తొలికోడి మలికోడి గడియారాల చప్పుళ్ళకు
పక్షుల ఊయల పాటలు
ఏమంత కునుకు దీత్తదో గాని
పొద్దు పొడవక ముందే
భుజాన అడవిని మోస్తుంటది
ఆమె గుడిసె ముందు
నిప్పుల కుంపటి రాజేసినట్టు సూరీడు
ఆమె వెళ్లే దారెంట చెట్ల గంటల చప్పుడు
జంతువుల అడుగుజాడలే గురువు
మొత్త మూసి బయలెల్లిన అడుగుల్లో
ఆమె ధైర్యం ఒక నిశ్శబ్ద దీపం
ఏ ప్రశంసని స్పృశించని నిలువెత్తు అడవి సాక్ష్యం
ఆకుల మీద సంతకమై నిలబడుద్ది
తరాల కథలు
శ్రమ సాంప్రదాయ వారసత్వాన్ని
ఇంటి నిట్టాడుకి వెళ్ళాడ గట్టి
చూపుడు వేలుతో బతుకు ఆశని చూపే నిర్దేశకురాలు
చెమటకు తాకిన పెరక కంపలు
పువ్వులవటం చూస్తుంది
అడవి శ్వాసని కాపాడే చేతులు కదా!
కాలాలు ఒంట్లో మారినా
అభివృద్ధి ప్రణాళికల్లో ఆమె కష్టం లెక్కకు రాదు
కానీ నీకు తెలుసా?
భూమి గుండెలో ఆమె అడుగులే చరిత్ర!
ఉనికికి అక్షరాలందిస్తూ
లోయలతో పచ్చిక బయళ్ళతో
ఒప్పందం కుదుర్చుకుందేమో
బండరాళ్ళ మీద మౌనగీతమై
ఆమె చెమట కథను పాడుకొనుటకు
ఆమె చేతుల్లో విత్తనపు స్పర్శ
పాటల్లో అడుగుల్లో భూమి తాళం వేసినట్టు
జాతి ఊపిరి గుండెల్లో మిగిలే ఉంది
పొగ మంచుని తరిమిన ఉదయం లా
ఆమె నిలిస్తే
పూర్వీకుల గానమైన రేల పాట
అడవి తత్వాన్ని వినిపిస్తది
రాలిన ఆకుల శబ్దం
ఆమెకు లభించే చెట్ల చేతుల చప్పుడు
ఎండిన కట్టెల మోపు నెత్తిన కిరీటమై మెరవంగ
చెమట చుక్కలు ఆమె మెడలో
ముత్యాల దండలు కూర్చినట్టు
వాలే పొద్దు కిరణాల శాలువా
ఆమె భుజాల మీద

