1.మలయాళ సాహిత్యంలో మీరు నవలా రచయితగా, కథకుడగా చాలా ప్రసిద్ధులు, ప్రతిష్టాత్మకమైన తుంజన్ మెమోరియల్ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉన్నారు. ఈ సంస్థను ఎలా ఉన్నతికి తీసుకురాగలిగారు?
పదహారేళ్ల క్రితం ఈ సంస్థకు చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఇక్కడ చెప్పుకోదగ్గ వాతావరణం లేదు. నిధుల్లేవు.ఒక చిన్న ఆడిటోరియం, మంటపమూ ఉండేవి. నా సాహిత్య పర్యటనల్లో భాగంగా మన దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ మలయాళీలను కలిసినప్పుడు వాళ్ల సహకారాన్ని కోరాను. ఇది భాష కోసం, సాహిత్యం కోసం ముందు తరాల కోసమని చెప్పాను. మంచి స్పందన వచ్చింది. వచ్చిన నిధుల్తో దీనిని అభివృద్ధిపరచాం. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, కాటేజ్‌లు ఏర్పడ్డాయి.
2.తుంజన్ స్మారకంలో జరిగే కార్యక్రమాలకు కేంద్రాంశాలేమిటి?
16వ శతాబ్దపు మలయాళ మహాకవి తుంజన్ పేరిట ఉన్న స్మారకమిది. మలయాళ భాష లక్షణాల్ని పునర్నిర్వచించిన రుషికవి ఆయన. భాషను ప్రజలకు చేరువ చేశాడు. రామాయణ మహాభారతాల్ని అనుసృజించాడు. ఆయన పేరిట ఈ సంస్థలో వివిధ భాష సాహిత్యాల్ని దగ్గరికి తేవడం, పలు భాషా రచయితలను ఒక వేదిక మీదికి తీసుకురావడం ప్రాతిపదికగా కార్యక్రమాలు చేస్తుంటాం. భారతీయ భాషల్లోకి అనేకమంది సీనియర్ రచయితలతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి కూడా రచయితలు ఇక్కడకి వచ్చారు. పలు భాషల రచయితల నడుమ సంబంధాలేర్పడడం, అవి కొనసాగడం, వివిధ భాషా సాహిత్యాల గురించి అందరికీ ఒక కనీసపు అవగాహన ఉండాలని ఆశించడం – ఈ దిశలో కార్యక్రమాలు జరుగుతాయి.
3.ఏటేటా జరిగే తుంజన్ ఉత్సవం సాహిత్య పర్వదినంగా ఉంటుంది. దాని గురించి చెప్పండి.
మహాకవి తుంజన్ ఘంటాన్ని ఉత్సవ వాతావరణంలో వీధుల్లో ఊరేగిస్తాం. సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. ఇదిగాక ఏడాదికోసారి “విద్యారంభ” అనే కార్యక్రమం చేస్తాం. ఐదారువేల మంది పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతుంది. అన్ని మతాలవాళ్లు పాల్గొంటారు. బియ్యపు పళ్లెంలో అక్షరాల్ని రాయిస్తా. అలాగే బంగారు ఉంగరంతో పిల్లల నాల్కల మీద రాస్తాం. ఇదంతా ఒక మెటఫర్. జ్ఞానమే సంపద. జ్ఞానమే ఆహారం.
4.ఈ తుంజన్ స్మారకాన్ని వృద్ధి చేసే క్రమంలో మీ వ్యక్తిగత సాహిత్య సృజన కార్యక్రమాలేమైనా దెబ్బతిన్నాయా?
నేను కాలికట్‌లో ఉంటాను. ఇక్కడికి గంటన్నర ప్రయాణం. వచ్చీపోతూ ఉంటాను. పనుల్ని పర్యవేక్షిస్తాను. పెద్దగా నా సృజనకు అవేమీ అడ్డు కాలేదు.
5.సాహిత్యమే మీ ప్రాణం కావడానికి దోహదం చేసిన కారకాలేంటి?
సాహిత్యమంటే అమిత ఇష్టం. కుగ్రామంలో ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న రోజుల్లో మొదలెట్టాను. సాహిత్యం వల్ల డబ్బు సమకూరుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. రాస్తూ పోయానంతే. క్రమంగా రాయడం నా వృత్తైంది. నా జీవికకు సామాగ్రిని సమకూర్చింది.
6.మీ కుటుంబ నేపథ్యాన్ని చెబుతారా?
పల్లెటూళ్లో పుట్టాను. ఆరు మైళ్లు నడిస్తే స్కూలు, ఆర్థికంగా చాలా వెనుకబడ్డ పేద కుటుంబం నుంచి వచ్చాను. నాన్న సిలోన్‌లో పని చేసేవాడు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి నాన్న మాకు డబ్బు పంపడం కష్టమైపోయింది. నాకు మంచి బట్టలుండేవి కావు.. కాలేజీలో సంపన్న సహాధ్యాయులతో తిరిగేవాణ్ణి కాదు. ఎక్కువ సమయం లైబ్రరీలో గడిపేవాణ్ణి.
7.’మాతృభూమి‘ వీక్లికి సంపాదకులుగా చాలాకాలం పని చేశారు కదా? మీదైన ప్రత్యేకమైన కృషి ఏంటీ?
సాహిత్య ప్రియుణ్ణి కాబట్టి మాతృభూమి వీక్లీ సంపాదకుడిగా పని చేశాను. రాజకీయాల్తో ముడిపడి ఉన్న డైలీ విభాగాన్ని ఇస్తామన్నా వద్దన్నాను. వీక్లీ సంపాదకుడిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరమూ రిపబ్లిక్‌డే సందర్భంగా ప్రత్యేక సంచిక వెలువరించేవాణ్ణి. దాన్లో 14 భాషల నుంచి 14 కథల్ని ఎంపిక చేసి ఆ సంచికలో ఆయా రచయితల క్లుప్త పరిచయంతో సహా ప్రచురించేవాణ్ణి. దీని మూలాన వివిధ భాషల రచయితలనేకమంది మలయాళ సాహిత్యాభిమానులకు పరిచయమయ్యారు. సంపాదకుడిగా వందలకొలది నిస్సారమైన రచనల్ని చదవాల్సి వచ్చేది. ఐతే ఎప్పుడో ఒకప్పుడు ఎంతో అద్భుతమై రచన కనబడేది. పరమానందం కలిగేది. అచ్చేసేవాణ్ణి వీక్లీలో అలా చాలామంది కొత్త రచయితల్ని కనుగొని ప్రోత్సహించాను. వాళ్లలో ఇవాళ చాలామంది ప్రసిద్ధులైనారు.
8.దాదాపు పదేళ్ల క్రితం ఈ తుంజన్ మెమోరియల్‌కు నేను వచ్చినప్పుడు విన్నదేంటంటే మీరు ఏడాదిలో ఆర్నెళ్లు సాహిత్య యాత్రలు చేస్తారని, వాటి గురించి చెప్పండి.
అప్పట్లో అంతగా యాత్రించిన మాట నిజమే. ఆఫ్రికా తప్ప అన్ని ఖండాలూ తిరిగాను. అమెరికా యూరప్, గల్ఫ్‌లకు చాలాసార్లు వెళ్లాను. చాలా బుక్ ఫెస్టివల్స్‌కు ఆహ్వానించబడ్డాను. ఆరోగ్య కారణాల వల్ల ఇప్పుడెక్కువగా తిరగడం లేదు.
9.ఈ యాత్రల అనుభవమేంటి?
కొత్త ప్రాంతాల్ని చూడ్డం, కొత్త వ్యక్తుల్ని కలవడం నాకెంతో ఆనందదాయకమైన విషయాలు. బయటి ప్రపంచం అర్థమవుతుంది. సమయాన్ని వెచ్చించాల్సిన మాట నిజమే కానీ, అధ్యయనశీలత కొరవడ్డ ఈ రోజుల్లో, భాషలు చిన్నచూపుకు గురవుతున్న ఈ కాలంలో సాహిత్య పర్యటనల అవసరం ఎంతైనా ఉంది. విషాదమేంటంటే ఇక్కడ మలయాళం చదవకుండా డిగ్రీ తీసుకోవచ్చు. సొంత భాష పట్ల ఇంత నిర్లక్ష్యమా? నా బాధ్యతగా ఈ విషయంలో నేను గట్టిగా మాట్లాడుతున్నాను. దీని వెనుక రాజకీయాల్ని కూడా ప్రశ్నిస్తున్నాను.
10. మీకు తొలిరోజుల్లో కవిత్వం రచనకు ప్రయత్నించారని విన్నాను. నిజమేనా?
నిజమే. అసలు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కవిత్వంతోనే మొదలవుతారని అనుకుంటాను. సూర్యోదయాన్ని గురించో, చంద్రకాంతిని గురించో రాస్తూ.. నేను మొదట్లో కవిత్వం రాశా. పదహారేళ్ల వయస్సులో ఒకేసారి ఒక కవితనూ, ఒక కథనూ, ఒక వ్యాసాన్నీ, వేర్వేరు పేర్లతో అప్పట్లో వస్తున్న ‘చిత్ర కేరళ’ అనే పత్రికకు పంపాను. మూడు అచ్చయ్యాయి. కొంతకాలం ఊగిసలాడాను, ఎటువైపు వెళ్లాలా అని. మా చిన్న పల్లెటూళ్లో మార్గ నిర్దేశం చేసేవాళ్లు లేరు. నాకు నేను స్ట్రగుల్ అయ్యాను. కవిత్వంలో రాణించలేననిపించి కడకు కథనే ఎంచుకున్నాను.
11. కథలూ రాశారు, నవలలూ రాశారు కదా! దేనిని గాఢంగా ఇష్టపడ్తారు మీరు?
కథనే. ఎందుకంటే నవల ఎంత మంచిదైనా దాన్లో అక్కడక్కడా బలహీనతలుండే వీలుంది. కానీ కథ అలా కాదు. అన్ని విధాలా పక్కాగా ఉంటేనే తప్ప అది మంచిదనిపించుకోదు.
12. ఎన్నో రాశారు కదా! వైవిధ్యంతో కూడా కథలూ, నవలూ, ఇతరాలు ఎన్ని రాసి ఉంటారు?
తొమ్మిది నవలలు, పదహారు కథా సంపుటాలు, మూడు యాత్రా రచనలు, మూడు బాలల పుస్తకాలు, రెండు విమర్శ గ్రంథాలు రాశాను. ఇవన్నీ పునర్ముద్రణ పొందుతున్నాయి. ప్రతీ వారం పునర్ముద్రణతో కొత్త పుస్తకాల బండిల్స్ ఇంట్లోకి వస్తూంటే వాటి కోసం చోటుకై మా ఆవిడ ఆందోళన పడుతుంది. పుస్తకాలే మన ఆస్తి అని నేనంటాను. నా తొలి రచన కూడా ఇవాళ ముద్రణలో ఉండడం నాకెంతో ఆనందకరమైన విషయం.
13. ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేశారు కదా! ఆటోబయోగ్రఫీ ఏదైనా రాశారా?
రాయలేదు. కానీ ఇటీవలె నా జీవనానుభవాల్ని గుర్తు చేసుకుని రాసినవాటితో “అమ్మకు” అనే పుస్తకం వచ్చింది. అది ఆంగ్లంలో “Bear with me, Mother” అనే పేరుతో ఇటీవలే ప్రచురించబడింది.
14. విస్తృత పర్యటనలూ, విస్తార అధ్యయనమూ, అనుభవ సంపత్తీ, బహుళ సంబంధాలూ ఉన్న మీలాంటివాళ్లు “ఆత్మకథ” రాస్తే ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది కదా?
దాన్ని నేను కాదనను. అయితే ఒక దశలో ‘ఆత్మకథ’రాయనక్కర్లేదని ఎందుకనుకున్నానంటే, నా అనేకానేక అనుభవాలూ, చిన్న నాటి జ్ఞాపకాలు నా కథల్లో నవలల్లో వచ్చేశాయి. మళ్లీ ఆత్మకథ పేరిట రిపీట్ చేయడమెందుకన్పించింది. ఐతే ఇవాళ కూడా నేను ఆత్మకథను రాయగలను. ఎందుకంటే ఇంకా నేను సాహిత్యంలో ఇమడ్చని అనేక విషయాలు నా దగ్గర ఉన్నాయి.
15. ఫిక్షన్ రచనకు సామాజిక జీవితంలో నిరంతర సంపర్కమవసరం కదా. మీరు ఆ సంబంధాన్ని ఎలా ఏర్పరుచుకున్నారు?
నేనెక్కువగా గ్రామీణ జీవితం గురించే రాశాను. గ్రామీణ వాతావరణంతో నాకున్న సుదీర్ఘ సాన్నిహిత్యం, అనుభవాలు నా రచనకు ఉపకరణాలైనాయి. అనుభవాలంటే అన్నీ ప్రత్యక్షానుభవాలని కాదు. పరోక్షమైనవి కూడా. అంటే అమ్మ చెప్పినవో, పరులు చెప్పినవో అన్ని నాలో చేరాయి. పిల్లవాడు దార్లో వెళ్తూ వెళ్తూ కనబడ్డ గులకరాళ్లను తీసుకుని జేబులో వేసుకున్నట్టుగా నేను అనుభవాల్ని భద్రపరుచుకున్నాను. ఇప్పటికీ కొన్ని రాళ్లు నా జేబులో భద్రంగా ఉన్నాయి.
16. మీ రచనా విధానం దగ్గరికొస్తాను. మీరు ఒక నవలను మొదలెడితే ఏకబిగిన రాస్తారా? విడతలు విడతలుగా విరామం తీసుకుని రాస్తారా?
ఒక వూపులో మొత్తం నవలను రాస్తాను. సాధారణంగా ఏకాంత వాతావరణంలో రచన చేస్తాను. కాలికట్‌లో ఇంట్లో ఉంటున్నా.. రచన కోసం పొద్దున్నే హోటల్‌కెళ్లి ఓ రూమ్‌లో రాయడం మొదలుపెట్టి రాత్రి ఇంటికొచ్చేవాణ్ణి. రచన మొదట డ్రాఫ్ట్ అయ్యేదాకా అలా ఏకాంతంలోనే ఉండేవాణ్ణి.
17.ఒక రచనను పూర్తి చేయడానికి సాధారణంగా ఎన్ని డ్రాఫ్ట్‌లు రాస్తారు?
కనీసం రెండు, మూడైనా రాస్తాను. భాష, శైలి బాగా రావడానికి అలా రాస్తాను. అత్యంత సరళంగా రచన వచ్చిందా లేదా అని చూసుకుంటాను. ఆ సరళత నాకిష్టం. నా పుస్తకాలు పాఠకులకు దగ్గరవడానికి ఈ సరళతే కారణం.
18. మీరు ఏక కాలంలో రెండు రచనల్ని సమాంతరంగా చేస్తారా? అంటే రెండు నవలల్నో, రెండు కథల్నో లేదా ఒక నవలతో పాటు ఓ కథనో?
లేదు. నేను రెండు పనుల్ని ఒకే సమయంలో చేయను. ఒక దాని తర్వాతే మరొకటి, నవల మొదలెట్టాననుకోండి. దాని మొదటి డ్రాఫ్ట్ పూర్తి చేశాకనే మరో రచనకు పూనుకుంటాను.
19. మీరు రచన చేస్తున్న కాలంలో వేరే రచయితల పుస్తకాలు చదువుతారా? సృజన సమయంలో అధ్యయనం చేస్తారా అని తెలుసుకోవాలని ఉంది?
తప్పక చదువుతాను. చాలావరకు సాహిత్య గ్రంథాల్నే చదువుతాను. నేను చేసే రచనకు భిన్నంగా ఉండే రచనల్నే ఎక్కువగా చదువుతుంటాను. అధ్యయనం నాకు నిరంతర విషయం.
20.ఎప్పుడో రాసిన మీ తొలి రచనల్ని మళ్లీ ఇప్పుడు చదువుకుంటారా?
పెద్దగా లేదు. ఐతే యాభై యేళ్ల కింద నేను రాసిన నా నవలను మళ్లీ చదివినప్పుడు అక్కడక్కడా కొన్ని బలహీనతల్ని గుర్తించాను. ఆ నవలలో ఓ అధ్యాయంలో ఒక ప్రాంతం గురించిన ప్రస్తావన ఉంది. అది బాగా రాయలేదని తర్వాత చదివినప్పుడు అనిపించింది. ఆ ప్రాంతానికి వెళ్లి నేను కొద్ది రోజులు అధ్యయనం చేసి ఉంటే ఆ అధ్యాయాన్ని ఇంకా బాగా రాసి ఉండేవాణ్ణని ఇప్పడనిపిస్తున్నది. ఈ విషయాన్ని నాలోనే ఉంచుకోకుండా పాఠక లోకానికి బాహాటంగా తెలియజేశాను కూడా!
21.మలయాళ సాహిత్యంలో మీ సీనియర్ రచయితల ప్రభావం మీ మీద పడిందా?
నా సీనియర్ రచయితలు, ప్రతిభావంతంగా, అనుభవ సంపత్తితో, తమదైన శైలితో రచనలు చేసి సాహిత్యాన్ని బలోపేతం చేశారు. వారి పట్ల నాకెంతో గౌరవముంది. ఐతే నేను ఎంచుకున్న శైలి వేరు. మార్గం వేరు.
22. మీ మార్గం వేరన్నారు కదా! మలయాళ సాహిత్యానికి మీరైదేనా మలుపునిచ్చినట్టు భావిస్తున్నారా?
నాకు ముందు కృషి చేసిన తగళి, పొట్టెక్కాళ్ లాంటి సీనియర్ రచయితలు నిస్సందేహంగా గొప్పవాళ్లు. కొందరి శైలి ఎంత ప్రత్యేకమైందంటే మరెవరైనా అనుకరించడం చాలా కష్టం. వాళ్లలో చాలామందికి రాజకీయ ఉద్యమానుభవాలున్నాయి. వాటిని సృజనలో చేర్చారు కూడా. ఐతే నేననుకునేదేంటంటే వాళ్లు మనిషి అంతర్ ప్రపంచాన్ని అంతగా పట్టించుకోలేదు. నేను మనిషి మానసిక ఘర్షణల మీద ధ్యాసను కేంద్రీకరించాను. మనుషుల లోపల ఏం జరుగుతున్నదో చదవడానికి యత్నం చేశాను. వాటిని నా రచనల్లో ప్రతిఫలించడం ద్వారా బాహ్య ప్రపంచంతో పాటు అంతర్ ప్రపంచపు గమనాల్నీ సాహిత్యంలో తెచ్చినవాణ్ణయ్యాను. ఆ కోణంలో మలయాళ సాహిత్యానికి నేనొక మలుపునిచ్చినట్టుగా భావిస్తున్నాను.
23. ఇన్నేళ్ల రచనానుభవాన్ని సముపార్జించుకున్న మీరు, ఇప్పుడేదైనా కొత్త రచనకు పూనుకున్నప్పుడు అలవోకగా రాసేస్తారా?
ఇంత రచనా ప్రయాణం తర్వాత కూడా , కొత్త కథను రాయడానికి కూర్చొన్నప్పుడు నర్వస్ అవుతాను. పదో తరగతి పిల్లాడు పరీక్షకు ముందు ఎలా టెన్షన్‌కు గురవుతాడో అలాంటి స్థితి అన్న మాట. ఐతే మొదటి డ్రాఫ్ట్ కాగానే ఆ నర్వస్‌నెస్ పోతుంది.
24. మీ నవలల విషయంలో మీకు ఎక్కువ తక్కువ ఇష్టాలున్నాయా?
నా ప్రతీ నవలకూ ఒక నేపథ్యమూ, ప్రత్యేకతా ఉన్నాయి. యేళ్ల సమయం తీసుకుని పూర్తి చేసినవి కొన్నైతే. చాలా తేలిగ్గా పూర్తి చేసినవి మరికొన్ని. సంతానంలో పిల్లల్ని సమంగా ఇష్టపడినట్లే నా రచనల్ని ఇష్టపడతాను.
25.సినిమాలతో మీకు సంబంధముంది. మీ స్క్రీన్‌ప్లేల కోసం నిర్మాతలు క్యూలు కడతారని విన్నాను.
దాదాపు ముప్పయేళ్ల కాలంలో ఇరువై మూడు స్క్రీన్‌ప్లేలు ఇచ్చాను. ఇప్పటివరకు నిజమే. నా స్క్రీన్ ప్లేల కోసం చాలా డిమాండ్ ఉంది. చాలా మంచి పేరుంది వాటికి. ఒకప్పుడు జీవితంగా గడ్డుగా ఉన్నప్పుడు సినిమా ఆదాయం ఆదుకున్నది. ఇప్పుడు స్థిరపడ్డాను. సాహిత్యమే నా ప్రధాన వ్యాపకం. ఇప్పటికీ చాలామంది సినిమావాళ్లు స్క్రీన్‌ప్లేల కోసం వస్తుంటారు. నేను ఒప్పుకోవడం లేదు. నాకు నేను చేయాలనుకున్నప్పుడు మాత్రమే చేస్తాను. సాహిత్య సృజనే నా ప్రాణం.
26.మీ రచనలకు మీరు పొందుతున్న రాయల్టీ ఎలా ఉంది?
ప్రతి సంవత్సరమూ నేను మూడున్నర నుంచి నాలుగు లక్షల దాకా ఆదాయం పన్ను కడతాను. నా అన్ని పుస్తకాలకూ రాయల్టీ వస్తున్నది. పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. కొత్త తరంతో సహా అంతా నా పుస్తకాల్ని ఆదరిస్తున్నారు. పద్మభూషణ్ అవార్డు కన్న పాఠకుల ఆదరణే నన్ను గర్వపడేలా చేస్తున్నది.
27.పద్మభూషణ్ పొందారు. జ్ఞాన్‌పీఠ్ అవార్డు మిమ్మల్ని వరించింది. నాలుగైదు గౌరవ డాక్టరేట్లూ మీకు వచ్చాయని విన్నాను. ఇన్ని ఉన్నా మీరు చాలా సింపుల్‌గా ఉంటారు. సాదాసీదాగా కనబడతారు. తెచ్చిపెట్టుకున్న గాంభిర్యం లేదు. ఈ తత్వం మీకెలా సాధ్యమైంది?
నేను సామాన్యుణ్ణి. పల్లెటూరు నుంచి గడ్డు పరిస్థితుల నుంచి వచ్చాను. నేనొకటే నమ్ముతాను. నా రచన బాగుంటే అదే సజీవత్వం. 1958లో నేను రాసిన నవల ఇప్పటికీ 10 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. ఇవాళ్టికీ అది మార్కెట్లో ఉంది. ఇదెలా సాధ్యమైంది? పాఠకుల వల్ల. వాళ్లకు సర్వదా నేను కృతజ్ఞుణ్ణి. వాళ్లు నా రచనల్ని ప్రేమిస్తున్నారు.
28. కొత్త యువ రచయితలు మీ దగ్గరకొచ్చి తమ రచనలు మీద మీ అభిప్రాయం అడిగినప్పుడు ఏ పద్ధతిలో స్పందిస్తారు?
నిజంగానే నిక్కచ్చైన అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే తపనతో వచ్చేవాళ్లకు నిర్మోహమాటంగా నా అభిప్రాయం చెబుతాను. దాచుకోను నేను ‘మాతృభూమి’కి సంపాదుకుడిగా ఉన్నప్పుడు ప్రచురణ కోసం వచ్చే రచనల మీద నా అభిప్రాయాల్నీ, సవరణల్నీ సూచిస్తూ లేఖలు రాసేవాణ్ణి. అవి వారికి ఉపయుక్తంగా ఉన్నట్టు నాకు తెలిపే వారు. ఐతే చిత్తశుద్ధి, సీరియస్‌నెస్ లేకుండా ఎవరైనా వస్తే ఏం స్పందిస్తాం? వాళ్ల సమయమూ నా సమయమూ వృథా అవడం తప్ప!
29. మీ సాహిత్య వ్యాసంగానికి కుటుంబ సహకారం ఎలా ఉంది?
చిన్నప్పుడు కిరోసిన్ దీపం దగ్గర కూర్చుని రచనలు చేసేవాణ్ణని మా అమ్మకు తెలియదు. పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఎలా నడపాలనే ధ్యాసలో ఆమె ఉండేది. మొదట్లో నా రచనా వ్యవహారం మా నాన్నకూ అర్థం కాలేదు. క్రమంగా అది నా జీవితానికి ఊతంగా ఉందని తెలుసుకున్నాడు. తొలి రోజుల్లో నా భార్యకు ఇదంతా కొత్తగా ఉండేది. రచనలు చేస్తున్నప్పుడు రోజులు తరబడి ఇంట్లో అంతా మాట్లాడేవాణ్ణి కాదు. క్రమంగా సాహిత్యానికి నేను కమిట్ అయ్యానని నా భార్యకూ, పిల్లలకూ అర్థమైంది. వాళ్ల నుంచి ఎంతో సహకారం లభించింది. నా ఇద్దరు కూతుళ్లకూ సాహిత్యమన్నా, పుస్తకాలన్నా ఇష్టమే. కుటుంబ సహకారం ఏ రచయితకైనా చాలా అవసరం.
30. రచయితలు ఉన్నత స్థాయిని చేరుతున్న క్రమంలో, లేదా చేరిన తర్వాత అసూయా ద్వేషాలకు గురయ్యే అవకాశం ఉందని చెప్పడానికి చాలా భాష సాహిత్యాల్లో దాఖలాలున్నాయి. మీకలాంటి స్థితి ఎదురైందా?
ఎదురైంది. ఐతే ఇవి ఎక్కడైనా ఉంటాయి. ఉదాహరణకు ఈ తుంజన్ మెమోరియల్‌ను క్రమక్రమంగా నేను వృద్ధి చేస్తున్నప్పుడు వ్యతిరేకతను ఎదుర్కున్నాను. అసూయలు ఉండనే ఉన్నాయి. ఐతే నేనివేవీ పట్టించుకోనూ, పని చేసుకుంటూ పోతాను. అది నా పద్ధతి.
31.మలయాళ సమాజంలో యం.టి.గా మీరు సుప్రసిద్ధులు. చాలా పాపులర్ వ్యక్తుల్లో ఒకరు. రాజకీయాల్తో మీ సంబంధాల గురించి చెప్పండి.
పార్లమెంటుకూ, అసెంబ్లీకి పోటీ చేయమని చాలా ఆఫర్లు వచ్చాయి. నేను కాదన్నాను. ఎందుకంటే నా కమిట్‌మెంట్ సాహిత్యానికే. అది నా అంతిమ ప్రపంచం. ఆ ప్రపంచంలో స్వచ్ఛతనూ, శుద్ధినీ, సౌందర్యాన్ని చూశాక ఇక మరోదాన్లోకి ఎలా వెళ్లగలను? అందుకే రాజకీయాల్లోకి వెళ్లలేదు.
32. మీ సాహిత్య జీవితంలో మిమ్మల్ని కదిలించిన ఏదైనా ఒక అనుభవాన్ని చెప్పండి.
చాలా అనుభవాలున్నాయి. ఒకటి చెబుతానిక్కడ. 1976లో నేను తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో ఉన్నాను. అలాంటి స్థితిలో నా దగ్గరికి ఓ పల్లెటూరతను వచ్చాడు. నా రచనలంటే అభిమానమనీ, తాను చదివానని చెప్పాడు. ఏమన్నాడంటే – “మీరు జబ్బుతో వున్నారని తెలిసి సేవ చేయడానికి వచ్చాను. కొన్ని పనులు మగ నర్సులే చేయాల్సి వుంటుంది. మీకు నయమయే దాకా ఆ పనులు చేస్తాను” నేను కదిలిపోయాను. అతను తన వ్యవసాయ పనులను ఆపుకుని మరీ వచ్చాడు. రచనా ప్రయాణంలో పడ్డ ఏళ్ల కష్టాలు బరువు ఇలాంటి ఒక్క ఘటనతో తగ్గిపోయినట్లనిపిస్తుంది. కళ్లు చెమ్మగిల్లుతాయి.
33. ఈ దేశంలో కానీ, ప్రపంచం మొత్తంలోగానీ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన రచయితలెవరు?
మలయాళ రచయితలనందరినీ చదివాను. పాశ్చాత్య రచయితల్లో చాలామంది ప్రముఖుల్నీ చదివాను. ఐతే దోస్తోవిస్కీని చాలా చాలా గౌరవిస్తాను. నా దృష్టిలో ప్రపంచంలో అత్యుత్తమ రచయిత ఆయన.
34.మలయాళ సాహిత్య భవిష్యత్తు ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు?
ఆ విషయంలో నాకు ఆందోళన లేదు. బాగా రాసేవాళ్లు, చిత్తశుద్ధి ఉన్నవాళ్లు చాలామందే వస్తున్నారు. అదృష్టవశాత్తు ఇక్కడ రీడర్‌షిప్ ఎక్కువ. పబ్లిషర్సూ ఉన్నారు. రచనలు పబ్లిష్ కావడం అంత కష్టం కాదిప్పుడు.
35. సమాజం సాంకేతికమయమవుతున్న క్రమంలో భవిష్యత్తులో సాహిత్య మనుగడ ఎలా ఉంటుంది?
సాంకేతికత ఎలా ఉన్నా, సాహిత్యానికి ఆటంకం కాదు. దృశ్య మాధ్యమాలు ఎంత పెరిగినా పుస్తకం విలువ తగ్గదు. ఒక పుస్తకాన్ని చదివే పాఠకుడికి దానిపై యాభై శాతం సాధికారికత వుంటుంది. దానితో తన అవగాహనను జత చేసి తన మెదళ్లో ఒక కొత్త పుస్తకాన్ని రచిస్తాడు అదీ పుస్తకం గొప్పదనం!
ఇంటర్వ్యూ: దర్భశయనం శ్రీనివాసాచార్య
దర్భశయనం శ్రీనివాసాచార్య
కవి, విమర్శకుడు. అనువాదకుడు, “కవిత్వం “ వార్షిక సంకలనాలకు సంపాదకుడు .1961లో వరంగల్ లో జననం . ఇప్పటివరకు 12 తెలుగు కవితాసంపుటాలు, ఒక ఆంగ్ల కవితాసంపుటి (Scents of the Soil), ఒక విమర్శ గ్రంథం (ఇష్ట వాక్యం ), పిల్లల కోసం “బాలల కోసం బాటసారి పదాలు” అనే సంపుటిని వెలువరించారు.