డాక్టర్ ముఅజ్జం సాహబ్!

Spread the love

ముకర్రమీ ముఅజ్జమీ బగరామీ ఖిద్మత్ హజరత్

డాక్టర్ ముఅజ్జం సాహబ్*!

అల్లాహు యస్తఫీ మినల్ మలాయికతి రుసులన్ మినన్నాసి, ఇన్నల్లాహ సమీఉన్ బసీర్

“Allah chooses messengers from among the angels and from among the people; surely Allah is All-Hearing, All-Seeing.”

Quran 22:75

**        **

గాలికసురుల ఇసుక మేట 
మగతై మేను పూడ్చినప్పుడు

నిట్టూర్పుల కొలిమి సెగ
నలికిరి చీలిక నాలుకై పొలుసుల పొడ ఊదినప్పుడు

నిదానమూ కాని
నివారణా లేని గోరోజనమయ్యింది
నా దేహం!

మొండి బండ నెర్రెలు… ఎండు నేల బీటలు
ధమనుల్లోకి దారితప్పినప్పుడు

వెయ్యి ఎడారుల ఎద్దడి కమ్మి
వెన్నుపూసల మెట్లొక్కొక్కటే విరిగిపోతున్నప్పుడు

ఇన్నల్లాహ్ యుగస్మృతుల పీర్లగుండం కుమ్ములో
రగిలే రాకాసికణమయ్యింది
నా ప్రాణం.

** **

అడుగో కొండి… కోర... కొమ్ముల అతను
నా ఉసురుని ముసిరిన సైతాను
అతడే జహన్నుమ్ జనన జ్వాలల ఇబ్లీస్!

రౌద్ర రౌరవ కీలలా
వాడు నా శ్వాసని కమ్మినప్పుడు
స్వస్థతల సాంత్వన రాగమయ్యింది నీ మంద్రస్వరం.
“అలిహందులిల్లాహి రబ్బుల్ ఆలమీన్…”
" బిస్మిల్లా హిర్రహ్మాన్ నిర్రహీమ్… "

నిమిత్తమాత్రుడ్ని అని కదా నీ నమాజు
అవును… కాదు కావొచ్చు ఇస్రాఫీల్!
అల్లా ఎంచుకున్న దూత నువ్వు

నీ ఖురాన్ కారుణ్య స్తోత్రాలు
మంచుపూలై కురిశాయి
భవరోగ వైద్యాలు
మంచి ముత్యాలసరం కంట జార్చాయి

వెయ్యిసూదుల దిష్టి
నాపై దిగదుడిచిన ఈకలదట్టి నువ్వు

నీ రుఖయా దువా
నోస్టాల్జిక్ సాయిబు సాంబ్రాణి ధూపమయ్యింది
ధిక్ర్ దీవెనల తాటింపు
నల్లతావీజు తాడై నా తోడయ్యింది
** **

దారి చూపావా
చూపు నిచ్చావా
మసీదు గోడ గొలుసుబొమ్మల్లో
బొగ్గుగీతల ‘ఛూ’ మంత్రమయ్యావా
ఓ నా ఇస్రాఫీల్!
సూఫీ ఆత్మల శుభ్రవేదనల్లో
దర్గా దర్శనాల దయవయ్యావా!
** ** **

**      **      **

నరేష్ నున్నా

* డాక్టర్ ఎస్.డి. డాక్టర్ ముఅజ్జం, జనరల్ ఫిజిషియన్, కిమ్స్సన్ షైన్ గచ్చిబౌలి.

నరేష్ నున్నా

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *