సుభాషిణి కాదు సుమలత

Spread the love

రెక్కలు టప టపా కొట్టుకుంటూ శక్తినంతా కూడదీస్కోని “కొక్కుర్రక్రోక్రూ…..” అని ఒళ్లిరిసుకుంది కోడిపుంజు, ఏ పిచ్చుక పుష్పావతయ్యిందో పిచ్చుకలన్ని పిచ పిచ మని కిచ కిచ మని అల్లరి చేసుకుంటూ ఇంటి ముందున్న ఏపచెట్టెక్కి ఏడుకలు చేసుకుంటన్నాయ్, సమాధుల్లో చింత చెట్టు మీద కూర్చొని కాకులన్ని కలసి గొంతులు సరిచేసుకుంటున్నాయ్ ఏ వూర్లో కచ్చేరివుందో.  డొంకచివర బోరింగునెవురో భారంగా కొడుతున్నారు అది “గర్రుంకుక్….గర్రంక్, గర్రుంకుక్….గర్రంక్” అని మొత్తుకుంటా “జర్రూ… జర్రూ” మని ఇత్తడి  బుంగలో నీళ్ళు పోస్తుంది, ఉన్నట్టుండది “గ్రంక్ గ్రంక్ గ్రంక్ గర్రంక్” మని వేగం పెంచింది ఏ కుర్రోడి చేతులో పడిందో.

“దీనెమ్మ నాయాల్ది ఇంకా మంచం దిగలేదంట్రా సుధగా, తెల్లర్లా! రాత్రంతా పెత్తనాలు నూక్కపోతే తొందరగా పోడుకోకూడదంటయ్యా…! లెగార్నాయాలా లెగు, ఒమేయ్ ఎమేలిమ్మ ఇంకా నిద్రబోతున్నా రాత్రేంపాటుకి బోయేవమ్మా యెంతసేపని మీకోసం ట్రాక్టరున్డిద్ది, రోజూ చెప్పాలంటమ్మే…ఏం మనుషుల్రాసాంవె” అంటూ అందర్ని నిద్ర లేపుతున్నాడు ఆక్కోట్టను ( పొగాకు పచ్చిగా ఉన్నప్పుడే చెట్ల నుంచి వేరు చెయ్యడం)  బోను పెద్దనవాకు. చచ్చిపోయిన చీమకుర్తి నాగేస్సర్రావ్ ట్రాక్టరు టేపురికార్డులో దూరి “దేవీ కష్టములెట్లుండును పుణ్యక్షేత్రములైన వారణాసిని దర్శించితిమి గదా” అని ఆరున్నొక్క శ్రుతిలో పద్యాల్ని పాడుతున్నాడు. ట్రాక్టరుడ్రైవర్ బాలకృష్ణ అంతకంటే ఎక్కువ సౌండ్తో హారన్ కొడుతున్నాడు. కట్టుకున్న కొకమీద చొక్కాఏసుకొని ఎమేలిమ్మ పక్కింటి కవితోల్లింటికి కొచ్చి “కదలండసె మగల్లారా ట్రాక్టరుబోతుందంట, ఓస్ కవితో ఇంకా మొకం కడుగుతున్నావంటమ్మే, ఇంకెంతసేపే తల్లారుద్దేది, రుద్దింది సాల్లే రామే ఎంత రుద్దిన ఎర్రంగా రావుగానే” అని ఎకసక్కేలాడింది. బాలకృష్ణ ఇంకో సారి హారన్ కొట్టాడు. “ చిస్స్.. చిస్స్..చిస్ “ మని కాంతమ్మోలింట్లో చీపురు నేలన్నాకుతుంది. “ఒసే మగడో నువ్వింకా ఇల్లు చిమ్మేకాడే వున్నా సరిపోయింది సంబడం” అని జేబులో వున్న చింతపండు కొంచెం నోట్లోఏసుకుంది ఎమేలిమ్మ. ఇంకో సారి హారన్ మోగింది. “నువ్వాగారా సామె సిక్కింది కదాని నొక్కుతున్నావ్” అని బాలకృష్ణ మీద అరిచింది వాడికి వినపడకుండా ట్రాక్టరెక్కుతూ ఎమేలిమ్మ. “ఎందసె పిల్లో దెయ్యంపట్టిన్దాన్లాగ కూసున్నావ్ ఇక్కడ ఒకాదనివే, బయమేసింది గదమే నిన్ను చూసే” అంది ట్రాక్టరులో ఒక మూలన కూర్చొని వున్న సుభాషిణిని చూసి, అ పిల్లకి పదిహేనేల్లుంటాయి సమాధానం చెప్పకుండా అంతే వుంది. “ఆమ్మో మాట్లాడితే ముత్యాల్రాతాయంట్లే ఆ పిల్లకి, ఇందాకట్నుంచి పిలుస్తున్నాకూడా ఉలకలా పలకాలా” అన్నాడు ట్రాక్టరు డ్రైవర్ బాలకృష్ణ. “రావాల్రవల్రవాలా… ట్రాక్టరుబోతుంది” అంట అక్కడకి చేరుకున్నాడు పెద్దనవాకు.

చియాక్ చియాక్ మని నేల మీద పడుతున్నాయ్ కళ్ళాపినీళ్ళు కుమారోలింట్లో, లసక్ లసక్ మని నలుగుతున్నాయ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గోంగూర ధనమ్మోలరోట్లో. “తిస్ జు..తిస్స్ జు..తిస్జు” మని స్టీలు తపేల్లో పడుతున్నాయ్ బర్రె పాలు సుబ్బయ్యోలింట్లో. జనాలని ఎక్కించుకొని ట్రాక్టరు గోలబెట్టుకుంటా సమాధుల్ని దాటుకుంటా మల్లవరప్పాడు దారిపట్టింది. ఇన్ని శబ్దాలు చేస్తే గాని కళ్ళు తెరవలేదు సూరీడు కందులూరు పల్లెలో. “ఈళ్ళు పనికిపోయేదేమోగాని గోల గోల చేసి ఊరందర్నీ లేపుతార్ర” అంది మా అమ్మమ్మ కవలమ్మ మంచమ్మీద దుప్పట్లు మడతెస్తా.

ఎంత వేగంగా పోయిందో అంతే వేగంగా వెనక్కి వచ్చింది ట్రాక్టరు మళ్ళీపల్లెకి, ఎక్కడా ఆగకుండా సుభాషిణి వాళ్ళ ఇంటిమున్దాగింది. “ఆక్కుబోయినోల్ల ట్రాక్టరు మళ్ళీ ఎనకొచ్చిందేందబ్బ” అంటా మంచం కిందున్న చేతికర్ర తీసుకుంది కవలమ్మ. “కవలప్పో… కవలప్పో తొందరగా మా ఇంటికి రాయే సుభాషిణి మాటా పలుకు లేకుండా బిత్తరచూపులు చూస్తందే, మా కేదో బయ్యగుందే” అంటా లగెత్తే సరికి వచ్చే గస పెడతా చెప్పేడు సుభాషిణి వాళ్ళ నాన్న కవలమ్మతో. “అందుకేనా ట్రాక్టరు ఎనక్కొచ్చిందే” అంటా “సరే పోదాం బా” అంటా కర్రబోటుతోనే వేగంగా కదిలింది. “ఓ యమో కొంచే సిన్నగా బోయే పడతావ్” అంటా అరిచింది మాయమ్మ గెంజి వంచుతా. “పెదనానో సుభాషిణికేమయ్యిందే” అని అడిగా పెద్దగా మంచంమీదనుంచి లేస్తా. “అద్దెలియక్కదా మీ యమ్మమ్మని తీసకెలతంది” అన్నాడు మా అమ్మమని చెయ్యిపట్టుకోని తీసుకెల్తా. వూర్లో అందరికంటే పెద్దదవటం వల్ల ఎవురికేసమస్య వచ్చిన ముందు మా అమ్మమ్మని తీసకెల్తారు ఆమె చూసి చెప్పినాకే ఏ నిర్ణయమైనా తీసుకంటారు పల్లెల్లోవోల్లు.

నేను కూడా మా ఇంట్లో నుంచి లగెత్తుకుంటాబోయి మా ఇంటి ముందున్న డొంకలో నుంచొని సుభాషినోల్ల ఇంటి వైపు చూసాను. అటు జల్లోల్ల బజారునుంచి సుబ్బులమ్మ, పసుమర్తోల్ల బజారునుంచి ఇజిమ్మ, మేరిమ్మ, చక్క్రయ్యగోరి కోటేసు హడావిడిగా సుభాషినోల్ల ఇంట్లోకి దూరారు.” ఎమైదంట్రా బుజ్జిగా” అని పొయ్యి కాడ కూర్చున్న మాయమ్మ కేకేసింది. “నేనేల్లి సూసొస్తాన్మా” అని అక్కడనుంచి సుభాషినోల్ల ఇంటివైపుకేల్తన్న.

మా ఊరికి కొత్తగా వచ్చింది సుభాషినోల్ల కుటుంబమంతా పనుల కోసం. సుభాషిణి చలాకి పిల్ల , సితనాప్పిల్ల,   చదువు రాదుగాని తెలివిగల్ల పిల్ల, ఏ పనైనా చిటికెలో సేసిద్ధి. ఆ పిల్ల బొరింగొట్టినట్టు కందులూరో లో ఏ మగోడు కొట్టలేడు. ఆ పిల్లతో మొగపిల్లలు కూడా పరిగెత్తలేరు. బిల్లంగోడాడిద్ది, గొలీలాటాడిద్ది, ఓకులాటాడిద్ది, గోసికట్టి ఒంగులుదూకులాడిద్ది. సన్నంగా గెడకర్రలాగా వుండి చూట్టానికి ఛామనఛాయాగుండిద్ది. లంగాబొందిలేసుకొని, రెండు జడలుండా బట్టి ఆ పిల్లని ఆడపిల్లంటారు గాని అన్ని మొగోల్ల లక్షణాలే పుష్పావతవ్వకముందు.

ఇపుడాపిల్లకి పదిహేనేళ్ళు పుష్పావతయ్యి ఆరు నెలలయ్యింది. ఇప్పుడు చూడాలి ఆ పిల్లందం ఆ చూపుల్లో సిగ్గు, బుగ్గల్లో జోబ్బల్లో నునుపు, పెదాల్లో ఎరుపు, కళ్ళల్లో కాటికే, ఎత్తుముడ్డిదాక ఎలాడే జడ, పైట లో వున్నప్పుడు కనపడే సన్నని తెల్లని పొట్ట, ఇంతెత్తు నుండే రొమ్ములు, నీళ్ళు తెస్తా బొందిలని పైకి దోపుకున్నప్పుడు కనపడే తెల్లని కాళ్ళు, అబ్బ అచ్చం సినిమాహీరోఇన్ను లాగుండిద్ది. “ ఓమౌ సుభాషిణి బలేవుండిద్దె” అని ఒకసారి మా అమ్మతో అంటే “ఒరేయ్ ఆపిల్లెవురనుకున్నావ్, సుబ్బరత్తం పెద్దమ్మ కూతురుగదంట్రా నీకు సెల్లలయ్యిద్ది” అంది నేనెక్కడ తగులుకుంటానో అని. నిజానికి మా అమ్మ చెప్పేదాకా నాకు ఆ పిల్ల సెల్లెలయ్యిద్దని తెలియదు. తెలియనప్పుడు ఆ పిల్ల గురించి ఎన్నో రకాలుగా ఊహించుకున్న, మరిప్పుడు వాటినన్నిటిని ఆపుకోవాలి ఆ పిల్ల సెల్లెలు కాబట్టి. నిజంగా సుభాషిణి నాకు చెల్లెలు కాకుండా వుంటే ఎంత బాగుండేదో అని నేను ఎన్నోసార్లనుకున్న.

రెండు కాకులు ఒకటేమాయన “క్రా…క్రా క్ర్రా..” అని అరుస్తున్నై ఎండుతునకలారేసే కర్రమీద వాలి సుభాషినోళ్ళ ఇంటిముందు, అంతకంటే పెద్దగా “ఒమేయ్ రండమ్మే టయమవుతందా, ఒర్నాయాలో రారే సూసింది సాలుగానే, ట్రాక్టరెక్కండ్రా” అని అరుస్తన్నాడు పెద్ద నవాకు . “పాపం ఏ దొంగనాసయితి కన్నుబడిందో దుక్కలాగుండే పిల్ల ఇట్ట యాలబడతంది” అంది ఎమేలిమ్మ ట్రాక్టరు దగ్గరికి పోత కవిత్తో, “ఆమే మూడురోజులనుంచి ఆ పిల్లా మేతగ్గానే వుంది మే” అంది కవిత ట్రాక్టరు ఎక్కుతూ ఎమేలిమ్మతో, “బాలకృష్ణా ఇంకా బోనియ్” అన్నాడు ట్రాక్టర్ లో ఎక్కిం మనుషులని లేక్కేస్తూ పెద్ద నవాకు. ట్రాక్టరు గాలిబట్టిన అడవిదున్న లాగ అరుసుకుంటా అక్కడనుంచి పోయింది. ఎవురో దిష్టి తీసిన ఎంట్రుకలు, ఎండు మిరపకాయలూ పొయ్యిలో ఎసినట్టున్నారు ఘాటుగా కంవురు కంపు కొడతంది. గుంపు ని తోసుకుంటా లోపలికేల్లను సుభాషిణిని చూడడానికి.

గోడకానించిన నులకమంచంమీద కూర్చుని రెండు కాళ్ళు పట్టే కానించి ముందుకీ వెనక్కీ ఊగుతూ ‘ఉఫ్ఫ్ ఉఫ్ఫ్’ మని నోట్లోంచి గాలి బయటకి ఊదుతూ, నిమిషానికి ముప్పై సార్లు కళ్ళు మూస్తూ తెరుస్తూ ఎవరిసాయ చూడకుండా తలని అటు ఇటు ఊపుతూ  కూర్చోనుంది సుభాషిణి. ఎదురుగా గా మా అమ్మమ్మ స్టూలు మీద కూర్చోనుంది ఏ మాత్రం బయపడకుండా. సుభాషిణిని అలా చూసేతలికి అరికాల్లో చెమటలు పట్టినయ్ నాకు. కవలమ్మ ఫాట్మని చెంప మీద కొట్టి “ మేయ్ సుభాసినా ఎంవయ్యిందే అని అడుగుతుంటే గాల్లోకి సూత్తవే, ఏమయ్యిందో సెప్పో” అంది. ఆ పిల్ల ఆ దెబ్బకి ఏం తమకలా, బుసపెడతంది, సన్నగా ఒణుకుతుంది. కవలమ్మ ఆ పిల్ల  జుట్టు పట్టుకొని “ఏందే అడుగుతుంటే సేప్పవూ” అని మల్లి కొట్టబోయింది. కవలమ్మని ఇదిలించుకొని ఇంకొంచం దూరంగా జరిగింది సుభాషిణి మంచంమీదే. ఆ కుదుపుకి ఒంటిమీదున్న పైట జారిపోయి రయికకన్పించింది, తల్లో ముడి జారిపోయి ఎంట్రుకలు బుజాలమీదగా కిందకు జారి రయికని కప్పెసినాయ్ సాంబ్రాణి పొగలాగా ఎంట్రుకలు సుడులు సుడులు తిరిగున్నై. ”ఒరే ఇలా కాదుగాని ఆ చీపురు తీసుకోఎట్ట చెప్పదో నేను జూస్తా” అంది కవలమ్మ. “అప్పో కొట్టబాకప్పో” అంది బయపడతా సుభాషిణి. “ఆదిరా సంగతా దీనికి గాలి బట్టింది” అంది కవలమ్మ. ఎనబై ఏల్లుండే మా అమ్మమ్మని పట్టుకొని సుభాషిణి అప్పో అప్పో అంటంటే నాకు ఉచ్చబడ్డాయి, అక్కడున్న వాళ్ళందరికీ పడేవుంటయ్, ఎవ్వరూ శ్వాస కూడా తీసుకోవడం లా, ఆపిల్లనే చూస్తున్నారు. “అప్పో ఎవురో కనుకొప్ప” అన్నాడు సుభాషిణి వాళ్ళ నాన్న కవలమ్మ . “ఎవుతివే నువ్వు, ఏ ఊరే నీదే” అని కవలమ్మ స్టూలు కొంచెం ముందుకు జరుపుకుంది.  “అప్పో నన్ను గుర్తుబట్టలేదంటే, నేను గదా సుమలతని” అంది సుభాషిణి. “ఓస్ లంజ నువ్వంటే” అని ఆశ్చర్యపోయింది మా అమ్మమ్మ. “సుమలతంటే సుబ్బాబు కూతురు గదా” అక్కడున్న వాళ్ళల్లో చాలామంది గోనుక్కోవడం వినపడింది నాకు.

“నీకు సిగ్గెట్టలేదమ్మే మళ్ళీ ఈ వూరి జనాలమద్దికి రాడానికి సేడిపోయిన్దానా యాక్ థు” అని సుభాషిణి మొకంమీదూసింది మా అమ్మమ్మ. అది సుభాషిణి కంటి మీద పడి కిందక్కారతంది. “అది కాదప్ప మొన్నాదివారం ఈ పిల్ల బాగా తలకి పోసుకొని పూలుబెట్టుకొని మద్యానం పూట ఒలుకుల్లోకి దొడ్డిక్కొచ్చిన్దప్ప, పిల్ల పచ్చంగనపడేతలికి దూరేనప్ప” అంది వణుకుతా. “అబ్బ కళ్ళు మంటలూ , గుచ్చుకుంటన్నాయ్ .. అబ్బా మంట” అని కళ్ళు నలుపుకుంటుంది సుభాషిణి, కళ్ళకాటిక కల్లచుట్టూ అయ్యి లోపలి గుడ్లు ఎర్రంగా చుట్ట చివర నిప్పులాగా వెలిగిపోతున్నాయ్. “కళ్ళల్లో కాకేరిగిందట్టమ్మే కల్లునలుపుకుంటున్నావ్ లైలాడిదానా” అంది కవలమ్మ సుభాషిణి ని . పక్కనే వున్నసుదీర్ గోడు పకపకా నవ్వేడు “ఈ కర్రి నాబట్టేవుడప్ప తెగ నవ్వుతున్నాడో” అంది వాణ్ని చూస్తా సుభాషిణి. “ధనమ్మ కొడుగ్గదా కావాలా ఏంది” అని వాణ్ని ముందుకు లాగింది  కవలమ్మ, వాడక్కడే ఉచ్చబోసుకొని ఎడుస్తా వలపోసుకుంటా ఎనక్కి తిరక్కుండా ఇంటికేల్లేడు.

నాకు ఇందాకున్న బయం కాస్త తగ్గింది, మా అమ్మమ్మ పక్కన, సుభాషిణి కి ఎదురుగ్గా కూర్చున్న. ఆ పిల్ల నన్నసలు గుర్తుపట్టలా,  ఉన్నట్టుండి “వామ్మో తలపగిలి పోతుంది నాయనో, కళ్ళు మంటల్రో, వామ్మో నీళ్ళు చల్లగున్నై, ఆ బాయిలో ఇసక నాకల్లలోకి పోయింది, కళ్ళు మంటలప్పో కళ్ళు మంటలేయ్ ఓఓఓ …” అని ఏడుస్తూ, వణికిపోతూ సాకండాలు పెట్టడం మొదలుబెట్టింది సుభాషిణి. “నువ్వు జేసిన పనికి అట్టే మండాల్లె లంజా…. ఇప్పుడేంనాకనొచ్చావ్? ఈ పిల్ల జివానెందుకు పడ్డావ్? సెప్పి మర్యాదగా బయటకెల్లక పోతే సెప్పుతెగిన్దాక్కోడత సెడిపోయిన్నాసయితే” అని చెప్పు తీసుకుంది కవలమ్మ. “ అప్పో నేనేం ఇక్కడున్దామని రాలేదులేయే, పోతానెయ్, ఆ నా బట్ట పదిరోజులనంగా యాడికోబోయేడు ఆడినెతుక్కుంటా ఇటొచ్చా….. ఆడు రాంగాల్లోనే ఈ పిల్లనిడిసిపెడతానే… ఆడు నన్నెతుక్కుంటా కచ్చితంగా వత్తాడెయ్…” అని పెద్దగా అరుస్తుంది సుభాషిణి. “సెడిపోయిన్దానా పైన కూడా మీ ఇద్దరు కలిసే వున్నారంటే, సెప్పటానికి సిగ్గేట్టా లేదే నీకో” అని పళ్ళు కొరికింది కవలమ్మ. “ఆ నా బట్ట నాకోసం పురుగుల మందు తాగాడు, పొగచేలల్లో గిల గిల తన్నుకొనిచస్తంటే చూడలేకపోయా, నోరు చేదన్నాడు, గొంతులో మంటన్నాడు… నా కళ్ళ ముందే సచ్చాడప్పా, వుంటే వాడితోనే వుండాలని నేనుకూడ బాయిలో దూకానుతల్లో, ఆడు నన్నేతుక్కుంటా వస్తాడు, కచ్చితంగా వత్తాడు” అని మంచం మీద అటు బోర్లి ఇటు బోర్లి అరుస్తూ ఏడుస్తూ వున్నా సుభాషిణి ని చూసి నాకు ఏడుపొచ్చింది.  “రేయ్ కుర్రపిల్లలందరూ ఇక్కడ్నుంచి ఎల్లండ్రా” అని మా అమ్మమ్మ పెద్దగ అరిసి “రేయ్ బుజ్జా నువ్వింటికి బో” అని నన్నక్కడనుంచి పంపించింది.

గుంపు లోంచి బయటకొచ్చిన నాకు అసలీ సుమలత ఎవురో, మందు తాగి సచ్చిపోయిందెవురో తెలుసు కోవాలని మనసు కుతకుతలాడింది.  వెంటనే మళ్ళీ గుంపులోకేల్లి “ఒయేయ్ అమ్మమ్మో మా యమ్మ పిలుస్తుందేయ్” అన్న సుభాషిణి వైపు చూడకుండా. “ నేను తర్వాతొస్తాననిజెప్పుపో” అంది సుభాషిణి తో మాట్లాడుతూ. “ తునకల కూరయ్యిందంటనే తినటానికి రమ్మంటంది” అన్న. “ ఈడొకడు , సరేనమ్మే ఇప్పుడేవస్తా, నేనోచ్చేలికే నువ్విక్కడుండగూడదు వుంటే నీకు పోలేరమ్మ గుడే గతి గుర్తుబెట్టుకో” అంటా నా ఎనకాలే మా ఇంటికొచ్చింది, మా అమ్మమ్మకి ఎండు తునకల కూర అంటే బలే ఇష్టం.

తునకల కూర తిందామని ఆశగా ఇంటికొచ్చిన అమ్మమ్మ రోట్లో మా అమ్మ నూరుతున్న చింతకాయ పచ్చడి చూసి “ఏందమ్మాయ్ ఈడేమో తునకల కూరన్జెప్పేడు నువ్వు జూస్తే పచ్చడి నూరతన్నావ్” అంది గుటకల మింగుతా. “ఊరికెనే జెప్పేన్లేయా లేకపోతే ఇంటికి రావని” అన్నాను నవ్వుతూ. “ఈడు సితనాబ్బట్టతల్లా” అంది కర్రతో కొట్టబోతూ. “అమ్మమ్మో అది సరేగానే సుభాషినేందే అట్టమాట్లాడతందా? నువ్వాపిల్లకి నాన్నమ్మవి కదా అయ్యేది నిన్ను బట్టుకొని అప్పా అంటందేంది” అన్నాను, మంచమ్మీద కూర్చున్న మా అమ్మమ్మ పక్కన కూర్చుంటూ. “అవునే ఏమయ్యిందే ఆ పిల్లకే” అంటా పళ్ళెంలో కూడేసుకొని వచ్చి అమ్మమ్మకి ఇస్తా అడిగింది మా అమ్మ.

“ నీకు ఆ బాయిలో దూకిన సుమలత గుర్తులేదంటమ్మాయ్”, “సుబ్బాబు కూతురు గదా” అంది మాయమ్మ, మా అమ్మమ్మ ప్రశ్నకి. “ఆ ఆనాసయితే ఈ పిల్లకి బట్టింది” అంది మా అమ్మమ్మ కూడు కలుపుకుంటా. “ ఎందుకు బాయిలో దూకిందా?” అడిగా ఆత్రంగా ఇంకొంచం దగ్గరకొస్తూ. “ ఏముంద్రా ఈ సెడిపోయింది సిగ్గు లేకుండా అన్న వరసయ్యే వాడితో తిరిగింది, ఎవురికి తెలియకుండా వుంటే ఎట్టుండేదో గాని ఊరంతా తెలిసిపోయే, అప్పుడైనా మానుకుందా? మొగుడుపెల్లల్లాగా సైకలెక్కి తిరగను, ఒంగోల్లో సినిమాలకి బోను, జమాయ్ జమాయ్ గా తిరిగేరు. ఇద్దెలిసి సుమలతోల్ల నాన్న పంచాయితీలో పెట్టేడు. నలుగురు పెద్దోళ్ళు చర్చీకాడ కూకోని ఇద్దరినీ పిలిచి, ఆమే మీరు చేస్తందేమి బాగాలేదు… ఇకిది కుదర్దబ్బాయ్, ఇంటి పరువు బయటేసుకోవద్దు అని బుద్ది చెప్పి రెండేలు వాడికి జులమానా ఏసి పంపించేరు. ఇద్దరికీ వేరే వేరే సంబందాలు చూసి పెల్లిచేసేరు. పెళ్ళయినాక ఈ లంజెంసేసిందీ దాని మొగుడుపనికి పొంగల్లోనే ఈడితోకులికేది, ఆ సెడిపోయిన్నబట్టన్నా, మెయ్ ఇది పద్ధతి కాదు అని చెప్పకూడదా! సిక్కిన్దిలే సందనుకొని వాడుగూడ ఈ పిల్లని ఆ చక్రయ్యగోరి తాటిచెట్ల దగ్గరికి పిలిచి, అక్కడ జామాయిల చెట్లల్లో ఇద్దరుకల్సి పడుకున్నారు” “నోర్మయ్యమో మంచి మాటలుచెప్తన్నవ్ పిల్లోడికే” అని మా యమ్మమ్మని కసురుకోంది మా అమ్మ మద్యలో దూరి. “అమో చెప్పనియ్యా, నువ్వు జెప్పే అమ్మమ్మా” అన్న మమ్మని ఇసుక్కుంటా, “ ఇంకేమున్దరా అది ఎవురో చూసి ఊరంతా టాం టాం సేసేరు, ఆ నాబట్ట తలయాడబెట్టుకోవాలో తెలియక పురుగులమందు తాగి సచ్చేడు, అది చూసి ఇదిగూడ మార్కొల్ల బాయిలో దూకి సచ్చింది” అంది చెయ్యికడుక్కొని పైట చెంగుకి తుడుచుకుంటా.

“అయినా ఆ పిల్లకి వాడు అన్నవుతాడనే అనే ఇషయం ముందుగానే తెలియదంటమా పాపం, వాడిగ్గోడ తెలియదంట, ఈ పిల్ల పని కోసం  దేశం పోయింది గదా అక్కడ కలిసేరంట ఇద్దరు, పనులయ్యిపోయాక ఈ పిల్ల మనూరోచ్చేసింది, వాడసలు ఈ ఊరికి రావడానికి కారణమే ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలనంట, అప్పుడు తెలిసిందంట ఇద్దరు అన్న సెల్లిల్ల వరస అవుతారని, పాపం వాళ్ళెం సేస్తారు అప్పుటికే జరగాల్సింది జరిగిపోయే, ముందే తెలిస్తే ఆ పిల్ల మాత్రం అట్టేందుకు చేసిద్ది, ఏందో లే ఈ పేమలు పాడుగాను ….. పాపం సక్కని పిల్లమా ముప్పైఏళ్ళు కూడా ఉండవ్ దానికి” అంది సుమలతని గుర్తు చేసుకుంటా మా అమ్మ.  “అంటే ఇపుడా పిల్ల సుభాషిణీ కాదు సుమలతన్నమాట” అన్న  ఇంత పొడుగునా గాలిపీలుస్తా.

“యమా అన్నాసెల్లెల్లు పెల్లిచేసుకోకూడదంటారు ఎందుకే” అన్న మమ్మతో, “అదేట్ట కుదిరిద్దిరా అట్టసేసుకోవడం తప్పుకదా”అంది. “నువ్వు చెప్పే అమ్మమా” అన్నా, “ఏమో నాకేం తెలుసు ఎందుకుచేసుకోకూడదో” అని  “ఈడు కూడా సెడునాబట్టే తల్లా”  అంది తలమీద పొడుస్తా  వాళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు కాకుండా వుంటే పెళ్లి చేసుకొని హాయిగా వుండేవాల్లె కదా అనిపించింది మనసులో నాకు.

       *       *       *       *       *       *       *    

సాయంత్రమయ్యింది, సమాధుల్లో చింతచెట్టు గాలికి ఓఓఓ…. అని ఊగుతుంది, పనుల్నుంచి ఇల్లకొచ్చినోల్లందరూ సుభాషినోళ్ళ ఇంటికి పోతన్నారు. సుభాషిణీని ఊళ్లోవున్న పోలేరమ్మ గుడికి తీసుకెల్తన్నారు, చర్చీ దగ్గరకొచ్చేసరికి నాలుగు కుక్కలు ఊరేగింపు ముందు తప్పెట్లు మోగిస్తున్నట్టు “అవ్ అవ్ బవ్ బవ్” మని ఆ గుంపు ని చూసి అరుస్తున్నై. “ నేనాడికి రానప్పో నన్నొదిలేయ్యమని సెప్పప్పో, ఓర్నాబట్టో యాడ చచ్చేవురో” అని సచ్చినోడి ముందు ముసలోల్లెడిసినట్టు అరుస్తుంది సుభాషిణి. నలుగురైదుగురు మొగోళ్ళు పొట్టుకున్న కూడా ఒక్క అడుగ్గూడ ముందుకేయించలేక పోతున్నారు. జనమంతా పెద్ద ఎడుకలాగా ఆ పిల్ల ఎనకాలనే పోతన్నారు నవ్వుకుంటూ తోసుకుంటూ.

సూర్యుడు పెద్దగా అవులించేడు, కొణిజేడు కొండల్లోపొనుకొని మేఘాల దుప్పటి మీదకి లాక్కున్నాడు. “ఆ నా సయితి ఇపుడల్లా వదల్దంమ్మాయ్ ఈ పిల్లని, పోలేరమ్మ గుడికి తీస్కెల్నా వదల్లేదంటే సూడు దాని పట్టు, దొంగనాసయితి కుర్రపిల్ల ఎదాన పడింది” అని దుప్పటి కప్పుకుంటా మా యమ్మ తో సెప్పింది మా యమ్మమ్మ. కప్పలు గురకల పెడతా నిద్రబోతున్నై, మిణుగురుపురుగులు ఊరికి కాపలా కాస్తున్నాయ్, గుడ్లగూబలు యాటకి బయల్దేరినై, నక్కలు చీకటికి జోల పాటలు పాడతన్నాయ్

       *       *       *       *       *       *       *   

పొద్దున్నే ఆదివారం, కొండయ్య దున్ననిగోసి కువ్వలు పెడతన్నాడు, కుర్రోలంత మూడురాళ్ళు పోయ్యిలాగా బెట్టి దాన్లో చిల్లకంపేసి మంటేసి పైన ఒక పెద్ద డేగిసా బెట్టి నల్లకాస్తున్నారు.  సుయ్ సుయ్ మని దోశలు పోస్తున్న శబ్దం రాయేలోలింట్లో. నిద్రలేసిన నానోరంతా చేదుగా వుంది, తొట్లో నీళ్ళు కొంచెం చేత్తో తీసుకొని నోట్లో పోసుకొని పుక్కిలిచ్చి ఊస. చేదు పోలా, గొంతులోమంట మొదలయ్యింది కాకరిచ్చి కల్లెని మూడు సార్లు పొయ్యిలో ఊస, మా అమ్మమ్మ నా వైపు వింతగా చూస్తుంది. నోరంతా పురుగులమందు కంపు కోడతంది, “మౌ సక్కెరుంటే ఇయ్యా నోరంతా సేదుగుందా” అని అడిగా మా అమ్మని, కత్తిపీట ముందు బెట్టుకొని మాంసాన్ని ముక్కలు ముక్కలు గా కోస్తా నా వైపు ఒకలాగా చూస్తంది మా అమ్మ. “ మేయ్… సుబాషినా యాడికిమేయ్, మోయ్ ఆగుమేయ్…., ఓకవలప్పో….. ఆ పిల్ల మీ ఇంటి వైపే వస్తందేయ్ ఆపిల్లని బట్టుకో ఆపిల్లని బట్టుకో” అని అరుస్తున్నాడు సుభాషినోల్లనాన్న. నా నోరంతా చేదు, పురుగులమందు కంపు, గొంతులోమంట.

“నా బట్ట నీకు సిగ్గెట్ట లేదురా! పిల్లోడొంట్లోదూరావ్, కొజ్జనాబట్ట ఇంకెవురూ దొరకలేదంట్రా? ఇద్దరూ మళ్ళి అన్నాసెల్లెల్ల ఒంట్లోనే దూరారు కదరా వాఇవరసల్లేని నా బట్ట, నీ మొదులార, నీ నాలక్కొయ్య, నీ కంట్లో కాకేరగా, నీ నోట్లో సాడుబొయ్యా” అని ఎర్రితిట్లు తిడతా, చీపురితో వీపుమీద బాదింది. కళ్ళుమూసుకున్నాను.

  *       *       *       *       *       *   

ఇండ్ల చంద్రశేఖర్

పచ్చాకు సీజను, దేహయాత్ర, కోటమామ కూతురు తదితర కథలతో తెలుగు సాహితి లోకానికి పరిచయం అయిన ఇండ్ల చంద్రశేఖర్ పుట్టిన వూరు ప్రకాశం జిల్లాలోని కందులూరు. నేను నాన్న బిర్యానీ అనే తొలికథతో ఇప్పటికీ 20 కథలకు పైగా అనేక పత్రికల్లో అతని కథలు  ప్రచురితం అయ్యాయి. పచ్చాకు సీజను, దేహయాత్ర కథలు తమిళంలోకి అనువాదం అయ్యాయి.  విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ఇతని కథలను “రంగులచీకటి” అనే పేరుతోటి ఒక కథల పుస్తకంగా తీసుకొచ్చారు. యెర్రగబ్బిలాల వేట అనే నవలను అన్వీక్షికి వారు పబ్లిష్ చేశారు.
నాటకరంగంలో M.A, M.Phil. , Ph.D. (Performing Arts (Drama)) చేసి డ్రామాలో MA గోల్డ్మెడల్, UGC రీసెర్చ్ ఫెల్లోషిప్ పొంది ఇప్పుడు  వృత్తి రీత్యా అఘాఖాన్ ఆకాడెమి లో డ్రామా టీచర్ గా పని చేస్తున్నాడు. అతని కథలకు డా. వి. చంద్రశేఖరావు కథా పురస్కారం – 2021, రా. వి. శాస్త్రి కథా పురస్కారం – 2022 లభించాయి. దినం అనే కథకు సాక్షి ఉగాది కథల పోటీల్లో నాలుగో బహుమతి లభించింది.
అంతేకాకుండా నాటకరంగంలో “ఒక రాజు కథ, మిస్ మీనా, అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి, స్లీపింగ్ సిండ్రెల్లా ఔర్ ఏక్ చొర్ కి కహానీ, చితనాపి లాంటి విజయవంతమైన నాటికలు రాశాడు. బొంబే టైలర్స్, విశ్వవిఖ్యాత ముక్కు, గోపాత్రుడు, వీర బొబ్బిలి, ఏడు తరాలు( రూట్స్) లాంటి కొన్ని కథలను నవలలను నాటకాలుగా మలచాడు.  కటకట దేశం తికమకరాజు నాటకానికి నంది బహుమతి, సెక్షన్ 302 నాటకానికి ఆకెల్లా నాటికల పోటీలు 2023 లో తృతీయ బహుమతి అందుకున్నాడు.  అతను దర్శకత్వం వహించిన నాటకాలను ఇక్క ఇవ్వబడిన లింక్ క్లిక్ చెయ్యడం ద్వారా చూడవచ్చు.  Phone : 9912416123
https://www.youtube.com/@indlachandrasekhar7143.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *