స్వీడన్ – నేరం – సంస్కరణ -2

Spread the love

డ్రగ్ అడిక్ట్ ముద్రపోవాలంటే.. 

డ్రగ్ అడిక్షన్ & రిహాబిలిటేషన్ సెంటర్ లు  

10వ తేదీ 

నాలుగో రోజు  మా బృందంతో పాటు రత్న, KRIS స్టాఫ్  అన్నేల్లి, యూహ డియోడర్సన్, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇవా మరియా   skydsvarnet  పురుషుల డ్రగ్ ఎడిక్షన్ & రిహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్ళాం.  ఇవా మరియా  కాలేజ్ లో సోషల్ సైన్సెస్ అధ్యాపకురాలు.  ఉత్తర భారతదేశంలో కుల వివక్ష గురించి ఆరు నెలలు ఉండి అధ్యయనం చేశానని చెప్పింది. 

బ్యోర్క

బ్యోర్క (Bjorka Behandilingssham) ఒక స్వచ్ఛంద సేవా సంస్థ.

  1910 లో ప్రారంభమైంది.   ఆ సంస్థ  డ్రగ్ ఎడిక్ట్స్ రిహాబిలిటేషన్ సెంటర్ నడుపుతోంది.  ఆ ఇన్సిస్టిట్యూట్  మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నేరాలు చేసి జైలు జీవితం అనుభవించి ఆ వ్యసనం నుంచి బయటకు రావాలనుకునే వారికి  ట్రీట్మెంట్ ఇస్తారు. జైళ్ళలో ఉండేవారి హక్కుల కోసం కూడా పనిచేస్తుంది ఈ సంస్థ.  

ఆ ఇన్సిస్టిట్యూట్ లోని శిక్షకుడు Mr. హెన్రిక్ అక్కడ  ట్రీట్ మెంట్ ప్రోగ్రాం వివరాలు చెప్పారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారిని అందులోంచి బయటకు తీసుకొచ్చి సభ్య సమాజంలో వారి కుటుంబంలో కలిసి పోవడానికి వారు ఉపయోగిస్తున్న 12 step ప్రోగ్రాం గురించి తెలిపారు.  మామూలుగా  ఈ చికిత్సా విధానం మూడు నెలల వ్యవధిలో ఉంటుంది. నేరస్త జీవితం గడిపిన వారిని చిన్న చిన్న గ్రూపులు గా విభజించారు. ఒక్కోగ్రూప్ లో 15 మంది లోపు ఉండే విధంగా చూస్తారు.  వారికి ప్రతి రోజూ ఒక గంట సేపు కౌన్సిలింగ్, చికిత్సలు ఉంటాయి . తర్వాత ఎవరికి వారికి వ్యక్తిగత చికిత్సలు ఉన్నాయి . అవి ఆయా వ్యక్తుల నేరస్థ జీవితం, నేరస్థ ఆలోచనలు మొదలైన వాటిని బట్టి ఉన్నాయి.  వ్యక్తిగత  చికిత్సలు  ఒక వారం పాటు కొనసాగుతాయి.  భవిష్యత్తులో వారి ఆలోచనలు నేరాల వైపు మళ్ళకుండా చేయడం చిన్న విషయం సామాన్య విషయం కాదు. ఆ ప్రయత్నం ఈ సంస్థ చేస్తోంది.   ఈ సంస్థలో చికిత్స తీసుకొనే ప్రతి ఒక్కరూ ఈ మూడు ప్రాథమిక రూల్స్ పాటించి తీరాలి. 

 అవి:

1. మాదక ద్రవ్యాలు వాడకూడదు 

2. నేరాలు చేయకూడదు 

3. హింసని ప్రోత్సహించకూడదు. భయపెట్టకూడదు 

అవసరాన్ని బట్టి కొందరికి ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు చికిత్స ఇస్తామని  Mr. హెన్రిక్ చెప్పారు.  మేం వెళ్ళినప్పుడు 23 మంది ఉన్నారు.  ఆ సంస్థ 23 మందికి చోటు ఇవ్వగలదు.  నెలలో ఒక రోజు వారిని తమ కుటుంబ సభ్యులు వస్తే  కలిసి మాట్లాడడానికి అనుమతిస్తారు.   స్టాక్ హోమ్ నగరంలోని వివిధ ప్రాంతాలకు సభలు , సమావేశాలకు వారంలో ఒక సారైనా తీసుకెల్తారు.  ఇక్కడికి వచ్చేవారంతా నేర చరిత్రతో జైలు జీవితం నుండి వచ్చిన వారు. వీళ్ళకు సమూహ కార్యక్రమాలలో పాల్గొనే విధంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా  సంస్థ ఉద్యోగులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.  

స్టాక్ హోమ్ నగరంలో చాల డి-అడికషన్ సెంటర్లు ఉన్నాయి.  బ్యోర్క సెంటర్లో డి-అడిక్షన్ కార్యక్రమాలు 1968లో ప్రారంభం అయ్యాయి.  2000 సంవత్సరం నుంచి 12 స్టెప్ ప్రోగ్రాం ప్రారంభం అయింది.  ఇది అమెరికన్ ప్రోగ్రాం అని హెన్రిక్ చెప్పారు

ఒకప్పుడు స్త్రీలు, పురుషులు ఇద్దరికీ ఇక్కడే చికిత్సలు జరిగేవని అన్నేల్లి చెప్పింది.  తాను కూడా ఈ సెంటర్ లోనే చికిత్స తీసుకున్నట్లు తెలిపింది .  జైల్లో మంచి నడవడితో ఉండి, కష్టపడి పని చేస్తున్న వారికి శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత బయటికి వస్తే మళ్లీ మాదకద్రవ్యాలకు అలవాటు పడే అవకాశం ఎక్కువ . అందుకనే,  ఆ జీవితం వద్దు అనుకునే వారు చికిత్స కోసం జైల్లో ఉన్నప్పుడే జైలు ద్వారానే దరఖాస్తు చేసునే ఏర్పాటు ఉంది .  

పిల్లలు, మహిళల కోసం ప్రత్యేకంగా డి -అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి.  మహిళల కోసం 2004 లో ప్రారంభమయింది.  

నేరాలు చేసే వారిలో ఎక్కువ మంది పేదలు.  కొద్ది మంది బాగా ఉన్న కుటుంబాల వారు కూడా నేరస్తులుగా ఉన్నారు.  స్వీడన్ లో నేరస్తులు అంటే వారు మత్తు పదార్ధాలకో, మాదక ద్రవ్యాలకో అలవాటు పడి వాటి కోసం దొంగతనాలు చేయడం, దోపిడీలు చేయడం, హింసకు పాల్పడడం వంటివి చేస్తున్నారు.  జైలు జీవితం అనుభవించి బయటికి వచ్చాక వారిపై పడిన ముద్ర వారికి పని ఇవ్వదు. చాలా సమస్యలలోకి నెట్టివేస్తుంది.  అవి భరించలేక మళ్లీ ఆ నేరస్థ జీవితంలోకి నేట్టివేయబడుతున్నారు.  అలాంటి వారికి KRIS జీవితం పట్ల ఆశను పెంచుతూ జైలుకి వెళ్లి ఖైదీలకు క్లాసులు తీసుకుంటుంది.   3 నెలల పాటు కారాగారం  జీతం ఇస్తుంది.  స్వీడిష్ సాంఘిక సంక్షేమ శాఖ కావలసిన సహకారం, క్లాసులు ఇస్తుంది.   చికిత్స తీసుకునే వారిలో ఎక్కువ మంది 20 నుండి 40 ఏళ్ల మధ్యవయస్కులే.  వారి జీవితం మీద వారికి బాధ్యత రావడం కోసం వారి దృష్టి మళ్ళిస్తూ వారి వారి ఇష్టాలను బట్టి రకరకాల కార్యక్రమాలు అందుబాటులోకి తెచ్చారు.  చదువు, ఆటలు, వినోదం మొదలైనవి

చికిత్స పూర్తి చేసుకొని బయటకు వెళ్ళిన వారిలో దాదాపు 30 శాతం మంది తిరిగి వస్తున్నారని, అందుకు కారణం కుటుంబం వారిని అంగీకరించక పోవడమేనన్నాడు హెన్రిక్.  కుటుంబం వారిని అంగీకరించడానికి నాలుగైదు సంవత్సరాలు పడుతుందని తెలిపారు.  ప్రభుత్వం వారికి సగం జీతం ఇస్తుంది .  

నేరస్థ జీవిత చరిత్ర కలిగిన వారికి , శిక్ష అనుభవించి బయటికి వచ్చిన తర్వాత పాస్పోర్ట్, వీసా ప్రపంచంలో  ఏ దేశం లోనూ ఇవ్వరు.  కానీ  స్వీడన్ లో కొంతకాలం పరీక్షించిన తర్వాత పరిశీలించిన తర్వాత పాస్పోర్ట్ , వీసా ఇవ్వొచ్చు అంటాయి స్వీడిష్ చట్టాలు.  ఇలాంటి వారికి పాస్ పోర్ట్ / వీసా ఇవ్వాలన్నా, ఉద్యోగం ఇవ్వాలన్నా ప్రజాభిప్రాయం సేకరిస్తారు.  అదే విధంగా మీడియా అభిప్రాయం తీసుకుంటారు.  

ఆ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాతే 2005లో అన్నేల్లి, యుహ లు భారత పర్యటనకి వచ్చారు, ఇక్కడి జైళ్ళు, నేరస్థుల సంస్కరణ కార్యక్రమాలు చూడటం కోసం. 

బ్యోర్కా లో ఉన్న 23 రూములు ఎంతో చక్కగా ఉన్నాయి.  వారి వసతులు స్టార్ హోటల్ ను తలపిస్తూ . కొందరి దగ్గర లాప్ టాప్ లు కుడా ఉన్నాయ్.  ప్రతి రూం లో టెలివిజన్ ఉంది.  చక్కటి బెడ్ పరుపు, దిండు దుప్పట్లతో  

మాజీ నేరస్థుల లేదా సంస్కరించబడిన నేరస్థుల రక్షణ కోసం, వారిలో మార్పు కోసం ప్రత్యేక పథకాలు అమలు పరుస్తోంది అక్కడి ప్రభుత్వం.  మల్టి మీడియా టీచింగ్ ఎయిడ్స్ ఉన్నాయి 

 దాదాపు    స్వీడిష్ విధానంలో   మాదకద్రవ్యాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడే వారితో ఎలా డీల్ చేస్తుందో  తెలుసుకున్నాం.  పూర్తి ఎయిర్ కండిషన్ ఉన్న భవనాలలో వార్తా [పత్రికలు, టెలివిజన్ , ఇంటర్నెట్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి.  

మహిళల రిహాబిలిటేషన్ సెంటర్

అదే రోజు మధ్యాహ్నం స్తేన్బిగిర్డ్ లో ఉన్న  మహిళల రిహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్ళాం.  అది ఎక్కడో పొలాల్లో కొండల దగ్గర ఉన్నట్లుగా ఉంది. చలి గాలులు వీస్తూ .. .  ఈ సెంటర్ 2004 లో ప్రారంభమయింది.  

అక్కడున్న మహిళల్ని కలిశాం .  ఇండియా నుండి వచ్చామని చెప్పగానే కెరిన్ పియా  అనే ఒకావిడ వచ్చి తనను తాను పరిచయం చేసుకుంది.  తను 1983లో ఎయిర్ హోస్టెస్ గా ఇండియా వచ్చానని, యోగ, మెడిటేషన్ నేర్చుకోవాలనుకున్నానని చెప్పింది. కానీ ,   ఢిల్లీలో  డ్రగ్స్ కోసం తన పాస్పోర్ట్ అమ్మేసుకున్నానని, ఆరు నెలల తర్వాత ప్రభుత్వ జోక్యం చేసుకోవడం వల్ల తిరిగి తమ దేశం చేరుకున్నానని అంది. ఆ తర్వాత క్లబ్ డాన్సర్ గా పని చెసాను.  మూడు సంవత్సరాలు సోషల్ వర్క్ చదువుకున్నని, చైనా నుంచి ఆక్యుపంచర్ నేర్చుకున్న తెలిపింది   బెట్రిస్  గోవాబీచ్ లలో సన్ బాత్ చాలా ఇష్టపడే దాన్నని, అక్కడ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డానని, రెండుసార్లు జైలు జీవితం అనుభవించి మారాలన్న ఉద్దేశంతో ఈ సెంటర్లో చేరానని  చెప్పింది.   మరోకావిడ రెండేళ్ళ క్రితం ఇండియా వచ్చి ఆగ్రా , డిల్లీ, జైపూర్ చూశానని చెప్పింది. అక్కడ ఉన్న వారి నేరాలు  అన్నీ డ్రగ్స్ అమ్ముతునో, డ్రగ్స్ కోసం దొంగ తనం చేసో, డ్రగ్స్ కోసం హింసకు పాల్పడం వాళ్ళ జరిగినవే.  ముగ్గురు కౌన్సిలర్లు , ఇద్దరు సోషల్ వర్కర్లు ఉన్నారు. పాతిక మంది మహిళలు ఉన్నారక్కడ.  అంతా మాదక ద్రవ్యాల మత్తు నుండి బయట పడాలని అనుకుంటున్నామని చెప్పారు.  మేం జైలులో ఉన్నప్పుడు KRIS కార్యకర్తలు పదే పదే మా దగ్గరకు వచ్చి ఆ అలవాటు నుండి బయట పడి సాధారణ జీవితం, గౌరవ ప్రదమైన జీవితం కుటుంబంతో కలిసి జీవించడం గురించి చెప్పేవారనీ, మేం మా అలవాటును మానుకోవాలని బలంగా కోరుకుంటే చికిత్స చేయించుకోవడానికి డి -అడిక్షన్ సెంటర్లు స్టాక్ హొమ్ లో చాలా ఉన్నాయని మాకు  చెప్పారు.  అందుకే మేం ఈ సెంటర్ లో చేరామని చెప్పారు.  

  ఆ చెప్పడం మరిచాను. 10 వ తేదిన  మేం మహిళల ట్రీట్మెంట్ సెంటర్ కి వెళ్ళగానే అక్కడి కార్యకర్తలు  మమల్ని ఆహ్వానించి పోనీ ఫార్మ్ లోకి వెళ్దాం అని తీసుకెళ్ళారు. అది గుర్రపు పిల్లకి ఆహారం అందించే సమయమట.  అక్కడ ఉన్న గుర్రపు పిల్లలకు ఆహారం అందించి వద్దాం రండి, రెండు ఫర్లాంగులు కూడా ఉండదు  అంటూ ఫారం కేసి నడక మొదలు పెట్టారు.    వాళ్ళ చేతిలో నిండుగా ఉన్న పేపర్ బాగ్స్.   చల్లటి గాలి ఈడ్చి కొడుతున్నట్లుగా .  మూడో నాలుగో డిగ్రీల టెంపరేచర్ ఉంది ఉండొచ్చు.  నిండా కోట్, తలకు మఫ్లర్, లోపల థర్మల్ వేర్ ఉన్నా చలి గజ గజా వణికిస్తూ.. అలాగే వాళ్ళతో నడక సన్నని కాలి బాటలో .   గుర్రం పిల్లలకి ఏ దాణానో పెడతారనుకున్నా.  కానీ,  వెళ్ళాక అర్థమైంది వాళ్ళు మోసుకొచ్చింది యాపిల్ పళ్ళని.  తెలుపు , లేత ఆకుపచ్చ ఆపిల్ పళ్ళు తీసి వాటికి అందిస్తున్నారు.  మాకూ అందించమని  చేతిలో పెట్టారు. మన గుట్టలమ్మట, గుట్టకింద పచ్చికలో మేత మేసే గేదెలు, ఆవులు, మేకలు తిరుగుతుంటాయి కదా అలాగే ఆ గుర్రం పిల్లలూ మేత మేస్తూ.  అవి బయటికి పోకుండా ఆ చేను చుట్టూ ఇనుప తీగతో చేసిన ముళ్ళ కంచె.    మనం ఎంతో ఖరీదు పెట్టి కొనే ఆపిల్ పళ్ళు వాటికి పెట్టడం చూసి  ఆశ్చర్యంలో నేను  .. అదే అడిగేశా, పోనీ నోట్లో వాళ్ళిచ్చిన యాపిల్ పెడుతూ. అది ఎక్కడ వేళ్ళు కోరుకుతోందో, చేయి కోరుకుతుందో నన్న భయంతో మేం అందించిన పళ్ళు సగం కిందే పడిపోయాయి.  వాళ్లిచ్చినవి ఎంచక్కా వాటి నోట్లోకి పోయాయి.  

సేపు అని పిలుచుకునే ఆపిల్ తినాలనే కోరిక తీర్చుకోవడం కోసం జ్వరం తెచ్చుకున్న మా బాలసేవా సంఘం పిల్లవాడు ఆ క్షణం నా కళ్ళముందు మెదిలాడు. జ్వరం తెచ్చుకున్న  అతని కోరిక తీర్చలేక పోయింది అతని కుటుంబం. 

అటునుండి చుట్టూ పరికిస్తూ తిరిగి వాళ్ళ ఆఫీస్ దగ్గరకి చేరాం.  ఆ ఈదురు గాలి కాస్త తగ్గిందో లేక నేను అలవాటు పడ్డానో గానీ ఫర్వాలేదు. అంత ఇబ్బంది అనిపించలేదు.  ఆఫీస్ పెరటి వైపు నా దృష్టి పడింది.  

అంతకు ముందు వెళ్ళేటప్పుడు నేను గమనించలేదు కానీ  కాంపస్ లో చాలా ఆపిల్ చెట్లు ఉన్నాయి.  మన రేగు చెట్ల కింద పండ్లు పండి రాలిపోతాయి చూడండి అదే విధంగా యాపిల్స్ కింద పరుచుకొని ఎర్రటి ఎరుపు రంగులో .. చెట్టుమీద పచ్చటి ఆకుల మధ్య ఎరుపు, గులాబీ, లేత ఎరుపు, తెలుపు, లేత ఆకుపచ్చ రంగుల్లో .. .

స్వీడెన్ లో ఆపిల్ చెట్లు రోడ్ల పక్కన ఉంటాయనీ అవి కాసి, పండి రాలి పోతాయనీ వాటిని ఎవరూ తీసుకోరని మా రాకకు ముందే విని ఉన్నా.  నిజానికి యాపిల్ చెట్టుని గతంలో నేనెప్పుడూ చూడలేదు.  ఆ అవకాశం  రాలేదు.  అందుకే ఏ చెట్టు చూసినా యాపిల్ చెట్టేమో.. పళ్ళు రాలి పడ్డాయేమో అని నా కళ్ళు వెతుకుతూ ఉండేవి.  నా వెతుకులాట ఫలితం ఇక్కడ కనిపించింది

అవి చూడగానే ఒక్క ఉదుటున అక్కడికి పరుగెత్తా.  మామిడి చెట్లలాగా ఎదిగిన యాపిల్ చెట్లపై పళ్ళు నన్ను ఊరిస్తుంటే  నేను ఆగలేక పోయాను.  ఇది కావాలని ఎవరినీ అంత త్వరగా అడగని నేను, మొహమాట పడే నేను  ఒకటి తీసుకోవచ్చా అని అడిగేశా.  అందుకు వాళ్ళు నవ్వి కింద పడినవి అసలు మేం వాడం.  మీకు ఎన్ని కావాలంటే అన్ని చెట్టు నుండి కోసుకోండి అన్నారు. గబా గబా వెళ్లి చెట్టు నుండి రెండు చేతులతో రెండు ఆపిల్స్ కోసి ఒకటి కోరికేసా.. అబ్బ ! ఆ  రుచి గురించి మాటల్లో ఏమని చెప్పను ? అంత రుచిగా ఉన్నాయవి. రెండోదాన్ని కోటు జేబులో వేశా.  అది చూసి రత్న , అన్నేల్లి, యూహ ఇంకా అక్కడి కార్యకర్తలు నవ్వుల జల్లు కురిపిస్తూ.

మీకు ఎన్ని కావాలంటే అన్ని కోసుకోవచ్చు అని చెప్పారు కార్యకర్తలు. మేం కొన్ని పళ్ళు కోసుకుని తీసుకువెళ్లాం.  వాటితో రత్న యాపిల్ పై అనే స్వీట్ చేసి పెట్టింది ఇంటికి వెళ్ళాక.  ఎప్పుడు యాపిల్ చూసినా ఆ సంఘటన గుర్తొస్తుంది.  

వాళ్ళతో మా మాటలు సాగుతుండగా ఒకరు అందరికీ టీ సర్వ్ చేసారు.  నాకు టీ అలవాటు లేదు.  అందుకే వద్దన్నాను.  ఇది మేం ఇండియా నుండి తెప్పించుకున్న 

జైపూర్ టీ అన్నారు.  ఆ టీ ప్యాకెట్ కూడా తీసుకొచ్చి చూపారు.  దాని మీద పాక్ డ్  ఇన్ లండన్ అని ఉంది.  నిజానికి జైపూర్ లో టీ తోటలు లేవు.  కానీ, జైపూర్ అంటే విదేశీయులకు ఉన్న మోజును  తయారీదారులు మార్కెట్ చేసుకుంటున్నారు.    

రోజు ఉదయం నుండి మేమంతా చాలా బిజీగా ఉన్నాం. స్టాక్ హోం నగరం లోని బ్యోర్కా (Bjorka Behandlingsham ), Stenby Gird లలో మాదకద్రవ్యాలకు అలవాటు పడి నేరాలు చేసి జైలుకు వచ్చిన వారికి ఇచ్చే చికిత్సలు, ఆ జైళ్ళలో ఉండేవారి హక్కులు ఏమిటో తెలుసుకొని తిరుగు ప్రయాణం అయ్యాం KRIS బృందం Juha Deoderson, Annelli, Eva Maria లతో పాటు స్టాక్ హోం లోనే ఉంటున్న రత్న (లవణంగారి మానస పుత్రిక ) ఇక్కడ నుండి వెళ్ళిన లవణం గారు , సుందర్ , నేను.  

మేం అప్పటివరకూ వెళ్లిన ప్రాంతాలన్నీ సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉన్నాయి. అంతా అలసిపోయి త్వరగా బసకు చేరాలని అనుకుంటున్నా సమయంలో మేం ప్రయాణిస్తున్న వాహనం పార్కింగ్ లో ఆపి ఇప్పుడే వస్తానంటూ యూహ పరుగు పరుగున వెళ్ళాడు.  ఎందుకో మాకెవ్వరికీ అర్థం కాలేదు.  నిమిషాలు గడుస్తున్నాయి. అతను రాలేదు.  దాదాపు 20 నిమిషాల తర్వాత చేతిలో పెద్ద బ్యాగ్ తో వచ్చాడు. 

అంత సేపు ఎదురుచూసేలా చేసినందుకు క్షమాపణలు చెప్పాడు.  మా వాహనం కదిలాక తాను ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పింది విన్నాక అప్పటి వరకు ఉన్న అసహనం అందరిలో మాయం అయింది. అతను అప్పుడు వెళ్లకపోతే, కాస్త ఆలస్యం అయితే ఆ పూట ఎంతో మంది ఆకలితో పస్తు ఉండాల్సి వచ్చేది. 

అసలు విషయం ఏంటంటే అక్కడ హోటళ్లు అన్నీ సాయంత్రం 6 గంటలకు మూసేస్తారు.  ఆ లోపు వెళితే ఆ రోజు మిగిలిపోయిన ఆహారం తీసుకోవచ్చు. లేదంటే అది వృధా అయిపోతుంది. అందుకే ప్రతి రోజూ ఆ సమయానికి రెండు మూడు హోటళ్లలో మిగిలిన ఆహారం సేకరించి పేదలకు అందిస్తాడు యూహ.  ఆ విధంగా పేదల కడుపు నింపుతున్న యూహా అంటే గౌరవం రెట్టింపు అయింది.  యూహా జైలు జీవితం నుండి బయటి ప్రపంచంలోకి వచ్చి KRIS లో చేరిన తర్వాత ఇలా తనకు తోచిన సేవచేస్తున్నాడని అన్నేల్లి చెప్పింది.  యూహ మానవత్వానికి హ్యాట్సాఫ్ చెప్పి ముందుకు సాగాము. 

గతంలో నాకు తెలిసింది చాలా చాలా తక్కువ. అదంతా ఓ కొత్త ప్రపంచం. కొత్త దేశం, ప్రజలు, సంస్కృతి ఆచార వ్యవహారాలన్నీ వేరు వేరు. వారి సామాజిక జీవితం వేరు. అలవాట్లు వేరు.  మాదకద్రవ్యాలు మనిషిని ఎంత లొంగదీసుకుంటాయో జీవితాన్ని ఎంత అస్తవ్యస్తం జేస్తాయో తెలుసుకున్నాను. ఆ ఊబిలోంచి బయటపడాలని తాపత్రయ పడుతూనే మళ్ళీ ఊబిలోకి జారిపోయే వారి గురించి వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాను. 

డ్రగ్ ఎడిక్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే  ఆ ఉదయం చూసిన వ్యక్తులే నా కళ్ళ ముందు.. వారి మాటలే నా చెవుల్లో .. అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నా. 

వి. శాంతి ప్రబోధ 

వి. శాంతి ప్రబోధ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *