” ఎక్కడైతే స్వేచ్ఛ ఉండదో అక్కడ కవిత్వం రెక్కలు చాస్తుంది, సంతోషం కన్నా దుఃఖ సమయాలలో వ్రాయబడ్డ అక్షరాలు ఎక్కువగా వెంటాడుతాయి “
ఇవి ఓ గాయపడ్డ అనామకుని ఆత్మగీతంలోని వాక్యాలు. ఈ పుస్తకం ఓ దగ్ధ హృదయాన్ని పరిచయం చేస్తుంది మనకు.
నిరాశ నిస్పృహల మధ్య వేలాడే బేతాళుడు ని భుజానమోస్తు తిరిగే విక్రమార్కుడు ఈ కవి
ఉన్మత్తావేశాలని, కరుడుగట్టిన నీలి రక్తపు మరకల్ని అంటించుకున్న దేహానికి ఊరడింపుగా ఓ తెగిపడిన సీతాకోక రెక్కలోని రంగులని చొక్కాకు పులుముకున్న పసి బాలుడి హృదయం ఈ కవిత్వం.
కాళరాత్రుల మధ్య నిదురపోలేని మానవాత్మ ఈ నగరపు వీధుల్లో తిరుగుతూ మానవత్వపు వేదనాలాపనకి వెన్నెల రాత్రులని సముద్రపు అలల తాకిడిని, ఆకాశం కింద ఓ చుక్కల ఊయల కట్టి యుద్దోన్మాదాన్ని ఎన్ని రకాలుగా ఈ భూమి పైకి విసిరి వేయబడుతుందో అంటూ ఓ విషాద గీతాన్ని ఆలపిస్తాడు ఈ కవి.
అర్ధరాత్రులు నిషాచర గీతమై నగరసంచారం చేస్తూ ” మెట్రో పిల్లర్ కిందనో, బస్సు అద్దం పక్కనో ” ఓ కవిత్వంగా అక్షరాల్లో కుప్పకూలిపోయే నరేష్ కుమార్ సూఫీని ఈ కవిత్వం లో చూడొచ్చు.
ఫేస్బుక్ వాల్ మీద నరేష్ రాసే కవితలు చదవడం అలవాటే.. అప్పుడు కలగని ఎదో అసంకల్పిత గగుర్పాటు అన్నీ కవితల్ని ఒక దగ్గర చదివినప్పుడు కనిపిస్తుంది.ఈ భయం ఎదో జరిగిపోతుంది అని కాదు..ఈ కవిత్వంలో ఎక్కడో కూరుకుపోయి మనల్ని మనం మార్చిపోతామేమో అనుకునే అంతలోనే వొ భరోసా వాక్యంమై నిలబెడతాడు.
వొ గమ్మత్తయిన అనుభూతి కలుగుతుంది మనకు అందుకు కారణం. అతనిలోని “పద సంపద” . ఈ పదాలు మనకోసం ప్రతీ కవితలో ఒక కొత్త వాతావరణాన్ని పట్టి తెస్తుంది. ఇంత పద సంపద ఎలా కూర్చుకున్నాడో కానీ ఆ పదాలలో
మూడ్ స్వింగ్స్ ని కవిత్వంగా మార్చడం, ఈ కవిత్వం లో ఇమేజ్నరీస్ అన్నీ కూడా మనల్ని ఓ కొత్త లోకానికి పంపిస్తూ ఉంటాయి.
నిర్ణిద్రలో ఒంటరి తనాలని అనుభవిస్తున్న కాలాన్ని పరిచయం చేస్తూనే అమ్మ కొంగులో భరోసాని చుట్టుకొచ్చి కవిత్వమై తేలుతాడు నరేష్.
ప్యాండమిక్ కాలంలో, నిర్మానుష్య వేదనలలో గాయపడ్డ హృదయాలని పరిచయం చేస్తాడు. సున్నితమైన హృదయాన్ని చిదిమివేసే కలల్ని కన్న కాళరాత్రుల నుండి మేలుకొల్పి కూర్చోబెడతాయి.
అంతలోనే తెగిపడిన సీతాకోక రెక్కల్లో ఈ సమాజపు చీకట్లను వెంటాడే సంఘంలోని కలుషిత మనుషుల్ని ప్రశ్నిస్తూ ఆ గొంగళిపురుగు గా నేనెందుకు మిగిలిపోలేకపోయానని తల్లడిల్లెలా చేస్తాడు.
ప్రేమగా అల్లుకుపోయే ప్రేయసి నుండి దూరమైనప్పుడు, వెన్నంటి వచ్చే ప్రకంపనలతో అల్లాడినప్పుడు ఇద్దరి మధ్య ఆగిపోయిన మాటల్ని విప్పి మాట్లాడలేకపోయిన సందర్భాలని పంచుకునే సమయాలు రెప్పల తడి అద్దుకోని పాఠకుడికి కాస్త విరామం కోరుకునేలా చేస్తుందీ కవిత్వం.
అంతేనా.. ఈ కవిత్వం కాశ్మీర్ నుండి నువ్వు నిలబడ్డ నేల వరకు
నీది అయినది ఏమిటి?
కానిది ఏమిటి?
ఈ సమయంలో ఈ నేల పై, నీ యుద్ధం దేనికై చేస్తున్నావని ప్రశ్నిస్తుంది. ‘విద్రోహి’గా నీ భయాన్ని వేలెత్తి చూపిస్తుంది.
అంతిమయాత్రల్లో, ఉద్యమ గీతాల్లో తేలి ఆడుతున్న సమయాల్లో మనిషి తత్వానికి ఏ నిషిద్ధ ఫలాన్ని తినిపించావో అంటూ యుద్ధమై రెప్పల వాకిట ఓ యుద్దోన్మాదం వచ్చి వాలుతుంది.
అంతేనా ఈ కవిత్వంలో గాయపడ్డ హృదయ గీతాన్ని పాడే పాటగాడుంటాడు. నీలిరంగు కళ్ళు పులుముకున్న మనుషుల్ని, నల్లరంగు కోయిలల్ని, పిడికిట పట్టుకున్న మట్టిలోని స్వేచ్ఛానుభవాన్ని, ప్రేమను పంచిపెట్టే అమ్మ, గాయం చేసిన ప్రేమ, ప్రియురాలి కళ్ళలోని నిజాయితీ, ఓడిపోయిన దివా రాత్రులు, భరోసానిచ్చే భుజాలు, ఊపిరి సలపని రాత్రికి వెన్నెల తిరిగి నిద్ర పుచ్చే సమయాల్ని, యుద్దానంతరంగాన్ని ఛేదించే వొ సైనికుడి ఆర్తనాదాన్ని వినిపిస్తుంది నరేష్ కవిత్వం…
చదివి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి
పుస్తకం పేరు
“అనామకుని ఆత్మగీతం”
కవి -నరేష్ కుమార్ సూఫీ.
