తెలంగాణ కథా జగత్తుకో కొత్త వెలుగు – ‘కందిలి’

Spread the love

మాట్లాడే వాళ్ళు లేకపోతే భాషకు ఉనికి లేకుండా పోతుంది‌. కనుమరుగవుతుంది. ప్రాంతీయ భాష సంస్కృతి సాహిత్యాల ఉనికి కూడా అంతే. ‘అస్తిత్వానికి ఆరంభం కార్యాచరణ’ అంటాడో ప్రముఖ తత్త్వవేత్త. అలాంటి ఆచరణే చేపట్టారు ఖమ్మం కథకులు డా. ధరణికోట రమేష్ గారు. ‘ఇది ఇట్లెందుకు?’ కథల సంపుటి ద్వారా వారి ప్రగతిశీల భావజాలం సుపరిచితమే. తెలుగు సాహిత్య ప్రపంచంలో తెలంగాణ అస్తిత్వం బలోపేతం చేసేందుకు ఇప్పటికే అనేకమంది గొప్ప కృషి చేస్తున్నారు. తమ వంతు అదనపు చేర్పుగా ‘కథా తెలంగాణం – ఖమ్మం స్ఫూర్తి’ ప్రచురణలు మొదలెట్టారు రమేష్ గారు. తమ కాలపు కథాగొంతుకలకు మరో వేదికనివ్వడం ద్వారా ఆయన తన కార్యాచరణలో మొదటి అడుగు వేశారు. ఆ అడుగుకు ఊతంగా నిలిచారు సంపాదక బృందం ప్రసేన్, సీతారాం, రవిమారుత్ గార్లు. అదే పదిమంది తెలంగాణ కథకుల పదకొండు కథలతో వచ్చిన ‘కందిలి’ కథా సంకలనం‌. ఖమ్మం నుంచి ఈ ప్రయత్నం అభినందనీయం.

‘కందిలి’ లోని పదకొండు కథలు వస్తుపరంగా వైవిధ్యంగా ఉండడం, ఆ వస్తువులు ఊహాప్రపంచాలవి కాకుండా సమాజవాస్తవాలవడం, ఈ కథలు ఈ సంకలనంలోనే మొదటిగా ప్రచురితమవడం చదువరిలో ఆసక్తిని కలిగిస్తాయి. ‘మొదటి గంట’ తో మొదటి కథే మనసును కదిలించి ఆలోచింపజేస్తుంది. పాఠశాల స్థాయి పిల్లలను ఆకర్షించే అంశాలు, పెడతోవ పట్టే పిల్లలను దారిలోకి తెచ్చుకోవాలని ఆరాటపడే ఉపాధ్యాయులు, వారి చుట్టూ ప్రలోభ పెట్టి ప్రభావితం చేసే వాతావరణం కళ్ళకు కట్టినట్టు చిత్రించారు పెద్దింటి అశోక్ కుమార్. అన్నింటికి మించి ఇప్పుడు తెరపైకి వచ్చి దేశాన్ని ఆవహిస్తున్న పెద్ద అంశం గురించి ఆలోచన రేకెత్తించారు. ‘మతం నల్లమందు’ అంటారు. మాదకద్రవ్యాల కంటె ప్రమాదకరమైనది విషపూరితమైనది మతం. ఆ మత్తు పాఠశాల దశలోనే, దేశ భవిష్యత్తు నిర్మాతలైన విద్యార్థులను అంటుకోవటాన్ని హెచ్చరిస్తూ ప్రమాదఘంటిక మోగించారు‌.

‘అమ్మ నీడ చీకటి’ శీర్షికే తాత్వికతతో ఆకర్షిస్తుంది. చదూతుంటే మాత్రం పేరా పేరాకు మనసు ఛిద్రమయితది. అయోధ్యా రెడ్డి గారూ! ఆ పసిపిల్ల పట్ల కాస్త కరుణ చూపితే ఏం పోయిందండీ, అట్లా రాయకపోతే బావుండు కదాండీ అని అడగాలనిపిస్తది‌. అలా అనిపించేలా చేయటం ద్వారా ఓ రకంగా దమయంతి లాంటి జీవితాలను కథ చేయడంలో కథకులు సఫలమైనట్టేనేమో!
దమయంతుల విషాదం పక్కనపెడితే, పసిపిల్లను రాక్షసంగా హింసించిన అట్లాంటి పురుషుల ప్రవృత్తిని గురించి ఏమైనా మాట్లాడాలి!

పి. చంద్ రాసిన ‘కగార్’ కథ నిజానికి ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల వాస్తవ ముఖచిత్రం. పార్టీల పేర్లను ఉటంకించటానికి గానీ, కార్పొరేట్ ప్రయోజనాల కోసం ప్రజల ఆవాసాలను ధ్వంసం చేసే ప్రభుత్వ చర్యలను నేరుగా చెప్పడానికి గానీ వెరవనితనం ఈ కథలో కనిపిస్తుంది. వెలిగిపోతున్న స్వాతంత్ర్య వేడుకల్లో విస్తరిస్తున్న కారు చీకటి కోణాన్ని కగార్ చిత్రించింది.

ఒక వాగు తన ఆత్మకథ చెప్పుకుంటునట్టు, మోనోలాగ్ లాగా నిర్మించిన కథ ‘కృష్ణనింబః’. ఈ కథకు పెట్టిన టైటిల్‌‌ ద్వారా కథలోని కీలక స్వభావాన్ని ప్రకటించారు కథకులు డా. ధరణికోట రమేష్. రైతు సంక్షేమం నెపంతో నీటి వనరులపై నిర్మించే ప్రాజెక్టులు స్వార్థ ప్రయోజనాలకు ఎట్లా మళ్ళిస్తారో, మోసపోయిన సామాన్య రైతులెట్ల కూలీలుగా మారతారో చెప్తుందీ కథ. పయోముఖ విషకుంభాల సిసలు ముఖం చూపుతుంది.

వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో తనను తాను తర్కించుకుంటూ మెరుగ్గా మలచుకుంటూ సాగే కథ ‘ఉనికి’. ఆద్యంతం ఒక అమూర్త పాత్రను ఆ వ్యక్తి జీవితంలో కీలకంగా చూపెట్టటం ద్వారా మానవ సంబంధాల ఉనికిని పరోక్ష పద్ధతిలో చిత్రించారు కొట్టం రామకృష్ణారెడ్డి. కథంతా తెలంగాణ జీవద్భాషలో సహజంగా రచించడం వల్ల ఈ సంకలనానికి వన్నె వచ్చింది.

కులాంతర మతాంతర ప్రేమకథలు చాలా వచ్చే ఉంటాయి. వాటిల్లో ఈ ‘నయా ఆస్మాన్’ కాస్త కొత్తగానే కనపడుతుంది. మతాన్ని ఉనికిలో ఉంచడం కోసం గ్రంథాల్లో లేని కఠిన నియమాలను చెలామణీ చేయడాన్ని ప్రశ్నిస్తుంది. వెజిటేరియన్స్ ఓన్లీ లాంటి కథను రాసిన స్కై బాబా ఈ కథనూ రాయడం ద్వారా మతాన్ని చుట్టి ఉన్న అన్ని కోణాలనూ నిష్పక్షపాతంగా చర్చిస్తున్నారని అర్థమవుతుంది. మత చిహ్నాలను వదిలించుకుని ప్రేమజంట కొత్త జీవితాన్ని ఆరంభించడంతో ముగిసిన ఈ కథ కొత్త ఆలోచనకు నాంది పలుకుతోంది.

పై కథలన్నీ చదివాక వచ్చే ‘అత్తర్’ కథ మనసును హత్తుకుని తేలికపాటి శాంతినిస్తుంది. ఇలాంటి కథలు రాయడమే కాస్త ఎక్కువ కష్టమేమో! రంజాన్ రాత్రుల్లో పాతబస్తీ వీధుల అందం ఈ కథ చదివి తెలుసుకోవచ్చు. బంధంలో ముడిపడిన ప్రేమే ఏ అత్తర్ అందివ్వలేని అసలైన పరిమళం అని సున్నితమైన అంశాన్ని చాలా అందంగా సమర్థవంతంగా నడిపారు. ఈ కథ కోసం శ్రీ ఊహ అత్తర్ పరిమళాల గురించి ఎంతో పరిశోధన చేసి ఉంటుంది. లేదంటే ఆ వాక్యాలు చదూతూనే సువాసన చదువరి మనసుకు తాకటం సాధ్యమా!

జీవితంలోని అన్ని ఒడిదుడుకులనూ ఒంటరిగా విజయవంతంగా దాటగలిగే స్వతంత్ర మహిళలు – స్త్రీ పురుష సంబంధాల విషయంలో ఎట్లా గాయపడతారో, గాయపడినా మునుపటి ధైర్యంతో ఎలా అధిగమిస్తారో తన కథలో చెప్తారు స్వాతి శ్రీపాద. ఈ కథలో పురుషుడు స్త్రీ ని ఛాయిస్‌గా శరీరంగా భావిస్తాడు. స్త్రీ పురుషుడ్ని మనసుకు తోడుగా భావిస్తుంది‌. ఈ సంబంధంలోని పెళుసుతనాన్ని గ్రహించి, లేని విలువ కోసం ఉండక్కర్లేదంటుంది ‘భాగీ యు ఆర్ గ్రేట్’

ఆదివాసీలపై దోపిడీ గురించి దశాబ్దాలుగా వింటున్నాం. తవ్వకాలు, ప్రాజెక్టుల పేరుతో అడవిని ధ్వంసం చేయటం, అడవిబిడ్డల అస్తిత్వం ప్రమాదంలో పడడం, విస్తాపనను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవటం – ఇది ఆదివాసీలకు నిత్యకృత్యం. వాళ్ళెంతటి దుర్భరమైన పీడనకు గురవుతున్నారో అక్షరరూపం ఇచ్చారు ‘ఆఖరి మనుషులు’ కథలో ఉదయమిత్ర. భూస్వామి చేతుల్లో చెంచు మహిళ పార్వతమ్మ పాత్ర పడిన హింస, చూపించిన ధిక్కారం, చివరకు ఆమెకు పట్టిన అగత్యం అంత తేలికగా మర్చిపోలేం. అంత పీడనకు గురవుతూ ఆ జాతి మిగిలే అవకాశం ఎక్కడుందనే ప్రశ్నను మిగులుస్తుందీ కథ.

నిజమైన ప్రజాస్వామ్యంలో మతం వ్యక్తిగత విషయం. అందులో ప్రభుత్వ జోక్యం ఉండరాదు. కానీ ప్రస్తుత‌ రాజకీయాలు ప్రభుత్వం మతం పేరుతో ప్రజల్ని చీల్చి విభజించు పాలించు’ పాటిస్తుంది. ఆ చీలిక ప్రభావాన్ని చూసిన ఇద్దరు స్నేహితుల కథ ‘భ్రమాన్విత పరిమళం’. దేశంలో ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అనేమాట ఉట్ఠి భ్రమేనని తేలిపోవడం గురించి ఆ ఇద్దరు స్నేహితుల జీవితంలో చోటుచేసుకున్న మార్పుల ద్వారా చెప్తారు వంశీకృష్ణ. ‘ఏ సమూహమైనా ద్వేషంతో సఘటితమైతే వినాశనానికి దారితీస్తుంది’ అంటారు. కథ ఆరంభంలోని వర్ణనే ముగింపులోనూ పునరుక్తి చేయటం ద్వారా విధ్వంస తీవ్రతను చెప్పదలచుకున్నారు కథకులు. చివరాఖరి వాక్యం కీలకం.
ఈ కథలో బాల్యపు నాస్టాల్జియా ఎపిసోడ్ వాళ్ళ స్వచ్ఛమైన స్నేహం పరిమళాన్ని అందిస్తుంది.

గిరిజన జాతి గోండుల జీవితాలు వాళ్ళ జీవన విధానం సంస్కృతి ప్రతిబింబిస్తాయి చివరి కథ ‘ఆపరేషన్ ఖండాల’లో. అడవిని అమ్మలా చూసుకునే గిరిజన జాతిని, మీ వల్లే అడవి నాశనమైతుంది అడవిని ఖాళీ చేయండి అంటుంది అధికారగణం. ఆ ప్రాంతపు అడవిలో దొరికే ఖనిజం పై కార్పొరేట్ వ్యాపార దిగ్గజాల కన్ను పడడం అసలు కారణం. అందుకు పులి దాడి పేరుతో ఒకరిద్దర్ని చంపి గోండుగూడేన్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ కుట్రను కనిపెట్టి దాన్ని అంతం చేయడానికి ఒక గిరిజనుడు చూపిన తెగువతో కథ ముగిస్తారు వసంతరావు దేశ్‌పాండే.

ఇలా పెద్ద కాన్వాస్ గల ఒక్కో కథనూ నాలుగు మాటల్లో పరిచయం చేసే ప్రయత్నమే కానీ, ఈ సంకలనంలోని కథలన్నీ భిన్న అంశాలను చర్చించాయి. కదిలించాయి. సమకాలీన రాజకీయ చర్యలను ప్రశ్నించాయి. సంపాదకులు ధరణికోట రమేష్ గారితో చిన్న ముచ్చట పెట్టేలా చేశాయి.

కథ కొత్త దృష్టిని ఇస్తుందని నమ్మకం – డా. ధరణికోట రమేష్

జ: ఒక రచయితకు కథ అంటే కేవలం వినోద సాధనం కాదు, అది సమాజాన్ని చూడడానికి, అర్థం చేసుకోవడానికి, ప్రశ్నించడానికి ఉపయోగించే ఒక గాఢమైన మాధ్యమం అనే లోతైన విశ్వాసం.

కథ అనేది జీవితానికి అద్దంలాంటిది. మనిషి అనుభవాలు, బాధలు, ఆశలు, ఘర్షణలు ఇవన్నీ కథ రూపంలోకి వస్తాయి. అందుకే కథ ప్రక్రియ అంటే “ఏం జరిగింది?” చెప్పడం మాత్రమే కాదు “ఎందుకు జరిగింది?”, “దాని అర్థం ఏమిటి?” అనే ప్రశ్నలకు సమాధానం వెతకడం .

కథపై నమ్మకం ఉన్నవాళ్లకు కథ ఒక ఆత్మ శోధన. అది పాఠకుడి ఆలోచనలను కదిలిస్తుంది, స్థిరమైన విలువలను కుదిపేస్తుంది, కొత్త దృష్టిని ఇస్తుంది. మంచి కథ చదివిన తర్వాత మనం మునుపటిలా ఉండం.
సారాంశంగా చెప్పాలంటే, కథ ప్రక్రియ పట్ల నమ్మకం అంటే కథ ద్వారా మనిషిని అర్థం చేసుకోవచడం , సమాజాన్ని ప్రశ్నించడం , మార్పుకు బీజం వేయొచ్చు అనే గట్టి విశ్వాసం.

జ: తెలంగాణ కథ ఆవశ్యకత అంటే మన భాషలో, మన బతుకుబాటల్లో, మన సమస్యలతో మనమే మన కథ చెప్పుకోవడం. ఆంధ్ర కేంద్రిత కథల్లో కనిపించని గ్రామీణ జీవితం, వలస కూలీలు, నీటి కష్టాలు, ఉద్యమాల అనుభవాలు ఇవన్నీ తెలంగాణ కథలోనే స్పష్టంగా బయటపడతాయి. ఇది కేవలం సాహిత్యం కాదు. మన గుర్తింపుని, చరిత్రని నమోదు చేసే పత్రం. అందుకే తెలంగాణ కథ అనేది అవసరం మాత్రమే కాదు, తప్పనిసరి కూడా.

జ: తెలంగాణలో కథ లేదంటున్నారు. తెలంగాణ కథకులకు రాయడం రాదంటున్నారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యం చూసినపుడు వనరుల వినియోగంలో వివక్ష వల్ల వెనుకబాటుతనం మాత్రమే కాకుండా అభివృద్ధి చెందిన ప్రాంతాల సాంస్కృతిక ఆధిపత్యాన్ని కూడా సహించాల్సి వచ్చింది. ఈ సందర్భంలో తెలంగాణా ప్రాంతం నుండి వచ్చే సాహిత్యం గురించి ప్రత్యేక స్పృహతో మాట్లాడుకోవడం సామాజిక కర్తవ్యంగా మారింది. ఏ ప్రాంతంలో నయినా, ఏ భాషలోనైనా సాహిత్యంలో కథకి ప్రత్యేక స్థానం వుంది. సామాజిక చింతన, సాంస్కృతిక నేపథ్యం, మానవీయ భావొద్వేగాలు, ఉద్యమాలు, జీవిత సత్యాల్ని కథ ప్రతిబింబింపచేస్తుంది. ఒక కోణంలో అవి సూచికా శిలాజాలు. ఏ లాక్షణిక సూత్రాలప్రకారం చూసినా తెలంగాణా కథకొక పరిణామక్రమం ఉంది. తెలంగాణ కథకులు ఏ రోజు కూడా తమ సామాజిక బాధ్యతని మరిచిపోలేదు. తెలంగాణా కథని కాపాడుకోవడం, కొత్త ఊపిరులూదడం, ఈ కథల వెలుగులను మరింత విస్తరింప చేయడం అవసరం. ప్రస్తుతం వస్తున్న కథా సంకలనాల్లో తెలంగాణాకి రావాల్సిన వాటా రాకపోవడం కూడా తెలంగాణ కథకులు రాసిన కథలతో సంకలనాన్ని తీసుకు రావడానికి ముఖ్య కారణం. తెలంగాణ నుంచి మంచి కథ వస్తుంది అని రుజువు చేయడం మా ఉద్దేశ్యం.

జ: సంకలనానికి తెలంగాణలో మాత్రమే వాడే పదాన్నో, పదబంధాన్నో టైటిల్ గా పెట్టాలి అనేది నిర్ణయం. ఆ పదం కచ్చితంగా అర్ధవంతమైనదయి ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ సారి కందిలి అనే టైటిల్ ఇచ్చాము. ఇది తెలంగాణలో వాడే మాట. కందిలి వెలుగు కుప్ప, కందిలి రాతిరి సూరీడు, కందిలి ఒక దారి దీపం, కందిలి చీకటిని చంపే ఆయుధం, కందిలి లాగా ఈ కథలు కూడా రాజకీయ, సాంస్కృతిక, ఆర్ధిక సామాజిక చీకట్లమీద వెలుగు విరజిమ్ముతాయని , శాశ్వత జ్ఞాపికలుగా మిగులుతాయని నమ్ముతున్నాను. ప్రతి సంవత్సరం ఇలా తెలంగాణ పదం టైటిల్ గా సంకలనం తెస్తాం.

జ: కందిలి కథా సంకలనానికి ప్రసేన్ , సీతారాం , రవిమారుత్ కూడా నాతో పాటు సంపాదకులుగా వున్నారు. తెలంగాణా సాహిత్యంలో మంచి కథలు రాస్తున్న కథకుల్ని, ప్రతి జిల్లాకి ప్రాతినిధ్యం వుండేటట్టుగా ఎంపిక చేసుకున్నాం. పేరెన్నిక గలిగిన స్వాతి శ్రీపాద మొదలు, పెద్దింటి అశోక్ కుమార్ , చంద్ , అయోధ్య రెడ్డి , కొట్టం రామకృష్ణా గారు, స్కైబాబ , శ్రీ ఊహ , వంశీ కృష్ణ , వసంతరావు దేశ పాండే , ఉదయమిత్ర ని ఎన్నుకున్నాం. ఊహించిన విధంగానే తెలంగాణా సమాజం ద్వారా దేశ రాజకీయాల్ని ప్రశ్నించే కథల్ని మాకు అందించారు. పూర్తి సహకారాన్ని అందించిన రచయితలందరికి కృతజ్ఞతలు .

జ: ప్రస్తుతానికయితే కందిలి లాంటి సంకలనం ప్రతీ సంవత్సరం ఒక పుస్తకం తీసుకొస్తాము. తెలంగాణ కథను మరింత వెలిగించడానికి అవసరమైన మాకు చేతనైన పనులు చాలా చెయ్యాలనుంది.
కథ పట్ల తెలంగాణ అస్తిత్వం పట్ల సంపాదకులు రమేష్ గారికి గల విశిష్టమైన ప్రేమ అభినందనీయం. వారితో చిన్ని సంభాషణ ద్వారా వారి లక్ష్యం తెలుసుకున్నాక – ముందు ముందు తెలంగాణ కథకుల జాడను అందించగల చిరునామా అవుతుంది ‘కథా తెలంగాణం-ఖమ్మం స్ఫూర్తి’ అనడంలో సందేహం లేదు.

ఫణి మాధవి కన్నోజు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *