సన్నటి ముసురు. నేలంతా బాగా నాని వుంది. అడుగు తీసి అడుగు వేస్తే చెప్పులు, ఆసాంతం బురదలోనికి కూరుకుపోబట్నాయి. ఇంకా గట్లనే నాల్గంగలేస్తే చెప్పుగూడలు వూసిరావడం ఖాయమని పించి చూతుల్లోకి తీస్కొని నడవబట్టిండు. తుఫాను ముసురు మూడ్రోజుల సంది కురుస్తనే వుంది. చెరువు కట్ట మీద గొడ్లు, మేకలు, గొర్లు నడిచిన డెక్కల గోతుల్ల నీళ్ళు నిండి వున్నాయ్. తను అడుగుతీసి అడుగు లేస్తుంటే బురద మోకాలెత్తు లేసి ప్యాంటు తడిపేస్తుంది.ఈ చెరువు కట్ట మీదనించి నడుస్తున్నప్పుడల్లా ప్రభావతి గుర్తుకు వస్తూ వుంటుంది. ఎంత శ్రావ్యమైన గొంతో, చెవుల్లో రింగుమని ఆక్రమించేసి తోడుగా నా పక్కనే నడుస్తున్నట్టు ఫీలింగ్, వరి పొలంలో నాట్లు వేయడానికి వచ్చేది ప్రభావతి. కాలేజు ఎగ్గొట్టి పొలాల చుట్టూ తిరిగేవాడు, వరి పొలాలు అనే బదులు ప్రభావతి చుట్టూ అంటే సరిపోతుంది.పొద్దుపోయాక చీకట్లో ఒకరి చేతులు ఒకరం పట్టుకొని జారి పడకుండా నడిచిన జ్ఞాపకాల ముసురు లో మరోతొవ్వ లేక దీర్గామైన శ్వాస వదిలి గట్లనే నడుస్తుండు. ఊర్లోకి పోయేటందుకు మేన్ రోడ్డు లో బస్సుదిగి నల్ల చెరువు కట్టమీదినుంచే కాలినడకనే రావాలె. ఎండాకాలమైతే బండ్లు, సైకిళ్లు కట్టమీదినించి నడుస్తయి. వర్షంలో మాత్రం కాలినడుకే, తప్పదు. కట్ట మీద మైసమ్మ చింతచెట్టు, చెట్టుమొదట్లో మోకాలెత్తురాయి దానిమీద పసుపు, కు౦కుమ చల్లిన బొట్లు అగుపిత్తన్నై చింతకాయలు ఇర్గకాసేడ్ది, దారెంట వచ్చి పోయేటోళ్ళు చూసి చింతకాయలు కోయడానికి మైసమ్మ తల్లి నెత్తిమీద నుంచి చెట్టెక్కుతరు. అది చూసినోళ్ళు“కండ్లుపోతాయి బిడ్డా, సత్తెనాస్ అయిపోతరు. కింద రాలినయి ఏర్కొతినండ్లి” అని చూసినోళ్ళు గద్దిచ్చుడు. ఎవరూ చూడనప్పుడు గబుక్కున చెట్టెక్కుడు గుర్తొచ్చి తన్లోతనె నవ్వుకున్నడు. అప్పుడే ఆకాశంలో మెరుపు మెరిసింది.’నే నున్నా’నని తెల్లగా మెర్సిపోతూ మైసమ్మబండ కండ్లపడ్డది.
చెరువు కొమ్ముమీద కొద్ది దూరంల మాదిగ్గూడెం, ఇటుపక్కల ఊరు, గూడెంల ఎవరో శోకాలు తీస్తున్నరు ఆడగొంతు. పాపం పెనిమిటో, కడుపు పంటో పోయివుంటరు. యాదికొచ్చి ఏడుస్తుంది. అక్కడక్కడ తడికల సందుల్లనుంచి దీపంబుడ్లు వెల్తురు చిమ్ముతున్నాయి. ఊర్లో గొల్లలు. నాయికపోళ్లు, తురుకలు రెండు కమ్మోరిండ్లు, రెండు బాపనోళ్ళ కుటుంబాలుంటాయి. మాలోళ్ళు వున్నరు వాళ్ళు కూడా ఊర్లనే కలిసేవుంటరు
నేనెప్పుడూ ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షహనాయి విన్లేదు. కాని మాలోళ్ల ఇలంగి గురువయ్య సన్నాయి మాత్రం చిన్నప్పటి సంది వినని పసికందు ఊళ్ళో మిగలడు.తెల్లారగట్ల నాల్గున్నర ఐదుగంటలకి తన కొడుక్కి సన్నాయి నేర్పిస్తూ సాధన చేస్తుండేవాడు. సన్నాయిలో లయ బద్దంగ ఎన్నో పాటలు పాడేవాడు “సన్నాయి వాయిద్యంతోటే ఊరు మేల్కొనేది. పాలేర్లు లేసి రైతులిండ్లకు పోయేటోళ్ళు, గొడ్లసావిడి అలికిడి షురూ అయ్యేడ్ది, పేడ తీసుడు, ఊడ్సుడు, గొడ్లకు పాలు పితుకుడు అరకలు కట్టే ఎడ్లను ఇడ్సి బీళ్ళలో మేతకోసమని తోల్కపోయేటోళ్ళు. కొద్దిసేపటికి కాకులు, పక్షులు రెక్కలల్లార్చుకుంట చెట్లమీది నించి లేసి ఎటో మేతకోసమని వేల్లిపోయేటివి. ఎనకటి రోజులు యాదికొచ్చి ఆలోచన్లు సాగుతున్నయి గని దారి ముందుకు జరగడం లేదు. ఎక్కడ సరుక్కున జారి కట్టకింది మళ్ళలోనో, అటుపక్క చెరువులోకి దొర్లు కుంటూ పోతనో అని మనసులో అనుకుంట అడుగుల అడుగేసుకుంట నడవ బట్టిండు. ఇంతల వరిమళ్ళ మధ్యన గెట్టెంబడి నడిచొస్తున్న సేకుసిందు చేతిలో టార్చి లైటును మొకం మీద పడేటట్టు ఏసిండు. ముఖం కన బడంగనే “అయ్యో చిన్న దొరా తమరా అద్దం రాత్రి రాబట్టింన్రు” అని పలకరించిండు.
“ఎరా సేకుసిందు ఎట్లున్నవు? బోరున వర్షం కురుస్తున్నా చెరువు కాపలాకాస్తున్నవా?” అని అడిగిండు.
“ఎవలకు తప్పినా నాకు తప్పిద్దా చిన్న దొరా” అన్నడు సేకుసిందు.
“నమ్మకస్తుడివిగదా, ఊరోళ్ళందరూ నిన్నే వుండమంటరాయే” అన్నడు తను.
“ఏదో మీ దయకొద్ది రోజులు దొర్లిస్తున్న బాంచెన్” అన్నడు.
“ఏందిరో గూడెపోళ్ళు ఈ రోజు జాగారం చేస్తునార్ర, దీపాలు అన్నిండ్లంల్ల ఆరకుండా వెలుగుతన్నయ్” చీకట్లో అగుపడవని తెల్సికూడా కండ్లెగరేసిండు
“ఏదో గత్తరొచ్చింది, కలికాలం, పోగాల మొచ్చింది దొరా. కాలి కింది చెప్పులు కాళ్ళను అంటిబెట్టుకోనుండక భుజాలెక్కి ఊరేగుతామంటే ఎవరు వప్పుకుంటరు”అన్నడు సేకుసిందు.
“ఏందిరా! ఏం జరిగింది?” అని అడిగిండు.
“రేప్పాద్దుగాల మీరే ఇంటరుగా, నడిరాత్రి మీటింగ్ దేనికి” అని కట్టచివరి దాకా టార్చిలైటు వెలుగు చూపెట్టి కట్ట దాటించిండు.
* * *
ముసురు వెల్సింది, తుఫాను జాడలింకా ఆకాశంనిండా కన్పిస్తనే వున్నయి. పొద్దింకా కనపడ్తలేదు. గొడ్లు, మేకలు, గొర్లు అడివికెళ్తున్నాయి. టైం పది కావస్తంది. తను ఊరికి వచ్చినప్పుడల్లా లేచే వేళ ఇదే. నోట్లో బ్రష్ వేసుకొని ఇంటెనుకకు పోయిండు. వదిన పని మనిషి తోటి ఏదో మాట్లాడుతుంది. దొడ్లోకి పోయి ముఖం కడుక్కొని స్నానం గట్రా ముగించుకొని వచ్చిండు
“అప్పుడే స్నానం జేసినవేంది?” తనవేపు ఆశ్చర్యంగ చూస్తూ వదిన, మళ్లీ తనే
“మీ అన్న ఇప్పటికి రెండు, మూడుసార్లు అడిగిండు లేసిండా, లేసిండా అని” ఆగింది.
“ఎటన్నా పోతుండా?”
“ఈరోజు యాడికిఫోడు, ఊర్లో పంచాయితి వచ్చిపడింది గదా”అంది.
“ఏంది?” నవ్వుకుంటూ అన్నడు. మళ్ళి తనే
“ఊళ్ళో ఏదన్న జంట లేసిపోయింన్లా ఏ౦ది”?అని నవ్వుకుంటా అన్నడు.
“ఎప్పుడూ గయ్యే వుంటాయా ఏంది?”జరంత కోపంగానే ముఖం పెట్టి మళ్ళీ తనే అంది. “ఊరంటే నీకు బొత్తిగా లెక్కలేకుండా పోయింది, చదువుకున్నోనివి గట్లనేనా మాట్లాడేది”అంది.
“సారీ, సారీ వదిన, నీ సీరియస్‌నెస్ నేను పసికట్టలే తప్పైంది క్షమించవా” అని ప్రాధేయపడిండు.
“ఇంజనీరింగ్ చదువుకున్నోనివి, ప్రపంచంపోకడ గురించి నీకు చెప్పగలదాన్నా ఏంటి ? గోబలైవేషన్తో ప్రపంచమంతా చిన్న గ్రామంలా మారిపోతుందని కలలు కనేవాళ్ళుగా మీరంతా” అని అంది వదిన.
“వదినా తిడుతున్నావా, పొగుడుతున్నావా? ఇంతకి నా ఇంజనీరింగ్ చదువుకి, గోబలెవేషన్కు, ఈ రోజు మన ఊర్లోని పంచాయితీకి లింకు ఏంటి? కాస్త వివరించవా” అని ప్రాధేయపడిండు ఏమీ అర్ధం కానట్లు ముఖం పెట్టి.
“ముందు టిఫిన్ తిను ఆ తరువాత చెప్తాను” అంది
“తినుకుంట వింటాను చెప్పు” అన్నాడు.
“మన రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు, హరిజన, గిరిజనులకు పక్కా ఇండ్ల పథకం ‘ఇందిరమ్మ పక్కాగృహాల పదకం’ ఒకటిపెట్టి, ఇళ్ళు కట్టుకోవడానికి కొంత డబ్బు సబ్సీడీకింద మాఫీ చేస్తుంది గదా, ఆ పథకంలో ఇల్లు మంజూరైన ఒక దళితుడు నడి ఊర్లో వున్న తన స్వంత జాగాలో ఇల్లు కట్టుకుంటానికి పునాదులు తవ్వటం మొదలుపెట్టిండు. అగ్గో ఆడనే ఊరు పునాదులన్నీ కదిలిపోయినయి. అందరు గగ్గోలు మొదలు పెట్టిండ్రు. “మాదిగోడే౦ది? నడి ఊర్లో ఇల్లు కట్టుకోవడమేందని, ఇది ఊరా? వల్లకాడా?” అని ఆగక పునాదులు తవ్వడానికి వేసిన ముగ్గు తుడ్చేసి ఇల్లు కట్టుకోవడానికీల్లేదని హుకుం జారీ చేసింన్లు ఊర్లోని పెద్దమనుషులు కొందరు”అని కొద్దిసేపు ఆగింది.
“వాల్లేమంటున్నరు?” ఆసక్తిగా అడిగిండు.
“వాల్లేమన్నా తక్కువ తిన్నరా మా జాగల మేం ఇల్లేసుకుంటే మీకేంది అని తిరగబడింన్రు. తమని కులం పేర తిట్టిండ్రని, తిట్టినోళ్ల మీద ఎట్రాసిటి కేసు పెడతామని ఠానాకు పోతుంటే, అట్లాగాదు నేన్నాయం చేస్తానని చెప్పి మీ అన్న వాళ్ళని ఆగబట్టిండు. అదిగ్గదే ఇప్పుడీ పంచాయితీ” అని తేలగొట్టి వంటగదిలోకి వెళ్ళింది వదిన.
తుఫాను మబ్బు వీడిపోయినట్టు సస్పెన్స్ నుంచి కొద్దిగా తేరుకున్నాడు.నిజంగానే ఈ సమస్య మీద ఎవరూ ఏమీ మాట్లాడకపోవడం ఏంటి? అనే ప్రశ్న మొలకెత్తింది. గాంధీ, గాంధేయవాదులంతా హరిజనోద్దరణ గుళ్ళో ప్రవేశాలగురించే మాట్లాడిండ్రు కాని, ఊళ్ళోకి ప్రవేశించడం పై చాలా మట్టుకు మౌనమే వహించి౦న్రు, గ్రామానికి, గూడేనికి మధ్య వున్న అంటరాని సరిహద్దుని చెర్పే౦దుకు, దాన్ని గురించి మాట్లాడేందుకు ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. మహా అయితే కమ్యూనిస్టు పార్టీల వాళ్ళు సహపంక్తి భోజనాల పేరుతో గూడెంలోకి పోయి ఆ కాసింతసేపు వాళ్ళతో వుండి పండగ తంతులాగ కొద్దిసేపు వాళ్ళతో గడిపి ఉపన్యాసాలు దంచి వచ్చి౦న్రే కాని గూడెపోళ్ళని ఊర్లోకి పిల్చి సహపంక్తి అని తమ పెళ్ళాంపిల్లల్ని తోడుగా కూర్చోబెట్టలేకపోయారు.
ప్రభుత్వాలు పక్కాగృహాలు కట్టిస్తూ కాలనీల పేర పాతగూడెం వున్న చోట్లోనే కొత్తగా మరో “గూడెం” కట్టిస్తున్నరేగని, అంతరాలు చెర్పేసే విధంగ కాకుండా ప్యూడల్ భావాలకు అలవాలంగ నిల్చే ప్రమాణాలనే కొలబద్దలుగా పాటిస్తూ వస్తున్నారు. మార్పును తీసుకురాలేకపోతున్నారు. భూస్వామ్య పెత్తందారీతనం బాగా వేళ్లూనుకున్న గ్రామీణ వ్యవస్థ అంతతేలిగ్గా మారుద్దా. అందుకు ఎవరో ఒకరు ప్రయత్నం చేయాలిగ ఆ ప్రయత్నం మొదలైందనిపించింది.
“ఏంటయ్య తెగ ఆలోచిస్తున్నవ్?” వంటగదిలోంచి వస్తూ తన వాలకం చూసి పలకరించడంతో తేరుకొని, చేయికడుక్కొనికి డైనింగ్ టేబుల్ దగ్గరి నుంచి లేసిండు.
“ఊర్లొ జాగా యాడిది వాళ్ళకు?”
“అది ,గదే. నిన్నటి సంది మీ అన్న మల్లగుల్లాలు పడుతుంది, తీరా వాకబ్ చేయంగా తేలిందెంద౦టే కరీముల్లా అనేటాయన బిడ్డ పెండ్లికి అప్పు ఊర్లొ పుట్టక పోవడంతో గూడెం వాళ్ళ దెగ్గర తీసుకున్నడంట. అప్పు తీర్చ లేక ఆ స్థలం రాసిచ్చి౦డు” అని ఆగింది.
వదిన, పిల్లలతోటి మాట్లాడుకుంటనే ప్రతి ఐదు, పది నిమిషాలకోపాలి గేటువేపు చూస్తుండు అన్న వస్తడేమోనని. వచ్చీరాంగనే పంచాయితీ పరిష్కారం గురించి అడగాలని ఆరాట పదుతుండు. అన్న ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తనే పంచాయితీ దగ్గరకెళ్ళిండు.
ఊర్లోని పంచాయితీలన్నీ ఈ చింతచెట్టు కిందనే జరుగుతుంటయి. ఎన్నో న్యాయ, అన్యాయాలకు సాక్షిగా నిలబడి ఉన్నట్టుగా అగుపిస్తుందీ చెట్టు. వందమందికి పైగానే చెట్టునీడన కూర్చోని వున్నారు జనం. చెట్టు చుట్టూర అరుగు కట్టించి వుంది. ఆ అరుగు మీద ఐదారుగురు పెద్ద మనుషులు కూకోనున్నరు. ఇంతకు ముదాలు తన చిన్నప్పటి సంది ఈ చెట్టుకింద జరిగిన ఎన్నోపంచాయితీలు చూసిండు. అరుగు మీద ఒక్క మున్సబే కూసునేటోడు.కాని ఇప్పుడు మున్సబుతో సమానంగ అందరూ కూకున్నరు. మున్సబులో ఇంతకు ముందున్న దర్పం కన్పించడం లేదు. పులిలా కూర్చునేటోడు, మేక చర్మం కప్పడమే అనే దాఖలాలు కన్పించడంలేదు. ముసుర్లో మేకల మందలో మునగదీస్కోని కూర్చున్న మేక పోతులాగ కూర్చున్నడు. దానిక్కారణం లేక పోలేదు. ఊర్లో నానా పార్టీలు వచ్చి చేరినయ్, కాస్త డబ్బున్నోడల్లా తలా ఒక పార్టీలో చేరి లీడర్ అనిపించుకుంటుండు. అనిపించుకుంటున్నరేగని తన మాట మీరి పోవడం లేదు. పని వున్నా లేకున్నా అందరూ తనకాడికే వచ్చి కూర్చుంటరు. ఆ ఒక్క సంతృప్తి వల్లే అప్పుడప్పుడు మీసాలు మెలేసుకుంటాడు మున్సబు. జనం రెండు గుంపులుగా విడిపోయి. కూకోనున్నరు. గంతమందిల లచ్చిగాడొక్కడే. చేతులు కట్టుకొని నిలవడ్డడు. తప్పుచేసినోనికిమల్లె. దిక్కులు సూత్తండు, మాటలాలకిత్తండు, పెద్ద అండ వున్నట్టే దైర్నింగున్నడు. తెల్లచొక్కా భుజాన కండువా వేసుకున్నాయన నిలబడి మాట్లాడుతుండు. ఎంతసేపట్నించి మాట్లాడుతుండో పెదాలు తడారిపోంగ మధ్యమధ్యల నాలుకతో పెదాల్ని తడిచేస్కుంటుండు.
“……. ఇట్లా ఎవళ్లుపడితే వాళ్లు ఇష్టం వచ్చినట్టు ఊరేగుతమంటే సరిపోద్దా ఊరా, వల్లకాడనుకున్నారా? ఊరన్నంక కొన్ని కట్టుబాట్లుంటయి. మంచి, చెడులుంటయి. నాల్గు అక్షరం ముక్కలు సదువుకొని నాకూ హక్కుందని ఎగేసుకొని వస్తే అంత తేలిగ్గ రానిత్తరాఏంది? పూర్వీకులు ఏ కులపోళ్లు ఎక్కడ వుండాలోహద్దులు పెట్టిండ్రు. వాళ్లంతా వెర్రోళ్లా, సదూవుకోనోళ్ళా. వాళ్ళు వేదాలు సదువుకున్నోళ్ళు కాబట్టే ఊరు కట్టుబాట్లను పెట్టిండ్రు. ఆ రివాజున గట్లా నడ్సుకోండ్రి అన్నరు. ఇప్పుడు వాట్ని కాళ్ళతో తంతం అంటే ఎవళ్ళు వప్పుకుంటరు. మాటిమాటికి కాలం మారింది, కాలం మారిందంటున్నరు. ఇప్పుడేమన్న మనిషి అన్నం తినడం మాని ఇంకేమన్నా తిని బతుకుతుండా ఏంది? ఎక్కడుండాల్సినోళ్ళు అక్కడ వుంటేనే ఊరని అంటరు. లేకుంటే మరేదో అనాల్సివస్తది” అని ఆగి ఊపిరి ఎగపీల్చి కూసున్నడు.
జనంలో గుసగుసలు మొదలైనయి. “భలేగ చెప్పిండ్రా నా కొడుకులకి దీంతో తిక్క దిగుద్ది” అని చెవులు గొరుక్కుంటున్నరు. ఒక పక్కకూకున్న జనం గుంపు, మరో పక్క గూడా చెవులు కొరక్కుంటనే వున్నరు. చిన్నచిన్నగా పోయి పెద్దగనే చెప్పుకుంటున్నరు. ఇరుగుంపుల మధ్య ఏదో రాజుకుంటుందని కనిపెట్టిన ఓ పెద్దమనిషి గట్టిగనే గద్దిస్తూ “ఆపుండ్రి లొల్లి, గుసగుసలు, కబుర్లు చెప్పుకోవడానికి వచ్చిండ్రా ?. ఏమన్నా మాట్లాడేదేమన్నా వుంటె లేసి నిలబడి అందరికి ఇనబడేటట్లుగ మాట్లాడండి లేదంటే గుసగుసలు కట్టిపెట్టుండ్రు” అని అన్నడు. గ్రూపు మీటింగులు, గుసగుసలు టక్కున సద్దు మణిగినై. ఎవళ్ళు లేసి మాట్లాడుతారా అని అన్ని దిక్కులు చూస్తున్నాయి జన్మ౦ చూపులు. కొద్ది సేపటికి రెండో గుంపులోనుంచి నడివైసు కారు మనిషి లేసి గొంతు సవరదీసుకోడానికనట్టు “హుం” అన్నాడు. గడియ గడిచినంక
“అయ్యా గ్రామ పెద్దలు, ప్రభువులు అందరికీ పేరు,పేరున దండాలు. జర కాస్త దయతో మామొర ఆలకించండ్రి. మా గూడెపోళ్ళు సదువుకోలేదు, మా తాతముత్తాతల కాడినుంచి మీ కాళ్ళకాడే చెప్పులు కుట్టో, కూలి-నాలి జేసో మీ ఇండ్లల్లో జీతగాళ్ళుగా వుండి బతుకులు ఎల్లబుచ్చినం. స్వతంత్రం వచ్చినంక అరవై ఏండ్రకు మా పోరగాళ్ళ నాలుకల మీదికి నాల్గు నల్లచ్చరం ముక్కలు చీమలబార్లతీర్గ ఎగబాకడం మొదలు పెట్టినయి. మాగూడెం పోరగాళ్ళు సుచి శుభ్రం- నేర్పుకుంటున్నరు. తలకు నూనెరాసుకొని క్రాపులు దువ్వుకుంటున్నరు.
మా తాత ముత్తాతల్లాగ సచ్చిన కళేబరాల్ని కోసుకొని తినడం లేదు. మా ఇండ్ల’ కంచెల మీద గొడ్డు మాసం తునకలు ఎండబెట్టుకోవడం మా తిండి రివాజు. గరీబోళ్ళం మీలాగ కరీదుగల తిండి తినకపోయినా ఒక మాదిరి అన్నం తింటున్న వాళ్ళమే. వంటి మీదికి వున్నకాస్తలో శుభ్రమైన బట్టలే తొడుక్కుంటున్నం. మా లోగిళ్ళు మరీ నీసుబారిపోవడం లేదు. కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టుకొని నిగ, నిగలాడక పోయినా నుదుటి మీద బొట్టున్న ఆడ కూతురులాగ కాస్త నదురాగానే వుంటున్నాయ్. మేం పరాయి ఊరుపోతే, మేం అంటరానోళ్ళమని గుర్తుపట్టే ఆనవాళ్ళు మా దగ్గరిప్పుడు లేవు. మరి మేం ఏం పాపం జేసినమని మమ్మల్ని ఇంకా దూరంగా వుంచాలని చూస్తున్నరు. మీరూ ఈ భూమ్మీదనే ఇళ్ళు, భవంతులు కట్టుకున్నరు, మేమూ ఈభూమ్మీదనే ఇల్లో, పూరిగుడిసో మా తాహతుకు తగ్గట్టు కట్టుకున్నం గదా. మీది ఊరెట్లా అయింది. మాది అంటరాని గూడెం ఎట్లా అయిందో కాస్త చెప్పుండ్రి” అని కొద్దిసేపాగిండు. మల్లాతనే.
“మీరందరూ కాస్త దేశాల మీద తిరిగొచ్చినోళ్ళే గదా, ఏదన్న పట్నంల, టౌనుల- ఇక్కడున్నట్టు వేరుబంధం కనిపిస్తదా? సమస్త పెజలు కలివిడిగనే వుంటున్నరు.పట్నంల, టౌనులల్ల గూడెం యాడనన్నా కన్పిస్తదా? కంటికి. కాకుంటే పేదోళ్ళ స్లమ్ ఏరియాలుంటాయి.అన్ని కులాల పేదలు ఆ మురికి బస్తీల్లో వుంటున్నరు.తేరిపారంగ చూసిరండ్రి, మరి గక్కడ లేంది ఈ పల్లెటూళ్ళె అంటరాని గూడేలు ఎందుకంట? అంతటా మారిపోయినపుడు ఊల్లే ఎందుకు మారకూడదు ఆలోచించుండ్రీ. ఎవలన్నరు ఊర్లో మార్చురాలేదని, పచ్చి అబద్ధం. మన తాత ముత్తాతలు ఎద్దుముడ్డి పొడ్సుకుంట కొయ్యనాగళ్ళతో దున్నేటోళ్ళు. ఎంత దూరమైనా కాలినేడకన కోసుల కొద్ది నడ్సుడేనాయ్, ఆ ఎడ్ల అరకలు యాడికిపోయే,ఆ నడుసుడు యాడికిపాయ్? కంటికి కనిపిస్తున్నాయా?. బస్సులొచ్చినయి, టాక్టరు లొచ్చినయి,పంటకోసుడు యంత్రాలొచ్చినయి. ఎవల్లయ్య ఊల్లే మార్పురాలేదన్నది” అన్నడు.
“లచ్చిగాడు మీ ఆస్తులిమ్మన్నడా ? భూములు పంచమన్నడా? ఊల్లె కాస్త జాగున్నది. నా చోటులో నేను ఇల్లేసుకుంటానన్నడు. ఊర్లో పడి దోపిడీకి వచ్చిన వాడికి మల్లె తిట్టి, కొట్టి తరమేయబడితిరి. ఇదెక్కడి నాయం? అయ్యలూ మీరేకాదు మేము ముప్పూటలు కాకున్నా ఒక్కపూటైనా అన్నమే తిని బతుకుతున్నాం. కాకుంటే మాది గొడ్డుకారం మెతుకులు అంతే తేడా ” అని కూలబడ్డడు.
“ఏందిరో, యమతెలివిగ మాట్లాడుతున్నరు. కూకోబెట్టి మాట్లాడితే. గిట్లనే నకరాల్ చేస్తరు. దుడ్డుకర్రలు తీస్కొని వెంటపడితే గూడెంలో పడేదన్క పారుకొని వురకాల లం .. కొడుకులు” అన్నడు గుంపులోంచి ఒకడు.
“గాజులు తొడుక్కొని ఎవల్లేరిక్కడ, రాండ్రి చూసుకుందాం” అని కాలు దువ్విండు ఇవతలి గుంపులోంచి ఒకడు.
“అరెరే, కాస్త ఆగండ్రా, కొట్టుకొని సత్తానికారా ఇక్కడ కూకోబెట్టింది” అని గద్దించిండు ఒక పెద్దమనిషి.
గొడవ కాస్త సద్దుమణిగింది, నిప్పుల మీద బాగా నివురు కప్పుతుంది. తుఫాను ముందు నిశ్శబ్దంలానే వుంది. పెద్దమనుషులు నల్గురూ నాల్గుతీర్ల ఆలోచనల పడ్డరు.ముందుగా అనుకున్న ప్లాను తీర్గనే పాచికలు కదపడానికి నల్గురూ ఒకరినొక్కళ్ళు చూసుకొని సైగల్ చేసుకున్నరు. ముందుగాల అనుకున్న ప్రకారమే లచ్చిగాడిని తిట్టిన వాళ్ళని పంచాయితీ కాడికి రాకుండా చేసింన్లు జనమంతా పెద్దమనుషులు ఏంచెపుతరా అని చూడ బట్టిన్రు. ఒక్క లచ్చిగాడు మాత్రమే తప్పుచేసినోడికి మల్లె నిల్చోనున్నడు. ఊరు పెద్ద మున్సబు గుబురు మీసాలు సవరించుకుంటూ
“ఏమయ్యా లచ్చయ్య” అని పిల్సిండు. ఇంతకు ముందైతే “ఏందిరా లచ్చిగా’ అని పిల్సేటోడు, పరిస్థితులు గమనించే గౌరవించి పిల్సిండు. మున్సబు ఇంకెవర్నో పిలుస్తుండేమోనని జనం కెళ్లి చూస్తుండు లచ్చిగాడు.
“నిన్నే పిల్సేది, అటూ ఇటూ దిక్కు, లు చూడబట్నావు” అన్నడు మున్సబు.
“అయ్యాదొర” అని చేతులు జోడించి దండం పెట్టిండు.
“నిన్ను అడ్డగించి తిట్టినోళ్ళు ఎవరో చూపెట్టు” అని జనం వైపు చూపిస్తూ అన్నడు.
లచ్చిగాడికి ఏమీ పాలుపోలే, ఏం జరగబోతోందో పసికట్టలేక సతమతమౌతూనే జనం వైపు చూసి వాళ్ళెవరూ కన్పింకపోవడంతో పెద్ద మనుషుల వైపు తిరిగి …
“వాళ్ళివరూ లేరు” అన్నడు అయోమయంగ ముఖం పెట్టి . జనంలో ఎవరో రహస్యం తెల్సినట్టు కిసుక్కున నవ్విండు.
“ఏరా సేకుసిందూ …” పక్కనే నిలబడి వున్నా చూడనట్టే గట్టిగ అర్సిండు మున్సబు.
“అయ్యా దొర” అని పలికిండు సేకుసిందు.
“మీ మీద పంచాయితీ వచ్చింది, ఊరు పెద్దమనుషులు రమ్మన్నరని చెప్పలేదురా? ఎందుకు రాలేదు బద్మాష్‌లు” అని అర్సిండు మున్సబు.
“అందరికి చెప్పిన, తప్పనిసరిగా రావాలని మీరు చెప్పమన్న వాళ్ళందరింల్లకు పోయి చెప్పొచ్చిన దొర” అన్నడు.
“వాళ్ళే లేకుంటే పంచాయితీ ఏమైతది” తన్లోతనే అనుకున్నట్టు పైకన్నడు మున్సబు.
“మీరేంజేత్తరు, వచ్చే ఆదివారం నాటికి పంచాయితీ వాయిదా వేయిండ్రి”అన్నడు మరో పెద్దమనిషి. ఆ మాటలతోటి క్షణం ఆలస్యం చేయకుండా మున్సబు.
“లచ్చయ్య ముద్దాయిలు లేంది పంచాయితీ ఏం జేస్తం, మళ్ళీ ఆదివారం నాటికి వాళ్లందరిని గుంజుకొచ్చి చెట్టుకు కట్టిపడేసి పంచాయితీ జరిపిస్తా, నువ్వు ధైర్యంగుండు” అని లేసి నిలబడ్డడు. జనం ఎవళ్ళకు వాళ్ళు, వాళ్ళకు తోచిన విధంగ అంచనాలు వేసుకుంట ఇండ్ల దారి పట్టిన్రు.
“లంమిడి కొడుకులు, అందరూ కట్టకట్టుకొని గూడెమంతా తోల్కొని వచ్చింన్రు.గదేదో ఊర్లో మాదిగోళ్ళు పెట్టుకున్న దేవుడి ఊరేగింపునే వూర్లోనికి రానీయలే,ఏకంగా ఊర్లోనే ఇల్లు కట్టుకోనిత్తమా? చూస్తుండుండ్రి ఏం జరగబోద్దో తమాషా, ఇప్పుడూరుకుంటే రేపేమైనా అంటరు. చూస్తూ వూరుకునేది లేదు, దేనికైనా సిద్ధంగుండాల” అని హెచ్చరించి ఇంటి కెళ్ళిపోయిండు మున్సబు.
* * *
రెండు మూడు దినాలు గడ్సినయి, ఎక్కడ బడితే అక్కడ అదే చర్చ, ఏనోటిన్నా అదేమాట, చేన్లకాడ, చెలకలకా డ, గొడ్ల, మేకల కాపర్లు ఒక్కరేంది … ఊరుజనమేకాదు చుట్టుప్రక్కల ఊళ్ళోలందరూ ఆసక్తిగా ఇటే చూస్తున్నరు. ఏమైతదా?, ఏం జేస్తరో అని ఎదురు చూడబట్టిడ్రు. తోచిన కాడికి పక్కూర్ల నుంచి సలహాలు,సంప్రదింపులు జరుగు తున్నయ్. సల్లిడవకండని ఎవరి పక్షాలకు వాళ్ళు సలహాలిస్తున్నరు. కొందరైతే మల్లా జరిగే పంచాయితీ నాటికి మేమూ వస్తామని దయిర్నం చెడొద్దని హామీలు అందుతూనే వున్నయి. ఊరంతా సెగపెట్టిన కుమ్మరి వామిలా పొగలు చిమ్ముతుంది.
* * *
ఊర్లో పొద్దుగాల్నే పాడిగేదెలకు, పాడి ఆవులకు పచ్చగడ్డి తెచ్చేందుకు చేన్లకు పోయేవాళ్ళు సద్దిబువ్వ రవ్వంతతిని కొడవళ్ళు చేతపట్టుకుని చేన్లకు పోతున్నరు. వెంకటేశం కూడా పచ్చగడ్డికోసం బైలెల్లడం చూసింది తల్లి మంగమ్మ.
“ఓరి వెంకటేశం జర కాస్త జాగర్తగుండు బిడ్డా, ఏమన్నా మిడిమాలపు పనిచేస్తివా? ఇగచూడు ఊరు కాలి బుగ్గై పోతది అట్టాంటి జోలికి పోమాకు.” అని హెచ్చరించింది తల్లి.
“ఏహె … ఊరుకోవె … ఊరందరిది ఒకదారైతే వులిపిరి కట్టెదొ దారన్నట్టుంది నీతంతు” అని తల్లిని కసిరించుకొని కొడవల్లిక్కిని సైకిల్ హ్యాండిల్‌కు తగిలించుకొని తల్లి మాటలు ఇనకుండనే సైకిలెక్కి చేన్లదారిపట్టిండు.ఏం జేస్తది, తల్లి భయం తల్లిది. మిడసరపు పిల్లకారు. ఎటు నుంచి ఏం ముంచుకొచ్చుద్దో, ముంచుకొచ్చి మీద పడేవరకు సోయి వుండదు. ఇంకా యాడాదికాలె, మాదిగోల్ల ‘ఎంకి’కి, ఈడికి వున్న సవాసం బైటపడి, కంది చేలో ఎంకిని,వెంకటేశాన్ని పట్టుకొని ఎంకి మొగుడు కూత్తెగోల జేసిండా!? అప్పుడు ఊర్లో ఏ గొడవలు లేవు కాబట్టి సరిపోయింది. ఏదో ఊరు పెద్దలు సర్ది చెప్పి గొడవ చేయిదాటి పోకుండా కాపాడిండ్రు. “ఇప్పుడైతేనా …” అని తల్లి గుండెలు బాదుకుంటుంది.
కాలిబాటన సైకిల్ తొక్కుతున్నడనే గాని వెంకటేశం మదినిండా ఎంకి నిండీ వుంది. ఒక్క కులం తక్కువదనే గాని ఎంకసుంటి పొల్ల చుట్టు పక్కల నాలుగూళ్ళు కలేసి చూసినా యాడా దొరకది. దాని రూపురేఖలు గుర్తుకొస్తే పిచ్చెక్కిపోతడు. చేను మంచెల మీద ఎంకీ, తను ఎన్ని వెన్నెల రాత్రులు గడపలేదు. ఎన్ని కబుర్లు చెప్పుకోలేదు. ఎన్నెన్ని కలల గూళ్ళు కట్టుకోలేదు. రెండుమూడు సార్లు ఇద్దరు కలిసి ఎటన్నా లేచిపోయి హాయిగా ఏ కొండ, కోనల్లోనో ఈ అంతరాలకు అడ్డుగోడలకు దూరంగ బతకా లనుకున్నరు, కాని సాహసం చేయలేక పోయారు. ఇంతల ఎంకికి పెండ్లి చేశారు. అప్పటి నుండి గుట్టుసప్పుడు కాకుండా కంది చేలల్లో కలుసుకుంటుండేవారు, ఎంకి నెలరోజుల సంది కనిపిస్థనే లేదు.అని ఆలొచిస్తూ సైకిల్ తొక్కుతుండు, ఇంతలో ఎంకోళ్ళ అయ్య కందిచేలో గడికోస్తూ నిలబడి తనవైపే చూస్తూ అగుపడ్డది. టక్కున సైకిల్‌కి బ్రేకులు పడ్డై. సైకిల్ దిగి చేలోని ఎంకిదగ్గరికి పోయిండు.
“ఏంది, ఈ మధ్యలో బొత్తిగ కన్పిస్తలేవు” అని పలకరించిండు వెంకటేశం
“మేము యాడ కన్పిత్తం మీ కండ్లకు? మేం అంటరానోళ్ళమాయే” అని దెప్పిపొడ్సింది ఎంకి.
“ఊర్లో గొడవలు మనకెందుకే” అని మీద చేయి వేసిండు వెంకటేశం. మాటలేగని చేతల్లో కసిరిచ్చలేదు ఎంకి, ఇంక కాస్త చొరవ ఎక్కువ చేసిండు, ఎంకి కాదనలేకపోయింది. కాని మనసులో యాడనో మండుతున్న నిప్పుసెగ తల్గుతనే వుంది. ఎట్లా బైట పెట్టాలా అని ఎదురు చూస్తుంది ఎంకి. కాసేపైనంక …
“మొన్న పంచాయితీలో దుడ్డు కర్ర తీస్కొని మాలావు నిల్సున్నవంట” అంది ఎంకి.
“గయి అన్నీ ఇప్పుడెందుకే …” అంటుండగనే పైకి లేవబోతు కాలితో కావాలనేతన్నింది ఎంకి. వెంకటేశం వెల్లకిలాపడి, దులుపుకొని లేవబోతుండగ.
“ఇక్కడైతే అడ్డురావుకాని, ఊర్లో అడ్డమొత్తయా మా అంటరాని బతుకులు” అంది కసిగ ఎంకి. తెగ ఫీలయిండు, బైటికి కనపడనీయలే తల దించుకున్నోడు దించుకున్నట్టే తల పైకెత్తకుండ అవమాన భారంతో సైకిల్ దిక్కు నడిసిండు వెంకటేశం.
ఎంకి ముందు తనలో తను నవ్వుకుంది. వెంకటేశం వెళ్ళినంక బిగ్గరగా నవ్వింది చేలోని కందిపూలు పూసినట్లు. అవమానభారంతో తలదించుకొని వెంకటేశం పోయిన దిక్కు చానా సేపు చూస్తూ నిల్చుండి పోయింది ఎంకి.
* * *
ఊర్లో మీటింగ్ అనుకున్న రెండ్రోజులు ముందుగనే సాయత్రం సాటింపు చప్పుడు విని ఊరుజనం అయోమయంలో పడ్డారు. ఊరు సాటింపు చేసే పీరిగాడు బిగ్గరగా అరుస్తూ చెప్పుకోపోతుండు._ “మన ఊరు సమస్త ప్రజలందరికి తెలియచెప్పేందేందనగా, రేపు మన ఊరుకి ఆర్.డి.ఓ. గారు వచ్చి ప్రజలందరితోటి మీటింగ్ పెడతరంట. కాబట్టి ఊరు ప్రజలందరూ. హాజరుకావాల్సిందిగా కోరుతున్నారహో … ..!” అని చెప్పుకుంట పోతుండు.
హటాత్తుగ ఆర్డీవో ఊళ్ళకు ఎందుకత్తండో, ఎమో ఎవల్లకూ అంతు చిక్కడం లేదు. ఈ మాదిగ ముండా కొడుకులేమన్నా? కంప్లై౦ట్ ఇచ్చింన్రా ఎంది?రక రకాలుగా జనం చెప్పుకుంటున్నరు. ఒకరిద్దరు మున్సబు గారికే మన్నతెల్సునేమోనని ఆరాతీయంగ వచ్చి అడిగిండ్రు. మున్సబు సుత పెదవిర్సిండు తెల్వదన్నట్టు. ఆ రాత్రంతా గుడగుడల్తోటే గడిచి తెల్లారింది.
పొద్దుగాల్నె సేకుసిందు మున్సబు ఇంటి ముంగట వచ్చి నిలబడ్డడు. ఏమన్నాపనికి పురుమాయిస్తడోనని. మున్సబు పొద్దుగాల్నే లేసినట్టుంది, ఇంటెనుకాల దొడ్లో ఖాండ్రించి వుమ్మిన సప్పుడు ఇనపడుతుంది. ముఖం గట్రా కడుగుతున్నటుంది అనుకున్నడు. సేకుసిందు వచ్చింది చూసిన పని మనిషి పోయి. మున్సబుతోచెప్పింది.
“వాణ్ణి ఇంటెనకాలకు రమ్మను” అని చెప్పిండు.
“ఏం జేస్తున్నవు?” అన్నట్టు కండ్లెగరేసిండు మున్సబు.
“రాత్రి విలేజ్ అసిస్టెంట్ కబురు పంపిండు పొద్దుగాల్నే బడికొట్టం శుభ్రం చేసిపెట్టమని, ఇద్దరు పనోళ్ళను వూడిపిత్తానికి పెట్టి మీ దెగ్గరికొచ్చిన” అన్నడు సేకుసిందు.
“ఆర్టీవో సారు వచ్చినంక నాకు కబురుపెట్టు, ఎవళ్ళన్నా అడిగితే ఇంట్లనే వున్నా,వస్తున్నానని చెప్పు” అన్నడు మున్సబు. సరేనన్నట్టు తలూపి అక్కడ్నుంచి బైటికొచ్చిండు సేకుసిందు.
పదిగంటలు కాకమునుపే ఆర్టీవో గారి జీపు, మరో రెండు జీపుల తోటి ఊర్లోని బడి కొట్టం దెగ్గరకు వచ్చినయ్, అప్పటికే మండలంలోని చిన్నా చితక ఆఫీసర్లందరూ వచ్చేసిండ్రు. జనం కూడా వచ్చినట్టే లెక్క ఎవరొచ్చిండ్రు, ఇంకెవరు రావాలె అని ఏమీచూడలే. ఆర్దీవో జీపు దిగంగనే జనం మధ్యలోంచి దారిచేసుకుంట టేబులు, కుర్చీలు ఏసిన జాగలపోయి ఒక కుర్చీలాక్కొని కూర్సుండు.
ఎమ్మార్వో మైకులో ఏదో చెప్పపోతుండు, ఆర్డీవోనే లేసి మైకు దెగ్గరికి వచ్చి నిలబడంగనే ఎమ్మార్వో పక్కకు జరిగిండు, కొద్ది సేపు గట్లనే నిలబడి జనం వైపు చుట్టూ కలియ జూసిండు.
“మన ప్రాంతం వాళ్ళందరికి మంచి రోజులొచ్చినయ్” అని కొద్గిసేపాగిండు. ఆర్టీవో జనమంతా ఏం చెప్పబటోతుండోనని ఆర్జీవో వైపే చూస్తున్నరు. ఆసక్తిగా నోళ్ళు తెర్చి కన్నార్పకుండా
“ఎన్నో ఏండ్లనుంచి మన ప్రాంతంలో మంచిరోడ్డు లేక తెగ ఇబ్బంది పడుతున్న సంగతి వేరే చెప్పనక్కరలేదు. బస్సులో ప్రయాణం చేస్తే, నిండుచూలాలు దవాఖనకు పోద్దో, దార్లోనే కంటదో మనకు తెలియంది కాదు. బస్సులోనే కాన్పైన తల్లులు,పుట్టిన పిల్లలు మీలో ఎంత మందున్నరో మీకు తెల్సు. అందుకనే ఆ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని, మరెన్నో మహాకార్యాలు నేర్పడానికి ప్రభుత్వం వారు ఒక మహారోడ్డుని వేయడానికి పూనుకున్నారు. అందుకు మీ సహకారం కావాలని చెప్పడానికే ఇక్కడికి వచ్చిన” అని ఆగిండు.
“ఇది మామూలు రోడ్డుకాదు, అంతర్జాతీయ రహదారి. ఆసియా ఖండం మొత్తం చుట్టాచ్చేదారి, ఎనిమిదిలైన్ల వెడల్పుగల మహాదారి. ఈ రోడ్డుతో మనకెన్నో వుపయోగాలు వున్నాయి, మనం రహస్యంగ కొనుక్కునే విదేశీ సరుకులన్నీ మన బడ్డీకొట్లల్లో పెట్టి అమ్ముకోవచ్చు. అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా ఒక్కటేంటి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సరుకులన్నీ మన రోడ్డు మీదనే కొనుక్కోవచ్చు.మనం పండించే పంటల్ని ఏ దేశంలోనైనా అమ్ముకోవచ్చు” అని జరంత సేపు మొసతీస్కోవదానికి ఆగిండు. గుక్కెడు మంచినీళ్ళు నోట్లో పోస్కోని
“చాలా ఊర్లు ఎంతో కొంత రోడ్డు కింద పోతున్నాయ్. మీ ఊరొక్కటే రోడ్డుకు సెంటర్లోవుంది, కాబట్టి మీ ఊరు మొత్తం రోడ్డు కింద పోతుంది. అందుకే, ముందుగాల మీకు చెప్పడానికి వచ్చిన, బలవంతంగ ఖాళీ చేయించే కాడికి తెచ్చుకోకండి, మీ ఇష్టమొచ్చిన ఊర్లో మీ ఇండ్లుకట్టుకోండి. అందరికి ఒక్కచోటే ఇంటి జాగాలు కావాలంటే దొరకది భూమి. రోడ్డు కిందపోయిన జాగలకు ప్రభుత్వం తులమో, ఫలమో వెలకట్టి నష్టపరిహారం ఇస్తది” అని ముగించి సర్రున బైలెల్లిండు ఆర్టీవో. తోడుగా వచ్చిన చిన్నా, చితుక ఉద్యోగులు మరో నిమిషం లో తుర్రుమన్నరు. సద్దుమణిగింది, ఊరు క్షణం పాటు మూగదైపోయింది.
జనం ఎర్రి మొఖాలేసుకొని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నరు. ఏమీ అర్ధం గాని అయోమయంలో పడ్డరు. బడి కొట్టం అరుగుమీద మున్సబు తల కాళసందులో ఇరుకించుకొని కూర్చున్నడు.జనం తలో దిక్కు ఆలోచిస్తున్నారు.మున్సబు ఏం మాడ్లాతలేడు. జనంలోంచి ఎవరో వుండి గట్టిగ అర్సిండు.
“రోడ్డుని ఊరు పక్కనుంచి మళ్లించాలి” అని …
“చేన్లు పోతయిగదా, తర్వాత ఏం చేసి బతుకుతవు?” అన్నడు మరొకడు.
“నిజమే, అయితే గెట్లామరి?” అని నోరు తెర్సిందడొకడు.
“మున్సబో మాట్లాడవు మరి?” అన్నడు నాయుడు.
“ఎవరేమన్నా అందరం ఒక్కమాట మీదుండాలె” అన్నడు మున్సబు. ఏమి చేయడానికైనా గ్రామ ప్రజలందరితోటి ఒక కమిటీ వేయాలనుకున్నాడు. కులానికి ఒక్కడు చొప్పున కమిటీలో ఉండాలని తీర్మానించుకున్నరు.
“రోడ్డు నిర్వాసితుల పోరాట కమిటీ” అని పేరు పెట్టుకున్నరు. కమిటీకి కన్వీనర్‌గా మున్సబుని పెట్టిన్రు.
కులానికి ఒక్కడు చొప్పున ఎన్నుకున్నరు. మాదిగోల్ల తరుపున లచ్చిగాడ్ని కమిటీ సభ్యునిగా పెట్టిన్రు. ముందుగాల మండల ఆఫీసు ముందు ధర్నా చేయాలని తీర్మానించుకున్నరు. ధర్నా కోసమని లచ్చిగాడు ప్లేకార్డులు రాస్తుండు.
“ఊర్ని కాపాడాలి” టక్కున ఆగిపోయింది చేతిలోని బ్రెష్.
“ఊర్ని ఎవర్నించి కాపాడాలి? రోడ్డు నుంచా? గ్రామ పెత్తందార్ల నుంచా?”చాలా సేపు ఆలోచిస్తూ వుండిపోయిండు.
“నన్ను ఊర్లోకి రానీయని ఊర్ని నేనెందుకు కాపాడాలి?” ఆవేశం కట్టలు తెగింది.ప్లేకార్డుపై ఖాండ్రించి వుమ్మిండు.ఎన్ని సార్లు వుంచిండో, వుమ్ము తడికి స్లేకార్డుపై అక్షరాలు కారిపోతున్నాయి. అచ్చరాలు మాసిపోతున్నట్టు, ఊరు మాయమైపోతుంది కండ్లముంగట. .
* ఆదివారం “వార్త” నవంబర్ 5,2006.
* తెలంగాణ కథ వార్షిక -2006
* పడమటి నీడ (కథా సంపుటి )-2009.

హనీఫ్
హనీఫ్ పేరుతొ కథలు రాస్తున్న సయ్యద్ హనీఫ్ 1962 ఫిబ్రవరి 3న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తిప్పనపల్లిలో జన్మించారు. ఇప్పటివరకు రెండు కథా సంపుటాలు, మూడు కవితా సంపుటాలు వెలువరించారు. సింగరేణి కోల్ మైన్స్ లో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసారు. ప్రస్తుత నివాసం మణికొండ, హైదరాబాద్. ఫోన్ నెంబరు: 9247580946

Nice story, unexpected ending. Kudos Haneef Saab.