ఎలీకుట్టి – ఒక చిట్టి ఎలక పిల్ల. అది ఎప్పుడూ తండ్రి తనకి అసలు ఆ పేరు ఎందుకు పెట్టాడా అని ఆలోచిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు వివరం తెలిసొచ్చింది.. అదీ ఎప్పుడని.. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నాక! లేత గులాబి రంగులో ఉండే ఆ చిట్టి ఎలక పిల్లకి తన అస్తిత్వం గురించి తెలియదు. ఇంకా కళ్ళు తెరవకపోవడం వల్ల తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కూడా బొత్తిగా ఏమీ తెలవదు. ఏదో ఒక కాకి వచ్చి ఆ ఎలక పిల్లని ఎగరేసుకుపోయి స్వాహా చెయ్యొచ్చు. కానీ అది ఆ కాకి ముక్కుకి సరిపోదాయె! మెల్లగా మూసుకున్న ఆ చిన్ని కళ్ళు ఎప్పటికీ తెరవకపోనూ వచ్చు. బలవంతంగా కళ్ళు తెరిచి చూస్తూనే …. మళ్ళీ కళ్ళు శాశ్వతంగా మూతపడిపోతాయి. శక్తి అంతా కళ్ళల్లోకి వచ్చి ఒక్కసారిగా శెలవు తీసుకున్నట్టు …. చూసేవాళ్ళకి ఆ కళ్ళు గంజాయి మత్తులో తూగుతున్నట్టు, సగం తెరిచి సగం మూసి ఉన్నాయి. అయినా ఎదురుగా ఉన్న జనాలు మసకమసకగా కనిపిస్తున్నా… లోపలి దృశ్యాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నచోట ఉండాలని లేదు. అసలు ఇక్కడకి రావాలని కూడా లేదు. ఇలాంటి చోటకి ఎవరికి మాత్రం రావాలని ఉంటుంది? ఆ ఇంటి నిండా ఎదురుచూపులే. కాస్త ఓదార్పు కావాలి తనకి. జీవితం ఎంతో భారంగా అనిపిస్తోంది. ఎక్కడికయినా దూరంగా పారిపోవాలని ఉంది …. దూరంగా …. చాలా దూరంగా….!
తెలతెలవారుతుండగా ఆమె నిద్ర లేచింది. మనిషి ఈ నులివెచ్చని ఎండనే కాస్త ఆస్వాదించగలడు. ఎండ మరికాస్త చురుకెక్కిందో చూడాలి దాని తడాఖా! తోలు ఊడిపోయేంత ఎండ. మామూలుగానే అక్కడ వర్షాలు తక్కువ. ఈ ఏడాది అస్సలే కురవలేదు. ఆకాశం అలిగి కూర్చున్నట్టు ఉంది. తనకి చిన్నప్పటి నుండి ప్రతిరోజూ ఈ వేళకే నిద్ర లేవడం అలవాటు. రోజూ ఉదయాన్నే చేసే పనులు మారి ఉండొచ్చు. కానీ, నిద్ర లేచే వేళలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. ఆమె ప్రతిరోజూ ఒక బెంగ నిండిన మనసుతో, సగం మిగిలిపోయిన నిద్రని కళ్ళల్లో దాచుకుని మేల్కుంటుంది. ఆమె జీవితంలో అదొక భయంకరమైన సమయం. తను కూడా అందరి స్త్రీలలాగనే ఎవరో ఒకరి నిద్రకి మూల్యం చెల్లిస్తూ నిద్ర లేస్తుంది. ఒక్కొక్కసారి అన్నగారి నిద్రకి, ఒక్కొక్కసారి తండ్రి నిద్రకి మూల్యం చెల్లిస్తే …. ఇంక పెళ్ళయ్యాక జీవితాంతం భర్త నిద్రకి….! అంత మసక చీకట్లో చూడటం కష్టమే. అయినా రోజూ కనిపించే దృశ్యమే అది. ఒకపక్కకి ఒరిగిపోతున్న తన ఇంటికి ప్రహారీగా కట్టిన కొబ్బరాకుల దడి. అసలు ఈ కొబ్బరాకులు, వెదురు బొంగులు లేకపోతే అది ఇల్లే కాదాయె! ఆ ఇంటికి మహా మహా బలాఢ్యులు ప్రచారం చేసే ఇటుక, సిమెంటు, చువ్వలు ఏమీ లేవు. ఎప్పటి నుండో చూస్తున్న ఇల్లే అది. చిన్నప్పటి నుండి ఇలాంటి ఇళ్ళే చూస్తూ పెరిగింది. చుట్టుపక్కల అంతా ఇలాంటి ఇళ్ళే. వాళ్ళందరివీ కూడా ఇంచుమించు ఇలాంటి కన్నీటి కథలే. ఈ పేదరికాన్ని తలచుకుని కొంతమంది బాధపడుతూ ఉండొచ్చు కానీ దీని గొప్పతనం దీనికుంది. ఈమధ్య ఇలాంటి గ్రామీణ వాతావరణాన్ని ఇష్టపడేవారి సంఖ్య పెరుగుతోంది. వాళ్ళకి ప్రకృతి సహజమైన వనరులతో కట్టిన ఇలాంటి ఇళ్ళు, వాతావరణం అంటే వల్లమాలిన ప్రేమ! ఈ ఇళ్ళు ప్రకృతి సహజమైనవే కాక ‘మినిమలిస్టిక్’ కూడా! అలాంటి వాళ్ళకోసం ప్రత్యేకంగా ఇలాంటి ఇళ్ళు కడుతూ ఉంటారు. వాళ్ళు కూడా కొన్నాళ్ళు ఇలాంటి ఇళ్ళల్లో సేదతీరి, మళ్ళీ ఆ కాంక్రీటు అడవుల్లోకి, కాలుష్యంలోకి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అదొక ప్రపంచం. ఎలీ రోజూ ఆ ప్రపంచాన్ని చూస్తూనే ఉంటుంది. అయితే తన ప్రపంచంలో నుండి బయలుదేరి, ఆ ప్రపంచాన్ని అలా అలా పైపైన చూసి మళ్ళీ తన ప్రపంచంలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇంటి పైకప్పుకు ఉన్న కొబ్బరాకులు కాస్త తప్పుకుంటే ఏర్పడే సందులో నుండి సూర్య కిరణాలు వచ్చి పలకరిస్తూ ఉంటాయి. ఎండ ఎక్కువయ్యే కొద్దీ అవీ మాయం అయిపోతాయి. అప్పటికి ఎలీ వాకిలి చిమ్మి, మరుగుతున్న నీటిలో టీపొడి వేస్తుంది. అప్పుడు టీ గ్లాసు పట్టుకుని కూర్చుంటుంది అనుకుంటున్నారా? లేదు…. లేదు. మొగుడికి టీ గ్లాసు అందించి, తన సైకిలుకి బుట్ట వేలాడేస్తూ ఉంటుంది. మధ్యమధ్యలో ఒక్క గుక్క టీ తాగుతూ ఉంటుంది. టీ అంటే అదేదో పెద్ద తేనీటి విందు కాదు. మరిగే మరిగే నీళ్ళల్లో కాస్తంత టీపొడి వేసిన డికాక్షన్ అంతే. మొగుడికి ఇంత వయసొచ్చినా ఇంకా బాధ్యత రాలేదు. పని దొరికితే దొరికినట్టు లేదా ఎలీ ఒళ్ళు హూనం చేసుకుని సంపాదించిన ఆ నాలుగు డబ్బులతో తాగి తందనాలాడుతూ ఉంటాడు. ఈ లోకంతో కానీ, తన పెళ్ళంతో గానీ అతనికి పెద్దగా సంబంధ బాంధవ్యాలు ఏం లేవు. మొదట్లో పెళ్ళం శరీరం కోసమైనా వెంపర్లాడేవాడు. కానీ ఇప్పుడు ఎముకల గూడు అయిన ఆ ముసలి శరీరంతో అతనికి పనిలేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య బంధం ఉంది అంటే ఉన్నట్టు, లేదు అంటే లేనట్టు. రోజూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంటాయి. కానీ లోపల లోపల మనసులు మొద్దుబారిపోయాయి. తడి ఆరిపోయింది. ఒకరకమైన విరక్తి వచ్చేసింది. ఇప్పుడు అతను దగ్గుతున్నా ఆమె మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వదు …. అలాగే అతను కూడా ఆమె సైకిలు పంక్చరు వెయ్యించడం మానేసాడు. అంతమాత్రానికి మునుపు ఏదో భార్యకి తోడూనీడగా ఉన్నాడని కాదు. ఎప్పుడూ ఎలాంటి బాధ్యత తీసుకున్నవాడూ కాదు. గుడ్డిలో మెల్ల …. పిల్లలు లేరు. ఉంటే వాళ్ళనీ ఇలాగే నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేసి ఉండేవాడు. ఎలాంటి బాధ్యత పట్టని ఇలాంటి మనుషుల పట్ల లోకానికి ఎన్నో ఆశలు ఉండొచ్చు. కానీ వాళ్ళు మాత్రం నిమ్మకి నీరెత్తనట్టు తమకు నచ్చినట్టు బతికేస్తూ లోకాన్ని వెక్కిరిస్తూనే ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాలు మండు వేసవిలో నూతిలో నీళ్ళలా ఇంకిపోయాయి. వాళ్ళిద్దరి మధ్య ఏ కాస్తో ప్రేమానురాగాలు మిగిలి ఉన్నా అవి కూడా ఆ కొబ్బరాకుల దడిలాగే …. గట్టిగా పట్టుకుంటే పడిపోయేలా ఉన్నాయి! అయితే ఈ పరిస్థితుల్ని ఇద్దరూ పెద్దగా పట్టించుకున్నది లేదు. సైకిలుకి బుట్ట కట్టుకుని సిద్ధమయిన తర్వాత ఎలీ మరుగుతున్న నీటి మీద ఒక గుడ్డ కప్పి దాని మీద ఇడ్లీ పిండి వేసి మూతపెట్టింది. ఆ ఇడ్లీపాత్రలో రెండురోజుల నుండి నీళ్ళు మార్చలేదు. ఇవాళ కానీ నీళ్ళు రాకపోతే రేపు ఈ నాలుగు ఇడ్లీలు ఉడకడానికి కూడా నీళ్ళు ఉండవు. ఊళ్ళో నూతులు అన్నీ ఎండిపోయాక ప్రభుత్వం ఈ ఊరికి రోజూ మంచినీళ్ళ ట్యాంకరు పంపుతోంది. అయితే గత రెండు రోజులుగా ట్యాంకరు జాడ కూడా లేదు. ఇడ్లీపాత్ర మూత తీసి చూస్తూనే ఆవిరి గుప్పుమని పైకి లేచింది. ఈ ఉదయపు ఎండలో ఆ మాత్రం ఆవిరైనా కనిపిస్తోంది. అదే మరికాస్త ఎండెక్కితే ఈ ఆవిరి కనబడటం కూడా కష్టమే. చిన్న చెంచాతో గుచ్చి చూసి ఇడ్లీ ఉడికిపోయింది అనుకున్నాక ఇడ్లీ పాత్ర కిందకి దింపేసింది. ఇడ్లీపాత్ర తేలికపడింది. కాసినన్ని నీళ్ళు మిగిలాయి. ఆ ఉన్న ఆవిరికి ఇడ్లీలు ఉడికిపోతాయిలే అని సరిపెట్టుకుంది. ఇడ్లీలు పెట్టుకోవడానికి అరటాకులు కూడా సిద్ధం చేసుకుంది.
“ఇవాళ మంచినీళ్ళ ట్యాంకరు వస్తే రెండు బకెట్లు నీళ్ళు పట్టి పెట్టు. నాకోసం కాకపోయినా కనీసం నీకోసమైనా పట్టుకో. లేదంటే రేపు ఈ రెండు ఇడ్లీలు కూడా ఉండవు.” – ఎలీ సైకిలు హ్యాండిలు సరిచేసుకుంటూ చెప్పుకుపోతోంది. లోపల కూర్చున్న ఎలీ మొగుడు జవాబు చెప్పలేదు. తనకి కాదు, ఏదో గాలికో, గోడకో చెబుతున్నట్టు మౌనంగా ఉండిపోయాడు. జవాబు చెప్పకపోయినా ట్యాంకరు వస్తే నీళ్ళు పడతాడు. అతని స్వార్థం గురించి ఆమెకు బాగా తెలుసు. అవే రెండు ఇడ్లీ బయట తినాలంటే డబ్బులు కావాలి మరి!
ఎలీ సైకిలు బయలుదేరింది. అలసిపోయిన కాళ్ళతో సైకులు తొక్కుతోంది. ఆమెకి తెలియని విషయం ఏంటంటే తమిళనాడులో పి.సాయినాథ్ అనే రచయిత సైకిలు తొక్కే తమిళనాడు స్త్రీల స్వాతంత్ర్యాన్ని, శక్తినీ బాగా పొగిడాడు. ఆ ముసలి కాళ్ళు సహకరించినా, సహకరించకపోయినా బయటకి వెళ్ళడానికీ-రావడానికీ ఎలీ ఎవరిమీదా ఆధారపడదు. తను ఆ సత్తువలేని కాళ్ళనీ, సైకిలు పెడల్ నే నమ్ముకుంటుంది. ఊరు దాటి నగరంలోకి వస్తూనే చురుక్కుమనే వెలుగు ఆమె కళ్ళని తాకింది. ఆ వెలుగుని తట్టుకోలేక, దుమ్ము-ధూళి నుండి కాపాడుకోవడానికి కళ్ళు కాస్త చిట్లించింది. ఎండ తీవ్రత కూడా మెల్లమెల్లగా పెరుగుతోంది. జీవితం నిస్సారంగా ఉంది. అయినా బతుకు ఎడ్లబండిలా మెల్లగా సాగిపోతోంది. ఇంకా పరుగు మొదలవలేదు. కాసేపు ఆగితే మొదలవుతుంది. అందరూ మదురై వెళ్ళేవాళ్ళే. రోజూ పని మీద వెళ్ళేవాళ్ళకి ఒక నిర్దుష్టమైన సమయం అంటూ ఉంటుంది. కానీ, సొంత పనుల మీద వెళ్ళే వాళ్ళు కాస్త ముందు బయలుదేరాలి. తమ తమ పనుల మీద వెళ్ళే కూలివాళ్ళవల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకేసారి గుంపులు గుంపులుగా బయలుదేరేవాళ్ళతోనే అసలు సమస్య. మిన్ను విరిగి మీద పడినంత హడావుడి చేసేస్తారు. ఎలీ పువ్వుల మార్కెట్ చేరుకోవాలి. అంటే వైగయీ నది వంతెన దాటాలి.
ఒక గ్రద్ద ఆకాశంలో చక్కర్లు కొడుతూ-కొడుతూ మెల్లగా కిందకి దిగే ప్రయత్నంలో ఉంది. అలా ఆకాశంలో గుండ్రంగా తిరుగుతూనే అది కింద ఉన్న వేటని గమనిస్తూ ఉంటుంది. చూస్తూ చూస్తూనే కిందకి దిగి ఏ కోడిపిల్లనో ఎగరేసుకుపోతుంది… దాని కడుపు నిండుతుంది. ఎలీ సైకిలు దిగి బలమంతా ఉపయోగించి సైకిలు తోసుకుంటూ వంతెన దాటిస్తోంది. వైగయీ నది అప్పుడప్పుడు మదురై నగరం గుండా ప్రవహిస్తూ ఉంటుంది …. కానీ ప్రస్తుతానికి ఎండిపోయి ఉంది. నది మధ్యలో కనిపిస్తున్నది నీళ్ళు కాదు…. నగరంలో నుండి కొట్టుకొచ్చిన మురికి…. ఎండలకి ఆ మురికి, మలమూత్రాలు కలిసి అట్టలుకట్టేసాయి …. కంపు. నిజానికి ఈ నది ద్రవిడ సభ్యతకి ఒకప్పుడు కేంద్రంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ ఎండిపోయిన నది వెంబడి తవ్వకాలు జరుగుతున్నాయి. ఎండిపోయిన ఈ నదిపై నిర్మించిన ఆ వంతెన జనాలకోసం కాదు. కార్లు-బండ్ల కోసం. పట్నాల్లో వంతెనలు అలాగే ఉంటాయి. దూరం నుండి ఎత్తరగా ఉండి మధ్యలోకి చేరుకునేసరికి వాలు మొదలైపోతుంది. కార్లు-బండ్ల మాట సరే పెట్రోలు-డీజిలుతో నడుస్తాయి. కానీ కాళ్ళీడ్చుకుంటూ నడిచే పాదచారుల సంగతేంటి? సైకిళ్ళు-రిక్షాలు తొక్కేవాళ్ళ సంగతేంటి? ఎలీ బలమంతా ఉపయోగించి సైకిలు నెట్టుకొస్తుంది. పడుతూ-లేస్తూ వంతెన ఎక్కేసరికి ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయిపోతుంది. అసలు ఒంట్లో ఇంత నీరు ఎక్కడిదా అని ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది. ఈ ముసలి వయస్సులో కాళ్ళనొప్పులు, నడుంనొప్పి అంటే అర్థం చేసుకోగలదు. కానీ ఇలా ఇంత చెమట అంటే నీటిని వృథా చెయ్యడమే అని ఆమె ఆలోచన. ఎలీ, వంతెన అంచు పట్టుకుని కాసేపు నిలబడింది. వగరుస్తున్న జీవితానికీ, మరణించిన నదికీ ఏమన్నా సారూప్యత ఉందంటారా?! నది పైన ఆ ఇసుక మేటలు తన కాలి పగుళ్ళని గుర్తుచేస్తున్నాయి. ఇంక కాస్త నెమ్మళంగా ఊపిరి తీసుకుని మళ్ళీ బయలుదేరవలసిన సమయం దగ్గరపడింది. ఎండెక్కితే పువ్వుల మార్కెట్ మూసేస్తారు. వంతెన మధ్యకి చేరుకుని ఎలీ మళ్ళీ సైకిలు ఎక్కి కూర్చుంది. నిజం చెప్పాలంటే ఇవే ఆమె జీవితంలో బంగారు క్షణాలు…. వైగయీ నది వంతెన పై నుంచి పెడల్ తొక్కక్కర్లేకుండా హాయిగా కిందకి జారే క్షణాలు… ఎలీకి అదొక పెద్ద గెలుపు …. ఒక్క క్షణం తల పైకెత్తి ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వింది.
ఎలీ తన సైకిలు అరటిపళ్ళ మార్కెట్ గుండా పోనిచ్చింది. ఒకప్పుడు ఈ మార్కెట్ లో పది-పన్నెండు రకాల అరటిపళ్ళు దొరికేవి. ఇప్పుడు అతికష్టం మీద ఐదు-ఆరు రకాలు దొరుకుతున్నాయి. అయితే మాత్రం … ఆ చరిత్ర తెలియనివాళ్ళకి ఇదే గొప్ప! ఎందరో పర్యాటకులు వీటన్నిటినీ ఫోటోలు-వీడియోలు తీసుకోవడం ఎలీ చూస్తూనే ఉంటుంది.
“నువ్వు రోజూ ఠంచనుగా టైముకి వచ్చేస్తావు. అసలు ఆలస్యం అన్న మాటే ఉండదు.”
వయసు తెచ్చే ఇబ్బందులు తప్ప ఆలస్యానికి వేరే కారణాలు ఉండవని సతీష్ కి ఎలా చెప్పాలి? ఈ వయసులో కూడా ఆ దేవుడి దయవల్ల సైకిలు తొక్కగలుగుతోంది. అదే పదివేలు. ఆలస్యానికి మూలం బద్దకం. పేదవాడికీ బద్దకానికీ చుక్కెదురు. పైగా తను ఆడది కూడా! ఈ సమాజం ఆడదానికి బద్దకించే అవకాశం ఎప్పుడూ ఇవ్వదు. ఇదంతా మనసులో అనుకుంటూనే ఎలీ పువ్వులు ఏరడం మొదలుపెట్టింది. నాలుగుపక్కలా పువ్వులే పువ్వులు. ఈ మార్కెట్ రకరకాల పువ్వులకి ప్రసిద్ధి. ఇక్కడికి దేశం నలుమూలల నుండీ పువ్వులు వస్తాయి. అయినా చాలామటుకు పువ్వులు బెంగుళూరు నుండే వస్తూంటాయి. బెంగుళూరు రైతులైతే అన్నం ఏం తింటాంలే అన్నట్టు పువ్వుల సాగు చేస్తూంటారు. ఈ పువ్వులు చాలామటుకు గుళ్ళు-గోపురాలకి చేరతాయి. గొప్పింటివాళ్ళు తమ ఇళ్ళల్లో అలంకరణకి కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ అన్నింటికంటే మల్లెపువ్వులకి గిరాకి ఎక్కువ. ఆడవాళ్ళు తలలో అలంకరించుకోవడానికే ఈ మల్లెపువ్వులు ఎక్కువ కొంటూ ఉంటారు. ఒకే త్రాసులో కలిగలిపి తూస్తున్న మల్లెలు-గులాబీలు-బంతులు-చేమంతులని చూడటం కొత్తగా వచ్చినవాళ్ళకి ఒక వింత అనుభవం. అయితే ఎలీకి ఇదంతా రోజువారీ ముచ్చట. ఎలీ వాడిపోయిన పువ్వుల ముఖాలు కూడా చదవగలదు. మల్లెపువ్వుల గుట్టలో నుంచి ఎలీ గుప్పెడన్ని పువ్వులు తీసి చూస్తుంది.
“ఎలీ, నీ ముసలి కళ్ళకి పువ్వులు సరిగ్గా కనిపిస్తాయా?”
“ఎందుకు కనబడవు? ఎంత ముసలిది అయినా తల్లికి కొడుకు కనబడ్డట్టు నాకు ఈ పువ్వులు కనిపిస్తూనే ఉంటాయి.”
“వ్యాపారంలో ఇలా మాటకి మాట జవాబు చెప్పలేకపోతే కష్టం. ఎవడుపడితే వాడు వెర్రివెంగళప్పని చేసి ఆట ఆడించేస్తాడు.”
ఎలీ ఈ పువ్వుల మార్కెటు నుండి బయల్దేరి తన దుకాణం తెరవాలి. ప్రతిరోజూ మీనాక్షీ అమ్మవారి దేవాలయం గుండా వెళ్తుంది. సరిగ్గా మీనాక్షీ అమ్మవారి గుడికి ఎదురుగా, వచ్చి పోయే భక్తులకి అందుబాటులో తన దుకాణం ఉండాలని ఎలీ కోరిక. అప్పుడు బోల్డన్ని అమ్మకాలు అవుతాయని ఎలీ ఆశ. అయితే జీవితం చరమాంకానికి వచ్చేసింది కానీ గుడికి దగ్గర్లో దుకాణం అద్దెకి తీసుకోగలిగే అంత డబ్బు మాత్రం కూడబెట్టలేకపోయింది. రోజూ అక్కడి దుకాణాల్లో పువ్వులు కొనుక్కుని గుళ్ళోకి వెళ్ళే భక్తులని చూస్తూ ఉంటుంది. బయటి నుండి వచ్చే భక్తులకి ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి అమ్ముతూ ఉంటారు. సరే, ఎప్పుడో ఒక్కసారి వస్తాం కదా అని జనాలు కూడా రేటు గురించి పెద్దగా పట్టించుకోరు. పువ్వులు అమ్మేవాళ్ళు, చెప్పులు మా దగ్గర పెట్టుకోండి, చూస్తూ ఉంటాం అని ఎరవేసి భక్తులని ఆకర్షిస్తూ ఉంటారు. పోలీసులు ఈ దుకాణదారుల మీద ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచుతారు. చెప్పులు స్టాండులోనే పెట్టుకోమని అనౌన్స్ చేస్తూనే ఉంటారు. అయినా వీళ్ళ చాకచక్యం వీళ్ళదే. ఈ దుకాణాల వాళ్ళు పువ్వులతోపాటు, కొబ్బరికాయల పేరుచెప్పి కుళ్ళిపోయినవి కూడా అంటగట్టేస్తూ ఉంటారు. ఆ తోపులాటలో అసలు ఏం జరుగుతోందో కూడా అర్థం కాదు. ఎలీ అతి కష్టం మీద సైకిలు ముందుకు నడిపిస్తోంది. గుడి దూరమయ్యే కొద్దీ, రద్దీ కాస్త తగ్గింది, కానీ కార్ల రణగొణ ధ్వని మాత్రం పెరుగుతూనే ఉంది. ఎలీ తన సైకిలు ఒక చౌరస్తా దగ్గర ఆపింది. ఆ చౌరస్తాలో రామరాజు అనే రాజకీయ నాయకుడి పాత విగ్రహం ఒకటి ఉంది. ఆ నాయకుడిలాగానే ఆ చౌరస్తాని కూడా మర్చిపోయే రోజు ఎంతో దూరం లేదు. మీనాక్షీ అమ్మవారి గుడికీ, ఈ చౌరస్తాకి పెద్దగా సంబంధం ఉండదు. అందుకే పువ్వులు మరీ ఎక్కువ రేటుకి అమ్మే అవకాశం ఉండదు. ఆ చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళు తల్లో పెట్టుకోవడానికి కొనుక్కుంటేనే ఆమెకి నాలుగు డబ్బులు వచ్చేది. అక్కడి చాలామటుకు ఆడవాళ్ళు ఎలీకి పరిచయమే. మల్లెపువ్వులు పెట్టుకుని కాస్త అందంగా కనబడాలని వాళ్ళు చేసే ప్రయత్నం వల్లే ఎలీ దుకాణం నడుస్తోంది. ఈ మల్లెపువ్వుల వాసనకి తలకి ఒత్తుగా పెట్టిన నూనె వాసన తగ్గి కాస్త ఇంపుగా ఉంటుందని ఆడవాళ్ళకి ఆశ. ఎలీ, సైకిలు స్టాండు వేసి బుట్ట కిందకి దింపుతుంది. పెద్ద బండ ఆసరాతో కర్ర నిలబెట్టి దానికి ఒక పెద్ద గొడుగు పెట్టి ఆ నీడలో కూర్చుని ఎలీ పువ్వులతో పొడవాటి మాల అల్లడం మొదలుపెడుతుంది. సతీషు దగ్గర నుండి తీసుకొచ్చిన పువ్వులు అయిపోయేవరకూ ఎలీ అలా మాల అల్లుతూనే ఉంటుంది. ఈ పెద్ద మాలలో నుంచి చిన్న చిన్న ముక్కలు చేసి రోజంతా అమ్ముతూ ఉంటుంది.
“అమ్మా దివ్యా! అలా పువ్వులన్నీ కెలికెయ్యకమ్మా. పువ్వులు పాడైపోతాయి. నాకొచ్చే నాలుగు డబ్బులకి గండి కొట్టకు తల్లీ. అసలే ఎండలు మండిపోతున్నాయి.”
“నిజమే ఎలీ. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అసలు ఈ ఏడాది ఒక్క చినుకు పడితే ఒట్టు. ఈ ఎండలకి మదురైలో చెట్లన్నీ ఎండిపోయేలా ఉన్నాయి.”
“నాకు ఇంట్లో ఒక్క చుక్క నీళ్ళు లేవు. నువ్వు చెట్లు చేమల గురించి దిగులుపడుతున్నావు. ఇవాళ ఇడ్లీలు వెయ్యడానికే నీళ్ళూ బొటాబొటీగా సరిపోయాయి.”
“మీ ఊరివైపు ఏదో పెద్ద యాగం చేస్తున్నారని విన్నాను! దేవుడు సంతోషించి జోరుగా వానలు కురిపిస్తాడులే! పొలాలు పంటలతో కళకళలాడుతాయి ఇంక.”
“అయ్యో రాత! దేవుడు కూడా పొలంపుట్ర ఉన్నవాళ్ళ పక్షానే ఉంటాడు. వాళ్ళ దేవుడు, వాళ్ళ మాట విని, వాళ్ళ కోసం వర్షాలు కురిపిస్తాడు. ఈ యాగాలతో మాలాంటి పేదవాళ్ళకి ఒరిగేది ఏం లేదు.”
దివ్య తనకి కావలసిన మాల తీసుకుని బయలుదేరింది. రోజూ వచ్చే గిరాకే ఇంతసేపు మాట్లాడుతారు. లేదంటే వచ్చామా, పువ్వులు కొనుక్కున్నామా, వెళ్ళామా అన్నట్టు ఉంటారు.
ఎలీ దేని గురించి అయితే మాట్లాడకూడదు అనుకుందో అదే విషయం చర్చకి వచ్చింది. మంచినీళ్ళ కోసం కీలడిలో యాగం జరుగుతోంది. అది గొప్ప గొప్ప ధనవంతులు ఉండే ఊరు. అక్కడ వాళ్ళకి ఎకరాలకి ఎకరాలు భూములు ఉన్నాయి. ఆ ప్రాంతంలోనే పురావస్తుశాఖ వారు చేపట్టిన తవ్వకాల్లో ప్రాచీనకాల అవశేషాలు బయటపడ్డాయి. ఆ ఊరికి చెందిన ఒకాయన మంత్రి పదవిలో కూడా ఉన్నాడు. ఆ మంత్రి గారి కుటుంబం వాళ్ళే ఈ యాగం తలపెట్టారు. వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో భూములు ఉన్నాయి. వర్షాలు పడకపోతే పంటలు ఎలాగరా భగవంతుడా అని ఈ యాగం! అయితే కూటికి దిక్కులేని పేదవాళ్ళు సైతం ఈ యాగంకోసం వెట్టిచాకిరీ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. దేవుడు సంతోషించి వర్షం కురిపిస్తే అందరికీ లాభమే. యాగం చేసినవాళ్ళకే వర్షం కురిపిస్తా అంటే అసలు ఆయన దేవుడే కాడు. ఇంత చిన్న విషయం ఈ పేదవాళ్ళకి ఎందుకు అర్థం కావటంలేదో మరి! రేపు అక్కడకి మంత్రి గారు కూడా రాబోతున్నారు. అన్ని వసతులూ కీలడి వైపే పరుగులు తీస్తున్నాయి. అయితే ఎలీకి ఈ గొడవలేం పట్టవు. ఇవాళ ట్యాంకరు వచ్చి మంచినీళ్ళు దొరికితే అంతే చాలు.
పొద్దు వాటారటం ఎంత సహజమూ, టైం ప్రకారం ఎలీ తెచ్చుకున్న ఆ రెండు ఇడ్లీలు తినడం కూడా అంతే సహజం. తిండి మీద ఎలీకి ప్రత్యేకించి ఏం శ్రద్ధ లేదు. లేదంటే తినే ఈ రెండు ఇడ్లీలకి చట్నీ, సాంబార్ చెయ్యడం అదొక పెద్ద తలనొప్పి …. పైగా సమయం వృథా. కీరా దోసకాయ మీద ఉప్పు కారం చల్లుకుని తిన్నట్టు ఇడ్లీ మీద బయట కొని తెచ్చుకున్న కారంపొడి చల్లుకుని తినేసి ఆరోజుకి అయ్యింది అనిపిస్తుంది. ఆ తిన్న ఎంగిలి అరటి ఆకు చెత్తబుట్టలో పడేసి మళ్ళీ వచ్చి కూర్చుంది. ఫెళఫెళమంటూ ఎండ. ఆ ఎండకి చర్మం ఊడి వచ్చేస్తుందా అన్నట్టు ఉంది. సాధారణంగా ఇలాంటి వేళ ఎవరూ ఇళ్ళల్లో నుంచి బయటకి రారు. ఉన్నచోటే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. లెక్కప్రకారం అయితే ఎలీ కూడా వ్యాపారం కట్టిపెట్టి సైకిలు మీద తిరుగుతూ మిగిలిన పువ్వులు అమ్ముకోవాలి. కానీ, ఈ ఎండలో తిరిగే ఓపిక లేక, అక్కడే ఆ గొడుగు కిందే కూర్చుంటుంది. ఒకళ్ళో ఇద్దరూ వచ్చి రెండు రూపాయల పువ్వులు కొనుక్కుంటారు అని ఆశ. అయితే ఆ వేళల్లో ఆమె చాలామటుకు నిద్రలో జోగుతూనే ఉంటుంది. అలా కూర్చుని-కూర్చుని కాస్త ఎండ తగ్గాక మళ్ళీ సైకిలు తీసుకుని బయలుదేరుతుంది. ఆ పెద్ద గొడుగు కింద ఆమె ఆకారం …. బక్కపలచగా ఉండే ఆ ముసలి శరీరం… ఎక్కడా రవ్వంత కళాకాంతులు లేకుండా, వీసమెత్తు కండలేకుండా ఏదో ఎముకల గూడులా అనిపిస్తుంది. నోరు తెరుచుకుని జోగుతున్న ఎలీని చూస్తే నిజంగానే సాగతీసి పెద్దగా చేసిన ఎలకపిల్ల ఏమో అనిపిస్తుంది. రోడ్డు మీద పరుగెట్టే కార్ల వెనక లేచే దుమ్ముకీ, ఎలీకి పెద్దగా తేడా ఏమీ ఉన్నట్టు అనిపించదు. ఎందుకంటే ఆ దుమ్మునీ, ఈ ఎలీనీ కూడా పట్టించుకునేవాడు ఎవడూ లేడు. ఏదో ఒకరోజు ఎలీ ఈ చౌరస్తాలో కనిపించకుండా పోయినా అడిగే దిక్కు ఉండదు. ఈ చౌరస్తలో ఉన్న ఆ రాజకీయ నాయకుడు రామరాజు విగ్రహం కూడా కొన్నాళ్ళకు శిథిలావస్థకు చేరుకుంటుంది. అయినా పట్టించుకునే నాథుడు ఉండడు. కాలం స్వరూపమే అంత. క్షణికమైన జీవితాలు గడిపేస్తున్నాం అందరం. తళుకు-బెళుకులు లేని జీవితం వ్యర్థం అన్న పరిస్థితి దాపురించింది. చూడగా చూడగా ఈ పరిస్థితి ఆగేలా లేదు …. ఇంకా ముందుకు పరుగులు తీసేలా ఉంది.
ఎలీ సైకిలు తీసుకుని బయల్దేరింది. కాలిబాట దాటుకుంటూ గోడలకి అంటించిన పంటపొలాలకి కొట్టే పురుగుల మందు అడ్వర్టయిజుమెంట్లు చూసుకుంటూ నడుస్తోంది ఎలీ. తిరుగు ప్రయాణంలో ఎలీ బైపాస్ రోడ్డు గుండా వెళ్తుంది. వైశాలి ఆసుపత్రి మలుపు తిరిగి రోజూ ఉదయం పువ్వులు తీసుకునే మార్కెటు గుండా వెళ్తుంది. అప్పుడు మళ్ళీ వైగయీ నది వంతెన వస్తుంది. నది ఇప్పుడు కూడా పొద్దున్న ఉన్నట్టే ఉంది. అయితే ఎలీకి సాయంత్రం వేళ నది దీనావస్థని గురించి బాధపడే అంత సమయం ఉండదు. ఎండ కొంత తగ్గింది. కానీ సూర్యుడి కుంపట్లో నిప్పులు ఆరిపోయి ఆ వేడి సెగ కిందకి కొడుతోందా అన్నట్టు ఉంది …. అదొక పెద్ద పొగరాని అగ్నిగుండం. దాని నుండి తప్పించుకోవడం కుదరదు. సూర్యుడు అస్తమిస్తూ తన వేడినీ-నీడనీ కింద ఇళ్ళ గోడలపై పరుస్తూ అంతర్ధానమవుతున్నాడు. ఆ గోడలపై కొన్ని నీళ్ళు చిలకరిస్తే ‘సుయ్య్’ మని చప్పుడు చేస్తూ నీటి బిందువులు ఆవిరయిపోతాయి. కానీ, అసలే కరువు… వర్షాలు లేవు. ఆ నాలుగు చుక్కలు నీళ్ళు మాత్రం పోసేవాడు ఎవడు?! నీళ్ళ సంగతి గుర్తొస్తూనే ఎలీకి మళ్ళీ బెంగ మొదలయింది. ఇంటికి తొందరగా చేరుకోవాలనే హడావుడిలో సైకిలు వేగం పెంచింది. మొగుడు నీళ్ళు పట్టకపోతే ఎలా!? ట్యాంకరు రావడం ఆలస్యం అయ్యి మొగుడు ఏ కల్లు కాంపౌండులో దూరాడో లేదా గుక్కెడు సారా కోసం ఎవరి కాళ్ళు పట్టుకుని దేబరిస్తున్నాడో అని ఆలోచిస్తోంది. అందుకే వీలైనంత తొందరగా ఇల్లు చేరుకోవాలని ఆమె ఆరాటం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇళ్ళపైన పొడవాటి నీడలు పరుచుకుంటున్నాయి. దారిలో ఒకటీ అరా చెట్లు మిగిలి ఉన్నాయి. పక్షులు తిరిగొచ్చి ఆ చెట్ల మీద వాలి సేదతీరుతున్నాయి. ఇంట్లో చుక్క నీళ్ళు లేవని గుర్తొచ్చి మళ్ళీ ఎలీ గుండెలు గుబగుబలాడాయి.
ఇల్లు చేరుకునేసరికి ఎలీకి ఆయాసం వచ్చింది. కాళ్ళు గుంజుతున్నాయి. అయినా సైకిలు వేగంగా తొక్కక తప్పలేదు. నోరు తడారిపోయింది. ఒంట్లో నుండి వేడి సెగలు బయటకి తన్నుకొస్తున్నాయి. రోజూలాగే ఇవాళ కూడా మొగుడు ఇంటిపట్టున లేడు. పిల్లి పాలగిన్ని వెతుక్కున్నట్టు, ఎలీ నీళ్ళకోసం వెతుక్కుంది. కానీ ఖాళీ బకెట్టు ఆమెను వెక్కిరించింది. ఇంట్లో ఒక్క చుక్క నీళ్ళు లేవు. ఈ ఎండ, దాహం, ఇంట్లో నీళ్ళు లేకపోవడంతో ఎలీకి చిర్రెత్తుకొచ్చింది. కోపం నషాళానికి అంటింది. కానీ ఆ ఒంటరి ఇంట్లో తన కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాలేదు. పొరుగింట్లో ఏమన్నా రెండు చెంబులు నీళ్ళు దొరుకుతాయేమో అని వెళ్ళి చూసొచ్చింది. అక్కడా ఇదే పరిస్థితి. చుక్క నీళ్ళు లేవు. తన గోడు వెళ్ళబోసుకుంటే పక్కింటి ఆమె అసలు సంగతి బయటపెట్టింది.
“యాగం పూర్తయ్యేవరకూ మంచినీళ్ళ ట్యాంకర్లు అన్నీ అక్కడికే పోతాయంట! రేపు-ఎల్లుండి కూడా ట్యాంకరు రాదని చెప్పాడు వేలు.”
“ఎవరు? ట్యాంకరు వేలునా?”
“అవును. ట్యాంకర్లన్నీ అక్కడికే తీసుకెళ్ళాలని వాళ్ళకి పైనుంచి ఆదేశాలు …. వాళ్లకేం …. ట్యాంకరు ఇంతదూరం తీసుకొచ్చే పని తప్పుతుంది. అటునుండి అటు దింపి వెళ్ళిపోవచ్చు.”
“సరే పోదాం పద.”
“ఎక్కడికి?”
“యాగం జరిగే చోటుకి. నీళ్ళు లేకపోతే మనం చచ్చిపోతాం!”
“నీకేమన్నా పిచ్చెక్కిందా? అక్కడికి మనల్ని ఎవడు రానిస్తాడు? రానిచ్చినా, నీళ్ళు పట్టుకోనిస్తాడా? మనం నీళ్ళు పట్టుకుంటే అంతమంది చూస్తూ ఊరుకుంటారా?”
“అంటే నీళ్ళు లేకుండా మనకి పూట గడుస్తుందా?”
ఎలీ తడి ఆరిపోయిన కళ్ళు పొరుగింటి ఆమెకేసి చూస్తున్నాయి. ప్రస్తుతానికి పెద్దగా దాహం వెయ్యకపోయినా పొరుగు ఇంట్లో కూడా చుక్క నీళ్ళు లేవు. ఆ యాగానికి చాలామంది వచ్చారు. వాళ్ళందరి కోసం ఈ నీళ్ళ ట్యాంకర్లు అన్నీ అటే మళ్ళించారు. నిజంగా మంచినీళ్ళు అవసరం ఉన్నవాళ్ళు దాహంతో అలమటిస్తున్నారు. అయితే ఎవ్వరికీ వీళ్ళగురించి బెంగ లేదు. ఎండ తీవ్రత తగ్గినా ఇంకా దాని ప్రభావం అలాగే ఉంది. ఎలీ గొంతు తడారిపోతోంది. ఒకపక్క ఏడుపు తన్నుకొస్తోంది. కానీ, ఏడ్చినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. వింటి నుండి వదిలిన బాణంలా ఇంట్లోకి వెళ్ళి రెండు బకెట్లు తీసుకుని యాగం జరిగే చోటుకి వెళ్ళింది. వెనకాలే పొరుగింటామె కూడా …. మంచినీళ్ళకి ఎంత కటకట చూడండి …. ఇంకొక ఎనమండుగురు ఆడవాళ్ళు వీళ్ళకి తోడయ్యారు. రంగురంగుల బకెట్లు కీలడి వైపు నడుస్తున్నట్టు ఉంది. ఏదో ఉద్యమకారుల దళం తమ బకెట్లని ఆహుతి ఇవ్వడానికి వెళ్తున్నట్టు ఉంది ఆ దృశ్యం.
కీలడి ఊరి చివర …. యాగవేదిక …. ఒక పెద్ద మండపం. అక్కడికి చుట్టుపక్కల నుండి చాలా మంది జనం వచ్చారు. వాళ్ళల్లో వాళ్ళకి ఎన్నో గొడవలు ఉండొచ్చు. కానీ, దేవుడి పేరు చెప్పి అంతా ఒక్కటయ్యారు. రకరకాల పువ్వులతో ఆ ఆవరణ అంతా అలంకరించి ఉంది. కానీ, ఎలీకి అవేమీ కనబడటంలేదు …. తన లక్ష్యం మాత్రమే కనిపిస్తోంది. యాగ మండపానికి మరొక పక్క రెండు మంచినీళ్ళ ట్యాంకర్లు ఉన్నాయి. ఆ పక్కనే ఒక టెంపరరీ టాయిలెట్ బ్లాకు కూడా ఏర్పాటు చేసారు. అవసరమైనవాళ్ళు ఆ ట్యాంకరు నుండి బకెటుతో నీళ్ళు తీసుకుని టాయిలెట్ కి వెళ్ళొచ్చు మాట! వేలూ ట్యాంకరులో నీళ్ళు … అంటే ఎలీ బస్తీవాళ్ళు తాగవలసిన నీళ్ళు మరుగుదొడ్ల కోసం వాడుతున్నారు! ఒకపక్క బస్తీలో మంచినీళ్ళకి కటకటగా ఉంటే ఇక్కడ ఇదీ పరిస్థితి! ఎలీ అక్కడ ఎవరినో ఒక బకెట్ నీళ్ళు ఇవ్వమని బతిమాలుతోంది. ఇంతలో బకెట్లు పట్టుకుని వస్తున్న ఆడవాళ్ళని ఆ యాగంచేసే వాళ్ళలో ఒకతను చూడనే చూసాడు. ఆ మంచినీళ్ళ గొడవ అంతా చూసి అతనికి చిర్రెత్తుకొచ్చింది.
“ఈ యాగం పూర్తయ్యే వరకు ఎవ్వరికీ మంచినీళ్ళు దొరకవు. ఇక్కడి నుండి పోండి. వేరే ఎక్కడి నుండి అయినా తెచ్చుకోండి. మేము ప్రభుత్వం నుండి అన్ని అనుమతులూ తీసుకున్నాం …. ఈ యాగం వల్ల వర్షం కురిస్తే మా ఒక్కళ్ళ కోసం కురుస్తుందా? ఫలితం అందరికీ కావాలంటే ఆమాత్రం త్యాగం చెయ్యక తప్పదు మరి.”
“అయ్యా! బతికుంటే కదా ఫలితం అనుభవించేది! ఇక్కడ మేము దాహంతో చచ్చిపోతున్నాం. మేము చచ్చాక వర్షాలు పడితే ఎవడికి కావాలి? పడకపోతే ఎవడికి కావాలి? చచ్చాక మేము వచ్చి చూసేది లేదు చచ్చేది లేదు.” – ఎలీ తన మనసులో మాట బయటపెట్టింది.
“మీరు ఎంత అరిచిగీపెట్టినా ఎవ్వరికీ నీళ్ళు దొరకవు. పెద్దపెద్దవాళ్ళు వస్తున్నారు. రేపు స్వయంగా మంత్రిగారు వస్తున్నారు. పోండి ఇక్కడి నుండి.”
“ఏదేమైనా మేము నీళ్ళు తీసుకుని కానీ ఇక్కడి నుండి కదలం.” – అంటూ ఎలీ నీళ్ళ ట్యాంకరు వైపు కదిలింది. ఒకపక్క యాగం నడుస్తూనే ఉంది. కానీ అందరి దృష్టి నీళ్ళ ట్యాంకరు వైపే …. ఎలీని చూసి మిగిలిన ఆడవాళ్ళు కూడా ట్యాంకరు వైపు కదిలారు. ఎలీ తన బకెట్ ట్యాంకరు కింద పెట్టింది. ఇంతలో వెనకనుండి ఎవరో ఆమెపై దాడి చేసారు. ఆమెని కాపాడదామని మిగిలిన ఆడవాళ్ళు ఎంతో ప్రయత్నించారు. ఇంతలో చాలామంది మూకుమ్మడిగా దాడిచేసారు. విచిత్రం …. ఆ దాడిచేసిన వాళ్ళలో కొందరు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. చిన్న గొడవ చిలికి-చిలికి గాలివాన అయ్యింది. ఎలీ తూలి కింద పడింది. తర్వాత ఏమయిందో ఆమెకి తెలియలేదు. నేలమీద బొక్కబోర్లా పడింది. నడుం కళుక్కుమంది. విపరీతమైన నొప్పి… దానికి తోడు నాలుక పిడచ కట్టుకుపోయేంత దాహం. కళ్ళు బైర్లు కమ్మాయి. చూస్తూచూస్తూనే కళ్ళు మూతలు పడుతున్నాయి…. ఎన్నో ఏళ్ళ అలసట తీరుతున్నట్టుంది.
స్పృహ వచ్చేసరికి ఎలీ ఆసుపత్రి మంచం మీద ఉంది. తనతో పాటు మరొక ఇద్దరు ఆడవాళ్ళకి కూడా దెబ్బలు తగిలాయి. తనకి మాత్రం నడుముకి గట్టి దెబ్బ తగిలింది. డాక్టరు అస్సలు కదలొద్దని చెప్పి వెళ్ళారు. కళ్ళు తెరిచి చూస్తే భర్త పక్కనే ఉన్నాడు. అంత నొప్పి-బాధలో కూడా ఆమె ముఖంపై చిన్న చిరునవ్వు విరిసింది. పక్కన భర్తతోపాటు ఇరుగుపొరుగు వాళ్ళు, పక్క ఊరువాళ్ళు కూడా ఉన్నారు. ఆ యాగానికి మంత్రి గారు వస్తూండటం వల్ల కొంతమంది పత్రికా విలేఖరులు ముందురోజే అక్కడికి వచ్చారు. సరిగ్గా అప్పుడే ఈ గొడవ జరగడంతో వార్త తొందరగా బయటకి పొక్కింది. మంత్రి గారు ముందు ఆసుపత్రికి వచ్చి, గాయపడిన వారిని పరామర్శించి అప్పుడు యాగం దగ్గరకి వెళ్తారని తెలిసింది. అయితే వీటన్నిటివల్ల బస్తీలో నీటి సమస్య తీరుతుంది అని ఎలీ సంతోషించింది. మంత్రిగారు వచ్చి తనని కలుస్తారని, అప్పుడు తమ మంచినీటి సమస్య గురించి మొరపెట్టుకోవచ్చని ఊహించుకుంది. మంత్రిగారు నలుగురి ముందూ కాదనలేరనీ, మంచినీటి సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూపిస్తారని ఎలీ ఆశ. ఇంతకు ముందు తను ఎప్పుడు ఆసుపత్రికి వచ్చినా పట్టించుకున్న నాథుడు లేడు. అసలు ఎందుకు పట్టించుకోవాలి! ఇప్పుడు ఇంత హడావుడిలో కూడా తనని ఎంతో జాగ్రత్తగా ప్రత్యేకంగా చూసుకుంటున్నారు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, నొప్పి అయితే భరించలేకుండా ఉంది. మంత్రిగారి కుటుంబ సభ్యులు వచ్చి, ‘మంత్రిగారి ముందు మరీ ఎక్కువ మాట్లాడొద్దని, కుశల ప్రశ్నలకి మాత్రం జవాబు చెప్పమని’ హెచ్చరించారు. మంత్రిగారి గౌరవానికి మచ్చ రాకుండా చూసుకోవాలని వాళ్ళ తాపత్రయం.
మరుసటి రోజు ఉదయం. మంత్రిగారు ఆసుపత్రికి రావడానికి గంట ముందు నుండే హడావుడి మొదలయిపోయింది. ఎలీ మొగుడు వచ్చి – “ఇంట్లోకి రెండు కొత్త బకెట్లు వచ్చాయి. వేలు రోజూ వచ్చి నీళ్ళు పోసి వెళ్తాడు. ఈ ఆసుపత్రి ఖర్చు అంతా కూడా మంత్రిగారి చుట్టాలే భరిస్తున్నారు. కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకు.” అన్నాడు. ‘మంత్రి గారు ఆసుపత్రికి వచ్చారు. రోగులని పరామర్శించారు’ అని వార్తలు వచ్చాయి. పరామర్శించడం అంటే అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే అని మాత్రం రాయలేదు వార్తల్లో! పరామర్శించడం అంటే మాట్లాడాలి కదా! కానీ, మంత్రి గారు అలా ఏం చెయ్యలేదు. ఎలీ మొగుణ్ణి పక్కకి పిలిచి ఏదో చెప్పి వెళ్ళిపోయారు. దెబ్బలు తగిలింది, మంచం మీద ఉన్నది పెళ్ళం అయితే ఆమె మొగుణ్ణి పరామర్శించడం ఏంటో ఎలీకి అర్థం కాలేదు. ఎలీకి మనసు చివుక్కుమంది. ఈ నొప్పి, బాధంకంటే ఇంత పెద్ద అబద్దం ఆమె మనసుని కష్టపెట్టింది. లోకంపై ఉన్న కోపం అంతా ఆమె ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒకరకంగా ఇది ఆమె చేసిన తిరుగుబాటుని వెక్కిరించడమే. అయితే అక్కడ ఆమెని పట్టించుకునే వాడు ఎవడూ లేడు. మంత్రిగారు వార్తల్లోకి వచ్చారు… వెళ్ళారు. కానీ ఎలీ పరిస్థితి మాత్రం అలాగే ఉంది. ఆసుపత్రి మంచం మీద …. నిస్సహాయంగా!
ఆ ఆసుపత్రి ఎంత వేగంగా వార్తల్లోకి ఎక్కందో అంతే వేగంగా వార్తల్లో నుంచి కనుమరుగయిపోయింది కూడా! ఎలీ పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారయ్యింది. రోజు మొత్తంలో ఒకటి రెండుసార్లు నర్సు వస్తే వచ్చినట్టు …. లేదంటే అంతే సంగతులు. మంత్రిగారు వచ్చి వెళ్ళాక ఒక్క డాక్టరు కూడా ఎలీ మంచం వైపు తొంగి చూడలేదు. కట్టుకున్న మొగుడే రెండేసి రోజులు కనబడకుండా పోతే ఇంక బయటివాళ్ళ గురించి ఏం చెప్పేది! ఒంటికి-రెంటికి కూడా వేరేవాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి దాపురించింది. ఎవరైన కనికరించి ఆ బాత్రూమ్ వరకు తీసుకెళ్తారు … లేదంటే కాళ్ళీడ్చుకుంటూ తాను వెళ్ళాల్సిందే. ఒకరోజు నర్సు వచ్చి – “ఇలా ఇక్కడ ఎన్నాళ్ళని ఉంటావు! విశ్రాంతి తీసుకుంటేనే ఈ నొప్పి తగ్గేది. అయినా వయసు అయిపోయాక వచ్చే ఈ నొప్పులు అంత తొందరగా తగ్గవు. మీ ఆయన్ని పిలుచుకో. ఇంటికి వెళ్ళిపో.” అంది. ఎలీ మొగుడు రెండురోజుల తర్వాత వచ్చాడు. అది కూడా సారా మత్తులో తూగుతూ! వస్తూనే ఎలీ మీద చిందులు తొక్కాడు.
“ఇంట్లో నీకు చాకిరీ చెయ్యడానికి ఏమన్నా పదిమంది నౌకర్లు-చాకర్లు ఉన్నారనుకున్నావా? ఇక్కడే ఉండు!” అని ఇంతెత్తున ఎగిరాడు.
“నాకూ ఇక్కడే ఉండాలని ఉంది. ఇక్కడ కనీసం మంచం-పరుపు అయినా ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు బాత్రూమ్ వరకు తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు. ఇంట్లో ఎవరున్నారు ఇవన్నీ చెయ్యడానికి? నువ్వా ఇంటిపట్టున ఉండే రకం కాదు!” – అంది ఎలీ.
ఎలీ మాటలకి ఆమె మొగుడికి కోపం వచ్చింది. రాకపోతే ఆశ్చర్యపోవాలి కానీ, వస్తే ఆశ్చర్యం ఏముంది! అయితే నర్సు ఎలీ మొగుడిని చెయ్యి పట్టుకుని బయటకి తీసుకెళ్ళింది. గంట తర్వాత ఎలీ మొగుడు ఒక నడివయస్సు ఆటోడ్రైవరు ని వెంటబెట్టుకుని వచ్చాడు. ఎలీ మొత్తానికి ఎలాగో ఆటోలో ఇల్లు చేరింది.
ఇంట్లో రెండు మూడు రోజులు బాగానే గడిచాయి. రోజంతా మొగుడు ఇంట్లోనే ఉన్నాడు కూడా! ఇద్దరు-ముగ్గురు ఇరుగుపొరుగు వాళ్ళు కూడా వచ్చి, చూసి పలకరించి వెళ్ళారు. మెల్లగా విషయం బయటపడింది. తోపులాటలో గాయపడ్డ వాళ్ళందరికీ డబ్బులు ముట్టాయి. ఎలీ మొగుడికి మరికాస్త ఎక్కువ రొక్కం ముట్టింది.. లక్ష రూపాయలు వచ్చినా మొగుడు తనకి ఒక్క నయా పైసా కూడా ఇవ్వడనీ, పైగా ఉన్న సొమ్ము అంతా సారాకి తగలేస్తాడని ఎలీకి బాగా తెలుసు. అందుకే మొగుణ్ణి ఏం అడగలేదు. అడిగీ ప్రయోజనం ఉండదని తెలుసు! ఇంకా ఎండలు ప్రతాపం చూపిస్తూనే ఉన్నాయి. మొగుడు రోజూ రెండు సార్లు రెండు ఇడ్లీలు తెచ్చి అక్కడ పెట్టి కల్లు దుకాణానికి పరుగెడతాడు. రోజురోజుకీ నొప్పి పెరుగుతూనే పోతోంది. రోజూ పదిహేను కిలోమీటర్లు సైకిలు తొక్కుకుంటూ చిన్న-చితకా వ్యాపారం చేసుకుని పొట్టపోసుకునే ఎలీ ఇవాళ బాత్రూమ్ కి ఎవరు తీసుకెళ్తారా అని ఎదురు చూస్తోంది. ఎలీ ఇప్పుడు నిస్సహాయతకి మారుపేరులా ఉంది.
మళ్ళీ ఒకరోజు ఎలీ మొగుడు ఆ ఆటో డ్రైవరుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి ఫూటుగా తాగారు. ఎలీకి కూడా తినడానికి దోశ, సమోసా ఇంకా ఏవేవో తీసుకొచ్చారు. చాలారోజుల తర్వాత నోటికి కొత్త రుచి తగిలింది. మర్నాడు ఎలీ మొగుడు – “ఈ ఆటో డ్రైవరు వాళ్ళ ఊర్లో ఒక మంచి డాక్టరు ఉన్నాడు. ఎంత మొండి రోగాన్నీ ఇట్టే నయం చేసేస్తాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్దాం.” అంటూ చెప్పుకొచ్చాడు. తను మళ్ళీ మునుపటిలా సైకిలు తొక్కాలి …. తన వ్యాపారం చేసుకోవాలి. పువ్వుల దుకాణం గుర్తొస్తూనే ఎలీ మనసు విలవిల్లాడింది.
మర్నాడు ఆటోలో కొత్త ఊరికి ప్రయాణం. ఎలీ ఇంతకుమునుపు ఎప్పుడూ ఆ ఊరిని చూడలేదు. కనీసం ఆ ఊరి గురించి వినలేదు కూడా. అక్కడి ఎండలు చూస్తే తన ఊరే మేలు అనిపించింది. దానికితోడు నొప్పి-బాధ. ఊరూ-పేరు తెలియని కొత్త ముఖాల మధ్య మొగుడు మాత్రం ఎంతని బయట తిరుగుతాడు! కాసేపు అలా-అలా తిరిగి మళ్ళీ ఎలీ దగ్గరకి వచ్చేసాడు. ఎలీకి మళ్ళీ ఆ పాతరోజులు తిరిగొస్తాయన్న ఆశ చిగురించింది.
ఎలీ రాత్రంతా నొప్పితో మూల్గుతూనే ఉంది. ఎప్పుడో తెలతెలవారుతూండగా నిద్రపట్టింది. మర్నాడు మెలకువ వచ్చి చూస్తే ఆ ఇంట్లో అంతా తమ చుట్టాల సందడి. ఒక్క క్షణం ఎలీకి ఏమీ అర్థం కాలేదు. అంతా ఏదో కలలా ఉంది. ఏళ్ళతరబడి చూడని, ఎప్పుడూ తమ ఇంటి గడప కూడా తొక్కని చుట్టాలని చూసి ఎలీ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అయితే వాళ్ళంతా ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చారో మాత్రం అర్థం కాలేదు. ఈ ఊళ్ళోనే ఏదైన పెళ్ళో-పేరంటమో ఉంటే వచ్చారేమో …. విషయం తెలిసి తనని చూసిపోదామని వచ్చి ఉంటారులే అనుకుంది. అయితే ప్రాణాలు జిల్లార్చుకుపోయేంత ఆ నొప్పిలో ఆమె అంతకు మించి ఆలోచించలేక పోయింది.
వంటింట్లో పూరీలు వేయిస్తున్న వాసన ఎలీని కుదురుగా ఉండనివ్వట్లేదు. చుట్టాలకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. పూరీల్లోకి రెండు మూడు రకాల కూరలు… పాయసం.. ఇలా ఎన్నో ఊహించుకుంది. ఈ రోగంతో రుచి చచ్చిపోయిన నాలుక కొత్త రుచులు కోరుకుంటోంది. అందరూ సుబ్బరంగా తినేసి కూర్చున్నారు. కానీ ఎలీని ఎవ్వరూ తిన్నావా, తింటావా అని అడిగిన పాపాన పోలేదు. ఏర్పాట్ల హడావుడిలో మర్చిపోయి ఉంటారులే అని తనికి తాను సర్దిచెప్పుకుంది. మొగుణ్ణి పిలిచి అడిగింది. మొగుడు చెప్పిన జవాబు విని ఎలీకి నోట మాట రాలేదు –
“రేపు నిన్ను చూడటానికి డాక్టరు వస్తారు. అప్పటివరకు నీకు తినడానికి ఏమీ పెట్టద్దన్నారు.”
ఎలీకి ఒళ్ళు మండిపోయింది. అయితే ఆ నొప్పిని తట్టుకుని ఎదురుతిరిగే ఓపిక లేక మౌనంగా ఉండిపోయింది. ‘నాకు ఆకలితో చావమనే రాసిపెట్టి ఉంది కాబోలు’ అని మౌనంగా కళ్ళుమూసుకుంది.
క్రమక్రమంగా ఇంట్లో హడావుడి ఎక్కువ అవుతోంది. ఈ నొప్పికి ఆకలి తోడయింది. కానీ భరించడం తప్ప ఎలీకి వేరే దారిలేదు. తన తాగుబోతు మొగుడు ‘మంచితనం’ ముసుగు వేసుకుని చుట్టాల మధ్య హడావుడిగా తిరుగుతూ సందడి చేస్తున్నాడు. పేకాట-కబుర్లు జోరుగా సాగుతున్నాయి. ఎలీ మాత్రం ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తోంది.
ఆరోజు రాత్రి కూడా నొప్పితో ఎలీకి నిద్రపట్టలేదు. మామూలుగానే శరీరం వడిలిపోయింది. పైగా దానికి తోడు ఈ నొప్పి … పథ్యం …డాక్టరు కోసం ఎదురుచూస్తూ లంఖణాలు.. ఇవన్నీ కలిసి ఎలీకి ఏడుపు తన్నుకొచ్చింది. మర్నాడు తెల్లవారేసరికి ఎలీ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయింది. కనీసం చెయ్యి కూడా కదపలేనంత నీరసం. ఆ నీరసానికి నోట్లో నుంచి మాట రావడం కూడా కష్టంగా ఉంది. ఇంట్లో అంతా జనాలు సందడి. కానీ ఆమెని పట్టించుకునేవాడు లేడు. ఆ ముక్కు-మొఖం తెలియని ఇంట్లో తన చుట్టాలు, కట్టుకున్న మొగుడూ అందరూ ఉన్నారు. కానీ ఎవరికీ ఎలీ అనే ఒక రోగిష్టిది మంచం పట్టి ఉందని గుర్తు కూడా లేదు. ఆ డాక్టరు ఎప్పుడు వస్తాడో, అసలు వస్తాడో రాడో ఎవరైనా చెబితే బాగుండు. పెదవులు ఎండిపోయి అట్టకట్టేసాయి. ఎలీ ఎండిపోయిన పెదాలు నాలుకతో తడుపుకుంది. ఆమె పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ ఇంత అన్యాయంగా లేదు. ఇప్పుడు ఆమె పరాన్నజీవి… పైగా రోగిష్టిది..!
“డాక్టరు ఇవాళ రాలేకపోయాడు. రేపు కచ్చితంగా వస్తాడు. ఒకవేళ రేపు కానీ రాకపోతే నీకు అన్నం పెట్టేస్తాను. నీ బాధచూసి నేను తట్టుకోలేకపోతున్నాను.” – మధ్యాహ్నం తర్వాత మొగుడు చెప్పిన మాటలకి ఎలీ కళ్ళల్లో చిన్న కన్నీటి పొర. అయితే అది మొగుడు చూపిస్తున్న ప్రేమవల్లనా లేక ఆకలి వల్లనా చెప్పడం కష్టం. నొప్పికి ఏడవటం ఎప్పుడో మానేసింది తను. అది తన ఏడుపుకి తగ్గే నొప్పి కాదు అని ఆమెకి మెల్లమెల్లగా అర్థమైంది. అందరికీ ఎందుకో రోజు చాలా సాగుతున్నట్టు అనిపిస్తోంది. చుట్టాలకి విసుగ్గా ఉంది. ఇంచుమించు అందరూ ఆ ఎండకి మధ్యాహ్నం జోగుతూనే ఉన్నారు. సాయంకాలం అయ్యేసరికి కొందరు సారాతో సహవాసం మొదలుపెట్టారు. ఆ రాత్రి ఎలీకి కాళరాత్రిలా అనిపించింది. ఆకలికి తట్టుకోలేక వెళ్ళి కాస్త ఏమన్నా తిందామని లేవడానికి ప్రయత్నించింది. అంతే, మంచం మీద నుంచి కింద పడింది. ఆ చప్పుడుకి అందరూ ఒక్కసారి లేచి అక్కడ గుమిగూడారు. నలుగురు కలిసి ఆమెని మళ్ళీ మంచం మీద పడుకోబెట్టారు. ఇప్పుడు నొప్పి మరీ ఎక్కువ అయిపోయింది. ఎవరైనా ఆ నడుము, శరీరం వేరు చేసేస్తే బాగుండును అనిపించింది. విపరీతమైన నొప్పి-నీరసంతో ఎలీకి స్పృహతప్పింది.
పొద్దున్న పొద్దున్న ఎముకలు కొరికే చలికి ఎలీకి మెలుకువ వచ్చింది. కనీసం కళ్ళు తెరిచే ఓపిక కూడా లేదు. సగం మూసి సగం తెరుస్తున్న కళ్ళ సందులో నుంచి చూస్తే ఎలీ పైన ఎవరో చన్నీళ్ళు పోస్తున్నారు. ఒంటిమీద నూలుపోగు లేదు. బట్టలు ముందే ఊడదీసేసినట్టున్నారు. ఎవరో తనమీద దుప్పటి కప్పారు. అంతే ఎలీకి స్పృహ తప్పింది. ఎలీ శరీరం చుట్టూ మొగుడు, చుట్టాలు నిలబడి ఉన్నారు. ఎలీ మొగుడు ఎలీ చెంప మీద గట్టిగా కొడుతున్నాడు. ఆ కొట్టడం కూడా నిద్ర లేపుతున్నట్టు … స్పృహలోకి తీసుకొస్తున్నట్టు ఉంది. ఎలీ మెల్లగా కళ్ళుతెరిచింది. ఎవరో ఒకతను ఎలీ నోటికి ఒక గ్లాసు అందించాడు. అవి పేడ కలిపిన నీళ్ళు. ఆకలిమీద ఉందేమో ఎలీ ఒక్కసారి గ్లాసు ఎత్తి గటగటా తాగేసింది. ఇంకా ఆమె వంటిమీద చన్నీళ్ళు పోస్తూనే ఉన్నారు. నొప్పి, చలి, ఆకలి, నీరసంతో ఎలీకి స్పృహతప్పింది. ఒక పెద్ద వాంతు అవడంతో ఆమెకి మెలకువ వచ్చింది. చూస్తూచూస్తూనే వరసగా నాలుగైదు వాంతులు అయిపోయాయి.
ఆమెని ఒంటరిగా వదిలి అందరూ దూరం జరిగారు. బహుశా ఎలీకి విపరీతమైన జ్వరం తగిలినట్టుంది. ఆ పేడనీళ్ళ వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ అయినట్టుంది. పైగా చాలా నీరసంగా కూడా ఉందాయె. బయటకి తెలిసేది, కనిపించేది ఇదే!
ఎలీకుట్టి స్పృహలో ఉందా, స్పృహ కోల్పోయిందా లేక మొత్తానికే చచ్చిపోయిందా – చెప్పడం కష్టం. అయితే చివరిసారి తన మొగుడి ముఖం మీద కాండ్రించి ఉమ్ము వెయ్యాలని మాత్రం చాలా బలంగా అనుకుంది ఎలీ! రోగిష్టి పెళ్ళం పీడ వదిలించుకోవడానికి తన మొగుడు ఆఖరికి ఈ దారి ఎంచుకున్నాడు మాట! ఇంక ఆ వైగయీ నదే తనని కాపాడగలదు!
***
‘తలైకూతల్’ అన్నది తమిళనాడులోని వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ఒక ఆచారం. ఈ ఆచారం ప్రకారం వయసు ఉడిగిపోయిన ముసలివాళ్ళ బాధ్యత వదిలించుకోవడం కోసం వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంటారు. ఈ చంపడానికి – చల్లటి నీళ్ళతో స్నానం చేయించి కొబ్బరినీళ్ళు తాగించడం, పొట్టలో ఇన్ఫెక్షను తయారవ్వడం కోసం పేడ, బురుద, మానవ మలం కలిపిన నీళ్ళు తాగించడం, ముక్కు మూసి పాలు తాగించడం – ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి.
ఇలా చెయ్యడం వల్ల ఆ వ్యక్తి ఒకటి రెండు రోజుల్లో చనిపోతాడు. పైగా పోస్టుమార్టం చేసినా హైపోథర్మియా, కడుపులో ఇన్ఫెక్షన్, గుండెనొప్పి వంటి కారణాలే బయటపడతాయి.
