నేను. నేను తెలుసు కదా? ఇరవై ఏళ్ళ క్రితం క్యాసెట్ లో ‘సైడ్ ఏ’ లో మొదటి పాట గా నువ్వున్నప్పుడు నిన్నొకే ఒక్కసారి విని ప్రేమలో పడిపోయాను చూడూ ….. నేనే.
ప్రేమ లేఖ రాయటం కొత్తగా ఉంది. కొంచెం సిగ్గుగా కూడా ఉంది. నువ్వు వినిపిస్తే నేను వినడమే అలవాటు. తిరిగి ఎప్పుడూ ఏదీ మాట్లాడవలసిన అవసరం అనిపించలేదు. నీ శబ్దం .. నా నిశ్శబ్దం.. ఇదే మన బంధం ఇన్నాళ్లూ. కానీ నీ తో కలిసి ఓ అర్ధజీవితకాలపు ప్రయాణం చేసాక కొన్ని నీకు చెప్పుకోవాలని ఉంది. నేను ఎప్పుడూ వినే పాటవు .. ఈ రోజు నా మాట వింటావు కదూ?
యాదృచ్చికం గా ఘజళ్ళ క్యాసెట్లలో నాకు తోచిన ఒకటి ఎంచుకున్నాను. ఎవరూ పరిచయం చెయ్యలేదు. ముందు అందులో ఒక్క పాట కూడా విని ఉండలేదు. ఆవార్ గీ… అంటే అర్ధం తెలీదు. ప్లే నొక్కగానే .. జల్ తరంగ్ మీద కొన్ని స్వరాలు నువ్వొస్తున్నావని అప్రమత్తం చేసాయి … కానీ ఆ తర్వాత జాలువారిన అమృత వాహిని కి ఎవరూ నన్ను సిద్ధం చెయ్యలేదు. సంగీతం తో తడిసిన భావగర్భితమైన పదాలు అలలు అలలు గా నన్ను ముంచెత్తాయి. అవి ఉప్పు నీటి ఉప్పెనలు కావు … ఆత్మ దాహార్తి తీర్చిన తియ్యతియ్యని శబ్ద తరంగాలు. నేనేమీ ఉక్కిరిబిక్కిరి అవ్వలేదు. ఇది అలాంటి ప్రేమ కాదు. గుక్కతిప్పుకోకుండా నేను తాగుతూనే ఉన్నా. నాలో ఇంత దాహం ఉందా అని నాకే ఆశ్చర్యంకలిగింది. ‘నేను అనంత శబ్దాన్ని… నీకెంత కావాలో అంత గ్రోలు’ అన్నావు నువ్వు. అంత ఉదారత ఎప్పుడూ చూడలేదు జీవితం లో.
మనిషిని కదా.. నీ విశాలత్వం కొత్త. ఈ ప్రేమ కూడా కొత్తదాయె. ఎన్నో సందేహాలు. నేను ప్రేమ లో పడింది నీతోనేనా? గులాం అలీ గళం, సంగీతం, మొహసిన్ నక్వీ … వీరితో కాదా? అప్పుడు అసలు ఏమీ తెలీదు. ఆ ఘజల్ ఏ రాగమో, ఎవరు రాసారో, ఎప్పుడు, ఎందుకు రాసారో … ఇవేవీ తెలీదు. ఇవన్నీ తెలుసుకొని ప్రేమించలేదు. అనుకుని ప్రేమించలేదు. నువ్వు పరిచయమవ్వగానే తెలిసిపోయిందంతే…. ఇంక నువ్వు నా జీవితం లో ఉంటావని.
ఆవార్ గీ.. ఓ పిచ్చితనం, గమ్యం అనే ఆలోచన లేని సంచారం, ఓ దేశదిమ్మరిత్వం. అర్ధం నిఘంటువు చెప్పింది. భావం మనసుకి లీలగా అర్ధమయింది. వినగానే గుబాళించింది నీ ‘పల్లవీ’పల్లవం ….
యే దిల్ యే పాగల్ దిల్ మేరా … క్యూ బుఝ్ గయా … ఆవార్ గీ
ఇస్ దష్త్ మే ఇక్ షెహెర్ థా …. వో క్యా హువా …. ఆవార్ గీ
ఈ మనసు… ఈ నా పిచ్చి మనసు … ఎందుకు కొడిగట్టిందో… ఆవార్ గీ
ఈ ఎడారి లో ఓ నగరం ఉండాలి కదూ … అది ఏమైందో మరి… ఆవార్ గీ
నాకీ పదాలు అర్ధమవ్వకుండానే ఎందుకు అర్ధమయ్యాయి? ఎందుకు నచ్చావు వినగానే? నువ్వు పరిచయమవ్వక ముందు జీవితం … నువ్వు పరిచయమవ్వడానికి నేను చేసిన సాధనేనా? నువ్వు వినగానే అర్ధం అవ్వడం కోసమే అంత జీవితం చూసానా?
******
పుట్టిన ప్రతీ ప్రాణికి ప్రేమంటే ఏవిటో తెలుసు. మనసుకి అర్ధమవుతుంది. అవసరమని తెలుస్తుంది. ఎంత మాయ చేసినా ప్రేమ లేని చోటు .. అది లేని లోటు … రెండూ ఎంత చిన్న పిల్లైనా ఇట్టే గ్రహించగలదు. నేనూ గ్రహించాను. ప్రపంచం లో ని ప్రేమంతా అమ్మే ఇవ్వలేదు. నాన్న కూడా ఇవ్వాలి.
ఎక్కడో ఏ రాక్షసుడో తప్ప తండ్రులు కూతుళ్ళని ప్రేమిస్తారు. కానీ కూతుళ్ళకి కావాల్సినంత కాదు… తమకి చేతనైనంత. ఎక్కడో ఏ రాక్షసో తప్ప తల్లులు అలా కాదు. ప్రేమనే మార్గదర్శత్వం గా తీస్కుని అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది తల్లి. ఇక హద్దులు, లెక్కలు, వ్యక్తిగత బలహీనతలు అడ్డురావు. తండ్రి అలా కాదు. నా తండ్రి అలా అసలే కాదు.
నా తండ్రి ఏనాడూ నా మీద చెయ్యత్తలేదు… కొట్టడానికైనా… ఆశీర్వదించడానికైనా … ప్రేమగా తలనిమరడానికైనా. తన భవిష్యత్తు పట్ల ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో ఉన్న నాన్న ని చచ్చిపోతానని బెదిరించి పెళ్ళికి ఒప్పించిందిట నానమ్మ.
పెళ్ళికి కారణం ఏదైనా మెల్లిగా గాడిలో పడిపోతారు కొంతమంది. నాన్న అలా చేయలేకపోయారు. ఆయన భార్యాపిల్లలు ఆయనకి ఏదో చేదైనది గుర్తు చేసేవారేమో … ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడేవారు కాదు. వారానికి కొన్ని గంటలు. అంతే. అప్పుడు కూడా తనకిష్టమైన పని లో మేము భాగమవ్వాల్సిందే.
నా చిన్నప్పటి జ్ఞాపకాల్లో నాన్న నోట్లో సిగరెట్ లేకుండా కనిపించడం అరుదు. రోజుకి ఐదారు డబ్బాలు ఖాళీ అయ్యేవి. నాన్నతో సమయం అరుదు, అపురూపం. ఇంక ఆ సమయం లో ఆయన అలవాట్ల గురించి మాట్లాడే హక్కు అమ్మకి ఆయన ఎప్పుడూ ఇవ్వలేదు. నాన్న తో కొన్నే మాట్లాడాలి. కొన్ని మాట్లాడితే అక్కడినుంచి వెళ్ళిపోయేవారు. ఈ భయం తో ఉండేదాన్ని చిన్నదాన్నైన నేను.
క్రాస్ వర్డ్ పూర్తి చేయటం అంటే నాన్న కి చాలా ఇష్టం. ఆయన ఒళ్ళో వెళ్లి కూర్చొనే దాన్ని నేను. ఆయన వెంటనే విసుక్కొని పక్కన కూర్చోమనేవారు. ఆయన్ని అతుక్కొని అలాగే కూర్చొనే దాన్ని. ఆయన నోట్లో సిగరెట్ కి కళ్ళు మండేవి. దగ్గొచ్చేది. కానీ ఆయనతో సమయం గడపడానికి దొరికే ఛాన్స్ అదొక్కటే. పక్కనే చిన్న డిక్షనరీ పెట్టుకునేవారు. నన్ను పదాలు వెదకమనేవారు. ఆదివారం క్రాస్ వర్డ్ కోసం ఏ ఆరేళ్ళ పిల్లా అంతగా ఎదురుచూసేది కాదేమో!
ఇప్పుడెవరైనా కొత్తగా తండ్రి అయిన వారు నా దగ్గరకి వచ్చి ‘మా అమ్మాయి ని ఎలా చూసుకోవాలి’ అని అడిగితే నేను చెప్పే మొట్టమొదట సమాధానం ‘మీరు మీ పిల్లలకి డబ్బు, సమయం, విలువలూ, క్రమశిక్షణ … ఇవేవీ ఇచ్చినా ఇవ్వకపోయినా.. మా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనే అనుమానం మాత్రం రానివ్వకండి’ అని.
ఓ గులాబీ పువ్వు పట్టుకొని ఒక్కో రేకూ తుంపుతూ ‘హీ లవ్స్ మీ … హీ లవ్స్ మీ నాట్’ అనే ఆట ఆడతారు కన్నెపిల్లలు. చివరి రేకు కి ఏ మాట అంటే అదే నిజమన్నమాట. అలా కూతురి గా నాన్న ప్రేమ గురించి తర్జనభర్జన లో ఒక్కో రేకూ తుంపుతూ ఈ ఆట ఆడుతూనే ఉన్నాను నేను.
సరదాగా సినిమా కి, హోటల్ కి తీసుకెళ్లినప్పుడు ‘హీ లవ్స్ మీ’ అనేది చిన్నారి మనసు. అలా వెళ్ళినప్పుడు అమ్మ ఎందుకు ఆనందంగా లేదు? ముందు రాత్రి ఎందుకు నిద్రలో మెలకువ వస్తే అమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ బలవంతంగా నన్ను పడుకోబెట్టేసింది? ఆ వినిపించింది నాన్న అరుపులా? నా పీడ కలా? నాన్న తాగొచ్చి ఇలాంటి గొడవ చేసినప్పుడు ‘హీ లవ్స్ మీ నాట్’.
మంచి వయసు, మంచి ఆరోగ్యం, మంచి ఉద్యోగం, అందమైన భార్య, ఓ కూతురు.. చిన్ని సంసారం.. ఇవన్నీ ఉన్న వ్యక్తి కి ఎందుకు సిగరెట్, మందు అవసరమవుతున్నాయి? ఈ ప్రశ్న అడిగేంత లోతుగా నాన్న ని ఎవరూ ప్రేమించలేదా? ఆయన ప్రేమించనివ్వలేదా? పెద్దవారెవరైనా ప్రశ్నిస్తే నాన్న అనేవారట …. ‘భర్త గా, తండ్రిగా వాళ్ళకింత సంపాదించి పెడుతున్నాను… ఇంక నేనెలా ఉంటే మీకెందుకు’ అని. ఆస్తులివ్వని వారికి అడిగే హక్కు కూడా ఉండదు. అంతటి తో పెద్దవాళ్ళు ఊరుకున్నారు.
నాకు పన్నెండు.. పదమూడేళ్ళు వచ్చేసరికి నాన్న ఉద్యోగం పోయింది. అందరూ దురలవాట్ల వల్లే అన్నారు. నాన్న ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టారు. ఆఫీస్ పనే నాన్న ని నాకు దూరం చేసింది అనుకున్న నాకు అతి త్వరలోనే భ్రమలు తొలగిపోయాయి. ఇంట్లో ఉన్న నాన్నకి ఆఫీస్ లో ఉన్న నాన్నకి తేడా లేదు. అక్కడ పని, ఇక్కడ పానం.
అమ్మ ఇంటి బాధ్యత ని తీసుకుంది. ఆర్ధిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలో అయితే అర్ధం చేసుకుంటుంది సమాజం. బలహీనమైన మగవాడ్ని మాత్రం క్షమించదు. ఆ శిక్ష అతని కుటుంబానికి కూడా వర్తింపచేస్తుంది. ఇంటి పేరు తండ్రి దే పెట్టుకోవడం మన సంప్రదాయం. ఇదే సమయం లో .. మా ఇంటి పేరు ఏంటో మారిపోయింది. ‘తాగుబోతు వాడి కుటుంబం’ ‘ఇంట్లో ఖాళీ గా కూర్చొనే మగాడు’ ‘ఆడ సంపాదన మీద నడుస్తున్న సంసారం’ ఇలా. ఇది నాన్న కి కూడా తెలుసు. నాన్న నన్ను కాదు … తన బలహీనతల్నే ఎంచుకుంటున్నాడు ప్రతీ సారీ అని నా చిన్ని హృదయానికి తట్టినప్పుడు … ‘హీ లవ్స్ మీ నాట్’.
ఇవీ .. ఇంకా ఎన్నో కోపాలూ, అలకలూ, సందేహాలూ తీర్చకుండా చాలా చిన్నవయసు లోనే నాన్న చనిపోయినప్పుడు …. హీ లవ్స్ మీ నాట్.
చిన్న వయసు నాదీ … అమ్మదీ … నాన్నదీ. అలవాట్ల వల్ల నాన్న చనిపోయారు. చనిపోవాలనే ఆ అలవాట్లు చేసుకున్నారు. ఆయనది నిశ్శబ్ద ఆత్మహత్య.
ఆవార్ గీ, నాన్నకి నువ్వు తెలియదు. కానీ పరిచయమయితే నీ లో ఈ రెండు పంక్తులూ ఆయనకి బాగా నచ్చేవి.
ఇక్ అజ్నబీ ఝోంకే నే జబ్ పూఛా మేరె ఘమ్ కా సబబ్
సెహ్రా కీ భీగీ రేత్ పర్ మై నే లిఖా … ఆవార్ గీ
ఓ తెలీని తెమ్మెర ‘ఏమిటోయ్ నీ నైరాశ్యానికి కారణం?” అని అడిగినప్పుడు …
ఎడారిలో తడిసిన ఇసుక పై నేను రాసా …. ఆవార్ గీ …
******
నాన్న వెళ్ళిపోయారు. కానీ ఆయన ప్రభావం ఎక్కడికి పోతుంది? మంచివి, చెడువి, రెండిటికి అతీతమైనవి… ఎన్నో సంచులతో జీవన యానం కొనసాగింది. ఒక ఆడపిల్ల కి మగవాడి ప్రేమేంటో మొదటగా తెలిసేది తండ్రి వల్లే.
పితృస్వామ్యం లో పితృదేవోభవ అనే ఉద్భోధ తో పెంచే పిల్లలకి నాన్న కూడా మనిషే … లోపాలున్న మనిషి… అని తెలిసేసరికి వాళ్లలో బాల్యం చనిపోతుంది… ఒక్కో సారి సమయానికి ముందే. ఈ పిల్లలు ప్రేమ ని చూసే కోణమే మారిపోతుంది. మామూలు భాష లో చెప్పాలంటే కొందరు ఆ తండ్రుల లాగే ‘లూజ్’ అవుతారు, కొందరు వారికి పూర్తి విరుద్ధంగా ‘టైట్’ అవుతారు.
ఈ ‘లూజ్ ‘ ఆడపిల్లలు తండ్రి ప్రేమ ని అన్ని చోట్లా వెదుక్కుంటారు. ఎవరు ‘ప్రేమ’ అన్నా పడిపోతుంటారు. అబ్బాయిల కి ఇలాంటి ‘డాడీ ఇష్యూస్’ ఉన్న అమ్మాయిలు ఈజీ టార్గెట్స్ అయిపోతారు. నేను? అమ్మ డిసిప్లిన్ ప్రభావం అయ్యుండచ్చు…. ప్రేమ తడారిపోయి మనసు ని రాతి గోడల మధ్య బంధించేసాను. ప్రేమంటే ఒకింత చులకన, అబ్బాయిలంటే అపనమ్మకం. ఎవరైనా ప్రేమ అంటే అదో తప్పు మాట గా భావించడం.
ప్రేమ.. బైటి ప్రపంచం లో మొదటి సారి ఈ మాట ఎప్పుడు విన్నాను?
ఏడో తరగతి. వింటే నవ్వొస్తుంది. తొమ్మిదో తరగతి లో ఓ వెధవకి నేను నచ్చానట… వాడి ఫ్రెండొకడు రాయబారానికొచ్చాడు. వాడికి ఎవరో ఒకర్ని ప్రేమించాలని తట్టింది కానీ … చెప్పే ధైర్యం లేదు. ఆ సో కాల్డ్ ప్రేమికుడికి యాభై ఏళ్లొచ్చాక తన ఫ్రెండ్స్ తో డ్రింక్ చేస్తూ నన్ను గుర్తుచేసుకుంటాడు. వాడి మధురస్మృతి నేను. నేను మర్చిపోవాలనుకునే ఘట్టం వాడు.
సినిమాల ప్రభావం అంటారు కానీ కొంత మంది అబ్బాయిల్లో అంతర్లీనంగా ఈ వికారం ఉంటుంది… వారి లో హార్మోన్లు వికసించడం అమ్మాయిల చావుకొస్తుంది. అలాగే నా మెడ కి చుట్టుకుంది ఈ ‘స్టాక్’ మార్కెటింగ్ ప్రేమ ….స్టాకింగ్ .. అంటే నీడలా వెంట పడి వేధించి మార్కెటింగ్ చేసే ప్రేమ.
సినిమా ఒకరి లో ఆలోచన అంకురించేలా చేయకపోవచ్చు కానీ ఈ విషపు సంస్కృతి ని బాగా సెలెబ్రేట్ చేస్తుంది. ఎందుకు ప్రతీ పోస్టర్ లో అమ్మాయి ముందు అబ్బాయి వెనక ఉండాలి? గమనించావా? అలాగే ఈ వ్యవహారం అమ్మాయిలు కూడా లోపల్లోపల ఇష్టపడతారు అనే దుష్ప్రచారం ఒకటి .. పాటల్లో, సీన్స్ లో.
ఏంటో ఆ కౌమార దశ నుంచే లింగ భేదాలు ప్రస్ఫుటంగా తెలిసిపోతూ ఉంటాయి. ఒకడి ప్రేమ ని ఒప్పుకోమని లాబీయింగ్ చేసే ఐక్యత, స్నేహం మగవారిలో ఉంటుంది. ఓ అమ్మాయి అలా అల్లరవుతుంటే మిగిలిన అమ్మాయిలు ఆమె పక్కన ఎందుకు ధైర్యంగా నిలబడరు? ఇది కూడా ప్రకృతి నియమమా? నా వెంట పడట్లేదు అని అసూయ పడుతుందా తోటి ఆడపిల్ల? లేదా అలా నిలబడాలి అని ఎవరూ నేర్పించలేదా?
అందరు అబ్బాయిలు ఇలా ఉండరు అన్న మగవాళ్ళే ఈ వెంట పడే అబ్బాయి తో స్నేహం మానరు, ఇది తప్పని చెప్పరు.
నాకు చిన్నప్పటి నుంచి నడక ఇష్టం. స్కూల్ నుంచి ఇంటికొచ్చే దారి ని చాలా ఎంజాయ్ చేస్తూ నడిచేదాన్ని. కానీ కొన్నేళ్లు ఆ ప్రశాంతత లేకుండా చేశారు ఈ ‘గ్యాంగ్’ లు. ఇది వేట లానే ఉంటుంది … ఒకరికి క్రీడ ఒకరికి ప్రాణాంతకం. ఒకే సారి వేటు పడదు… ప్రాణం పోదు. కొద్దికొద్దిగా అమ్మాయిల సహనం, ఆత్మగౌరవం, ‘మంచి పేరు’ చచ్చిపోతూ ఉంటాయి.
ఇంట్లో చెప్పుకొనేంత ఆరోగ్యకరమైన వాతావరణం ప్రతీ ఆడపిల్లకి ఉండదు. ధైర్యం చేసి ఇంట్లో చెప్పినా ‘నీ వెనకే ఎందుకు పడుతున్నాడు?’ అంటారు. నేను మాత్రం అమ్మ కి ఇంకో తలనొప్పి గా మారకూడదని ఇవేమీ చెప్పేదాన్ని కాదు. ఈ వ్యవహారాన్ని ‘ప్రేమ’ అని పిలవడం వల్ల అదేంటో తెలీకముందే విసుగొచ్చేసింది.
డాక్టర్ దగ్గరకెళ్ళి మన బాధని పేజీలు పేజీలు గా వివరిస్తే .. ఒక్క పదం లో ఆ బాధ పేరు చెప్పి.. రెండు లైన్ల లో మందు రాసిస్తారు చూడూ .. నువ్వదే చేసావు.
యే దర్ద్ కీ తన్హాయియాఁ …. యే దష్త్ కా వీరాఁ సఫర్
హమ్ లోగ్ తో ఉక్తా గయే .. అప్ని సునా ఆవార్ గీ
ఈ బాధల ఒంటరితనం … ఈ ఎడారి బాటన నిస్సార ప్రయాణం
మాకైతే విసుగొచ్చేసింది … ఆవార్ గీ, మరి నీ సంగతి చెప్పవూ??
******
నాకు ‘పెళ్లి వయసు’ రావడం పాతికేళ్ల క్రితం మాట. అమ్మ కి బంధువుల నుంచి బాగా ఒత్తిడి రావటం మొదలైంది. ఆర్ధికంగా పెళ్ళి తంతు నిర్వహించే పరిస్థితి లో లేదు అమ్మ. “మేం అందరం లేమూ? తలా కొంత వేసుకొని ఏ గుళ్ళోనో పెళ్ళి చెయ్యలేకపోమా?” అన్నారంతా. సంబంధాలు కూడా తెచ్చారు కొన్ని. అమ్మ నా దాకా ఆ సంబంధాలూ తేలేదు … నన్ను పెళ్ళి చూపులకీ కూర్చోనివ్వలేదు. ఆ సంబంధాల్లో నా పట్ల ఆప్యాయత కన్నా మా కుటుంబం పట్ల చులకనే కనపడింది అమ్మకి.
నేను బాగా చదువుకోవాలని నాకూ అమ్మ కీ ఉండేది కానీ డబ్బు లేదు. పెళ్ళంటే పర్సులు తెరిచిన చుట్టాలు చదువంటే తెరవలేదు. అమ్మ ఎలాగోలాగ నన్ను మంచి కాలేజీ లో చేర్పించింది.
అప్పుడు మొదలైన దూరాలు ఇంకా పెరుగుతూనే వచ్చాయి… అందుకు కారణం నేనింకా పెళ్ళి చేసుకోకపోవడం. కుటుంబ జీవనం చుట్టూ నిర్మించుకున్న సమాజం ఓ టీం గేమ్. ఇక్కడ ‘సింగిల్స్’ ఆడటానికి వీలు లేదు. పాతికేళ్ళ తర్వాత ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎలా ఉండాలో తల్లిదండ్రులకే ట్రైనింగ్ ఉండదు. పక్కింటి వాళ్ళకి, చుట్టాలకి అసలే ఉండదు.
గుళ్ళో పూజ చేయించుకోవాలంటే టికెట్ కి ఇద్దరు అంటే భార్యాభర్తే! పాపం మాకు తెలిసిన పూజారి గారు ఇరవై ఏళ్ళు ‘శీఘ్రమేవ’ దీవించీ దీవించీ ఇటీవలే ‘ఇష్టకామ్యార్ధ’ కి మారారు. తోటి స్నేహితుల పిల్లలకి కూడా ఇటీవలే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పెళ్ళి చేసుకొని ‘సెటిల్’ అయిపోవడం అనే భావన లోతు గా బలపడిపోయి ఉన్న సమాజానికి నేనంటే ఎప్పుడూ ఓ అస్థిర భావమే.
ఎడారి లో ఓ నగరం అదృశ్యమైంది. ఇంక మిగిలింది… ‘ఎవరూ నడవని బాట’. కావాలని ఈ బాట ఎంచుకోలేదు. అలా రాసి ఉంది. కానీ ఈ దోవ లోనే ఆత్మబలం పెరిగింది. ఆత్మవిశ్వాసం కలిగింది. వ్యక్తిత్వం వికసించింది. ఇక్కడ పక్కా రోడ్డు లేదు. కానీ ట్రాఫిక్ జామ్ కూడా లేదు. ఓ ప్రశాంతత. ఒంటరి తనానికి ఏకాంతానికీ తేడా తెలిసే మార్గం.
లోగోఁ భలా ఇస్ షెహెర్ మే కైసే జియేంగే హం జహాఁ
హో జుర్మ్ తన్హా సోచ్ నా లేకిన్ సజా … ఆవార్ గీ
ఎలాగయ్యా ఈ నగరం లో బ్రతకమంటారు? ఇక్కడ ఒంటరి గా ఆలోంచడం నేరమే … మళ్ళీ దానికి శిక్ష కూడా ఒంటరితనమే!
*******
నాకు పెళ్ళి మీద గౌరవం లేక ఒంటరి గా ఉన్నాననుకుంటారు. నాకు నవ్వొస్తుంది. పెళ్ళి మీద గౌరవం ఉంది కనుకనే చేసుకోలేదు అని ఎంతమందికి చెప్పను?
ప్రేమ లోని మృగత్వాన్ని మచ్చిక చేసుకొని తమ అధీనం లో కి తెచ్చుకోవడమే పెళ్ళి అనే పద్ధతి కి నాంది ఏమో? అలాగే వదిలేస్తే అదో అడవి జంతువు. వావివరసలు, సమయాసమయాలూ, హద్దులూ ఏవీ తెలీని ఓ విశృంఖల శక్తి. దాని మెడకో బరువు, ముక్కుకో తాడూ వేసి ఓ జత ని వెదికి … ఇద్దరూ ఏదైనా పనికొచ్చేది చెయ్యండని సంసారవ్యవసాయం లో కి దింపారేమో పెద్దవాళ్ళు. ఇదిగో … వీడ్ని ప్రేమించచ్చు. వీడు నీ కుటుంబానికి కూడా నచ్చాడు. వీడి తో నువ్వు ఏ హద్దూ పెట్టుకోక్కర్లేదు. వీడి తో నీ ప్రేమ కి ఓ గమ్యం ఉంది. అది పిల్లలైనా, ఇద్దరికీ సమానంగా ఉన్న ఆశయాలైనా. ఇలా పెళ్ళి ని డిజైన్ చేశారేమో.
పెళ్ళి మీద గౌరవం ఉంది కానీ నమ్మే ధైర్యం చెయ్యలేకపోయాను నేను. ప్రతి చిన్నారికి తల్లిదండ్రులే ఆదిదంపతులు… వారిని చూసే అభిప్రాయాలూ ఏర్పడేది. నాన్న నాకు పంచిన బాధ ఏంటో తెలిసిన నేను భర్త గా అమ్మ కి ఇంకెంత అన్యాయం జరిగిందో ఊహించడం కష్టమేమీ కాదు.
అలాంటి నాకు ఎదురైంది ఓ ప్రశ్న.
“నన్ను పెళ్ళి చేస్కుంటావా?”
ఇరవయ్యేళ్ళ నేను షాక్ అయి చూస్తున్నాను.
కాలేజీ ఆఖరి రోజున ఫేర్వెల్ పార్టీ లో అబ్బాయిలు, అమ్మాయిలు చీరలూ, సూట్లూ వేసేస్కుని సడన్ గా పెద్దరికం సంతరించేస్కున్నారు. తమ జీవిత భాగస్వాముల్ని కూడా ఎంచుకుని నిజమైన ‘ఇల్లాట’ ఆడటానికి రెడీ అయిపోతున్నారు.
నాలుగేళ్లు గా ఫ్రెండ్ అతను. అతని కళ్ళల్లో నా కోసం ఓ ప్రత్యేకమైన భావం నేను చూడలేకపోలేదు… కానీ ఇంత సీరియస్ అనుకోలేదు.
ఓ సగటు అమ్మాయి అతని ప్రస్తావన కి ఎగిరి గంతేసేది. అందంగా ఉంటాడు. గౌరవంగా సూటిగా అనుకున్నది చెప్పాడు. ఇంటికొచ్చి మాట్లాడతా అన్నాడు. ఇంకేం కావాలి?
నాకు మాత్రం అతని తో ఉంటే నా జీవితం ఎలా ఉంటుందో ఓ రీల్ లాగా కదిలింది కళ్ళ ముందు. ఉమ్మడి కుటుంబం అతనిది. ఒక్కగానొక్క కొడుకు. ఇద్దరు అక్కచెల్లెళ్ళు. నాకు కుటుంబం నుంచి అతన్ని పక్కకి తీసుకొచ్చే ఉద్దేశం లేదు. నేనే నలిగిపోవాలి. ఈ అబ్బాయిలు అమ్మాయిల్ని ప్రేమిస్తారు, అవసరమైతే కన్విన్స్ చేస్తారు కానీ తమ ఇంట్లో వారికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచరు. తన తల్లీ, చెల్లీ వైఖరులు ఎలా ఉంటాయో తెలిసినా తమకిష్టమైన అమ్మాయిని వారినుంచి రక్షించలేరు. అమ్మాయే సద్దుకుపోవాలని ఆశిస్తారు. అతని నుంచి ప్రోజోజల్ చాలా సింపుల్. తన కిష్టమైన అమ్మాయి రాక తో అతని జీవితం విస్తరిస్తుంది. అమ్మ ని ఒంటరిగా వదిలేసి, నా ఆకాంక్షల్ని వదిలేసి కుటుంబ బాధ్యతల్లో పడి నా జీవితం నాలుగ్గోడల మధ్య కుచించుకుపోతుంది.
ఇంత సద్దుకుపోయి ప్రేమకోసం ఉందామన్నా … సగటు ప్రేమికుడి ప్రేమ పొగడ్తల తో మొదలయి పెళ్ళాం మీద జోకులు తో సాగుతుంది. ఇంత ఇష్టపడి చేసుకున్న అమ్మాయి మీద ఆట్టే గౌరవం ఉండదు. ఉన్నా చూపించకూడదు అందరిలో. నాలుగేళ్ళు గా అతని మాటల్లో లీల గా మాల్ షావనిజం కూడా చూడకపోలేదు నేను.
అతను చెడ్డవాడు కాదు. అతను నాకు ఇద్దామనుకున్న ప్రేమ నాకు సరిపోదు అంతే. మనసులో ఓ మూల, ఓ సున్నితమైన స్థలం లో ‘అతను నన్ను ప్రేమిస్తున్నాడు!’ అనే మురిపెం లేకపోలేదు. పెళ్ళి కి అది సరిపోదు. అదే నా నిజం.
ఓ రెండేళ్ళు నన్ను కన్విన్స్ చేసాడు. నా ‘రాతి గుండె’ కరగలేదు. అతని హృదయం గాయపరిచిన చెడ్డపేరు నాకు మిగిలింది. కుదురైన కుటుంబాలనుంచి వచ్చిన మా ఫ్రెండ్స్ కి నేను అర్ధం కాలేదు. అతను నన్ను స్పెషల్ గా చూడటమే నాకు ఎందుకు సరిపోవట్లేదు అనడిగారు. ఇలా ఉంటే నీకు ఎవరూ నచ్చరు అన్నారు.
వాళ్ళకి చెప్పలేను. ప్రేమ అనే మైదానం లో కి నాన్న అనే ఓ హార్ట్ బ్రేక్ తో అడుగుపెట్టిన నాకు ఇంకో మగాడి వల్ల బాధ పడే ఓపిక లేదు. ఇంకో మగాడి కి నన్ను నిరాశపరిచే హక్కు ఇవ్వదలుచుకోలేదు. ఇలా ఓ గిరి గీసుకొని కూర్చున్నా నేను. కానీ వాళ్ళకీ నాకూ తెలీదు..! ప్రేమ ఎలాగైనా నన్ను చేరుకుంటుంది అని.
కల్ షబ్ ముఝే బే-షక్ల్ కీ ఆవాజ్ నే చౌన్కా దియా
మైనే కహాఁ తూ కౌన్ హై … ఉస్నే కహాఁ ఆవార్ గీ
నిన్న రాత్రి … ఓ నిర్ముఖ శబ్దం నన్ను ఉలిక్కిపడేలా చేసింది. ‘ఎవరు నువ్వు?’ అడిగాన్నేను … ‘ఆవార్ గీ’ అన్నావు నువ్వు!
*******
జీవితం లో ఒక్కో దశకం గడిచే కొద్దీ అన్నీ మారిపోతుంటాయి. ముందే చెప్పినట్టు గా ముప్ఫయిలు ఆడదానికి చాలా హాయైన వయసు. జీవితానుభవాల వల్ల అమాయకత్వం తగ్గుతుంది. ఇంకో వైపు కూడా ఒకింత నిరాశ కూడా ఆవహిస్తుంది. తమ రూపాన్ని తీర్చిదిద్దుకోవడం తగ్గుతుంది. పుట్టినరోజులు రహస్యంగా వచ్చి వెళ్లిపోతుంటాయి. పెళ్ళి, పిల్లలు కాక ఇంకే ధ్యేయం పెట్టుకోవాలో తెలియక భవిష్యత్తు ఏంటో తెలియక తమ నిర్ణయాల ని మళ్ళీ సరిచూసుకొనే వయసు.
నాకు మొదటి సారి ఈ వయసు లోనే నేను ఒంటరి గా ఉండిపోతానేమో అనే భయం కలిగింది. అమ్మ పెద్దదవుతోంది. “అమ్మ తర్వాత ఏంటి?” అనే ఆలోచన ఇష్టం లేకపోయినా బుర్రలో మెదులుతోంది. నాకది ఆలోచనే కానీ అమ్మకి … బెంగ.
ఈ బలహీనమైన క్షణం లో నా మనసు ని ప్రేమ కోసం మళ్ళీ తెరిచాను. సమయం మారింది. ఇప్పుడు పెళ్ళికే కాదు డేటింగ్ కి కూడా వెబ్ సైట్లు, ఆప్ లూ వచ్చేసాయి. డేటింగ్ సైట్లకి మాట్రిమోనియల్ సైట్లకి చాలా తేడా ఉంటుంది. డేటింగ్ సైట్లలో కలిసిన వాళ్ళు కొంత మంది పెళ్లి చేసుకున్నారు. నిజమే. కానీ ఈ సైట్ల లో ఒకమ్మాయి ని తన భవిష్యత్తు లో భార్య గా ఎంత మంది మగవాళ్ళు చూస్తారు? డేటింగ్ సైట్ లో ఉద్దేశాలు అనేకం… అక్కడ ఇద్దరి లో ఎంతో అయోమయం. ఒక డేట్ కి వెళ్ళి చూద్దాం అని మొదలయ్యే వ్యవహారం ఇద్దరి మనోవికారాల ని అనుసరించి ముందుకి సాగడమో.. ఆగడమో…. లాగడమో జరుగుతుంది. ఆ ఆఖరిది మరీ బాధాకరం. ప్రత్యక్షంగా ఇది నేను అనుభవించలేదు. తెలివి గల వాళ్ళు పక్కవాళ్ళ అనుభవాలనుంచి కూడా నేర్చుకుంటారు. అందుకే రెండు సైట్లకీ దూరంగా ఉండిపోయా నేను.
ఈ సమయం లో పరిచయమయ్యాడు అతను. ముందు గా అతని లో నన్ను ఆకర్షించింది అతని మృదు స్వభావం. తర్వాత అతని విలువలు. ఏ దురలవాట్లూ లేవు. మంచి సాహితీ సంగీత పిపాసి. మాటలు మీరడు. ఫెమినిస్ట్. కరకు అనుభవాల రాళ్ళ మధ్య మెత్తగా తగిలింది అతని ఉనికి అనే స్పర్శ. కలిసి పనిచేసేవాళ్ళం. అతని గురించి తెలుసుకోవటానికి చాలా అవకాశం దొరికింది.
అతని లాంటి మగవాళ్ళు ఆడవారికి ఓ సేఫ్ స్పేస్. ఎంతటి రాడికల్ విషయాన్నైనా చర్చించగలిగేదాన్ని. అతను మగవారి వైపు డిఫెన్సివ్ గా మాట్లాడింది లేదు. అర్ధం చేసుకోడానికి ప్రయత్నించేవాడు, ప్రశ్నలు అడిగే వాడు. అతను వేరే స్త్రీల పట్ల నాతో ఉన్నట్టే ఉండడం చూసి నాకోసమే ప్రత్యేకంగా నటించటం లేదని తెలిసేది. అతనికి పెళ్లయి పిల్లలున్నారేమో అని ఆరా తీసా అతని వెనక. నాకే నా ఈ వైఖరి కి నవ్వొచ్చేది. నాకు నేనే విచిత్రంగా అనిపించేదాన్ని. అవును.. ఇలా ముందెప్పుడూ లేను. ముందెప్పుడూ ఎవరూ నచ్చలేదు కదా మరి.
పరిచయమయి చాలా కాలమైనా తన పరిధి లో ఉండేవాడు. చనువు పెంచుకొనేవాడు కాదు. నేను మాత్రం నేను పెట్టుకొన్న కఠినమైన కమాండ్ మెంట్స్ ని సడలించడం మొదలుపెట్టాను. మొదటి సారి అతని బండి మీదే కూర్చున్నాను. అతనితో చెప్పలేదు కానీ సైలెంట్ గా చాలా ఆస్వాదించాను ఆ చిన్ని అనుభవాన్ని. ఒక సారి ఓ చోట ఓ ఉయ్యాల బల్ల వేసుంది. నేను ఊగుతుంటే అతను కూడా పక్కనొచ్చి కూచున్నాడు. అతనితో పంచుకున్న ఇంకో ఆంతరంగిక అనుభవం అది.
చాలా ఏళ్ళ నుంచి ఓ ఖరీదైన కోరిక ఉండేది. సినిమాల్లో చూపించినట్టు నాకే సొంతం అనుకున్న అబ్బాయి భుజం మీద తలవాల్చాలని. ఈ కోరిక తీరాలంటే అతనికి నా మీద ఎటువంటి ఉద్దేశం ఉందో తెలియాలి.
స్త్రీకి ప్రేమంటే ఎవరైనా ఇస్తే తీసుకొనేది. ప్రకృతి నియమం … మగవాడే మొదటి అడుగు వెయ్యాలి. ఆడవాళ్ళకి నచ్చినా మొదట బయటపడిపోకూడదు. ఈ అలిఖిత నియమానికి కట్టుబడి ఉండిపోయా నేను. కొన్నాళ్ళకి నా ప్రమేయం తో కాకుండా మాటల్లో పెళ్ళి టాపిక్ వచ్చింది. నేను కుతూహలం గా వింటున్నాను అతని మాటలు.
“నాకు పెళ్ళంటే భయమండీ” అన్నాడు. నేను నవ్వాను. ‘నాక్కూడా’ అనుకున్నా మనసులో.
“మా ఇంట్లో బాగా ఒత్తిడి చేస్తున్నారు. నేనొక్కగానొక్క కొడుకునై తప్పు పని చేశాను!” ఈ సారి నవ్వలేదు. ఎందుకంటే అతని మొహం సీరియస్ గా ఉంది.
“మీకొక విషయం చెప్పనా? ఇన్నేళ్ళూ స్వతంత్రంగా ఉన్నా కదా … నాకిష్టమైనప్పుడు అలా కొండల్లో, అడవుల్లో వాకింగ్ కి, డ్రైవ్ కీ వెళ్ళిపోతూ ఉంటాను. ఓ పుస్తకం పూర్తి చేసేవరకూ ఇంకే పని చెయ్యను. సాహితీ చర్చల్లో అసలు టైమే తెలీదు. ఫలానా చోటా ఫలానా ఫుడ్ బాగుంటుంది అంటే వెళ్లి తినేస్తాను. నాకిష్టమైన ప్రాజెక్ట్ ఏదో ఎంచుకొని చేస్తాను. ఆ డబ్బులు నాకు చాలు. ఎవర్నో పోషించే బాధ్యత నాకు లేదు. అందుకే మనసు చంపుకొని ఏ పనీ చెయ్యను. ఈ జీవితం నాకు ఇలా బాగుంది. పెళ్ళైతే ఇలా ఉండగలమా?”
మొదటి సారి అతని వైపు కథ వింటున్నాను నేను. పెళ్లి కి అతను ఎంత మానసికంగా సంసిద్ధం గా లేడో తెలిసిపోయింది నాకు. భర్త, తండ్రి… ఈ పాత్రల బాధ్యత తెలిసిన వాడు కాబట్టే తాను సిద్ధం గా లేనని నిజాయితీ గా ఒప్పుకుంటున్నాడు. ఒక వైపు ఈ నిజాయితీ నచ్చింది… ఇంకో వైపు నా సమాధానం దొరికింది. ఇంకో విషయం రూఢి అయింది. ఒక మగవాడు కావాలనుకుంటే మొదటి అడుగు అతనే వేస్తాడు. అతను వేయలేదంటే తనకే స్పష్టత లేదు.
మనసు చాలా బాధపడింది. ‘అడిగి చూడు… నీ కోసం అయితే మారతాడేమో’ అని ఓ చిన్న ఆశ కొట్టుమిట్టాడింది. ఈ లోపే నాన్న గుర్తొచ్చారు. అతను మారడు. నేను మారిపోతాను.. అమ్మ లా. ఇంకో చిన్నారి నాలా …. వద్దు వద్దు… అస్సలు వద్దు.
ఇంత మంచి అబ్బాయి తో కూడా నాకు రాసి లేదు అనగానే నాకు ఎందుకో ఇంక ఎదురుచూపులు చాలనిపించింది. నాకు నువ్వు చాలు అనిపించింది. అసలు నువ్వంటూ ఉన్నావని తెలిస్తే అసలు వీళ్ళ జోలికి వెళ్ళే దాన్నే కాదు!
ఎక్ తూ కె సదియో సే మేరా హందర్ద్ భీ హం రాజ్ భీ
ఎక్ మే కె తేరే నామ్ సే నా ఆష్నా ఆవార్ గీ
ఇన్నేళ్లు గా నువ్వు నా బాధలు పంచుకున్న సఖుడివి .. మనసు లో మాటలు చెప్పుకోగలిగిన ఆంతరంగికుడివి … మరి నాకో .. అసలు నీ పేరే తెలీలేదు!
*******
మగవారు తమ ప్రేమ కథలని నెమరువేస్కుంటుంటే మురిపెంగా చూసే ఇదే లోకం స్త్రీ తన గతం నెమరువేస్కుంటే ఆమె శీలాన్ని ప్రశ్నిస్తుంది. ఎంత విశాల భావాలూ/హృదయం ఉన్న భాగస్వామి కైనా మాజీ ప్రేమల గురించి చెప్పుకోగలమా? నీకు చెప్పుకోగలను. నువ్వు విని అపార్ధాలు చేస్కోకపోవడమే కాదు… నా లో ఆవేదనల తో సహా నన్ను ఆలింగనం చేసుకుంటావు. బాధ మరిపిస్తావు.
ఈ మానసరోవర మథనం లో ప్రేమామృతం పుట్టక ముందు … అదే .. నువ్వు కనిపించక ముందు … ప్రేమ ఇలా ఉంటుందని తెలియక ముందు .. ఈ విషపానాలు చేయాల్సివచ్చింది.
ఈ మథనం లో వాసుకీ నేనే … మందర పర్వతం నేనే … కూర్మమూ నేనే .. రాక్షసీ నేనే … దేవతా నేనే… నాలోనూ లోపాలున్నాయి.
దుర్భేద్యమైన నా ఛేదించుకుని ఎవరైనా వచ్చినా ఆ బంధం నేను నెరవేర్చగలనా? త్వరగా బోర్ అవ్వడం నాకో చెడ్డ అలవాటు. అదే మనిషి…. అదే స్వభావం… అవే అలవాట్లు… ఒక టైం దాటాక గానుగెద్దు తీరైపోయితుందేమో? ఈ మాట బైటికి అంటే? రోజుకొకడు కావాలా అని మళ్ళీ నా అరిటాకు క్యారెక్టర్ నే శంకిస్తారు. అలాంటివాళ్ళెవరూ ఉండరంటారు. ఇది మాత్రం నేనొప్పుకోను.
వాళ్ళకి నీ సంగతి తెలీదు, ఆవార్ గీ! గొప్ప రచన తన రహస్యాలన్నీ ఒకే సారి బైటపెట్టదు. నువ్వూ అలాగే. జీవితం లో ఒక్కో మెట్టూ ఎక్కే కొద్దీ ఒక్కోలా అర్ధమవుతావు. ఓ రోజు ఎంత ఆనందం అనిపించిందనీ! ముందు వినని సంగతులతో, చరణాలతో మళ్ళీ మురిపించావు నువ్వు.
ఇంకో భయం చెప్పనా? యవ్వనం లో ‘తప్పులు’ జరుగుతాయి అంటారు. నలభైల్లోని నిశ్శబ్ద విశృంఖలత్వం గురించి ఎవరూ చెప్పరు. ‘నిన్నింకా మర్చిపోలేదు’ అని తిరిగివచ్చే పెళ్ళైన ప్రేమలని నేను ఎంత కాలం అడ్డుకోగలను? పెళ్ళి అనే మొహమాటం వదిలేసుకొని ఓ తోడు కోసం సహజీవనం చేయడానికి ఎంత దూరం లో ఉన్నాను నేను? నా ‘యూ’ సర్టిఫికెట్ ప్రేమల్లో ఉన్న మోరల్ సుపీరియారిటీ నిజమా? అది నేను నాకే చేస్కుంటున్న మోసమా?
ఉస్ సమ్త్ వెహ్ షీ ఖ్వాహిషోఁ కీ జద్ మే పైమాన్ – ఏ – వఫా
ఉస్ సమ్త్ లెహ్రోఁ కీ ధమక్ కచ్చా ఘడా ఆవార్ గీ
ఆ వైపు విశృంఖల కోరికల తాకిడి కి డోలాయమానమవుతున్న నా ప్రేమ
ఆ వైపు అలల కల్లోలం … పచ్చి కుండ … ఆవార్ గీ
*******
ఇంటర్నెట్ లో అంతర్జాతీయం గా ఒక కొత్త ట్రెండ్ పుట్టింది ఆ మధ్య. ఆడవాళ్ళని అడిగారు ‘man or bear?’ … కారడవి లో ఒకరి తో ఉండాలని ఎంచుకోవాల్సొస్తే ఎవర్ని ఎంచుకుంటావు? ఓ మగాడినా? మృగాన్నా? అని. ఈ ప్రశ్న కి సమాధానం వినక్కర్లేదు. ఎంత మంది మృగాన్ని ఎంచుకున్నారో తెలియక్కర్లేదు. అసలు ఈ ప్రశ్న ని చూస్తేనే పరిస్థితి అర్థమయిపోతుంది. కదా?
స్వతంత్రులైన ఆడపిల్లలను పెంచిన ఓ తరం తల్లి తండ్రులు … ఆ ఆడపిల్లల తో కలిసి నడవగలిగే మగ పిల్లల్ని మర్చిపోయారు అని ఎక్కడో చదివాను.
కారడవి సంగతి తెలీదు కానీ నా జీవితం లో మాత్రం నిన్నే ఎంచుకున్నాను. నీ లో ఇంకా ఎన్నో రహస్యాలున్నాయి అని తెలుసు … అందులో నన్ను బాధపెట్టేది లేదు అని కూడా నమ్మకం. నా లాగే ఎంత మందిని ఇలా మురిపించావేంటి? అని అనుమానించాల్సిన పని లేదు. నువ్వో అపురూప సృష్టివి. నిన్ను ఎంత మంది తెలుసుకుంటే అంత ఆనందం నాకు. నన్ను మోసం చేస్తావన్న భయం లేదు.
ప్రేమ అంటే ఇరువురు మమేకం అవ్వడమే అంటారు … మనిద్దరం అవ్వలేదా? శబ్ద తరంగాల రూపం లో కర్ణాల తో మొదలైన నీ స్పర్శ … కూనిరాగంగా నా పెదవులని, కంఠాన్ని చేరలేదా? తన్మయత్వం తో కళ్ళు అర్ధనిమీలితాలవ్వలేదా? అంతర్లీనంగా సాగుతున్న నా అలజడుల్ని నువ్వు సరిగ్గా అర్ధం చేసుకున్నప్పుడు ఎవరికీ అందని నా లోని లోతుల్ని నువ్వు స్పృశించలేదా? నాకు నడక ఇష్టం అని నీ ‘చరణాలు’ నా చరణాల తో జత చేసి నడిచావు. నా ఖరీదైన కోరిక నీ తో తీరింది. ప్రపంచం లోని ప్రేమ లేని తనం మనసు లో గుచ్చుకున్న రోజుల్లో నీ భుజాల మీద వాలి సేద తీరాను. నాకు నువ్వో పాటవీ, కవితవీ కావు … సంపూర్ణమైన ప్రేమ స్వరూపానివి. నాది శ్రవణ ప్రేమ!
నేను పడిన బాధలకి అక్షర రూపానివి. ఆ బాధలన్నీ క్షమించేసాను …. నిన్ను అర్ధమయ్యేలా చేసినందుకు. నేను ఒంటరిగా ఎందుకుండిపోయా అని అడిగే వాళ్ళకి రెండు విషయాలు తెలీదు. నిన్ను మించిన దైతే గానీ ఏ ప్రేమా నాకొద్దనీ… నువ్వుండగా నేనసలు ఒంటరినే కానని.
కల్ రాత్ తన్హా చాంద్ కో దేఖా థా మేఁ నే ఖ్వాబ్ మే
‘మొహసిన్’ ముఝే రాస్ ఆయేగీ షాయద్ సదా అవార్ గీ
నిన్న రాత్రి కలలో ఒంటరి చంద్రుణ్ణి చూసాన్నేను. మొహసిన్ … ఇంక మనకి ఈ ఆవార్ గీ నే సరేమో!

సౌమ్య నిట్టల
చదువు: ఎం. ఏ ఇంగ్లీష్ లిటరేచర్, కర్ణాటక సంగీతం లో డిప్లొమా. ఇంద్రగంటి మోహనకృష్ణ గారి ‘అష్టా చమ్మా’ మరియు తనికెళ్ళ భరణి గారి ‘మిథునం’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం. షార్ట్ ఫిల్మ్ మేకర్ గా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు, స్వయంగా రాసి దర్శకత్వం వహించిన ఇంగ్లిష్ నాటకాలకి అవార్డులు, మంచి సమీక్షలు.
సా పా సా అనే సంగీత పరమైన యూట్యూబ్ ఛానెల్ (సోదరి తో కలిసి), సౌమ్యవాదం అనే బ్లాగు నిర్వహణ. కథా రచయిత్రి గా పలు ప్రముఖమైన పత్రికలో కథా ప్రచురణలు.

సౌమ్యా నిట్టల గారి కథ ప్రియమైన ఆవార్గీ చాలా బాగుంది. ఒక అమ్మాయి అంతరంగాన్ని, బాల్యంలో మనసుకు తగిలిన గాయాలని, ప్రేమని వెతికే క్రమంలో పడే సంఘర్షణని ఆసక్తికరంగా కథలో ఇమిడ్చారు. “కుటుంబ జీవనం చుట్టూ నిర్మించుకున్న సమాజం ఓ టీం గేమ్. ఇక్కడ ‘సింగిల్స్’ ఆడటానికి వీలు లేదు”.”పెళ్ళి చేసుకొని ‘సెటిల్’ అయిపోవడం అనే భావన లోతు గా బలపడిపోయి ఉన్న సమాజానికి నేనంటే ఎప్పుడూ ఓ అస్థిర భావమే” వంటి వాక్యాలు కథనంలో మెరుపులు మెరిపించాయి!ఒక గజల్ చుట్టూ కథను అల్లటం వినూత్నంగా ఉంది. గజల్ ప్రేమికులకు మరింత నచ్చే కథ! అభినందనలు!
Thank you very much!
కథలో ఎన్నో జీవిత సత్యాలు వెన్నెల్లో నీటి అలల్లా తళతళలాడాయి. కథతో పాటే ప్రయాణించినంతసేపూ చల్లని ఏకాంత విహారం చేసిన అనుభూతి. సూటిగా మనసులోకి చొచ్చుకుపోగల చక్కని శైలి మీది. అభినందనలు!
Thank you very much!
Narration chaalaa baagumdi
Its good story