అబ్సర్డ్

Spread the love

 ‘ఈరోజు ఎలాగైనా సరే చచ్చిపోవాలి’ మనసులో బలంగా అనుకున్నాడు భార్గవ్.

‘ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళంతా ఎలా చేసుకుంటున్నారసలు? చాలామంది ఉరెసుకుని చనిపోతున్నారు. కానీ ఇంట్లో నాకు కుదరని పని అది. రైలు కింద పడదామంటే ధైర్యమెందుకు సరిపోవట్లేదో అర్థం కావడం లేదు. ఎందుకో ఇప్పటికిప్పుడు లేచి వెళ్లలేకపోతున్నా. పోనీ, ఎటైనా వెళ్ళి నిప్పంటించుకుంటే..! అమ్మో చాలా పెయిన్‌. బాధ భరించలేక గట్టిగా అరుస్తానేమో! ఎవరైనా వచ్చి నన్ను సేవ్ చేస్తారేమో. ఏమో, ఒకవేళ అలాగే జరిగి ఎవరైనా వచ్చి నన్ను కాపాడితే..? సగం కాలిన గాయాలతో చావలేక, బతకలేక.. అబ్బో అదింకా నరకం. నో, అలా అస్సలొద్దు. చస్తే ఒకేసారి చావాలి. అది కూడా ప్రశాంతమైన చావై ఉండాలి. కానీ ఎలా.. ఎలా?’ అని క్షోభ అనుభవిస్తూ తెల్లవారుజామునొస్తున్న కలనుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడిలేచాడు భార్గవ్.

                                                           *

ఉదయం నిద్రలేచేటప్పటికీ బాగా పొద్దెక్కిపోయింది. ఈరోజు కూడా రోజూ వినపడే పక్కింటి పిల్లల గోలతోనే మెలకువ వచ్చింది. ఉదయాన్నే అలా సౌండ్‌ పొల్యూషన్‌తో లేస్తే తనకు నచ్చదు. అలా లేచిన ప్రతీసారి రోజంతా చికాగ్గా, తలనొప్పిగా ఉంటుందతనికి.

కోపాన్ని ఆపుకోలేక, ‘ఏంటీ అల్లరి’ అంటూ చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్‌తో గొడవకు దిగుదామనుకున్నాడు. ‘మీకు పిల్లలుంటే తెలిసేది’ అంటూ వాళ్ళు దెప్పి పొడుస్తారని, అది గౌతమి గనుక వింటే ‘ఇలాంటిళ్ళ మధ్య ఇలాగే ఉంటుంది. బాగా సంపాందిస్తే గేటెడ్‌ కమ్యూనిటీకి షిఫ్ట్‌ అవుతాం కదా’ అంటూ మళ్ళీ తలనొప్పి తెస్తుందని ఆగిపోతాడు.

‘అయినా అసలీ పిల్లలంతా పొద్దున లేచీ స్కూల్‌కి రెడీ అయ్యే దగ్గర్నుండి సాయంకాలం తిరిగొచ్చి, రాత్రి పడుకునే దాకా అల్లరి చేయడమే పనిగా పెట్టుకుంటారా? ఎలా భరిస్తారీ అల్లరిని వాళ్ళ పేరెంట్సంతా? వాళ్ళందరికి విసుగు రాదా?’ అనుకుని చిరాకుపడ్డాడు.

నిన్న రాత్రి సినిమా ముగించుకుని ఇంటికి వచ్చేసరికి రెండయ్యింది. భోజనం కూడా చేయకుండా అలాగే పడుకున్నాడు. ఏదో భారీబడ్జెట్ పాన్ఇండియా సినిమా ప్రీమియర్‌ షో అట. ఒక్కడే వెళ్ళాడు. రాత్రి మొదలైన తలనొప్పి ఇంకా పోనేలేదు.

‘అయినా ఇన్నేసి కోట్లు తగలేసి ఎందుకిలాంటి అడ్డమైన సినిమాలు తీస్తారు? హాయిగా బతుకుతున్న నాలాంటి వాళ్లపైనెందుకు రుద్దుతారు? అయినా నేను కదా ఆ సినిమాకు వెళ్ళింది. వాళ్ళేమీ నాకు టికెట్ తీసి వెళ్ళమని బలవంతపెట్టలేదు. ఇంకోసారి ఇలాంటి ఓవర్ హైప్డ్ దరిద్రపు గొట్టు సినిమాలకు వెళ్తే నా చెప్పుతో నేను..’ అని తనలో తాను తిట్టుకున్నాడు.

భార్యతో రాత్రిపూట ఉండే పోరు భరించలేకే అప్పుడప్పుడిలా లేట్ నైట్ షోలకు వెళ్తుంటాడు భార్గవ్. అర్ధరాత్రి దాటాక వెళ్తే తన నుండి తప్పించుకోవచ్చునని. ఆఫీస్‌కు వెళ్ళే ముందెలాగో ఆమె గోల తప్పదు, మళ్ళీ నైట్ కూడా మరొక స్పెషల్ క్లాస్ ఎందుకనుకుంటాడు.

                                                           *

వాష్‌రూమ్‌ కెళ్ళొచ్చీ, ఇంకా వంటింట్లోనుండి ఏ చప్పుడూ వినబడలేదని బెడ్రూమ్‌లోకి తొంగి చూశాడు. ఓ అర్ధరాత్రిదాకా ఎదురు చూసీ, తనను తిట్టే ప్రోగ్రామోదో క్యాన్సిలైందనే బాధతో పడుకున్నట్టు కనిపిస్తోంది గౌతమి. దగ్గరికెళ్ళి మెల్లగా తట్టిలేపడానికి ప్రయత్నించాడు. ఆమె కొంచెం కదిలింది. బ్లాంకెట్‌ సరి చేసుకుని ఈసారి పూర్తిగా ముసుగుపెట్టుకుని మరోవైపుకు తిరిగి పడుకుంది.

“గౌతమి లే. చాలా పొద్దెక్కిపోయింది. ఇట్స్‌ నైన్‌ ఏఎమ్ ఆల్రెడీ.”

“నాకు ఒంట్లో బాగా లేదు” ఒక్క మార్కు ప్రశ్నకు సమాధానంలా వచ్చిందా సమాధానం.

“ఏమైంది?” అంటూ నుదుటి మీద చెయ్యి పెట్టి చూశాడు. అది కేవలం బ్లాంకెట్‌తో కవర్‌ చేసుకోవడం వల్ల వచ్చిన వేడి మాత్రమేనని అనిపించింది.

‘సరే, లే. లేచి టీ పెట్టి కాస్త అన్నం వండు చాలు.”

“ఓ పక్క నాకు ఒంట్లో బాగోలేదని చెబుతుంటే అర్థం కాదా మీకు? చావు బతుకుల్లో ఉన్నా, లేచి నాకు వండిపెట్టీ చచ్చిపో అనేటట్లుందిగా మీ పద్ధతి. అయినా అసలు పక్కనున్నోళ్ళ బాధలను మీరెప్పుడు పట్టించుకున్నారని? నా కర్మ కాకపోతే ఈ ఇంట్లో వచ్చి పడ్డాను చూడు!”

“ఎందుకరుస్తున్నావ్ ఇప్పుడు, మరీ లేచి తిరగలేనంత ఫీవరా?”

“అవును, నీకలాగే అనిపిస్తుంది. అయినా నా హెల్త్‌ గురించి నాకు తెలుసా, మీకు తెలుసా? కళ్ళు తిరిగి కిందపడి ఏ చెయ్యో కాలో విరిగిపోతే ఏం చేస్తారు? నన్ను కనీసం ఓ మంచి హాస్పిటల్‌కి తీసుకెళ్ళేంత డబ్బైనా ఉందా మీ దగ్గర? ఏ నెల చేస్తే ఆ నెల గడుస్తోంది. అసలు మనకంటూ సేవింగ్స్‌ ఏవైనా ఉండాలన్న ఆలోచనైనా రాదు కదా మీకు?”

“ఎందుకు సీరియల్‌ ఆర్టిస్ట్‌లా డ్రమటిక్‌గా మాట్లాడతావెప్పుడూ. నార్మల్‌గా, కూల్‌గా చెప్తే సరిపోదా. నీ పిచ్చి వాగుడంతా పక్కింట్లోకి వినిపిస్తుంది.”

“హా, వినిపిస్తే ఏమౌతుంది?”

భార్గవ్ ఏం బదులివ్వలేదు. చప్పుడు చెయ్యకుండా బెడ్‌రూం నుంచి బయటికొచ్చేశాడు. ఇది తనకు కొత్తేమీ కాదు. చాలా రొటీన్. లేవగానే పాలప్యాకెట్, కూరగాయలు తెచ్చివడం. టీ తాగి టిఫిన్ చేసి త్వరత్వరగా బస్సెక్కి ఆఫీసుకెళ్ళడం. నెలకో రెండు మూడు సార్లు ఒంటరిగా సెకండ్ షోలకి వెళ్ళడం. సాయంత్రం ఇంటికి త్వరగా వస్తే దగ్గర్లోని పార్కుకెళ్లి గాలి పీల్చడం. మళ్ళీ తిరిగొచ్చాక చాలా సేపయిందనే సాకుతో భార్యతో తిట్లు తినడం. డిన్నర్, ఆ తర్వాత ఏవేవో బాధలు భయాందోళనలతో ఉలిక్కిపడుతూ తెల్లారేదాక ఉండే కోడినిద్ర.. మళ్ళీ మళ్ళీ ఇవే. తన జీవితంలో రోజూ జరిగే ఈ రోటీన్ ప్రోగ్రామ్‌కు ఏ తేడా లేదు. ఇందులో మార్పేదైనా వస్తే తనకెంతో సంతోషంగా ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు ఏ మార్పో వస్తుందనే ఆశ కూడా తనకేమాత్రం లేదు.

                                                             *

ఎదురుగా గోడకున్న అమ్మానాన్నల ఫొటో చూసాడు. అమ్మతో ఉన్న రోజులు, జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఆ వెంటనే నాన్నతో గడిపిన క్షణాలూ. వాళ్ళతో పాటు తనని కూడా ఎందుకు వెంటబెట్టుకెళ్ళలేదని కోపమొచ్చింది. ఆ తర్వాత కాసేపు ఒంటరితనపు బాధ. కొత్తలో రాత్రిళ్ళు బాగా ఏడుపొచ్చేది. ఏడవటానికి బాత్రూమ్ సాయపడేది. ఈమధ్య ఏడుపైతే రావట్లేదు. కానీ బాధ మాత్రం ఎక్కువవుతూ పోతోంది. చూపు కాస్త పక్కకు తిప్పి గడియారం వంక చూసాడు. ముళ్ళన్నీ ఏడు దగ్గరే ఆగిపోయి, ఇప్పుడు నడవకపోతే ఫీల్‌ అవుతారో ఏమోనన్నట్టు మొహమాటానికి ముక్కుతా ములుగుతా అక్కడక్కడే ముందుకు వెనక్కు తిరుగుతున్నాయి. తేది పన్నెండు, పదమూడుకి మధ్యగా చూపిస్తోంది. వారంలో ఏరోజనేది కనిపించడమే మాయమైంది. పెండ్యులమైతే చచ్చిన శవంలా పడి ఉంది. దాన్నలా చూసేసరికి భార్గవ్‌కు చిర్రెత్తుకొచ్చింది ఎప్పటిలాగే. దగ్గరికెళ్ళి ముళ్ళను సరిచేసి పెండ్యులమ్‌ను ఊపాడు. ఎప్పటిలాగే బాగైంది. టిక్‌ టిక్‌ మంటూ ఆరోగ్యంగా నడిచింది. కాస్త మనసు తేలికైనట్టు అనిపించింది.

ఐదేళ్ళ కిందట కొన్న బిగ్‌సైజ్‌ టైటాన్‌ పెండ్యులమ్‌ క్లాక్‌ అది. రోజ్‌ గోల్డ్‌ కలర్‌. చాలా ఖరీదైనది. కానీ స్మగుల్డ్ ఐటం. తక్కువలో కొన్నాడు. ఆ గడియారం అంటే అతనికి పిచ్చి. కొత్తలో బాగానే పనిచేసేది. అప్పుడు అమ్మానాన్నలు బానే ఉండేవారు. అమ్మ దూరమైన తర్వాత నాన్న కూడా దూరమయ్యే క్రమంలో అది కొద్దికొద్దిగా పాడవటం ప్రారంభమైంది. ఇటువైపు భార్గవ్ ఆరోగ్యం కూడా. గత కొద్ది నెలలుగానైతే ఇంకా ‌వీక్‌ అయిపోయాడు. ఏదో తెలియని అస్వస్థత. ఏదీ మనసున పట్టదు. ఓ దగ్గర ఎక్కువసేపు ఉండలేడు. ఎవరినీ భరించలేడు. ఒక్కోసారి ఊపిరి ఆడదు. విపరీతమైన తలనొప్పి. తనకెందుకిలా జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. గడియారం మొరాయించిన కొత్తలో బ్యాటరీ పాడైందేమో అనుకున్నాడు. ఎన్ని బ్యాటరీలు వేసినా తరచూ ఆగిపోయేదది. రిపేర్‌ ఉందేమోనని వెళ్తే అంతా ఓకే, ఏం లేదన్నాడు సర్విస్‌ సెంటర్‌ వాడు. అయితే ఆగిపోయినా ప్రతీసారి ఎవరైనా వెళ్ళి ముళ్ళని సెట్‌ చేసి, పెండ్యులమ్‌ను కదిపితే మళ్ళీ బాగయ్యేది. ఒకరెప్పుడూ దాని పక్కనే ఉండాలన్నమాట. ‘ఏదో మాయరోగం వచ్చింది దానికి’ అంటుంది గౌతమి. అలా అన్న ప్రతీసారి గుడ్లు మిటకరించి కోపంగా ఓ చూపు చూస్తాడు. తనకోసం ఏ పనీ చేయకున్నా పర్లేదు, గడియారం ఆగిపోవడం గమనిస్తూ దాన్ని ఎప్పటికప్పుడూ సరిచేస్తే చాలన్నట్టు ఉంటాడు. ‘మాయల పకీర్‌ ప్రాణాలు చిలుకలో ఉన్నట్టు, మీకు ఆ గడియారానికి ఏదైనా సంబంధముందా?’ అని వెటకారంగా అంటుంది గౌతమి.

రాత్రి డిన్నర్‌ చేయనందుకో ఏమో కాస్త కళ్ళు తిరుగుతున్నట్టనిపించి కిచెన్‌వైపుకు అడుగులేశాడు భార్గవ్‌. కుక్కర్‌లో రైస్‌ పెట్టాడు. ఎనిమిదిన్నరకల్లా తను ఆఫీసుకు బయలుదేరాలి. ఇప్పటికే లేటైంది. కర్రీ చేసే అంత టైము, ఇంట్రెస్టు ఇప్పుడు లేవు కాబట్టి, ఆ ఇన్‌స్టాగ్రాంలో కొన్న సులేఖ్య పచ్చడ్లే దిక్కనుకున్నాడు. కర్రీ సంగతి పక్కన పెడితే అసలీ పెళ్ళి, పిల్లలూ మొత్తానికి సంసారమనే కాన్సెప్ట్ పైనే తనకు ఇంట్రస్ట్‌ లేదు. అమ్మ పోయిన తర్వాత ఇంటికో ఆడదిక్కుండాలని చుట్టాలెవరో బలవంతపెడితే వెనకాముందు చూడకుండా పెళ్ళికి ఒప్పుకున్నాడు. అమ్మని విడిచిపెట్టీ ఉండలేకపోయిన నాన్న కూడా.. రెండేళ్ళకే ఆమె దగ్గరికెళ్ళిపోయాడు. వాళ్లిద్దరూ అలా దూరమవ్వడం భార్గవ్‌ను మానసికంగా చాలా కృంగదీసింది. చిన్నప్పటి నుండి అమ్మానాన్నలే లోకంగా పెరగడం, వారితో తప్ప ఎవరితోనూ అంత మూవ్ అవ్వకపోవడంతో వాళ్ళ లోటు అతన్ని పెద్ద దెబ్బే తీసింది. భార్యతో ఉన్నప్పటికీ అంత మింగిల్ అవ్వలేకపోయాడు. ఒకే ఇంట్లో, ఒకే రూంలో, ఒకే బెడ్‌పై.. చాలాసార్లు ఒకరిపైన ఇంకొకరున్నా ఎందుకో ఒంటరిగానే బతికారిద్దరూ.

గొడవపడ్తేనైనా బుజ్జగించి ఏదోవిధంగా దగ్గరికి తీసుకుంటాడనుకుంటుంది గౌతమి. కానీ ఆ గులుగుడు నచ్చకనో ఏమో ఇంకాస్త దూరమే వెళ్తున్నాడతను. అది ఆమెకు మరింత కోపం తెస్తోంది. వాళ్ళిద్దరి మధ్య కొన్నేళ్ళ నుంచి సాగుతున్నదిదే.

                                                          *

ఉప్మాలాగ ఉడికిన అన్నంలో రెండు మామిడి పిక్కలేసుకుని మూడు ముద్దలు మింగి బయటపడి బస్టాప్‌కేసి నడిచాడు. స్కూల్‌కి వెళ్తున్న పక్కింటి పిల్లల్ని చూసి వాళ్ళనక్కడే ఆపీ ‘ఇంకోసారి గట్టిగా గోలపెడుతూ నైబర్స్ ను డిస్టర్బ్‌ చేస్తారా?’ అంటూ లాగిపెట్టీ ముడ్డిమీద ఒక్కటిద్దామనుకుని ఆగిపోయాడు.

“ఈరోజు మళ్ళీ మ్యాథ్స్‌ ఎగ్జామ్‌ రా. దిజ్‌ ఇస్‌ ది సెకండ్ టైమ్‌ ఇన్‌ దిజ్‌ వీక్‌. శ్రేయ టీచర్‌కి కరోనా వచ్చీ చచ్చిపోతే బాగుండు. దెన్‌ వీ వొంట్‌ హ్యావ్‌ మ్యాథ్స్‌ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ ఎనీమోర్‌” అని ఆ పిల్లలు మాట్లాడుకుంటున్న తీరు చూసి నవ్వుకున్నాడు. వాళ్ళవి బాధలే కదా అనుకున్నాడు.

మంచి ఉద్యోగం లేదని, బాగా సంపాదించట్లేదని రోజూ రాత్రి ఏదో విధంగా గొడవ పెట్టి అసలింటికి రావాలంటేనే చిరాకొచ్చేలా చేసే భార్య. చుట్టం చూపుకని నెలకు రెండు మూడు సార్లొచ్చి.. “అయినా టాలెంట్‌ ఉంటే ఈపాటికి ఏదో ఒక ప్రమోషన్ వచ్చేది. అది లేకే కదా. ఇంకా అదే తక్కువ జీతం, కష్టపడి పేరు తెచ్చుకొని బాగా సంపాదించాలనే ఉద్దేశ్యమే లేదు మీ ఆయనకి” అని కూసే అత్త. ఎప్పుడైనా తప్పనిసరై ఫ్యామిలీ ఫంక్షన్‌లకెళ్తే.. “పెళ్ళై ఇన్నేళ్ళవుతున్నా కిడ్స్‌ కోసం ప్లాన్స్‌ ఏం లేవా? ఎంత సంపాదిస్తున్నావిప్పుడు? ఓఆర్‌ఆర్‌కు దగ్గర్లో నా ఫ్రెండ్‌ది వెంచరొకటి స్టార్ట్‌ అయింది. పుట్టబోయే పిల్లల మీద ఓ ప్లాట్‌ తీసి పెట్టరాదు. ఇప్పటినుంచే ఉండాలయ్యా ప్లానింగ్‌లు” అంటూ ఎదురయ్యే బంధువుల సైటైర్ల వల్ల భార్గవ్ కు అసలు మనుషులతో కలవలడమంటేనే చిరాకొచ్చేది. రోజురోజుకూ తన బతుకు మీద తనకే విరక్తి లేస్తోంది.

మొన్నొకరోజు స్కూల్‌ ఫ్రెండ్‌గాడొకడు కలిసాడు. తాత ముత్తాతల స్థిరాస్థితో సక్సెస్ అయిన బిజినెస్‌మ్యాన్‌ వాడు. వాడన్న మాటొకటి గుర్తొచ్చింది భార్గవ్‌కు.

“కష్టాలన్నీ తీరాలంటే లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలిరా. అప్పుడే మన చూట్టూ ఉన్న సర్కిల్‌లో రెస్పెక్ట్‌ దొరుకుతుంది” అనేదతని ఉచిత సలహా.

‘అయినా వీళ్ళందరి దృష్టిలో సెటిల్ అంటే ఏంటి? ఎంత డబ్బు సంపాదిస్తే సెటిల్? అసలు ఎవరైనా సెటిల్ అయి ఏం చేస్తారు? పని చేయటం మానేస్తారా? లేక డబ్బు సంపాదించడం అపేస్తారా?’ అనేది తనకెప్పటికీ అర్థం కాదనుకుంటాడు భార్గవ్.

                                                        *

బస్ వస్తే ఎక్కాడు. ఆఫీస్‌ వైపెళ్ళే రూట్‌లో డైరెక్ట్‌ మెట్రో రూట్‌ లేకపోవడంతో బస్ ఒక్కటే దిక్కవుతుంది భార్గవ్‌కు. ఈరోజు లక్కీగా విండో సీట్‌ దొరికింది. అది దొరికినప్పుడల్లా కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. పక్కనున్న వాళ్ళ గోల పట్టించుకునే అవసరముండదు కాబట్టి. కిటికీలోంచి ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద చాలా పెద్ద హోర్డింగొకటి కనిపిస్తూ ఉంది. ఏదో ఛానెల్‌లో బిగ్గర్ బాస్ అనే ప్రోగ్రామోదో స్టార్ట్ అవుతోందట. వంద రోజులు ఆడా మగ తేడా లేకుండా ఇరవై మందిని ఒకే ఇంట్లో పడేసి ఆటలాడిస్తారట. సెల్‌ఫోన్లు లేకుండా. నలభై ఎనిమిది సీసీ కెమెరాలతో 24/7 అంతా రికార్డ్‌ చేసి టీవీల్లో వేస్తారంటా. ఆటలాడుతూ, తిండి సంపాదించుకుంటూ అది అరిగించుకోవడం కోసం గొడవలు పడతారంటా… వీళ్ళ బొంద ఆట. ఇదేం ఆట. కర్మ కాకపోతే? అన్ని రోజులు ఒకే దగ్గర ఇంతమంది ఎలా కలిసుంటారు. హౌ ఇస్‌ దిస్‌ పాజిబుల్‌? బాబోయ్ నావల్లైతే కాదు. అసలు మనిషన్నోడి వాడి వల్లే కాదు. ఏమో ఆ ఉండేవాళ్ళ గురించి నాకస్సలు అర్థం కాదు. అయినా ఎవరెటు పోతే, ఎవరేం చేస్తే తనకేంటనుకున్నాడు.

బస్‌లో ముందు నుంచి ఒకటే గోల. ఫిష్‌ మార్కెట్‌లాగా. మళ్ళీ చిరాకొచ్చింది భార్గవ్‌కు.

అసలీమధ్య బస్సులో వెళ్ళడమనేదొక అడ్వెంచర్‌ అయింది. ప్రతీ బస్సులో రాజమౌళి సినిమా రిలీజైన ఫస్ట్ డే థియేటర్ ముందు కనిపించేంత జనం. కూర్చోడానికి చోటు దొరకడం పక్కనెడితే, ఎలాగోలా లోపలికి చొచ్చుకుని, స్టీల్‌ గొలుసుని పట్టుకుని వేళ్ళాడటం కూడా సాహసమనిపిస్తుంది. ఏదైతేనేం నాకైతే సీట్‌ దొరికింది చాలు అనుకున్నాడు భార్గవ్.

కూర్చున్న కాసేపటికే ఓ ఆడగుంపు దిగిపోయి బస్ అంత కాస్త ఫ్రీగా గాలాడుతోంది. హమ్మయ్య అనుకుంటున్నాడో లేదో బస్సు ముందు స్టాప్‌లో ఆగి, బయటినుంచి మరొక ఆడ గుంపు లోపలికి అలలా వచ్చిపడింది. ‘అయినా ఒకటేంటి ఇప్పటిదాక బస్సు మొత్తం వాళ్ళేగా, ఈ ఫ్రీ స్కీమ్‌ పెట్టాక మగవాళ్ళు బస్స్‌ ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు. ఆ ఆడవాళ్ళంతా బాగా తయారై ఉన్నారు. మంచి పట్టుచీరలు, రంగు రంగుల హ్యాండ్‌ బ్యాగులతో. వీళ్లంతా కలిసి ఎటు వెళ్తున్నారు? వీళ్ల భర్తలు, పిల్లలకు తినడానికసలేమైనా వండిపెట్టి వచ్చారా? ఏమో ఎటో పిక్‌నిక్‌ వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు’ అని అనుకున్నాడు. 

ముందునుంచి వినపడ్డ మాటల ద్వారా రత్నగిరి టెంపుల్‌కని తెలిసింది. ఈమధ్యే కట్టి దేవుడ్ని తీసుకొచ్చి పెట్టారంట. ఏయే లొకేషన్లలో ఎటువంటి ఫొటోలు దిగాలో కూడా మాట్లాడుకోవడం వినిపించిందతనికి. ‘వీళ్ళు వెళ్ళే విధానం చూస్తోంటే టెంపుల్‌ కెళ్తున్నట్టు లేదు, ఏదో టూరిస్ట్‌ ప్లేస్‌ కెళ్తున్నట్టుంది. మొన్నటిదాక దేవుళ్ళని మొక్కడానికి వెళ్ళేవాళ్ళు, ఈ బస్సులు ఫ్రీ అయినదగ్గర్నుంచి ఫొటోలు, టైం పాస్‌ కోసం పోతున్నట్టనిపిస్తోంది. ఎటూ వెళ్ళకుండా, వాట్సాప్‌లో ఏ ఫొటోలు స్టేటస్ గా పెట్టుకోకపోవడాన్ని కూడా కొందరు అవమానంగా భావిస్తున్నారీమధ్య. పోనీలే. వీళ్ళకు ఈ రూపంలోనైన కాస్త ఫ్రీడమ్‌ దొరికింది’ అనుకున్నాడు. అందులో కొంతమంది వంటింటి కుందేళ్ళు అనే ట్యాగ్‌ను ఈమధ్యే వదిలించుకుంటునట్టు కనిపించారతానికి.

ముందు స్టాప్‌లో మరొక బస్‌కోసం ఈ గుంపంతా దిగిపోతున్నారు. వాళ్ళందరిని తోసుకుంటూ వాళ్ళు దిగకముందే ఒకమ్మాయి వేగంగా వాళ్ళని నెట్టుకుంటూ బస్‌లోకి ఎంటర్‌ అవుతోంది. ఆ క్రమంలో తనొక సైడ్‌ ఇరుక్కుపోయినట్లై.. కొన్ని సెకన్లపాటు అలాగే నలుగుతూ ఎలాగోలా బయటపడి నేరుగా వచ్చి అతని పక్కనే కూలబడింది. 

ఈ గుంపుగా కాకుండా ఒంటరిగా రావడంతో.. టైం పాస్‌గా కాకుండా ఏదో కచ్చితమైన పనే ఉండి వెళ్తోందని జడ్జ్ చేసాడు. ఆమెను మరోసారి చూసీ చూడనట్టుగా చూసాడు. తను కాస్త ఛామనచాయ కావచ్చు. వయసెంతో గానీ యువతిలాగే ఉంది. జీరోసైజ్‌కు దగ్గర్లో ఉంది. పఫ్ వేసి జుట్టంతా వెనక్కి లాగి ఉంది. చెవులకు చిన్న స్టడ్స్‌. మెడలో సన్నని సిల్వర్‌ చెయిన్‌. తెలుపు, నలుపు మిక్స్‌ చేసిన ఇక్కత్‌ డ్రెస్‌. ముఖంలో మంచి కళ. జడలో ఏ పూలున్నాయో గానీ దవనం ఉందన్న పరిమళం ముక్కును తాకుతోంది. బొట్టైతే లేదు. క్రైస్తవులో, ముస్లీంలో గుర్తించడం కష్టమైంది.

కాసేపటికి ఉన్నట్టుండి ఆమె తల భార్గవ్ భుజానికి తగులుతూ లేస్తూ ఉంది. ఏంటీ ఈమెకు అప్పుడే నిద్రొస్తుందా.. నాపై పడుతూ లేస్తూ ఉందని అనుకున్నాడు.

‘అయినా ఈ పడుకోగానే నిద్రొచ్చే వాళ్ళు ఎంత లక్కీ పర్సన్స్! అసలు పడుకొనేటప్పుడు ఆలోచించి డిస్టర్బ్ అవ్వడానికి బాధలేం ఉండవా కొంతమందికి..?’

టైం చూసుకున్నాడు. ఎటు కాదన్నా కనీసం ముప్పై నిమిషాల పైనే పడుతుంది ఈ ట్రాఫిక్ ను దాటి ఆఫీసు చేరుకోవడానికి. ఇంకో అర్ధగంట భరించాలి తనను. ‘జరిగి, సరిగా కూర్చోండి’ అని చెప్పలేనంత ఇంట్రోవర్ట్.

తనకు కూడా ఇలా త్వరగా నిద్రొస్తే బాగుండనుకున్నాడు. మంచిగా నిద్రపోయి చాలా రోజులైందనిపించింది. ప్రపంచమంతా హాయిగా నిద్రపోతుండగా తను మాత్రం మేల్కొని ఉండటం, అప్పుడప్పుడు మాత్రమే కోడినిద్ర పోవడం ఎంత బాధ అనుకున్నాడు.

నిద్ర రాక ఒక్కోసారి ఆలోచనలెక్కువవుతాయి. కాసేపటికే తల రివ్వున తిరిగిపోద్ది. నరాలన్ని కదిలిస్తూ మెదడు దిమ్మెక్కిపోద్ది. నిన్న రాత్రి కూడా నిద్ర సరిగ్గా లేనందువల్లనో లేక ఆలోచనల అలసట వల్లనో మళ్ళీ కళ్ళు తిరిగినట్లనిపించింది. కళ్ళు అలా మూసుకున్నాడో లేదో పక్కన కూర్చున్నామె ఒక్కసారిగా అతని ఒళ్ళో కుప్పకూలిపోయింది.

‘ఆ… ’ అంటూ అరిచాడు. ఆమెను కదిపి లేపడానికి ప్రయత్నించినా.. ఫలితం లేదు. కండక్టర్‌, తోటి ప్రయాణికులంతా వచ్చి లేపడానికి ప్రయత్నించారు. అయినా తను లేవలేదు. బస్‌ పక్కకు ఆపి ‘వన్‌ నాట్‌ ఎయిట్‌’కు కాల్‌ చేశారు. అంబులెన్స్‌ వచ్చింది. చేతి నాడినీ, శ్వాసనూ చూశారు. ‘షీ ఇజ్‌ నో మోర్‌’ అన్నారు. సడెన్ హార్ట్ ఎటాక్ కావొచ్చు అన్నారు. భార్గవ్ తో సహా అక్కడున్నవాళ్ళందరికీ ఏం జరిగిందో అర్థం కాలేదు. సరాసరి దగ్గర్లోని పోలిస్‌ స్టేషన్‌కు తీసుకెళ్ళారు. ఆ ఉద్రిక్త వాతావరణం నుండి బయటపడి తనకెందుకీ తలనొప్పి అనుకుంటూ అక్కడినుండి వేగంగా నడచి ఆఫీస్‌కి చేరుకున్నాడు.

రాగానే అందరూ ఇన్ ఛార్జ్ కు గుడ్ మార్నింగ్ అని విష్ చేయడం సాధారణంగా ఎక్కడైనా జరిగే తంతే. భార్గవ్‌కు అలా చెప్పడం ఇష్టం ఉండదు. ‘అసలీ గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళ మార్నింగులు అంత గుడ్‌గా ఉంటాయా..? లేక వీళ్ళు చెప్పినంత మాత్రాన ఆ వినే వాళ్ళ మార్నింగ్‌లు గుడ్‌గా మారిపోతాయా? గాడిద గుడ్డు కాకపోతే ఎందుకీ పై పై మాటలు’ అనుకుంటాడు.

అప్పటికే గంటన్నర లేటైంది. ఇన్‌ఛార్జ్‌ డెస్క్ దగ్గరికొచ్చి క్వశ్చన్ చేశాడు. జరిగిందంతా చెప్పినా అతను వినలేదు. కాసేపు ఇంగ్లీష్‌లో తిట్లు. భార్గవ్‌ ఎప్పటిలాగే నిశ్శబ్దంగా ఉన్నాడు. ‘ఈసారి లే ఆఫ్‌లో వీడు ఫసక్‌’ అని కొలీగ్స్‌ గుసగుసగా అనుకున్నారు. లేటొచ్చాడనే కోపంతో ఇన్‌ఛార్జ్‌ కాస్త ఎక్కువ పనే ఇచ్చాడు. కానీ మనసు మాత్రం పని మీద నిలవలేదు. లంచ్‌ అయిన కాసేపటికే సిస్టమ్‌ లాగౌట్ చేసి కాఫీకి అంటూ లేచి మూడు గంటలకే ఆఫీసునుంచి బయటపడ్డాడు. తెలుగు తల్లీ ఫ్లై ఓవర్ దాటి ట్యాంక్ బండ్ కేసి నడిచాడు.

‘మళ్ళీ మళ్ళీ ఆ బస్ లోని అమ్మాయి గుర్తొస్తూనే ఉంది. అయినా ఈ హార్ట్ ఎటాక్‌లు ఎలా వస్తాయి. తను చాలా సైలెంట్‌గా కూర్చొని ఉంది. గతంలో తనకేమైనా బాధలుండొచ్చా? ఆ రీజన్‌తో తనేమైనా డిస్టర్బై ఇలా జరిగుంటుందా? దీనికి అసలు కారణమేమై ఉంటుంది? అయినా ఈ హార్ట్‌ ఎటాక్‌లకు వేళ పాళా అంటూ ఏం ఉండదా? బస్సులోకొచ్చి నా పక్కనే కూర్చొని, నా ఒళ్ళో పడి చనిపోవడమేంటి? దేవుడనే వాడే ఉంటే ఇట్స్‌ హిజ్‌ వరెస్ట్‌ ప్లాన్‌’ అని తిట్టుకున్నాడు.

వేగంగా నడుస్తున్నాడు. అలసిపోయి ఆగిపోతున్నాడు. మళ్ళీ వేగంగా. అలా బాగా అలసిపోయాడు. ఒళ్ళంతా చెమటలు. ఏదో గుర్తొచ్చి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎడమ భుజం నుంచి నెమ్మదిగా నొప్పి కూడా మొదలవుతున్నట్టు అనిపించింది. తనకు కూడా హార్ట్ ఎటాక్ వస్తుందేమోనని భయమేసింది. ప్యాంట్ జేబులోనున్న ఫోన్‌ తీసి టైం చూశాడు. నాలుగున్నరైంది. ఇంత త్వరగా ఇంటికెళ్ళాలనిపించలేదు. నెక్లెస్ రోడ్ వైపు నుంచి మళ్ళీ తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు నడిచాడు. మంచి వర్షాకాలమైనా ఎండ దంచి కొడుతోంది. ఆకాశానికేసి చూశాడు. ప్రపంచమంతా వంకర టింకరగానే నడుస్తోందేమో అనుకున్నాడు. హుస్సేన్‌సాగర్‌లో ఒడ్డుకి వచ్చి కొట్టుకుంటున్న అలలను చూశాడు. అవి అలాగే వచ్చి తన మనసులోని బరువుని కూడా కడిగేస్తే బాగుండనిపించింది. జరిగిందంతా మళ్ళీ ఓసారి గుర్తు చేసుకున్నాడు. పిచ్చెక్కేటట్లైంది. ఓ బెంచ్‌పై కూర్చున్నాడు. ఇన్‌స్టా రీల్స్‌ ఓపెన్‌ చేసి త్రీ జీబీ డేటా అయిపోయే వరకూ రెండు గంటలు స్క్రోల్‌ చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ లేచీ ఫుట్‌పాత్‌ మీదనుంచి బస్టాప్‌కేసి నడుస్తున్నాడు. మళ్ళీ ఆమె గుర్తొచ్చింది. ఒంట్లో వణుకు స్టార్ట్‌ అయింది. ఒక్కసారిగా పక్కనుంచి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకొకటి జెట్‌స్పీడ్‌లో డబుల్‌ సైలెన్సర్‌తో భారీ సౌండ్స్‌ చేస్తూ వెళ్ళింది. ఆ సౌండ్‌కు భార్గవ్‌కు గుండె ఆగినంత పనైంది.

‘అసల్లెవర్రా మీరంతా, ఇలా తయారవుతున్నారెంట్రా? రోడ్డుపై వెళ్ళేవాళ్ళని బెదిరించడమే పనిగా పెట్టుకుంటారా మీరు? అయినా ఇంతింత సౌండ్‌ పొల్యూషన్‌ చేసే బైక్‌లకు ఎందుకు అనుమతి ఇస్తోందీ గవర్నమెంట్‌’ అంటూ తిట్టుకున్నాడు. కాసేపలా నడిచి బస్‌ ఎక్కి ఇంటికి చేరుకున్నాడు.

వచ్చీరాగానే ఫ్రెషప్పై హాల్లోకొచ్చీ సోఫాలో పడుకుని నిద్రలోకి జారుకున్నాడు. డిన్నర్‌ టైంకి లేపడానికెళ్ళిన గౌతమి గొంతు విని ఉలిక్కిపడి లేచాడు. తనను చూసీ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు.

“ఏమైందండి?”

“ఈరోజు బస్‌లో.. బస్‌లో ఒకామె నా ఒళ్ళో పడి చనిపోయింది.”

“ఏంటీ..?”

జరిగిందతా చెప్పాడు. ‘అసలెవరై ఉంటుందామ్మాయి? వాళ్ళ అమ్మానాన్నలెక్కడుంటారు? వాళ్ళు బతికే ఉన్నారా? ఉంటే వాళ్ళకీ న్యూస్‌ చేరి ఉంటుందా?’ అని శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్తూ అన్నాడు.

గౌతమి.. రోజూ ఉండే గోలే కదా అనుకుని టీవీలో వినే వార్తేదో విన్నట్టు విని “ఔనా, ఏదో పోనీలెండి. ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. నేనొచ్చీ మీ ఇంట్లో పడలేదా. నాలాంటి ఉండీ లేని బతుకు బతికేకన్నా.. అలా పోయిందే బాగుంది. సరే డైనింగ్‌ టేబుల్‌పైన చపాతీలున్నాయి” అని అసందర్భంగా మాట్లాడి బెడ్‌రూంలోకి జారుకుంది.

భార్గవ్‌ అక్కడే మళ్ళీ సోఫాలోనే పడుకుండిపోయాడు. లేచి వెళ్ళి తినేంత ఓపిక లేదు. నిద్ర వస్తున్నట్టే వచ్చీ.. పోతోంది. బస్‌లోకి ఎంటరైన దగ్గర్నుండి ఆమె తన ఒళ్ళో పడి కన్నుమూసే వరకు జరిగిందంతా అతనికి లూప్‌లో మళ్ళీ మళ్ళీ కళ్ళెదుటే కనిపిస్తూ మనసును ముక్కలు ముక్కలు చేసింది. కళ్ళు మూసుకున్న కాసేపటికే ఎవరో తన ముఖంపై దిండు పెట్టి ఊపిరాడనివ్వకుండా చేసినట్టుగా అనిపించి శ్వాస ఆడలేదు. లేచి బయటికొచ్చీ కొద్దిసేపలా తిరిగి మళ్ళీ సోఫాలొకొచ్చీ పడుకున్నాడు. నిద్రరాక చాలా అవస్థపడ్డాడు. మళ్ళీ ఎడమ భుజం వైపు నుంచి నడుము దాకా భయంకరమైన నొప్పి. ముఖ్యంగా గుండె దగ్గర. ఊపిరి అందనట్లుగా లోపలంతా ఏదో పట్టేసినట్లనిపించింది. కనీసం తన పక్కన ఎవరైనా ఉండీ వారి చేయి తగిలి కాస్త స్పర్షగా అనిపిస్తే బాగుండు అనిపించింది. రాత్రంతా ముందుకు వెనకకు దొర్లుతూనే ఉన్నాడు. తెల్లవారుజామున ఏ ఐదు గంటలకో నిద్రపట్టింది. గురకపెట్టి నిద్రపోయాడు.

గౌతమి నిద్రలేచేసరికి “అమ్మా.. అమ్మా..” అంటూ మూలుగుతున్నాడు. దగ్గరికెళ్ళి తన నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది. నిప్పులా కాలిపోయింది.

“ఒళ్ళంతా కాలిపోతోంది, ఏమైంది?” అంటూ నిద్ర లేపింది తను. మళ్ళీ ఉలిక్కిపడి లేచాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ‘అమ్మా.. అమ్మా..’ అంటూ మళ్ళీ అటీటూ బొర్లాడు.

గౌతమి పరుగున వెళ్ళి తెలిసిన డాక్టర్‌కి ఫోన్ చేసింది.

ఎప్పటిలాగే పక్కింట్లోని పిల్లల అల్లరి, దానికి తోడు వెనక గల్లిలోనుంచి వస్తోన్న దేవుడి డీజే పాటలు చెవులకు గట్టిగా వినబడుతోన్నా.. వాటికి విరుద్ధంగా ఏదో భయంకరమైన నిశ్శబ్దం తన చుట్టూ ఆవరించుకున్నట్లు కాసేపు, అంతకుముందురోజు సాయంత్రం తనని భయపెట్టిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ సైలెన్సర్‌ సౌండ్‌ మరికాసేపు చెవుల్లో ధ్వనిస్తూ తలంతా రివ్వున తిరిగిపోతున్నట్లు అనిపించింది భార్గవ్‌కు.

డాక్టర్ వచ్చే టైంకి కాస్త కుదురుకున్నట్టనిపించింది. అయినప్పటికీ ఆయన పూర్తిగా చెకప్ చేసి, “ఏమీ లేదు. ఓన్లీ ఫీవర్‌. బట్‌ వన్‌ నాట్‌ టూ. కాస్త ఎక్కువే” అంటూ ఇంజక్షనేసీ, కొన్ని మందులు కూడా ఇచ్చి రెస్ట్‌ తీసుకొమ్మని చెప్పి వెళ్ళిపోయాడు.

“టైమెంతయ్యింది?” అడిగాడు భార్గవ్.

ఫోన్‌ చూసి “టెన్ థర్టీ సిక్స్‌” అందావిడ.

గడియారంకేసి చూశాడు. రాత్రి మూడుకే ఆగిపోయి ఉందది. చేతిలో ఉన్న సగం పాల గ్లాసును పక్కనెట్టి ఆ గడియారాన్ని కాస్త సరిచేయచ్చుగా అన్నాడు నొప్పిని భరిస్తున్న గొంతుతో.

“సరే, ముందైతే ఆ పాలు తాగండి. నిన్న సాయంత్రం నుంచి ఏమీ తినలేదు” అని బలవంతం చేసినట్టు అడిగిందామె.

“చెప్పింది చేస్తావా లేక నన్ను లేచి సరిచేయమంటావా?” గట్టిగా అరిచాడు.

గౌతమి ఫోన్‌లో రీల్స్ చూడటం పక్కనెట్టి గడియారం దగ్గరకి పరిగెత్తినట్లుగా వెళ్ళింది. కుర్చీ లాగీ, దాని మీదెక్కి గడియారం సగభాగంలో ఉన్న గ్లాస్‌ డోర్‌ను ఓపెన్‌ చేసింది. చలనం లేకుండా ఉన్న పెండ్యులాన్ని చేత్తో ఊపింది. అలాగే ఒకే దగ్గర ఆగిపోయిన ముళ్ళను కూడా మెల్లగా కదిపి సరైన టైమ్ చూపేలా సెట్ చేసింది. అప్పుడది బాగైంది. ‘టిక్.. టిక్’ మంటున్న చప్పుడు చెవులకి వినిపించగానే భార్గవ్‌కు మళ్ళీ శ్వాస నార్మల్‌గా ఆడినట్లుగా మనసుకు ప్రశాంతంగా అనిపించింది.

“టిఫిన్ తింటారా? ఏం చేయమంటారు?” ఓపిక లేనట్టు అడిగింది తను.

“నువ్వు ముందు నోర్మూసుకుని ఇక్కడినుంచి వెళ్ళు” బాధను కూడా ఏకాంతంగా అనుభవించనీయకుండా ఇబ్బంది పెడుతున్నట్టనిపించి కసిరించాడామెను.

పాలు తాగి మందులు వేసుకుని, పక్కనే ఉన్న స్టీల్‌ వాటర్‌ బాటిల్‌నుంచి కొన్ని నీళ్ళు తాగి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు.

కాసేపటికి కళ్ళు తెరిచి ఏదో గుర్తొచ్చినట్లుగా మళ్ళీ అమ్మానాన్నల ఫొటోలవైపు చూసాడు. ఆ వెంటనే గడియారం వైపూ. బానే పని చేస్తోంది. మళ్ళీ మరోవైపుకు తిరిగి పడుకున్నాడు.

ఓ గంట గడిచిందో లేదో మరోసారి ఉలిక్కిపడి లేచాడు. ఒళ్ళంతా చెమటలు పట్టడం చూసుకుని జ్వరం దిగిపోతోందేమోననుకున్నాడు. మళ్ళీ గడియారం వైపేసి చూశాడు. అదెప్పుడో పన్నెండు ఇరవై ఐదు నిమిషాల దగ్గరే ఆగియిపోయినట్లు కనబడింది. సర్రుమని కోపం వచ్చింది. ఎవరో నెత్తి మీద ఐరన్‌ రాడ్డు తీసుకొని బలంగా కొట్టినట్టనిపించింది. గౌతమిని పిలవడానికి ప్రయత్నించాడు. నోరు కదపలేకపోయాడు. ఒక చేత్తో తల పైభాగాన్ని గట్టిగా అదిమిపట్టి మళ్ళీ ప్రయత్నించి గట్టిగా ‘గౌతమి’ అని అరిచాడు.

బెడ్ రూమ్ నుంచి హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది తను.

“ఆ గడియారాన్ని ఎందుకు సరిచేయలేదు?” కోపాన్ని ఆపుకుంటూ అన్నాడు.

“మెంటలా నీకేమైనా? ఏమైందో అనుకుని భయపడి చచ్చాను. ఇప్పుడది పనిచేయకపోతే ఏమైందట. ఈ ఇంట్లో అదొక్కటే అలా ఉందా. ఎప్పుడూ దాని వెంట పడ్తారెందుకు? అయినా ఎన్నిసార్లని సరిచేయను? ఐదు నిమిషాలు కూడా సరిగ్గా పని చేయదది. ఈ పనికిరానివన్నీ నాకే అంటకున్నాయెంటో.. అయినా ఈ డొక్కు క్లాక్‌ను ఊపుతూ కూర్చోవడానికే చేసుకున్నారా నన్ను?”

ఆ క్లాక్ మీద వంకతో తననే తిడుతున్నట్టనిపించింది గౌతమ్‌కు.

“చెప్పిన పని చేయవా? అసలే ఇంట్లో ఒక మనిషి బాగా లేకుండా ఉంటే అపశకునంలా మళ్ళీ ఇలా క్లాక్‌ డెడ్‌ అయిపోతే ఎలా? ఇంట్లో ఉండి మూడు పూటల తినడం తప్ప.. బెడ్రూంలో అంత బిజీగా ఏం పొడుస్తున్నావ్‌?”

గౌతమికి కోపమొచ్చింది. పక్కనే ఉన్న స్టీల్‌ వాటర్‌ బాటిల్‌ తీసుకుని ఆ గడియారానికేసి బలంగా కొట్టింది. దాని ముందు భాగంలో ఉన్న గ్లాస్‌  పగిలి మొత్తం అంతా కిందపడి ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురైంది.

ఒక్క ఉదుటున సోఫాలోనుంచి లేచిన భార్గవ్.. గౌతమి దగ్గరికెళ్ళి ఆమె చెంప చెళ్ళుమనిపించాడు. నా ఇంట్లో ఒక్క నిమిషం ఉన్నా కూడా నా చేతిలో నీకు చావే. వెళ్ళిపో ఇక్కడినుంచి అని గట్టిగా అరిచాడు.

గౌతమి మారు మాట్లాడకుండా ఏడుపును ఆపుకుంటూ కోపంగా లేచి బెడ్‌రూంలోకెళ్ళి డోర్‌ లాక్‌ చేసుకుంది. ఆ గడియారన్ని అలా చూసీ భార్గవ్‌కు ఏం తోచలేదు. తలంతా నొప్పి, గోడకేసి గుద్దుకున్నాడు. గుక్కపెట్టి ఏడ్చాడు. అమ్మ గుర్తొచ్చింది. తర్వాత నాన్న. వెంటనే వారిద్దరీ చావులు. వాళ్ళు తన నుండి దూరమయ్యేటప్పుడు క్రమక్రమంగా గడియారం పాడయ్యే సంఘటనలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఏవేవో పిచ్చి ఆలోచనలు. ఒకదాని తర్వాత ఒకటొస్తూ ఒక చోట ఆగడం లేదు. ఎక్కడెక్కడికో పరుగెత్తి, అక్కడ మాయమై, మళ్ళీ మరొక చోట తేలుతూ అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితుల్లో పడేస్తున్నాయి. ఊపిరి ఆగిపోతున్నట్టనిపించింది. గడియారంతో పాటు తనకూ అది ఆఖరి రోజేమో అనిపించింది. సోఫాలోనే అటీటూ బొర్లుతూ ఏడ్చీ ఏడ్చీ చాలాసేపటి తర్వాత మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ఎంతసేపు నిద్రపోయాడో తెలియలేదు. మెలకువ రాగానే విపరీతమైన దాహమేసింది. కళ్ళంతా మసకబారినట్లు అనిపించింది. నీళ్ళకోసం వంటింట్లోకెళ్దామని లేచాడు. అక్కడ గౌతమివాళ్ళ అమ్మానాన్న ఇతని కోసమే ఎదురుచూస్తూ కూర్చున్నారు. వాళ్ళెందుకొచ్చారో ఊహిస్తుండగానే “ఇక మా అమ్మాయి నీతో ఉండదు” అని చెబుతూ విడాకుల నోటీస్‌ అందుకోవడానికి సిద్ధంగా ఉండు మిస్టర్‌ భార్గవ్‌” అని ఆ ముగ్గురు అక్కడినుండి వెళ్ళిపోయారు.

                             భార్గవ్‌కేమీ తోచలేదు. రెండు బాటిళ్ళ వాటర్ తాగి, ఆ కాసేపటికే ఆ తాగిందంతా వాంతి చేసుకుని మళ్ళొచ్చి బెడ్‌ ఎక్కాడు. నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ మెలకువ. నిద్రలో జరిగినవన్నీ లూప్‌లో మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్టనిపిస్తున్నాయి. నిద్ర పడుతోంది. ఓ గంటో రెండు గంటలో పడుకున్నట్టనిపిస్తోంది. లేచి ఫోన్‌ చూస్తే పది నిమిషాలకే మెలకువ వచ్చినట్టు తెలుస్తోంది. ఎంత తప్పించుకోవాలని చూసినా.. భయాందోళనలు కలిగిస్తోన్న ఆ జ్ఞాపకాల వరద నుంచి బయటపడలేకపోయాడు. తనవల్ల కాలేదు.

గూగుల్‌లో వెతికి దగ్గర్లోని ఓ మైండ్‌ సెంటర్‌కి వెళ్లి డాక్టర్‌కి జరిగేదంతా చెప్పాడు. వారం రోజుల ట్రీట్‌మెంట్‌ ఉంటుందని ఒప్పించి అక్కడినుంచి గోకులం మెంటల్‌ హాస్పిటల్‌కి షిఫ్ట్‌ చేశారతడిని. డాక్టర్‌ సూచన మేరకు స్టాఫ్‌.. భార్గవ్‌ను వార్డులోని బెడ్‌పై పడుకోబెట్టి క్లోనాజెపామ్‌ ఇవ్వడంతో నిద్రపట్టిందతనికి.

లేవడం, పూటకింత తినడం, ఏదో విధంగా నిద్రపట్టేలా చేసుకుని నిద్రపోవడం. మూడు రోజుల నుంచి ఇదే తంతు. ఏ మందూ లేనిదే నిద్ర సరిగా పట్టట్లేదు. మళ్ళీ మళ్ళీ అవే భయాందోళనలు. గంటలు ఎలా గడుస్తున్నాయో, రోజులు ఎలా ముగుస్తున్నాయో తెలియడం లేదు. ఫోనూ, సోషల్ మీడియాతో ఎటువంటి సంప్రదింపులు లేవు. ఒక్కోసారి వార్డులోంచి పక్కనే ఉన్న సెల్‌లోకి వెళ్ళి చూసేవాడు.

ఓ పూట ఇలాగే పూర్తిగా నగ్నంగా నడుస్తూ, నవ్వుతూ, ఏడుస్తూ, అరుస్తూ, సెల్‌లోంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ, గురక పెడుతూ నిద్రపోయే వాళ్ళ దృశ్యాలను చూసి బెంబేలెత్తిపోయాడు. తనూ వాళ్ళలాగా మారిపోతానేమోననుకుని భయపడ్డాడు. మరికాసేపటికి తనలా లేనని, అస్సలు అలా అవ్వనని సంతోషపడ్డాడు. ఎక్కువగా ఆలోచించొద్దన్న డాక్టర్‌ మాటలు గుర్తొచ్చి ముందుకెళ్ళి గార్డెన్‌లో ఉన్న బెంచ్‌పై కూర్చున్నాడు. వద్దనుకుంటూనే వెనక్కి తిరిగి మళ్ళీ సెల్‌లో ఉన్న పెషెంట్స్‌ వైపు చూశాడు.

చూస్తూనే ఉన్నాడు.

గట్టిగా నవ్వాడు.

నవ్వుతూ అరిచాడు.

లేచి ఎగురుతూ నవ్వుతూ అరుస్తున్న భార్గవ్‌ను హాస్పిటల్‌ స్టాఫ్‌ వచ్చి బంధించి వార్డులోకి తీసుకెళ్ళారు.

                                                        *

క్రాంతి శివరాత్రి

Spread the love

One thought on “అబ్సర్డ్

  1. “అబ్సర్డ్” @క్రాంతి శివరాత్రి.
    ఇప్పుడే ఈ కథ చదివాను. చాలా స్పష్టంగా, కథ మొదటి నుండి చివరివరకు ఎక్కడ రవంత పక్కకి పోకుండా చాలా అద్భుతం గా కాస్త suspensive గా కొత్త అనుభూతిని ఇచ్చింది. ఈ విధంగా నేను ఒక స్టోరీ చదవడం ఇదే మొదటిది.
    నా comment ఏంటి అంటే ప్రతి జీవితం అంతరించి పోయే సమయం లో ఒక ఆలోచన వస్తుంది ఇంకో ఛాన్స్ ఉంటే బాగుండు నా జీవితాన్ని మరోలా చక్కదిదుకునే వాడిని అని అనుకుంటాము. ఈ కథ చదివితే మన జీవితం అంతమవ్వకముందే తేరుకొని చక్కదిదుకోవచ్చు. ఎలాంటి కథలు ఎన్నో సమాజం లో కి వచ్చి నేటి అస్పష్టత జీవితాల్లో మార్పులు తేవాలని కోరుకుంటూ ఈ చక్కటి inspirational story ni అందించిన వారి అందరికి కృతజ్ఞుడను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *