మౌనానికి సాక్షిగా నిలిచిన అక్షరాల ప్రవాహమే ఈ కుందేరు సాక్షిగా

Spread the love

“When justice is silent,literature becomes the loudest witness”

ఈ ఆధునిక ప్రపంచం సరికొత్త నాగరికతతో వేగంగా పరుగులు పెడుతుంది. సాహిత్యం కూడా అంతే వేగంగా పుంజుకుంటుందనిపిస్తుంది. ఇలాంటి రచనలు చూసినప్పుడు.అయితే కాలగర్భంలో జ్ఞాపకాలు మనుషులు వస్తువులు ఎన్నో అంతరించిపోయినప్పటికీ అక్షరాలు మాత్రం నేటి యువ రచయితల్లో కొత్తతరం జ్ఞాపకాలుగా మొలకెత్తుతూ సాహిత్య లోకానికి బలమైన పునాదిగా నిలుస్తున్నాయి. కనుమరుగవుతున్న ప్రాంతపు అస్తిత్వాలను ఒక సాహిత్య పరిశోధకుడిలా వెలికితీసి తెలుగు సాహిత్య ప్రయోగశాలకు అవసరమైన తరహాలో రచనలు అందిస్తూ, పార్వేట కథల నుంచి తన అక్షరాల వేటను కొనసాగిస్తూ లోతైన సాహిత్య సేద్యం చేస్తూన్న మా కాలపు రచయిత సురేంద్ర శీలం గారు. ఆయన ఎంచుకున్న కథ వస్తువులకంటే కథలో ఉన్న ప్రతి పాత్ర, ప్రతి వస్తువుకు జీవం పోస్తారు. ఇటీవల ఆయన ఈ సాహిత్య లోకానికి అందించిన పుస్తకమే “కుందేరు సాక్షిగా”.

కథలు కొందరు రాయగలరు, చదవలగలరు, ఇంకొకరితో కథ నేపథ్యం గురించి బాగా చెప్పగలరు, విశ్లేషించగలరు కానీ ఈ రచయిత మాత్రం దానికి పూర్తిగా భిన్నం కథలో పాఠకుల్ని పాత్రలుగా నిమగ్నం చేసి మనల్ని తెలియని లోకంలో పడేసి ఆ పాత్రల వెంట మనల్ని నడిపిస్తారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఒక సినిమా సెట్ లోకి మనల్ని లాక్కెళ్లి అక్కడే ఉండి షూటింగ్ మొత్తం చూస్తున్నట్లుగా ఉండేలా చేస్తారు. అది రచయిత కలానికి ఉన్న బలం. మనుషుల్ని మార్చే గుణం, శాంతి, అహింస, ప్రేమకి , వినూత్న ఆలోచనలకు ఉంటుంది. వాటితో పాటుగా అక్షరాలు అల్లుకున్న కుందేరు సాక్షిగా నవలకు కూడా ఉందని ఈ నవల చదివాక గట్టిగా నమ్ముతున్నాను. సురేంద్ర శీలం గారు ఈ నవలలో కథ చెప్పడానికంటే,ఒక వివక్ష సమాజాన్ని వివక్షకు గురైన నాగరికతను, ఆ మనుషుల్ని మన ముందుంచారు. ఇది ఒక వ్యక్తి కథగా మొదలైనప్పటికీ, చదువుతున్న కొద్దీ అది ఒక ఊరి కథగా, ఒక వర్గపు కథగా, చివరకు ఒక వ్యవస్థ కథగా మారుతుంటుంది.

పార్వేట కథలలో గ్రామీణ జీవితాన్ని లోపలికి వెళ్లి చూసిన రచయితగా మనకు తెలుసు, నడురీ మిద్దెలో వ్యక్తిగత జీవితాల మధ్యతరగతిలో నలుగుతున్న సంక్షోభాన్ని పట్టుకున్న రచయితగా చదివాం, ఈ నవలలో మాత్రం రచయిత తన పరిశీలనను మరింత విస్తృతమైన సామాజిక స్థాయికి తీసుకెళ్లాడు అని చెప్పొచ్చు. కథలోని ఆ ప్రాంతంలో భూమి కేవలం ఒక పొలం మాత్రమే కాదు. భూమి ఒక వర్గ బలానికి కేంద్రమై ఉంది. భూమి ఎవరి చేతిలో ఎంత ఉందో, చట్టం వారి భాష వారి మాటలు మాట్లాడుతుంది. వారి చెప్పిందే చట్టమవుతుంది. అది వారికి దగ్గర చుట్టమవుతుంది. దేవుడి దయ అండదండలు కూడా వారి వైపే నిలుస్థాయి .దీన్ని రచయిత ఎక్కడా సిద్ధాంతం వేదాంతంలా చెప్పడు. కథలో జరిగే సాధారణ సంఘటనలు ఆ పాత్రల అమాయకం పల్లె ప్రజల నమ్మకం ద్వారా ఇవన్నీ కళ్లకు కట్టినట్లు చూపిస్తారు రచయిత. 

అంతేకాకుండా భూమి అధికారం మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంటుందో వివరణగా చెప్తూ గ్రామీణ ప్రాంతాలలో వారి అధికార బలం ఎలా పనిచేస్తుందో వారు ఎత్తులు ఎలా పనిచేస్తాయో, పగటివేశాగాల్ల రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో, రాజకీయ కోణంలో కథ ఎలా ముందుకు సాగుతుందో పాఠకుడికి నెమ్మదిగా ఒక స్లో పాయిజన్ లా అర్థమయ్యేలా చేస్తారు రచయిత. 

ప్రకృతి అన్నింటికి సాక్ష్యం. ఈ కథకు ప్రధాన సాక్షి మాత్రం ఒక నది మౌనం.ఈ నది మౌనం పాఠకులను ప్రతిఘటించేలా చేస్తుంది. 

కుందేరు సాక్షిగా నవలలో కొన్ని పాత్రలు మనల్ని విస్మయానికి గురిచేస్తాయి అందులో ఒక ముఖ్యమైన పాత్ర బాలయ్యది. ప్రతి పల్లెల్లోను అలాంటి నిరుపేద కళాకారుడైన బాలయ్యలను ఎందర్నో చూసే ఉంటారు. అయితే ఈ బాలయ్య కుటుంబం ఈ కథలో ఒక వ్యక్తిగత విషాదం కాదు అది ఒక తరానికి చెందిన జీవన స్థితి. వారి అస్తిత్వానికి సంబంధించింది. తాగుడు, అప్పులు, అస్థిర జీవనం ఇవి బాలయ్య వ్యక్తిగత వైఫల్యాల్లా కనిపించినప్పటికీ, వాటి వెనుక ఉన్న సామాజిక ఒత్తిడిని రచయిత సినిమాలో లాగా ట్విస్టులాగా దాచాడు. బాలయ్య పాత్ర తండ్రిగా ఓడినట్లు అనిపించినా, అతని ఓటమి వెనుకాల ఈ నిర్లక్ష్య సమాజం, అధికార వర్గ వ్యవస్థ మోపిన పరిస్థితుల ఫలితం అతన్ని ఓటమిగా చూపించాల్సి వచ్చింది. అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన సంఘటనలు ప్రతి పాఠకుణ్ణి కలిచి వేస్తాయి. ఒక కోణంలో చూస్తే ఈ నవలలో వ్యక్తిని కాకుండా, అతన్ని తయారు చేసిన ఈ వ్యస్థీకృత పరిస్థితుల మీద పాఠకులకు అనేకమైన ప్రశ్నలు పుట్టుకొస్తాయి…

ఇకపోతే ఈ కథకు ప్రధాన మూలం అయినా ప్రభాకర్–శ్రావణిల ప్రేమ కథ. నవలలోనీ వీరి పాత్రలు సన్నివేషాత్మకంగా మెదులుతూ పాఠకుల హృదయాల్ని బరువెక్కిస్థాయి. ఇది అలవోకగా సాగిపోయే ప్రేమ కాదు. చదివిన ప్రతి పాఠకునికి యదార్థానికి చాలా దగ్గరగా ఉన్న ప్రేమకథలా తోస్తూ రచయితపైన అనుమానం కల్గిస్తుంది. సొంత కథ రాసుకున్నట్లు తన భావోద్వేగాన్ని బయటికి తీశారు. మనిషి మనసుల హృదయాలను కన్నీటి జలపాతం చేసేశారు రచయిత.

రికార్డింగ్ డాన్స్ కళాకారిణిగా శ్రావణి జీవితం ఎంత దుర్భరమో, ఆ దుర్భర జీవితాల మధ్య నలిగి కూడా ఆమె తీసుకున్న నిర్ణయాలు మనుషులుగా మనల్ని ఆలోచింపజేస్తాయి. ఆమె ప్రేమ ధైర్యం, నిజాయితీ కలది. ప్రేమే ఆమెను ఈ సమాజంలో నిలబెడుతుంది అని చాలా కలలు కనింది. సమాజం తనను ప్రశ్నిస్తుంది కానీ ఎదురొడ్డి గెలవాలని బలంగా నమ్మింది. కానీ ప్రేమకు ముడిపడినా కులం ముందు పోరాడి ఓడిపోయింది. చివరికి ప్రేమే ఆమె పాలిట శాపంగా మారింది. శ్రావణి కలని, కుటుంబ నిండు భవిష్యత్తుని సమాధి చేశారు జాత్యహంకారపు ముసుగులో. ఇకపోతే శ్రావణి ప్రేమైన ప్రభాకర్. ఈ ప్రపంచంలో ఉన్న వర్ణాలు వర్గాలు ఎలాంటి భేద భావం లేకుండా ఒకే మనస్తత్వం కల్గి కులాన్ని ఎదురించి గ్రామీణ వాతావరణంలో కులాన్ని కులదోయడానికి తన శక్తివంతు ప్రయత్నం చేసినా వ్యక్తి ప్రభాకర్ అని చెప్పొచ్చు. 

ప్రభాకర్ ప్రేమలోని గొప్పతనం మాటల్లోనే కాకుండా బాధ్యత కనిపిస్తుంది. అతని నిజాయితీ ఎదుటి వ్యక్తుల మీదున్న గౌరవం కూల నిర్మూలన జరగాలనే కోరుకొనే మనస్తత్వం. ప్రభాకర్ ప్రేమ వ్యవస్థను కూల్చదు కానీ ప్రశ్నిస్తుంది. కుల పిచ్చి వ్యవస్థ మధ్య కూడా మనిషిగా మిగలడానికి తన పోరాటం చివరి వరకు ఉంటుంది. 

అతని మౌనం బలహీనత కాదు. అది అతను ఎంచుకున్న స్థితి. పన్నెండేళ్ల జైలు జీవితం అతనిలో మిగిల్చిన నిశ్శబ్దం, నేరం చేశానని ఒప్పుకోకపోయినా శిక్షను స్వీకరించిన ధైర్యం ఇవన్నీ న్యాయం, నైతికతలపై తీవ్రమైన ప్రశ్నలు వేస్తాయి. అతను మాట్లాడకపోవడం కూడా ఒక రకమైన ప్రతిఘటనేనని అనిపిస్తుంది. ఈ పాత్ర ద్వారా రచయిత “న్యాయం” అనే భావన ఎంత సంక్లిష్టమైందో తెలుపుతూ పాఠకుడిని ఆలోచనలో పడేస్తాడు. 

ప్రతి మనిషికి గ్రామాలలో గొప్ప స్నేహితులుగా గురన్న లాంటి మిత్రుడొకడు ఉంటే చాలనిపిస్తుంది. నమ్మిన వారికోసం, నమ్మకం ఉంచిన వారి కోసం తన అవసరమైనప్పుడు వారి పక్కనే ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎలాంటి లోటు లేకుండా కాపాడే నిజమైన ఆప్త మిత్రుని గొప్పతనం చెప్పడంలో కథకూడా కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తుంది ఇతని పాత్ర. 

అణచివేయబడిన సమాజాల్లో వ్యక్తి ఒంటరిగా నిలబడలేడన్న నిజాన్ని ఈ పాత్రలు గుర్తుచేస్తాయి. గురన్న పాత్ర ద్వారా రచయిత ఒక గ్రామీణ సామూహిక స్పృహను మనకు చూపిస్తాడు. అది పెద్దగా కనిపించదు, కానీ కథను కూలిపోకుండా, అతని నిజాయితీ, స్నేహం యొక్క విలువ దీన్ని నిలబెడుతుంది.ఇతని స్నేహం లేకపోతే ప్రభాకర్ కథ వ్యక్తిగత విషాదంగా మిగిలిపోయేది.

ఇక నవలలో నారపురెడ్డి, తిమ్మారెడ్డి,ఈసిరెడ్డి రాజకీయాలు గ్రామంలో జరిగే దేవాలయ సంఘటనలు, దేవదాయ భూముల చుట్టూ తిరిగే లెక్కలు, అధికారుల మౌనం ఇవి అన్నీ కలిసి అగ్రవర్ణాల ఎత్తుగడల అసలు స్వరూపాన్ని బయటపెడతాయి. ఇక్కడ హింస ప్రత్యక్షంగా కనిపించదు. కానీ నిర్ణయాలు జరుగుతాయి. భూములు మారుతాయి. జీవితాలు చీలిపోతాయి. నేరం చేసినట్టు ఎవరూ కనిపించరు. అదే ఈ వ్యవస్థ మరొక రూపం. రచయిత ఈ అంశాన్ని ఆగ్రహంతో కాకుండా, మంచి పరిశీలనతో పాఠకులకు వివరిస్తాడు.

భాష విషయానికి వస్తే, సురేంద్ర శీలం అనుభవం నుంచి వచ్చిన తన వాడుక భాషను ఇందులో వాడాడు. మాండలికం అలంకారంగా కాదు, వాతావరణాన్ని నిర్మించే సాధనంగా ఈ నవలలో పనిచేస్తుంది. వాక్యాలు సూటిగా ఉంటాయి. రచయిత తన అభిప్రాయాన్ని పాఠకుడిపై మోపడు. పరిస్థితులను ఉంచి వదిలేస్తాడు. ఆ నిశ్శబ్దమే పాఠకుడిని ఆలోచింపజేస్తుంది.

ఈ నవల చదివిన తరువాత పాఠకుల హృదయాలలో ప్రవహిస్తున్న మౌనపు నదులు ప్రవాహం ఆగిపోతుంది. న్యాయం పూర్తిగా జరగలేదన్న భావన. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవన్న భావన. జీవితం కూడా ఇలానే ఉంటుంది. భూమి రాజకీయాలు కొనసాగుతాయి. వర్గాధిపత్యం కొనసాగుతుంది. మనుషుల్లో మౌనాలు పేరుకుపోతూనే ఉంటాయి. మొత్తానికి, ఇది ఒక కథ కాదు. ఇది ఒక సమాజపు పని తీరుకు సంబంధించిన ఎన్నో ఏళ్ల రికార్డు. ప్రేమ, స్నేహం, తల్లి ప్రేమ ఇవన్నీ వ్యవస్థ మధ్య ఎలా నిలబడతాయో చూపించిన గొప్ప రచనగా చెప్పుకోవచ్చు.. సురేంద్ర శీలం గారు ఈ నవలతో రచయితగా మాత్రమే కాదు, ఒక కాలానికి ఇతని కలం సాక్షిగా నిలబడుతుంది. తెలుగు సాహిత్యంలో ఈ నవల ఒక మైలురాయి స్థానం సంపాదించుకుంటుంది అని భావిస్తూ రచయితకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను..!

చేగువేర_హరి

అనంతపురం.9951310711.

https://amzn.in/d/2XoDJjG

చేగువేర హరి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *