ఆరాధనను అక్షరాలుగా ఒలకబోసి
మనసును లోతుగా చూసి, మరోసారి చదివి
నాజూకు పదాలను పూలుగా గుచ్చి
ఉత్తరంగా పంపిన అప్పటి ఆర్ద్రత
జవాబు కోసం అహర్నిశల ఆత్రుత
నేటి అసహనపు టెక్స్ట్ కన్నా ఎంతో నయమనిపిస్తుంది
లువ్రాలో ఓ రోజు
లండన్లో మరో రాత్రి
పేరున్న దేశాలకు పరిగెత్తే సెలవుల్లో
ద్రవాల్లో తేలే, చేతుల్లో ఆడే మంచు కన్నా
శారద రాత్రుల్లో, బేలూరు ఆలయాల్లో
శిల్పాల వెచ్చదనం మది మురిపిస్తుంది
రూపాయి ఒక్కొక్కటి పదిలంగా దాచి
పేర్చే ప్రతి ఇటుకను పరవశంగా స్పృశించి
ద్వారాలకు పసుపు రాసి, రంగులను ఏర్చి, కూర్చి
పొదరిళ్ళను తలపించే చిన్న ఇళ్ల స్వాంతన
చలువరాళ్ల భవనాల కన్నా చాలా తృప్తినిస్తుంది
తీరికతో ఓపికతో నాడు డబ్బు కోసం మా ఎదురుచూపు
డబ్బు మాత్రమే ఉన్న ఈ జీవితాలకన్నా ఎందుకో మెరుగనిపిస్తుంది
అనిశ్చితిని, ఒత్తిడిని నిస్సహాయంగా మోసే మీరు
కావడితో సాగిపోయే శ్రవణకుమారుని తలపిస్తారు

