స్వీడన్ – నేరం – సంస్కరణ -4

Spread the love

ఇల్లు లేని వారి ఇల్లు

అక్టోబర్ 13, 2025

ఉదయం 9.30 సమయంలో స్టాక్‌హోమ్‌లోని KRIS ఆఫీసు గడప దాటుతుండగా, సూర్యకిరణాలు ఇంకా నగరాన్ని పూర్తిగా ఆవరించలేదు.

నా గుండెలో ఒక వింత ఉత్సాహం, కొత్త అనుభవాల ఆసక్తి. లవణం గారు, సుందర్, రత్న మా బృందం నలుగురం ఆ రోజు కార్యక్రమం కోసం విడిపోయాం. నాతో మొరిత్, హెలెన్ ఇద్దరూ స్థానికులు. KRIS కార్యకర్తలు ఈ స్త్రీలు, నన్ను స్లుసేన్‌లో మెట్రో దిగిన తర్వాత ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు.

స్లుసేన్ నుంచి దక్షిణ దిశగా నడక మొదలైంది. అది స్టాక్‌హోమ్ నగరంలోని సోదరుమాం, దాని విశాలమైన రోడ్లతో, మెత్తగా పరుగులు తీస్తున్న కార్లతో, ఒక సినిమా సెట్‌లా కనిపించింది. ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పటికీ, నగరం యొక్క శాంతమైన సౌందర్యం నా మనసును ఆకర్షించింది. ఏడెనిమిది నిమిషాల నడక తర్వాత, హెలెన్ ఒక్కసారిగా ఆగి, “ఇక్కడి నుంచి గంలాస్తాన్ చాలా దగ్గర!” అని చెప్పింది. నా చూపు ఆమె చూపిన దిశగా తిరిగింది. నీటి అలల మధ్య ఒడ్డున నిలిచిన అందమైన భవనాలు, బాల్టిక్ సీ, మలారెన్ సరస్సు లాక్స్ సిస్టమ్‌తో కలిసి ఒక మాయాజాలాన్ని సృష్టించాయి.

మొరిత్, నీటి ఆవలి భవనాల వైపు చూపిస్తూ, “అదే సిటీ హాల్, నోబెల్ బహుమతులు అందించే ప్రపంచ ప్రసిద్ధ స్థలం!” అని చెప్పింది. నా కళ్ళు ఆశ్చర్యం తో విచ్చుకున్నాయి. కుంగ్శుహాం ద్వీపంలో ఆ గొప్ప చరిత్ర కలిగిన భవనం, నేను నిలబడిన సోదరుమాం ద్వీపం నుండి కనిపిస్తోంది. ఆ క్షణంలో, నీటిని దాటి అక్కడికి పరుగెత్తాలనిపించింది. కానీ సమయం అడ్డుపడింది. మనసులో ఒక తీర్మానం.. తిరిగి వెళ్లే ముందు సిటీ హాల్‌ను తప్పక చూడాలి.

సోదరుమాం గురించి హెలెన్ చెప్పిన కథలు నన్ను నాలుగు శతాబ్దాల క్రితం తీసుకెళ్లాయి. “ఇది ఒకప్పుడు చిన్న గ్రామం, వ్యవసాయ ప్రాంతం. 20వ శతాబ్దంలో పట్టణీకరణతో ఈ ప్రాంతం ఖరీదైన, సంస్కృతి సమృద్ధమైన చోటుగా మారింది,” అని ఆమె వివరించింది. రోడ్డు పక్కన పురాతన చెక్క భవనాలు, శతాబ్దాల చరిత్రను ఛెదరనీయకుండా నిలబెట్టుకుని, నాకు స్వాగతం పలికాయి.

అలా మాట్లాడుకుంటూ నడుస్తున్న మేము బ్రిగ్గాన్, అంటే ఇల్లు లేని వారి ఇల్లు చేరుకున్నాం.

“ఇక్కడ నీవు నిరాశ్రయులతో మాట్లాడతావు,” అని మొరిత్ చెప్పింది. నా మనసులో ప్రశ్నలు మేఘాల్లా కమ్ముకున్నాయి. “ఇది అనాధాశ్రమమా? లేక నిరాశ్రయుల కోసం తాత్కాలిక ఆశ్రయమా?” మొరిత్ నవ్వుతూ వివరించింది, “ఇది ఒక తాత్కాలిక ఇల్లు. ఇక్కడ వారికి కొన్ని గంటలపాటు ఆశ్రయం, ఆహారం, బట్టలు, విశ్రాంతి లభిస్తాయి. కానీ ఇది అనాధాశ్రమం కాదు.”

స్వీడన్‌లో నిరాశ్రయుల సమస్యను పరిష్కరించే బాధ్యత సాంఘిక సంక్షేమ వ్యవస్థది. 1990లలో జాతీయ సర్వేలు నిర్వహించి, దేశవ్యాప్తంగా 18,000 మంది నిరాశ్రయులున్నట్టు అంచనా వేశారు, వీరిలో సగం మంది స్టాక్‌హోమ్, గోథెన్‌బర్గ్ నగరాల్లోనే ఉన్నారు. వీధుల్లో, షెల్టర్లలో, జైళ్ల నుంచి విడుదలైన వారు, స్నేహితుల ఇళ్లలో తాత్కాలికంగా ఉండేవారు—ఇలా నాలుగు రకాల నిరాశ్రయులను గుర్తించారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి షెల్టర్లు నడుపుతూ, ఆహారం, బట్టలు, స్నానం, విశ్రాంతి వంటి ప్రాథమిక అవసరాలు తీరుస్తున్నాయి.

బ్రిగ్గాన్‌లోకి అడుగుపెట్టగానే, షూ రాక్స్ నన్ను ఆశ్చర్యపరిచాయి. రకరకాల జోళ్లు, వివిధ సైజులతో నిండిన రాక్స్, ఒక సౌకర్యవంతమైన ఇంటి గుమ్మాన్ని గుర్తు చేశాయి. లోపలికి వెళితే, గదుల్లో బట్టల రాక్స్… షర్టులు, ప్యాంట్లు, కోట్లు, ఉన్ని దుస్తులు.. అన్నీ సైజుల వారీగా జాగ్రత్తగా అమర్చి ఉన్నాయి.

నిరాశ్రయులు, తమ సొంత ఇంటిలా, ఈ రాక్స్ నుంచి బట్టలు, జోళ్లు తీసుకుంటున్నారు. స్నానం చేసి, వాళ్ల పాత బట్టలను అక్కడే వదిలేస్తున్నారు. కాంటీన్‌లో కొందరు భోజనం చేస్తున్నారు—కేవలం 10 క్రోనార్లకే ఒక భోజనం! బంక్ బెడ్స్‌పై కొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎరుపు, తెలుపు, ఆపిల్ ఎరుపు—రంగురంగుల మనుషులు, ఒక కథను చెప్పే కళ్లతో.

ఇక్కడి వారిలో మధ్య వయస్కులు ఎక్కువ. పురుషుల సంఖ్య కాస్త ఎక్కువగా కనిపించినా, స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీలలో చాలామంది 18 ఏళ్లలోపు తల్లులు, తమ పిల్లలతో తాత్కాలిక షెల్టర్లకు వస్తుంటారు. కుటుంబ హింస, విడాకులు, డ్రగ్స్ వ్యసనం… ఇవి వారిని మానసిక సమస్యల బారిన పడేస్తున్నాయి. తూర్పు యూరోప్ నుంచి వచ్చిన యువతులు ఇక్కడ ఎక్కువగా కనిపించారు. కొందరు మాదక ద్రవ్యాల కోసం వ్యభిచారంలోకి జారుకుంటున్నారు. ఓపియం, హెరాయిన్, కొకైన్, కన్నబిస్ వంటి డ్రగ్స్‌ను వాడటం, అమ్మడం వారిని నేరాల బారిన పడేస్తోంది. జైళ్ల నుంచి విడుదలైన వారికి కుటుంబంలో, సమాజంలో గౌరవం లభించదు. ఉద్యోగాలు దొరకవు. ఫలితం? నిరాశ్రయత, మళ్లీ నేరాల వైపు మళ్లడం.

షెల్టర్‌లో ఐదుగురు కార్యకర్తలు అలుపెరగకుండా పని చేస్తున్నారు. కొందరు జీతంతో, కొందరు స్వచ్ఛందంగా. వచ్చిన బట్టలను లాండ్రీలో వేయడం, సైజుల వారీగా అమర్చడం, వచ్చిన వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయడం మొదలైనవన్నీ వారే చూసుకుంటారు. ఉదయం 9 – మధ్యాహ్నం 2 గంటల వరకు హోమ్ తెరిచి అవసరమైన వారికి అందుబాటులో ఉంటుంది.

షెల్టర్‌లోకి రావడానికి కొన్ని నియమాలున్నాయని మొరిత్ వివరిస్తుండగా, ఒక్కసారిగా ఒక వ్యక్తి మా ముందు నిలబడ్డాడు. ఎర్రటి కోటు, పిచ్చుక గూడులాంటి పొడవాటి గడ్డం, పెద్ద బూట్లు, ఆపిల్ ఎరుపు రంగులో మెరిసే ముఖం.. అతను ఒక సర్కస్ బఫూన్‌లా కనిపించాడు. నవ్వొచ్చినా, సభ్యత కోసం ఆపుకున్నా.

అతను నన్ను వింతగా చూస్తూ మొరిత్ వైపు తిరిగాడు. “ఇండియా నుంచి వచ్చింది, మన గురించి తెలుసుకోవడానికి,” అని మొరిత్ చెప్పగానే, అతను ఒక్క గెంతులో నా ముందుకొచ్చి హగ్ చేసుకోబోయాడు. భయంతో వెనక్కి జరిగాను, “ఏయ్!” అని అరిచా.

మొరిత్ అతన్ని గద్దిస్తూ, “మన అతిథులను మర్యాదగా చూసుకోవాలి,” అని చెప్పింది. అతను సారీ చెప్పి, షేక్‌హ్యాండ్ ఇవ్వబోయి, మళ్లీ సారీ అంటూ అవతలికి నడిచాడు.

కాంటీన్‌లో కొందరితో మాట్లాడి, బయటకు వచ్చాము. అక్కడే, ఆ ఎర్రకోటు వ్యక్తి మళ్లీ కనిపించాడు. ఈసారి మర్యాదగా నా దగ్గరకు వచ్చి, “సారీ,” అన్నాడు. తనలో భారతీయ రక్తం ఉందని, భారతీయులంటే బంధువుల్లా భావిస్తానని చెప్పాడు. “నీవు భారతదేశంలో ఎక్కడివాడివి?” అని అడిగాడు. నాకు ఆసక్తి కలిగింది. నెమ్మదిగా మాటలు మొదలెట్టాను.

“నా తల్లి, ఆమె తల్లిదండ్రులు గాంధీ పుట్టిన దేశస్థులు,” అని గర్వంగా చెప్పాడు. అతని తండ్రి రాజస్థాన్‌లో టూరిస్టుగా ఉన్నప్పుడు అతని తల్లిని పెళ్లి చేసుకుని ఫిన్‌లాండ్ తీసుకెళ్లాడని, ఆమె ఆ తర్వాత భారత్‌కు తిరిగి రాలేదని చెప్పాడు. “నా తండ్రి ఫిన్నిష్, నేను స్వీడన్‌లో ఉంటా,” అన్నాడు. “ఏం చేస్తావు?” అని అడిగితే, భళ్ళున నవ్వి, “బై!” అని వెళ్లిపోయాడు.

మరొక వ్యక్తి ఫిన్నిష్‌లో ఏదో అడిగాడు. మొరిత్, “ఇండియా,” అని చెప్పగానే, అతను “హలో!” అని పలకరించి, గాంధీ గురించి మాట్లాడాడు. “మార్టిన్ లూథర్ కింగ్‌కు నోబెల్ బహుమతి రావడానికి గాంధీ స్ఫూర్తి. ఏసు క్రీస్తు తర్వాత అత్యధికంగా రాయబడిన వ్యక్తి గాంధీ,” అని చెప్పాడు. గాంధీ పై అతని అభిమానం, జ్ఞానం నన్ను ఆశ్చర్యపరిచాయి. నాకు తెలియని విషయాలు అతనికి తెలుసు. అంత జ్ఞానం ఉన్న వ్యక్తి నిరాశ్రయుడిగా ఉండటం బాధ కలిగించింది.

KRIS ఆఫీసుకు తిరిగి చేరుకునేసరికి, హాల్‌లో ఒక వ్యక్తి కనిపించాడు. అతను మైఖేల్. హెలెన్ అతన్ని పరిచయం చేసింది, ఆమె కళ్లలో, మొరిత్ మాటల్లో అతని పట్ల గొప్ప గౌరవం స్పష్టంగా కనిపించింది. మైఖేల్ యువతతో పని చేస్తాడు, నేర జీవితంలోకి జారిపోకుండా వారిని కాపాడుతాడు. స్టాక్‌హోమ్ జైళ్లలో, కస్టడీలో ఉన్న యువతను కలిసి, కౌన్సెలింగ్ ద్వారా వారి జీవితాలను మార్చే ప్రయత్నం చేస్తాడు. అతని నిబద్ధత, సమాజం పట్ల అతని అంకితభావం నన్ను కదిలించాయి.

మొరిత్, ఒక్కసారిగా ఉత్సాహంగా చెప్పింది, “మీకు తెలుసా, మైఖేల్ భారతీయ దేవతలకు పూజలు చేస్తాడు!” నేను ఆశ్చర్యంతో అతని వైపు చూశా. మైఖేల్ నవ్వుతూ తల ఊపాడు. “శివుడికి పూజ చేస్తాను. కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా పూజలు చేశా,” అని చెప్పాడు. అతను ఒక ఆశ్రమంలో ఉంటాడని, నవరాత్రులను ఘనంగా జరుపుకున్నామని, ప్రతిరోజూ యోగా, మెడిటేషన్ చేస్తానని చెప్పాడు. అతని మాటల్లో భారతీయ సంస్కృతి పట్ల లోతైన గౌరవం, ఆధ్యాత్మిక జీవనం పట్ల నియమ బద్ధత కనిపించాయి. హెలెన్, మొరిత్‌తో పాటు KRISలోని ఇతరులకు కూడా మైఖేల్ జీవనశైలి ఒక స్ఫూర్తిగా కనిపించింది.

ఇండియాలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. మీరు ఏ దేవుడిని నమ్ముతారని నన్ను ప్రశ్నించాడు మైఖేల్. నేను కనిపించే మనిషిని నమ్ముతాను. కనిపించని దేవుళ్లను కాదు అని చెప్పినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. వింతగా చూశారు.

మధ్యాహ్నం భోజనం తర్వాత , మొరిత్ మా బృందాన్ని లండన్ అనే ప్రాంతంలోని మరో సెంటర్‌కు తీసుకెళ్లింది. అది మాదక ద్రవ్యాల బానిసలై, ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నవారికి సేవలు అందించే ప్రైవేట్ సంస్థ. 55 గదులు, 14 రకాల చికిత్సలు, సౌనా బాత్ వంటి సౌకర్యాలు ఉన్నాయని గొప్పగా చెప్పారు. సౌనా బాత్‌ను చూసేందుకు నాకు ఆసక్తి కలిగింది. మొదట సన్ బాత్‌తో పొరపాటు పడ్డా, అది ఆవిరి స్నానమని తెలిసింది. “సౌనా వైకింగ్స్ నుంచి వచ్చిన పురాతన అభ్యాసం. స్కాండినేవియన్ దేశాల్లో ఇది సాంప్రదాయం,” అని మొరిత్ వివరించింది.

మొరిత్, హెలెన్ ఇద్దరూ ఒకప్పుడు మాదక ద్రవ్యాలకు బానిసలై, నేరాలు చేసి, జైలుకు వెళ్లినవారే. రీహాబిలిటేషన్ ద్వారా తమ జీవితాలను మార్చుకుని, ఇప్పుడు KRISతో కలిసి పని చేస్తున్నారు. వారి సంకల్పం, మార్పు నన్ను ఆలోచింపజేశాయి. మైఖేల్, మొరిత్, హెలెన్—ఈ ముగ్గురి కథలు, వారి జీవితాల్లోని పోరాటాలు, సమాజానికి వారు అందిస్తున్న సేవలు నా మనసులో ఒక లోతైన ముద్ర వేశాయి.

14వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు KRIS ఆఫీసుకు చేరాం. అప్పటికే లవణం గారు, వారి స్టాఫ్ సమావేశంలో ఉన్నారు. ఒక మిలిటరీ రిటైరీ, ప్రతి ఒక్కరి పేరు పిలిచి, వారి పనుల గురించి అడిగారు. ఇది వారి రోజువారీ ఆచారం. కాఫీ తాగుతూ నిన్నటి రోజు చేసిన పనుల గురించి ముచ్చటించడం, ఈ రోజు చేయబోయే వాటి గురించి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది.

తర్వాత, మిస్టర్ కై తన ఛాంబర్‌లోకి ఆహ్వానించాడు. అతను జ్యూయిష్ వ్యక్తి. కై డాక్యుమెంటేషన్ తో పాటు ఇండియా ప్రాజెక్ట్‌లలో పని చేస్తాడు. అతను స్వీడిష్ ఆర్కైవ్స్ పద్ధతిని వివరించాడు. మాటల మధ్యలో నేనిక్కడ ఆడ్ మాన్ అన్నాడు. మాకు అర్థం కాలేదు. తర్వాత ఈ ఆఫీసులో తానొక్కడే క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేని వాడినని చెప్పాడు.

శ్రీలంక నుంచి వచ్చిన డెలిగేట్స్‌తో సమావేశం ఒక కొత్త అనుభవం. వారు కూడా నేర జీవితం నుంచి బయటపడినవారే. శ్రీలంకలో నేరస్థులకు పాస్‌పోర్ట్, వీసా సులభంగా లభిస్తాయని, వారు అమెరికా వెళ్లి వచ్చారని తెలిసి ఆశ్చర్యపోయాం. లవణం గారు, సంస్కార్ నేరస్థులతో పని చేసిన అనుభవాన్ని వివరిస్తూ, నేర జీవితాన్ని అర్హతగా చూపే శ్రీలంక డెలిగేట్ జాన్ వాదనను తిప్పికొట్టారు. “మా సంస్థ దేశ గౌరవాన్ని ఫణంగా పెట్టదు,” అని స్పష్టంగా చెప్పారు. KRIS అధ్యక్ష కార్యదర్శులు లవణం గారిని అభినందించారు.

వాడిగా వేడిగా జరిగిన చర్చలతో మరో రోజు గడిచిపోయింది.

వి. శాంతి ప్రబోధ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *