నా చిన్నప్రపంచంలో
నిద్రలో ఎన్నో రంగుల కలలు—
చందమామను తాకినట్టు,
వెన్నెల్లో నడిచినట్టు,
పేదరాసి పెద్దమ్మ
కథలు చెబుతుంటే
ఆ కథల్లోనే నిద్రపోయినట్టు.
అప్పుడు
రాత్రి అంటే నిద్ర,
నిద్ర అంటే కలలు,
కలలు అంటే
చేతికి అందిన చందమామ.
ఇప్పుడు
అర్ధరాత్రి మెలకువ వస్తే
వీధి కుక్కలు
ఇంటి ముందు కాపలా కాస్తూ
ఒకదానితో ఒకటి మొరుగుతుంటాయి.
ఆ కేకలు ఆగిపోతాయి.
నా నిద్ర మాత్రం తిరిగి రాదు.
కళ్లుమూస్తే
ఎప్పుడో విన్న ఒక స్వరం,
ఎప్పుడో చూసిన ఒక ముఖం,
చెప్పకుండా మిగిలిపోయిన ఒక మాట—
అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తాయి.
చిన్నప్పుడు
పెద్దమ్మ కథ చెబుతుండగానే
నిద్ర వచ్చేది.
ఇప్పుడు
ఒక జ్ఞాపకం గుర్తొస్తే
దాని వెంట ఇంకో జ్ఞాపకం
నన్ను మేల్కొలుపుతుంది.
అలా
అర్ధరాత్రి దాటేసరికి
నేనే గుర్ఖాగా మారిపోతాను—
నా ఇంటికి కాపలా కాస్తూ,
నా జ్ఞాపకాలకు కాపలా కాస్తూ.
ఏ జ్ఞాపకం వచ్చినా
దాన్ని మళ్లీ కోల్పోకూడదనిపిస్తుంది.
ఎప్పుడో విన్న స్వరం
మళ్లీ వినిపిస్తే
కళ్లుమూసుకుని వింటాను.
ఎప్పుడో చూసిన ముఖం
మనసులో మెదిలే ఊహా చిత్రం
దాన్ని మరికొంతసేపు చూస్తాను.
వయసు పెరిగేకొద్దీ
నిద్ర గడతా తగ్గిందనుకున్నాను.
ఎంతమాత్రం కాదు—
మర్చిపోయాననుకున్న జ్ఞాపకాలు
రాత్రివేళ మళ్లీ మేల్కొంటున్నాయి.
కిటికీ ఆవల
చందమామ నవ్వు ఇంకా ఉంది.
చిన్నప్పుడు
కలల్లో దాన్ని తాకేవాడిని;
ఇప్పుడు
మెలకువలో దాన్ని చూస్తున్నాను.
పేదరాసి పెద్దమ్మ
కథలు చెప్పే రోజులు పోయాయి.
అప్పుడప్పుడు కొన్ని రాత్రులు
నాలో మిగిలిన బాల్యం కళ్లుతెరుస్తుంది.
అప్పుడు
వీధి కుక్కల కాపలా మధ్య,
చందమామ వెలుగులో,
నేను మాత్రం మేల్కొని ఉంటాను—
ఇంటికి కాపలాదారులా కాదు,
నా జ్ఞాపకాల కాపలాదారిలా నేను.
బొల్లిముంత వెంకట రమణారావు
తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తున్న కవి, కథకుడు, నాటక రచయిత. కొత్తగూడెం ఆకాశవాణి (ఎఫ్.ఎమ్) కేంద్రంలో సుమారు ఎనిమిది సంవత్సరాలు క్యాజువల్ ఉద్యోగిగా పనిచేశారు. విదేశీ సంస్థలో కంటెంట్ రివ్యూయర్‌గా, స్థానిక పత్రికలో సంపాదక సహాయకుడిగా కూడా సేవలందించారు.
ఇప్పటివరకు ఆయన 150కు పైగా తెలుగు కవితలు, 15 కథలు రచించారు. ఆయన రచించిన 20 రేడియో నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. అలాగే 150కు పైగా ఆంగ్ల కవితలు వివిధ అంతర్జాతీయ సాహిత్య వెబ్‌సైట్లలో ప్రచురితమయ్యాయి.2002 సంవత్సరంలో Poetry.com నిర్వహించిన కవితా పోటీలో బహుమతి అందుకున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో కలిపి ఇప్పటివరకు 15 పుస్తకాలను ప్రచురించారు. సాహిత్యం, మానవ సంబంధాలు, సామాజిక అంశాలు, సమకాలీన జీవన అనుభవాలు ఆయన రచనల్లో ప్రధానంగా ప్రతిఫలిస్తాయి.
