మరొక రోజు వస్తుంది!

Spread the love

మరొక రోజు రాబోతోంది
అమ్మ లాంటి రోజు
పారదర్శక రూపకంలా
ఏ వెలితీ లేని నిండుదనంలా

వజ్రపు కాంతి ఊరేగుతున్నట్టు
మెరుస్తున్న ఎండ
చల్లగాలి చలువనిచ్చే
చీరకొంగులాంటి నీడ

ఆ రోజు ఏ ఆశా ఆత్మహత్య చేసుకోదు
ఏ అడుగూ
సొంతనేలను విడిచిపోవాలని ఆలోచించదు

గతం పీడ విరగడయి
అన్ని విషయాలు సహజంగా వాస్తవంగా
వాటి ప్రారంభ లక్షణాలకు
పర్యాయపదాల్లా ఉంటాయి

కాలం సెలవు రోజు నిద్ర పోతున్నట్టు
మీ సుందరమైన సమయాన్ని పొడిగించుకోండి!
మెత్తని కాంతి ధారల్లో సూర్య స్నానం చేయండి!

సీతాకోకలా
ఓ శుభ శకునం ఎగురుతూ వచ్చేదాకా
ఎదురు చూడండి
ఆ తర్వాత తీరిగ్గా పెరిగి పెద్దవాళ్లవుదాము
పెద్దవడానికి చాలా సమయం ఉంది

మరో రోజు వస్తుంది...

స్త్రీ మూర్తి లాంటి రోజు
అభినయించే పాటలా
అనునయించే పలకరింపులా
గతంలా కాక
అప్పుడు అన్ని విషయాలూ
అమ్మ లాగే ఉంటాయి

రాతి వక్ష స్థలం నుండి
తల్లి పాలవంటి నీటిధారలు ప్రవహిస్తాయి
గాలిలో ద్వేషపు ధూళి ఉండదు

కాలంలో కరువు జాడలు
బతుకులో ఓటమి నీడలు
కానరావు

అప్పుడు...
ప్రేమికుల పడకలో
గూడు కట్టుకునే చోటు దొరకక
శాంతి పావురం
యుద్ద ట్యాంకులో నిద్ర పోతుంది

మూలం : (Another Day Will Come)
- - - మహమూద్ దర్విష్ స్వేచ్ఛానువాదం : రహీమొద్దీన్

మహమూద్ దర్విష్

పాలస్తీనా జాతీయ కవి‌గా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...

రహీమొద్దీన్

కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్‌ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *