చీకట్లో ఒక చిన్ని దీపం
గాలితో సరాగాలాడుతూ వెలుగుతూంటే
ఓ పాట వినిపిస్తుంది
ఆ పాట తీగలా అల్లుకుని
నన్నో దీపం చేస్తుంది.
ఇప్పుడు ఆ దీపానికి
నన్ను చూస్తే ఏ పాట వినిపిస్తుందో
చూడగా చూడగా
దీపం ఒక గాయంలా
ఊగిపోతున్నట్లు కనిపిస్తుంది
మా నాయినమ్మ నుదుటి బొట్టులా
మా తాత రుమాల్లా
మా బాపు నవ్వినప్పుడు అందంగా
మెరిసే విరిగిన పన్నులా
ఇక్కడే ఎక్కడో కూర్చుని నను పిలుస్తున్న
మా అమ్మ కళ్లల్లా తెరలు తెరలుగా
నాకు ప్రతిరూపంగా
ఈ కొవ్వొత్తి దీపం
నా చిన్నప్పటి గూటి మిణుగురులా
కందిని చందమామలా
పొయ్యిలో కొరకాసులా
ఊపేస్తుంది చూస్తున్న కొద్దీ
కాలిపోతున్నది
కాలంతో పేనుకున్న జ్ఞాపకం
కరిగి రాలిపోతున్నది
ఒట్టి మైనం ముద్ద
సముద్రాన్ని బోర్లించినా
ఆరిపోదీ వెలుగు
దీపం పాడుతోంది
చీకిట్లో చిటికెడు గాలిని సంగీతంగా మలిచి
వింటున్నావా అంటూ పదే పదే నన్ను పిలిచి
పాడుతోంది
ఈ దేహం కోసం ఒక మోహ గీతం

పసునూరు శ్రీధర్బాబు
దాదాపు నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్న పసునూరు శ్రీధర్బాబు 1969 జూలై 21న తెలంగాణ పల్లె మోత్కూరులో జన్మించారు. జర్నలిస్టుగా ఇండియా టుడే, హెచ్ఎంటీవీ, ఈటీవీ, బీబీసీ వంటి సంస్థలలో వివిధ హోదాలలో పని చేసిన ఈ కవి ‘తెలంగాణ ఉద్యమంలో టీవీ జర్నలిజం పాత్ర’ అనే అంశం మీద పరిశోదన చేసి జర్నలిజంలో డాక్టరేట్ అందుకున్నారు. ఆధునిక కవిత్వంలో తనదైన స్వరాన్ని వినిపిస్తూ 1991లో తొలి కవితా సంపుటి “అనేకవచనం” ప్రచురించారు. ఆ తరువాత 2021లో రెండో కవిత్వ సంపుటి “నిదురపోని మెలకువ చెప్పిన కల” ప్రచురించారు. అనేకవచనం సంపుటికి అజంతా అవార్డు, రమణ-సుమనశ్రీ పౌండేషన్ పురస్కారం అందుకున్నారు. ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’ సంకలనానికి 2022లో రొట్టమాకు రేవు పురస్కారం, ఖమ్మం ఈస్తటిక్స్ అవార్డు, మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారం అందుకున్నారు. ఆయన మూడో కవితా సంకలనం “ఏకాంతం ఒక అతిథి” 2025 డిసెంబర్లో విడుదలైంది.
