నవంబరు, 2024కు ఒక నెల రోజుల ముందే బెంగుళూరులో జరగబోయే పెళ్ళికి పిలుపు వచ్చింది. మావారు పాట్నా కాలేజీలో చదువుకునే రోజుల్లో క్లాస్‌మేట్, స్నేహితుడైన మిశ్రా కొడుకు పెళ్ళి. పెళ్ళికొడుకు బెంగుళూరులో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతను, బెంగుళూరుకు చెందిన కన్నడ అమ్మాయి ప్రేమించుకుని పెళ్ళి చేసుకుందామని అనుకున్నారు. ఇరువైపులా పెద్దల్ని ఒప్పించడంలో సఫలీకృతులయ్యారు. అమ్మాయి వైపు వారి అభ్యర్థన ప్రకారం పెళ్ళి బెంగుళూరులో జరపడానికి నిశ్చయించి పెళ్ళి పిలుపులు మొదలెట్టారు. మేం పెళ్ళికి హాజరై, బెంగుళూరు దగ్గరలోనే ఉన్న వేరొక ప్రదేశాన్ని దర్శించాలని ఉబలాట పడ్డాం. బెంగుళూరుకు మరీ దూరం కాని కూర్గ్ వెళ్ళాలని ప్లాను వేసుకున్నాం. అది వరకు నేను మా చిన్నమ్మాయితో కూర్గ్‌లోనే ఉన్న మడికేరి చూశాను కాబట్టి, ఈసారి కూర్గ్‌లోనే ఉన్న విరాజ్‌పేట్ వెడదామన్న నిర్ణయం తీసుకున్నాం.
నవంబరు 16న ఉదయం ఫ్లైట్‌లో బెంగుళూరు చేరుకున్నాం. కర్ణాటక, బీహారి సంప్రదాయాల అనుసారం వైవిధ్యంగా జరిగిన పెళ్ళి ఉత్సవాల్లో పాల్గొని ఎంతో ఆనందించాం. రెండు రోజులు ఇట్టే గిర్రున తిరిగిపోయాయి. నవంబరు 18న మాకు బస ఏర్పాటు చేసిన హోటల్లో ఉదయం నాస్తా కానిచ్చుకుని 9.30 కల్లా అంతకుముందే బుక్ చేసుకున్న టాక్సీలో విరాజ్‌పేట్ బయలుదేరాం. బెంగుళూరు నుంచి విరాజ్‌పేట్ సుమారు 237 కిలోమీటర్లు ఉటుందని, ప్రయాణ కాలం ఐదు గంటలపైన పడ్తుందని తెల్సుకున్నాం. మా డ్రైవర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన, మధ్య వయస్కుడైన మన్సూర్. మధ్య మధ్యలో జరిగిన సంభాషణలతో, కునికిపాట్లతో ప్రయాణం సాఫీగా సాగింది. మధ్యాహ్నం మైసూరులో ఆగి మన్సూర్ తీసుకెళ్ళిన మంచి హోటల్లో భోజనం కానిచ్చాం.
తర్వాత మైసూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగరహోళె నేషనల్ పార్క్ గుండా కూర్గ్ పోవల్సివచ్చింది. ఇది కర్ణాటకలోని మైసూరు, కొడగు లేక కూర్గ్ జిల్లాల్లో వ్యాపించి ఉంది. దీన్ని 1965లో వన్యప్రాణుల అభయారణ్యం (ఔఱశ్రీసశ్రీఱటవ ూaఅష్‌బaతీవ)గా గుర్తించి, 1988లో రాజీవ్ గాంధి జాతీయ పార్క్‌గా మార్చారు. నాగరహోళె అనే నది వలన దీనికా పేరు వచ్చింది. నాగర్ అంటే పాము, హోళె అంటే నది. అనగా పాము నది (సర్పెంట్ రివర్) అని కన్నడ భాషలో అర్థం. ఇది పడమటి కనుమల నుండి బ్రహ్మగిరి అభయారణ్యం గుండా బందిపూర్ టైగర్ రిజర్వ్‌ను దాటుకుని తూర్పు కనుమలలోకి ప్రవేశిస్తుంది. దీన్ని కార్బెట్, కాజీరంగా తర్వాత ముఖ్యమైన టైగర్ రిజర్వ్‌గా పేర్కొంటారు. రోడ్డుకి ఇరువైపులా పరచుకున్న అడవి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం చేశాం. పులులు కనబడలేదు కానీ, అక్కడక్కడా ఏనుగులు, కోతులు కనిపించాయి. కారుని మరీ స్పీడ్‌గా పోనివ్వగూడదన్న నియమం ప్రకారం మన్సూర్ కారుని నెమ్మదిగా పోనిచ్చాడు. వన్యప్రాణులు రోడ్డు దాటుతున్నప్పుడు కారుని నిలిపివేయాలన్న రూలుని కూడా పాటించాడు.
మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళడం వలన చివరకు సాయంత్రం నాలుగు గంటలకు విరాజ్‌పేట్‌లో మేం ఉండాలనుకున్న ఒక ప్రఖ్యాత టూరిస్ట్ కంపెనీ వారి రిసార్టు చేరుకున్నాం. ఆ ప్రదేశం చూసి మరింత ముచ్చటపడ్డాం!
చక్కని ఆధునిక సౌకర్యాలతో, పరిశుభ్రతతో ఎంతో బాగున్నాయి అక్కడి భవనాలు. అన్నిటికీ మించి ఆ రిసార్ట్ చుట్టూ ఉన్న అడవి, కాఫీ ప్లాంటేషన్స్ ఆ ప్రదేశానికి వింత అందాన్ని తెచ్చాయి. అసలు విరాజ్‌పేట్ కర్ణాటక రాష్ట్రంలో కొడగు లేక కూర్గ్ జిల్లాలో, విరాజ్‌పేట్ తాలుకాలో ఉంది. ఇది కూర్గ్ జిల్లాకి ముఖ్య పట్టణమైన మడికేరికి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. విరాజ్‌పేట్‌లో కాఫీ, సుగంధద్రవ్యాలు, తేనె పుష్కలంగా లభిస్తాయి. ఇక్కడ మలయాళం, కన్నడ, కొడవ, తులు ముఖ్యమైన భాషలు. ఇక్కడి ఇళ్ళు పచ్చటి ప్రకృతి మధ్య, కాఫీ ప్లాంటేషన్స్ మధ్య అందంగా కనబడతాయి.
ఇక చారిత్రకంగా కూర్గ్ ప్రాంతం పూర్వం కదంబులు, చాళుక్యులు, హోయసాలులు, రాష్ట్రకూటులు, గంగులు, చోళులు, విజయనగర రాజుల పరిపాలన కింద ఉన్నది. తర్వాత రెండు వందల సంవత్సరాల పైన (షవ1600`1834) కొడగు రాజులు పరిపాలించారు. 1782లో మైసూరు రాజు హైదర్ ఆలీ మరణం తర్వాత టిప్పుసుల్తాన్ కూర్గు రాజ్యాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేశాడు. 1780`1809ల మధ్యకాలంలో పరిపాలించిన దొడ్డ వీర రాజేంద్ర టిప్పుసుల్తాన్ పాలన నుంచి కూర్గ్‌కి విముక్తి కలిగించాడు. తర్వాత టిప్పు సుల్తాన్‌కి వ్యతిరేకంగా ఆంగ్లేయులకు సహాయపడ్డాడు. 1792లో ఆయన తన పేరు మీద వీర రాజేంద్రపేట్‌ను నిర్మించాడు. అదే కాలక్రమేణా విరాజ్‌పేట్‌గా ప్రసిద్ధికెక్కింది.
మేం రిసార్టు చేరుకున్న తర్వాత ఆఫీస్‌లో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నాం. అయిదింటి వరకు హై టీ ఫెసిలిటీ ఉందని తెల్సుకుని, డైనింగ్ హాల్‌కి వెళ్ళి, పకోడీలు, బిస్కెట్లుతో పాటుగా చాయ్ తాగాం. ఆ తర్వాత రిసార్టు వాళ్ళు ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్‌లో దారిలోని రకరకాల చెట్లను, రంగు రంగుల పువ్వులను వీక్షిస్తూ, సామాన్లతో మా గదికి చేరుకున్నాం. అక్కడ ఆఫీసులో పని చేసేవారు, డ్రైవర్లు, పని వాళ్ళు ఎంతో వినయంగా ప్రవర్తిస్తూ, మాకెటువంటి లోటు కలుగకుండా సహాయపడ్డారు.
అక్కడ ఉన్నన్ని రోజులు ప్రశాంతమైన వాతావరణంలో, అడవి అందాలు, రిసార్టు పార్కులు, కాఫీ తోటలు తిలకిస్తూ మేం చాలా హాయిగా రోజులు గడిపాం. ఉదయాలు, సాయంత్రాలు నడకలు సాగించాం. రిసార్టులో స్విమ్మింగ్ పూల్ ఉంది. పిల్లల కోసం, పెద్దల కోసం అవుట్ డోర్, ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. రిసార్ట్ వారు కాఫీ ప్లాంటేషన్ వాక్స్ ఏర్పాటు చేశారు. కానీ మా అంతట మేమే చుట్టూతా ఉన్న కాఫీ ప్లాంటేషన్స్‌కి నడుచుకుంటూ వెళ్ళాం. ఇక ఆహారం దగ్గరికి వస్తే నాస్తా, లంచ్, డిన్నర్‌లో రకరకాల వంటకాలు ఉండేవి. అన్నింటినీ రుచి చూడాలంటే సాధ్యమయ్యేది కాదు. మెంబర్స్‌కి అవి డిస్‌కౌంట్‌లో దొరికే ఏర్పాటు చేశారు. నాగరిక ప్రపంచానికి, ట్రాఫిక్‌జామ్‌లకు, వత్తిళ్ళ లోకానికి దూరంగా ఉంటూ, ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ కొన్ని రోజులైనా ప్రశాంతంగా జీవించాలనుకునే వారికి ఇది అద్భుత లోకమని అనిపించకమానదు!









రిసార్ట్‌లో బట్టల దుకాణం కూడా ఉంది. కూర్గ్‌లో నేసిన చీరలు మాత్రమే చూపించమని వారిని కోరాను. అరటి బెరడుతో నేసిన కూర్గ్ సిల్కు చీర, రెండు మామూలు కూర్గ్ చీరలు కొన్నాను. అవి మా విరాజ్‌పేట్ ట్రిప్పుకి గుర్తుగా ఉంటాయన్న సంతృప్తి కలిగింది. మరో విషయం, ఇక్కడి మహిళలు కూర్గ్ సంప్రదాయాన్ని అనుసరిస్తూ చీర వేరే విధంగా కట్టుకోవడం గమనించాను. అలా కట్టుకున్న ఒక యువతితో స్నేహ పూర్వకంగా మాట్లాడి, ఆమె అంగీకారంతో ఫోటో కూడా తీసుకున్నాను.
ఒక రోజు విరాజ్‌పేట్ టౌన్‌లో ఉన్న విశేషాలు చూద్దామని టాక్సీ మాట్లాడుకుని బయలుదేరాం. ముందుగా విరాజ్‌పేట్‌కి ముఖ్యమైన లాండ్‌మార్క్ కట్టడమైన క్లాక్‌టవర్‌కి వెళ్ళాం. దీన్ని ఐదవ జార్జ్ రాజు ఇండియా దర్శనానికి (1911) గుర్తుగా కట్టారట! ఇది 1915లో ఆవిష్కరించబడిరది. ప్రస్తుతం క్లాక్ పని చెయ్యడం లేదని తెల్సింది.
యాత్రికులు ఎక్కువగా దర్శించే మరొక కట్టడం సెయింట్ ఆన్స్ చర్చి. 1792లో కొడగు రాజు వీరరాజేంద్ర ఈ చర్చి కట్టడానికి భూమిని, నిధులను సమకూర్చాడు. దీన్ని ఆయన టిప్పు సుల్తాన్ ఆగ్రహానికి గురయి, పారిపోయి వచ్చిన మంగుళూరు క్రిస్టియన్స్ కోసం కట్టించాడు. అప్పుడు కట్టిన కట్టడాన్ని పడగొట్టి 1868లో దాని స్థానంలో ప్రస్తుతం ఉన్న చర్చిని కట్టారు. ఇది యూరపు, గోథిక్ మిశ్రమ వాస్తు పద్ధతులలో కట్టబడిరది. ఈ వివరాలన్నీ చర్చి బయట ఉన్న బోర్డు మీద రాశారు. ఇది కొడగు రాజుల మత సామరస్యానికి నిదర్శనం అని అనిపిస్తుంది. చర్చి లోపల కూడా బయట ఉన్నట్లే ఆకర్షణీయంగా ఉంది. ఈ రెండు కట్టడాలు దర్శించిన తర్వాత దగ్గర్లో ఉన్న ఉడిపి హోటల్లో భోజనం చేశాం.
భోజనం తర్వాత విరాజ్‌పేట్‌కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మలెతిరికె కొండ మీద ఉన్న అయ్యప్ప గుడి, శివాలయం చూడాలని బయలుదేరాం. సగం దూరం వచ్చిన తర్వాత అయ్యప్ప గుడి ఉండే ప్రదేశానికి చేరుకున్నాం. కొండ కింద ఉన్న గుడికి పోవడానికి అక్కడ ఉన్న ఆటో తీసుకుని వెళ్ళాం. మధ్యాహ్నం అవడం వలన గుడి మూసి ఉంది. బయట నుంచే ఫొటోలు తీసుకున్నాం. గుడి సింపుల్‌గా, ముచ్చటగా ఉందనిపించింది. గుడి నుండి బయటికి వచ్చి, మళ్ళీ ఆటోలో టాక్సీ దగ్గరికి చేరుకున్నాం. టాక్సీలో మలెతిరికె కొండపైకి వెళ్ళాం. అక్కడ శివాలయం చాలా అందంగా, కేరళలోని ఇళ్ళ మాదిరిగా ఉంది. గుడి చుట్టూ ప్రదక్షణ చేశాం. గుడి మూసివేయబడినా కటకటాల్లోంచి శివలింగాన్ని దర్శించుకున్నాం. కొండ మీద పచ్చటి ప్రకృతి మధ్య కట్టిన గుడి ఆకర్షణీయంగా కనబడిరది.
అక్కడి నుండి చెలవర జలపాతం చూడటానికి వెళ్ళాం. అది మేం ఉన్న రిసార్టుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. దారిలోని వృక్ష సంపద ఆహ్లాదపరచింది. జలపాతం దగ్గరికి వెళ్లాలంటే కారు పార్కింగ్ నుండి మూడు వందల మీటర్లు అడవిలో ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలని, దారి గతుకులతో అనుకూలంగా ఉండదని తెల్సుకుని, దూరం నుంచే జలపాతం చూస్తూ సంతోషపడి ఫొటోలు తీసుకున్నాం. విరాజ్‌పేట్ విశేషాలు చూసిన తర్వాత దారిలోని మార్కెట్‌లో చౌకలో సుగంధద్రవ్యాలు, కాఫీ పాకెట్లు కొనుక్కుని, చీకటి పడుతుండగా రిసార్టు చేరుకున్నాం.
22వ తారీఖున ప్రొద్దున్నే నాస్తా కానిచ్చుకుని టాక్సీలో బెంగుళూరు బయలు దేరాం. ఇన్ని రోజులు అడవి, కాఫీ ప్లాంటేషన్స్, రిసార్టు పార్కుల మధ్యలో ఉల్లాసంగా గడిపిన తర్వాత తిరిగి కలతల ప్రపచంలోకి వెళ్ళడానికి మనస్సు నిరాకరించింది. కానీ తప్పదు కదా? బెంగుళూరులో నాలుగున్నర కల్లా మావారి మేనల్లుడు ఇంటికి చేరుకున్నాం. రాత్రి వరకు కబుర్లతో కాలక్షేపం అయింది. మరుసటి రోజు అంటే 23న సాయంత్రం ఫ్లైట్‌లో బయలుదేరి రాత్రి ఎనిమిదికల్లా హైదరాబాద్ చేరుకున్నాం. ప్రకృతి ప్రేమికులు తప్పనిసరిగా చూడవల్సిన ప్రదేశాలలో విరాజ్‌పేట్ ఒకటని అనిపించింది. అక్కడి అనుభవాలు గుర్తుకొచ్చినప్పుడల్లా మనస్సు ఆనందంతో మైమరచేది!

pl give telugu typing option like emaata magazine, please
people are already typing their comments in telugu in this site