మీరు మిగుల్చుకున్న వాక్యాలు మా ముంగిట్లో వాలాయి. మనసును స్పృశించాయి. కాలం ప్రవాహమే…జీవితం నదమే…ఆ కాల ప్రవాహంలో కలిసిపోయే జీవన క్షణాలను అక్షరాల్లో ఒడిసిపట్టి ఒక రూపదర్శిణిగా చదువరులకు అందించేదే కవిత్వంలోని ఒక పార్శ్వం…అందులో మీరు విజయం సాధించారు.
ఆమె గురించి వివిధ కోణాల్లో విరచించిన వైనం బాగుంది. పచ్చి గుండెను తవ్వి చూడకు అని గుచ్చి చెప్పారు. తప్పొప్పుల లెక్కల్లో చిక్కిన ఆమెకు శాశ్వతాశాశ్వాతాల మధ్య ఖాళీ కనిపించనంతగా మిగిలిపోయి, గుండె దాటి హిమపాతాలవుతున్న క్షణాలు కళ్ళకు కనిపింప చేసారు. పసిబిడ్డ నోట కరిచిన చనుమొనలకు నలుగురి చూపు తగిలినా, చారల మరకలు మెలిపెట్టినా, తన వంటి నొప్పిని మరిచి మనకు నొప్పినంటకుండా పెంచిన అమ్మను చూపారు. కల్తీ చేసిన పుట్టతేనె లాంటి జీవితం…రంగులు మాసిన సీతాకోకచిలుకలు…కనిపించిన జీవన ఖననం చూపించారు. ఆత్మీయ బంధమో…ఆత్మ బంధమో…అలా స్పృశించి…ఆ మిగుల్చుకున్న వాక్యాన్ని పరిచయం చేసారు. సమాజారణ్యం…క్రూరత్వావాహం…మొద్దుబారిన యువబాణాలు…పబ్బుల మబ్బులు…చీకటి దిబ్బలు…వాలిపోతున్న పెద్దరికం రాలిపోతున్న ఆకుల చందం…శూన్య శోధన…మిగిలిన రోదన కళ్ళకు కట్టినట్టు చూపించారు.
ఊహకందక ముందే మెడకు తగిలించిన ఉచ్చుతో (బాల్య వివాహం) బంధాల మాయలో బందీ అయిన ఆమె ఓ టైం టేబుల్ అని బాధాతప్త హృదయంతో భావావేశాన్ని కనిపించారు. గతం గుర్తుకు రాని గమనం లేదు. గమనాన్ని ఆపిన గతం లేదు. నిశ్శబ్దం వెనుక నిరీక్షణ ఉంది…నినాదం ఉంది…అని వినిపించారు. మగువ మేనుపై చర్చ …ఆడపుటకపై రచ్చ…చూసీ చూడలేక ఆవిరైపోతున్న కాలం…సాక్ష్యం కాలేని వైనం…రన్నింగ్ కామెంట్రీ…వాడి పోతున్న బంధాల ట్రీ…అడిగేసారు…కడిగేసారు…బతుకు నడకలో అలసిన కళాజీవి నిదురను త్యాగం చేసి తన
కళలను వెలిగిస్తాడని నిద్దుర దొంగిలించబడింది కవితలో చక్కగా చెప్పారు. నడిచే యంత్రాలే మనుష్యులు! పుట్టిన మట్టికి లేని మతం…ఛాందసం…మానవులకెందుకో? ప్రశ్నలో సంగతి ఉంది…ఆడపిల్లల స్వేచ్ఛను నియంత్రించడంపై కాగడాలై నిగ్గదీయాలని ఇచ్చిన పిలుపు సమర్థనీయం. అందుకే కాసింత ధైర్యాన్ని పుట్టిన మట్టిని బదులడిగారు రూప గారు. రణం మరణమై దారుణీకృతమవుతుంటే…సరిహద్దుల పద్దులపై యుద్ధాల కార్చిచ్చుల్లో సామాన్యులు…పిల్లలు…అతివలు…బలవుతున్నారన్న ఆవేదన…ఆక్రోశం … అర్థసహితం. సామాన్యుని దేవుళ్ళు కూడా సామాన్యమే…ఆడంబరాలు…ఆర్భాటాలకు దూరమని చెప్పిన సహజత్వానికి స్వాగతించాలి. ఉత్తరం ఉనికి ఏమైందో … మార్పుకు బలయింది మరి…కలకాలం ఉండాల్సిన ప్రేమలు కౌలు ప్రేమలవుతున్నాయని బ్రేకప్ చెబుతుంది.
బోసిపోయిందన్న ఆమె నుదురు ఆకాశమంత విశాలమైన కొత్తదారి. ఉన్న సమస్యను చూడలేని…కొత్త సమస్యలను సృష్టించే నవ రాజకీయాన్ని చూపించారు. నిజాల ప్రమాదాలు…ఇజాల నినాదాలు…చెరసాలకు చేరుస్తున్న ఈనాటి మాటను నిజంగానే చెప్పారు. ఆనాటి ఆమె కథలు వీర సుగంధాలు…ఈనాటి ఆమె మాటలు సంప్రదాయ బందీలు…పన్నలు…అధిక ధరలు…పేదోడి ఆకలి మంటల కొలమానాలు…అవి పెరుగుతుంటే ఇవీ పెరుగుతున్నాయి…ఎంతెగిరినా జాతీయ పతాకం…ఆపలేని జాతి పతనం…కనబడిన ఆమె కథనం…నచ్చింది. విరిగి పోయిన మనుషులు…కరిగిపోయిన బంధాలు…ఇప్పటి కన్నీటి శకలాలు…రేపటికవి పిరమిడ్లు. మనిషికిప్పుడు ఎక్కడుంది స్థిమితం…అంతా గతం…అర్థం కాని స్వగతం…ఆమెకే నొప్పులు…సమాజానికవే ఒప్పులు…కనబడవెవరికీ ఈ తప్పులు…అంతర్థానమవక ఏమవుతుంది ఆమె…మరి సమాజం నిలబడగలదా ఆమె లేక? నిన్న ఆమె పచ్చని మాగాణి…మాట స్వచ్ఛమైన చినుకు…ఎందుకో కినుక సమాజానికి…ఇప్పుడు ఆమె గాయాల మాను…ఎండిపోయిన చేను…కీచకాగ్నిలో కాలిపోతున్న నగ్న సింధూరం…శిథిలమైన నవ్వుల్ని వెదుకుతున్న ఆమె నిసర్గ…ఆమెకు ఆమే లేపనం…ఓర్పుకు ఉపమానం…కట్టుబాట్ల కట్టడిలో బానిస ఆడదాని శ్వాస అని తన వాదం వినిపించారు అద్దం అబద్ధం లో…ఆమె కవిత్వానికి నిర్వచనం సామాన్యడికి అర్చనం..ఆమె ఊపిరి పోసే ఆక్సిజన్ మాస్క్ ఆకర్షణల సునామీల్లో…ఆమెకు ఆమె మీద నమ్మకముండాలని చెప్పడం బాగుంది…
యుద్ధాలు, ఎన్నికలు, విభేదాల విస్ఫోటనాలు, కులమతాల కుళ్ళులు…ప్రస్ఫుటంగా మనిషితనాన్ని మాయం చేసాయనడం అతిశయోక్తి కాదేమో! సనాతన పంజరాలు…సామాజిక కట్టుబాట్లు…రాధామనోహరాలే ముళ్ళతీగలు…వెన్నెల లేని ప్రేమలో సెగలు…ఆమెకు ఆశలు…ఆశయాలు…అభిమతాలు…ప్రశ్నలే…సమాజం అక్కో, అన్నో, తోడో…కాదు … నక్క…తన ఊళల్లో ఆమెకు మరణ రాగం పాడుతుంటునే ఉంటుంది…మా ఇంటి డాబా తడవలేదు కాని మా ఊరి రోడ్లు నిండిపోయాయి వానకు…ఊరు మారిందో…మార్చబడిందో అభివృద్ధి పేరుతో…బాగా వాస్తవీకరించారు.
మనసు పూలతోటకు మాటల నీళ్ళివడం మర్చిపోతే నీరింకిన గుండెల్లో దిగులు గూడు మిగులుతుంది. ఈ వాక్యాలు బంధాల బాకాలు…మనిషికి సకలాలు.
ఏ పేజీ చూసినా అండం దగ్గరినుండి ఆమెగా ఎదిగేంతవరకు ఆమె గురించే రూపా వాదం… తన పద వాదం…మనుభేదం దాటి చెప్పిన స్త్రీ వేదం…
For Copies