స్త్రీల కోరికలు – ఒక ప్రతిఘటన!

Spread the love

1) ఖాళీ శబ్దం!
(సిల్వియా ప్లాత్ కోసం)
..
నా చివరి ప్రియుడు నాతో గంటల కొద్ది మాట్లాడాడు! మాటలు, మాటలు, మాటలు !
అన్నీ ఖాళీ తనం నిండిన డొల్ల మాటలు!
వొట్టి అబద్ధాలు!
చచ్చినట్లున్న చివరి ఫోన్ కాల్ లో అతని గొంతు మారుతూ శృతి తప్పడం అర్థమయ్యేదాకా నేను ఎదురు చూసాను!
నాకంటే ముందు తనే ఫోన్ పెట్టేసాడు!
నేను మృత్యు సమానమైన ఆ చచ్చుబడినతనంలోనే అతని కోసం నిరీక్షిస్తూ ఉండిపోయాను!
~
గ్యాస్ స్టవ్ మంట సిల్వియా మౌనాన్ని మరింత ఎర్రగా మార్చిపడేసి ఉంటుంది!
ఆ స్టవ్ లోనే మరి
ప్రియుడు దొరకని సిల్వియా తన తలని పెట్టి చనిపోయింది!
~
హృదయంలోని ఖాళీతనాన్ని ఏ మాటలతో వర్ణించాలి?
ముక్కలైపోయిన,విరమించుకోబడ్డ ఖాళీతనాన్ని చెప్పండి?
స్త్రీలకి మాత్రమే ప్రత్యేకించబడ్డ భావోద్వేగాలుగా ఆపాదించబడ్డ,ముద్ర వేయబడ్డ సిల్వియాలోని ఖాళీతనాన్ని?
మరి.,
నాలోని శూన్యాన్ని వాళ్లేమని పిలుస్తారో వినాలని ఉంది!
~
వాళ్ళకసలు మనుషుల్లోని ఖాళీతనం అర్థమైతే కదా?
అవును! ఖాళీతనానికీ తనదైన ప్రత్యకమైన శబ్దం ఉంటుంది!
పవిత్రమైన, చీకటి లాంటి,లోతైన శబ్దం!
బ్రద్దలైన విష్కీ సీసాలు చేసే శబ్దం!
ఊపిరాడని గొంతు చేసే ఉక్కిరిబిక్కిరి శబ్దం!
చేతుల మీది చీలికలు చేసే శబ్దం!
~
అసలు విషయం ఏమిటంటే,
దేన్నైనా సరే తనంత తానుగా ఎన్నుకోవడమనేది స్త్రీలకున్న ప్రత్యేక హక్కని వాళ్ళసలు ఎందుకనుకోరో అర్థమే కాదు!


2) మా పేరుతో యుద్ధాలు చెయ్యకు!

~
ప్రేమ కంటే ఎక్కువగా యుద్ధమే నిన్ను బాధ పెడుతుంది!
అంటాడు నా మాజీ ప్రియుడు!
అవును అతను మగవాడు మరి!
అతనికి యుద్ధమూ శాంతీ రెంటిలో నమ్మకం లేదు!
ఆడవాళ్లు అతనికి చదరంగంలో పావులు మాత్రమే!
~
యుద్ధ విరమణ జరిగినప్పుడు ఆ భీభస్థాన్ని,నష్టాన్ని సమర్థించుకోవడానికి ఆ యుద్దోన్మాధులు మా పేర్లు వాడుకుంటారు!
యుద్ధం తర్వాతి శాంతి వాతావరణంలో వాళ్ళు
అచ్చం రాబందులు శవాలని పీక్కు తిన్నట్లుగానే మా స్త్రీల శరీరాలతో విందు చేసుకుంటారు!
~
అన్నట్లు నా మాజీ ప్రియుడు ఎప్పటికీ అర్థం చేసుకొనిదేంటంటే,
యుద్ధం ఎన్నటికీ మమ్మల్ని వదిలిపెట్టదని!
నిత్యం మేము యుద్ధం చేస్తూనే ఉంటామని!
~
ఉదయమే మేము మా సమాదుల్లోంచి లేవడం అతను చూడడా?
తమను తాము యుద్ధ వీరులుగా ప్రకటించుకునే వాళ్ళకి,మమ్మల్ని ప్రేమతో
కాకుండా భర్త అనే అధికారంతో లొంగదీసుకునే వాళ్ళకి
మేము రోజూ చాయ్ చేసి ఇస్తుంటామని అతనికి తెలియదా !
~
కానీ వాళ్ళు మాత్రం మా స్త్రీల పేర్లు వాడుకుంటూ యుద్ధం చేస్తుంటారు!
మౌమితా ఆలం
గీతాంజలి

Dr. Bharati : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. రచనలు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). ''బచ్ఛేదాని' (కథా సంకలనం). 'పహెచాన్' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం ' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *