ప్రతి వాటికీ కొన్ని ముందు సంకేతాలుంటాయి. పైరగాలి పిల్లగాలిగా మనసును గిలిగింతలు పెడుతుంటేనూ,సృష్టిలోని ప్రతిదీ మహాద్భుతంగా కనిపిస్తుంటేనూ యుక్తవయస్సు పరవళ్లు తొక్కుతోందని అర్థం.
పత్రికనో, పుస్తకాన్నో లీనమై చదివేస్తుంటాం. మధ్యలో ఎక్కడో ఒక వాక్యం దగ్గర చూపులు నిలుస్తాయి. కళ్లలో నీళ్లు చిప్పిలుతాయి అది బాధా కావచ్చు, భరోసా కావచ్చు. డబ్బు మదంతో కొవ్వెక్కిన పెత్తందారుపై కసీ, కోపం కావచ్చు.
‘అలాంటోణ్ణి నరికి చంపేయక,ఇంకా చూస్తూ ఊరుకున్నారేం?’ అనే ఆక్రోశమూ కావచ్చు.
పెద్దల దౌష్ట్యానికో, దోపిడీకో చితికిపోయిన బడుగు బతుకులకు బాసటగా నిలవాలన్న కాంక్షో, సంఘీభావమో కావొచ్చు.
‘పతితులార! భ్రష్టులార! బాధాసర్పదష్టులార! నేనున్నా నేనున్నాను.ఏడవకేడవకండి’ అనే వీరావేశమైనా కావచ్చు.
‘ఏం రాశాడురా? వీడి సిగ తరగ’ అనే అభినందన పూర్వక అలజడీ కావచ్చు.
అక్షరాల వెంట అశ్రుధారలు పరుగులు తీస్తుంటే దానికి పలువైనాలుగా భాష్యాలు చెప్పుకోవచ్చు.
ఏమైతేనేం, ఏదైతేనేం – మీ గుండెలో తడి ఉందని మీ కళ్ల చెమ్మ సాక్షిగా అర్థం.
మీ మనసులో గూడు కట్టుకుని పేరుకు పోతున్న భావావేశం, పేలనున్న అగ్నిపర్వతంలా ఉందని అర్థం.
వెరసి మీలో రచయిత కాగల లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అర్థం.
ఇంతకంటే ఫౌండేషన్ కోర్సు మరేముంటుంది?
ఇంకెందుకాలస్యం, కలమూ కాగితమూ చేత పట్టండి. అలా కాదంటే లాప్‍టాప్‍ను ప్రేమగా ఒళ్ళోకి తీసుకుని లాలించండి. మనసులో నుంచి లావాలా పొంగుకొచ్చే ఆలోచనలను అక్షరాల రైలు బోగీనెక్కించండి.
అది కథా, కవితా, మ్యూజింగ్సా, ముచ్చట్లా, డైరీనా – ఇలాంటి టెక్నికాలిటీలను వదిలేయండి.
గుండెల్లో ఈ కాస్తంత స్పార్క్ మినుకుమినుకు మంటుంటే, దాని వత్తిని ఎగదోసి జ్వలింప చేయటం ఎంతసేపని.
పదాలను చదివి పరవశించిపోవడమూ, వాక్య విన్యాసాల తోటి అడుగులో అడుగు వేసి కదం తొక్కడమూ చేస్తున్నారంటే – మంచి వాక్యం మీ మనసులో దూరి రొద పెడుతున్నట్లే మరి!
తలుపులు తెరిచి లోపలికి రెడ్ కార్పెట్ వెల్‍కమ్ చెప్పి,మంచీ మర్యాద కనుక్కుంటే అతిథి మర్యాదలకు మురిసిపోయిన ఆ వాక్య శిఖామణి రిటర్న్ గిఫ్టులివ్వకపోతాడా? అంటు మొక్క కొమ్మలు పూబాలలతో కిలకిలలాడినట్లు, వాక్యధారలు మీలోనూ పొంగి పొర్లవా?
* * *
కొన్ని వాక్యాల సొగసునూ విగరునూ మీరూ రుచి చూడండి.
పెళ్లికూతురి మొగలిజడలా
మెరిసిపోతోంది పంటకాలవ.
అందులో విరిసిన వెండి పువ్వులా
వెలిగిపోతున్నాడు చంద్రుడు.
అడ్డాల్లో పిల్లకి పాలిస్తున్న చల్లని తల్లిలా
వున్నది పల్లాన వున్న గున్నమామిడి.
దూరాన పైటలా ఎగురుతున్న తెర చాపకు
స్వాగతం పాడుతోంది ఆవలి గట్టు సరుగుడు తోట.
-బీనాదేవి (అసలు లేని వడ్డీ కథలో)
– – – – –
ఊర్లో అంటుకొన్న కొంపలాంటిది రైతు దుఃఖం. చుట్టుపక్కల వాళ్ళు ఆర్పేందుకు వస్తారు. ఆరినా ఆరకున్నా సానుభూతి అయినా దక్కుతుంది.
దూరంగా అంటుకుని ఎగబడి కాలుతూ ఉన్న కొండమంట లాంటిది గొర్ల కాపర్ల దుఃఖం. చూసేవాళ్లే గాని దగ్గరకు వెళ్ళే వాళ్ళు గానీ ,ఆర్పేందుకు ప్రయత్నించే వాళ్ళు గానీ కనిపించరు.
-సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి (కొండపొలం నవలలో)
– – –
రామనాథంగారు ఈ లోకంలోకి వచ్చి యాభై ఆరు సంవత్సరాలూ,తాలూకా ఆఫీసులో గుమాస్తాగా కుదురుకుని ముప్పై ఐదు సంవత్సరాలు. ఉద్యోగం నుంచి రిటరై పది నెలలూ, ఆ ఇల్లు కొన్ని ఆరు నెలలూ, అమ్మేసి వారం రోజులు అయింది.
-గొల్లపూడి మారుతీరావు (అద్దె బ్రతుకు కథలో)
– – – –
పాట అనే మాటలో ఎన్ని ఉద్వేగ ఊటలో! ఎన్ని ఉద్రేకాల తంత్రులో! ఎగసి పడి ఎదను రసప్లావితం చేసే ఎన్నెన్ని పారవశ్యాల జల యంత్రాలో! ప్రతి రాత్రీ వసంత రాత్రిగా ,ప్రతి గాలి పైరగాలిలా, బతుకంతా పాటలా సాగాలంటారు ఒక కవి.
…. పాటను కైకట్టిన ఆదికవి ‘అమ్మ’ అంటారు అందెశ్రీ.
-సాక్షి (సోమవారం సంపాదకీయంలో)
– – – –
*చేపల్లా నీళ్లలో ఈదుతూ ఆడుకుంటున్నారు వాళ్లు.
*చంద్రుడు విప్పేసిన బట్టల్లా అక్కడక్కడా పల్చటి మబ్బులు తేలుతున్నాయి.
* తెల్లటి, చల్లటి నిశ్శబ్దం కురుస్తోంది.
*కిష్టప్ప కడుపులో బెంగ పెద్ద బుడగైపోయింది.
*రెండ్రోజులవగానే తురకపాలెం మాత్రం మూడ్రోజుల కిందటి పిజ్జాలా కనిపించింది.
*ఎదురింటి మెట్ల మీద కామాలా పడుకుంది కుక్క.
తల్లావజ్జల పతంజలి శాస్త్రి (సమాంతరాలు కథల సంపుటిలోని వాక్యాలు)
* * *
ఈ కాసినీ మచ్చుకు మాత్రమే. యువ,నవ కవులు ,రచయితలు సైతం వాక్యాల వారోత్సవాలూ పెద్ద పందిళ్లలో పండగలూ చేస్తున్నారు. తరచి చూడండి. మనసు రొద పెట్టే వాక్యాలెన్నో. వాటిని ఒడిసి పట్టి గుండెల్లో దాచుకోండి.
పదాలు పద… పద… మంటాయి
వాక్యాలు వ్యంగ్యాస్త్రాలను ఈటెల్లా విసురుతాయి
అమ్మలా జోలపాటలు పాడతాయి
నిప్పు కణికల్లా మండి ఆవేశాన్ని రాజేస్తాయి
గంపెడంత దుఃఖాన్ని గుమ్మరిస్తాయి
ఉద్వేగాల ఒడిలో ఊరేగిస్తాయి
మాటలంటే మాటలు కాదు మరి.
* * *
