నాన్న గురించి ఎప్పుడూ మరిచింది లేదు. చిన్నప్పుడు మా అమ్మను కొడతడని కోపం ఉండేది. ఆయన కోపం కూడా భయంకరమైన కోపం. వాళ్లిద్దరూ తగవుపడితే అదొక రణరంగం. అదొక బీభత్సం. ఇల్లంతా బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన స్థితి. మా చెల్లెలు బుజ్జి పుట్టేదనక ఈ తీవ్రత ఉండేది. సినసిన్నంగా తగ్గింది. మా అమ్మ నోరుకూడా పెద్దదే. ఏడా తగ్గేది కాదు. ఏడా ఆగేది కాదు. భీకరంగా ఉండేది. ఆ గొడవలకు ఊరు మొత్తం మా ఇంట్ల ఉండేది. పెద్ద పెద్ద అరుపులు, ఏడ్పులు. శోకాలు.
గుండెలు పగిలిపోయేట్లు ఉండే పరిస్థితి.
‘కొట్టినచోట కొట్టకుండా కొట్టిండు మీఅబ్బా’ అంటుండేది. ఆ బీదరికం, మాటపట్టింపులు, అలుగుళ్లు, ఆప్యాయతలు, చీకాకులు, చీదరింపులు ఎప్పుడూ నిమ్మలంగా ఉండేది కాదు. పిల్లలం బిక్కుబిక్కుమనుకుంటా ఉండేవాళ్ళం.
వ్యవసాయం, కిరాణా కొట్టు – అంతా బాగున్నట్టున్నా అన్నీ అరకొరగానే ఉండేవి. సక్కనైన బట్టలు కానీ, సక్కనైన సదుపాయాలు కానీ పిల్లలకి అమిరేడివి కాదు. తిండికి ఫర్వాలేదు. ఉంటానికి గూడుకు పర్వాలేదు. చదువుకోసం ఖర్చుపెట్టగలిగిన స్థితి ఉండేది కాదు. ‘ఎంత సంపాదించిన, రెక్కలుముక్కలు చేసుకున్నా మీ పొట్టలు నింపడానికే సరిపోతుంది’ అనే మాటలే ఇంట్ల ఎప్పుడూ విన్పించేవి.
ఎవరూ ఖాళీగా కూచున్నది లేదు. ఎవరికీ కూకొని తినే పరిస్థితీ లేదు. పిల్లలం పదో తరగతి చదువుకునేలోపల కేవలం చదువుకుంటూనే గడిపాం అని కాదు, అన్ని పనులు, చెప్పిన పనులు చేసేటోళ్లం – పొద్దుగాల బుగ్గవాగునుంచి నీళ్లు మొయ్యడం, గడ్డికోయడం, పొద్దున్నే చేలకు పిట్టల్ని తోలడం కోసం మంచెలెక్కి పిట్టకావలి చేయడం, గొడ్ల కొట్టంల పెండ ఎత్తడం, పెంటకుప్పదాకా మోసి వేసి రావడం, వాకిలి ఊడవడం – ఈ పనులు మా పిలగాండ్లకు ఎవరికీ తప్పలేదు. తర్వాత కాలంలో జీతగాళ్ళు వచ్చినా ఎప్పుడూ రికాముగా కూచున్నది లేదు. స్కూల్ టైం వరకు పనులు చేయాల్సిందే. ఆ తర్వాత కొన్ని మేకలు వచ్చాక అవి మేపేటోళ్లు కుంపు పెడితే, స్కూల్ కు డుమ్మా కొట్టాల్సిందే, మేకలు కాయాల్సిందే. గొడ్లు కాయడం కూడా తప్పలేదు. నాట్ల రోజుల్లో పొలంల సాయం చేయడానికి దుగాలు చెక్కడం, దుగాలు అలకడం, నారు కట్టలు అందించడం, గడ్డిమొట్లు బురదలోకి తొక్కడం, మళ్లీ బీళ్ళల్ల నాగళ్ళు ఇప్పినంక ఎడ్లను రాత్రి పదింటిదాకా సందపూట మేపకరావడం – చదువు రోజుల్లో ఉత్త చదువే కాదు, ఈ పనులూ కలగలిసి సాగేది. పల్లెటూళ్లనుంచి వచ్చే పిలగాండ్లకు ఎవరికీ ఇవి తప్పవేమో, ఎవరో కొద్దిమందికి తప్ప.
ఈ మొత్తంల మా నాయిన మీద,అమ్మమీద సిన్నతనంల లోపల కోపంగ ఉన్నా -కొద్దిసేపన్నా కూసోనీయరు అని. తర్వాత అర్థం అవుతూ వచ్చింది అట్లా కూసోనీయకుండా పనులు చేయించడం వల్లనే ఈ లోకంల నిలబడ్డానికి అప్పట్లనే తర్ఫీదు ఇచ్చింరని. తర్వాత రోజుల్ల ఎక్కడికిపోయినా ఆ కష్టం చేసే అలవాటు పనికివచ్చింది. అందుకే మా అబ్బ, అమ్మ అంటే ఇష్టం. వాళ్ళున్న స్థితిల అట్లా తప్ప ఇంకోలాగా పెంచలేరు. వాళ్ళూ ఎక్కడా కూసున్నది లేదు, మమ్మల్నీ కూసోనీయలేదు.
పరుగులాంటి జీవితం. బాల్యం. విశ్రమించని బాల్యం. విరామమెరుగని బాల్యం. కనాకష్టపు అరకొర బాల్యం.
అయినా గర్వంగా చెప్పుకోగలిగిన బాల్యం.
కవిత్వం రాయడం మొదలుపెట్టాక ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో కవిత్వంలోకి తీసుకొచ్చే పని చేసాను. చాలానే ఉన్నాయి. అందులో 2000 సంవత్సరంల రాసిన ఈ కవిత ఒకటి. ‘సరిహద్దురేఖ’సంపుటిలో ఉంది.
