ఎల్విరాలో ఎన్నికల సిత్రాలు

Spread the love

భారతీయ మూలాలున్న  ఆంగ్ల రచయిత వి. ఎస్.  నైపాల్  (1932-2018) సాహిత్య రంగంలో నోబెల్ బహుమతిని 2001లో పొందారు. ట్రినిడాడ్ లో జన్మించిన ఆయన ప్రపంచ సాహితీ చరిత్రలో నవలలు, కథలు, వ్యాసాలు,  యాత్రా రచనల ద్వారా  ఖ్యాతి గడించారు.  నైపాల్ రచనలలో  ‘ఇన్ ఏ ఫ్రీ స్టేట్ ’ ‘ఏ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్,’  ‘ఏ బెండ్ ఇన్ ద రివర్,’  ‘ఇండియా:  ది వూన్డెడ్  సివిలైజేషన్,’  ‘ఎన్ ఏరియా ఆఫ్ డార్క్ నెస్,’  ‘ఇండియా: ఎ మిలియన్  మ్యూటినీస్ నౌ,’ ‘మ్యాజిక్ సీడ్స్,’  ‘ది  సఫ్రేజ్ ఆఫ్ ఎల్విరా,’ ‘ది లాస్ ఆఫ్  ఎల్దొరడో,’ ‘బియాండ్ బిలీఫ్’ తదితర రచనలున్నాయి.

    నైపాల్ తన రచనల్లో నిర్దాక్షిణ్యంగా విమర్శ చేస్తాడు.  భారతీయ నాగరికత బలహీనత , ఎమర్జెన్సీ లో భారత్ పరిస్థితి, భారత్  ప్రజా దైనిక జీవితాల్లోని అసంఖ్యాక తిరుగుబాట్లు చిత్రించడం చేశాడు. ఆఫ్రికా లో స్వాతంత్ర్యానంతరం అవినీతి పాలన, అంతర్గత ఘర్షణలు, వలసవాద ప్రభావాన్ని విశదంగా చూపాడు. ఇస్లామిక్ దేశాలలో పాశ్చాత్య పెత్తనం , ఆ తర్వాత ఇస్లామిక్ మరియు లిబరల్, మార్క్సిస్టు ధోరణుల మధ్య ఘర్షణ, చివరకు ఇస్లామిక్ ఫండమెంటలిజం యొక్క పెరుగుదల ను తన యాత్రా రచనల ద్వారా  ప్రదర్శించాడు.నైపాల్  శైలి ,  నిష్కర్షగా వాస్తవికత   చిత్రణ,  అక్షరాలకు జీవితాంతం  నిబద్ధత  తెలిసిందే . తన పాత్రల అంతర అలజడిని తగు సానుభూతి,  అవసరమైనంత దూరంతో చిత్రిస్తాడు.

    ప్రముఖ రచయిత ముకుంద రామారావు గారి పరిశోధనా గ్రంథం  “అగమ్య  గమ్యాలు ” (2025)లో రాసినట్లు  ట్రినిడాడ్  మొదట స్పానిష్, 1797 తర్వాత బ్రిటిష్ కాలనీగా ఉంది. స్పానిష్ వలస కాక ముందే  అక్కడ కరేబ్ అని పిలువబడే స్థానిక తెగలవారు అయిన టైనో, కాలినాగోలు ఉన్నారు.    చెరకు తోటలో పని  కోసం భారత్ నుంచి 1845 – 1917ల మధ్య 1,43,939 మందిని ఒప్పంద కూలీలుగా ట్రినిడాడ్ కి తీసుకొని వెళ్లారు. బెంగాల్ బీహార్ ఉమ్మడి ప్రావిన్స్ లో   అధిక వేతనం ఆశతో,కరువు, కుల వ్యవస్థ, దళారీల  వంచన వల్ల  ఒప్పంద కూలీలు సాగరంపై నానా కష్టాలు పడి ప్రయాణించి  ట్రినిడాడ్ చేరారు. తెలియని భాషలో ఒప్పంద సంతకం చేసిన వలస  కార్మికుల అదుపు కోసం అక్కడ  ఎన్నో శాసనాలు ,  శిక్షలు ప్రవేశపెట్టారు. యజమానుల లైంగిక దోపిడీ , భర్త ఆధిపత్యం వల్ల ప్రధానంగా స్త్రీల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి.ఒప్పంద కాలం ముగిసినప్పటికీ తిరిగి స్వదేశం వచ్చేందుకు సొమ్ము లేక భారతీయ వలస కార్మికులలో 75 శాతం  మంది అక్కడే స్థిరపడ్డారు. వీరిలో వీరి   స్వదేశీ సాంస్కృతిక అలవాట్లు సైతం నిలిచిపోయాయి.            .

   ప్రస్తుత నవల అయిన “ ది సఫ్రేజ్ ఆఫ్ ఎల్విరా”(1958)  అందరికీ ఓటు హక్కు 1946 లో వచ్చిన పిదప స్థానిక  ఎన్నికల సన్నివేశాన్ని, భిన్న వ్యక్తుల ఎత్తులు, జిత్తులను, వారి మారే అదృష్టాలు  ఆసక్తికరంగా వర్ణిస్తుంది. ఈ నవలలో  ఎన్నికలలో యుక్తులు, కుయుక్తులు ఎన్నో. సాయం పేరుతో డబ్బు అడగటం, కుక్క వల్ల ఒక కుటుంబం నాశనం అవుతుందని మూఢనమ్మకాల్ని ప్రచారం చేయటం, ఓటు బ్యాంకు కోసం పోటీ, ప్రచారంలో పోటీ, గెలవాలనే తపన, ఓటింగ్ అనేది దైవ వ్యతిరేకమైన ప్రచారం, చిల్లర తగాదాలు ,రాజీలు అన్నిఆసక్తికరంగా  వర్ణించబడ్డాయి.

   హర్బన్స్ ఒక కాంట్రాక్టర్ మరియు  రాజకీయ నాయకుడు. ఎల్విరాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి. అతడు ఆ ఊర్లో ప్రచారంకి భక్ష్, చిత్తరంజన్ అనే ఇద్దరు ప్రభావమున్న వ్యక్తుల్ని కలవాలని బయలుదేరుతాడు.భక్ష్ ముస్లింల నాయకుడు, ఏడుగురు పిల్లలున్న పెద్ద కుటుంబానికి పెద్ద. హర్బన్స్ తన సాయం అడిగినపుడు భక్ష్ ముందు అతిశయం చూపించినా  చివరకు అంగీకరిస్తాడు.

   భక్ష్, అతని  పెద్ద కొడుకు ఫోమ్ ఇద్దరు హర్బన్స్ ను ప్రచారం నిమిత్తం ఒక వ్యాన్, లౌడ్ స్పీకర్ లు అద్దెకు తీసుకోమని ఒత్తిడి చేస్తారు. దానికి డ్రైవర్ గా ఫోమ్ ఉండి తన ప్రత్యర్ధి అయిన మరో యువకుడు లోర్కూర్ ను దెబ్బతీయాలని అనుకుంటాడు. హర్బన్స్ స్వర్ణకారుడు అయిన చిత్త రంజన్ ను కలిసి అతడు తన డబ్బు వడ్డీకి ఇచ్చిన హిందువుల,  స్పానియార్డుల ఓట్ల కోసం ప్రయత్నించాలని భావిస్తాడు.

   ఇరుగు పొరుగున ఉండే  చిత్త రంజన్, రామ్ లోగాన్ లు  తమ ఆవరణలో చెట్ల పూలు ఫలాలు పొరుగువారికి పోతున్నాయని ఇద్దరికీతగాదా. చిత్త రంజన్ తన కూతురు నెల్లిని హర్బన్స్ కుమారునికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలనే ఒప్పందం తో మెజార్టీ ఓట్లను  హర్బన్స్ కు పడేలా చేస్తానని వాగ్దానం చేస్తాడు. రామ్ లోగాన్ మద్దతుతో హర్బన్స్ గెలిస్తే అతడి  అనుయాయులకు మద్యం పోయించేందుకు హర్బన్స్ అంగీకరిస్తాడు.

   ఎన్నికల పోటీలో మరో అభ్యర్థి ప్రీచర్. ఇతనికి మద్దతుగా ప్రచార మేనేజర్ గా  లోర్కూర్, అతడికి దన్నుగా ఒక ఉపాధ్యాయుడు. ఒక డిబేట్ పోటీలో తన్ను ఓడించి, సినిమా హాల్లో లౌడ్ స్పీకర్ ప్రకటనదారు గా ఉద్యోగం తెచ్చుకున్న లోర్కూర్ అంటే ఫోమ్ కు పడదు. హర్బన్స్ ను గెలిపించి లోర్కూర్,  ఉపాధ్యాయుడు ఇద్దరి నీ అవమానించాలని ఫోమ్ కోరిక.

   కార్డోబా లో స్పానిష్ వారి వ్యతిరేకత వల్ల  ఓడిపోతానని, ఖర్చు కూడా పెరుగుతోందని హర్బన్స్ ఆందోళన చెందుతాడు. అతడికి  ఖర్చు పెరగటం తప్పదని ధని రామ్ , చిత్త రంజన్ , భక్ష్ చెబుతారు. .ఫోమ్, అతని చిన్న తమ్ముడు హెర్బర్ట్ ఒక కుక్కని పిల్లను ఇంటికి తీసుకురాగా మిస్సెస్ భక్ష్ హెర్బర్ట్ ను  దండించి వారిద్దరితో ఒట్టు వేయించుకుంటుంది. వారి కుటుంబ  నాశనానికి  ప్రీచర్ పెట్టిన  శాపానికి భయపడుతుంది మరోవైపు ‘విట్నెస్’ బృందానికి చెందిన సభ్యురాళ్ళు ఇద్దరూ ఓటు వేయవద్దని ప్రచారం చేస్తూ ఉండటం ప్రధాన ప్రత్యర్థులు అయిన హర్బన్స్, ప్రీ చర్ ఇద్దరికీ కంటకంగా మారుతుంది.

   హర్బన్స్ కు మద్దతు ఇచ్చే మహదేవ్ నల్ల జాతీయులలో జబ్బు పడిన వారి, చనిపోయిన వారి జాబితా తయారు చేస్తూ అవసరం ఉన్నవారికి సాయం చేయడం ద్వారా ఓట్లు రాబట్టాలని ప్రయత్నిస్తుంటాడు. అతన్ని  నల్ల జాతీయుడైన మిస్టర్ కఫీ తిరస్కరిస్తాడు. భక్ష్  ఒక పెద్ద కుక్క తెల్లవారి కల్లా చిన్నది అవుతుందని మూఢ నమ్మక కథను ఊర్లో ప్రచారం చేస్తుంటాడు. చిత్తరంజన్ రామ్ ప్యారి భర్త దగ్గరకు వెళ్లి అతడి అప్పు అవసరం గురించి చెప్పి బెదిరిస్తుంటాడు.

      నైపాల్ శైలి  లోని హాస్యం పాఠకుని  పెదాలపై చిరునవ్వు తెస్తుంది. రామ్  లోగాన్ తన షాపు నుంచి హక్ వెళ్లిపోయిన తరువాత  ఆయిల్ ను  ముఖంపై రుద్దుకొని ,వాసన చూసి తాగటం మినహా   అన్నీ చేస్తాడు.

    భక్ష్  కూడా ముస్లిం ఓట్లను చీల్చేందుకు అభ్యర్థిగా రంగంలోకి దిగి రెండు వేల డాలర్లు ,డిపాజిట్ డబ్బు తనకు ఇవ్వాలని  హర్బన్స్ ను కోరతాడు. ప్రీచర్ యొక్క డ్రైవర్, ప్రచార మేనేజర్ అయిన లోర్కూర్ ఐదు వందల డాలర్లు ఇస్తే హర్బన్స్ కు  అనుకూలంగా ఓట్లువేయిస్తానంటాడు.  అకస్మాత్తుగా కఫీ మరణించడంతో అతడి  అంత్యక్రియలకు  హర్బన్స్ బృందం సాయం చేస్తుంది .

   ఎన్నికల హడావిడిలో పలు విచిత్రాలు. వీటిలో  డాక్యుమెంటరీ తీద్దామని వచ్చిన ఫోటోగ్రాఫర్ అభ్యర్థుల వినతి వినకుండా  ఆకస్మిక నిష్క్రమణ, ఆహారం, మద్యం తీసుకుని వెళ్లే  హర్బన్స్ వ్యానును  ఒక గుంపు లూటీ చేయడం, తమకు ఆహారం, మందు  అందనందుకు టాక్సీ  డ్రైవర్లకు కోపం రావటం, పోలింగ్ స్టేషన్ కి వెళ్లి ఓటర్ల పేర్లు పెద్దగా చదువుతూ ఓటింగ్ ఆలస్యం చేసేందుకు  క్లర్క్ ను హర్బన్స్ డబ్బు ఇచ్చి ప్రలోభపట్టడం లాంటివి కొన్ని . తర్వాత  ఎన్నికల ఫలితాల్లో   గెలిచి ప్రజలకు పార్టీ ఇచ్చేందుకు మళ్లీ ఎల్విరా కు వస్తాడు .  రామ్ లోగాన్ ఎన్నికల కమిటీ కే మందు పార్టీ అనటంతో  జనానికి కోపం వస్తుంది. హర్బన్స్ కారు  అకస్మాత్తుగా దగ్ధమవడంతో అతడు  వెళ్ళిపోతూ ఇక ఎప్పుడు ఎల్విరాకు తిరిగిరానంటాడు.

      నైపాల్   రచన  వలసవాద పక్షపాతం అని  కొందరు  విమర్శకులు భావించారు. ప్రస్తుత నవలలో లిబరల్ ప్రజాస్వామ్య దృక్పథం నుంచి  ఎన్నికల్లో కనబడే    వికార వాస్తవంపై అతడి విమర్శ కాదనలేని సత్యం.

–డా.జె.రవీంద్రనాథ్ 

డా. జె. రవీంద్రనాధ్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *