అధ్యాయం- 10
విచారణ – అభియోగం.
———————-
అభియోగపత్రం ఈ విధంగా సాగింది:
జనవరి 17వ తేదీన ‘మౌరిటానియా’ లాడ్జ్‌లో, కౌర్గాన్ నగరానికి చెందిన సెకండ్ గిల్డ్ వ్యాపారవేత్త ‘థెరపాంట్ ఎమిలియానోవిచ్ స్మెల్‌కాఫ్’ హఠాత్తుగా మరణించాడు.
నాల్గవజిల్లాకు చెందిన స్థానిక పోలీస్ డాక్టర్ ధృవీకరణ ప్రకారం అధిక మొత్తంలో మద్యం సేవించడం వల్ల గుండెపోటుతో స్మెల్‌కాఫ్ మరణం సంభవించింది. సదరు స్మెల్‌కాఫ్ శరీరాన్ని ఖననం చేసారు.
చాలారోజులు గడిచాక అదే కౌర్గాన్ నగరవాసి, సదరు స్మెల్‌కాఫ్ మిత్రుడూ అయిన టిమోఖిన్ అనే వర్తకుడు సెయింట్ పీటర్స్‌బర్గ్ నుండి తిరిగి వచ్చి, అతని మరణానికి సంబంధించిన పరిస్థితులు తెలుసుకుని, అతని దగ్గరున్న డబ్బు దోచుకునే ఉద్దేశ్యంతోనే సదరు స్మెల్‌కాఫ్‍కి విషం ఇవ్వడం వల్ల మరణం సంభవించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసాడు. ప్రాథమిక విచారణలో బలపడిన ఈ అనుమానం, పరిశోధనలో ఇలా నిరూపించబడింది:
- మరణానికి కొద్దిరోజుల ముందు, సదరు స్మెల్‌కాఫ్ బ్యాంకు నుండి 3,800 రూబిళ్ళు తీసుకున్నాడు. మరణించిన వ్యక్తి దగ్గర లభించిన వస్తువుల జాబితా తయారు చేసినప్పుడు అక్కడ కేవలం 312 రూబిళ్ళ 16 కోపెక్లు మాత్రమే ఉన్నట్టు కనుగొన్నారు.
- మరణానికి ముందురోజు పగలు మరియు రాత్రి మొత్తం సదరు స్మెల్‌కాఫ్, లుబ్కా (అలియాస్ కటెరినా మస్లోవా)తో ఆమె ఇంట్లోనూ, అలాగే మౌరిటానియా లాడ్జ్ లోనూ గడిపాడు. సదరు స్మెల్‌కాఫ్ అభ్యర్థన మేరకు మస్లోవా అతని గైర్హాజరీలో కొంత డబ్బు తీసుకోవడానికి మౌరిటానియా లాడ్జ్‌కి కూడా వెళ్లింది. అక్కడ ఆమె అతని ట్రంకుపెట్టె నుండి డబ్బు తీసుకుంది. మౌరిటానియా లాడ్జ్‌లో పనిచేసే యూఫెమియా బొచ్‌కోవా మరియు సిమియన్ కార్టింకిన్ సమక్షంలో, సదరు స్మెల్‌కాఫ్ ఆమెకు ఇచ్చిన తాళం చెవితో ట్రంకుపెట్టె తెరిచి డబ్బు తీసుకుంది. సదరు మస్లోవా తెరిచిన ట్రంకుపెట్టెలో, సదరు బొచ్‌కోవా మరియు కార్టింకిన్‌లు 100 రూబిళ్ళ బ్యాంకు నోట్ల కట్టలను చూసారు.
- సదరు స్మెల్‌కాఫ్ మౌరిటానియా లాడ్జ్‌కి లుబ్కాతో కలిసి తిరిగివచ్చిన తర్వాత, లాడ్జి పనివాడైన కార్టింకిన్ ఇచ్చిన సలహా మేరకు, లుబ్కా సదరు స్మెల్‌కాఫ్‍కి ఒక తెల్లటి పొడిని బ్రాందీలో కరిగించి ఇచ్చింది. ఆ తెల్ల పొడిని సదరు కార్టింకిన్‌నే ఆమెకు ఇచ్చాడు.
- మరుసటి ఉదయం సదరు లుబ్కా (అలియాస్ కటెరినా మస్లోవా), ఒక వజ్రపు ఉంగరాన్ని వ్యభిచార గృహం నడుపుతున్న తన యజమానురాలైన కిటాయెవా అనే సాక్షికి విక్రయించింది. ఆ ఉంగరాన్ని స్మెల్‌కాఫ్ తనకు ఇచ్చాడని ఆమె పేర్కొంది.
- మౌరిటానియా లాడ్జ్‌లో పనిమనిషి అయిన యూఫెమియా బొచ్‌కోవా స్థానిక వాణిజ్య బ్యాంకులో తన ఖాతాలో 1,800 రూబిళ్ళు జమ చేసింది. సదరు స్మెల్‌కాఫ్ శరీరానికి జరిపిన పోస్ట్‌మార్టం పరీక్ష, ప్రేగుల రసాయన విశ్లేషణ అతని శరీరంలో విషం ఉన్నట్లు నిస్సందేహంగా నిరూపించాయి. కాబట్టి సదరు స్మెల్‌కాఫ్ మరణం విషప్రయోగం వల్ల సంభవించిందని నమ్మడానికి బలమైన కారణం ఉంది.
ప్రతివాదులైన మస్లోవా, బొచ్‌కోవా మరియు కార్టింకిన్‌లను విచారించినప్పుడు, వారు నేరం చేయలేదని వాదించారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం- నిజంగా స్మెల్‌కాఫ్ పంపడం వల్లనే మస్లోవా తాను ‘పనిచేసే’ వ్యభిచారగృహం నుండి మౌరిటానియా లాడ్జ్‌కి అతని కోసం కొంత డబ్బు తీసుకురావడానికి వెళ్ళానని చెప్పింది. అతను ఇచ్చిన తాళంచెవితోనే ట్రంకుపెట్టె తెరిచి, అతను చెప్పినట్లుగానే 40 రూబిళ్ళు మాత్రమే తీసానని, అంతకుమించి ఏమీ తీయలేదని తెలిపింది. ఇంకా, తాను ట్రంక్‌ను తెరిచినప్పుడు మళ్ళీ మూసినప్పుడు బొచ్‌కోవా, కార్టింకిన్-లు ఇద్దరూ అక్కడే ఉన్నారని, వారు ఈ వాంగ్మూలం యొక్క వాస్తవాన్ని ధృవీకరించగలరని ఆమె చెప్పింది.
ఆమె ఇంకా వివరంగా ఈ విధంగా తన వాంగ్మూలాన్ని ఇచ్చింది: రెండవసారి లాడ్జ్‌కి వెళ్ళినప్పుడు, సిమియన్ కార్టంకిన్ ప్రేరణతో తాను స్మెల్‌కాఫ్‍కి ఒకరకమైన పొడిని బ్రాందీ గ్లాసులో కలిపి ఇచ్చానని, అది మత్తుమందు లాంటిదని తాను అనుకున్నానని, దానివల్ల అతడు నిద్రపోతే తనకు తప్పించుకునే అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతోనే అలా చేసానని చెప్పింది. స్మెల్‌కాఫ్ తనను కొట్టిన తర్వాత తాను ఏడుస్తూ వెళ్ళిపోతానని బెదిరించినప్పుడు అతడే స్వయంగా ఆ ఉంగరాన్ని తనకు ఇచ్చాడని కూడా ఆమె తెలిపింది.
నిందితురాలు యూఫెమియా బొచ్‌కోవా వాంగ్మూలం ప్రకారం, పోయిన డబ్బుల గురించి ఆమెకేమీ తలీదు. అసలు స్మెల్‌కాఫ్ గదిలోకి కూడా తాను వెళ్ళలేదని, ల్యూబ్కా ఒక్కతే ఆ పనిలో తలమునకలుగా ఉండిందని పేర్కొంది. ఒకవేళ ఏదైనా దొంగతనం జరిగి ఉంటే, అది స్మెల్‌కాఫ్ ఇచ్చిన తాళంచెవితో అతని డబ్బు తీసుకోవడానికి వచ్చినప్పుడు లుబ్కా మాత్రమే చేసినదై ఉంటుందని బొచ్‌కోవా అభిప్రాయపడింది.
ఈ సమయంలో మస్లోవా ఒక్కసారిగా ఉలిక్కిపడి, నోరెల్లబెట్టి బొచ్‌కోవా వైపు చూసింది.
‘అప్పుడు…’ అంటూ సెక్రెటరీ మళ్ళీ చదవడం కొనసాగించాడు.
బొచ్‌కోవాకు 1,800 రూబిళ్ళ బ్యాంకు రసీదు చూపించి, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని అడిగినప్పుడు, అది తన 12 సంవత్సరాల కష్టార్జితం మరియు తాను పెళ్ళి చేసుకోబోయే సిమియన్ సంపాదన అని చెప్పింది.
నిందితుడు సిమియన్ కార్టకిన్‌ను మొదట విచారించినప్పుడు, వ్యభిచార గృహం నుండి తాళంచెవితో వచ్చిన మస్లోవా ప్రేరణతోనే తానూ, బొచ్‌కోవా డబ్బు దొంగిలించి, మస్లోవాతో కలిపి సమానంగా పంచుకున్నట్లు ఒప్పుకున్నాడు.
ఇక్కడ మస్లోవా మళ్ళీ ఉలిక్కిపడింది. కుర్చీలోంచి సగం లేచి, లజ్జతో ఎర్రబడిన మొహంతో ఏదో చెప్పబోయింది. కానీ బంట్రోతు ఆమెను ఆపేసాడు.
‘చివరికి…’ సెక్రెటరీ మళ్ళీ చదవడం కొనసాగించాడు,
స్మెల్‌కాఫ్ను నిద్రపుచ్చడానికి తాను పొడులు సరఫరా చేసినట్లు కూడా కార్టంకిన్ ఒప్పుకున్నాడు. రెండోసారి విచారించినప్పుడు డబ్బు దొంగతనంలోనూ, మస్లోవాకు పొడులు ఇవ్వడంలోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని ఖండించాడు. ఆమె ఒక్కతే చేసిందని ఆరోపించాడు.
బొచ్‌కోవా బ్యాంకులో జమ చేసిన డబ్బు విషయంలో సిమియన్ కార్టింకిన్ కూడా ఆమె చెప్పిందే చెప్పాడు- అంటే, ఆ డబ్బు తామిద్దరూ కలిసి 12 సంవత్సరాలు లాడ్జికి వచ్చిన అతిథులకి చేసిన సేవకి ఇచ్చిన ‘టిప్స్’ వల్ల సంపాదించామని చెప్పాడు.
ఆ తర్వాత ఖైదీలను విచారించిన వివరాలు, సాక్షుల వాంగ్మూలాలు, నిపుణుల అభిప్రాయాలు పొందుపరచబడ్డాయి. అభియోగపత్రం చివరగా ఇలా ముగిసింది:
పై వివరాల ప్రకారం, బోర్కి గ్రామ రైతు సిమియన్ కార్టింకిన్- వయసు 33, నగర పౌరురాలు యూఫెమియా బొచ్‌కోవా- వయసు 43, నగరపౌరురాలు కటెరీనా మస్లోవా- వయసు 27, ఈ క్రింది నేరానికి బాధ్యులుగా అభియోగం మోపబడింది:
188x- సంవత్సరం జనవరి 17వ తేదీన, వీరు ముగ్గురూ కలిసి వ్యాపారి స్మెల్‌కాఫ్ నుంచి సుమారు 2,500 రూబిళ్ళ విలువైన డబ్బు మరియు వజ్రపుటుంగరాన్ని దొంగిలించడం, మరియు సదరు స్మెల్‌కాఫ్‍కి విషం కలిపిన మద్యం ఇవ్వడం ద్వారా అతని ప్రాణాలు తీయడానికి కుట్ర పన్నడం, దానితోపాటు అతని మరణానికి కారణమవడం అనే నేరాలకు వారు నిందితులని అభియోగం మోపబడింది.
రష్యన్ శిక్షాస్మృతిలోని నియమావళి సెక్షన్ 1455, ఉపవిభాగాలు 4-5 ప్రకారం ఈ నేరాలు శిక్షార్హమైనవిగా పేర్కొనబడుతున్నాయి.
అధ్యాయం- 11
మస్లోవా – విపక్ష విచారణ
సెక్రెటరీ నేరాభియోగపత్రం చదవడం పూర్తయిన తరువాత, అధ్యక్షుడు సభ్యులతో చర్చించి కార్టింకిన్ వైపు తిరిగి చూసాడు. ఆయన మొహంలో ఒక భావం స్పష్టంగా ఇలా కనిపిస్తోంది: ‘ఇప్పుడు మేం వివరంగా ప్రతి చిన్నవిషయంతో సహా పూర్తి నిజాన్ని బయటికి లాగుతాం.’
‘రైతు సిమియన్ కార్టంకిన్.’ అధ్యక్షుడు ఎడమవైపుకు వంగి అన్నాడు.
సిమియన్ కార్టింకిన్ లేచి, కట్టుకున్న చేతులను నిదానంగా పక్కలకు జార్చి, శరీరం మొత్తం ముందుకు వంచి, శబ్దం బయటకు రాకుండా పెదాలను కదిలిస్తూ నిలబడ్డాడు.
‘188x జనవరి 17వ తేదీన, స్మెల్‌కాఫ్ అనే వ్యాపారి ట్రంకుపెట్టె నుంచి, యూఫెమియా బొచ్‌కోవా మరియు కటెరీనా మస్లోవాతో కలిసి డబ్బును దొంగిలించారని మీపై అభియోగం మోపబడింది. అంతేకాక, మీరు తరువాత కొంత ఆర్సెనిక్ అనే విషాన్ని సంపాదించి, దాన్ని బ్రాందీతో కలిపి స్మెల్‌కాఫ్‍కి ఇవ్వమని మస్లోవాను ప్రేరేపించారని, అదే అతని మరణానికి కారణమైందని పేర్కొనబడింది. ఈ నేరం చేసినట్టు మీరు ఒప్పుకుంటున్నావా?’ అని అడిగాడు అధ్యక్షుడు, ఈసారి కుడివైపుకు వంగుతూ.
‘ఒప్పుకోను! ఎందుకంటే లాడ్జికొచ్చిన అతిథులకు సేవ చేయడమే మా పని, ఇంకా-’
‘ఆ సంగతి తరువాత చెబుదురు గాని, మీరు ఈ నేరాన్ని అంగీకరిస్తున్నారా?’
‘అయ్యో, లేదు సార్. నేను కేవలం-’
‘ఆ సంగతులన్నీ తర్వాత, నేరాన్ని అంగీకరిస్తున్నారా లేదా?’
ఈసారి శాంతంగానే అయినా చాలా దృఢంగా మళ్ళీ అడిగాడు అధ్యక్షుడు.
‘నేనలాంటి పని చేయలేను, ఎందుకంటే అది-‘
బంట్రోతు మళ్ళీ సిమియాన్ కర్టింకిన్ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి, గుసగుసగా హెచ్చరిస్తూ అతడిని ఆపాడు.
అధ్యక్షుడు కాగితం పట్టుకున్న చేతిని విదిలించి, మోచేతిని మరో భంగిమలోకి మార్చాడు. ఆ చర్యతో ఆయన ‘ఇది ఇక ముగిసింది’ అని చెప్పకనే చెప్పాడు.
తర్వాత ఆయన యుఫీమియా బోచ్కోవా వైపు తిరిగాడు.
‘యూఫెమియా బొచ్‌కోవా, 188x జనవరి 17వ తేదీన, మౌరిటానియా అనే లాడ్జ్‌లో, సిమియన్ కార్టింకిన్, కటెరీనా మస్లోవాలతో కలిసి వ్యాపారి స్మెల్‌కాఫ్‍కి చెందిన ట్రంకుపెట్టె నుండి డబ్బు మరియు ఓ ఉంగరాన్ని దొంగిలించారని, ఆ డబ్బును మీలో మీరు పంచుకున్నారని, తరువాత స్మెల్‌కాఫ్‍కి విషం ఇచ్చి అతని మరణానికి కారణమయ్యారని మీపై అభియోగం ఉంది. ఈ నేరాన్ని మీరు ఒప్పుకుంటున్నారా?’
‘నేను ఏ నేరమూ చేయలేదు.’ ఖైదీ బొచ్‌కోవా ధైర్యంగా, ధృఢంగా సమాధానమిచ్చింది.
‘నేను ఆ గది దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఈ చెత్తపిల్ల లోపలికి వెళ్లింది. అంతా ఆమే చేసింది.’
‘అవన్నీ తర్వాత చెప్పవచ్చు. మీరు నేరాన్ని అంగీకరిస్తున్నారా లేదా?’
అధ్యక్షుడు మళ్ళీ మృధువుగా- కాని స్థిరంగా- అన్నాడు.
‘నేను డబ్బు తీసుకోలేదు, మందు ఇవ్వలేదు, గదిలోకి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళి ఉంటే ఆమెను తన్ని బయటకు పంపేదాన్ని.’
‘మీరు నేరాన్ని అంగీకరించడం లేదు, అంతేనా?’
‘ఎప్పటికీ నేరం ఒప్పుకోను.’
‘మంచిది’ అని అధ్యక్షుడు మూడవ ఖైదీ వైపు తిరుగుతూ ప్రారంభించాడు.
‘కటేరినా మస్లోవా, మీరు వ్యభిచారగృహం నుండి వాణిజ్యవేత్త స్మెల్‌కాఫ్ ట్రంకుపెట్టె తాళంచెవితో పాటు డబ్బు, ఉంగరం తీసుకొని వచ్చారని ఆరోపించబడింది.’
అధ్యక్షుడు ఇదంతా కంఠతాపట్టిన పాఠంలాగా చెప్పాడు.
ఇంతలో తన ఎడమవైపు ఉన్న సభ్యుడి వైపు వంగి, అతను ‘మెటీరియల్ ఎవిడెన్స్’ జాబితాలో పేర్కొన్న ఒక సీసా కనిపించడం లేదని అతని చెవిలో గుసగుసలాడుతుంటే విని, తిరిగి తాను ఆపిన దగ్గర నుండి పునరావృతం చేస్తూ అన్నాడు:
‘ట్రంకుపెట్టె నుండి డబ్బు మరియు ఉంగరం దొంగిలించి పంచుకున్నారు. తరువాత స్మెల్‌కాఫ్‍తో కలిసి మౌరిటానియా లాడ్జ్‌కి తిరిగి వచ్చి, అతనికి మందులో విషం ఇచ్చి తద్వారా అతని మరణానికి కారణమయ్యారు. మీరు నేరాన్ని అంగీకరిస్తున్నారా?’
‘నేనే తప్పూ చేయలేదు.’ వెంటనే అంది మస్లోవా. ‘ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెబుతున్నాను- నేనా ఉంగరం తీసుకోలేదు, నేనా ఉంగరం తీసుకోలేదు. నేనసలు ఏమీ తీసుకోలేదు. ఆ ఉంగరం స్వయంగా ఆయనే నాకు ఇచ్చాడు.’
‘అంటే మీరు 2,500 రూబిళ్ళు దొంగిలించిన నేరాన్ని కూడా అంగీకరించడం లేదా?’
‘నేను 40 రూబిళ్ళు తప్ప ఏమీ తీసుకోలేదని చెప్పాను.’
‘సరే, మరియు మీరు వ్యాపారి స్మెల్‌కాఫ్‍కి మద్యంలో పొడి కలిపిన నేరాన్ని అంగీకరిస్తున్నారా?’
‘అవును. ఆ పని నేను చేసాను. కానీ అవి నిద్రమాత్రలనీ, వాటివల్ల ఏ హాని జరగదనీ వాళ్ళు చెప్పింది నమ్మేసాను. అతణ్ణి చంపాలని నేనెప్పుడూ అనుకోలేదు, అతను చనిపోవాలని నేనెప్పుడూ కోరుకోలేదు. దైవసాక్షిగా చెబుతున్నాను, నాకెప్పుడూ అలాంటి ఉద్దేశం లేదు.’
‘అంటే, వ్యాపారి స్మెల్‌కాఫ్ నుండి డబ్బు, ఉంగరం దొంగిలించిన నేరం అంగీకరించడం లేదు కాని ఆయనకు పౌడర్ ఇచ్చిన నేరం మాత్రం ఒప్పుకుంటున్నారా?’
‘అవును. ఇది ఒప్పుకుంటున్నాను. కానీ అవి నిద్రమాత్రలని మాత్రమే అనుకున్నాను. అతను నిద్రపోవడానికి మాత్రమే వాటిని ఇచ్చాను. అంతకంటే ఘోరమైనదేదీ నేను చేయాలనుకోలేదు. అంతకుమించిన ఉద్దేశ్యమేదీ నాకు లేదు.’
‘సరే. మంచిది.’ అన్నాడు అధ్యక్షుడు.
తనకు కావలసిన వివరాలు వచ్చినందుకు సంతృప్తిగా ఉన్నట్టు స్పష్టంగా కనిపించాడాయన.
‘ఇప్పుడు, ఇదంతా ఎలా జరిగిందో చెప్పండి.’ కుర్చీలో వెనక్కి ఒరిగి, చేతులు ముడుచుకుని టేబుల్ మీద పెట్టి అన్నాడు: ‘ఏం జరిగిందో మొత్తం స్వేచ్ఛగా చెప్పండి. అది మీకే మంచిది.’
మస్లోవా అధ్యక్షుడి వైపు సిగ్గుపడుతూ చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది.
‘ఎలా జరిగిందో అందరికీ చెప్పండి.’
‘ఎలా జరిగిందంటే-‘ మస్లోవా ఒక్కసారిగా చకచకా చెప్పడం మొదలుపెట్టింది. ‘నేను లాడ్జ్‌కి వచ్చాను. నాకు గది చూపించారు. అతను అప్పటికే బాగా తాగి ఉన్నాడు.’ ఆమె ‘అతను’ అనే పదాన్ని కళ్ళు పెద్దవి చేసి, భయపడుతున్న చూపుతో పలికింది. ‘నేను వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ అతను నన్ను వెళ్ళనివ్వలేదు.’ ఆమె దారం తెగిపోయినట్లుగానో, మరేదో గుర్తుకొచ్చినట్లుగానో టక్కున ఆగిపోయింది.
‘సరే, తర్వాత?’
‘తర్వాతేముంది? నేను కాసేపు అక్కడే ఉండి ఇంటికి వెళ్ళిపోయాను.’
సరిగ్గా అప్పుడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుర్చీలోంచి కొద్దిగా పైకి లేచి, ఒక మోచేతి మీద అసౌకర్యంగా వంగి నిలబడ్డాడు.
‘మీరు ఏదైనా ప్రశ్నించాలనుకుంటున్నారా?’ అని అడిగాడు అధ్యక్షుడు.
అవునన్నట్టు సూచన రావడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను మాట్లాడమని ఆహ్వానిస్తూ ఒక సంజ్ఞ చేసాడు.
‘ఖైదీ మస్లోవాకి సిమియన్ కర్టెంకిన్‌తో ఇంతకు ముందు పరిచయం ఉందా అని నేను అడగాలనుకుంటున్నాను?’ అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్, మస్లోవా వైపు చూడకుండా. ప్రశ్న అడిగాక అతను పెదవులు బిగించి మొహం చిట్లించాడు.
అధ్యక్షుడు ఆ ప్రశ్నను మళ్ళీ అడిగాడు. మస్లోవా భయపడ్డట్టుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తేరిపార చూసింది.
‘సిమియన్‌తోనా? ఉంది.’
‘కర్టెంకిన్‌తో ఖైదీకి ఉన్న పరిచయం ఏ స్థాయిలో ఉండేదో తెలుసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళు తరచూ కలుసుకునేవారా?’
‘పరిచయమేం లేదు… లాడ్జ్‌కి వచ్చే గెస్ట్ ల కోసం నన్ను పిలచేవాడు, అంతే. అదసలు పరిచయం కూడా కాదు.’ తన కళ్ళను ఆత్రుతగా అధ్యక్షుడి మీంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు, తిరిగి అధ్యక్షుడి వైపు తిప్పుతూ అంది మస్లోవా.
‘కర్టెంకిన్ మిగిలిన అమ్మాయిలను వదిలేసి కేవలం మస్లోవాని మాత్రమే గెస్ట్‌ల కోసం ఎందుకు పిలిచేవాడో తెలుసుకోవాలనుకుంటున్నాను?’- పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్ళు సగం మూసి, ఒక కుటిలమైన మెఫిస్టోఫెలియన్ నవ్వుతో అన్నాడు.
‘నాకు తెలీదు. అది నాకెలా తెలుస్తుంది?’ భయంభయంగా చుట్టూ చూస్తూ అంది మస్లోవా.
క్షణంపాటు ఆమె నెఖ్లుడోవ్ వైపు చూసి, మళ్ళీ అంది. ‘అతనికి నచ్చినవాళ్ళని పిలిచేవాడు.’
‘ఆమె నన్ను గుర్తుపట్టిందా?’ మనసులో అనుకున్నాడు నెఖ్లుడోవ్.
వెంటనే అతని మొహంలోకి రక్తం పరుగులెత్తింది. కానీ, గుంపులో ఉన్న అతణ్ణి గుర్తుపట్టకుండానే మొహం తిప్పుకుని, మళ్ళీ ఆత్రుతగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైపు చూసింది మస్లోవా.
‘అయితే, కార్టింకిన్‌తో తనకు ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవని ఖైదీ ఖండిస్తుందా? మంచిది, ఇక నేను అడగాల్సిన ప్రశ్నలేం లేవు’ అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
టేబుల్ మీదనించి తన మోచేతిని తీసి ఏదో రాయడం ప్రారంభించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. వాస్తవానికి అతడేం రాయడం లేదు. తన నోట్స్‌లో ఉన్న అక్షరాల వెంట పెన్నుని పరుగెత్తిస్తూ ఏదో రాస్తున్నట్టుగా నటిస్తున్నాడు. పెద్దపెద్ద లాయర్లు, ప్రాసిక్యూటర్లు ఒక తెలివైన ప్రశ్న వేసాక, తమ ప్రత్యర్థులను విరిచేయడానికి ఉపయోగపడే నోట్ రాసుకోవడాన్ని అతను చూసాడు.
అధ్యక్షుడు వెంటనే కొనసాగించలేదు. ఎందుకంటే కళ్ళజోడున్న సభ్యునితో ముందు తయారు చేసుకున్న ప్రశ్నలను అడగడం అంగీకారమేనా అని అడిగి అతని సలహా తీసుకుంటూ ఉన్నాడు.
‘సరే! ఆ తర్వాతేమైంది?’ అని అధ్యక్షుడు మళ్ళీ మొదలుపెట్టాడు.
కొంచెం ధైర్యంగా అధ్యక్షుడి వైపే చూస్తూ చెబుతోంది మస్లోవా: ‘తర్వాత నేను ఇంటికొచ్చేసాను. పడుకున్నాను. దాదాపు నిద్రపట్టే సమయానికి మా అమ్మాయిల్లో ఒకరైన బెర్తా నన్ను లేపి, ‘వెళ్ళు, నీ వ్యాపారి మళ్ళీ వచ్చాడు!’ అని చెప్పింది. అతను…’
‘అతను’ అనే పదాన్ని ఉచ్చరిస్తుంటే ఆమెలో భయం మళ్ళీ స్పష్టంగా కనిపించింది.
‘…అతను మా అమ్మాయిలందరికి విందు ఇస్తూనే ఉన్నాడు. ఇంకా మందు తెప్పించాలనుకున్నాడు. కాని అతని దగ్గర డబ్బులేం లేవు. నన్ను అతని లాడ్జ్‌కి వెళ్ళి డబ్బు ఎక్కడుందో, ఎంత తీసుకురావాలో చెప్పాడు. అందుకే వెళ్ళాను.’
అధ్యక్షుడు అప్పటివరకు తన ఎడమవైపున్న సభ్యునితో గుసగుసలాడుతూనే ఉన్నాడు. కానీ ఆమె చెప్పింది విన్నట్లుగా కనిపించేందుకు ఆమె చివరి మాటలను పునరావృతం చేసాడు.
‘అందుకే మీరు వెళ్ళారు. సరే, తర్వాత ఏమైంది?’
‘నేనక్కడికి వెళ్ళాను. అంతా అతను చెప్పినట్టే చేసాను. అతని గదిలోకి వెళ్ళాను. నేనొక్కదాన్నే కాదు, సిమియోన్ కార్టింకిన్‌నుతో పాటు ఆమెను కూడా పిలిచాను,’ అని బొచ్‌కోవా వైపు చూస్తూ చెప్పింది.
‘అదబద్ధం. నేనసలు లోపలికి వెళ్ళలేదు,’ అని బొచ్‌కోవా అరవడం మొదలుపెట్టింది, కానీ వెంటనే అధ్యక్షుడు ఆమెను ఆపాడు.
‘వాళ్ళ ఎదురుగానే నేను నాలుగు నోట్లు తీసుకున్నాను,’ అని మస్లోవా కోపంగా ముఖాన్ని ముడుచుకుంటూ బొచ్‌కోవా వైపు చూడకుండానే చెప్పింది.
‘అయితే, ఖైదీ 40 రూబిళ్ళు తీసుకుంటున్నప్పుడు అక్కడ మొత్తం ఎంత డబ్బుందో గమనించిందా?’ ప్రాసిక్యూటర్ ప్రశ్నించాడు.
ప్రాసిక్యూటర్ ఆమెనుద్దేశించి ప్రశ్నించగానే మస్లోవా వణికిపోయింది. ఎందుకో తెలీదు గాని అతను తనకేదో కీడు చేయాలకుంటున్నాడని ఆమెకి అనిపించింది.
‘నేను లెక్కబెట్టలేదు. కాని కొన్ని 100-రూబిళ్ళ నోట్లని మాత్రం చూసాను.’
‘ఆ! అయితే ఖైదీ 100 రూబుల్ నోట్లను చూసింది. అంతేగా?’ అంటూ అధ్యక్షుడు ఒకసారి గడియారాన్ని చూసుకుని మళ్ళీ కొనసాగించాడు.
‘సరే, మీరు డబ్బు తెచ్చారు కదా!’
‘తెచ్చాను.’
‘తర్వాత?’
‘తర్వాత అతను నన్ను తనతో తిరిగి తీసుకెళ్ళాడు.’
‘సరే. మరి మీరా పొడిని అతనికెలా ఇచ్చారు, అదే- అతని మందులో?’
‘ఎలా ఇచ్చానంటే, నేనే దాన్ని మందులో కలిపి ఇచ్చాను.’
‘ఎందుకిచ్చారు అతనికి?’
ఆమె సమాధానం చెప్పకుండా ఒకసారి దీర్ఘంగా బరువుగా నిట్టూర్చింది.
‘అతను నన్ను వెళ్ళనివ్వలేదు.’
కాసేపు నిశ్శబ్దం తర్వాత కొనసాగిస్తూ చెప్పింది.
‘నేను బాగా అలిసిపోయాను. అందుకే బయట వరండాలోకి వెళ్ళి సిమియోన్‌తో ‘అతను నన్ను వెళ్ళనిస్తే బావుండు, బాగా అలిసిపోయాను’ అని చెప్పాను. అప్పుడతను ‘మేం కూడా అతనితో బాగా విసిగిపోయాం. అతనికి నిద్రమాత్ర ఇవ్వాలనుకుంటున్నాం. అతను నిద్రపోతాడు, అప్పుడు నువ్వు వెళ్ళొచ్చు’ అన్నాడు. నేను సరే అన్నాను. అవి అంత ప్రమాదకరమైనవేం కాదనుకున్నాను, అతనో పొట్లం ఇచ్చాడు. లోపలికెళ్ళాను. వ్యాపారి పార్టిషన్ వెనుక పడుకుని ఉన్నాడు. బ్రాందీ ఇవ్వమని అడిగాడు. టేబుల్ మీదున్న మంచి షాంపైన్ బాటిలొకటి తీసుకుని రెండు గ్లాసుల్లో పోసాను. ఒకటి అతనికోసం ఇంకోటి నా కోసం. అతని గ్లాసులో పొడిని కలిపి ఇచ్చాను. అది ప్రమాదకరమని ముందే తెలిస్తే అతనికెందుకు ఇస్తాను?’
‘సరే. ఆ ఉంగరం మీ దగ్గరికి ఎలా వచ్చింది? అతను మీకు ఎప్పుడిచ్చాడు?’
‘మేము అతని లాడ్జ్‌కి తిరిగి వచ్చినప్పుడు జరిగిందది. నేను వెళ్ళిపోవాలనుకున్నాను, అతను నా నెత్తిమీద కొట్టి నా దువ్వెన విరిచేసాడు. నాకు కోపం వచ్చి వెళ్ళిపోతానన్నాను. అప్పుడు, నేను వెళ్ళిపోకుండా ఉండటానికి తన వేలికున్న ఉంగరం తీసిచ్చాడు.’
పబ్లిక్ ప్రాసిక్యూటర్ మళ్ళీ కొద్దిగా పైకి లేచి, అమాయకత్వం వొలకబోస్తూ ఇంకొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతి కోరాడు. అనుమతి లభించాక, తన ఎంబ్రాయిడరీ చేసిన కాలర్‌పై తల ఆనించి అడిగాడు:
‘వ్యాపారి స్మెల్‌కోవ్ గదిలో ఖైదీ మస్లోవా ఎంతసేపుందో తెలుసుకోవాలని ఉంది.’
మస్లోవా మళ్ళీ కంగారు పడింది. ప్రాసిక్యూటర్ వైపు, అధ్యక్షుడి వైపు భయంగా చూసి గబగబా ‘ఎంతసేపున్నానో నాకు గుర్తు లేదు’ అంది.
‘ఓకే. అయితే స్మెల్‌కాఫ్ గదిలోంచి బయటకు వచ్చాక ఖైదీ మస్లోవా ఆ లాడ్జ్‌లో ఇంకెక్కడికైనా వెళ్లిందేమో గుర్తుందా?’ ప్రాసిక్యూటర్ అడిగాడు.
మస్లోవా ఒక క్షణం ఆలోచించి చెప్పింది, ‘అవును, నేను అతని గది పక్కనే ఉన్న ఖాళీ గదిలోకి వెళ్ళాను.’
‘అలాగా! అక్కడికి ఎందుకెళ్ళారు?’ ఈసారి ప్రాసిక్యూటర్ తన స్థాయి మరచిపోయి నేరుగా ఆమెనే ప్రశ్నించాడు.
‘కొంచెం విశ్రాంతి తీసుకుందామని వెళ్ళాను. గుర్రబ్బండి వచ్చేవరకు అక్కడ ఉందామనుకున్నాను.’
‘మరి ఖైదీతో పాటు కార్టింకిన్ అదే గదిలో ఉన్నాడా లేదా?’
‘అతను లోపలికి వచ్చాడు.’
‘అతనెందుకు వచ్చాడు?’
‘వ్యాపారి బ్రాందీ కొంచెం మిగిలిపోయింది. మేము ఇద్దరం కలిసి దాన్ని తాగేసాం.’
‘ఓహో, కలిసి తాగేసారా. బాగుంది! మరి ఖైదీ కార్టింకిన్‌తో మాట్లాడిందా? ఒకవేళ మాట్లాడితే దేని గురించి మాట్లాడిందో?’
మస్లోవా అకస్మాత్తుగా సిగ్గుతో ఎర్రబడ్డ తన మొహాన్ని ముడుచుకుని చకచకా అంది: ‘దేని గురించి మాట్లాడ్తాను? నేనేం మాట్లాడ్లేదసలు. నాకు తెలిసింది అంతే. నన్ను మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి. నేనే తప్పూ చేయలేదు. అంతే!’
‘ఇక నేను అడగాల్సిందేం లేదు,’ అన్నాడు ప్రాసిక్యూటర్. తన భుజాలను అసహజంగా పైకెత్తి కింద ఏదో రాసుకుంటున్నాడు. అందులో ఖైదీ స్వయంగా కార్టింకిన్‌తో ఖాళీ గదిలో ఉన్నానని ఒప్పుకుందని తన ప్రసంగం కోసం ఒక నోట్ రాసుకున్నాడు.
కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది అక్కడ.
‘మీరు ఇంకేమీ చెప్పదలచుకోలేదా?’ – ప్రశ్నించాడు అధ్యక్షుడు.
‘నేను మెత్తం చెప్పేసాను.’ – నిట్టూర్పు విడిచి కూర్చుంది మస్లోవా.
తర్వాత అధ్యక్షుడు తాను గమనించినదేదో రాసుకున్నాడు. ఎడమవైపు కూర్చున్న సభ్యుడు తన చెవిలో గుసగుసలాడింది విని, అధ్యక్షుడు పదిహేను నిమిషాల విరామం ప్రకటించి హడావుడిగా లేచి కోర్టు బయటికి వెళ్ళిపోయాడు.
ఆ ఎడమవైపున్న సభ్యుడు గుబురుగడ్డం, మృదువైన కళ్ళతో ఎత్తుగా ఉన్నాడు. అతను చెప్పిన సమాచారం ఏంటంటే; అతనికి కాస్త కడుపునొప్పితో ఇబ్బందిగా ఉంది. కొంచెం మసాజ్ చేసుకుని, కొన్ని చుక్కల మందు వేసుకోవాలనుకుంటున్నాడట. ఈ విరామ ప్రకటనకు కారణం అదే.
న్యాయమూర్తులు లేచిన వెంటనే మిగిలిన న్యాయవాదులు, జ్యూరీ సభ్యులు, సాక్షులు కూడా లేచి నిలబడ్డారు. పనిలో కొంత భాగం పూర్తయిందన్న చిన్న సంతృప్తితో ఒక్కొక్కరు ఒక్కో వైపు కదలడం ప్రారంభించారు.
నెఖ్లుడోవ్ జ్యూరీ గదిలోకి వెళ్ళి, ఒక కిటికీ పక్కన కూర్చున్నాడు.
అధ్యాయం 12
పన్నెండేళ్ళ క్రితం:
అవును, ఇది కటూషానే.!
పన్నెండేళ్ళ క్రితం నెఖ్లుడోవ్, కటూషా మధ్య సంబంధాలు ఈ విధంగా ఉన్నాయి:
యూనివర్సిటీలో మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు నెఖ్లుడోవ్ కటూషాని మొదటిసారి చూసాడు. వేసవి సెలవుల్లో ‘భూమి యాజమాన్యం’పై ఒక వ్యాసం రాసుకుంటూ తన మేనత్తల దగ్గర గడిపినప్పుడు ఆమెను చూసాడు. అప్పటివరకు అతను ప్రతి వేసవిలో తన తల్లి, చెల్లితో కలిసి మాస్కో దగ్గర తల్లికున్న పెద్ద ఎస్టేట్‌లో గడిపేవాడు. కానీ ఆ సంవత్సరం అతని చెల్లి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. తల్లి ఆరోగ్యరీత్యా ఔషధ లక్షణాలున్న ‘నీటి బుగ్గలు’ కోసం విదేశాలకు వెళ్ళింది. వ్యాసం పూర్తిచేయాల్సిన పని ఉండటంతో నెఖ్లుడోవ్ ఆ వేసవికాలం తన మేనత్తలతో గడపాలని నిర్ణయించుకున్నాడు.
ఏకాంతవాసమైన వాళ్ళ ఎస్టేట్ ఒక నిశ్శబ్ద నిలయంగా ఉండేది. అతని మనసుని మరల్చేవేవీ అక్కడ లేవు. తమ మేనల్లుడు, తమ వారసుడైన నెఖ్లుడోవ్‍ను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు అత్తలు. అతనికి కూడా తన అత్తలన్నా, వాళ్ళ పాతకాలపు సాధారణ జీవనశైలి అన్నా చాలా ఇష్టం.
మేనత్తల ఎస్టేట్‌లో గడిపిన ఆ వేసవిలో నెఖ్లుడోవ్ ఒకానొక మధురానందమయ స్థితిని అనుభవించాడు. ఒక యువకుడిగా, మొదటిసారి ఎవరి మార్గదర్శకత్వం లేకుండా జీవితపు అపురూప సౌందర్యాన్ని దానిలోని అంతరార్థాన్ని హృదయంతో చూసాడు. లోకంలో మనిషికంటూ ఒక ప్రత్యేక కర్తవ్యం ఉందని అతడు తెలుసుకున్న సమయం అది. అనంతమైన పరిపూర్ణత వైపు తనను తాను మలుచుకునే అవకాశం ఉందని, ఈ ప్రపంచంలో మరిన్ని వెలుగులు నింపగల శక్తి మనిషికి ఉందని అతడు నమ్మాడు. అది కేవలం ఆశ మాత్రమే కాదు, తాను కలలుగన్న పరిపూర్ణతను చేరుకోగలననే దృఢసంకల్పంతో ఆ మహత్తరమైన పనికి తనను తాను అర్పించుకున్నాడు.
ఆ సంవత్సరం, ఇంకా యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లోనే, అతను స్పెన్సర్ రాసిన ‘సోషల్ స్టాటిక్స్’ అనే పుస్తకం చదివాడు. భూమి యాజమాన్యం గురించి స్పెన్సర్ చెప్పిన అభిప్రాయాలు అతన్ని బాగా ఆకట్టుకున్నాయి, ఎందుకంటే నెఖ్లుడోవ్ స్వయంగా పెద్ద ఎస్టేట్‌కి వారసుడు. తండ్రి పెద్ద ధనవంతుడు కాకపోయినా, తల్లికి పదివేల ఎకరాల భూమి తన కట్నం కింద సంక్రమించింది. ఆ సమయంలో భూమిపై వ్యక్తిగత యాజమాన్యం ఉండటం అనేది ఎంత నిర్దయగా, అన్యాయంగా ఉంటుందో నెఖ్లుడోవ్ స్పష్టంగా గ్రహించాడు. మనస్సాక్షికి లోబడి త్యాగం చేయడంలో అత్యంత ఆధ్యాత్మిక ఆనందం దొరుకుతుందని నమ్మేవాళ్ళలో నెఖ్లుడోవ్ ఒకడు. అందుకే, తనకుతండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిపై హక్కు వదులుకొని, రైతుకూలీలకు దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ భూమి సమస్య గురించే అతను తన వ్యాసాన్ని రాసాడు.
మేనత్తల ఎస్టేట్‌లో నెఖ్లుడోవ్ తన జీవితాన్ని ఇలా క్రమబద్ధీకరించుకున్నాడు: ఉదయం చాలా తొందరగా, కొన్నిసార్లు మరీ మూడింటికే నిద్రలేచేవాడు. సూర్యోదయానికి ముందే కొండకిందున్న నదిలో స్నానం చేయడానికి ఉదయపు మంచుతెరల గుండా నడిచెళ్ళేవాడు. గడ్డిమీదా పూలమీదా మంచు బిందువులు ఇంకా ఆరిపోకముందే తిరిగి వచ్చేవాడు.
కొన్నిసార్లు ఉదయపు కాఫీని ఆస్వాదించాక, పరిశోధన గ్రంథాలు, పత్రాలతో వ్యాసం రాయడానికి కూర్చునేవాడు. కాని చాలాసార్లు చదవడం రాయడం మానేసి ఇంట్లోంచి మళ్ళీ బైటికెళ్ళి పొలాల్లో అడవుల్లో స్వేచ్ఛగా తిరిగేవాడు. మధ్యాహ్నభోజనానికి ముందు తోటలో ఎక్కడోచోట పడుకొని కాసేపు నిద్రపోయేవాడు. భోజనం చేస్తున్నప్పుడు సరదాగా మాట్లాడుతూ తన అత్తలను నవ్వించి సంతోషపెట్టేవాడు. ఆ తర్వాత కాసేపు గుర్రం మీద స్వారీకో, పడవ మీద నదీవిహారినికో వెళ్ళేవాడు. సాయంత్రం మళ్ళీ తన వ్యాసంపై పనిచేస్తూనో, పుస్తకం చదవుతూనో, మేనత్తలతో కూర్చుని పేకాడుతూనో గడిపేవాడు.
అతని జీవితంలోని ఆనందం ఎంత గొప్పగా ఉండేదంటే అది అతణ్ణి కలవరపెట్టేది. ఎన్నో రాత్రుళ్ళు నిద్రపట్టకుండా చేసేది. ముఖ్యంగా వెన్నెల రాత్రుళ్ళు. అప్పుడు నిద్రపోవడానికి బదులు తెల్లవారుజాము వరకూ తోటలో ఒంటరిగా అనేక కలలూ, ఊహలతో విహరించేవాడు.
అలా ప్రశాంతంగా, సంతోషంగా తన మేనత్తల దగ్గరున్న కాలంలో మొదటి నెలంతా గడిపాడు నెఖ్లుడోవ్. వాళ్ళ సంరక్షణలో ఉన్న సగం విద్యార్థి, సగం పనిమనిషైన ఆ నల్లకళ్ళ చురుకు కాళ్ళ పిల్ల కటూషాను ప్రత్యేకంగా పట్టించుకోలేదు.
అప్పుడు, పందొమ్మిదేళ్ళ వయస్సులో, తల్లి రెక్కల చాటున భద్రంగా పెరిగిన నెఖ్లుడోవ్ ఇంకా చాలా స్వచ్ఛంగా ఉన్నాడు. కలలోనైనా సరే ఒక స్త్రీ కనిపించిందంటే అది కేవలం అతని భార్యగానే కనిపించేది. తాను పెళ్ళి చేసుకోలేని ఇతర స్త్రీలందరూ అతని దృష్టిలో అసలు మహిళలే కాదు, ‘మనుషులు’ మాత్రమే.
కాని ఆ వేసవిలో స్వర్గారోహణ దినాన, అతని అత్తల పొరుగువాళ్ళు కుటుంబంతో సహా ఆ రోజు గడపడానికి వచ్చారు. అందులో ఇద్దరు యుక్తవయసు కూతుర్లు, ఒక పాఠశాల పిల్లోడు, వాళ్ళింట్లో ఉంటున్న ఒక గ్రామీణ యువ చిత్రకారుడు ఉన్నారు. టీ తాగాక అందరూ ఇంటి ముందు గడ్డి కోసేసున్న పచ్చిక మైదానంలో ఆడుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు ‘గోరెల్కి’ అనే ఆట ఆడుతుండగా కట్యూషా కూడా వాళ్ళతో చేరింది. ఆటలో పరుగెడుతూ, జతగాళ్ళని మారుస్తూ, నెఖ్లుడోవ్ కటూషాని పట్టుకున్నాడు. అప్పుడామె అతని జంట అయింది.
ఇప్పటిదాకా కటూషా రూపలావణ్యాన్ని ఇష్టపడ్డాడే తప్ప ఆమెతో సన్నిహిత సంబంధం కావాలనే ఆలోచన అతని మనసులో ఎప్పుడూ తలెత్తలేదు.
‘వాళ్ళిద్దర్నీ పట్టుకోవడం అసాధ్యం’ అన్నాడు చిరునవ్వుతో యువ చిత్రకారుడు. ఈసారి పట్టుకోవాల్సిన వంతు అతనిదే. అతనివి పొట్టి కాళ్ళే గాని పిక్కబలంతో గట్టిగా పరుగెత్తగలడు.
‘ఓయ్! నువ్వు మమ్మల్ని పట్టకోలేవా?’ అంది కటూషా.
‘ఒకటి… రెండు… మూడు…’ అని చిత్రకారుడు చప్పట్లు కొట్టాడు. కటూషా నవ్వు ఆపుకుంటూ అతని వెనక నెఖ్లుడోవ్‍తో చోటు మార్చుకుంది. తన గరుకైన చిన్నిచేత్తో అతని పెద్దచేతిని ఒత్తి పట్టుకుంది. గంజి పెట్టిన లంగా రెపరెపమని చప్పుడు చేస్తుండగా ఆమె ఎడమవైపుకి పరుగెత్తింది. చిత్రకారుడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నెఖ్లుడోవ్ కుడివైపు వేగంగా పరుగెడుతూ వెనక్కితిరిగి చూసాడు. చిత్రకారుడు కటూషాని వెంటపడుతూ పరుగెడుతున్నాడు. యవ్వనపు దృఢమైన కాళ్ళతో వేగంగా పరుగెడుతూ అతనకి చాలా ముందుంది ఆమె. వాళ్ళ ముందు ఒక లైలాక్ మొక్కల దిబ్బ ఉంది. కటూషా నెఖ్లుడోవ్‍ని వెనకనించి వచ్చి తనతో కలవమని తలూపుతూ సైగ చేసింది. ఆట నియమం ప్రకారం వాళ్ళిద్దరూ మళ్ళీ చేతులు కలిపితే ఇక వెంటపడేవాడి నుండి సురక్షితంగా ఉన్నట్టు లెక్క. నెఖ్లుడోవ్ ఆ సైగను అర్థం చేసుకుని పొద వెనుకగా పరుగెత్తాడు. కాని అక్కడ ఒక చిన్నగుంటలో ముండ్లతుప్పలు పెరిగి గడ్డిదుబ్బులతో కప్పబడున్నాయని అతనికి తలీదు. పాదాలు తడబడి మంచుతో తడిసిన ముండ్లతుప్పల మీద పడిపోయాడు. చేతులు మంటపుట్టేలా ముళ్ళు దిగబడ్డాయి. అయినా చటుక్కున పైకి లేచి తన దురదృష్టానికి తానే నవ్వుకున్నాడు.
నల్ల రేగుపళ్ళలాంటి కళ్ళతో, ఆనందం వెల్లివిరుస్తున్న మొహంతో కటూషా అతని వైపు గాలిలా దూసుకొచ్చింది. ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు.
‘ముళ్ళు గుచ్చుకున్నాయనుకుంటా?’
ఖాళీగా ఉన్న ఇంకోచేత్తో జుట్టు సర్దుకుంటూ, వేగంగా ఊపిరి పీలుస్తూ, సంతోషంతో కూడిన ఆహ్లాదకరమైన చిరునవ్వుతో నేరుగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగిందామె.
‘ఇక్కడ గుంట ఉందని నాకు తెలీదు’ అన్నాడు, ఆమెతో పాటు నవ్వుతూ.
అతనామె చేతిని తనచేతిలో ఉంచుకునే సమాధానం చెప్పాడు. ఆమె అతనికి మరింత దగ్గగా జరిగింది. ఎలా జరిగిందో తెలియకుండానే అతనామె వైపు వాలిపోయాడు. ఆమె వెనక్కి తగ్గలేదు. చేతిని గట్టిగా పట్టుకుని ఆమె పెదాలమీద ముద్దు పెట్టుకున్నాడతను.
‘అదిగో! పెట్టేసావు!’
ఒక్కసారిగా తన చేతిని విడిపించుకుని అతణ్ణుండి దూరంగా పరుగెత్తింది. రాలిపడుతున్న పూలున్న తెల్లటి లైలాక్ చెట్టు నుండి రెండు కొమ్మలను విరిచి, వేడిగా ఉన్న తన మొహానికి వింజామరలా విసురుకుంటూ, తల అతని వైపుకు తిప్పి ముందుకు నడుచుకుంటూ, చేతులు చకచకా ఊపుకుంటూ వెళ్ళి ఇతర ఆటగాళ్ళతో కలిసింది.
ఈ సంఘటన తర్వాత నెఖ్లుడోవ్, కటూషాల మధ్య ఒక ప్రత్యేక బంధం ఏర్పడింది. అది యువతీయువకులు పరస్పరం ఆకర్షితులైనప్పుడు ఏర్పడే స్వచ్ఛమైన బంధం లాంటిది.
కటూషా అతని గదిలోకి వచ్చినప్పుడో, తెల్లటి ‘ఏప్రాన్’లో దూరం నుంచి కనిపించినప్పుడో, నెఖ్లుడోవ్ కళ్ళు కాంతిమయం అయ్యేవి. సూర్యుడు ఉదయించినప్పుడు ప్రతిదీ మరింత ఆసక్తికరంగా, మరింత సంతోషకరంగా, మరింత మంగళకరంగా ఎలాగైతే మారినట్లు ఉంటుందో అలా ఉండేదతనికి. జీవితం మొత్తం ఒక ప్రశాంతానందంతో నిండిపోయినట్టు అనిపించేది. ఆమె కూడా అలాంటి అనుభూతినే పొందేది.
నెఖ్లుడోవ్ కి కేవలం కటూషాతో కలిసున్నప్పుడు మాత్రమే కాదు, ‘కటూషా ఉంది’ అనే ఆలోచన (ఆమెకు నెఖ్లుడోవ్ ఉన్నాడనే ఆలోచన) కూడా ఈ అనుభూతి కలిగించేది.
తల్లి నుండి ఒక బాధాకరమైన ఉత్తరం వచ్చినప్పుడో, వ్యాసం రాయడంలో ఇబ్బంది కలిగినప్పుడో, యువకులకు తరచుగా వచ్చే అకారణ విచారం కలిగినప్పుడో కేవలం కటూషాను గుర్తు చేసుకుంటే చాలు, ఆమెను చూడబోతున్నానని అనుకుంటే చాలు అతని బాధలన్నీ మాయమైపోయేవి.
కటూషాకు ఇంట్లో చాలా పని ఉండేది. కానీ చదువుకోవడానికి కొంచెం సమయం కేటాయించగలిగేది. నెఖ్లుడోవ్ తాను చదివిన దోస్తోయేవ్ స్కీ, తుర్గెనోవ్ పుస్తకాలను ఆమెకు ఇచ్చేవాడు. తుర్గెనోవ్ ‘Lull’ ఆమెకు చాలా బాగా నచ్చింది. ఎలాగోలా వీలు కుదుర్చుకుని ఏ కారిడార్‌లోనో, వరండాలోనో, పెరట్లోనో, కొన్నిసార్లు మేనత్తల పాత పనిమనిషి ‘మట్రోనా పావ్‍లోవ్‍నా’ గదిలోనో కలుసుకుని మాట్లాడుకునేవాళ్ళు. మట్రోనా పావ్‍లోవ్‍నాతో అతను కొన్నిసార్లు టీ తాగుతుంటే, కటూషా అక్కడే పనిచేసుకునేది.
మట్రోనా పావ్‍లోవ్‍నా సమక్షంలో జరిగే సంభాషణలు అత్యంత ఆహ్లాదకరంగా ఉండేవి. ఒంటరిగా ఇద్దరే ఉన్నప్పుడు మాత్రం పరిస్థితి వేరేగా ఉండేది. వాళ్ళ నోళ్ళు మాట్లాడుకునే మాటల కంటే ముఖ్యమైన వేరే విషయాలను వాళ్ళ కళ్ళు మాట్లాడ్డం మొదలుపెట్టేవి. అర్థంకాని ఆత్రుతతో వాళ్ళ పెదాలు ముడుచుకుపోయేవి. ఏదో తెలీని భయం వాళ్ళని తొందరగా విడిపోయేలా చేసేది.
నెఖ్లుడోవ్ మొదటివిడత తన మేనత్తల దగ్గర ఉన్నంతకాలం ఈ ప్రత్యేకమైన బంధం వాళ్ళ మధ్య కొనసాగింది. అత్తలు కూడా దాన్ని గమనించారు. భయపడ్డారు. నెఖ్లుడోవ్ తల్లి ‘ప్రిన్సెస్ ఎలెనా ఇవనోవ్‍నా’కు ఉత్తరం కూడా రాసారు. దిమిత్రి కటూషాతో సన్నిహిత సంబంధం పెంచుకుంటాడేమోనని పెద్దత్త మేరీ ఇవనోవ్‍నా భయపడింది. కానీ ఆమె భయానికి ఆధారం లేదు. ఎందుకంటే నెఖ్లుడోవ్ తనకే తెలీనంత స్వచ్ఛమైన ప్రేమతో కటూషాను ప్రేమించాడు. ఆ స్వచ్ఛమైన ప్రేమలోనే అతని భద్రత, ఆమె భద్రత దాగి ఉంది. ఆమెను అనుభవించాలనే కోరిక అతనికి కలలో కూడా రాలేదు, ఒకవేళ వచ్చినా ఆ ఆలోచన అతనికి భయానకంగా అనిపించేది.
కవితాత్మక స్వభావం కొంచం ఎక్కువున్న సోఫియా ఇవానోవ్‍నా భయాలు మరింత సమంజసంగా ఉన్నాయి. బలమైన, నిశ్చయాత్మక స్వభావం కలిగిన దిమిత్రి లాంటివాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆమె పుట్టుకను గాని, స్థాయిని గాని పట్టించుకోకుండా పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడేమో అని భయపడింది.
ఆ సమయంలో నెఖ్లుడోవ్ గనక తాను కటూషాని ప్రేమిస్తున్నానని గ్రహించినా, ముఖ్యంగా ఆ స్థాయి అమ్మాయితో జీవితాన్ని పంచుకోవడం అసాధ్యమని ఎవరైనా అతనితో వాదించినా అతని సహజ ముక్కుసూటితనపు స్వభావం వల్ల ఆమెను పెళ్ళి చేసుకోవడానికి తను ఆమెను ప్రేమించడం తప్ప వేరే కారణాలేవీ అక్కర్లేదని తేల్చేసేవాడు.
కాని మేనత్తలు వాళ్ళ భయాలను అతనికి చెప్పలేదు. వెళ్ళిపోయేటప్పుడు కూడా కటూషాని ప్రేమిస్తున్నానని అతనికి తెలీదు. తన అంతరంగాన్నిఆనందంతో నింపుతున్న అనేక జీవనానంద రూపాల్లో కటూషా కూడా ఒకటని మాత్రం అతనికి ఖచ్చితంగా తెలుసు. మధురోల్లాసభరితయైన ఈ చిన్నపిల్ల ఆ సంతోషాన్ని తనతో పంచుకుంటుందని మాత్రమే అతను అనుకున్నాడు.
అయినా సరే- అతను వెళ్ళిపోతుంటే అత్తలతో పాటు వరండాలో నిలబడి కన్నీళ్ళు నిండిన నల్లటికళ్ళతో కటూషా తన వైపు చూసినప్పుడు, మళ్ళీ ఎప్పటికీ దొరకని ఒకానొక అందమైన అమూల్యమైన అపురూపమైనదేదో వదిలేసిపోతున్నట్టనిపించింది అతనికి. మనసంతా దిగులుతో నిండిపోయింది.
‘గుడ్‌బై, కటూషా! అన్నిటికీ థాంక్స్.’
బండి ఎక్కబోతుండగా సోఫియా ఇవనోవ్‍నా టోపీ మీదుగా కటూషాని చూస్తూ చెప్పాడతను..
‘గుడ్‌బై, దిమిత్రి ఇవనోవిచ్!’
ఆహ్లాదకరమైన మృదు స్వరంతో బదులు చెప్పింది కటూషా.
కళ్ళలోంచి దూకుతున్న కన్నీళ్ళను ఆపుకుంటూ హాల్‍లోకి పరుగెత్తింది.
అక్కడైతే ఆమె ఏకాంతంలో ప్రశాంతంగా ఏడవగలదు.
***
