మాటలు నా జీవితంలో నాకు శిలాక్షరాల్లాగా నిలిచి, అనేకసార్లు దిశానిర్దేశం చేశాయి” (పుట 26). అలాగే, “హృదయంతో జీవించడమెలాగో నేర్పింది చలమైతే, మెదడుతో ఎలా ఆలోచించాలో నేర్పింది కుటుంబరావు” (పుట 25) అన్న వాక్యం ఆమె ఎంత అవగాహన కలిగిన పాఠకురాలో చెప్పడానికిదో మచ్చుతునక. అంతేకాదు… శ్రీపాద వారి వీలునామా… ఒక అరుదైన లేఖ. ఒక గొప్ప రచయిత దుర్భర జీవితాన్ని దైన్యస్థితిని తెలిపే ఈ లేఖను చాలా తక్కువ మంది చదివి వుంటారనుకొంటున్నా. ఇలాంటి అరుదైన లేఖను తిరిగి బహిర్గతపర్చిన భార్గవి గారికి నిజంగా ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇది తెలుగు సాహిత్యానికి పరమ ప్రయోజనం కూడా. మాలతీచందూర్ ‘పాత కెరటాలు` పేరిట చేసిన ప్రపంచ ప్రఖ్యాత నవలల పరిచయాన్ని నేటి తరానికి కూడా పరిచయం చేశారు భార్గవి గారు. సోమర్సెట్ మామ్ ని ఎంతగా అభిమానించేవారో చెబుతూనే, ఆయన జీవితాన్ని కూడా పాఠకులకు అందించారు. ఇలాంటి ఒక వివరణ… పుస్తకాల పరిచయం… మరెందరినో రచయితలుగా, పఠితులుగా మార్చడానికి అవసరమైన పునాదిగా ఈ పుస్తకం ఎంతైనా ఉపయోగకారి అని అనిపిస్తోంది.

ఈ పుస్తకంలోని ప్రధాన బలం రచయిత్రి నిజాయితీ. తన జీవితంలో ఎదురైన మనుషులు, సంఘటనలు, తనకు నచ్చిన రచనలు, కవిత్వం – ఎప్పటికీ ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడం ఈ రచనకు సహజత్వాన్ని ఇస్తుంది. భాష చాలా సరళంగా, స్పష్టంగా సాగుతుంది. ఎక్కడా పాండిత్య ప్రదర్శన లేదు. ప్రతి పేజీలోనూ పఠనానుభవం నుంచి మొలకెత్తిన ఆలోచన లోతు కనిపిస్తుంది.

ఈ ఆధునికజీవనంలో వైద్యురాలిగా బిజీబిజీగా గడుపుతూనే పుస్తకాల పట్ల ఆమె చూపిన నిబద్ధత, ప్రేమ పాఠకులకు స్ఫూర్తినిస్తుంది. దిశానిర్దేశం చేస్తుంది.

94 పేజీల ఈ చిన్న పుస్తకంలో ఒక కాలాన్ని నిక్షిప్తం చేశారు. రచయిత్రి ముఖచిత్రం, అప్పటి పత్రికలు, సినిమా పత్రికల రంగుల చిత్రాలు, ప్రతి పేజీలోనూ ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు – ఇవన్నీ ఈ పుస్తకాన్ని ఒక పిరియడ్ డాక్యుమెంట్ గా నిలబెడతాయి. పుస్తకం కవర్ పేజీ లోపల ప్రచురించిన పాత పత్రికల ముఖచిత్రాలను పుస్తకం మధ్యలో అక్కడక్కడ ఇచ్చివుంటే బాగుండేదనిపించింది. ఆ ఒక్కటితప్ప ఇది కేవలం ఒక వ్యక్తిగత కథ కాదు; ఒక తరం చదువు సంస్కృతికి చెందిన చరిత్ర అని కూడా అనొచ్చు.

డాక్టర్ భార్గవి రొంపిచర్ల రచించిన “నా చదువు కథ” పాత తరం పాఠకులకు మధుర స్మృతులను తిరిగి అందిస్తే… కొత్త తరానికి మంచి పుస్తకాలను ఎంచుకోవడానికి, చదవడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. జ్ఞానాన్వేషణ చేసే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. ఈ పుస్తకం ఇక్కడితో ముగిసిందని అనిపించదు. రెండో భాగం రావాలని, రావాల్సిందేనని ఆశ కలిగిస్తుంది. ఇప్పటి యువతరం తప్పక వినవలసిన, చదవవలసిన కథ- డాక్టర్ భార్గవి గారి ‘నా చదువు కథ`.

అంజని యలమంచిలి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *