బానిసలూ! జిందాబాద్

Spread the love

నం ఒట్టి వెధవాయలమోయ్’ అని సూత్రీకరించారు గురజాడ అప్పారావు. పాత్ర ద్వారా పలికించిన మాటే అయినా ఇది అక్షరసత్యం. బహుశా గురజాడ వారికి కూడా వ్యక్తిగతంగా ఈ అభిప్రాయమే ఉండి ఉంటుంది. రచయిత మనసులో లేకుండా ఆ మాట పైకి ఉబకదు కదా!మన ఈ ‘వెధవాయితనం’ ఏళ్ళూ పూళ్ళూ గడుస్తున్నా నానాటికీ బలపడుతుందే గానీ పలచబడటం లేదు. మరి మనం సాధిస్తున్న పురోగతి ఏమిటి?

మనం స్వతంత్రుల అనుకొని మురిసిపోతున్నాం. భ్రమల్లో బతికేస్తున్నాం.బ్రిటిష్ వాడిని తరిమికొట్టి స్వతంత్రులమయ్యామని జబ్బలు చరుచుకుంటున్నాం. కానీ వాస్తవంలో మాత్రం బానిసలుగానే బతికేస్తున్నాం.

మనమంతా టెక్నాలజీకి, సిద్ధాంతాలకు, దేవుళ్ళకు, బాబాలకు, గురువులకు, బాసులకు కట్టు బానిసలం. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని సిద్ధాంతీకరించేసుకున్నాం. అడుగడుగునా ఏదో ఒకరూపంలో మన బానిసత్వం పొంగి పొర్లుతూ నడుముల్ని మరింతగా వంచేస్తుంది.

మనకు స్వతంత్ర వ్యక్తిత్వమంటూ లేదు. మెదడుకు ఆలోచించే శక్తి ఒకటుందని, దాన్ని ఉపయోగించుకోవచ్చని ఎన్నడూ తోచదు. చాలా సందర్భాల్లో బాసో, యజమానో చెప్పినట్టే చేసేస్తాం. వాడి కరుణాకటాక్షాల కోసం ప్రతిక్షణం వెంపర్లాడతాం. అందులో ఎవడైనా బుర్రతో ఆలోచించి, ‘ఏమిటీ అన్యాయం? ఇంకెన్నాళ్ళీ దుర్మార్గం’ అని గొంతు విప్పితే మనలో ఎక్కడలేని బానిసత్వం టన్నులకొద్దీ కట్టలు తెంచుకుంటుంది. ప్రశ్నించినవాడిని విప్లవకారుడని ముద్రవేసి తుదముట్టించాలని చూస్తాం. మనకు మనం ఆ పని చేయలేకపోతే బాసుకు వీరవిధేయంగా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ స్వామి భక్తి పరాయణత్వాన్ని నిరూపించుకుంటాం.

కార్మికరంగ చరిత్రలో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువగా నమోదు కావటానికి మన బానిసత్వ భావజాలమే మూలమన్న సంగతిని గుర్తించం. ఇప్పుడు సమ్మెలన్న మాటే విన్పించదు, కన్పించదు. కుటుంబాల గోడు పట్టకుండా వారానికి వంద గంటలైనా తల ఎత్తకుండా పనిచేయటానికి సిద్ధమైపోతాం.

బ్రిటిష్ వాడు తమకు కావలసిన గుమాస్తాలను తయారు చేయటానికి మెకాలే మాటున బానిస విద్యావ్యవస్థను అమల్లోకి తెచ్చాడని గొంతుచించుకుని అలిసిపోయాం. కానీ ఇప్పటికీ మన స్వతంత్ర వ్యక్తిత్వాన్ని పెంచుకుని, బానిసత్వం నుంచి బయటికొచ్చి మన కాళ్ళ మీద మనం నిలబడటానికి ఏ రకం చదువులు కావాలో ఆలోచించం. అప్పుడేమో బ్రిటిష్ వాడి సేవలో తరించి జీవితాన్ని ధన్యం చేసుకున్నాం. ఇప్పుడేమో అమెరికా డాలర్ల వేటలో సాఫ్ట్ వేర్ గుమస్తాలుగా తరించటానికి ఆ దేశానికి క్యూలు కడుతున్నాం. ట్రంప్ గారు ఛీత్కరించుకుంటున్నా అమెరికా చూరు పట్టుకుని వదలనంటున్నాం. పైగా అమెరికా పోయి బానిసలుగా బతక్కుండా మన దేవుళ్ళనూ ఎక్స్‌పోర్ట్ చేశాం. మన రుచుల బలహీనతలనూ వదులుకోలేకపోతున్నాం. మన బానిసత్వాన్ని మనతోనే అంతమోందించకుండా వారసత్వంగా కొనసాగించేందుకు ట్రంప్ గారి గడువులోగా ఆ గడ్డ మీద ప్రి మెచ్యూర్ బిడ్డలకైనా జన్మనివ్వటానికి ఆరాటపడుతున్నాం.

పెట్టుబడిదారుకు బానిసలంటే రవ్వంత గౌరవం ఉండదు. పైగా అవసరం తీరాక తోసేయటానికి పధకాలు చేస్తుంటారు. కృత్రిమమేధ పేరుతో శ్రమజీవులంతా తమ కొమ్మను తామే నరుక్కుంటున్నారు. రేపు రోబోలతోనూ పోటీపడి పని చేయగలమని సాగిలపడటానికి వెనకాడకపోవచ్చు.

మన డొల్లతనాలనుంచి, బానిస బుద్ధి నుంచి ఎప్పుడు బయటపడతామన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్

బానిసలూ! జిందాబాద్.

గోవిందరాజు చక్రధర్‍

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *