కాలాన్ని రీవైండ్ చేద్దాం. నన్నయగారినోసారి పలకరించి వద్దాం. ఆముదపు దీపపు వెలుతురులో, తాటాకుల మీద ప్రయాసపడి అక్షరాలను నెమ్మదిగా గుండ్రంగా చెక్కుతున్నాడు. కాస్త బలంగా ఘంటాన్ని నొక్కిపెట్టి రాస్తే తాటాకు పత్రం చిరిగిపోతోంది. మరోపత్రం తీసుకుని మొదలెత్తుకోవలసి వస్తోంది. బరువుగా ఉన్న ఆ ఘంటం తేలిగ్గా ముందుకు కదలడం లేదు.
శిలమీద ఉలి చెక్కినట్లు అక్షరం, అక్షరం మలచటానికి చాలా ప్రయాస పడుతున్నాడు పాపం నన్నయ. పైగా సొంత రచన కూడా కాదాయే. మూలం చెడకుండా, రాజరాజనరేంద్రుడు మెచ్చేలా రాయటం అదనపు ప్రయాస.
ఈ బాధలు చాలవన్నట్లు గణయతి ప్రాసలతో పద్యాలను కూర్చడం… భావం సరే, నడక తప్పకుండానూ చూసుకోవాలి గదా!
వంచిన తల ఎత్తకుండా బాసింపట్టు వేసుకుని గంటల తరబడి ఘంటాలతో చెక్కుతూ కూచుంటే ఆ ఇల్లాలికి పాపం ఎంతగా బోరు కొట్టి ఉంటుందో! మనసులోని మాట పైకి చెప్పుకోలేకపోయినా, కవిత్వమే లోకంగా బతికే నన్నయ్యగారి దీక్షాదక్షతల మీద గౌరవం ఉన్నా, ఎప్పుడో ఒకప్పుడు ఒక సన్నని అసమ్మతి రేఖ పొడ సూపకపోయి ఉండదు.
అందరి మాదిరి హాయిగా ఆ వ్యవసాయ పనులే చేసుకుంటే పోలా! ఏడాదిలో కొన్ని నెలలైనా కాస్తంత ఖాళీ చిక్కేదిగదా! అనుకుని ఉండి ఉంటుందా ఇల్లాలు.
అందరిలా ఉంటే రాజాస్థానంలో ఈ గౌరవమర్యాదలు, సత్కారాలు దక్కేవా? అయినా అంతటి ప్రభువుల వారి దర్శనమే మహాభాగ్యం కదా! అలాంటి రాజాస్థానంలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న నాథుడిని చూస్తుంటే ఒకింత గర్వమూ మిసెస్ నన్నయలో పొటమరిస్తోంది.
ఒక పక్క దీక్షగా నన్నయ్య, రాసినవాడు రాసినట్టే ఉండగా, మరోపక్క తాళపత్రాలకు కరక్కాయ సిరాను అద్దడమూ, ఆరబెట్టడమూ, వరస చెడకుండా, ఆకు చిరక్కుండా తాడుతో కట్టి, చెదలపాలు కాకుండా భద్రపరచడమూ వంటి పనులన్నీ మీదేసుకుని చేస్తోంది శిష్యగణం. సరే, వారికి ముప్పొద్దులా వండివార్చే బాధ్యత ఆ ఇల్లాలిదే గదా!
తాళపత్రాలకు నకళ్లను తయారు చేసే పనిలో మరో బ్యాచ్ శిష్యులు కుస్తీ పడుతున్నారు. గురువుగారూ! ఈ అక్షరం చూడండి, ఇది ‘మ’ నా? ‘య’నా? అంటూ ధర్మసందేహాలు గుమ్మరిస్తున్నారు.
నన్నయ్య రచనా ప్రయాసల్లో ఇవి రేఖామాత్ర వీక్షణలే. లోతుగా వైన వైనాలుగా అవలోకిస్తూ వెళితే దానికదే మరో భారతమవుతుంది.
నన్నయ ఇన్ని కష్టాలు పడి, అంతమందిని శ్రమపెట్టి భారతాన్ని ఆంధ్రీకరించకపోతే ఏమయ్యేది? ఒక మహా కావ్యం మనకు అందకుండా పోయేది.
ఒక నన్నయ గురించి మాట్లాడాల్సిన అవసరం లేకుండా పోయేది. ఒక రాజరాజనరేంద్రుడి ప్రస్తావనే అవసరమయ్యేది కాదు. పద్యాల సొగసు గురించి, నన్నయ రచనా సంవిధానం గురించి చర్చించాల్సిన పనే ఉండేది కాదు.
నన్నయ కాలాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని ప్రస్తుత కాలానికి వద్దాం. నన్నయ కష్టాలు యధాతధంగా కాకపోయినా ఇంచుమించు అవే ప్రయాసలు ఈ కాలపు రచయితలూ పడుతున్నారు. తాళ పత్రాల బదులు లాప్‍టాప్‍లతో సర్కస్ చేస్తుండవచ్చు. కొన్ని కంప్యూటర్ విద్యలు పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకోలేక అగచాట్లూ పడుతుండవచ్చు.
ఒక పుస్తకం రాసేందుకు కొన్ని నెలలు, ఏళ్ల పాటు రచయితలు సమయాన్ని వెచ్చిస్తున్నారు. బోలెడంత అధ్యయనం, నోట్సు రాసుకోవడం, మూడ్ రాకుంటే కాలుగాలిన పిల్లిలా తిరగటం… ఇలా చెప్తూ పోతే ఎవరికీ ఈ రాతల బాధలు వద్దు బాబూ! అనే వైరాగ్యం కలుగుతుంది..
రచయిత మాదిరి కష్టపడకుండా అందంగా చెక్కి చేతికిచ్చిన పుస్తకాన్ని హాయిగా పడక కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూచుని చదవడంలోని హాయి, అది అనుభవించే పాఠకులకే తెలుసు. అక్షరాల పడవలో అలా తిరిగి రావడం, అనుభూతి చెందడం, వేరే ప్రపంచాన్ని చుట్టి రావడం, పాఠకులు ఎంత అదృష్టవంతులో గదా!
మరి ఇంతటి అద్భుత వరాన్ని ఈ కాలపు జనాలు ఎందుకు కాలరాసుకుంటున్నారో అర్థం కాదు.
ఒక జీవిత కాలంలో వందల జీవితాలను సొంతం చేసుకోవాలన్న స్వార్ధం మీకుంటే, అందుకోసమైనా పుస్తకం అందుకోండి బాసూ!
