మట్టి కుండలు, ఇత్తడి బిందెలు
రాగి చెంబులు, మాయమై
ప్లాస్టిక్ వస్తువులు పొట్టకొట్టాయ్
కుదేలైన వృత్తి కళాకారులు
జీవన సమరం చేస్తున్నారు
పిడకల దాలిపైమట్టికుండలో
ఎర్రగా కాగిన పాలు
గట్టిగా తోడుకున్న గడ్డపెరుగు
పొద్దున్నే చద్దన్నంలో
నంజుకు ఆవకాయ ముక్క
ముద్దకు తోడు ఓ వెన్నముద్ద
నా సామిరంగా.. ఆ రుచే
బలం...పాతకాలపు బాల్యంలో
కండరాలు కరిగేలా కాళ్ళు
తొక్కిన చెరువుమట్టి
బలం కొద్ది రెక్కల కష్టం
చక్రం తిరిగి నాట్యమాడె
కుమ్మరిసారె కన్న కుండ
వెన్నుకతుక్కుపోయిన
కుమ్మరి బాపు ఆకలి పొట్ట
వంటకి, తాగు నీళ్ళకి
సావు మంటకి, పూజలకి
ఆ మట్టి పాత్రల పాత్ర
ఇప్పుడు కొడగట్టిపోయింది
ఊరి చెరువు మట్టి
ఊరికే రోజులు పోయి
చెమట రూకలతో
కొనుగోలు చేస్తూ
లాగలేని సంసారపు బరువు
బళ్ళున బద్దలవుతుంటే
చేతులడగలేని దైన్యం
రాజ్యమేలుతోంది
మనసు చంపుకోలేక
మనిషి చావు బారిపడుతుంటే
ఆకాశం సైతం కన్నీరెట్టుకుని
కుమ్మరి బాపు గొంతు
తడపలేక తడబడుతోంది
బోర్లపడిన బూర్లమూకుడై
మనల్ని వెక్కిరిస్తుంటే
అయ్యో పాపమని
మనమాదుకున్నది లేదు
ఇంత తోచిన సాయం చేసింది లేదు
మట్టి మనుషులమని
గొప్పలు చెప్పుకుంటాం
కాని మట్టిని మాణిక్యంలాంటి
సంబారాలు చేసే వారినెందుకు
ఆదుకోలేకపోతున్నాం.
అధవా చేతివృత్తులు నిలబడాలని
నినాదాలిచ్చి, ఏ విధానాన్ని
అమలుచేయని ప్రభుత్వ వైఖరిని
ఎండకడదామనైనా లేదా?
చేతివృత్తులు పూర్తిగా మాయమవ్వలిసిందేనా
ఎలుగెత్తి మద్దతు ఇవ్వలేమా?
బుద్ధిజీవులమాలోచన చేదాం
మట్టి మనిషిని బతకనిద్దాం.




