అధ్యాయం-16
మొదటి అడుగు
నెఖ్లుడోవ్ చర్చి నుండి తిరిగొచ్చాక, మేనత్తలతో కలిసి ఉపవాసం విడిచిపెట్టాడు. రెజిమెంట్‌లో అబ్బిన అలవాటు ప్రకారం ఒక గ్లాసు మద్యంతో పాటు కొంత వైన్ తాగి, బట్టలు మార్చుకోకుండానే తన గదికి వెళ్ళి వెంటనే నిద్రపోయాడు. తలుపు తట్టిన శబ్దానికి మెలకువ వచ్చింది. అది ‘ఆమె’ తలుపు తడుతున్న శబ్దమని అతనికి తెలుసు. కళ్ళు నులుముకుంటూ, ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు.
‘కటూషా నువ్వేనా? లోపలికి రా’ అన్నాడు.
ఆమె తలుపు తెరిచింది.
‘భోజనం సిద్ధంగా ఉంది’ అందామె.
ఇంకా అదే తెల్లని దుస్తుల్లో ఉంది, కాని తలకు రిబ్బన్ లేదు. ఏదో సువార్తను మోసుకొచ్చినట్టుగా అతణ్ణి చూసి నవ్వింది.
‘వస్తున్నాను!’ అంటూ పైకి లేచి, చెదిరిన జుట్టు దువ్వుకోవడానికి దువ్వెన చేతిలోకి తీసుకున్నాడు.
ఆమె ఒక నిమిషం అలాగే నిలబడింది. అది అతను గమనించి, దువ్వెన పక్కన పడేసి ఆమె వైపు నడిచాడు. సరిగ్గా ఆ క్షణమే ఆమె అకస్మాత్తుగా వెనక్కి తిరిగి, గది మధ్యలో ఉన్న తివాచీ మీద సుతారంగా అడుగులేసుకుంటూ గబగబా వెళ్ళిపోతోంది.
‘అరే… నేనెంత మూర్ఖుణ్ణి. ఎందుకు ఆమెను ఆపలేదు?’ అనుకున్నాడు నెఖ్లుడోవ్.
ఎందుకు ఆమెను ఆపాలో అతనికే తెలీదు. కానీ ఆమె తన గదిలోకి వచ్చినప్పుడు ఏదో చేయాలని మాత్రం అనిపించింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చేయాల్సిందేదో చేయకుండానే ఆమెని వదిలేసానని అనుకున్నాడు.
‘కటూషా, ఆగు’ అన్నాడతను.
‘ఏం కావాలి మీకు?’ ఆగి, అడిగిందామె.
‘ఏం లేదు, అదీ…’ అంటూ ఇలాంటి పరిస్థితిలో తనలాంటి మగాళ్ళు సాధారణంగా ఎలా ప్రవర్తిస్తారో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె నడుము చుట్టూ చేయి వేసాడు.
ఆమె నిశ్చలంగా నిలబడి అతని కళ్ళలోకి చూసింది.
‘వొద్దు దిమిత్రి. మీకిది తగదు.’ లజ్జతో కన్నీళ్ళు రాలుతుండగా, తన బలమైన చేతితో అతని చేతిని తోసేస్తూ అందామె.
నెఖ్లుడోవ్ ఆమెను వదిలేసాడు. అతను ఒక్కక్షణం అయోమయంతో సిగ్గుపడ్డమే కాకుండా తనని తాను అసహ్యించుకున్నాడు కూడా. అప్పుడైనా అతను తనను తాను నమ్మాల్సింది. నమ్మి ఉంటే ఈ సిగ్గూ, అయోమయం తన ఆత్మలోని ఉన్నతభావాల వల్ల కలిగాయనీ, అవి విముక్తి పొందాలని కోరుకుంటున్నాయనీ అతను గ్రహించగలిగేవాడు. కానీ, తనది కేవలం అజ్ఞానం అనీ, అందరూ ఎలా ప్రవర్తిస్తారో తను కూడా అలాగే చేయాలని అనుకున్నాడు. అతనామెను పట్టుకుని మెడమీద ముద్దు పెట్టుకున్నాడు.
అప్పుడెప్పుడో లైలాక్ పొద వెనుక అనాలోచితంగా పెట్టిన మొదటి ముద్దుకు పూర్తి భిన్నంగా ఉంది ఈ ముద్దు. ఈ పొద్దు చర్చి ఆవరణలో పెట్టుకున్న ముద్దుతో పోల్చినా కూడా చాలా తేడాగా ఉంది. ఇది భయంకరమైన ముద్దు. ఆమెకు అలా అనిపించింది కూడా.
‘అయ్యో, ఏం చేస్తున్నారు మీరు?’
అమూల్యమైనదేదో అతికించలేనంతగా విరిగిపోయిందన్నట్టుగా ఉందామె స్వరం. గట్టిగా అరిచి, గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.
అతను భోజనాల గదికి వచ్చాడు. నాజుగ్గా ముస్తాబైన మేనత్తలు, ఫామిలీ డాక్టర్, మరో పొరుగింటాయన అప్పటికే అక్కడున్నారు. అంతా సర్వసాధారణంగానే కనిపిస్తోంది. నెఖ్లుడోవ్ లోపల మాత్రం ఒక తుఫాను చెలరేగుతోంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అతనికి తెలీడంలేదు. మనసులో కటూషా గురించే ఆలోచిస్తూ, వాళ్ళు అడిగినవాటికి తప్పు సమాధానాలు ఇస్తున్నాడు. వసారాలో ఆమె అడుగుల చప్పుడు, ఆ చివరి ముద్దు తాలూకు పులకింతను మళ్ళీ అతనికి గుర్తు చేసింది. అతనింకేమీ ఆలోచించలేకపోయాడు. ఆమె గదిలోకి వచ్చింది. అతను తలతిప్పి చూడకుండానే తన సమస్త అస్తిత్వంతో ఆమె ఉనికిని గ్రహించాడు. ఆమెను చూడకుండా అతను బలవంతంగా నిగ్రహించుకోవాల్సి వచ్చింది.
భోజనం అయ్యాక వెంటనే పడకగదికి వెళ్ళి చాలాసేపు ఉద్వేగంతో అటూఇటూ పచార్లు చేసాడు. ఆమె అడుగుల అలికిడి కోసం ఇంట్లో వినిపించే ప్రతీ చిన్నశబ్దాన్ని శ్రద్దగా వింటూ, ఆశగా ఎదురుచూసాడు. ఇప్పుడు అతనిలోని పాశవిక పురుషుడు తల ఎత్తడమే కాకుండా, మూడేళ్ళకిందట అక్కడికి వచ్చిన ఆధ్యాత్మిక మనిషిని, చివరికి ఈనాటి ఉదయపు పవిత్ర పురుషుణ్ణి తొక్కిపారేయడంలో విజయం సాధించాడు. ఆ భయంకరమైన మృగం మాత్రమే ఇప్పుడు అతనిపై రాజ్యం చేస్తోంది.
రోజంతా ఎదురుచూసినప్పటికీ, అతనామెను ఒంటరిగా కలుసుకోలేకపోయాడు. బహుశా ఆమె అతణ్ణి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండవచ్చు. అయితే సాయంత్రం ఆమెకు అతని గది పక్కనున్న మరోగదిలోకి వెళ్ళక తప్పలేదు. డాక్టర్‌ని రాత్రికి అక్కడే ఉండిపోమ్మని అడిగారు. దాంతో ఆమె అతని పడక సిద్ధం చేయాల్సి వచ్చింది. ఆమె గదిలోకి వెళ్ళిన అలికిడి వినగానే, నెఖ్లుడోవ్ ఆమెను అనుసరించాడు. ఏదో నేరం చేయబోతున్నవాడిలా మెల్లగా అడుగులు వేస్తూ ఊపిరి బిగబట్టాడు.
ఆమె రెండు మోచేతులు గలీబులో పెట్టి అంచులు పట్టుకుని, దిండుకి శుభ్రమైన గలీబు తొడుగుతోంది. వెనక్కి తిరిగి చూసి నవ్వింది. ఆ నవ్వు ఇంతకు ముందులా సంతోషంగా, ఉల్లాసంగా లేదు. భయంగా, దీనంగా ఉంది. అతను చేస్తున్నది తప్పు అని చెబుతున్నట్లుగా ఉందా నవ్వు. అతను ఓ క్షణం ఆగిపోయాడు. అంత:సంఘర్షణకు అతనికి ఇంకా అవకాశం ఉంది. ఆమె పట్ల అతనికున్న నిజప్రేమ స్వరం, బలహీనంగానే ఉన్నప్పటికీ- ఆమె గురించి, ఆమె భావాల గురించి, ఆమె జీవితం గురించి- ఇంకా చేబుతూనే ఉంది. మరో గొంతు మాత్రం ‘నీ సొంత ఆనందం, నీ సొంత సంతోషం అందుకునే అవకాశాన్ని చేజార్చుకోవద్దు, జాగ్రత్త!’ అని హెచ్చరిస్తోంది. రెండోగొంతు మొదటి స్వరాన్ని పూర్తిగా అణిచేసింది. అతను పట్టువిడవకుండా ఆమె దగ్గరకు వెళ్ళాడు. అదుపులేని ఒక భయంకర పశువాంచ అతణ్ణి ఆవరించింది. చేత్తో ఆమెని చుట్టి మంచమ్మీద కూర్చోబెట్టాడు. చేయాల్సింది ఇంకేదో ఉందనిపించి ఆమె పక్కనే కూర్చున్నాడు.
‘దిమిత్రీ! దయచేసి నన్ను వెళ్ళనీయండి. మట్రోనా వస్తోంది.’ ఆమె దీనంగా అరుస్తూ తనను తాను విడిపించుకుంది.
నిజంగానే ఎవరో తలుపు దగ్గరకు వస్తున్నారు.
‘అయితే, రాత్రి నీ దగ్గరకు వస్తాను. ఒంటరిగా ఉంటావా?’ అతను గుసగుసలాడాడు.
‘ఏం మాట్లాడుతున్నారు.? వద్దు. అస్సలు రావద్దు!’ కేవలం పెదవులతో మాత్రమే చెప్పిందామె. ఆమె సమస్త దేహంలో కంపిస్తున్న అయోమయం ఇంకేదో విరుద్ధమైన విషయాన్ని చెబుతోంది.
తలుపు దగ్గరకు వచ్చింది మట్రోనా పావ్లోవ్‍నా. తన చేతిపై ఒక దుప్పటి వేసుకుని లోపలికి వచ్చి, నెఖ్లుడోవ్ వైపు ఆక్షేపణగా చూసి, తప్పుడు దుప్పటి తీసుకువచ్చినందుకు కటూషాను కోప్పడటం మొదలుపెట్టింది.
నెఖ్లుడోవ్ మౌనంగా బయటకెళ్ళిపోయాడు. కానీ అతనికి సిగ్గు కూడా అనిపించలేదు. మట్రోనా మొహం చూస్తే ఆమె తననే తిడుతోందని అతనికి అర్థమైంది. ఆమె సకారణంగానే తిడుతోందని తెలుసు. తప్పు చేస్తున్నానని కూడా అతనికి అనిపించింది. కానీ కటూషా పట్ల తనకున్న నిజప్రేమ తాలూకు పాత భావనలన్నిటినీ వొదిలించుకున్న ఈ నీచ పశుత్వపు నూతనోత్సాహం అతని పైన పూర్తిగా ఆధిపత్యం చెలాయించి, మరో ఆలోచనకు తావులేకుండా చేసింది. ఆ రాత్రంతా అతను పిచ్చిపట్టినట్టు తిరిగాడు. ఆమెను ఒంటరిగా ఎలా కలుసుకోవాలా అని ప్రతిక్షణం ఆలోచిస్తూ, అత్తల గదిలోకి మళ్ళీ తన గదిలోకి, ఆపై వరండాలోకి తిరుగుతూ అటూఇటూ నడుస్తూ గడిపాడు. కానీ ఆమె అతణ్ణి తప్పించుకుని తిరిగింది. మట్రోనా పావ్లోవ్‍నా ఆమెను దగ్గరగా గమనిస్తోంది.
****
అధ్యాయం- 17
నెఖ్లుడోవ్ & కటూషా
అలా సాయంత్రం గడిచిపోయి రాత్రి వచ్చింది. డాక్టర్ నిద్రపోయాడు. నెఖ్లుడోవ్ అత్తలు కూడా పడుకున్నారు. వాళ్ళతో పాటు మట్రోనా కూడా అదే గదిలో ఉందని అతనికి తెలుసు. కాబట్టి కటూషా ఖచ్చితంగా పనివాళ్ళ గదిలో ఒంటరిగా ఉంటుందని అర్థం చేసుకున్నాడు.
గాలి మొత్తం చివరి మంచును పారదోలుతున్న- లేదా కరిగిపోతున్న ఆఖరిమంచు నుంచి వ్యాపిస్తున్న- ఆ తెల్లని వసంతపు పొగమంచుతో నిండిపోయింది. వీధి గుమ్మానికి సుమారు వందఅడుగుల దూరంలో, కొండ కింద పారే నది నుండి ఒక వింత శబ్దం వినిపించింది. అది మంచు పగులుతున్న శబ్దం.
నెఖ్లుడోవ్ మెట్లు దిగి, మెరుస్తున్న మంచు ముక్కల పైనున్న బురద గుంటలను దాటుకుంటూ పనివాళ్ళుండే గది కిటికీ దగ్గరకు వెళ్ళాడు. అతని ఛాతీలో గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందంటే, ఆ శబ్దం అతనికి స్పష్టంగా వినపడుతున్నట్లు అనిపించింది. బలంగా లోపలికి పీలుస్తున్న శ్వాస, దీర్ఘనిట్టూర్పుల పరంపరగా బయటకి వెలువడుతోంది. పనివాళ్ళ గదిలో ఒక చిన్నదీపం వెలుగుతోంది. కటూషా ఒక్కతే బల్ల దగ్గర కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ముందుకు చూస్తోంది. నెఖ్లుడోవ్ చాలాసేపు కదలకుండా నిలబడి, తాను గమనించబడుతున్నానని తెలియని ఆమె ఏం చేస్తుందా అని చూస్తున్నాడు. ఒకట్రెండు నిమిషాలు ఆమె అస్సలు కదల్లేదు. తరువాత కళ్ళు పైకెత్తి, చిరునవ్వు నవ్వి, తనను తాను విదిలించుకున్నట్లుగా తలను గట్టిగా ఊపి, భంగిమ మార్చుకుంటూ రెండు చేతులు బల్లమీదకు జార్చి, మళ్ళీ ముందుకు చూస్తూ ఉండిపోయింది.
అతను అలాగే నిలబడి ఆమెనే చూస్తున్నాడు. తన గుండె కొట్టుకునే శబ్దాన్ని, నది నుండి వచ్చే వింత శబ్దాలను అసంకల్పితంగా వింటున్నాడు. అక్కడ నది పైన, తెల్లటి పొగమంచు కింద, అవిశ్రాంత శ్రమేదో కొనసాగుతున్నట్టు, ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు పగులుతున్నట్టు జారిపోతున్నట్టు ముక్కలవుతున్నట్టు ఏవేవో శబ్దాలు- ఒకదానికొకటి అద్దంలా తగిలి పగిలే మంచుముక్కల టంకారావాల శబ్దంతో కలిసి- వినిపిస్తున్నాయి.
అక్కడ అతను నిలబడి, విషాదంతో నిండిపోయిన కటూషా గంభీర వదనాన్ని గమనిస్తున్నాడు. అది ఆమె ఆత్మలో జరుగుతున్న అంతర్గత సంఘర్షణను బహిర్గతం చేస్తోంది. అతనికి ఆమె మీద జాలి కలిగింది. విచిత్రంగా అనిపించినా, ఈ జాలి అతని దురుద్దేశాన్ని మరింత బలపరిచింది.
అతను కిటికీ తట్టాడు. కరెంట్ షాక్ తగిలినట్లుగా ఆమె ఉలిక్కిపడింది. దేహం మొత్తం వణికిపొయింది. ఆమె ముఖంలో భయం కనిపించింది. గబుక్కున లేచి, కిటికీ దగ్గరకు వచ్చి మొహాన్ని అద్దం మీద పెట్టింది. గంతలు కట్టినట్లుగా రెండు చేతులు కళ్ళకు ఆనించి, అద్దంలోంచి తొంగి చూసి అతణ్ణి గుర్తించినప్పటికీ, భయం ఆమె మొహాన్ని వదిలిపెట్టలేదు. ఆమె మొహంలో ఒక అసాధారణ గంభీరత ఉంది. దాన్ని ఇంతకుముందెన్నడూ అతను చూడలేదు. అతని చిరునవ్వుకు ఆమె బదులు నవ్వింది, కానీ అది కేవలం అతనికి లొంగిపోవడం వల్లనే. ఆమె ఆత్మలో నవ్వు లేదు. భయం మాత్రమే ఉంది. అతను ఆమెను బయటకి వచ్చి, వరండాలో ఉన్న తన దగ్గరకు రమ్మని చేత్తో సైగ చేసాడు. ఆమె తలూపి కిటికీ దగ్గరే ఉండిపోయింది. అతను తన ముఖాన్ని అద్దం దగ్గరకు తెచ్చి ఆమెను పిలవబోయాడు. అదే క్షణంలో ఆమె తలుపు వైపు తిరిగింది, లోపల్నించి ఎవరో ఆమెను పిలిచినట్టున్నారు.
నెఖ్లుడోవ్ కిటికీ నుండి దూరంగా కదిలాడు. ఐదడుగుల దూరంలోని ఇంటికిటికీలు కూడా కనిపించనంత దట్టంగా ఉంది పొగమంచు. ఆకారం లేని చీకట్లోంచి ఎర్రని దీపకాంతి దండిగా ప్రకాశిస్తోంది. నది మీద- ఏడుస్తూ, సవ్వడి చేస్తూ, పగిలిపోతూ, టంకారాలు చేస్తూ అవే వింత శబ్దాలు కొనసాగుతున్నాయి. పొగమంచులో ఎక్కడో- మరీ దూరంగా కాకుండా- ఒక కోడిపుంజు కూసింది. ఇంకో పుంజు బదులిచ్చింది. ఆపైన, దూరంగా ఉన్న ఊర్లోని మిగతా పుంజులు ఆ కూతను అందుకున్నాయి. కూతల శబ్దాలన్నీ కలిసిపోయి ఒకే కూతగా మారింది. ఒక్క నదీ రవం తప్ప, చుట్టూ అంతా నీరవంగా ఉంది. ఆ రాత్రి కోళ్ళు కూయడం అది రెండోసారి.
నెఖ్లుడోవ్ ఇంటి వెనుకమూలన అటూ ఇటూ తిరిగాడు. ఒకట్రెండుసార్లు బురదగుంటలో అడుగుపెట్టాడు. మళ్ళీ కిటికీ దగ్గరకి వచ్చాడు. దీపం ఇంకా వెలుగుతోంది. ఏం చేయాలో తెలీనట్టుగా ఆమె మళ్ళీ బల్ల దగ్గర ఒంటరిగా కూర్చుంది. అతను కిటికీ దగ్గరకు వచ్చీరాగానే ఆమె తలెత్తి చూసింది. కిటికీ తట్టాడు. తట్టింది ఎవరని కూడా చూడకుండా ఆమె వెంటనే గదిలోంచి బయటికి పరుగెత్తింది. వింతచప్పుడుతో వీధితలుపు తెరుచుకున్న శబ్దం విన్నాడతను. పక్క వరండాలో ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. ఆమె రాగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేతులతో చుట్టేసాడు. ఆమె అతణ్ణి హత్తుకుని, మొహాన్ని పైకెత్తి, అతని ముద్దును పెదవులతో అందుకుంది. అప్పుడే, అదే శబ్దంతో తలుపు మళ్ళీ తెరుచుకుంది. మట్రోనా పావ్లోవ్‍నా స్వరం కోపంగా ‘కటూషా!’ అని పిలిచింది.
ఆమె అతని కౌగిలి నుండి తనను తాను విడిపించుకొని, తిరిగి పనివాళ్ళ గదిలోకి వెళ్ళింది. అతనికి గడియారం చప్పుడు వినిపించింది. తర్వాత అంతా నిశ్శబ్దం. ఎర్రని దీపకాంతి మాయమైంది. పొగమంచు మాత్రమే మిగిలింది. నది పైన సందడి అలాగే కొనసాగింది. నెఖ్లుడోవ్ మళ్ళీ కిటికీ దగ్గరకు వెళ్ళాడు. ఎవరూ కనిపించలేదు. తట్టాడు. సమాధానం రాలేదు. ముందుతలుపు గుండా ఇంట్లోకి తిరిగి వచ్చాడు. నిద్రపట్టలేదు. లేచి, చెప్పులు కూడా లేకుండా నడవాలోంచి నడిచి ఆమె గది దగ్గరకు వెళ్ళాడు. అది మట్రోనా గది పక్కనే ఉంది. మట్రోనా నిశ్శబ్దంగా గురక పెట్టడం వినిపించింది. ముందుకు వెళ్ళబోతుండగా ఆమె గట్టిగా దగ్గి, తన కిర్రు మంచంపైన పక్కకు ఒత్తిగిల్లింది. అతని గుండె జారిపోయింది. ఐదునిమిషాలు కదలకుండా అలాగే నిలబడిపోయాడు. అంతా సద్దుమణిగాక, ఆమె మళ్ళీ ప్రశాంతంగా గురక పెట్టడం మొదలుపెట్టగానే ముందుకు నడిచాడు. కిర్రు శబ్దం చేయని పలకల మీద నడవడానికి ప్రయత్నిస్తూ, కటూషా తలుపు దగ్గరకు వచ్చాడు. అక్కడ ఎలాంటి శబ్దం వినిపించలేదు. బహుశా ఆమె మేల్కొని ఉండాలి. లేకపోతే ఆమె ఊపిరి శబ్దం అతనికి వినిపించేది. అతను ‘కటూషా’ అని గుసగుసలాడగానే ఆమె వెంటనే ఉలిక్కిపడి లేచి, కోపంగా ఉన్నట్లు కనిపిస్తూ, అతణ్ణి వెళ్ళిపొమ్మని బలవంతం చేయడం మొదలుపెట్టింది.
‘తలుపు తెరువు! దయచేసి ఒక్కనిమిషం లోపలికి రానివ్వు! నిన్ను బ్రతిమాలుతున్నాను!’
అతనేం మాట్లాడుతున్నాడో అతనికే తెలీడం లేదు.
* * *
ఆమె వణుకుతూ, అతని మాటలకు బదులివ్వకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోగానే, నెఖ్లుడోవ్ మళ్ళీ వరండాలోకి వచ్చి నిలబడ్డాడు.
అప్పుడు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు.
తెల్లవారుతోంది. కింద నది పైన మంచు ఒరుసుకుంటున్నట్టు, పగులుతున్నట్టు, ఏడుస్తున్నట్టున్న శబ్దాలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక గలగల శబ్దం కూడా వినబడుతోంది. పొగమంచు కిందకు దిగడం మొదలుపెట్టింది. దాని పైన, ఆకాశంలో ఆరిపోతున్న చంద్రుడు ఏదో నల్లటి వింతైనదాన్ని మసకమసకగా ప్రకాశింపజేస్తున్నాడు.
‘జరిగిన దానంతటికి అర్థం ఏంటి? ఇది నాకు దొరికిన గొప్ప ఆనందమా లేక గొప్ప దురదృష్టమా?’
తనను తాను ప్రశ్నించుకున్నాడు నెఖ్లుడోవ్.
అధ్యాయం -18
తదనంతరం
అందంగా, ఆనందంగా ఉండే ప్రతిభాశాలి షాన్‍బాక్, మరుసటిరోజు నెఖ్లుడోవ్‍తో కలిసి అత్తల ఇంటికి వచ్చాడు. తన వినయంతో, స్నేహపూర్వక ప్రవర్తనతో, ఉత్సాహంతో, దానగుణంతో, దిమిత్రి పట్ల ఆప్యాయతతో అత్తల హృదయాలను పూర్తిగా గెలుచుకున్నాడు.
ఆ వృద్ధమహిళలు అతని దాతృత్వాన్ని మెచ్చుకున్నప్పటికీ, వాళ్ళకు అది కొంచం అతిశయోక్తిగా, గందరగోళంగా కూడా అనిపించింది. గేటు దగ్గరకు వచ్చిన కొంతమంది గుడ్డిబిచ్చగాళ్ళకు అతను ఒక రూబుల్ ఇచ్చాడు. పనిమనుషులకు పదిహేను రూబుళ్ళ బక్షీసు ఇచ్చాడు. సోఫియా ఇవనోవ్‍నా పెంపుడు కుక్క కాలుకు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే, తన అందమైన అంచులున్న నాణ్యమైన రుమాలును (అలాంటి రుమాలు డజను ధర కనీసం 15 రూబుళ్ళు ఉంటుందని సోఫియా ఇవనోవ్‍నాకు తెలుసు) చీలికలుగా చింపి కుక్క కాలికి కట్టు కట్టాడు. ఇలాంటి మనుషులను ఆ వృద్ధవనితలు ఎప్పుడూ చూడలేదు. షాన్‌బాక్‌కు రెండు లక్షల రూబుళ్ళ అప్పు ఉందనీ, అది అతను ఎప్పటికీ తిరిగి కట్టడనీ, కాబట్టి పాతిక రూబుళ్ళు ఎక్కువా తక్కువా అనేది అతనికి అస్సలు పట్టదని వాళ్ళకు తెలియదు. షాన్‍బాక్ ఒక్కరోజు మాత్రమే అక్కడ బస చేసాడు. అతను, నెఖ్లుడోవ్ ఇద్దరూ రాత్రి బయలుదేరారు. సెలవులు పూర్తిగా అయిపోవడం వల్ల, ఇంతకంటే ఎక్కువ రోజులు రెజిమెంట్‌కు దూరంగా ఉండటం వాళ్ళకు కుదరదు.
నెఖ్లుడోవ్ స్వార్థపూరిత ఉన్మాదం ఇప్పుడు చేరుకున్న దశలో, అతను తన గురించి తప్ప మరేమీ ఆలోచించలేకపోయాడు. తన ప్రవర్తన బయటపడితే తనని తప్పు పడతారా లేదా అని ఆలోచిస్తున్నాడే తప్ప, కటూషా ఎంత బాధ పడుతుందో, తర్వాత ఆమె ఏమైపోతుందో అని అస్సలు ఆలోచించలేదు.
షాన్‍బాక్ తమ మధ్య సంబంధాన్ని ఊహించాడని నెఖ్లుడోవ్ గ్రహించాడు. ఇది అతని అహాన్ని సంతృప్తిపరిచింది.
‘ఇంత హఠాత్తుగా నీకు అత్తలమీద ప్రేమ ఎందుకు కలిగిందో అర్థమైంది! దాదాపు వారం రోజులుగా వాళ్ళతో ఉంటున్నావు. అందులో కూడా ఆశ్చర్యం లేదు, నేనైనా అదే చేసేవాణ్ని. ఆమె చాలా మనోహరంగా ఉంది.’ అన్నాడు షాన్‍బాక్, కటూషాను చూసిన తర్వాత.
నెఖ్లుడోవ్ ఒక విషయం ఆలోచిస్తున్నాడు. ఆమెతో తన కోరికలు పూర్తిగా తీర్చుకోకుండానే వెళ్ళిపోవడం బాధాకరమే అయినా, ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోవడంలో కూడా కొన్ని లాభాలున్నాయి. కొనసాగించలేని ఒక కష్టసాధ్యమైన సంబంధానికి ఇది హఠాత్తుగా ముగింపు పలికింది. ఆమెకు కొంత డబ్బు ఇవ్వాలని కూడా అనుకున్నాడు. అది ఆమె కోసం కాదు. ఆమెకు అవసరానికి ఉపయోగపడుతుందని కాదు. అది తను చేయాల్సిన పని కాబట్టి ఇవ్వాలి. ఆమె స్థానాన్ని బట్టి, అతని స్థాయిని బట్టి- అతనికి ఉదారమైనది అనిపించేంత డబ్బు ఆమెకు ఇచ్చాడు.
వెళ్ళిపోయే రోజు, భోజనాలయ్యాక, బయటికెళ్ళి వసారా తలుపు దగ్గర ఆమె కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. అతణ్ణి చూసి ఆమె సిగ్గుతో ఎర్రబడిండి. పనివాళ్ళగది తలుపు తెరిచే ఉందని కళ్ళతోనే సైగ చేస్తూ అతణ్ణి దాటి ముందుకు వెళ్ళబోయింది. కానీ అతనామెను ఆపాడు.
‘వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను. ఇదిగో, తీసుకో!’ అన్నాడు, తన చేతిలోని వందరూబుళ్ళ నోటున్న కవరును నలుపుతూ.
అతను ఉద్దేశం ఆమె ఊహించింది. కనుబొమ్మలు ముడిచి, తల అడ్డంగా ఊపుతూ అతని చేతిని పక్కకు తోసింది.
‘తీసుకో. నువ్వు తప్పకుండా తీసుకోవాలి!’ తడబడుతూ అన్నాడు. కవరును ఆమె ఎప్రాన్ జేబులో దూర్చి, దెబ్బతిన్నవాడిలా మూలుగుతూ, కోపంగా తన గదికి పరిగెత్తాడు.
ఆ చివరి సంఘటనను తలుచుకుంటూ అతను చాలాసేపు బాధతో మెలికలు తిరుగుతూ అటూ ఇటూ తిరిగాడు. అప్పుడప్పుడు కాళ్ళు నేలకేసి కొట్టి అరుస్తూ గుర్రుమని మూలిగాడు కూడా.
‘ఇంతకంటే నేనింకేం చేయగలను? అందరికీ ఇలాగే జరుగుతుంది కదా?’ అతను తనకు తాను సర్ది చెప్పుకోవాలని చూసాడు.
‘అందరూ చేసేది ఇదే అయినపుడు… నేను చేసింది కూడా తప్పు కాదు!’ అనుకుంటూ అతను మనశ్శాంతి పొందడానికి ప్రయత్నించాడు. లాభం లేకపోయింది.
జరిగింది తలుచుకుంటే మనస్సాక్షి దహించుకుపోతోంది. అతని ఆత్మలో, ఆత్మ లోలోతుల్లో- తాను నీచంగా, క్రూరంగా, పిరికిపందలా ప్రవర్తించానని అతనికి తెలుసు. ఈ చర్య తాలుకు స్పృహ, ఇకముందు ఇతరులెవరినీ తప్పుబట్టకుండా, వాళ్ళ కళ్ళలోకి నేరుగా చూడకుండా తనని అడ్డుకుంటుందని అతనికి తెలుసు. తనను తాను ఒక అద్భుతమైన, ఉన్నతాశయాలు గల గొప్ప వ్యక్తిగా భావించుకోవడం ఇకపై అసాధ్యం. నిజానికి ధైర్యంగా, సంతోషంగా బతకాలంటే అలా భావించుకోవడం అతనికి చాలా అవసరం. ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉంది. అదేంటంటే- దాని గురించి అస్సలు ఆలోచించకపోవడం. అందులో అతను విజయం సాధించాడు. అతను ఇప్పుడు ప్రవేశించబోతున్న కొత్త జీవితం, కొత్త వాతావరణం, కొత్త స్నేహితులు, యుద్ధం- అన్నీ దానిని మర్చిపోవడానికి అతనికి తోడ్పడ్డాయి. ఎంత ఎక్కువ కాలం గడుస్తుంటే దాని గురించి అంత తక్కువ ఆలోచించేవాడు. చివరికి పూర్తిగా మర్చిపోయాడు.
యుద్ధం ముగిసాక, ఒకే ఒక్కసారి మాత్రం అతను కటూషాను కలవాలన్న ఆశతో అత్తల దగ్గరికి వెళ్ళాడు. అతను చివరిసారి కలిసిన తర్వాత ఆమె త్వరలోనే వెళ్ళిపోయిందనీ, ఎక్కడో ప్రసవించి పూర్తిగా చెడిపోయిందనీ అత్తలు చెప్పడం విని అతనికి గుండెల్లో నొప్పిగా అనిపించింది. ప్రసవించిన సమయాన్ని బట్టి చూస్తే ఆ బిడ్డ తనదే కావచ్చు, కాకపోనూవచ్చు. కటూషా దారి తప్పిందని, తల్లి చెడు స్వభావాన్ని వారసత్వంగా పొందిందని అత్తలు అనడం అతనికి ఆనందం కలిగించింది. అది అతణ్ణి నిర్దోషిగా ప్రకటించినట్లు అనిపించింది. మొదట్లో ఆమెని, ఆమె బిడ్డని వెతకాలనుకున్నాడు. కానీ ఆమెను తలచుకున్నప్పుడల్లా ఆత్మ లోలోతుల్లో విపరీతమైన సిగ్గు, బాధ కలగడంతో పెద్దగా ఆమెను వెతికే ప్రయత్నం చేయలేదు. బదులుగా, ఆ పాపాన్ని మళ్ళీ మర్చిపోవడానికి ప్రయత్నించి దాని గురించి ఆలోచించడం మానేసాడు.
ఇప్పుడు ఈ వింత యాదృచ్ఛికత అతనికి గతాన్ని తిరిగి జ్ఞాపకం చేసింది. తొమ్మిదేళ్ళుగా తను చేసిన ఆ తప్పును, తన హృదయం లేని, క్రూరమైన, పిరికిపంద స్వభావాన్ని అంగీకరించమని అతణ్ణి దబాయించింది. కానీ అలాంటి అంగీకారానికి అతను ఇంకా చాలా దూరంలో ఉన్నాడు.
తన భయం అంతా ఒక్కటే – ఇప్పుడు ఈ విషయం బయటపడిపోవచ్చు. కటూషానో, ఆమె తరపు లాయరో అదంతా చెప్పి, అక్కడున్న అందరి ముందు తనను అవమానించవచ్చు.
***
