ఇద్దరన్నదమ్ములు. వారిపేర్లిక్కడ అనవసరం. వారు నాకు చదువుకునే రోజుల్లో భలే నేస్తాలు. కానీ చాలా సంవత్సరాల ఎడబాటువల్ల మా సాన్నిహిత్యం పోయింది. వారిలో ఒకరు సుస్తీగావున్నారని నాకు చాలాకాలం క్రింద తెలియడం జరిగింది. ఎలాగైనా మా పూర్వ గ్రామానికి వెళ్తున్నాను; వారి గ్రామం దారిలోనే గనుక వారిని చూడ్డానికి దిగాను. వారిలో ఒకాయన అగుపించి జబ్బుగావుంది తన తమ్ముడని చెప్పాడు.
“అంతదూరం నుంచి మమ్మల్ని చూడ్డానికి వచ్చారంటే నాకెంతో ఇదిగావుంది. అయితే మావాడు కొంతకాలం క్రింద బాగై, మరోచోటికి వుద్యోగానిక్కూడా పోయాడు.” అని చెప్పాడు. తన తమ్ముడు రాసిన డెయిరీ రెండు సంపుటాలు నవ్వుతూ చూపించి “వీటిని చూస్తే మావాడికి వచ్చిన జబ్బు తరహా తెలుస్తుంది. మీరు మితృలు; చూసినా ప్రమాదం లేదు లెండి” అన్నాడు. డైరీని ఆతృతగా అందుకుని *అలా పార చూసాను. అతడికి వచ్చింది ఒక రకమైన మానసిక వ్యాధని తెలుసుకున్నాను. తననెవరో వెంటాడుతున్నట్లు అనుమానించడం ఆ వ్యాధి లక్షణం. రాత చాలా గజిబిజిగా వుంది. ఒకదానికొకటి సంబంధమంటూ లేదు. ఎన్నో పిచ్చి వాజ్మూలాలు. అంతేకాదు తేదీలివ్వడం కూడా మానేశాడు. అదంతా ఒకమాటు రాసింది గాదని సిరారంగులో, రాతలో అగుపించే తేడాలను బట్టి కనుక్కోవలసిందే. అయితే కొన్ని భాగాలు మాత్రం అట్టే సంబంధ రహితంగా లేవు. వైద్యశాస్త్ర పరిశోథనకు పనికివస్తుంది గదా అని అందులో ఒక భాగం నేనెత్తి వ్రాసుకున్నాను. పేర్లు తప్ప డైరీలో ఒక్క మాట కూడా నేను మార్చలేదు. అయినా ఆ డైరీలో పేర్కొన బడిన వ్యక్తులంతా వూరూ పేరూ లేని జానపదులు. ప్రపంచానికసలు తెలిసిన మనుషులే కాదు. ఇక శీర్షికకు వస్తే – స్వస్తపడిన తరువాత కర్తే దానిని ఎన్నుకున్నాడు. నేను దానినీ మార్చలేదు.
ఈ రాత్రి వెన్నెల ఎంతో కాంతిమంతంగా వుంది. గత ముప్పయి సంవత్సరాలుగా నేను వెన్నెల చూడలేదు. ఈరోజు చూడగానే ఎంతో పొంగిపోయాను. గత ముఫ్ఫై సంవత్సరాలుగా అంధకారంలో వున్నానని బోధపడసాగింది. ఇక చాలా అప్రమత్తతతో మెలగాలి. లేకపోతే ఆ చా_వో యింట్లో వున్న కుక్క ఎందుకు రెండుసార్లు నావేపు చూడవలసివచ్చింది.
నా భయానికి కారణం వుంది.
ఈరోజు వెన్నెల లేనేలేదు. ఇది ఎంతో దురదృష్టమని నాకు తెలుసు. ఈ వుదయం నేనెంతో భద్రంగా వెళ్ళినప్పుడు చా_ఓ ఏదో విచిత్రంగా చూసాడు. నన్ను చూసి ఏదో భయపడ్డాడా అనిపించింది. నన్ను ఖూనీ చేయాలనుకుంటున్నాడా అనిపించింది. అక్కడ యింకా యేడెనిమిదిమంది యితరులు కూడా వున్నారు. వారంతా గుట్టబడి నా గురించే మధన పడుతున్నారు. నేను చూసేసరికి భయపడిపోయారు. నాకెదురైన జనమంతా అలాగే వున్నారు. వాళ్ళల్లో మహాకౄరుడు పళ్ళన్నీ వెళ్ళబెట్టి ఒక్క చిరునవ్వు నవ్వాడు. వారియత్నం సంపూర్తి అయిందని తెలిసి నేను ఆపాదమస్తం వణికిపోయాను.
అయినా నేనేమీ భయపడలేదు. అలాగే వెళ్ళాను. నా యేదుటే ఒక గుంపు పిల్లలు కూడా నాగురించే చర్చిస్తున్నారు. వాళ్ళ చూపు అచ్చం ‘చా_ఓ’ చూపులాగే వుంది. వాళ్ళ ముఖాలు కూడా తెల్లబడి వికృతంగా వున్నాయి. నాకు వాళ్ళకు ఏం తగాదావుండి యీ పిల్లలిలా ప్రవర్తిస్తున్నారా అని విస్తుబోయాను. ఇక ఆగలేక ‘చెప్పండి’ అని కేక వేశాను, అయితే వాళ్ళు మాత్రం పరుగోపరుగు.
ఆశ్చర్యం! చా_ఓకు నాకు అసలేం తగాదా వుండగలుగుతుంది? ఆ దారేపోయే జనంతో నాకేం తగాదా వుంది? ఏమీ లేదు. కాని యిరవైయేళ్ళ క్రితం కూ-చు-యి లెఖ్ఖ చిట్టాను నేను కాలితో తొక్కాను. అందుకతడు చాలా నొచ్చుకున్నాడు. ఈ సంగతి చా_ఓకు తెలియకపోయినా వినివుంటాడు. నామీద కసి తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకనే దారేపోయే వాళ్ళతో నామీద కుట్ర పన్నుతున్నాడు. అయితే పిల్లల సంగతేమిటి? అప్పటికి వాళ్ళు పుట్టనేలేదే! అయితే మరి ఎందుకు వాళ్ళీరోజు నన్నింత యిదిగా చూసారు. నన్ను చూసి భయపడినట్లు, నన్ను ఖూనీ చేయాలనుకున్నట్లు? ఇది నిజంగా నాకు భీతాహం కలిగిస్తుంది, దిమ్మతిప్పేస్తుంది, తారుమారు చేసేస్తుంది.
తెలిసింది, వాళ్ళీ విషయం పెద్దాళ్ళ దగ్గరనుంచి తెలిసికొనివుండాలి.
నేను రాత్రిపూట నిద్రించలేను. ఏ విషయాన్నైనా ఆకళింపు చేసుకోడానికి నిశితమైన పరిశీలన వుండాలి.
ఈ మనుషులున్నారే- వాళ్ళల్లో కొందరిని మెజిస్ట్రేట్ బండకొయ్య వేశాడు కొందరిని వూరి పెద్దమనుషులు మొహం పేలగొట్టారు. కొందరి పెండ్లాలను బంట్రౌతులు తీసుకపోయారు. కొందరి తలిదండ్రులను ఆత్మహత్య చేసుకునేవరకు అప్పులవాళ్ళు తరిమి తరిమి సాధించి వేధించారు. అప్పుడు కూడా వారు నిన్న వున్నంత భీతాహంగా గాని కౄరంగా గానీ లేరు.
నిన్న రోడ్డుమీద ఆ ఆడమనిషి – ఆమె విషయం మరీ విపరీతం! కొడుకును వీపు బద్దలయ్యేట్టు బాదుతూ “ఒరే పిల్ల దయ్యమా! నీ మాంసం పుక్కిళ్ళుపుక్కిళ్ళు కొరికెయ్యాలనేంత మండుకపోతుంది నీ మీద నాకు” అంటుంది, కాని అన్నంతసేపు నావేపు చూస్తూనే వుంది. ఇక భరించలేక నోరు చేసుకున్నాను. ఆ పారపళ్ళ తెల్లమొహాల వాళ్ళంతా హేళనగా నవ్వ మొదలుపెట్టారు. ముసలి ‘చెన్’ గబగబావచ్చి నన్నింటికి పదమని కూచున్నాడు.
అతడు నన్నింటికి తీసుకవచ్చాడు. మా యింట్లో వాళ్ళంతా నన్నెరుగానట్లు నటించారు. వాళ్ళ చూపు కూడా ఆ యితరుల చూపులాగేవుంది. నేను నా స్టడీ గదిలోకి వెళ్ళగానే ఏ కోడినో, బాతునో మూసివేసినట్లు బైట బీగం బిగించారు.
కొన్ని రోజులక్రితం ‘వుల్ఫుక్లబ్’ గ్రామంనుంచి మా కౌలుదారొకాయన పంటల విషయం మాట్లాడడానికి వచ్చాడు. వాళ్ళ వూళ్ళో ఒక మహా కర్కోటకుణ్ణి వూరివారంతా కలిసి మోది చంపారట. ఆ చచ్చినవాడి గుండెను బైటకులాగి కొంతమంది నూనెలో వేల్చుక తిన్నారట. అలా చేస్తే ఆ చచ్చినవాడి ధైర్యంలో కొంతైనా, వారికి వస్తుందనట. ఆ కౌలుదారీ విషయాన్ని మా అన్నకు చెబుతుంటే నేను మధ్యలో కలిగించుకునేసరికి ఆ కౌలుదారు మా అన్న యిద్దరూ నావేపు కన్నార్పకుండా చూశారు. వాళ్ళ చూపులు కూడా అచ్చం ఆ బైట వుండేవాళ్ళ చూపుల్లాగే వున్నాయి. ఆ విషయం నాకీనాటికి ఆకళింపయింది.
ఈ విషయం తేల్చుకుంటే చాలు, నాకు నఖశిఖపర్వంతం వణకెత్తిపోద్ది. వాళ్ళు మనుషుల్ని తింటారుగనుక నన్ను కూడా తినేస్తారు. వాళ్ళని ఆపుచేయగలిగేదేముంది?
ఆ ఆడదుందే- “నీ మాంసం పుక్కిళ్ళు పుక్కిళ్ళు కొరికేస్తా” అనే మాటలు ఆ పారపళ్ళ తెల్లమొహాల నవ్వు నిన్నటి కౌలుదారు కథా ఇవ్వన్నీ రహస్య సాంజ్ఞలని తేటతెల్లమయింది. వాళ్ళ మాటలనిండా విషం; నవ్వుల నిండా బాకులు, నాకవగాహనమయింది- వాళ్ళ పళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి. ఎందువల్లనంటే, మనిషి మాంసం తింటంవల్ల.
నేను చెడ్డవాణ్ణి కాకపోయినా ‘కూ’ పద్దులు తొక్కిన్నాటినుంచి నేననుమానించబడ్డానని తోస్తుంది. నేనూహించలేని రహస్యాలేవో వారికున్నట్లగుపిస్తారు! ఒకసారి వారికి కోపంవస్తే ఇక ఎవణ్ణయినా చెడ్డాడనేస్తారు. నాకు బాగా గుర్తు, మా అన్న నాకు వ్యాసరచన నేర్పే రోజుల్లో ఎంతోమంచి వ్యక్తినైనా చెడ్డవాడని నేను తర్కిస్తే అంగీకార సూచకంగా గుర్తుపెట్టేవాడు. దోషకారుల్ని నేను క్షమించానో ‘ఇది నీకెంతో శ్రేయస్కరం, నీ భావనాశక్తిని చూయిస్తుంది” అనేవాడు, నాకు వారి రహస్యాలోచల్ని వూహించడం ఎలా సాధ్యమౌతుంది? అందులో ఇది భక్షించే తరుణమయ్యె.
ఏ విషయాన్ని ఆకళింపు చేసుకోవాలన్నా నిశితమైన పరిశీలన కావాలి. పూర్వకాలంలో మనుషులు మనుషుల్ని తినేవారన్నట్లు నాకు గుర్తొస్తుంది. నాకా విషయం అట్టే స్పష్టంగా లేదు. అన్వేషించాలని యత్నించాను. కాని నా చరిత్రకు కాలమానం లేదు. ప్రతిపుటలో ‘సజ్జనత్వం, నీతి’ అన్న మాటలే వున్నాయి. ఎట్లాగు నిద్రపట్టదు గదా- అర్థరాత్రంవరకూ జాగ్రత్తగా చదివేవాణ్ణి. వాటి అంతరార్థం తెలుసుకోడానికి ప్రయత్నించేవాణ్ణి. చదివేకొద్దీ పుస్తకమంతా “మనుషుల్ని తిను,” అనే అక్షరాలతో నిండిపోయేది.
పుస్తకంలోవున్న ప్రతిమాట మా కౌలుదారు చెప్పిన ప్రతిమాట, ఏదో నిగూఢంగావున్న చిరునవ్వుతో నా వేపు విచిత్రంగా పరకాయిస్తుంటాయి.
నేనూ మనిషినే, వాళ్లు నన్నూ తినాలి అనుకుంటున్నారు.
ఉదయం కొంతసేపు కదలకుండా కూచున్నాను. ముసలి చెన్ మధ్యాహ్న భోజనం గదిలోకి తెచ్చాడు. ఒక గిన్నెలో శాకాలు, మరో గిన్నెలో ఆవిరిచేప. ఆ చేప కళ్ళు తెల్లగా గట్టిగా వున్నాయి. మనిషి మాంసం తినాలనే మన మనుషులకు మల్లె అదీ నోరు తెరుచుకుని వుంది. అచ్చం అంతే వుంది. రెండు మూడు ముద్దలు మ్రింగాను. జారిపోతున్న ఆ కబళాలు చేప మాంసమో, మనిషి మాంసమో తెలుసుకోలేకపోయాను, అలాగే అంతా తినేశాను.
“ముసలి చెన్! బాగా వుమ్మదం తీస్తుంది, కాసేపు పెరటిలో తిరుగుతానని మా అన్నకు చెప్పు” అన్నాను. అతడు యేమనకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి గేటు తెరిచాడు. వాళ్ళు నన్ను ఎలా పరామర్శిస్తారో కనిపెట్టాలని నేనేం కదలలేదు. నన్ను వాళ్ళసలు బైటకు పోనివ్వరని నాకు తెలుసు. అనుకున్నంతా అయింది. మా అన్న ఒక ముసలాణ్ణి వెంటబెట్టుకుని నెమ్మదిగా బైటకువచ్చాడు, ఆయన కళ్ళల్లోంచి తొంగి చూస్తున్న ఖూనీకోరుచూపు నాకగుపిస్తుందేమోననే భయంకొద్ది తలవంచుకున్నాడు. కాని సులోచనాల మూలల్లోంచి దొంగ చూపులు చూస్తూనేవున్నాడు. “ఈరోజు కులాసాగా వున్నట్లున్నావు” అన్నాడు మాయన్న. “అవును” అన్నాను. “నేను నిన్ను పరీక్షచేయడానికి ‘వో’ గారిని యిక్కడకు పిలిపించాను.”
“సరే”
నాకు అంతా ఖచ్చితంగా తెలుసు ఈ వచ్చిన ముసలాడు ముసుగువేసుకున్న హంతకుడు. నేనెంత కొవ్వానో, నాడిని పరీక్షించే నెపంతో వాడు చూస్తున్నాడు. అందుకు నా మాంసంలో వాడికో భాగం యిస్తారు. అయినా నేనేమి భయపడలేదు. నేను మనుషుల్ని తినకపోయినా వారికంటే స్థైర్యంగల్లవాణ్ణే. నా రెండు చేతులు గుప్పెళ్ళుబట్టి, ముందుకుచాచి వాడేమి చేస్తున్నాడో గమనిస్తున్నాను. ముసలాడు కూచుని, కండ్లు మూసుకుని ఏదో కొంచెంసేపు మెదలకుండా వున్నాడు. అప్పుడు టక్కరి కళ్ళను విప్పి, “నాయనా నీ వూహలను ఇష్టం వచ్చినట్లు పరిగెత్తనివ్వకు. కొన్నాళ్ళు స్తిమితంగా కూచో, క్రమపడతావు.” అన్నాడు.
నీ వూహలను యిష్టవచ్చినట్లు పరిగెత్తనివ్వకు, కొన్నాళ్ళు స్తిమితంగా కూచో. నేనెంత క్రొవ్వితే వాళ్ళకంత ఎక్కువ మాంసం. కాని నాకేమి లాభం ఎలా క్రమపడతాను? ఈ మనుషులంతా నరమాంసాన్ని కోరుతున్నారు. కాని ఆ వుద్దేశ్యాన్ని కనిపించనీయకుండా వుండడానికి రహస్యంగా ప్రయత్నిస్తున్నారు. ముఖాముఖి ప్రవర్తించడానికి వీళ్ళకసలు దమ్ముల్లేవు. ఇదంతా చూస్తే నాకో పెద్దనవ్వొస్తుంది. నవ్వలేక దాదాపు చచ్చిపోయాను. నవ్వకుండా వుండలేను, మోతబుట్టేట్టు నవ్వేస్తా. అది నాకంత వినోదంగా వుంటుంది, ఈ నవ్వులో ధైర్యం యదార్థం వున్నాయి. ఆ ముసలాడు, మా యన్న యిద్దరు తెల్లమొహాలు వేశారు, నా ధైర్యానికి, యదార్థతకు కంపించిపోయారు.
నేనింత ధైర్యశాలిని గనుక నన్నుతింటే నా ధైర్యంలో కొంత భాగమైనా వస్తుందని వాళ్ళు తొందరపడుతున్నారు. ఆ ముసలాడు గేటుదాటి పట్టుమని పది అడుగులు వేయకముందే “వెంటనే తినేయాలి” అని మాయన్నతో గుసగుసలాడాడు. మా వాడేమో తలూపాడు. ఏమిరా అన్న! నీవుకూడ యిందులో వున్నాటరా! ఇదొక మహత్తరమైన పరిశోధన. నా గుండె గతుక్కుమంది. అయినా యిది క్రొత్తేంకాదు. ఇలా జరుగుతుందని నేనెప్పుడో వూహించాను. నన్ను తిండంలో మాయన్న కూడా ఒక చేయి వేస్తాడన్నమాట!
మాయన్న ఒక నరమాంసభక్షకుడు, నేను నరమాంసభక్షకుని తమ్ముణ్ణీ!
నేనితరులచేత భక్షింపబడుతాను. అయినా నరమాంసభక్షకునికి తమ్ముణ్ణవుతాను గదాని!
కొన్నాళ్ళనుంచి పునరాలోచన చేస్తున్నాను. ఆ ముసలాడు ముసుగువేసుకున్న హంతకుడు కాదు, వైద్యుడేననుకుందాం. అయినా నరమాంసభక్షకుడే అవుతాడు. అతనికి పూర్వుడైన వి-పిన్-చెన్ అనే వైద్యుడు ఓషధుల మీద ఒక పుస్తకం రాశాడు. మనుష్యుల మాంసాన్ని వేపుకు తినవచ్చునని అందులో సృష్టీకరించాడు. ఇంకా యీ వైద్యుడు తాను మనిషి మాంసం తిననని చెప్పుకోగలుగుతాడా?
ఇక మా అన్న సంగతికి వస్తాం. వాణ్ని నరమాంసభక్షకుల జాబితాలోంచి తొలగించడం దుస్సాధ్యం. వాడు నాకు పాఠాలు నేర్పే రోజుల్లో, ‘మనుషులు తమ కొడుకులను తినడానికి మారకం వేసుకునేవారని’ తననోటితోనే చెప్పాడు. ఒకప్పుడు ఒక చెడ్డవాణ్ణి గురించి చర్చించడం జరిగింది. ‘అట్టాంటాణ్ణి చంపితేనే చాలదు; వాడి మాంసం తిని చర్మంమీద నిద్రపోవాలి’ అన్నాడు. నేనప్పటికింకా బుడతను. కొంతసేపటి వరకు నా గుండెలు దడకొట్టాయి. మొన్న ‘వుల్ఫుహాలు’ నుంచి వచ్చిన మా కౌలుదారు ‘వాణ్ణేవన్నో చంపి, వాడి గుండెలు దొబ్బులు తిన్నారనే’ కథ చెప్పేటప్పుడు కూడా అతడేమీ ఆచార్యాన్ని చూయించలేదు.,తల పంకించాడంతే. అతడి వైఖరి మారిపోడం స్పష్టంగా అగుపించింది. తినేందుకు కన్న కొడుకుల్నే మారకం వేసుకోడం జరిగితే దేన్నైనా మారకం వేస్తారు. ఎవన్నైనా తింటారు. పూర్వం మా అన్న ఇలాంటివన్నీ బోధిస్తుంటే విని మరిచిపోయేవాణ్ణి. ఇప్పుడు మాత్రం నాకేమైనా బోధిస్తుండేప్పుడు వాడికి నోరూరడమే కాకుండా వాడి మనసంతా నన్ను తినడం మీదే ఉండట్టు నాకు గ్రహింపవుతుంది.
గాఢాంధకారం. ఇది పగలో రాత్రో నాకు తెలియడం లేదు. చా_ఓ యింటి కుక్క మళ్ళా మొరగడం మొదలేసింది.
సింహం యొక్క క్రౌర్యం, కుందేటి పిరికిదనం నక్కజిత్తులు……
వాళ్ళ పథకం నాకు తెలుసు. మీదకువచ్చే ఫలితాలకు భయపడి వాళ్ళేవణ్ణి బహిరంగంగా చంపదలచటంలేదు. అందుకని అందరు జట్టుకట్టి నన్ను నేనే చంపుకునేట్టు చేయడానికి వుచ్చులొడ్డారు. కొద్దిరోజుల క్రితం ఆ బజారులో ఆడాళ్ళ, మగాళ్ళ ప్రవర్తన చూడరాదూ! కొన్ని రోజులనుంచి మాయన్న వైఖరి మాత్రం అంతా తేటతెల్లంగానే వుంది. మనిషి వాడి పటకాతో వాడే దూలానికి వురి వేసుకచావాలని వాళ్ళ గొంతెమ్మ కోరిక. ఖూనీ చేశారనే అపవాదు వాళ్ళకు రాదు. హృదయ వాంఛేమో ఫలిస్తుంది. అనుభవించవచ్చు. బహుశా ఇందుకే కాబోలు వాళ్ళు వింగబడి పగలబడి నవ్వేది. ఇంకో సంగతి-ఒకడు జడిసో లేక దిగులుతో కుళ్ళో చస్తే బక్కబారి పోతాడుగా. అయినా వాణ్ణి తింటంకూడా వాళ్ళకిష్టమే.
వాళ్ళు తినేది చచ్చిన మాంసమే. హైనా క్రూర జంతువు ఒకటుందని, దాని చూపులు వికృతంగా వుంటాయని, అది చచ్చిన మాంసం మాత్రమే తింటుందని ఎక్కడో చదివినట్లు గుర్తు. పెద్దపెద్ద యెముకలను కూడా ముక్కముక్కలుగా నమిలి మింగేస్తుందట. ఈ విషయాన్ని తలుచుకుంటే చాలు ఎవడు హడలెత్తిపోడు! మైనాలు తోడేళ్ళకు దగ్గరవట. తోడేళ్ళుకి నైన్ జాతికి చెందినవి. నిన్న చా_ఓ యింటికుక్క చాలాసార్లు నావేపు చూసింది. అది ఆ స్థలంలో వాళ్ళతో కలిసి వుంటం ఖచ్చితంగా అగుపించింది. ఆ ముసలాడు నేలచూపు చూసాడు. అంత మాత్రాన నేను మోసపోతానా?
ఇక మాయన్న సంగతి అందరికంటే శోచనీయం. అతడు కూడా మనిషేగా. అతడు మాత్రం ఎందుకు భయపడడు. నన్ను తినడానికి యితరులతో ఎందుకు కుట్ర పన్నుతున్నాడు. ఇలాంటి సంఘటనలింతకుముందెన్నో జరిగాయని చారిత్రిక నిర్ధారణలున్నాయి గనుక తప్పుగాదు! లేక తప్పని తెలిసి కూడా గుండెను బండ జేసుకున్నాడో!
నేను నేరారోపణంచేసే నరమాంసభక్షకులలో మొదటివాడవుతాడు మాయన్న. నేను మరల్చడానికి ప్రయత్నించే వాళ్ళల్లో కూడా మొదటివాడే అవుతాడు.
అలాంటి వాదాలు పూర్వమెప్పుడో నిజంగా అంగీకృతమైవుండాలి.
గభాలున ఎవరో లోనికివచ్చారు. అతడికి యిరవైయేళ్ళ యీడు మాత్రమే వుంటుంది. అతడి మొక్కట్లను నేను సరిగా చూడలేదు. మొహం చిరునవ్వు మడతల్లో మునిగిపోయి వుంది. నాకేసి తలూపినప్పుడాతడి చిరునవ్వు నాకు నిష్కటంగా అగుపించలేదు. మనిషి మాంసం తింటం తప్పుగాదా అని అతన్ని అప్పుడడిగాను.
ఇంకా నవ్వుతూనే సమాధానం చెప్పాడు. “కరువు లేనప్పుడెవరైనా ఎలా తినగలుగుతారు.”
వెంటనే తెలిసిపోయింది వీడు కూడా వాళ్ళల్లో వకడని. అయినా ధైర్యం చిక్కబట్టుకుని మళ్ళీ అదేప్రశ్న వేశాను “తప్పులేదా?”
“ఏ కారణంవల్ల అలాంటి ప్రశ్న అడుగుతున్నావు? నీవు నిజంగా తమాషా చేస్తున్నావుగదూ …….. ఈ రోజు చాలా బాగుంది”
“అయినా నిన్నడగాలనుకున్నాను. చెప్పు, తప్పు లేదంటావా?”
వాడు తెల్లబోయి గొణిగాడు “తప్పే”
“తప్పేనా? అయితే వాళ్ళింకా ఎందుకా పని చేస్తున్నారు?”
“నీవు దేన్ని గూర్చి మాట్లాడుతున్నావు?”
“నేను దేన్ని గూర్చి మాట్లాడుతున్నానా? వుల్ఫుక్లబ్బు గ్రామంలో యిప్పుడు మనుషులు మనుషుల్ని తింటున్నారు. కావలసివస్తే చూడు, స్వచ్ఛమైన ఎఱ్ఱసిరాతో పుస్తకాల నిండా వ్రాసుంది.”
వాడి ముఖం మారిపోయింది. వికృతంగా తెల్లబోయాడు. నావేపు కన్నార్పకుండా చూస్తూ, “కావచ్చు. అన్ని కాలాల్లో అలాంటి ఘటనలున్నాయి,” అన్నాడు.
“ఎప్పుడూ అది అంతే గనుక తప్పు లేదంటావా?”
“ఇలాంటి విషయాలు నీతో చర్చించను. అయినా నీవిలాంటి విషయాలను గురించి మాట్లాడడమే తప్పు.”
నేను చెంగునలేచి వురిమిచూచేసరికి వాడు మాయమయ్యాడు. నాకు ముచ్చెమటలు పోశాయి. మా అన్నకంటె వీడెంతో చిన్న, అయినా అప్పుడే యీవృత్తిలో వున్నాడు. వీడికి తల్లితండ్రులు నేర్పివుంటారు. వీడు యీపాటికి తన కొడుక్కుకూడా నేర్పే వుంటాడు. అంచేతనే పిల్లలు సహితం నావేపు క్రూరంగా చూచేది.
వాళ్ళల్లో ప్రతివాడికి మనుషుల్ని తినాలనే కోరిక. కాని తననెవరు తింటారో అనే భయంతో ఒకరినొకరు మహాగొప్ప అనుమానంతో చూచుకుంటారు.
ఈ అవరోధంనుంచి బైటబడగలిగారా అతురత లేకుండా హాయిగా, ఆహారం, విహారం, శ్రమ, నిద్ర అన్నీ అనుభవిస్తారు. ఈ ఒక్క అడుగే వెయ్యాలి. అయినా యీ కుట్రలో భార్యలు, భర్తలు, అధ్యాపకులు, విద్యార్థులు, పచ్చగడ్డి వేస్తే ఎచ్చిగడ్డయ్యే శత్రువులు-మిత్రులు, వారు వీరేంటి ముక్కు మొగం తెలియని కొత్తాళ్ళు కూడా చేరిపోయారు. ఒకణ్నొకడు ఇరికించడం, ఉసిగొట్టడమున్ను. మిన్ను విరిగి మీదబడినా యీ నిశ్చయాన్ని మాత్రం మానుకోరు.
ఈరోజు ప్రొద్దున్నె మాయన్నను వెదకబోయాను. అతడు హాలు ద్వారం దగ్గర బైటనుంచుని మిన్ను జూస్తున్నాడు. నేను అతడి వెనగ్గా వెళ్ళి తలుపుగట్టిగా బిగించుకుని నించుని ఎంతో తాఫీగా వినయంగా అన్నాను. “అన్నా! నీకోసంగతి చెప్పాలనుకున్నాను”
“మంచిది, ఏమిటది?” అన్నాడు. సర్రున నావేపు తిరిగి తల పంకిస్తూను.
“అది చాలా చిన్న విషయమే. కాని చెప్పాలంటే నాకెంతో కష్టంగా వుంది. ఆదిమ మానవులందరు కొద్దిగా మనిషి మాంసం తింటం ఆరంభం చేసివుంటారు. వారి దృష్టి మారటం వల్ల దరిమిలా కొంతమంది మానేశారు. వాళ్ళు మంచిగా వుండాలని యత్నించారు గనుక మనుషులుగా మారారు. నిజమైన మనుషులుగానే మారారు. కాని కొంతమంది యింకా తింటూనేవున్నారు. సర్పజాతిలో కూడా కొన్ని చేపలుగా, పిట్టలుగా, కోతులుగా చివరకు మనుషులుగా మారాయి. కాని కొన్ని మంచిగా వుండాలని ప్రయత్నించవు. అవి యింకా సర్పజాతిగానే వుండిపోయాయి. మనుషుల్నితినే మనుషులు, మనుషుల్ని తినని మనుషులతో పోల్చుకునేప్పుడు వారెంతో సిగ్గుపడాలి. బహుశా కోతుల ముందు సర్పాలకంటె ఎంతో ఎక్కువ సిగ్గుపడాలి.
ప్రాచీనకాలంలో వంటవాడు తన కొడుకును వండి నిరంకుశాధికారికి వడ్డించాడట. అది ఒక పూర్వపుగాథ. కాని భూమ్యాకాశాలు సృష్టి అయిన నాటినుంచి మనుషులొకరినొకరు తింటూనే వున్నారు. నాటినుండి ఆ వంటవాడి కథా కాలంవరకు, అక్కణ్ణుంచి విప్లవం వరకు, విప్లవం నుంచి వుల్ఫు క్లబ్ గ్రామం మనిషి వరకు సాగుతూనే వుంది. నిరుడు పట్నంలో ఒక నేరస్తుణ్ణి వధించారు. వాడి నెత్తురులో రొట్టెముక్కను ముంచుకుని ఒక క్షయరోగి చీకేశాడు.
వాళ్ళు నన్ను తినాలనుకుంటున్నారు. దానికి నీవేం చేయగలవు పాపం ఒంటరిగాడవు. అది సరేగాని నీవుకూడా వాళ్ళతో ఎందుకు కలవాలి? వాళ్ళు నరమాంస భక్షకులు ఏమైనా చేస్తారు. నన్ను తిన్నవాళ్ళు నిన్ను మాత్రం తినరూ? మళ్ళీ మాట్లాడితే ఒకే ముఠాలో వాళ్ళు ఒకరినొకరు తింటారు. ప్రధమంగా నీ మార్గాన్ని నీవు అవవశ్యం మార్చుకో. అప్పుడు ప్రతివాడు శాంతంగా వుంటాడు. ఇది అనాదినుంచి జరుగుతున్నా, నేటినుంచి మనం ఒకరినొకరం విశేషించి ఆదరించుకుందాం. అది అసాధ్యంరా తమ్ముడూ అంటావు నీవు, అది సాధ్యమేరా అన్నాయ్ అంటాను నేను. బాడుగ తగ్గించమని మొన్న కౌలుదారడిగితే వల్లకాదన్నావు నీవు.” మొదట అతడు బాధాకరంగా ఒక చిరునవ్వు నవ్వాడంతే. తర్వాత ఒక ఖూనీకోరు ఛాయ అతడి కళ్ళల్లోకి వచ్చింది. వాళ్ళ రహస్యాలను నేను తడిమేటప్పటికి తెల్లమొహం వేశాడు మావాడు. బైటనేమొ ఒక గుంపు మనుషులు. చా_ఓ అతడి కుక్కతోసహా నావేపు తొంగి చూడ్డానికి అర్రులుచాచి నుంచునివున్నారు. ముసుగులు పెట్టుకు ఉన్నారల్లేవుంది వాళ్ళ మొహాలన్నీ నాకగుపించలేదు. కొంతమంది మాత్రం పాలిపోయి వికృతంగా నవ్వు బిగబట్టుకుంటూ వున్నారు. వాళ్ళంతా మనిషి మాంసం తినే మనుషుల ముఠా అని నేను తెలిసికొన్నాను. ఎలాగైతేనేం, వాళ్ళందరు ఒకేవిధంగా ఆలోచించడం లేదని కూడా నాకు తెలుసు. అన్ని కాలాల్లో మనుషుల్ని తింటంవుంది గనుక యిప్పుడు కూడా తినవలసిందేనని కొందరి ఆలోచన, మనుషుల్ని తినగూడదని కొందరికి తెలుసు. అయినా తినాలనే కోరిక వుంది. ప్రజలు వాళ్ళ రహస్యాన్ని తెలుసుకుంటారేమోనని వాళ్ళ భయం, అందుకనే నామాట వినబడగానే వాళ్ళకు కోపం వచ్చింది. కాని పెదవులు బిగించి ఆ విషపు చిరునవ్వు ఇంకా నవ్వుతూనే వున్నారు.
వెంటనే మా అన్న కళ్ళెర్రజేసి “ఇదిగో మీరందరిక్కణ్ణించి వెళ్ళిపోండి! మతి సరిలేని మనిషి వేపు అలా చూడ్డంలో మీ వుద్దేశమేమిటి?” అని చప్పట్లు చరస్తూ పెద్దగా అరిచాడు.
అప్పుడు వాళ్ళ టక్కరితనం నాక్కొంత అర్థమయింది. వాళ్ళు తమ నిశ్చయాన్ని మార్చుకోడానికిష్టపడలేదు. కావాలసిన పన్నాగాలన్నీ పన్నారు. నాకు పిచ్చాడనే పేరు కూడా తయారు చేశారు. ఇక నన్ను తినేసినా చిక్కేం రాదు. బహుశా ప్రజల కృతజ్ఞతను కూడా సంపాదిస్తారు. ఆ వూళ్ళో ఒక చెడ్డాణ్ని తిన్నారని మా కౌలుదారు మొన్న చెప్పిన కథలో వున్న పన్నాగం కూడా ఇదే. ఇది వాళ్ళ పాత పన్నాగమే.
ముసలి చెన్ ఆర్భాటంగా లోనకువచ్చాడు. అయినా వాళ్ళు నన్ను నోరు మూయించలేకపోయారు. నేను వాళ్ళకు చెప్పవలసిందేదో చెప్పేశాను. “మీరు మారాలి; తమాం మారాలి; మీ హృదయాలు అట్టడుగు నుంచి మారాలి; మానవభక్షకులకు ప్రపంచంలో ఇక చోటులేదని మీరు తెలుసుకోవాలి” అన్నాను.
మీరు మారకపోతే మిమ్మల్ని కూడా తినేస్తారు. మానవభక్షకులెంతో మంది పుట్టారనుకుంటున్నారు కాబోలు. వేటగాళ్ళు తోడేళ్ళను వధించినట్లు నిజమైన మనుషులు మిమ్ములను తుడిచిపెడ్తారు, మీపాట్లు పాములపాట్లవుతయి.
ముసలి చెన్ అందరిని తరిమివేశాడు. మాయన్న ఎక్కడికిపోయాడో అంతులేదు. నన్ను గదిలోకి వెళ్ళమని ముసలి చెన్ బతిమాలాడు. గదంతా చిమ్మచీకటి. దూలాలు, కడ్డీలు నా శిరస్సు మీద కంపించిపోతున్నాయి. కంపించి, కంపించి పెద్దవై నామీద గుట్టగూలాయి.
ఆ భారంతో నేను కదలలేకపోయాను. వాళ్ళు నన్ను చావగోరారు. ఆ భారమంతా వుట్టిమాయ అని నాకు బోధపడింది. పెనుగులాడి చెమటలో తడిసిపోయాను అయినా నేను చెప్పవలసింది చెప్పేశాను.
“మీరు మారాలి; తమాం మారాలి; మీ హృదయాలు అట్టడుగునుంచి మారాలి; మానవ భక్షకులకు ప్రపంచంలో ఇక తావేలేదని మీరు గ్రహించుకోవాలి.”
సూర్యుడు ప్రకాశించడు, ద్వారం తెరవబడదు, రోజూ రెండుసార్లు భోజనం.
నా ‘చాప్ స్టిక్సు’ను తీసుకున్నాను. మా అన్న విషయం మనసు కొచ్చింది. నా చిన్నిచెల్లి ఎలా చచ్చిపోయిందో నాకిప్పుడు తెలుస్తుంది. అదంతా వీడివల్లనే జరిగింది. అప్పుడు నా చెల్లి ఐదేళ్ళది. చక్కగా ముద్దుగా వుండేది. అది యీనాటికి నా మదిలో మెదులుతుంటుంది. మాయమ్మ ఏడ్చి ఏడ్చి వేసారింది. కాని వీడేమొ ఏడ్వద్దని ఆమెను బతిమాలాడు. బహుశా ఆ చిన్నదాన్ని వీడే తిని అలా చేసివుంటాడు. ఆమె యేడుస్తుంటే వీడికి లజ్జగలిగిందేమొ – అసలు వీడికి లజ్జనేది వుంటే..
మా అన్న మా చెల్లిని తినేశాడు. మా అమ్మకు తెలిసిందో లేదో నాకు తెలియదు.
మా అమ్మకు తెలిసే వుంటుందనుకుంటాను. కాని ఆమె యేడ్చేటప్పుడు వాడి ముఖాన ఆ విషయం పగులగొట్టలేదు. వాడి మర్యాద కాపాడాలనుకుందేమో! నాకు బాగా గుర్తు, నేను నాలుగైదేళ్ళ వాన్నైవున్నప్పుడు మా హాలు ముందు నీడలో కూచుని వున్నాను. అప్పుడు మా అన్నయ్య అన్నాడు “ఒరేయ్! సత్పుత్రుని లక్షణం ఏంటంటే-తల్లి తండ్రికి జబ్బు వస్తే వాళ్ళను బాగు చేయడానికి వాడి శరీరంలో ఒక భాగానైనా కోసి వండిపెట్టాలి” అన్నాడు. మా అమ్మ కూడా వాడి మాటను కాదనలేదు. ఒక భాగాన్ని తినగలిగితే శరీరమంతటిని తినివేయవచ్చుగా! అది సరేగాని ఆనాటి మాయమ్మ ఏడ్పును తలచుకుంటే నా గుండెలు నెత్తురుగక్కుతాయి. అదీ అందులో వున్న అద్భుతం.
ఆ విషయాన్ని తలచుకుంటే నేను భరించలేను. నాలుగువేలయేళ్ళ నుంచి మనుషులు మనుషుల్ని తింటున్న స్థలంలో నేను నివాసం చేస్తున్నానన్న విషయం నాకిప్పుడే ఆకళింపయింది. మా చెల్లి చనిపోయిన యెదిరింపుల్లోనే మా అన్నకు పెత్తనం వచ్చింది. వాడు దాని మాంసాన్ని మా అన్నంలో, కూరల్లో కలిపేసే వుంటాడు, మేం తెలియకుండా తినేసే వుంటాం.
అవును, నా చెల్లి మాంసపు ముక్కలనెన్నో నేను తెలియకుండా తినేసేవుండొచ్చు. ఇప్పుడు నా వంతు వచ్చింది.
నాకు తెలియకుండా జరిగిపోయింది నాలుగువేల సంవత్సరాల ప్రాయంగల్ల నరమాంసం భక్షణ చరిత్ర వుందే- ఇక నాలాంటివాడికి నిజమైన మనుషుల్ని చూస్తాననే ఆశ వుంటానికవకాశం వుందా అంట!
ఇంతవరకు మనిషి మాంసం మరగని పసిపాపలు బహుశా వుండవచ్చు, వాళ్ళకైనా రక్షణ కలుగుగాక.
ఏప్రిల్, 1918.
