ఎంతైనా ప్రకృతి ఇచ్చే కిక్కే వేరబ్బా… 

Spread the love

ప్రకృతిలోకి ప్రయాణమంటే ఎప్పుడూ ఉత్సాహమే. ఉద్వేగమే. ఆ ప్రాంతం గురించి ముందు తెలుసుకోకుండా వెళ్తే..మరింత ఉత్కంఠ. 

YHA -విహంగ మహిళలతో గొట్టం గుట్ట జలపాతం ఒకరోజు పర్యటన ప్రకటించింది.  జలపాతాల విహారమంటే నా మనసు  ఎప్పుడైనా సరే ఎగిరి గంతులేస్తుంది. పదపదమంటూ తొందర చేస్తుంది. వెంటనే నా ప్రయాణాన్ని ఖరారు చేసేశా. 

అనుకున్న తేదీ రానే వచ్చింది.  

అక్టోబరు 2 వ తేదీ నిర్ణయించిన ప్రకారం ఉదయం 7 గంటల సమయానికి అందరూ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర మినీ బస్సు ఎక్కాలి.  కానీ భండారు విజయ, పద్మావతి నేను కొద్దిగా ఆలస్యం. నిర్వాహకురాలు వజ్రేశ్వరి మా కోసం ఫోన్లు. 

మొత్తానికి  మా బస్సు బయలుదేరింది. చందానగర్ లో కరుణ, భారతిలను ఎక్కించుకుని ముందుకు కదిలాం. 

గొట్టం గుట్ట వికారాబాద్ వైపు ఉంటుందేమో అనుకున్నా. కానీ మా బస్సు నేషనల్ హైవే 65 లో  జహీరాబాద్ వైపు నడిచింది. అప్పుడు తెలిసింది మేం వెళ్ళవలసిన చోటు తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో ఉందని. 

మార్గమధ్యలో అల్పాహారం ముగించుకున్నాం. నంది కందిలో రామలింగేశ్వర స్వామి పురాతన ఆలయం గురించి కరుణ చెప్పడంతో అది చూడాలనుకున్నాం.  

ప్రధాన రహదారిలోనే నంది కంది రామలింగేశ్వర ఆలయం పేరుతో స్వాగత తోరణం కనిపించింది. ఆ ఆర్చ్ నుంచి కిలోమీటరు లోపు లోపలికి వెళ్ళాం.  పురాతన ఆలయం గ్రామ చివర ఉంది. మేం అక్కడకు చేరేటప్పటికి  9.30.  

హైదరాబాదు నగరానికి దాదాపు 70 కిమీ దూరంలో ఉన్న చారిత్రక ఆలయం చాలా చిన్నది. 11వ శతాబ్దికి చెందిన ఈ ఆలయాన్ని కళ్యాణి చాళుక్యులు నిర్మించారు.  గోపురం చుట్టూ నక్షత్ర ఆకారంలో ఉన్న ఆర్కిటెక్చర్ ఆకట్టుకుంది.  నల్ల గ్రానైట్ తో చేసిన నంది ఆకర్షించింది. కొన్ని భాగాలు ధ్వంసం అయ్యాయి. పిల్లర్లు పెద్ద ఎత్తు లేవు కానీ ఆ పిల్లర్లపై వివిధ నృత్య భంగిమల్లో చెక్కిన అద్భుతమైన చిత్రకళ ఆకట్టుకుంది.  ఆ చిత్రకళ చూస్తుంటే కాకతీయుల రామప్ప గుడి శిల్పకళ కళ్ళముందు కదలాడింది. 

అద్భుతమైన శిల్పకళ అనాథలా ఉండడం చూసి బాధ కలిగింది. శివరాత్రి సమయాల్లో ఉత్సవం జరుగుతుందట.  చారిత్రక ఆనవాళ్లను, శిల్పకళను కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పురాతత్వ శాఖ వారిది. 

మా బృందంలో ఉన్న వారిలో కోట శివకుమారిని దాదాపు 20 ఏళ్ల క్రితం చూశా. మళ్ళీ ఇప్పుడు గుర్తుపట్టి పలకరించాను. 

జహీరాబాద్ లో పెద్ద వాటర్ బాటిల్స్ కొనుక్కొని తెలంగాణ దాటి కర్ణాటకలో ఎప్పుడు ప్రవేశించామో మా కబుర్లలో తెలియనే లేదు. బస్సు హై వదిలి సింగల్ రోడ్ లో ప్రయాణిస్తున్నది. ఎటు చూసినా పచ్చదనమే.  చిన్న చిన్న పల్లెలు. ఆ పల్లెలు నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కనిపించే పల్లెల్లాగే కనిపించాయి. కాకపోతే ఇంటి పై కప్పుకి, గోడలకి, ప్రహరీగోడగా  నాపరాతి పలకలు వాడటం అక్కడక్కడ కనిపించింది.   వాకిట్లోనో, దడికో, కంపాలకో పాకిన సొర, చిక్కుడు పాదులు, పెంట కుప్పలపై పెరిగిన గుమ్మడిపాదులు కనిపించాయి. 

ఎటుచూసినా పచ్చదనం కమ్మేసింది. ఆ పచ్చదనంతో లేత ముదురుతో కూడిన ఎన్నెన్నో షేడ్స్.  పచ్చటి పంట చేలలో సాళ్లలో పెరిగిన కంది, చెరుకు, కొద్దిగా పత్తి దాటుకుంటూ గుల్బర్గా జిల్లా చించోలి అభయారణ్యంలోని చంద్రంపల్లి డాం దగ్గర మేం దిగేసరికి ఎండ బాగా పెరిగింది.  

పెద్ద గేటు నుంచి లోపలికి వెళ్ళగానే చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ బోర్డు కనిపించింది.  కొద్దిగా ముందుకు వెళితే డాం. ఈ ప్రాజెక్ట్ ని 1973లో భీమా నదిపై కట్టారు. డాం కి మొదట్లోనే కుడి వైపు దారుల్లోకి వెళ్లకుండా డాం పైకి నడిచాం. 

చుట్టుముట్టు కొండల నడుమ నీలాకాశాన్ని, ఆ ఆకాశంలో మేఘాల్ని నీళ్లపై చిత్రించుకున్న ప్రకృతి మమ్మల్ని రా రమ్మని ఆహ్వానం పలుకుతూ ఉంటే మేం ఆగుతామా!  ఆస్వాదిస్తూ గిరిజ, విజయ, శివకుమారి నేను ఆ చివరికి చేరాం. ఆ ప్రాంతమంతా చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది. నీటి మధ్యలో చిన్న ద్వీపం. 

 ఆ కొండపై ఉన్న వ్యూ పాయింట్ కి వెళ్లొచ్చని, అదే విధంగా బోటింగ్ చేయొచ్చని అనుకున్నాం.  కానీ మిట్ట మధ్యాహ్నం బోటింగ్ టికెట్ ఇచ్చే వాళ్ళు లేరక్కడ. పశుల కాపర్లు తప్ప సందర్శకులు ఈ చివర ఎవరూ కనిపించలేదు. 

మా వెనక మా వాళ్ళు నచ్చిన విధంగా ఫోటోలు తీసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ… నెమ్మదిగా పర్యాటకుల సందడి కొద్దిగా మొదలైంది. కూర్చోవడానికి అక్కడ ఏమీ సదుపాయాలు లేవు.  మధ్యాహ్నం కంటే సాయంత్రం వెళ్తే మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. 

రాత్రిపూట ఉండాలనుకునే ఔత్సాహికుల కోసం మూడు కాటేజీలు ఉన్నాయి. పక్షుల సందడి , జంతువుల అరుపులు , చల్లటి గాలులు చర్మాన్ని తాకుతూ  ఉంటే అద్భుతమైన అనుభవం సొంతం చేసుకోవచ్చు. 

అందమైన ప్రదేశాలు ఉన్నాయి కానీ వాటిని ఎట్లా ప్రజలకు అందుబాటులోకి తేవాలో మన ప్రభుత్వాలు ఆలోచించవు. అరకొర వసతుల మధ్య వచ్చే సందర్శకులు ఎక్కువగా  వచ్చేది హైదరాబాదు నుంచే. 

అక్కడి నుండి బయలుదేరి గొట్టం గుట్ట వాటర్ ఫాల్స్ కి బయలుదేరాం.  రిజర్వాయర్ కి ఆవలి వైపు గొట్టం గుట్ట వాటర్ ఫాల్స్ ఉన్నాయి. బస్సు జలపాతం వరకు వెళ్ళదు.  అడవిలోనే ఆపుకున్నాం.  మా ఫుడ్ తీసుకుని నడక మొదలు పెట్టాం. ఎగుడు దిగుడు అడవి దారిలో మండే ఎండలో బురద రాళ్ళూ రప్పల నేలలో దాదాపు రెండున్నర కిలోమీటర్లు నడిచి గొట్టం గుట్ట వాటర్ ఫాల్స్ చేరాం. 

అవి నన్నయితే చాలా నిరాశ పరిచాయి.  జలపాతం కింద చేరి జలకాలాడాలని ఎంతో ఉబలాటపడ్డ నాకు, నాలాంటి మరి కొందరు మిత్రులకు నిరాశ. కారణం వాగు ద్వారా బండరాళ్లను ఒరుసుకుంటూ ప్రవహించే నీరంతా చిక్కని టీ రంగులో. క్రితం రాత్రి చాలా పెద్ద వర్షం పడడంతో కొంత జారుడుగా.  ఆ నీటిలో దిగే సాహసం చేయలేదు.  కొందరు పర్యాటకులు అలాగే ఆ నీళ్లలో తడిసి ముద్దవుతున్నారు.  పిల్లలు వాగులో బండరాళ్ల మధ్యలో చేరి ఆడుకుంటున్నారు. స్నానం చేస్తున్నారు. 

వాటర్ ఫాల్ బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని ఫోటోలు తీసుకుని  ఆ పక్కనే ఉన్న చెట్ల కింద చేరాం. అందరం ఆకలితో ఉన్నాం. అలసి ఉన్నాం.  నీడను వెతుక్కుని ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారం తిన్నాం.  పక్కనే ఉన్న చిన్న వాగు చేస్తున్న సవ్వడి నిలువనీయడం లేదు. 

నెమ్మదిగా భారతి, పద్మావతి, నేను వెళ్లాం. ఆ నీళ్లలో కాళ్ళు జాపుకుని చెట్టు వేళ్ళ పై కూర్చున్నా. పద్మావతి, భారతి గార్లు ఆగలేక తడిసి ముద్దయ్యారు.   వజ్ర వచ్చి ఫోటోలు తీసింది. శివకుమారి ఫోటోలకు ఫోజులిచ్చింది. 

కాసేపు వాగుతో కబుర్లు చెప్పుకోవడం మనసుకు కాస్త ఊరట నిచ్చింది. ప్రకృతి ఎంత అద్భుతమైనదో.. ఎన్ని ఊసులు చెబుతుందో ఆలోచిస్తూ చించోలి అభయారణ్యంలోనే ఉన్న మరో జలపాతం చూడడానికి బయలుదేరాం. 

దాదాపు పది కిలోమీటర్లు ప్రయాణం చేసామో లేదో ఓ గుడి దగ్గర బస్సు ఆగింది.  జాడి మల్కాపూర్ అని అక్కడున్న బోర్డు చెప్పింది. అక్కడ చాలా మంది కనిపిస్తున్నారు. ఏదో మొక్కు తీర్చుకుని భోజనాలు పెట్టుకున్నారు. మేమంతా అడవిలోకి దారి పట్టాం. అప్పటికే సమయం నాలుగున్నర దాటింది. 

అడవి దట్టంగా ఉంది. వర్షాల వల్ల పెరిగిన గడ్డి, చిన్న చిన్న మొక్కలు నడుము దాటి.. కొండ దిగువకు వెళ్లాలని మా ప్రయత్నం. కరుణ జాగ్రత్తగా ముందుకు అడుగులేస్తూ దారి కనిపిస్తుందేమో అని వెతుకుతున్నది.  

ఓ వైపు నుంచి జలపాతపు సవ్వడి దూరంగా వినిపిస్తున్నది. కానీ ఆ చిక్కని అడవిలో వెళ్లే మార్గం తెలియడం లేదు.  పచ్చని చెట్టు కొమ్మల మధ్య నుంచి వాగు ఉన్నట్లు తెలుస్తున్నది. 

ఇంత చిక్కనైన అడవిలో ఏ పురుగు పుట్రా ఉంటాయో.. ఏం జంతువులు ఉంటాయో తెలియదు. కాసేపట్లో చీకటి అలుముకుంటుంది. ఈ సమయంలో వెళ్లడం అవసరమా అన్నది నిశ్చలరెడ్డి, అవునన్నది శివకుమారి. నిజమేనంటూ వారి వెనుకే విజయ భండారు, పద్మావతి, భారతి కూడా  వెనుదిరిగారు.   

కరుణ, వజ్ర, గిరిజ, నేను ముందుకు నడిచాం. మా నలుగురిలో ఇద్దరు 50కి దగ్గరలో ఉంటే మరో ఇద్దరు సీనియర్ సిటిజన్స్.  రిస్క్ అవసరమా అని ఆగిపోయిన మిత్రుల హెచ్చరిక. అయినా మేం ఆగలేదు. 

కరుణ అంతకు ముందు ఒకసారి చూసిన అనుభవంతో తాను ముందుండి నడిపింది. దారి చేసుకుంటూ, బండరాళ్ల మధ్య నుంచి కొండ దిగుతూ ఉండగా రెండు పెద్ద బండరాళ్ల నడుమ ఉన్న సన్నని సందు కనిపించింది. అది దాటుతూ మనం సరైన దారిలోనే ఉన్నామని కరుణ చెప్పడంతో మరింత ఉత్సాహంతో సాగింది మా నడక.  

కనిపించిన కర్రను ఊతంగా చేసుకుని మాకు అడ్డు వస్తున్న గడ్డి గాదం, కొమ్మ రెమ్మల్ని జరుపుకుంటూ సన్నని బాట చేసుకుంటూ సాగింది నడక. అదో అద్భుతమైన అనుభవం. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో చూసిన  దృశ్యాలు కదలాడుతుండగా మేమూ అలా నడుస్తున్న ఫీలింగ్, గొప్ప థ్రిల్ ఆ క్షణాల్లో.. 

ముందుకు వెళ్లి లక్ష్యం చేరాలని తప్ప మరో ఆలోచన లేకుండా సాగిన మేం వాగు చేరుకున్నాం. అక్కడి నుంచి మరికొంత దూరం వెళ్తే తప్ప జలపాతం చేరుకోలేం. 

జలపాతం వరకు చేరుకోగలిగినప్పటికీ తిరుగు ప్రయాణం ఆ చీకటిలో చాలా ఇబ్బంది అవుతుందని ఇక ముందుకు వెళ్ళలేదు. 

ఆ వాగులో నీళ్లు కూడా బురద రంగులో ఉన్నప్పటికీ నీళ్ళ ఆహ్వానం అందుకుని ఇక ఆలోచించకుండా దిగేసాం. కాళ్ల కింది రాళ్ళపై పరుగులు పెట్టె నీటి వేగం, మధ్యలో చేరిన బంకమట్టి మమ్మల్ని జారవిడవాలనే ప్రయత్నం చేస్తుంటే మేం మరింత గట్టిగా కాళ్లతో హత్తుకుంటూ  రాళ్లపై నుండి సవ్వడి చేస్తూ హడావిడిగా ఉరుకులు పరుగెత్తే నీటికి అడ్డుతగులుతూ కాసేపు ఆడుకున్నాం. ఆ నీళ్లలో మునిగి తేలాం.  చల్లగా జివ్వుమన్న ఆ నీటి రంగు స్వచ్ఛంగా లేకపోయినా నీరు స్వచ్ఛమైనదే. ఆ వనంలోని అనేకానేక వనమూలికల సారాన్ని వెంట తెచ్చుకున్న ఆ నీరు మా అలసటను పూర్తిగా తరిమేసింది.  కొత్త జవసత్వాలిచ్చింది. 

మనసు మరింత సేపు అక్కడే ఉండమని గొడవ చేస్తున్నప్పటికీ తప్పనిసరై తిరుగు దారి పట్టాం. అప్పటికే చీకట్లు ముసురుతున్నాయి.  మా నడక వేగం పెంచాం. కొండ లోయ నుంచి పైకి ఎక్కడం వల్ల ఆయాసంతో వగరుస్తూ పైకి చేరుకున్నాం.  మాకు సమయం ఉండి పక్కన గుట్ట పైకి ఎక్కి ఉంటే దిగువన చంద్రంపల్లి డాం, చంద్రంపల్లి గ్రామం కనిపించేవట. అది మేం మిస్ అయ్యాము. 

ఏదేమైనప్పటికీ ఆ అనుభవం నాకైతే ఎంతో స్థైర్యాన్నిచ్చింది.  ఇక ముందు నేను హైకింగ్, ట్రెక్కింగ్ చేయగలను అని నమ్మకం వచ్చింది . 

మేం చేరేటప్పటికి మా వాళ్లంతా  గుడి దగ్గర కూర్చుని ఎదురు చూస్తున్నారు. అప్పటి వరకు అక్కడ ఉన్న వారితో ముచ్చట పెట్టారు. సమీపంలోనే ఉన్న మరో గుడిని దర్శించుకున్నారు.  

రాత్రి క్యాంపింగ్ చేయాలనుకునే ట్రెక్కింగ్ గ్రూప్స్ వచ్చి టెంట్స్ వేసుకుని జాడి మల్కాపూర్ లో ఉంటారట. 

అడవి గేట్ మూసేస్తారని తిరిగి తెల్లవారి ఉదయం తెరుస్తారని ఆలస్యం అయితే అక్కడే ఉండవలసి వస్తుందని అక్కడ ఎవరో చెప్పారట.  మా వాళ్ళ కంగారు.  తిరుగు ప్రయాణం మొదలైంది. దారి పొడవునా అక్కడక్కడ చిన్న చిన్న తండాలు. 

అద్భుతమైన ప్రకృతిలో మిట్టపల్లాల చేల మధ్య నుంచి, పచ్చిక బయళ్ళలోంచి ఉన్న బాటలో సాగింది ప్రయాణం. అరకులో ప్రయాణిస్తున్నట్లే అనిపించింది. కాకపోతే ఇక్కడివి గుట్టలు అక్కడ కనిపించేది ఎత్తైన కొండలు. అందరం ప్రకృతితో కనెక్ట్ అయిపోయాం. 

ప్రపంచం, ప్రకృతి ఎంత వైవిధ్యమైనవో… ఎన్నెన్ని వింతలు విడ్డూరాలు తమలో ఇముడ్చుకున్నాయో!

యాంత్రికమైన ప్రపంచంలో ప్రకృతితో పెనువేసుకున్న సహజమైన బంధానికి దూరమవుతూ జీవితాన్ని సంక్లిష్టంగా మార్చుకుంటున్నాం. 

పట్నపు రణగొణ ధ్వనులు కాలుష్యం మధ్య బతికే నేను పక్షుల కిలకిలలు వింటూ స్వచ్ఛమైన గాలిని నింపుకున్న అనుభూతి నా  మనసుని శరీరాన్ని తేలిక పరుచుకున్న. శరీరంలోకి కొత్త శక్తి చేరింది. ఎంతైనా ప్రకృతి ఇచ్చే కిక్కే వేరబ్బా.. 

దానికి తోడు కొత్త పరిచయాలు, కొత్త సంభాషణలతో సోషల్ మీడియాకి దూరంగా రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడచిపోయింది. (నేను ఫోటోలకి తప్ప మొబైల్ వాడలేదు). 

వీలైనప్పుడల్లా ప్రకృతిలోకి పోయి రావాలని ఆ క్షణాల్లోనే నిర్ణయించుకున్నా. 

చించోలి అభయారణ్యం తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది. డాం కర్ణాటక పరిధిలో ఉంటే జాడి మల్కాపూర్, గొట్టంగుట్ట తెలంగాణ పరిధిలోకి వస్తాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త శ్రద్ధ పెట్టి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే పర్యాటకులు బాగా పెరిగే అవకాశం ఉంది. 

గొట్టం గుట్ట వెళ్లాలనుకునేవారు వర్షాకాలంలో వెళ్తే చాలా బాగుంటుంది .  తినడానికి ఏమీ దొరకవు కాబట్టి ఆహారపదార్ధాలు, నీళ్లు వంటి మనకి కావలసినవి మనమే తీసుకెళ్లాలి. ట్రెక్కింగ్ చేయొచ్చు.  

చంద్రంపల్లి నేచర్ క్యాంప్ లో ఉండానికి 3 కాటేజీలు ఉన్నాయి. అయితే ముందు కర్ణాటక అటవీశాఖ వారి అనుమతి పొందాలి. 

వి. శాంతి ప్రబోధ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *