రేష్మ

Spread the love

నేను చెట్టుకు వేలాడుతున్నాను. నా పసుపుపచ్చ చున్నీయే నా మెడ చుట్టూ ఉచ్చులా బిగుసుకుని ఉంది. బిగుతుగా అల్లిన నా జడ గాలికి మెల్లగా అటూ-ఇటూ ఊగుతోంది. దట్టమైన నా జుట్టుకి రాసిన కుసుమ నూనె ఘుమఘుమలాడిపోతోంది. నాలుక బయటకి వేలాడుతోంది. కళ్ళు ఇంకా తెరిచే ఉన్నాయి. చనిపోయాక కూడా ఆ కళ్ళు శూన్యంలో దేన్ని వెతుకుతున్నాయో మరి! చల్లగా చల్లబడిపోయిన చేతులు కాస్త బిగుసుకుపోయి  ఊగిసలాడుతున్నాయి. రెండు కాళ్ళూ దూరంగా చాపినట్టు ఉండి గాలికి ఊగుతున్నాయి. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది సరే, మరి ఆత్మ మాట ఏంటన్నట్టు?! నా శవాన్ని చూస్తున్నంతసేపూ ఇవే ఆలోచనలు. తెల్లవారుతూనే కాకులు-గద్దలు అక్కడక్కడే చక్కర్లు కొడుతున్నాయి. చెట్టు కొమ్మలమీద వచ్చి వాలాయి. బహుశా విందు భోజనానికి రమ్మని తమ బంధువులని కూడా పిలుస్తున్నట్టున్నాయి. ఒక పెద్ద మాంసం ముక్క చెట్టుకు వేలాడుతోంది. అంతేగా, ఈ శరీరం వాటికి మాంసం ముక్కే మరి! వాటిని చూస్తే ‘అసలు మనుషులకీ, వీటికీ ఏమన్నా తేడా ఉందా?’ – అనిపించింది! వీటి దృష్టిలో కూడా మానవ శరీరం అంటే మాంసం ముద్దే! కానీ ఈ గద్దలు-రాబందులు మనుషులకంటే చాలా నయం. బతికున్న మనిషిని మాంసం ముద్ద అనుకోవు. ఇవి ఎవరి ఆత్మల గొంతూ నొక్కెయ్యవు. ఎవరిమీదా అత్యాచారం చెయ్యవు. చంపి చెట్టుకు వేలాడదీసి ఉడాయించవు. స్త్రీని కూడా మనిషిగా గుర్తించడం, స్వయంగా మానవత్వం ఉన్న మనిషిగా మారడం మాట దేవుడెరుగు, మగాడు కనీసంలో కనీసం ఈ గద్దల్లా-రాబందుల్లా మారడానికి కూడా ఇంకా చాలా కాలం పడుతుంది.   

            తెల్లవారుతూనే ఒక్కక్కళ్ళుగా జనం పోగయ్యారు. ఎవరినోట విన్నా ఒకటే ప్రశ్న – ఎవరీ అమ్మాయి? అయ్యో ఎవరో గిరిజనుల పిల్లలా ఉందే! రాత్రి ఏమయింది? ఇదంతా చేసింది ఎవరు? ఎవరో సంచారజాతుల వాళ్ళ పిల్లయితే కాదు కదా? ఎవరితో అయినా అక్రమసంబంధం పెట్టుకుందంటావా? వాళ్ళ మనసుల్లో ఇలాంటేవే వందలాది ప్రశ్నలు! సుమారు రెండు-మూడు గంటల తర్వాత పోలీసులు వచ్చారు. నా శరీరాన్ని చెట్టు మీది నుంచి కిందకి దింపారు. పోస్టుమార్టం కోసం బాడీని పట్నం తీసుకెళ్ళారు. ఇంక చెట్టుకింద ఉన్న గుంపు కూడా మెల్లమెల్లగా చెదిరిపోయింది. నా శవం గురించిన చర్చ కూడా క్రమంగా సద్దుమణిగింది. ఇప్పుడు చుట్టుపక్కల అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో కూడా గాలి మెల్లగా వీస్తూంది. చెట్ల కొమ్మలు ఒకదానికొకటి ఒరుసుకుని చర్ర్ … చర్ర్ మని చప్పుడు చేస్తున్నాయి. నేను ఆ చెట్టుకొమ్మకి వేలాడుతూ ఉయ్యాల ఊగుతున్నాను.

            అసలు ఇది ఏ ఊరు? చూడటానికి ఏదో రైల్వే స్టేషనులా ఉంది. ఆఁ ‘బిసరా స్టేషన్’. ఝార్ఖండ్ నుండి ఒరిస్సా వెళ్ళే దారిలో వస్తుంది. ఆ రైల్వే లైనుకి ఆనుకునే అడవి. దానికి దగ్గర్లోనే సారండా అటవీప్రాంతం కూడా. దారిమధ్యలో కొన్ని చిన్న-చిన్న పల్లెటూళ్ళు కూడా ఉన్నాయి. చాలామటుకు ఊళ్ళు రాత్రి ఎనిమిదవుతూనే నిద్రలోకి జారుకుంటాయి. అప్పుడు అడవి తన పాట కచేరీ మొదలుపెడుతుంది. మళ్ళీ తెల్లవారుఝామున నాలుగింటికి కోడి కూతతో ఊరు మేల్కొంటుంది. దానికంటే ముందు గొడ్లు నిద్రలేస్తాయి. తల ఆడిస్తూ ఎండుగడ్డి తినే ఆ పశువుల మెడలో గంటలు లయబద్దంగా ఊగుతూ ‘టున్’ ‘టున్’ మని శబ్దం చేస్తూ ఉంటాయి. ఆ గంటల చప్పుడుకే మెల్లగా-మెల్లగా కళ్ళు నులుముకుంటూ ఊరు నిద్రలేస్తుంది.

ఆరోజు రాత్రి మేము ట్రైన్ లో బిసరా స్టేషన్ చేరుకున్నాం. జనరల్ బోగీలో ఎక్కి కూర్చున్నాం. పెద్దగా జనం లేరు. ట్రైన్ బిసరా స్టేషన్ చేరుకుంటూనే నాతోపాటు వచ్చినా ఐదుగురూ దిగిపోయారు. నన్ను కూడా దిగమన్నారు. కాసేపు చల్లగాలి పీల్చుకోవడానికి దిగారేమో అనుకున్నాను. ఇంతలో వాళ్ళల్లో ఒకడు నా నోరు నొక్కేసాడు. అందరూ కలిసి నన్ను పొదల్లోకి లాక్కెళ్ళిపోతున్నారు. నేను కాళ్ళూ-చేతులూ టపటప కొడుతూ గింజుకుంటున్నాను. వాడి చెయ్యి కొరికి బలవంతంగా అయినా నోరు తెరిచి అరవాలని ప్రయత్నించాను. ఇంతలో ట్రైన్ కదిలింది. నా అరుపులు ఆ ట్రైన్ చప్పుడులో కలిసిపోయాయి. అసలు ఎవరు ఆ ఐదుగురు? హుఁ… ఇంకెవరు?

“అందరూ తెలిసినవాళ్ళూ, చుట్టాలే. ఎవరో కొత్తవాళ్లు కాదు. ఊళ్ళో, ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఉండేవాళ్ళే. తరచూ బజార్లో కనిపించేవాళ్ళే. నా నోరునొక్కి, నన్ను పొదల్లోకి లాక్కెళ్ళింది మరెవరో కాదు – చిన్నాన్న కొడుకు ‘సోమర’. ఊళ్ళో అందరూ వాణ్ణి ‘సోమర’ అంటారు కానీ, పట్నం నుంచి తిరిగొచ్చాక ‘సమర్’ అయిపోయాడు.”

“ఏమున్నావే! పిటపిటలాడిపోతున్నావు! చూస్తూ చూస్తూనే మంచి ఏపుగా ఎదిగిపోయావు?” పట్నం నుంచి తిరిగొచ్చిన సోమర ఒకరోజు బావిదగ్గర నీళ్ళు తోడుకుంటూంటే నన్ను చూసి ఆటపట్టించాడు.   

“నేను ఎదిగిపోతున్నాను సరే, నీ సంగతేంటో? ఆ పట్నం పోయి నువ్వు ఎలా ఊరిపోయావో చూడు కొబ్బరిబొండాం లాగ!”  నేను కూడా మాటకి మాట చురక అంటించాను.

“నేను కొబ్బరిబొండాంలా ఉన్నానా? ఏది ఇంకొకసారి అను.” అంటూ నా జళ్ళు రెండూ పట్టుకుని లాగాడు. అసలే నెత్తిమీద నీళ్ళబిందె. అలా జడ లాగడంతో బిందె తొణికి బట్టలన్నీ తడిసిపోయాయి. ఆ చల్లటి నీళ్ళు అలా బట్టల లోపలనుండి మెల్లగా కారి కారి …. ఒక్కసారిగా నా ఒళ్ళు జలదరించింది. మొత్తానికెలాగో వాడి గోల వదిలించుకుని ఇంటికి చేరుకున్నాను.

మా ఇద్దరివీ ఎదురెదురు ఇళ్ళే. ఒకళ్ళు తలుపు తెరిస్తే ఇంకొకళ్ళ గుమ్మం. వాళ్ళ ఇంటి వాకిలి కాస్త పెద్దగా ఉంటుంది. ఆ వాకిలి పక్క గదిలో ధాన్యం దంచుకోవడానికి ఒక పెద్ద రోలు. మా ధాన్యం కూడా వాళ్ళ రోట్లోనే దంచుకుంటాం. స్కూలు నుండి వస్తూనే రోట్లో ధాన్యం దంచే పని నాదన్నమాట! ఆ రోటి చప్పుడు విని సోమర మెల్లగా వచ్చి నా పక్కకి చేరడం మొదలుపెట్టాడు. నాకు కాస్త సాయం కూడా చేసేవాడు. అతను రోట్లో పోటేస్తే దంచిన ఆ ధాన్యం చేటలోకి తీసి నేను చెరిగేదాన్ని. రోజూ సాయంత్రం ధాన్యం దంచి, చెరిగి, శుభ్రం చేసి అన్నం వండే పని నాది. ఉదయం అన్నం వండే పని తెముల్చుకుని స్కూలుకు వెళ్ళాలి మాట!

“అన్నం సరిగ్గా వండటం నేర్చుకో. అప్పుడే నీకు మంచి అత్తవారిల్లు దొరుకుతుంది. రోజురోజూ ఈ ధాన్యం దంపే పని తప్పుతుంది.” రోజూ ధాన్యం దంపుతున్నంతసేపూ ఇదే పాట పాడుతూ ఉండేవాడు. 

“నేనేం పెళ్ళిచేసుకోను. కావాలంటే నువ్వు చేసుకో. ముందు నీ పెళ్ళే అవుతుంది చూడు! అసలే నీకు వయసు కూడా అయిపోతోంది. ముదిరిపోతున్నావు.” – నామాట వింటూనే ‘నాకు వయసయిపోతోందా? నేను ముదిరిపోతున్నానా?’ అంటూ మళ్ళీ నా జడ పట్టుకుని గుంజాడు.   

ఒకరోజు సాయంత్రం ఇద్దరం కలిసి ధాన్యం దంచుతున్నాం. కరెంటు లేదు. వాకిట్లో ఒక చిన్న కిటికీ మాత్రం ఉంది. ఆ కిటికీలో నుంచి వచ్చే సన్నటి వెలుతురులో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళకి కనిపిస్తున్నాయి. అతను ఒకపక్క పనిచేస్తూనే నన్ను ఆటపట్టిస్తున్నాడు. ఒక్కసారిగా ఉన్నట్టుండి నా చెయ్యి పట్టుకున్నాడు. ‘రేష్మ, నువ్వు చాలా అందంగా ఉంటావు’ నన్ను దగ్గరకి లాక్కుంటూ గుసగుసగా అన్నాడు. ఆ పొగడ్తకి నేను ఒక్కసారి సిగ్గుపడ్డాను. బుగ్గలు ఎరుపెక్కాయి. ఒక మగవాడు ఇంత దగ్గరగా వచ్చి నన్ను పొగడటం ఇదే మొదటిసారి. చెయ్యి వదిలించుకోవడానికి ప్రయత్నించాను. కానీ, నన్ను తనవైపుకు లాక్కుని గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను కూడా మెల్లగా అతని కౌగిట్లో ఒదిగిపోయాను. నా తల అతని గుండెలమీద ఉంది. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అది నాకు స్పష్టంగా తెలుస్తోంది. అతని వేడి ఊపిరిలు నాకు తగులుతున్నాయి. ఇద్దరి ఊపిరులు దగ్గరవుతున్నాయి. ఇద్దరిమధ్య వేళాకోళం కాకుండా మరేదో అవుతోందని నాకు అర్థమయింది. ధాన్యం దంచి, అన్నం వండే చర్యతో పాటు మా మధ్య మరేదో చర్య కూడా జరుగుతోందని నాకు నెమ్మదిగా తెలిసింది. అతన్ని ఒక్కసారి దూరంగా గెంటేసి బియ్యం చేట తీసుకుని అక్కడి నుండి పారిపోయాను. కానీ, అతని వేడి ఊపిరులు చాలాసేపు నా మనసును దహించివేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అతను ఎదురుపడితే నేను సిగ్గుతో తల దించుకుంటున్నాను. ఏదో చెప్పలేని కలకలం… అతన్ని చూస్తూనే నా మనసు పక్షిలా ఎక్కడికో ఎగిరిపోతోంది. ఒకళ్ళకొకళ్ళు దగ్గరవడానికి వంకలు వెతుక్కోవడం మొదలుపెట్టాం. రోజూ ఉదయం-సాయంత్రం ధాన్యం దంచే వంకపెట్టి ఒకళ్ళనొకళ్ళం తాకి ఆనందిస్తున్నాం. ఆ స్పర్శలో ఏం మాయ ఉందో మరి! ఒకరోజు రాత్రి వంట, భోజనాలు అయ్యాక అలసిపోయి నేను వాకిట్లో మంచం మీద పడుకున్నాను. నిద్రపట్టేసింది. ఎప్పుడొచ్చాడో కానీ మెల్లగా వచ్చి నా పక్కలో చేరాడు. అతని శరీరం నుంచి వచ్చే మత్తైన మగ వాసన, ఆ బలమైన కండలు నన్ను బంధించాయి. వదిలించుకోవడం నావల్ల కాలేదు …. మోహం ఆవహించింది …. మెల్లమెల్లగా మా మధ్య హద్దులు ఎప్పుడు చెరిగిపోయాయో తెలియలేదు!

కొన్నాళ్ళు గడిచేసరికి ఎందుకో అనుమానం వచ్చింది …. నేను నెలతప్పాను. ఈ విషయం సోమరకి చెప్పాను. ‘ఎవ్వరికీ చెప్పొద్దు. నేనే ఏదైనా ఉపాయం ఆలోచిస్తాను’ అన్నాడు. ‘సరే’ అంటూ నేను తలాడించాను. ఇంతలో ఒకరోజు అర్ధరాత్రి ఉన్నట్టుండి వరసగా వాంతులు… అమ్మ ఉలిక్కిపడి లేచింది. నేను నెలతప్పిన విషయం అమ్మకి తెలిసిపోయింది. అమ్మ చాలా భయపడింది. కాస్త బాధపడింది కూడా. ‘రేష్మ! నీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డకి తండ్రి ఎవరు?’ అని నిలదీసింది. నేను ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయాను. రాత్రి మరికాస్త చిక్కబడింది. అమ్మ గాఢ నిద్రలో ఉంది. ఇంతలో సోమర కిటికీ దగ్గరకొచ్చి – “రేష్మ, రెండు జతల బట్టలు సంచిలో పెట్టుకుని బయల్దేరు. మనం రూర్కెలా వెళ్తున్నాం.” అన్నాడు. పసుపుపచ్చ చున్నీ తలనిండా కప్పుకుని ఒక చిన్న బ్యాగు తీసుకుని ఇంట్లోనుంచి బయటపడ్డాను. చూస్తే సోమరతోపాటు మరో నలుగురు కుర్రాళ్ళు కూడా ఉన్నారు. “వీళ్ళందరూ ఎవరు?” – అని అడిగాను. “మనవాళ్ళే. రాత్రివేళ కదా! మనకి ఏమన్నా అవసరం అయితే చూసుకుంటారు” అన్నాడు సోమర. ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి బయలుదేరాను.

“మొదట్లో మేం చాలాసేపు కొండల వెంబడి నడిచాం. ఆ చీకట్లో ఒక చెరువు కూడా కనిపించింది. ఆ నీళ్ళల్లో చీకటి ముఖం విచిత్రంగా కనిపించింది. ఆ చెరువు ఊరివాళ్ళ సహాయంతో నాన్న తవ్వించిన విషయం గుర్తొచ్చింది. సెలవు రోజుల్లో మేం అక్కడ చేపలు పడుతూ ఉంటాం. నేను ఈత కూడా ఆ చెరువులోనే నేర్చుకున్నాను. ఆ చెరువు దూరమయిపోతోంది. ఇంకా సిమెంటు రోడ్లు వెయ్యలేదు.  అంతా మట్టి-కంకర. ఆ కాస్త దూరం దాటితే సిమెంటు రోడ్డు వస్తుంది.”

చాలా అలసటగా ఉంది. కానీ, కాస్త ఓర్చుకుంటే ఏదో దారి దొరుకుతుందని మనసులో చిన్న ఆశ మిణుకుమిణుకుమంటోంది. కాస్త దూరంలో సిమెంటు రోడ్డు కనిపించింది. నాకు ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. మొత్తానికి ఎలాగో మెయిన్ రోడ్డుకు చేరుకున్నాం. రైల్వే స్టేషనుకు వెళ్ళే ఆటో దొరికింది …. ఆ రోజుకి ఆ దారిలో అదే ఆఖరి ఆటో అనుకుంటా! మొత్తానికి ఎలాగో సమయానికి స్టేషను చేరుకున్నాం. రూర్కెలా వెళ్ళే ట్రైన్ దొరికింది. అందరం ట్రైన్ ఎక్కేసాం. రూర్కెలా వెళ్ళాక పరిస్థితులన్నీ చక్కబడతాయని కలలు కనడం మొదలుపెట్టాను. ఈ సమస్య నుంచి బయటపడిపోతే ఇంక బుద్ధిగా చదువుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా ఆలోచనల్లోనే ప్రయాణం సాగుతోంది. అయితే ఈ ప్రయాణమే నా జీవితానికి అంతిమ ప్రయాణం అని అస్సలు ఊహించ లేదు. నామీద అత్యాచారం చెయ్యాలని వాళ్ళందరూ ముందుగానే ఆలోచించుకుని పకడ్బందీగా వ్యూహం పన్నారు. ఆరోజు రాత్రి అత్యాచారం చేసి, చంపి నన్ను చెట్టుకు వేలాడదీసారు. బిసరా స్టేషన్ కి కాస్త దూరంలో ఒక చెట్టుకి నా శవం వేలాడుతోంది. శరీరం నుండి బయటపడ్డ నా ఆత్మ ఆ చెట్టుకొమ్మ మీదే కూర్చుని అక్కడ జరుగుతున్న తమాషా అంతా చూస్తోంది. మనిషి చీకట్లో ఎలా ఉంటాడో, వెలుతురులో ఎలా ఉంటాడో చూస్తోంది నా ఆత్మ!  

ఇంతా చేసి నా వయసు ఎంతని! తిప్పితిప్పి కొడితే పదహారేళ్ళు! బక్కపలచగా ఏపుగా ఎదిగిన శరీరం. రోజూ స్కూలుకి వెళ్ళేముందు అద్దంలో చూసుకుంటూ ఉంటాను. నా గదిలో ఒక చిన్న అద్దం ఉంది. నా గది?! ఓహ్, అది నా గది కాదు. అందరి గది! నాకంటూ ఒక గది ఎక్కడిది? పల్లెటూర్లో పనిచేసుకునే ఆడదానికి విడిగా గది ఉండదు. ఇల్లంతా ఉంటుంది. ఒళ్ళు హూనమయ్యేలా పనిచెయ్యడానికి పొలం ఉంటుంది. రోజంతా ఆమె ఇల్లంతా అటూ-ఇటూ తిరుగుతూ ఉంటుంది. కానీ కాసేపు నడుం వాల్చుదామంటే తనకంటూ ఒక గది ఉండదు. పనిచేసి అలసిపోయి వాకిట్లో ఉన్న మంచం మీద వాలడమో లేక ఆ అరుగుమీద చాప పరుచుకుని పడుకోవడమో అంతే! గదిలో పడుకుంటే ఎవరో ఒకళ్ళు గదిలోకి వస్తూపోతూ ఉంటారు. పెద్దన్న, తమ్ముడు, అమ్మ, పక్కింటి పెద్దమ్మ, లేదా ఆ పెద్దమ్మ చిన్న కూతురు ఇలా ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూనే ఉంటారు. ఇంటి తలుపులు అందరికీ తెరిచే ఉంటాయి. ఊర్లో ఇంటికి తాళం వేసుకునే ప్రసక్తే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆదమరిచి నిద్రపోయే అలవాటు చేసుకోవాలి ఆడది. ఏ ఆడదీ కంటినిండా నిద్రపోదు. ఎప్పుడూ మాగన్నుగానే నిద్రపోతుంది. ఆమె జీవితాంతం సగం నిద్రతోనే సరిపెట్టుకుంటుంది. చావే ఆమెకి గాఢనిద్ర …. సమాధే ఆమెకి ‘సొంత గది’. అక్కడ ఆమెని ఎవ్వరూ విసిగించరు. జీవితాంతం రోజూ కాస్త కాస్త చస్తూ బతికే బతుకులోనే ఆమెకి విశ్రాంతి.

నా ఇంట్లో ఉన్న అద్దం అంచు విరిగి ఉంది. ఆ సగం విరిగిన అద్దంలోనే రోజూ నన్ను నేను చూసుకుంటూ ఉంటాను. నా కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో అని గర్వపడుతూ ఉండేదాన్ని. కళ్ళకి ఎప్పుడూ కాటుక పెట్టుకునేదాన్ని. ఇంట్లో అందరికంటే నేనే ఒక పిసరు రంగు ఎక్కువ. దానివల్ల కూడా నాకు కాస్త గర్వం. ఏదో చామనఛాయ ఉంటే ఊళ్ళో ఎవడూ పట్టించుకోడు. నా జుట్టు కూడా నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా ఉండేది. కుసుమ నూనె పట్టించి-పట్టించి నా జుట్టు ఒత్తుగా నల్లగా అయింది. ‘భలే అందగత్తెని కన్నావు సుమా!’ అని ఊళ్ళో అమ్మలక్కలందరూ మా అమ్మని పొగుడుతూ ఉండేవారు.

నేను బాగా చదివి, ఉద్యోగం చెయ్యాలని అమ్మ కోరిక. కానీ, ఇంకా ఎనిమిదో క్లాసులో ఉండగానీ సోమరతో ఇదంతా జరిగిపోయింది. అతను నాకంటే వయసులో పెద్దవాడు. సుమారు పాతికేళ్ళు ఉండొచ్చు. పట్నంలో ఉంటాడు. కొన్నాళ్ళు గుజరాత్ లో పనిచేసి ఈమధ్యే తిరిగొచ్చాడు. పెద్ద టౌనులో ఉండటం వల్ల పెద్దపెద్ద కబుర్లు చెప్పేవాడు. అతని కళ్ళల్లో ఏదో ఆకర్షణ. వరసకి మేం ఇద్దరం అన్న-చెల్లెళ్ళం. అయితే ఈ బంధాలు-సంబంధాలన్నీ సమాజం ఏర్పాటుచేసినవే. నిజానికి ఒక్కమాటలో చెప్పాలంటే మేం ఇద్దరం స్త్రీ-పురుషులం!

“ఊళ్ళో వాళ్ళకి బంతి భోజనాలు పెట్టి కడుపు పగిలేలా సారా పోయిస్తే సరి! మేం వరసకి ఏమవుతాం అని ఒక్కడు కూడా నోరెత్తడు. ఇలాంటివి సద్దుమణిగేలా చెయ్యడానికి రెండు మేకపోతుల్ని కోసి, ఒక్క బంతి భోజనం పెడితే సరి!” అని చెప్పి సోమర నన్ను ఓదార్చాడు. ఆ పల్లెటూళ్ళో పెళ్ళికి ముందు పిల్లల్ని కనడం ఏమీ కొత్త కాదు. గిరిజన ప్రాంతాల్లో పిల్లో పిల్లాడో పుట్టాక పెళ్ళిళ్ళు అవ్వడం కూడా చూస్తూనే ఉంటాం. అయితే వచ్చిన చిక్కల్లా మాది ఒకటే గోత్రం. పైగా వరసకి అన్న-చెల్లెళ్ళం. సమాజం దృష్టిలో సగోత్రీకుల పెళ్ళి నిషేధం. పైగా నేరం. బంతి భోజనం పెట్టి, సారా పోయించి సగోత్రీకుల పెళ్ళిళ్ళకి ఆమోదముద్ర వేయించుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు! అయితే మాది మరీ దగ్గరి చుట్టరికం. దీన్ని సమాజం అంగీకరించకపోవచ్చు. ఇదంతా నాకు తెలుసు. పెళ్ళికి ముందు ఇలాంటి వ్యవహారాలు కొత్తేం కాదు. కానీ, అయినవాళ్ళే సామూహిక అత్యాచారం అన్నదే ఇప్పుడు కొత్త నాకు! నిజమే. ఊరు మారుతోంది. సమాజం మారుతోంది.

“చనిపోయాక ఈ శరీరం ఏమవుతుందా అని నేను చూస్తున్నాను. పోస్టుమార్టం అయ్యాక, నా శరీరాన్ని ఒక గోనెసంచిలా కుట్టిపడేసారు. మర్నాడు పేపర్లో నా ఫోటో పడింది. వార్త నిప్పులా నాలుగువైపులా గుప్పుమంది. ఈ వార్త ఊళ్ళో మా ఇంటివాళ్ళ వరకు చేరింది. ఇంట్లో అంతా గగ్గోలు పెడతారు అనుకున్నాను. నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి అత్యాచారం చేసిన దోషులని ఉరికంబం ఎక్కించేవరకు పోరాడతారని కలగన్నాను. కానీ, అలాంటిదేం జరగలేదు. నాదంతా ఒఠ్ఠి భ్రమ అని  నాకు చాలా త్వరగానే అర్థమైంది.”

నాన్న వెక్కి వెక్కి ఏడ్చాడు. అసలు దీనికంతటికీ తనే కారణమని గుండెలు బాదుకున్నాడు. అమ్మ కూడా చాలా ఏడ్చింది. చాలారోజులపాటు మెతుకు ముట్టలేదు. అన్నదమ్ములు కూడా బాగా కృంగిపోయారు. ఇల్లంతా స్మశానంలా తయారయ్యింది.

కొన్నాళ్ళు పొయ్యి కూడా వెలిగించలేదు. చాలారోజులపాటు ఖాళీ గిన్నెలు ముఖాలు చూసుకుంటూ ఉండిపోయాయి. మేకలని కూడా మేతకి వదల్లేదు. చూసిచూసి పొరుగింటివాళ్ళే తమ మేకలతోపాటు వీటిని కూడా తోలుకెళ్ళారు. నా బుజ్జి మేకపిల్లలకి కూడా నేను లేననీ, ఇంక తిరిగి రాననీ తెలిసిపోయినట్టుంది. అవి కూడా దిగులుగా కనబడుతున్నాయి. ఇంటిల్లపాదీ బాధలో కూరుకుపోయారు. బాధపడుతున్న మాట వాస్తవమే కానీ, అందరూ నిజాన్ని సమాధి చెయ్యాలని చూస్తున్నవాళ్ళే.

కొన్నాళ్ళు బాధపడ్డాక నాన్న – “ఏం చేస్తాం, ఇంటి గుట్టు. ఇది బయటకి పొక్కితే మన పరువే పోతుంది. పోయిన పిల్ల ఎలాగూ తిరిగి రాదు. అయినా మన బంగారమే మంచిదైతే…” ఆయన గొంతు పూడుకుపోయింది. అమ్మ మాత్రం నాకు న్యాయం జరగాలనీ, నాపై అత్యాచారం చేసినవాళ్ళకి ఉరిశిక్ష పడేలా చెయ్యాలనీ, ఇలా ఎన్నో ఊహించుకుంది. అయితే ఇంతలోనే ఆ ఇంట్లో ఆమెకీ, ఆమె మాటకీ ఉన్న విలువ ఎంతో గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయింది. ఇల్లు భర్తది, పొలం భర్తది, ఆస్తి భర్తది, అధికారం భర్తది, నిర్ణయం భర్తది. అంతేనా! కూతురుని అత్యాచారం చేసి చంపినది కూడా భర్త చుట్టం, అతని సావాసగాళ్ళే! ఆమె జీవితాంతం ఈ ఇంట్లో, పొలంలో గొడ్డుచాకిరీ చేసింది. అంతే! కానీ నిర్ణయం తీసుకునే అధికారం కానీ, తన హక్కుల గురించి మాట్లాడే అధికారం కానీ, అన్యాయానికి వ్యతిరేకంగా, న్యాయంకోసం పోరాడే అధికారం కానీ, వీటిల్లో ఏ ఒక్కటి గానీ ఆమెకి లేవు.

ఎనిమిదో తరగతి చదువుతుండగానే అమ్మ పెళ్ళి అయిపోయిందట. తనకి పెళ్ళిచేసుకోవడం అస్సలు ఇష్టం లేదనీ, నాన్నే ఆమె వెంటపడి మరీ పెళ్ళి చేసుకున్నాడనీ చెప్తూ ఉండేది. ఆమెని పెళ్ళిచేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించాడుట కూడా! అంతా పచ్చి అబద్దం. ఎక్కడ చచ్చిపోయాడు? చక్కగా పెళ్ళిచేసుకుని తన మాట నెగ్గించుకున్నాడు.

పెళ్ళి అవ్వడంతోటే అమ్మ చదువు అటకెక్కింది. ఆ చిన్న వయసులోనే ఒక అబ్బాయి పుట్టాడు.  తర్వాత అమ్మాయి. మళ్ళీ మూడోసారి అమ్మాయి. మూడో కానుపులో పుట్టిన ఆ అమ్మాయి నేనే – ‘రేష్మ’. నా తర్వాత కూడా అమ్మ పిల్లల్ని కంటూనే ఉంది. అయితే నా తర్వాత పుట్టిన ఒక పిల్లాడు పురిట్లోనే చనిపోయాడు. రెండో పిల్లాడు పుట్టిన దగ్గర నుంచే నాన్న తాగుడుకి బానిసయ్యాడు. తాగొచ్చి గొడవలు, కొట్లాటలు, అమ్మని కాలితో తన్నడాలు, ఒంగోపెట్టి గుద్దడాలు… ఇదే బాగోతం. ఇంతమంది పిల్లల్ని కన్నాక ఎక్కడికి పోతుందిలే అని ధైర్యం! నిజంగానే అమ్మ ఒకరోజు పిల్లాణ్ణి చంకనేసుకుని ఆ కొండలు-గుట్టల వెంట వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడూ మొగుడి ముఖం చూడకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. అయితే ఈ సమాజం ఊరుకుంటుందా? చుట్టాలు అందరూ కలిసి “పిచ్చిదానా! పెళ్ళైన ఆడదానికి విడిగా ఇల్లు ఎక్కడిదే! మొగుడి ఇల్లే తన ఇల్లు. పో. పోయి హాయిగా కాపురం చేసుకో” అని చెప్పి వెనక్కి లాక్కొచ్చారు. మనసు చంపుకుని ఇంటికి తిరిగొచ్చింది. వేరే గతిలేక ఎప్పుడు పడితే అప్పుడు చావచితకబాదే ఆ మొగుడితో కాపురం చెయ్యడానికి మళ్ళీ అదే ఇంటికి తిరిగొచ్చింది.

పెళ్ళయిన తర్వాత కూడా వేరే ఆడవాళ్ళతో నాన్న రాసలీల సాగుతూనే ఉన్నాయి. ఇదంతా అమ్మకి కూడా తెలుసు. అయినా నోటికి తాళం వేసుకుని ఉంటుంది. “తిరగబడి మాత్రం నేను చెయ్యగలిగింది ఏముంది?’ అని మౌనంగా ఉండిపోయేది. నాన్న ఇంచుమించు  ప్రతీరోజూ మత్తులో తూగుతూనే ఇంటికొచ్చేవాడు. అమ్మ పడుకున్న గదిలోకి వెళ్ళి ‘ధడేల్’మని తలుపు వేసేవాడు. అప్పుడప్పుడు ఆ గదిలో నుంచి అమ్మ అరుపులు వినిపిస్తూండేవి.

ఒకరోజు పొద్దున్న లేస్తూనే అమ్మ బుగ్గ మీద పంటి గాట్లు చూసాను. అది కాస్త పుండు పడ్డట్టు కూడా ఉంది. అమ్మ దానికి ఏదో పసరు రాస్తోంది. “ఏమయింది?” – అడిగాను నేను. “అవ్వడానికి ఏముందని? ఈ మగజాతే కుక్క జాతి. పిచ్చెక్కితే కరుస్తుంది.” అంది. ఇంక నేనేం అనలేదు. పెళ్ళయ్యాక కూడా …. నాలుగు గోడల మధ్య కూడా అత్యాచారాలు జరుగుతూంటాయని నాకు ఆరోజే అర్థమయ్యింది. అయితే అమ్మ ఇంట్లో నాలుగు గోడల మధ్య, నేను ఇంటి బయట పొదల్లో అత్యాచారానికి గురవుతామని అస్సలు ఊహించలేదు. మారుతున్న కాలంతోపాటు గిరిజన సమాజం కూడా ఈ విషపు కోరలనుంచి తప్పించుకోలేకపోయింది.

ఊర్లో-సమాజంలో ప్రతీ సమస్యకి పరిష్కారం చెప్పడానికి పురుషులు సభ తీరుస్తారు. అయితే ఈసారి అలాంటి సభ ఏం జరగలేదు. కొన్ని గుసగుసలు మాత్రం వినపడ్డాయి – “పిల్ల నడవడికలోనే ఏదో లోపం ఉంది. అయినా ఇంట్లో-ఇంట్లో ముచ్చట. దీని గురించి రచ్చ చేసుకుంటే మాత్రం ఒరిగేది ఏముంది? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చచ్చిన పిల్ల ఎలాగూ తిరిగి రాదు. దీనిమీద ఇంకా చర్చలు చేస్తే పోయేది మన ఊరి పరువే!”-  ఇలాంటివే ఏవో నాలుగు మాటలు మాట్లాడి అందరూ మెల్లగా జారుకున్నారు.

ఇది జరిగిన రోజు నుండే సోమర పరారీలో ఉన్నాడు. ఎక్కడో పట్నంలో దాక్కున్నాడు. అయితే అప్పుడప్పుడు ఏ అర్ధరాత్రో అతను ఊర్లోకి రావడం నేను చూస్తూనే ఉన్నాను. చప్పుడు కాకుండా వచ్చి స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని కలిసి మళ్ళీ తెల్లవారుతూనే మాయమయిపోతూ ఉండేవాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఎవ్వరూ నోరు మెదపరు. సోమర తో ఉన్న ఆ మిగిలిన నలుగురూ  కూడా కొన్నాళ్ళు కనబడకుండా పోయారు. అంతా సద్దుమణిగింది అనుకున్నాక, సుబ్బరంగా బయట తిరుగుతున్నారు. బజార్లో కనిపిస్తూనే ఉన్నారు. క్రమంగా అందరూ ఈ ఉదంతం మర్చిపోయారు. రేష్మ కథ మరుగున పడిపోయింది. ఆ దుండగుల పరువుతో పాటు, నా ఇంటి పరువు, ఊరు పరువు కూడా దక్కింది!  

ఆ రైలు ఎప్పటి మాదిరిగానే రోజూ వెళ్తూ-వస్తూనే ఉంది. బిసరా స్టేషనులో ఆగుతూనే ఉంది. ఆ చెట్టు కూడా ఇంకా అలాగే ఉంది. నా చుట్టాలు-పక్కాలు అందరూ ఆ రైల్లో రూర్కెలా వెళ్తూ వస్తూ ఉన్నారు. అందరూ నన్ను ఒక పీడకలలా మర్చిపోయారు. కానీ, నేను ఇంకా ఆ చెట్టుకి అలా వేలాడుతూనే ఉన్నాను. శరీరం కాలిపోయింది… కానీ ఆత్మ సంగతి ఏంటి? నా ఆత్మ ఇంకా అక్కడే ఉంది ….. బిసరా స్టేషనులో తన్నులాడుకుంటోంది …. న్యాయంకోసం ఎదురు చూస్తూ …… మోక్షం ఎప్పుడు దొరుకుతుందా అని ….
నా ఆత్మ సంవత్సరాల తరబడి అలా ఎదురుచూస్తూనే ఉంది!!

జసింత కెరకెట్ట

ప్రముఖ ఆదివాసీ రచయిత్రి జసింత కెరకెట్ట 3 ఆగష్టు 1983 న ఝార్ఖండ్ లోని పశ్చిమ సింహభూమి జిల్లా ఖుదపోస్ గ్రామంలో జన్మించారు. ఝార్ఖండ్ జిల్లాలోని ఉరాఁవ్ గిరిజన తెగకి చెందిన జసింత నాలుగు కవిత సంకలనాలతో పాటు చిన్నపిల్లల కోసం రెండు పుస్తకాలు కూడా వెలువరించారు. వీరి కవితలు పలు భారతీయ, విదేశీ భాషల్లోకి అనువదించబడ్డాయి.

ఎన్నో జాతీయ-అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న జసింతకి UNDP Fellowship కూడా లభించింది. 2022 లో ఫోర్బ్స్ ఇండియా భారతదేశపు 22 ‘సెల్ఫ్ మేడ్ విమెన్’ జాబితాలో జసింతకి చోటు దక్కింది. 2023 మరియు 2024 సంవత్సరాలలో మణిపూర్ హింసాకాండ, ఫిలిస్తాన్ ప్రజల వేదనకి సంఘీభావం తెలుపుతూ జసింత రెండు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను తిరస్కరించారు.

‘ఔరత్ కా ఘర్’ వీరి తాజా కథా సంకలనం.

Jcntkerketta7@gmail.com

డా. వి.ఎల్. నరసింహం శివకోటి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి M.A (ఫంక్షనల్ హిందీ అండ్ ట్రాన్స్ లేషన్) (గోల్డుమెడల్), M.Phil (హిందీ) (గోల్డుమెడల్), Ph.D (హిందీ) పట్టాలు పొందిన డా|| నరసింహం శివకోటి హిందీ - తెలుగు భాషలలో పరస్పర అనువాదం, తులనాత్మక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. వీరు ఈమధ్య కాలంలో ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా గారి రెండు పరిశోధనాత్మక గ్రంథాలను 'ప్రభాత కిరణేఁ', 'అనావరణ్' శీర్షికన తెలుగు నుండి హిందీలోకి, అలాగే, ప్రముఖ హిందీ కవి నరేష్ సక్సేనా గారి ఎంపిక చేసిన కవితలను "అంతరిక్షం  నుండి.." శీర్షికతో హిందీ నుండి తెలుగులోకి అనువదించడంతోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలు తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ' భారత్ డైనమిక్స్ లిమిటెడ్'లో డిప్యూటీ మేనేజర్ (రాజభాష)గా సేవలు అందిస్తున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *