మూల్యామూల్యాలు!

Spread the love

కోర్టులో కేసు పెట్టారు!

ఎవరిమీద?

కోర్టు మీద!

ఆ?

ఔను, కోర్టు మీద కోర్టులో కేసు వెయ్యడమే యీ కేసు విశేషం!

బాగుంది!

ఏం బాగుంది?, కోర్టులో జడ్జిగారు కళ్ళుతిరిగి పడిపోతేను?!

నాకేం అర్థం కావడం లేదు?

నీకూ నాకే కాదు, యెవరికీ యేమీ అర్థం కావడం లేదు!

అసలేం జరిగింది?

*********

“సైలెన్స్”

జడ్జిగారు తీర్పు చదివి వినిపించారు!

“వాదోపవాదాలు విన్నమీదట… చేసిన నేరం రుజువయినందున… నాలుగేళ్ళ జైలూ పదివేల రూపాయల జరిమానా విధించడమైనది!”

“……………………………..”

“పదివేల జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైల్లో వుండాలి!”

జడ్జిగారు మాట్లాడక ముందువరకూ నిందితుడిగా వుండి, మాట్లాడాక అప్పటికప్పుడు నేరస్తుడిగా మారిన పెద్దమనిషి అయోమయంగా చూశాడు.

“పదివేలు కడతావా?”

“కట్టకపోతే?”

“కట్టకపోతేనా? కట్టలేకపోతేనా? హు… యేదైనా వొకటే. పదివేలయినా వొకటే ఆర్నెల్లు అయినా వొకటే”

పెద్దమనుషులు సాధారణంగా డబ్బులు కట్టేస్తారు. డబ్బులు లేనివాళ్ళు, కట్టలేనివాళ్ళు విధించిన శిక్ష అనుభవిస్తూ జైల్లోనే మగ్గి అంతా విధి అనుకుంటారు. తలరాత అనుకుంటారు. తప్పితే జడ్జిగారి రాతని అస్సలు అనుకోరు. అలా అనుకున్న యీ పెద్దమనిషి దగ్గాడు. అంటే గొంతు సవరించుకున్నాడు.

“అంటే పదివేలు కట్టేస్తే, ఆర్నెల్లు రద్దు చేస్తారా?”

“అదే కదయ్యా చెప్పింది?”

“డబ్బు కట్టేస్తాం సార్…”

“ఓకే”

“మొత్తం కట్టెయ్యొచ్చు కద్సార్?”

“మొత్తం కాకపోతే వాయిదాల్లో కడతావా? ఈఎమ్ఐల్లో కడతావా?”

కసురుకున్నా సరే నవ్వు ముఖంపెట్టి, కాగితం కలం అడిగి నిలబడే గబగబా లెక్కలు వేసుకున్నాడు పెద్దమనిషి. నిజానికి నోటితోనే లెక్కకట్టేసినట్టున్నాడు. మొదట కొంత దిగులు ఆ ముఖంలో కనిపించినా లెక్క తేలాక తెరిపినపడ్డట్టు హుషారు వచ్చింది. తన వాళ్ళవంక చూసి డబ్బు తీసుకురమ్మన్నట్టు సౌజ్ఞగా తలాడించాడు. నల్ల తోలుబ్యాగులో డబ్బుతెచ్చిన తనవాళ్ళతో చెవిలో యేదో గుసగుసలాడాడు. డబ్బు యెక్కడ కట్టాలో లాయరు చెప్పాడు. వెన్నంటే పోలీసులు. వాళ్ళవంక వొక చూపు చూశాడు. కట్టేదాక ఆగండి అన్నట్టు.

“ఇదేంటి యింత డబ్బు యిచ్చారు?”

“మొత్తం కట్టేస్తున్నాం సార్”

“మీరు కట్టాల్సింది పదివేలే”

“లేదు, నేను తొంభైవేలూ కట్టేస్తాను”

“ఎందుకు?”

“మొత్తం కట్టేసి యింటికెళిపోతాను, నాకీ జట్టీ వద్దు”

కేసు మళ్ళీ జడ్జిగారి ముందుకు వెళ్ళింది. అంతకన్నా ముందు పోలీసులు చెప్పారు. ‘ఇంతడబ్బు యిస్తావంటే కేసూ కోర్టులూ యెందుకసలు?’ అని వో పోలీసయితే గొణుక్కున్నాడు. లేదు, తెగ గింజుకున్నాడు. అలాగే పోలీసుల తర్వాత లాయర్లూ చెప్పారు. ‘ఇంతడబ్బు పెడతావంటే మంచి లాయర్నే పెట్టుకుందువు కదా?’ అని వో లాయరు గొణుక్కున్నాడు. లేదు, తెగ గింజుకున్నాడు. ముందే చెప్పివుంటే బావుణ్ణని, కథని వేరేలా నడిపించేవాళ్ళమని వారూ వీరూ కలిసి బాధపడ్డారు.

ఉన్న కేసులు వాయిదా వేసాక జడ్జిగారు విసుక్కుంటూ యీ కేసులోకి వచ్చారు.

“ఊ… చెప్పండి”

“నేను మొత్తం డబ్బు కట్టేస్తానంటే వొప్పుకోవడంలేదు సార్”

“తొంభైవేలు కడతానని అంటున్నాడు సార్”

జడ్జిగారు అర్థంకానట్టు చూశారు. నేరస్తుడైన పెద్దమనిషి జడ్జిగారి గౌరవానికి యే విధమైన లోటు రానివ్వకుండా నిలువెత్తుమనిషి కూడా గూని వచ్చినట్టు ఆరడుగులమనిషి వెన్నువంచి అయిదడుగుల మనిషై వినయంగా చేతులు జోడించి నిలబడ్డాడు.

“నీకు డబ్బులెక్కువయ్యాయా?”

“డబ్బు కంటే కాలం యెక్కువ విలువైంది కద్సార్?!”

వినీ వినిపించనట్టు అన్నాక, ‘జైలు బయటవుంటే అంతకు నాలుగింతలు సంపాదించుకోవచ్చు యేదో వొకటి చేసి’ అని అనుకున్నాడు పెద్దమనిషి. ఆ మాట పైకి అనలేకపోయాడు.

జడ్జిగారు నిట్టూర్చారు.

“హు… సరే, కట్టేస్తున్నావా?”

“మొత్తం పదివేలు కాదు తొంభైవేలూ కట్టేస్తున్నాను సార్, డిస్కౌంట్ కూడా అడగలేదు, లెక్కంటే లెక్కే”

“అదేం లెక్క?”

జడ్జిగారే కాదు, లాయర్లూ పోలీసులూ కోర్టు సిబ్బందీ వేరే కేసుల్లో హాజరైనవారూ అందరూ ఆగి చూశారు. లెక్క చెప్పేలోపల నిశ్శబ్దం చోటు చేసుకుంది. దాంతో చెప్పేది వినడానికి మరింత ౘవులూరినట్టయింది.

“ఆర్నెల్లకి పదివేలు అయినప్పుడు యేడాదికి యిరవై వేలు. నాలుగేళ్ళకి నాలుగు యిరవైల యెనభైవేలు. ఆరు నెలలది పదివేలు యెలానూ వుంది. మొత్తం తొంభైవేలు”

జడ్జీతో సహా అంతా కొయ్యబారి చూశారు. పిచ్చివాణ్ణి చూసినట్టు చూశారు.

“నాలెక్కా మీలెక్కా వొకటే”

ఇందులో విచిత్రం యేమీ లేదన్నట్టు చూశాడు పెద్దమనిషి.

“అది జరిమానా”

అంతకన్నా యేమి చెప్పాలో తెలీలేదు జడ్జిగారికి సాయపడ్డ లాయరుకి.

“తప్పు కట్టడం అనేది మన చిన్నప్పటి నుండీ సాంప్రదాయంగా వస్తోంది. కులపంచాయితీల్లోనైనా కోర్టుల్లోనైనా యెక్కడైనా అదే రివాజు”

“అంటే డబ్బుతో అన్నీ సాధ్యమని అనుకుంటున్నావా?”

“ఎందుక్కాదు?”

“ఎందుకవుతుంది?”

“మీరు ‘లా’లు యెన్నైనా తియ్యొచ్చు. డబ్బుతో యేది కాదో చెప్పండి. రెండు యాభైవేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తులు కడితే బెయిల్ యిచ్చారు కదా?”

“అది వేరు యిది వేరు”

“డబ్బు కట్టకపోతే బెయిల్ యిచ్చేవారు కాదు కదా?”

“అది హామీకి సంబంధించింది, నమ్మకానికి సంబంధించింది”

“హామీకి సమానమైనది డబ్బే! నమ్మకానికి సమానమైనది డబ్బే! డబ్బు యివ్వకుండా వొత్తి హామీ యిచ్చి నమ్మకంగా మేముంటాము అని దేవుడిమీద ప్రమాణం చేసి చెప్తే మాత్రం ఆ జామీను మీరు వొప్పుకుంటారా?”

“నువ్వు లా చదవాల్సింది”

“ఎందుకండీ మీకు పోటీ?”

నవ్వులు.

“కోర్టులో డబ్బుకీ న్యాయానికీ సంబంధం లేదు”

“ఎందుకు లేదూ? యిప్పుడు బాగా డబ్బుపెట్టి మంచి లాయర్ని పెట్టుకుంటే న్యాయం మారిపోవచ్చు కదా? శిక్ష తగ్గిపోవచ్చు కదా? అసలు కేసే కొట్టేయొచ్చు కదా? ఏ పోలీసులకో లాయర్లకో పోయేడబ్బు యిలా ప్రభుత్వానికి పెనాల్టీగా వెళ్తే ఆదాయపరంగా మంచిదే కదా? కాదా?”

“నువ్వేం మాట్లాడుతున్నావ్?”

“నేనేం నా లెక్క చెప్పడం లేదు, మీరు పదివేలా ఆర్నెల్లా అని అడిగారు కదా? ఆ లెక్కనే…”

“నీకెలా చెప్పాలో తెలీడం లేదు”

“నాకూ అలగే వుందండీ”

పెద్దమనిషి గొణుక్కోవడం చూసి జడ్జిగారి నుండి బెంచి గుమస్తా దాక అందరూ పెద్ద వూపిర్లు వదిలారు.

పెద్దమనిషి మాత్రం వొళ్ళంతా వొద్దిక చూపిస్తూ మాటతప్ప వూపిరికూడా గట్టిగా తీసుకోకుండా వినయంగా నిలబడ్డాడు.

“ఫర్ సపోజ్… నేను నేరం చెయ్యలేదు అనుకోండి”

“రుజువయ్యింది కదా?”

“అనుకుంటే అరిగిపోతారేటండీ? పోలీసులు డబ్బులు తీసుకొనో కోకో రుజువులు బలంగా పెట్టలేదనుకోండి, అప్పుడు నేను నిర్దోషిని. నేరం చేయ్యనట్టే”

“అయితే?”

“మళ్ళీ అయితే అంటారు? అప్పుడూ డబ్బుబట్టే కదా దోషి నిర్దోషి యేదైనా?”

“అంటే కోర్టును తప్పు పడుతున్నావా?”

“హన్నన్నా యెంతమాట?”

ముందు నోటిమీద వేలేసుకు తలడ్డంగా వూపిన పెద్దమనిషి తరువాత లెంపలు వేసుకున్నాడు. బెంచి గుమాస్తాకి యెందుకో మనసుకి హాయిగా తోచి అది చిరునవ్వై పెదవి చివర పూయబోతే దాన్ని మొగ్గలోనే తుంచేసి గంభీరంగా ముఖం పెట్టాడు.

“వొకవేళ నేరారోపణలన్నీ నిరాధారమైనవని రుజువు కాలేదని నిరూపణయితే, అప్పటికే శిక్ష అనుభవిస్తూ వుంటే కోర్టు యేంచేస్తుంది?”

“ఆధారాలూ రుజువులూ చూడకుండా కోర్టులు శిక్ష వెయ్యవు”

“నిజమే, కాని కింది కోర్టు వేసిన శిక్షని బాగా డబ్బులు ఖర్చుపెట్టి పైకోర్టుకు వెళ్తే కొట్టేసింది అనుకోండి, అప్పుడూ?”

కొద్దిసేపు నిశ్శబ్దం అలముకుంది. పద్దుకుమాలిన చర్చ ఆపెయ్యాలని జడ్జిగారికి అనిపించింది. కాని పబ్లిక్‌లో యింత దూరం వచ్చాక యిప్పుడు ఆపెయ్యడం అప్రదిష్టని కూడా అనిపించింది.

“నష్టపరిహారం చెల్లిస్తుందా లేదా?”

“కేసుని బట్టి… నష్టాన్ని బట్టి”

“పరిహారం యెలా చెల్లిస్తుంది?”

“తిరిగి వుద్యోగంలోకి తీసుకోమని అనొచ్చు. లేదా యింత సొమ్ము అతనికి చెల్లించమనీ అనొచ్చు, అతను లేకపోతే అతని కుటుంబానికి న్యాయం చెయ్యొచ్చు”

“అంటే యేంటట? యెలా న్యాయం చేస్తుంది? డబ్బిచ్చి!”

ప్రశ్నా తనదే. జవాబూ తనదే. పెద్దమనిషి మాటతీరుకి అంతా మూగాళ్ళయిపోయి చూస్తున్నారు.

“అంతెందుకు? మొన్నటికి మొన్న విమానం కూలిపోతే, రెండువందల డబ్బైమూడో నాలుగో మంది చనిపోతే, మృతుల కుటుంబాలకి మనిషికి కోటి నష్టపరిహారం యిచ్చింది. తప్పిదమైనా ప్రమాదమని పేరుపెట్టినా చేసింది వ్యాపార సంస్థలైనా ప్రభుత్వాలైనా కోర్టులైనా న్యాయాన్ని డబ్బుతోనే కొలుస్తారు”

కోర్టుహాల్లో వున్నవారంతా వూపిర్లు బిగబట్టి వింటున్నారు.

“న్యాయాన్నే కాదు, శిక్షల్ని కూడా డబ్బుతోటే కొలుస్తారు. తప్పుకట్టడం అనో జరిమానా అనో… తాగి బండి నడిపితేనో రోడ్డుపక్కన బైకో కారో పార్క్ చేశామనో… అంతెందుకు గడువులోపల కట్టాల్సిన యే బిల్లు కట్టకపోయినా అపరాధరుసుం పేరుతో డబ్బే వసూలు చేస్తారు. ఎందుకంటే డబ్బు అనేది కూడా కష్టపడితే వస్తుంది. కష్టపడకుండా వచ్చే కథ వేరు. మొత్తానికి యేదయితేనేం డబ్బుని లాక్కోవడం అంటే మనిషి కష్టాన్ని లాక్కోవడం. కష్టం అంటే శ్రమ. సమయం. జీవితం. ఇప్పుడు ఈడీలూ అవీ ఆస్తులు జప్తు చేస్తున్నారు కదా, ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారని ఐటి దాడులు దేనికోసం? తమపార్టీలో చేరడంకోసం చేసే ఆ కథ వేరు. అంచేత…”

ఆయాసం వచ్చి ఆగిపోయాడు పెద్దమనిషి. ఎవరో బాటిల్‌తో నీళ్ళు అందించారు. గటగటా తాగాడు.

“అంచేత తొంభైవేలూ కట్టించుకోండి, కావాలంటే దాని మీద జియ్యస్టీకూడా వెయ్యండి, నా శిక్షాకాలం రద్దు చెయ్యండి”

దబ్బుమని శబ్దం.

ఆపై అంతా ఆందోళనగా జడ్జిగారి చుట్టూ గుమికూడారు.

అసలేం జరుగుతోంది?

*********

పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కేసు విచారణకు స్వీకరించారు!

ఇంతకుముందు యెన్నడూ యిటువంటి కేసు నమోదు కానందున- అదీ న్యాయస్థానాన్ని తప్పుపడుతున్న కారణంగా- యేడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం యేర్పాటు అయ్యింది! బెంచ్ ముందుకు వచ్చిన న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించడం మొదలు పెట్టారు!

“న్యాయాన్ని డబ్బుతో కొలవడమే న్యాయం. న్యాయంలో భాగమైన శిక్షల్ని కూడా డబ్బుతోనే కొలవాలని విజ్ఞప్తి. పిటీషనర్ పేర్కొన్నట్టు చట్టపరమైన నష్టపరిహారం, శిక్షతో పాటు జరిమానా యింకా డిపాజిట్ల బాండ్ల రూపేణా యిప్పటికే డబ్బు ప్రవేశాన్ని కోర్టులు ఆమోదించాయే తప్ప, నిరోధించలేదు”

“మిలార్డ్, జరిమానా చెల్లించి శిక్ష తగ్గించుకొనే అవకాశం అందరికీ వున్నప్పుడు, కొందరే దాన్ని అంటే డబ్బున్నవాళ్ళే ఆ అవకాశం వినియోగించుకుంటున్నారు అన్నది గమనించాలి, యిది సమానత్వ భావనకి భంగం కలిగిస్తుంది”

“ఇట్స్ క్వయిట్ నేచురల్, బట్ అందరూ ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం లేదని కొందరికివున్న అవకాశాన్ని తోసిపుచ్చడం సరికాదు, అది చట్టం కల్పించిన హక్కుల వుల్లంఘన కిందికి వస్తుంది”

ఇరుపక్షాల వాదనలు వింటూన్న ధర్మాసనంలోని పెద్దలు యేదో రాసుకున్నాక, వొకరు ప్రశ్న వేశారు.

“చట్టపరమైన అనుమతులు లేమిటి?”

“ఇండియన్ పీనల్ కోడ్ 1860, భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం చాలా నేరాలకు జరిమానాలే శిక్షలుగా విధించబడ్డాయి, వొంటిగా లేదా జైలుశిక్షతో పాటు. ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ సెక్షన్ 8 ప్రకారం జారిమానా చెల్లించకపోతే గరిష్ట జైలుశిక్షలో నాలుగోవంతు జైలుశిక్ష విధించవచ్చు. దీన్ని ‘సమాన చెల్లింపు’గా భావించవచ్చు. జరిమానాను చెల్లించడం ద్వారా జైలుశిక్షను నివారించవచ్చు”

“సర్, జరిమానాతో శిక్షించదగిన నేరాలలో ట్రాఫిక్ వుల్లంఘనా- ఆర్ధికనేరాలూ- రెండూ కూడా పక్కపక్కనే వున్నాయి. ఐపిసీ సెక్షన్ 67 ప్రకారం యాభై రూపాయలకంటే తక్కువ జరిమానాలకు రెండునెలల వరకూ జైలుశిక్ష విధించే అవకాశమూ వుంది. అంటే, సెక్షన్ 8 ప్రకారం జారిమానా చెల్లించకపోతే గరిష్ట జైలుశిక్షలో నాలుగోవంతు జైలుశిక్ష విధిస్తుంటే, సెక్షన్ 67 ప్రకారం యాభై రూపాయలకంటే తక్కువ జరిమానాలకు రెండునెలల వరకూ జైలుశిక్ష విధిస్తుంటే, ఆరోహణా అవరోహణల మధ్య సమానరేఖను వెతుకుతున్నట్టుంది…”

పిటీషనుదారు పెద్దమనిషికి వాళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అయినా ఆగలేకపోయాడు.

“యాభైరూపాయల జరిమానాకు సమానంగా రెండునెలల జైలుశిక్ష విధిస్తుంటే, జరిమానా యెవరికి పడ్డట్టు? కోర్టుకా అంటే ప్రభుత్వానికా? లేక ఆ నేరస్తుడికా?”

“వాట్?”

“సైలెన్స్”

న్యాయమూర్తి మాటా బిల్లబంట్రోతు మాటా వొకేసారి వచ్చాయి.

“క్షమించాలి, నేరస్తుడు యాభైరూపాయలు కట్టకపోగా ప్రభుత్వం నుండి తిరిగి రెండునెలల పోషణ ఖర్చులు పొందడం సరికాదు, శిక్షల వల్ల ఆ శిక్ష యెవరికైనా పడొచ్చు. అదే జరిమానా అమలు వల్ల ప్రభుత్వానికి ఆదాయం!”  

పెద్దమనిషి మాటలకు న్యాయమూర్తులు వొకరి వేపు వొకరు వొంగి గుసగుసలాడుకున్నారు.

“ప్రజల్ని వినియోగదారులుగానే ప్రభుత్వం యేనాడో గుర్తించింది కాబట్టే సర్వీసు సెక్టర్లని బిజినెస్ సెక్టర్లుగా మార్చేసి చాలా కాలమైంది. విద్య, వైద్యం లాంటి ప్రాధమిక విషయాల్ని కూడా నాణ్యత పేరుతోనో పోటీవల్ల మంచి సర్వీసు యివ్వొచ్చు అనో తన బాధ్యతని బదిలీ చేసేసింది. స్వతంత్ర యూనివర్సిటీలు పెట్టుకొని తమకు అనుకూలమైన విద్య అనుకూలమైన మేధా తయారుచేస్తున్న తరుణంలో పెట్టుబడి అనివార్యతలని గుర్తించి గౌరవించాలి. ప్రభుత్వ విధానాల ప్రతిఫలనాలకు కోర్టులు మాత్రమే దూరం జరిగే అవకాశం లేదు”

ఆవరించిన నిశ్శబ్దాన్ని గోడకున్న గడియారం ముల్లు  ముల్లు గుచ్చినట్టు గుచ్చుతోంది.

“న్యాయమూ వినియోగమే. వినిమయమే. అన్ని వస్తువుల వినియోగదారుల క్రయవిక్రయాల మీద మన్నిక మీద న్యాయ వినియోగ సేవాకేంద్రాలు పనిచేస్తున్నాయి. అక్కడ ప్రధానంగా శిక్షలన్నీ దాదాపు ఫెనాల్టీ రూపంలోనే వున్న విషయం తమకు విదితమే. అఫకోర్స్ కేసుల పరిష్కారం కూడా జరుగుతోంది”

“జరిమానాను శిక్షగా గుర్తించాం కాబట్టి అందులో తప్పేముంది?”

న్యాయమూర్తి ప్రశ్నతో న్యాయవాది ముఖం వికసించింది.

“ఎస్… యువరానర్, ఆ రకంగా శిక్షని ‘ఫిజికల్‌’గా కాక ‘ఫైనాన్సియల్‌’గా మార్చమని ఐ మీన్ విస్తరించమని విసృతపరచమని విన్నవించుకుంటున్నాను”

న్యాయమూర్తులు ఆలోచనలో పడ్డట్టు వాళ్ళ చిట్లించిన నొసలు సాక్ష్యం చెపుతున్నాయి.

“తమ వ్యాపార వ్యవహారాల్లో దివాళా తీసామని చేతులు యెత్తేసినప్పుడు ప్రభుత్వ బ్యాంకులు లక్షల కోట్లు రద్దు చేయడం కూడా చాలాకాలంగా మనం చూస్తున్నాం. ఇది ప్రభుత్వమిచ్చే ప్రోత్సాహంగా కూడా అనుకోవచ్చు”

ఆ చివరి మాటకు అక్కడున్నవాళ్ళంతా ముసిముసి నవ్వులు నవ్వారు.

“అనుబంధమైన మరో మాట. చాలా మంది యెగవేతదారులు వేలకోట్లు యెగవేయొచ్చు, బట్ ఫ్రీగా విదేశాలకు తరలిపోతున్నారు. అదే వాళ్ళ ఆర్ధిక నేరాలకు యెంతో కొంత నిర్ణయించిన మూల్యం చెల్లించే అవకాశం యిస్తే వారు పారిపోయే అవకాశమూ తగ్గుతుంది. దేశం పరువు ప్రతిష్టకూ భంగం కలగకుండా వుంటుంది. ఆ విధంగా నేరస్తులకు శిక్ష పడినట్టూ న్యాయం జరిగినట్టూ అవుతుంది. అవినీతిని నీతిగా దిద్దే అవకాశమూ కలుగుతుంది. పైగా ప్రభుత్వం అవినీతిపరులను కాపాడుతోందన్న అపప్రదతో ప్రజలు యెన్నుకొన్న ప్రభుత్వాన్ని అస్థిరతకు నెట్టే ప్రమాదం నుండి తప్పించవచ్చు”

“అప్పుడు నేరస్తుడు తప్పించుకున్నట్టు కాదా?”

“మిలార్డ్… అసలు మనం నేరస్తుల్ని ఖైదుచేసి జైల్లో యెందుకు పెడుతున్నాం? కేవలం శిక్షించడానికి కాదు. శిక్షించడం అనేది ఆటవిక సమాజ న్యాయం. ఆధునిక సమాజంలో ఖైదీలని సంస్కరించి మామూలు మనుషులనిచేసి తిరిగి సమాజంలోకి తీసుకురావడం న్యాయం తాలూకా లక్ష్యం!”

కాదనలేని అంగీకారాన్ని అక్కడ నెలకొన్న నిశ్శబ్దం చెప్పకనే చెప్పినట్టుంది.

“ఒకవైపు కోర్టుల్లో యాభై మిలియన్ల కేసులు పెండింగులో వుంటే, మరో వైపు ముప్పైశాతానికి మించి న్యాయాధికారుల ఖాళీలు వుంటే, యీ స్థితిలో ప్రజలు కూడా సత్వర న్యాయం కోరుకుంటుంటే, యీ దశలో చెరకు సంహిత కాలంలో నాయ సంహిత వుండడం సబబు కాదని, అన్నీ ఆధునీకరించబడుతున్న కాలంలో న్యాయం కూడా ఆధునీకరించబడాలని… అందుకు అదనపు జరిమానాలతో జైలుశిక్ష రద్దూ- జరిమానా కట్టలేనివాళ్ళ పోషణా- యింకా న్యాయమూర్తుల నియామకమూ జరిగి న్యాయం వర్ధిల్లాలని… విన్నవించుకుంటున్నాను…”

తాము రాస్తున్నది పేపర్లమీదో ప్రజల నుదిటిమీదో ఆలోచించకుండా న్యాయమూర్తులు అలవాటుగా యేదో రాసుకుంటున్నారు.

‘జరిమానా వొక నజరానా’ అని భావిస్తున్న న్యాయవాదుల ముఖాల్లో విజయం తమదేనన్న వికాసం కనిపించింది.

పిటీషన్ వేసిన పెద్దమనిషి వెనకాల అనేకమంది పెద్దమనుషులు వున్నారిప్పుడు. వారు తమ ఆర్ధిక హార్దిక బలాన్ని యిచ్చారేమో ‘జరిమానా గెలుస్తుంది’, ‘జైలుశిక్ష వోడిపోతుంది’ అని తనలో తాను నినాదాలు కూడా రచిస్తూ గొణుక్కుంటున్నాడు.

కేసు వాయిదాపడింది.

అసలేం జరుగబోతోంది?  

బమ్మిడి జగదీశ్వరరావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *