నా కాలేజీల్లో నేను
మార్గాన అప్పారావుని మీకు తెలీదు. సలాది జగ్గారావుని కూడా మీకు తెలీదు. ఇమంది అప్పారావుని మీకు తెలియనే తెలియదు. మీకు అల్లబోయిన అప్పలస్వామినీ తెలీదు. అక్కరబోయిన అప్పలస్వామినీ తెలీదు. చిన్న నరసింహులు పేరు వినే ఉండరు. మరింక నేనెంతో మందికి ఎంతో వై.బాలాజీ కూడా మీకంతేనని కూడా తెలుసు. మీకతణ్ణి తెలిసే ఉండదు. అలాగే, రామచంద్ర పండా కాని, రామచంద్ర పండాలే కాని, శివదయాల్ సాహినీకాని, మునీ అబ్దుల్ గఫూర్ ఖాన్ కాని, పబ్లియాండర్ పిళ్ళేకాని, బలభద్ర శతవస్తికాని, రౌతు రాముడుకాని, గోపరాజు శివుడుకాని, కొల్లా రామ్మోహనుడు కాని, పన్యాల రంగనాథుడుకాని, మోచర్ల అనంత పద్మనాభుడు కాని, ఉప్పల వెంకటేశ్వరుడుకాని, చట్టిరామచంద్రుడు కాని, సోమయాజుల సోమేశ్వరుడు కాని, అబ్బూరి వరద రాజేశ్వరుడు కాని మీకు ఎప్పుడూ తటస్థపడి ఉండకపోవచ్చును.
వాళ్ళంత మందీ, అలాంటివాళ్ళెంతో మంది నాకు ఏ.వి.ఎన్ కాలేజీ – హైస్కూల్లో క్లాసుమేట్సూ, స్నేహితులూను.
నాకు ఏ.వి.ఎన్ కాలేజీ అంటే చాలా యిష్టం. నేనెవరికంటే కూడా ఎక్కువాణ్ణి కాననే విషయాన్ని నేనక్కడే తెలుసుకున్నాను.
మార్గాన అప్పారావు ఆడినంత బాగా, సలాది జగ్గారావు ఆడగలిగినంత చక్కగా నేను పుట్ బాల్ ఆట ఆడలేను. అల్లబోయిన అప్పలస్వామంత తెలివిగా నేను లెక్కలు చేయలేను; చేసినా సరే. అంత ధైర్యంగా కానీ ఒకరికి ఇవ్వలేను. శివదయాల్ సాహినీలా చిన్న నరసింహులులా, అక్కరబోయిన అప్పలస్వామిలా, అమలకంటి అప్పారావులా ధైర్యంగా దెబ్బలాడలేను. దురిశేటి నరసింగుళ్ళా తొందరగా పరిగెట్టలేను. గోపరాజు శివుళ్ళా, రామచంద్రపండాలేలా ఎవ్వర్నీ తాటాకులు కట్టలేను. మామిడిపూడి పట్టాభి, వెంకటేశ్వర్లులా పరీక్షల్లో ఫస్టుమార్కులు తెచ్చుకోలేను. రవీంద్రనాథ్ మీనన్ లా తెల్లగా ఉండలేను. డి.ఎల్.ఎన్. రాజులా పొడుగ్గా ఎదగలేను. పన్యాల రంగనాథుళ్ళా కథలు కట్టలేను.
అబ్బూరి (వరద ) రాజేశ్వరుళ్ళా గేయాలు రాయలేను. భగవంతుణ్ణి తిట్టలేను. కృష్ణమిశ్రలా చెడుగుడు ఆడలేను. మోచర్ల (అనంత) పద్మనాభుళ్ళా ఆడవేషం వెయ్యలేను. ఉప్పల వెంకటేశ్వరుళ్ళా స్నేహంగా ఉండలేను. కొల్లా రామ్మోహనుళ్ళా, సోమయాజుల సోమేశ్వరుళ్ళా కల్మషం లేకుండా ఉండలేను.
ఏ.వి.ఎన్. కాలేజీ – హైస్కూల్లో నా స్నేహితులు, నా సహ విద్యార్థులు నా కెన్నెన్నో పాఠాలు నేర్పేరు. జీవితంలో నాకెంతో ఆనందాన్నిచ్చేరు. వారంత మందినీ నేనెల్లప్పుడూ స్నేహభావంతో చూసుకుంటాను. గురుతుల్యులుగా తల్చుకుంటాను.
ఏ.వి.ఎన్. కాలేజీ అంటే నాకెంతో ఇష్టం. ఏ గురువో ఒకరు అభిమానించకపోతే, ఏ కొద్దిమందికో తప్పిస్తే, చాలా మందికి సరిగా చదువురాదని నా నమ్మకం. ఏ.వి.ఎన్. కాలేజీలోనే నేను చదువురాక తన్నులు తిన్నాను. అక్కడే మాస్టర్లని శ్రమపెట్టి వాళ్ళ వల్ల నేను కొంత చదువు నేర్చుకున్నాను. అక్కడ మా మాస్టర్లంతా మమ్మల్ని తిట్టినా, కొట్టినా, మందలించినా ఏం చేసినా మమ్మల్ని చాలా అభిమానంగా చూసుకొనేవారు. మేం అల్లరి చేసినా మమ్మల్ని అదుపులో ఉంచుకోగలిగేవారు. పాఠాలు సరిగా చెప్పగలిగిన శక్తి, సామర్థ్యాలుండటం చేత మా గౌరవం పొందేవారు. వారి స్వంత జీవితాల్లో ఎవరికైనా ఏవైనా పొరపాట్లున్నాయని మాకు ఎవరైనా చెప్పినప్పటికీ తండ్రుల పొరపాట్లని పిల్లలు క్షమించగలిగినట్టు మేం వారిని క్షమించగలిగేం. మా గురువులందరికీ నేను వినయపూర్వకంగా నమస్కరిస్తాను.
అవును, ఏ.వి.ఎన్. కాలేజీ అంటే నాకెంతో ఇష్టం. అక్కడ మాకెంతో అందం.
మహాసముద్రం అక్కడ మాకు పెరట్లో చెరువులాగ, ఎండలో వెండిలాగ, కదలని ఆకాశానికి కదిలే ముద్దుల నీడలాగ, వేసవిలో తరవాణి కుండలాగ, వెన్నెల్లో వేడెక్కిన ప్రియురాల్లాగా ఉప్పగా, చల్లగా, వెచ్చగా, మాకెంతో ఆనందదాయకంగా ఉంటుంది. ఎంతో అందంగా మనోహరంగా ఉంటుంది. కోపం వస్తే భయంకరంగా మా మీదికి భగవంతుళ్ళా విరుచుకుపడుతుంది. చల్లబడితే తన కెరటాల చేతుల్తో తల్లిలా లాలించి మమ్మల్ని మెత్తగా నిమురుతుంది. అన్ని అద్భుతాల సొగసుల్ని చూచి నివ్వెరపోయినట్టు యారాడ కొండ మాకు అనతి దూరంలో నీలంగా నిలబడి ఉంటుంది. కదిలే రథాల్లాగా, నడిచే మేడల్లాగా దేశదేశాల ఓడలు మాకు తేల్తూ, కనిపిస్తూ హార్బర్లోకి తేలితేలి వెళ్తుంటాయి. తెల్లతెల్లని సీతాకోక చిలకల్లాగ జాలర్లు తెరచాపనెత్తుకొని కెరటాలని దాటుకొని మాకు దూరంగా వెళ్తుంటారు. మాకు దగ్గరగా వస్తూంటారు. మెత్తమెత్తని గాలి మాకు నీలి ఆకాశంలో చల్లబడి నీలపు యారాడ కొండమీద చల్లబడి సముద్రమంత నీలాల నీటి మీద ఎంతో హాయిగా చల్లబడి మా కాలేజీలో మా కోసం మధురంగా వీస్తుంది.
అవునుమరి. ఏ.వి.ఎన్. కాలేజీ అంటే నాకెంతో ఇష్టం. మా కాలేజీ చరిత్ర ఎంతో ఘనమైన చరిత్ర అని మాకు చెప్తూండేవారు. ఆ చరిత్ర అంత ఘనమైనదైనా కాకపోయినా. శాస్త్రవేత్త సి.వి. రామన్ గారు చదివిన తావుల్లోనే నేను కూడా చదవగలిగినందుకు నేను గర్విస్తుంటాను. మహాకవి శ్రీశ్రీగారు చదివిన ఆలయంలోనే నాక్కూడా చదువు కొంత వచ్చినందుకు నేను గర్విస్తాను. అంతేకాదు, నా వంటి ఎంతో మంది చిన్నలతో పాటు కలిసి చదువుకోగలిగినందుకు కూడా నేను గర్విస్తాను. అక్కడ నేను దెబ్బలు తిన్నాను. తన్నులు కాసేను. బెంచీ లెక్కేను. కన్నీళ్ళు కార్చేను. కేరింతలు కొట్టేను. కొద్దిపాటి చదువులు చదవగలిగేను. ఆ కళాశాలకి నా కృతజ్ఞత.
అక్కణ్ణించి నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఆర్ట్సు కాలేజీకి వెళ్ళేను. ఆ విద్యాలయం అంటే నాకిష్టమో కాదో నేను చెప్పలేను. ఎందుచేతనో తెలియదు. ఆ వాతావరణానికి నేను సర్దుకోలేకపోయేను. ప్లెబియన్ కంపెనీకి అలవాటైపోవడం చేత పెట్రీషియన్ సొసైటీకి నేను తట్టుకోలేకపోయేనేమోనని నా కనిపిస్తూంటుంది. ఏ.వి.ఎన్ కాలేజీ నించి అక్కడకి వెళ్ళడం నాకు అమలాపురం కొబ్బరితోటల్లోంచి అనకాపల్లి వరిపొలాల్లోంచి అరేబియా ఎడారిలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. ఏ.వి.ఎన్. కాలేజీ కొండ మీద గాలెక్కువైతే, వాల్తేరు దిబ్బలమీద ఈదురుగాలెక్కువ. విశ్వవిద్యాలయంలోంచి కూడా మహాసముద్రం కనిపిస్తుంది. కాని అక్కణ్నించి మాకది ఆడుకొనే చెల్లిలా కాకుండా జగజ్జననిలా కనిపిస్తుంది. జగజ్జనని మంచిదే కాని ఆవిడకి దూరం నించి దండం పెడతామే కాని దగ్గరగా వెళ్ళి ఆవిడతో ఆడుకోలేం.
ఏ.వి.ఎస్. కాలేజీలో చదువు నాకు అమ్మదగ్గిర అ ఆ లు నేర్చుకున్నట్టుగా వుంటే విశ్వవిద్యాలయంలోని చదువు స్వాములవారి దగ్గర సంస్కృతం నేర్చుకున్నట్టు ఉండేది. స్వాములవారు కూడా మానవుల్ని ప్రేమిస్తారు. కాని నిన్ను మీ అమ్మానాన్నా, నన్ను మా అమ్మా నాన్నా అభిమానించినట్టు అభిమానించరు. అయితే వారు ఆ విధంగా ఉన్నారనుకోవడం నాలో లోపమే కాని వారి లోపం అయి వుండదని ఆ తరువాత కొంత కాలానికి నేను గ్రహించేను.
బాల్యదశలోంచి ఆ తరవాత దశలోకి నేను ఏ విధంగా మారేనో నేను సరిగా చెప్పలేను కాని ఆ మారడంలో ఏదైనా మంచి అంటూ ఉంటే అందుకు కొంతవరకూ డాక్టర్ తలిశెట్టి ఆత్మారాం, పురుషోత్తంగారు, డాక్టర్ పూళ్ళ తిరుపతిరాజుగారూ కారకులని నేను చెప్పగలను. మరో కారణం విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ!
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ ఎవరికి ఏయే ఉపకారాలు చేసిందో నాకు తెలియదు. కాని, ఆ లైబ్రరీ నాకు మాత్రం తెలియని లోకాలని చూపెట్టింది. కొత్త కొత్త భావాలని కలిగించింది. మంచి మంచి సరదాలని అలవాటు చేసింది. నన్నది భయపెట్టింది. ఆశపెట్టింది. కలవరపరిచింది. ఉత్సాహపరిచింది. ఆ లైబ్రరీ నన్నెంతగానో మార్చింది. పుస్తకాలకి కూడా కొందరు ఎందుకు నమస్కరిస్తారో నేనందువల్ల అర్థం చేసుకోగలను. అందువల్లనే మంచి పుస్తకాలకి నేను కూడా నమస్కరించగలను. వినిన వేదాల్లో అంతా ఉందంటారు. రాసిన పుస్తకాల్లో ఎంతో ఉంది.
నాదే మరో కాలేజీ మెడ్రాస్ లా కాలేజీ.
కాలేజీలు కలకల్లాడుతూంటే నా కిష్టం. (అందుచేతనే, మా కాలేజీలనే రాత్రివేళ చూస్తే నాకు భయంగా ఉంటుంది. సెలవుల్లో చూస్తే దిగులుగా ఉంటుంది.) మెడ్రాస్ లా కాలేజీ కళకళ్ళాడుతూ ఉండేది. మా తండ్రి తాతలు, బంధువులు, స్నేహితులు ఎంతో మంది అక్కడ చదివి ఉండడం చేత నాకా కాలేజీ కొత్తగా తోచలేదు. నేనక్కడ “లా” అట్టే చదవలేదు. కాని లోకం గురించి మాత్రం కొంత నేనక్కడ తెలుసుకున్నానని అనుకుంటాను.
“లా” కాలేజీలో చాలా మంది మధ్యతరగతి వాళ్ళే చదివారు. వారంతా ముదిరిన విద్యార్థులే కాని నూనూగు మీసాలవారు కాదు. 1946-48 రోజులవి. స్వాతంత్య్రం వస్తూ వస్తూ వచ్చేసిన రోజులవి. ‘లా’ కాలేజీ యువకులంతా చాలా ఉత్సాహంగానూ పశువుల సంతలో పొసుగుడు గాళ్ళల్లా చాలా, గడుసుగానూ ఉండేవారు. ముందుకి వాళ్ళకి మంచి దినాలున్నాయని వాళ్ళు గ్రహించగలిగేరని నేననుకుంటాను. (ప్యూడల్ మనిషిని కాబట్టి నేనా విషయాన్ని అంతగా గ్రహించలేకపోయేను).
పోతే, లా కాలేజీ నన్నెలా మార్చింది? ప్లీడరుగా మార్చింది. జీవితంలో కాస్త భుక్తి కల్పించింది. న్యాయం కోసం ఎల్లవేళలా నిలబడగలిగే ధైర్యం ప్రసాదించకపోయినా, నిలబడగలిగితే బావుండుననే కోరిక కల్పించింది. మధ్యతరగతి వారి వల్ల ప్రజలకు రాబోయే మహానర్ధాలని కొంతగా నాకు సూచించింది. వ్యక్తిగతంగా వారిలో ఇ. అయ్యప్పరెడ్డిలో, దామోదరం సంజీవయ్యలో, ఖజానా వెంకట్రావులో, పి. సుందరంలో, సత్యేంద్రన్ లో వారిలో కొందర్లో ఉండే మంచితనం నేను కొంత అక్కడ తెలుసుకున్నప్పటికీ, సామూహికంగా మధ్యతరగతి వారి తెలివితేటల్నీ, స్వార్థపరత్వాన్నీ నాకు లా కాలేజీయే చూపించింది.
ఎన్ని కాలేజీల్లో ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎంత నేర్చినప్పటికీ, ఎన్ని చూసినప్పటికీ, నేను మంచివాణ్ణయేనని చెప్పను. చెప్పలేను. కాని నాలో మంచితనం కొద్దిపాటి ఉన్నప్పటికీ అందుకు కారకులు నా గురువులూ నా సహ విద్యార్థులూ అని మాత్రం నేను చెప్పుకోగలను. మా గురువులందరికీ నేను వినయపూర్వకంగా నమస్కరిస్తాను. నా సహ విద్యార్థులందరికీ, ముఖ్యంగా అబ్బూరి వరద రాజేశ్వరరావుకీ అక్కరబోయిన అప్పలస్వామికీ, చాగంటి సీతారామయ్యకీ, మామిడిపూడి పట్టాభిరాంకీ వెంకటేశ్వర్లుకీ, జయంతి సుధాకర రూసోకీ, ఇ. అయ్యపరెడ్డికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.
(6-11-1970 ఆంధ్రజ్యోతి వారపత్రిక ‘విద్యార్థిలోకం’ శీర్షిక)
కథానిక
కథలు చెప్పుకోవడం ఆదినుంచీ ఉంది. కథల గురించి అంతా చెప్పాలంటే అది చాలా పెద్ద కథే అవుతుంది. ప్రతిజాతిలోనూ, భాషలోనూ కథలు పెద్దవీ ఉన్నాయి. చిన్నవీ ఉన్నాయి. విశ్వసాహిత్యాన్ని అలా విడిచిపెట్టేసి ఒక్క తెలుగు సాహిత్యంలోని, అందులోనూ నవ్యాంధ్ర సాహిత్యంలోని కథానికా విభాగం గురించి మాత్రమే వ్రాయాలన్నా కూడా అదేం చిన్నకథ కానేరదు. పూర్తి వివరాలతో వ్రాయాలంటే అది చిన్న వ్యాసంలో ఇమడదు. కొద్దిలో చెప్పాలంటే చాల భోగట్టా విడిచిపెట్టవలసి ఉంటుంది. అలా విడిచిపెడుతూన్నందుకు నన్నందరూ క్షమించవలసి ఉంటుంది.
లోగడ శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారు కథానికల గురించి వ్రాస్తూ “కథానిక అంటే అభినవ సాహిత్య సంసారానికి ఆత్మబంధువైన చిన్న కథకు పురాణ భారత సాహిత్యవేత్తలు పెట్టిన ముద్దుపేరు” అన్నారు. అయిదు రకాలైన గద్య కావ్యాల్లో ఒకటిగా చెప్పబడిన కథానిక (లేక చిన్న కథ)కి అగ్నిపురాణంలో చెప్పిన లక్షణాలేమిటో కూడా శ్రీ శాస్త్రిగారు ఈ విధంగా వివరించారు.
“1. కథ సుదూరంగా సాగిపోక పొందికగా ఉండాలి. 2. పెద్ద సమాసాలు, వర్ణనలతోను కథాశరీరం బిగిసిపోకూడదు” ఇవి బాహ్యలక్షణాలు.
అభ్యంతర లక్షణాలు మూడు : 1. “పఠితను భయ సంభ్రమాశ్చర్యాలలో ఉంచే విచిత్ర సంఘటన లుండాలి. 2. కథాగర్భంలో… కరుణ సన్నివేశం కూర్చాలి. 3. పాఠకుడు అనుకోని కొత్త మలుపులతో కథ తమాషాగా ముగిసిపోవాలి.
ప్రతి కథానికలోనూ పైన చెప్పిన అన్ని లక్షణాలు ఉండకపోయినా, ముఖ్యమైనవి కొన్ని ప్రతి కథలోను కనిపిస్తాయి.
పూర్వం నుంచీ భారతీయ సాహిత్యంలో చిన్న కథలనేకం ఉన్నాయి. అందుకు ఉదాహరణగా పంచతంత్రం, హితోపదేశం, విక్రమార్కుని కథలు మొదలయినవి తీసుకోవచ్చు. దగ్గర్లో మనకి పన్నెండు రాజుల కథలు, తెనాలి రామలింగని కథలు, శుకసప్తతి కథలు మొదలయినవి ఉన్నాయి. చెప్పిన లక్షణాలన్నీ లేకపోయినప్పటికీ ఇవి కథానికలని చెప్పకతప్పదు.
ఇందువల్ల మనకి తెలిసేదేమంటే కథానిక లేక చిన్న కథ పడవల్లో ప్రయాణం చేసి మన రేవుల్లో పాశ్చాత్యులతో పాటు దిగిన వస్తువు కాదు. కథానిక మనకి పూర్వం నుంచీ ఉంది. అయితే పాశ్చాత్యుల “షార్ట్ స్టోరీ” ప్రభావం మనమీద బాగా పడింది. అదెలానూ తప్పదు. కాంతి ఎక్కడున్నా అన్ని దిక్కులా పరిగెడుతుంది. పంచతంత్రం కథలు మనదేశంలో పాతుకుపోయి ఉండిపోలేదు. హిమాలయాన్ని దాటి చాలచోట్ల సంచారం చేశాయి, చేస్తున్నాయి. అరేబియన్ నైట్సు కథలు అరేబియా దేశపు వేడిలో మాడిపోలేదు. ఎన్నోచోట్ల అవి ఇప్పటికీ పచ్చగా ఉన్నాయి.
మనిషికి ఊహ ఉంది. అందుచేత ప్రతి జాతిలోనూ – “సాహిత్యం” అంటే ఏమిటో ఎరగనివాళ్ళలోనూ, లిపిలేని భాషలో బతికేవారిలోనూ కూడా – చిన్నకథలెన్నో ఉన్నాయి. ఇటీవల డా॥ భద్రిరాజు కృష్ణమూర్తిగారు కొండజాతుల వారి చిన్నకథలు కొన్ని సేకరించారు. కరుణ, హాస్యరసాలతో కూడుకొని ఆ కథలు కూడా కొన్ని అద్భుతంగా ఉన్నాయి. చెప్పే విధానంలో కూడా ఎంతో నేర్పరితనం కనిపిస్తుంది. పల్లె ప్రజలలో గేయరూపంలో ఉన్న ఎన్నో కథలు డా॥ బి. రామరాజుగారు చేసిన కృషి వల్ల అందరికీ ఇటీవల తెలియవచ్చాయి. వీటిని గురించి శ్రీ తూమాటి దొణప్పగారు కూడా ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారు.
తెలుగు ప్రజలలో ఎన్నో కథలున్నప్పటికీ పుస్తక రూపంలో మొదట్లో చాలా మటుకు అనువాదాలే వెలువడ్డాయి. క్రీ.శ. 1811లో “చార్ దర్వేష్” అనే పేరుతో తెలుగున అచ్చయిన కథలు ఆంగ్లం నుంచి అనువదింపబడిన కథలు. విశాఖ పట్టణంలోని గొడే నారాయణ గణపతి రాయణింవారు ఎర్రమిల్లి మల్లిఖార్జునుడనే వారిచేత తర్జుమా చేయించినారు. ప్రజలకి అర్థమయ్యే భాషలోకి అవి తర్జుమా చేయబడ్డాయి. క్రీ.శ. 1819లో “విక్రమార్కుని కథలు” “పంచతంత్ర కథలు” రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారు వ్రాశారు. అవేకాకుండా కాంభోజరాజు కథలు, తెనాలి రామలింగని కథలు, శుకసప్తతి కథలు, జలుకని పద్మాక్షి కథలు మొదలయినవి కూడా అచ్చవడంతో కథాసాహిత్యం వర్ధిల్లింది.
అప్పటివరకూ సంస్కృతభాషలోని మార్గాలనే అనుసరిస్తున్న తెలుగువారికి, ఆంగ్ల భాషలోని మార్గాలని కందుకూరి వీరేశలింగం గారు తొలిసారిగా పరిచయం చేశారు. వారావిధంగా చేసిన కృషి వల్ల గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషావాదం ప్రయోజనాన్ని పొందడం వల్ల తెలుగు భాష పుష్టి చెందింది. కొత్త రచయితలు ముందుకొచ్చారు. ముద్రణా యంత్రాలూ, పత్రికలూ నెలకొనడంతో కథానికా రచన విస్తృతమైంది. “ఆంధ్రపత్రిక” మరిన్నీ, “భారతి” “దేశసేవ” “కృష్ణాపత్రిక” “శారద” “గృహలక్ష్మి” వంటి పత్రికల ద్వారా వాటి స్థాపకులు తెలుగు భాషకీ, తెలుగు ప్రజలకీ సేవచేయడమే కాకుండా తెలుగు కథానికా రచనకి ఎక్కువ అవకాశం కూడా ఇచ్చారు.
“చిన్న కథ” వృద్ధిలోకి రావడానికి వివిధ సాహిత్య సంస్థలు కూడా ఎంతో కృషి చేశాయి. సాహితీసమితి, ఆంధ్ర సారస్వత పరిషత్తు, కవితా సమితి, నవ్యసాహిత్య పరిషత్తు, అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణా రచయితల సంఘం, విశాఖ రచయితల సంఘం, నవ్యసాహితీ సమితి ఇటువంటివి ఎన్నో సంస్థలు ప్రముఖ రచయితలెందరో ముందుకు రావడానికి దోహదం చేశాయి.
ప్రచురణ సంస్థలు కూడా కథానికని మిక్కిలిగా ఆదరిస్తున్నాయి. వావిళ్ళవారు, కొండపల్లి వారు, యువ ప్రచురణలవారు, దేశికవితామండలి వారు, విశాలాంధ్ర ప్రచురణలవారు, ఇటువంటి ఎన్నో సంస్థల వారు కథానికల నెన్నిటినో ప్రచురించి రచయితల్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం కథానిక తెలుగు సాహిత్యంలో చోటు చేసుకొని ఇంకా చోటు కావాలంటోంది. ఈ అమ్మాయికి ఎంత చోటు కావాలన్నా ఇవ్వడానికి ఎవరికీ కూడా అభ్యంతరం ఉన్నట్టు కన్పించదు.
ప్రథమంగా తెలుగున స్వతంత్రంగా కథానికా రచన సాగించిన గౌరవం గురజాడ అప్పారావుగారిది. ఆయన వ్రాసిన కథలు కొద్దివే అయినప్పటికీ అవి కొద్దిగా కావు. సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం ఉన్నదనే విషయం గుర్తించిన ఆయన కథానికా రచన వాడుక భాషలోనే సాగించారు. చారిత్రక కథానికలు రచించిన మాడపాటి హనుమంతరావుగారు, యువకథకుల ఉత్సాహానికి కారకులయిన సురవరం ప్రతాపరెడ్డిగారు కూడా చిన్నకథని పోషించారు.
” ప్రప్రథమంగా “డిటెక్టివ్ కథలు” వ్రాసిన చింతా భీమశంకరం గారు, టాల్ స్టాయ్ కథలనువదించిన కొడవటిగంటి వెంకట సుబ్బయ్యగారు, ఇప్పటికీ తెలుగువారి ఇళ్ళలో ఆడుకొంటూన్న సూరీ-సీతి-వెంకీ గురించి, ఇప్పుడు ప్రతి పట్టణంలోనూ కనిపించే “వటీరావు” గురించి కథలు చెప్పిన చింతా దీక్షితులుగారు, కథారచనలో ప్రత్యేకతనీ, పండిత సంస్కారాన్నీ ప్రదర్శించిన వేలూరి శివరామశాస్త్రిగారు, గృహస్థ జీవితంలోని ఆనందాన్ని కాంతం కథల ద్వారా వెదజల్లిన మునిమాణిక్యం నరసింహారావుగారు, తెలుగు కథకి ఒక స్థిర రూపం ఏర్పరిచారు.
హాస్యధోరణిలో కథలు చెప్పిన మొక్కపాటి నరసింహశాస్త్రిగారు, వ్యంగ్య ధోరణిలో భమిడిపాటి కామేశ్వరరావుగారు చిన్న కథకి చురుకుతనం తెచ్చారు. ఒక తరగతికి చెందిన తెలుగువారి కష్టసుఖాల్ని వారి ఆచార వ్యవహారాలనీ ప్రతిబింబింపజేస్తూ ఒక విశిష్టమైన శైలిలో కథలు చెప్పినవారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. కథకులూ, చిత్రకారులూ అయిన వారు అడవి బాపిరాజు గారు. ఇతివృత్తం తీసుకోవడంలో, భాషని కావలసినట్టు వాడుకోడంలో, శిల్పాన్ని మలచడంలో అసమాన ప్రతిభ ప్రదర్శించిన వారు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, తెన్నేటి సూరిగారు, నోరి నరసింహశాస్త్రిగారు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రిగారు, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారు, చాగంటి సోమయాజులుగారు కూడా ఆధునిక పద్ధతులలో, ఉత్తమ పద్ధతులలో కథలు చెప్పి తెలుగు కథానికకి అలంకారాలు సమకూర్చారు. పల్లెసీమల వాతావరణాన్ని తమ కథలలో మనోహరంగా చిత్రించిన కందుకూరి అనంతం (కరుణకుమార) గారు, సాంఘిక సమస్యల నితివృత్తంగా తీసికొని కథలు వ్రాసిన శ్రీనివాస శిరోమణిగారు, పాశ్చాత్య నాగరికత సోకని అమాయకజీవుల గురించి కథలు చెప్పిన కవికొండల వెంకటరావుగారు, శ్రామికులు గురించి, వారు వాడుకొనే భాషలో కథలు చెప్పిన మా గోఖలేగారు కూడా కథానికా రచనల్లో శ్లాఘనీయమైన కృషి చేయడమే కాకుండా, తెలుగు కథానిక చాలా దూరాలు వెళ్ళగలదని తమ రచనలవల్ల నిరూపించారు. 1930-40 మధ్యకాలంలో పూడిపెద్ది వెంకటరమణయ్యగారు, తాతా కృష్ణమూర్తిగారు, కోటమర్తి చినరఘుపతిరావుగారు, ఇరువంటి విష్ణురావుగారు విరివిగా కథానికా రచన చేసి ఈ సాహిత్యప్రక్రియని ప్రజలకి దగ్గరగా తీసుకువచ్చారు. బోయి భీమన్నగారు కొన్ని చక్కని స్కెచెస్ వ్రాశారు. అటుతరువాత రచయితలలో ధనికొండ హనుమంతరావుగారు, పన్యాల రంగనాథరావుగారు, కందుకూరి లింగరాజుగారు, రావూరి భరద్వాజగారు ఇంకా ఎంతోమంది తమ కథానికలలో వస్తు వైవిధ్యాన్ని, శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించి యువకులలో కథలు వ్రాసే ఉత్సాహం కలిగించారు.
గుడిపాటి వెంకటచలంగారు తెలుగు కథకులలో ముఖ్యులు. దేశంలో ఈయన ఎక్కువగా సంచలనం కలిగించారు. చాల మంది ‘చలం భక్తులు’గా మారారు. వ్యతిరేకులుగా ఎంతోమంది ఎదురు నిల్చున్నారు. మధ్యతరగతి వారి జీవితంలోని దౌర్బల్యాన్ని, కౌటిల్యాన్ని, కాలుష్యాన్ని వస్తువుగా తీసుకొని ఎత్తిపొడిచి విడలగి కడిగిపారవేయడానికి ఈయన ప్రయత్నం చేశారు. ఒక లక్ష్యం ముందుంచుకొని రచన సాగించిన వారిలో ఈయన ముఖ్యులు.
కొడవటిగంటి కుటుంబరావుగారు కథానికా రచనలో సిద్ధహస్తులు. కథల వల్ల సాధించదగిన సాంఘిక ప్రయోజనం ఉన్నదని విశ్వసించే కొద్దిమంది రచయితలలో ఈయనొకరు. నూతన సమాజస్థాపన గురించి రచయితలు కూడా పాటుపడవచ్చుననీ, పాటుపడాలనీ కూడా వీరు నమ్మినట్టు వీరి రచనలవల్ల తెలుస్తూంది. పాత్రల స్వభావ చిత్రణ అద్భుతంగా చేయడమే కాకుండా, ఏయే శక్తుల ప్రభావం వల్ల ఆ పాత్రలు ఆయా విధాల ఉంటాయో చెప్పడానికి కూడా వీరు ప్రయత్నం చేస్తారు. తెలుగు కథలకి వీరు మార్గదర్శకులు
నూతన భావాలతో, నూతన విషయాలతో నిండిన గోపీచంద్ గారి కథలు వ్యక్తిలోనూ, సంఘంలోనూ కూడా మార్పు రావాలనే కథకుడి ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. తెలుగు కథని కొత్తదారులంట నడిపించడం వల్ల ఈ తరం వారికి గోపీచంద్ గారు మార్గదర్శకులయ్యారు.
పాలగుమ్మి పద్మరాజుగారు తెలుగు కథానికా రచయితలలో నూతనోత్సాహం రగుల్కొల్పారు. వీరి ‘గాలివాన’ కథ అంతర్జాతీయ కథానికల పోటీలో బహుమతి పొందడం తెలుగు రచయితలందరికీ – యువ రచయితలందరికీ ముఖ్యంగా – సంతోషం, ఉత్సాహం కలుగజేసింది. కథానికా రచనలో ఈయన శిల్పానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.
శివరాజు వెంటక సుబ్బారావుగారు (బుచ్చిబాబు) తెలుగు యువ కథకులలో ముఖ్యులు. మనుష్యుల స్వభావాల గురించి అతి సహజంగా చెప్పడంలో ఈయనకి ప్రత్యేకమైన నేర్పరితనం ఉంది. కథని చెప్పే వీరి తీరులో కూడా గడుసుతనం కనిపిస్తుంది. పాశ్చాత్య సాహిత్యాలలో ఉన్న కొత్త పద్ధతులు కొన్నింటిని తెలుగులోకి తెచ్చి ఆ విధంగా కూడా వీరు తెలుగు భాషకి సేవ చేశారు.
తెలుగు సాహిత్యంలో ‘కథానిక’ లేక ‘చిన్నకథ’కి ప్రత్యేకమైన స్థానమే కాకుండా ఒక గౌరవమైన స్థానం లభించినదని చెప్పడానికి నిదర్శనం ఏమిటంటే పండితులే కాక, – మహాకవులే కాక, కవి సమ్రాట్టులు కూడా కథానికా రచన చేయడమే నిదర్శనం. డా॥ జి.వి. కృష్ణారావుగారు, డా॥ యస్.వి.జోగారావుగారు, కొర్లపాటి శ్రీరామమూర్తిగారు రమ్యమైన కథానికలు రచించి ఈ సాహిత్య ప్రక్రియకి గౌరవం తెచ్చారు. శ్రీరంగం శ్రీనివాసరావుగారు కొన్ని చిన్న కథలు, దాదాపు స్కెచెస్ వంటివి కొత్త పద్ధతులలో చెప్పారు. నిత్యజీవితంలో వీరి ‘కోనేటిరావు’ చాలచోట్ల కనిపిస్తాడు. విశ్వనాథ సత్యనారాయణగారు కథానికలు ఎక్కువ వ్రాయలేకపోయినప్పటికీ ఆ వ్రాసినవి ప్రాక్పశ్చిను సాహిత్య రీతుల సమన్వయం చేసికొని ఇంపుగా వ్రాశారు.
తెలుగు ‘కథానిక’ చరిత్ర చూచినట్లయితే తెలుగు కథకుల సంఖ్య మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఎక్కువైనట్టుగా తెలుస్తుంది. స్వాతంత్రోద్యమం, గాంధీ మహాత్యం దేశంలో గొప్పచైతన్యం కలిగించి మార్పు తీసుకువచ్చాయి. తెలుగు కథానికా సాహిత్యం ఆ ఉద్యమానికి, ఆ చైతన్యానికి ఫలితంగా పెరిగి ఉండవచ్చు. కాని స్వాతంత్రోద్యమానికి తెలుగు కథకులు చెప్పుకోతగ్గ౦తగా, ప్రత్యక్షంగా సహాయం చేయలేదనే చెప్పాలి. ఈ రోజు కూడా తెలుగు ప్రజల జీవితం గురించి తెలుసుకోవాలన్నా, వారి చైతన్యాన్నీ, ఉత్సాహాన్నీ గమనించాలన్నా, వారి దారిద్ర్యాన్నీ, దుఃఖాన్నీ, వారి సంపదనీ సుఖాన్నీ, చూడాలన్నా, తెలుగు ప్రజలలోకి వెళ్ళి చూసి తెలుసుకోవలసిందేగాని తెలుగు కథలు చదివితే మట్టుకు భోగట్టా తెలియదు.
తెలుగువారిలో భారతీయులందర్లో లాగే నూటికి తొంభై మంది రైతుపనో, కూలిపనో చేసుకు జీవిస్తున్నారు. తెలుగు కథల ద్వారా ఏమి తెలిసినప్పటికీ ఆ ప్రజల జీవితంలోని కష్టసుఖాలు గాని, ఆశలు గాని, ఆశయాలుగాని తెలియవు. 15-8-1947 తేదీకి ముందు తెలుగువారు గడిపిన జీవితానికీ, ఇప్పటివారి జీవితానికీ మధ్య ఎంతో తేడా ఉన్నదనే విషయం తెలిసిన వారికి తెలుస్తుంది. పల్లెలలో, పట్టణాలలో, వాడవాడలా దేశం నలుమూలలా ప్రజలు మేల్కొని మసలుతున్నారని గాని, నూతన సమాజ నిర్మాణానికి తొందరపడుతున్నారని గాని, వారి ఉత్సాహానికి మేర లేదనిగాని, వారి శక్తి సాధింపజాలనిది ఉండదనిగాని మనకి తెలుగుకథలు చదివితే తెలియదు. ప్రజల్లోని ఈ చైతన్యానికి తెలుగు కథలు కారణాలు కావు; ప్రతిబింబాలూ కావు.
అయితే, ప్రతిభగల రచయితలు చాలమంది నేడు కథానికా రచన చేస్తున్నారు. వీరి రచనల్లో వస్తువైవిధ్యం ఎక్కువగా లేకపోయినా కొంతగా వుంది. ప్రేయసీ ప్రియుల సంకేత స్థలాల్లోనూ, పడకటింటి తెరల మధ్యనూ పెద్దవాళ్ళ నాలుగిళ్ళ వాకిళ్ళలోనూ చాలాకాలం నలిగిపోయిన ‘తెలుగు కథ’ ఇప్పుడిప్పుడే బైటపడి లోకాన్ని చూస్తోంది. అమరేంద్ర, హితశ్రీ, ముళ్ళపూడి, పోతుకూచి, మురయా, మధురాంతకం, బలివాడ, కాళీపట్నం, అంగర, నార్ల అవసరాల, మునిపల్లె, ముద్దంశెట్టి, ఓగేటి, కొలకలూరి, కొమ్మూరి, పురాణం, భాస్కరభట్ల, ఇసుకపల్లి, సహజానందం, సింగరాజు, సురమౌళి, పూసపాటి, బొమ్మరెడ్డిపల్లి, పాలంకి, శిష్ట్లా, దండమూడి, చందూరి, పంతులు, నంది, సి. రామచంద్ర,అవధాని, చిదంబరం, తిలక్, జ్యేష్ట, వాకాటి, కావూరి మొదలైన వారెందరో మంచి పద్ధతుల్లో, కొత్త ఇతివృత్తాలతో కథలు వ్రాస్తున్నారు. తెలుగు జీవితాన్ని చిత్రించడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
నేటి కథానిక గురించి చెప్పుకోవలసిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే, పూర్వం కంటే ఆడవారు ఇప్పుడు ఎక్కువగా కథలు వ్రాయడం. కనుపర్తి వరలక్ష్మమ్మగారు, కులపర్తి కమలావతీదేవిగారు, స్థానాపతి రుక్మిణమ్మగారు ఇంకా మరికొందరు లోగడ చక్కని కథలు వ్రాసి ఆడవారి ప్రజ్ఞ నిరూపించారు. ఇప్పుడు కొమ్మూరి పద్మావతీదేవిగారు, సౌరిస్ గారు, నాయని కృష్ణకుమారిగారు, అబ్బూరి ఛాయాదేవిగారు, తురగా జానకీ రాణిగారు, ఇల్లిందల సరస్వతీదేవిగారు, పి. సరళాదేవిగారు, యద్దనపూడి సులోచనారాణిగారు, కె. రామలక్ష్మిగారు, చాగంటి తులసిగారు, ఎమ్. పార్వతిగారు – వీరంతా సరళమైనశైలిలో అందమైన కథలు, అందరూ చదువుకోదగ్గవి చెప్తున్నారు. వారు చెప్పే కథలు కరుణరసభరితాలై ఉంటున్నాయి. వారు చెప్పే కథలు నాజూకైన హాస్యంతో నిండి ఉంటున్నాయి. వారు తీసుకొనే ఇతివృత్తాలు జీవితానికి సంబంధించినవిగా ఉంటున్నాయి. వారు వాడు భాషలో తెలుగు నుడికారం తప్పక ఉంటోంది.
ఆంగ్లం నుండి కథలు ఎక్కువగా వచ్చాయి తెలుగులోకి. ఆంగ్లం ద్వారా మిగతా పాశ్చాత్య భాషల్లోని కథలు కూడా వస్తున్నాయి. కాని “రెండో తరహా” పాశ్చాత్య కథకుల ప్రభావం తెలుగు రచయితల మీద ఎక్కువగా ఉంటోంది. గాలి పోగుచేసి గారడీ చేసే రచయితల్ని చూసి మనం ముగ్ధులమైపోయి వారిని అనుకరించవలసిన అవసరం లేదు. జీవితం గురించి స్పష్టమైన, నిశ్చితమైన అభిప్రాయాలు కలిగినట్టివారు, అద్భుత విధానాలలో కథానికా రచన చేసినవారు, విశ్వసాహిత్యంలో చిరస్థాయిగా నిలవగల్గినవారు రాయ పాశ్చాత్య రచయితలు ఎందరో ఉన్నారు. వారి ప్రభావం తెలుగు రచయితలపై లేదు. తెలిసిన వారు జీవితాన్ని తరచి చూచినట్టుగా వారి రచనల వల్ల తెలుస్తుంది. జీవితం గురించి మనలో చాలామంది కథలు చదివి మాత్రమే తెలుసుకొంటున్నట్లుగా ఉంది. హిందీ కథలూ, బెంగాలీ కథలు కూడా తెలుగులో కనపడతాయి. బెంగాలీలోంచి కథా ప్రవాహమే దిగిపోయింది. చక్రపాణిగారు, బొందలపాటివారు, మద్దిపట్లవారు సవ్యమైన పద్ధతులలో ప్రప్రథమ అనువాద రచన చేస్తున్నారు. మనవారు బెంగాలీని, ముఖ్యంగా శరశ్చంద్ర చటర్జీగార్ని ఎక్కువగా ఆదరించారు. శరత్ గారి ప్రభావం నుండి తెలుగు కథ ఇప్పుడిప్పుడే అద్భుతమై తేరుకొంటోంది. దేశభాషల్లోని ఇతర భాషల్ని తెలుగువారు ఎందుచేతనో కాని కొంచెం దూరంగా ఉంచుకున్నారు. డిటెక్టివ్ కథలతో పాటు తెలుగు కథలు వ్రాసేవారి సంఖ్యా,చదివేవారి సంఖ్యా కూడా పెరుగుతోంది. కాని తెలుగు కథల్ని విమర్శించేవారు శ్రీవాత్సవ గారు, ఆచంట జానకీరాంగారు, సాళ్వ కృష్ణమూర్తిగారు- ఇలా కొద్దిమంది మాత్రం కనిపిస్తున్నారు. కథలలోని లోటుపాట్లని కూడా వారు చూపించినట్లయితే కథకులకి వారి విమర్శ ఉపయోగకరంగా ఉండగలదు. అందువల్ల తెలుగు కథానిక ఎక్కువ బాగుపడనూ గలదు.
ప్రస్తుతం కచ్చితంగా చెప్పగలిగే విషయం ఏమిటంటే తెలుగు సాహిత్య వీధిలో కథానిక లేక చిన్న కథకి దిట్టమైన పునాదులు పడ్డాయి. ఆ పునాదుల మీద మన రచయితలు గట్టి మేడ కట్టగలరని ఆశించడానికి అవకాశాలున్నాయి. సామగ్రి అంతా సిద్ధంగా ఉంది. శక్తి సామర్ధ్యాలుగల పనివారు కలాలు సర్దుకొని కార్యరంగంలోకి ఉరికి ఉత్సాహంతో పనిచేస్తున్నారు. యువ రచయితలు అనతికాలంలో అతి సుందరమైన, అద్భుతమైన కథానికా సౌధాన్ని నిర్మించగలరని మనం తప్పక ఆశించవచ్చు.
(అఖిల భారత తెలుగు రచయితల మొదటి మహాసభలు 1960 మే 6,7,8,9, తేదీల్లో హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో జరిగాయి. అప్పుడు, అక్కడ, ‘కథానిక’ మీద చదివిన ప్రసంగ వ్యాసం. మహాసభల సంచికలో అచ్చయింది ప్రసంగం.) 3-5-1981
శేఖరంగారి స్త్రీ వల్రీ
చిన్నప్పుడు నాకు కథల్రాయాలని చెడ్డ తహతహగా వుండేది. “ఎలా రాయడం, ఎలా రాయడం?” అంటే ఎవడూ చెప్పడు. ఆ రోజుల్లో మా వూరి జనాభా యాభైవేలు. నాకు తెలిసినవాళ్లు వందమంది, వంద జనాభాకి ఓ రచయిత (చొప్పున) వెలిసేడూ. అంటే ఆ దేశం నరకమైనా అవుతుంది, లేదా స్వర్గమైనా అవుతుంది. కాని, నూటికో రచయిత ఇప్పుడే కనిపించడు. అప్పుడెలా కనిపిస్తాడు? పోతే, నాకు తొమ్మిదేళ్ళు వెళ్ళీ వెళ్ళగానే (1931 సం॥రంలో) ఓ రచయితని దర్శించే భాగ్యం లభించింది. నా జీవితంలో నేను ప్రప్రథమంగా నా కళ్ళారా చూసిన రచయిత అబ్బూరి వరద రాజేశ్వర్రావు. అతనప్పుడు బెజవాణ్నించి వైజాగొచ్చి సెకండ్ ఫారంలో నాకు క్లాస్మేట్ అయేడు. అతణ్ని నేను అద్భుతమైన వ్యక్తిగా చూచి చాలా ఆనందించేను. తను రాసిన గేయం ఒకటి రాజేశ్వర్రావు నాకు చూపించేడు. దేవుడు లేడు లేడనేది ఆ గేయం సారాంశం. “దేవుడు లేడా?” అని నోరు వేళ్ళాడేసుకొని ప్రశ్నించేన్నేను. “లేడే!” అన్నాడు రాజేశ్వర్రావు చిరునవ్వు నవ్వుతూ.
అతని చిరునవ్వులో చిన్న సీరియస్ నెస్ కూడా వుంది. దేవుడు ఉన్నాడనే భోగట్టా పామరులకి పూర్వకాలపు ఋషులు ఆ విధంగానే చెప్పుంటారు. గడ్డాల గాంభీర్యాన్ని చిరుహాసంతో వెలిగించి వుంటారు. కాని రాజేశ్వర్రావు నాతో దేవుడు లేడని చెప్పేసరికి నాకు గాభరా వేసింది. భయం వేసింది. దేవుడు లేడనే విషయం దేవుడు చచ్చిపోయేడన్నట్టుగా బోధపడినందువల్ల నాక్కొంచెం దుఃఖం కూడా వచ్చింది. కాని, కవిని చూసినందువల్ల కలిగిన సంతోషంలో దేవుడు లేడన్న దుఃఖం కాసేపట్లో మర్చిపోయేను.
ఆవిధంగా, నేను చూసిన మొట్టమొదటి కవి నాలో చిన్న అలజడి కలిగించేడు. దేవీ ఉపాసకులకున్నట్టు కవులక్కూడా మంచి శక్తులుంటాయని దీనివల్ల బోధ పడుతుంది.
కవిని చూసినందువల్ల నాకు సంతోషం కలిగిందే కాని కథల్రాయడం మాత్రం రాలేదు. పి.వి. రంగనాధరావు ఆ మరుసంవత్సరం మరో సెక్షన్లో చేరేడు. కాని మూడేళ్ళ తరువాత అతను విజయనగరం వెళ్ళిపోయేకకాని అతనే బాలకవి పన్యాల వేంకటరంగనాధరావనే సంగతి నాకు తెలియలేదు. రాగాపోగా, కథలు ఎలా ఎప్పుడు ఎక్కడ పుడతాయో అవి ఎక్కడ ఎలా దొరుకుతాయో తెలియక నేను చాలా గిజగిజలాడిపోయేను. అందుచేత దొరికిన పుస్తకాల్లోని కథలన్నీ తెగ చదివేసి కథల దాహం తీర్చుకుంటూ వుండేవాణ్ని. రామాయణం కథ వింటే నాకు అలా రాసిపారేయాలని వుండేది. భారతంలోని కథలు వింటే అలా మనం ఎప్పుడు రాస్తామా అని వుండేది. మాయావి, మనోరమ, మాయావిని చదువుతే, అబ్బో ఇలా రాస్తే బావుణ్నే అని వుండేది. ఏది చదివితే అలా రాసేయాలనుండేది.
కథలు చదువుతూండడం వల్లా, కథల్రాయడం గురించి ఆలోచిస్తూ వుండడం వల్లా, కథల్రాయడం ఎలాగో నేను కొంచెం కొంచెం తెలుసుకుంటో వచ్చేను. నాకు తక్కువ తెలివీ, ఎక్కువ బద్దకమూను. నేర్చుకొనేది ఏదైనా వెంటనే రాదు. సబ్జక్టుతో కుస్తీలు పట్టలేను. అంచేత నేను నేర్చుకున్న నాలుగు విషయాలు నేర్చుకుందికి నలభై రెండున్నర సంవత్సరాలు పట్టింది. ఇంతకాలం పట్టినా నా రాత బాగులేదు. రాయడం మానేద్దాం అనుకొంటూ మానివేయలేకుండా వున్నాను. వాల్మీకిలాగా, వ్యాసుళ్ళాగా ఎవరూ రాయలేకపోయినా అందరూ రాస్తూనే వున్నారు. మంచి చెప్పినా చెప్పలేకపోయినా చెడ్డ చెప్పకపోతే చాలు కదా అనుకుని అప్పుడప్పుడు కాయితం మీద కలం పెడుతున్నాను. అనుభవం మీద నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. పుస్తకాలు చదవడం అనుభవంలో ఓ భాగం. ప్రత్యేకంగా ఏ గురువూ నాకు కిటుకులు చెప్పలేదు.జ్ఞానం బోధించలేదు.
కథల్రాయాలనే కోరిక నాకులాగే చాలా మందికి వుంటుందనే భోగట్టా నాకు తెలుసు. మహానుభావులక్కూడా చిన్న చిన్న సరదాలుండొచ్చు. సగం ప్రపంచాన్ని జయించిన నెపోలియన్ ది గ్రేట్ గారికి పిల్లిని కర్ర ఊదాలనే చిన్న కోరిక వుండొచ్చు; ఆ ఊదడం అతనికి రాకపోవొచ్చు; ఊద కలిగినవాణ్ని చూసి అతను ముచ్చటపడొచ్చు, లేదా మత్సరపడొచ్చు. బాగా పాడాలనే కోరిక కోయిలకీ వుండొచ్చు, కాకులకీ వుండొచ్చు, గుర్రాలు, గాడిదలు, గేదెలు, మనుషులు, (నీరో) చక్రవర్తులు – అందరికీ వుండొచ్చు, అలాగే, ఎక్కువా తక్కువా అనే భేదం లేకుండా అందరికీ కథల్రాయాలనే కోరిక వుండొచ్చు. కరటకదమనకులనే నక్కలు మనకి చక్కని నీతికథలు చెప్పడం మనందరికీ బాగా తెలుసు. వుడ్ హౌస్ గారి ఓ నవల్లో ఓ పోలీసు జవాన్ కి కవిత్వం రాయాలనే కోరిక పట్టుకుంటుంది. అతను రాత్రిపూట వీధులన్నీ బీటు తిరిగి తిరిగి ఆ మర్నాడు, “వీథులు వీథులు వీథులు, చీకటి నింపిన, మనుషులు పోయిన వీథులు, ఎన్నో వీథులు, ఎన్నెన్నో వీథులు” అంటూ వీథికవిత్వం చెప్తాడు. అలాగ కోర్టుకొచ్చే నక్కలకీ – అయామ్ సారీ – పార్టీలకీ, ప్లీడర్లకీ సాక్షులకీ కథలు చెప్పాలనే కోరిక మిక్కుటంగా వుంటుంది. కవుల బంగారు కలలు ఋజువు కావు. నిజం కాబోవు. పార్టీల కథలు మాత్రం తరచుగా నిజంగా కోర్టుల్లో రుజువయిపోతాయి. బతుకులు బద్దలు చేస్తాయి.
ఇంతకీ నేను చెప్పేదేమిటంటే; కథలు చెప్పే కోరిక మానవసహజం. ఆ కోరిక్కి జాతిమత విచక్షణ లేదు; ఆడామగా, చిన్నా పెద్దా తారతమ్యం తెలీదు. అందుచేత, కథలు రాయడం ఎలాగో చెప్తే చాలా మందికి వినాలనే సరదా వుంటుందనే అభిప్రాయంతో ఇదంతా నేను చెప్తున్నాను.
భారద్దేశంలో ఓ మంచి సంప్రదాయం వుంది. మంత్రాలు సంపాదించిన గురువులు ఆ మంత్రాలెవరికైనా ఉపదేశించి తీరాలి గాని ఉపదేశించకుండా పోకూడదుట. అది మంచి సంప్రదాయమేనని నా అభిప్రాయం. అయితే, అవి మంచి మంత్రాలైతే ఫరవాలేదు. కాని చెడుపు మంత్రాలైతే ప్రమాదం వుంటుంది. నా దగ్గర మంచివైనా చెడ్డవైనా మంత్రాలేవీ లేవు. నేను కొన్ని కిటుకులు తెలుసుకున్నాను. అవి మంచికీ ఉపయోగించుకోవచ్చు. చెడ్డకీ ఉపయోగించుకోవచ్చు. అది మీ ఇష్టం.
ఇంతకీ –
కథలన్నీ ఎక్కడ పుడతాయి?
కథలన్నీ వాస్తవ జీవితంలోంచే పుడతాయట. పుట్టి, ఊహాలోకంలో పెరిగి పెద్దవవుతాయిట. నాది కూడా అదే అభిప్రాయం. అయితే, “కథకీ నిజానికీ తేడా ఏమిటి?” అనే ప్రశ్న రావొచ్చు. ఆ ప్రశ్నకి సమాధానం నేనెక్కడో ఓ పుస్తకంలో చదివేను.
మిగలపండిన పళ్ళు చెట్టునుంచి రాలిపోతాయి అనేది నిజం. ప్రపంచంలో అలా జరుగుతుంది. మర్రిపళ్లు రాల్తాయి, మామిడిపళ్ళు రాల్తాయి, తాటిపండ్లు కూడా రాల్తాయి అంటే అది యథార్ధమే అవుతుంది. ఓ తాటిపండు రాలింది, ఓ కునుకు నక్క మీద పడింది అంటే అదో కథవుతుంది. అలాగే, మర్రిపళ్ళు మనిషిమీద రాలడం గురించి ఓ ఆసామీ ఓ నీతికథ చెప్పేట్ట.
ఈ ప్రకారం ఆ పుస్తకంలో కథకీ నిజానికీ తేడా చెప్పుకొచ్చేడు. ‘ఓహో! ఇదా తేడా!’ అనుకున్నాన్నేను. అంతకంటే ఎక్కువ నాకు మరేం బోధపళ్ళేదు. నిజాన్ని బాగా అందులోంచి అబద్ధం లాగ్గలగడమే కథ చెప్పడం అనిపించింది నాకు.
వాస్తవంగా జీవితంలో అనేక విషయాలు జరుగుతుంటాయి. వాటి గురించి అలా ఆలోచిస్తూ కూర్చుంటే నా ఊహ రకరకాలుగా పరిగెడుతుంది. అలా పరిగెట్టడంలో నాకు కథలు పుడుతుంటాయి.
ఉదాహరణకి:
శేఖరం ఉన్నాడు. అతను కథల్రాయనప్పుడు మెడిసిన్ చదువుతాడు. ఎల్లప్పుడూ అందరితో మంచిగా ఉంటాడు. అతనూ నేనూ నిన్న సాయంకాలం సిటీబస్ ఎక్కేం. ముందు సీట్లో చాలా ‘రష్’గా ఉంది. బస్సు ఎక్కేం అంటే, అక్కడ అన్నీ చేయకూడని పనులే ఉంటాయి. టికెట్ లేనిదే ప్రయాణం చేయరాదు. బస్సు ఆగనిదే దిగరాదు. చేతులు బైటకి చాచరాదు; చుట్టలు వగైరాలు కాల్చరాదు; ఉమ్ములు వగైరాలు వేయరాదు. ఇలా పెద్ద లిస్టుంటుంది. ఎక్కడ ఏ తప్పుపని చేసేస్తానో అన్చెప్పి నేను చాలా బుద్ధిగా కూర్చున్నాను. శేఖరం చిన్నవాడే అయినప్పటికీ – ఉన్నమాట చెప్పుకోవాలి – పాపం, అతను కూడా బుద్ధిగానే కూర్చున్నాడు. కాలక్షేపానికి నేను బస్సులోని సాహిత్యం చదువుకొని ఆనందిస్తున్నాను. స్త్రీలు హరేకృష్ణ స్త్రీలు హరేకృష్ణ లేడీస్ కృష్ణ కృష్ణ నో స్మోకింగ్ హరే హరే చిల్లరలేదు. అంటూ ఇహపరాలు సాధించే ప్రయత్నంలో లౌక్యం పారలౌక్యం జోడించేరు బస్సువారు. బస్సు నెమ్మదిగా వెళ్తోంది. డ్రయివరు జాగ్రత్తగా నడుపుతున్నాడు. విశాఖపట్నంలో బస్సులు జోరుగా వెళ్లేయంటే మనుషులు తొందరగా వైకుంఠానికి వెళ్ళిపోతారు (వైకుంఠం ఎంత బావున్నా ఎవరికీ కూడా అక్కడికి తొందరగా వెళ్ళిపోవాలనుండదు.)
ఇంతలో టర్నర్ సత్రం దగ్గిర బస్సు ఆగింది. ఆరుగురు దిగేరు. పది మంది ఎక్కేరు. ఓ యువతి కూడా లోనికి వచ్చింది. స్త్రీల సీట్లన్నీ నిండిపోయున్నాయి. శేఖరం వెంటనే లేచి తన పక్కనున్నవాణ్ని కూడా లెమ్మని, షివల్రస్ గా (శేఖరం ప్రకారం ‘స్త్రీ వల్రస్’గా ఆ ఆడమనిషిని కూర్చోమన్నాడు. అతని పక్కన కూర్చున్నవాడు లేవడానికి చాలా అయిష్టం చూపిస్తూ లేవబోయేడు. అంతలో వెనకనుంచి ఓ యాభయ్యేళ్ళ భారీ మనిషి వచ్చి శేఖరం ఖాళీ చేసిన సీట్లో దబ్బుమని కూర్చున్నాడు. తన్నిక కదల్చడానికి వీల్లేదన్నట్టుగా, కందుల బస్తాలమీద నువ్వులమూట పెట్టినట్టు వళ్ళో ఓ అయిదేళ్ళ అమ్మాయిని (కూతురయుంటుంది) కూర్చోబెట్టేసుకున్నాడు. నిల్చున్న యువతి నిలబడే ఉండిపోయింది. శేఖరం కొంచెం చిరాకుపడి, “అయ్యా! ఆడవారికోసం సీటు ఖాళీ చేసేనండీ” అన్నాడు. భారీ మనిషి, తన పక్కన తిరిగి కూర్చోబడిపోయిన రెండోవాణ్ని చూపిస్తూ, “మొగవాళ్ళు పక్కనుండగా ఆడవాళ్లు ఎలా కూర్చుంటారు?” అని రీజనింగు చేసేడు. శేఖరం, “ఆయన కూడా లేస్తాడు. ఆయన లేవబోయేడు కూడాను. మీరొచ్చేరు కాని” అన్నాడు “ఆయన లేవలేదే మరి!” అని తప్పంతా పక్కవాడి మీద తోసేశాడు భారీ మనిషి. పక్కవాడు ఇదేమీ వినకుండా కిటికీలోంచి టర్నర్ సత్రపు సౌందర్యం తిలకిస్తూ కూర్చున్నాడు. అయిదు నిమిషాల ప్రయాణంలో అల్లరెందుకన్చెప్పి శేఖరం నేనూ కూడా ఊరుకున్నాం.
శేఖరంగారి షివల్రీ (ఆయన ప్రకారం ‘స్త్రీవల్రీ’) అంతా కూడా ఆ విధంగా వేస్టయిపోయింది.
జీవితంలో ఇటువంటి వేస్టులు చాలా జరుగుతుంటాయి కదా అనిపించింది నాకు. ఒక అబల కోసం ఓ సహృదయుడు త్యాగం చేస్తే వేరొక దబాయింపుగాడు ఆ ఫలితం అంతా చక్కా కాజేశాడు. అదొక థీమ్ కింద తీసుకొని చాలా కథలు రాయొచ్చుకదా అనిపించింది నాకు. అలా ఆలోచిస్తూ ఆస్పత్రి డౌన్ దగ్గర దిగిపోయేన్నేను.
1. ఇంతపెద్ద ఆస్పత్రి ఉంది. ఇలాంటివి పెద్ద పెద్ద ఆస్పత్రులు దేశంలో ఎన్నో వున్నాయి. గవర్నమెంటువారు ఎంతో కష్టపడి వ్యయప్రయాసల్తో ఈ ఆస్పత్రులన్నీ, ముఖ్యంగా పేదవారి కోసం కట్టించేరు. కాని, అక్కడ వసతులన్నీ పెద్దవారికే దొరుకుతాయి. మంచి మందులన్నీ వారికే చెల్లిపోతాయి.
ఓ రోజున ఆస్పత్రిలో ఒక్కే ఒక్క అతి మంచి సూదిమందు ఉంది. (బజార్లో అది స్టాకు లేదు.) అదివ్వకపోతే ఓ గొప్ప పేషెంట్ చస్తాడు. అదివ్వకపోతే పేద పేషెంట్ చస్తాడు. ఆ ఇద్దర్లోను ఆ మందు ఎవరికివ్వాలి. ఎవరికిస్తారు? అందువల్ల ఫలితాలేమిటి?
కథ రాయొచ్చు.
2. ఎక్కడా కాణీ పుట్టకపోతే కొంతమంది ఆస్పత్రికివెళ్ళి అయిదు రూపాయల కోసం రక్తం దానం చేసేస్తారు. అంత త్యాగం చేసి ఇంటికి ఆ అయిదూ పట్టుకుపోదాం అంటే అందులో రూపాయి అక్కడ ఛోటా ఉద్యోగి లాక్కుంటాడు.
కథ రాయొచ్చు.
3. అలా ఓ పేద ఆడమనిషి రక్తదానం చేసి పిల్లలకోసం ఇంటికి నాలుగు రూపాయలూ పట్టుకువెళ్ళి మొగుడిచేతికి బియ్యం కోసం మూడ్రూపాయలిస్తే, వాడందులో రూపాయిన్నర పెట్టి గుల్లిపిల్లి సారా తాగేసేడు. మిగతా రూపాయిన్నర బియ్యం లోను పావలా మేరకి రాయీ రప్పా చెత్తా కొట్టువాడు కలిపేస్తాడు.
ఇంకో కథ రాయొచ్చు.
4. మనిషి దేవుణ్ని పూచ్చెయ్యొచ్చు. ఆ మర్నాడు వినాయకచవితి నాడు పూచ్చెయ్యడానికి పావలా పళ్లూ, పువ్వులు, ఆకులు ఇంటికి పట్టుకువెళ్తుంది. అవన్నీ ఆ రాత్రి పందికొక్కులు ఎత్తుకుపోతాయి లేక పాడుచేస్తాయి. ఆడమనిషికి తెలివొచ్చి లేచేసరికి ఆఖరి అరిటిపండుని ఓ పెద్ద సైజు పందికొక్కు భక్షిస్తూ ఉంటుంది, దాన్ని కొట్టబోతే అది గుర్రుమని గుర్రుపెట్టి, బుస్సుమని బుసకొట్టి తిరగపడుతుంది. మొగుణ్ని లేపుదాం అంటే అతను తప్పదాగి పడుకునుంటాడు.
ఇలా ఓ కథ రాయొచ్చు.
5. పువ్వుల్ని పందికొక్కులు పాడుచేసినట్టే పశువులు కూడా పాడుచేస్తాయి. నువ్వో మెత్తటి మనిషివి. నీకొక చక్కటి ప్రియురాలుంటుంది. ఆమె యెడల నీ అభిమానం అనురాగం పెంచుకున్నట్టే ఆమె కోసం ఓ గులాబి మొక్కని నువ్వెంతో కష్టపడి పెంచుతావు. రేపు ఆ మొక్కని నాలుగు పువ్వులు విడతాయి. రేపు నీ ప్రియురాలి పుట్టినరోజు, ఆ నాలుగు పువ్వులూ పట్టుకువెళ్లి వాటినిండా నీ ప్రేమ నింపి ఆమెకిద్దామని నీ ఆశ. ఇలా నువ్వు ఆశపడుతూంటే ఆ తెల్లారుఝామున రాజావారి పెద్దగేదె ఆ పువ్వులన్నీ నవిలేస్తుంది. నువ్వు ఆ చప్పుడికి గబగబా లేస్తావు. ఆ దృశ్యం చూసి నీ హృదయం క్షోభిస్తుంది. మానవత్వం మరిచిపోయి నువ్వు ఆ గేదెని గొడ్డుని బాదినట్టు బాదేస్తావు. ఆ గేదె తక్కువది కాదు, గేదెల్లో మహిషి, అందులోనూ రాజాగేదె. అది నిన్ను కొమ్ముల్తో పొడుస్తుంది. నీకు చావుతప్పి తొడ చీరుకుపోతుంది. ఆరోజులు ఆస్పత్రికి ఔట్పేషెంట్ గా తిరుగుతావు. అంతలోపల నీ దానవచర్య గురించి రాజావారు వింటారు. ఆయనకి భూతదయ యెక్కువ, అందులోనూ ఆ గేదె ఆయన స్వంతభూతం. అందులోనూ ఆయన రాజావారు. గేదె బాధని తల్చుకుని ఆయన హృదయం ద్రవించడమూ, నీ దానవత్వానికి ఆయన రక్తం ఉడుకులెత్తడమూ ఒక్కసారే జరుగుతాయి. ఆయన పౌరుషం ఆయన దుబ్బుమీసంలో మెలికలు తిరిగి నీ పీకల మీద పడుతుంది. రాజావారు దగ్గిరుండి మరీ నిన్ను చితక్కొట్టించేస్తారు. గేదెని బాదినట్టు నిన్ను బాదించేస్తారు. నీకు దుబ్బుమీసం లేదు కాని పౌరుషం లేకపోలేదు. పోలీసువారికి ఫిర్యాదు చేస్తే వారు నిన్ను ప్రైవేటు కేసు పెట్టుకోమంటారు.కేసు పెడితే ప్లీడరు ఫీజులడుగుతాడు. కాయితాలు స్టాంపులడుగుతాయి. గుమాస్తాలు మామూళ్ళడుగుతారు. మేజిస్ట్రేట్లు “సాక్ష్యం ఏది?” అంటూ కేకలేస్తారు. ఇంతకీ నిన్ను బత్తాలడిగిన సాక్షులు అవతల పార్టీ రాజావార్ని లంచాలడుగుతారు. ఆఖరికి వాళ్లు నీ సైడు చస్తే రారు. అంచేత నీకేసు డిస్మిస్ అయిపోతుంది. రాజావారి పార్టీ ఎక్విట్టవుతుంది. పరువు నష్టానికి రాజావారు నీమీద డామేజీ దావా చేస్తారు. ఈ విధంగా నువ్వు నానా చిక్కుల్లోనూ పడిపోయి అష్టకష్టాలూ పడతావు. ప్రేమా ప్రియురాలూ – వీటి గురించి ఆలోచించడానికి నీకు టైముండదు. చీటికీ మాటికీ చిరాకుపడిపోతావు. నీకు ప్రేమ తగ్గిపోయిందన్చెప్పి నీ ప్రియురాలు అలుగుతుంది. మాటమీద మాటొస్తుంది. అనసరంగా తగువుల్లోకి దిగినందుకు నిన్నావిడ కోప్పడుతుంది. తన్నులు తిన్నందుకు వెక్కిరిస్తుంది. ఇద్దరూ ఛెడీమంటే ఫెడీ అనుకొని మాటామంతీ మానుకొని చివరికి ముఖాలు చూసుకోడం కూడా మానేస్తారు. ఆఖరికావిధంగా నీ కోమల ప్రేమలతని ఓ కర్రిగేదె పాడుచేస్తుంది.
ఇదొక మంచి చిన్న నవలకి ప్లాటుగా కుదురుతుంది. ఎప్పుడో అప్పుడు రాసేస్తానేమో కూడా. రాజు-మహిషి రాసేశారు, కాని అసంపూర్ణం.
ఈ విధంగా శేఖరంగారి ‘స్త్రీవల్రీ’ లోంచి చాలా కథలు లాగొచ్చు. అయితే ఈ కథలన్నీ బరువు బరువు కథలు. పండుగనాడు ఫస్టుగా భోంచేసి కిల్లీ బిగించి పంకా నెమ్మదిలో ఆన్ చేసి ఖరీదైన సిగరెట్టు కాలుస్తూ ఖుషీగా తేలిగ్గా చదువుకుందికి మరో కథ కూడా రాయొచ్చు. ముందుగా నాకు ఆ ప్లాటే తట్టి ఆ తరవాత మిగతావి తట్టేయి. టూకీగా ఆ తేలిక కథ చెప్పాలంటే:
ఓ మంచి రోమియో ఉంటాడు. షివల్రస్ గా ఉండడమే అతని జీవితాశయం. (లంచాలు లాగడం కంటె మంచి ఆశయమేకద!) అతను ఆపదొస్తే లేవడానికి బస్సులో కూర్చుంటాడు ఆశయసిద్ధికోసం ఎదురుచూస్తూ. ఓరోజున అతను బస్సులో ఉంటాడు. దాంతో ఓ బాపూబొమ్మ ఆ బస్సెక్కి కూచోను సీటులేక నిలబడిపోతుంది. రోమియో టక్కున లేచి తన సీట్ ఆఫర్ చేస్తాడు. బొమ్మ పస్తాయిస్తుంది. అంతలో గొరిల్లా వచ్చి గభాల్న ఆ సీట్లో కూర్చుంటాడు. రోమియోకి సత్యాగ్రహం వస్తుంది. గొరిల్లాని లెమ్మంటాడు. గొరిల్లా లేవడు. భల్లూకంలా కూచుంటాడు. “లేడీకి సీటియ్యి! లే, లే!” అంటాడు రోమియో. “ఆ లేడీకి సీటివ్వడానికి నువ్వెవడివి? ఆ మనిషి నీ అప్పా లేక నీ చెల్లెలా? మేనగోడలా, మేనత్త కూతురా? వదినా లేక పిన్నమ్మా” అని గట్టిగా అడుగుతాడు గొరిల్లా. “ఆడమనిషి నిలబడిపోయింది లే మాఁవాఁలే! లేచి సీటియ్యి!” అని చాలా విట్టీగా అంటాడు రోమియో. భల్లూకంలా ఉన్న గొరిల్లా బెంగాల్ టైగరయిపోతాడు. “అది కూర్చుంటే నీకేం? నిల్చుంటే నీకేం? కోన్ కిస్కాగాడివి మధ్యన్నీ కెందుకు దాని ఊసు?” అంటూ ఆవేశంతో లేచి కేకలేస్తాడు గొరిల్లా. అపుడు మనమంచి రోమియోకి కోపవూఁ చెమట్లు వస్తాయి. లోకంలో సిస్టర్స్ స్త్రీలనందర్నీ ఆ క్షణానికి తన సోదరీమణులవలె భావించి “అవును ఆవిడ నా సిస్టరే! మరింక అట్టే పేలకురా గొరిల్లా” అంటాడు గట్టిగా. అంతవరకూ పొగలు మాత్రం చిమ్మిన గొరిల్లా అప్పుడు మంటమండి, “నా పెళ్ళానికి సీటివ్వడానికి నువ్వెవడివిరా రాస్కేల్?! పైగా దాని తమ్ముణ్నంటావా? ఎలాంటి తమ్ముడివి? నాకు తెలీకుండా ఎప్పుడు కొట్టుకొచ్చేవ్?” అంటూ రోమియోని కొట్టబోతాడు. అప్పుడు బొమ్మ తన భర్తని వారిస్తూ “మర్యాదా తెలీని గుంటల్తో మాటలెందుకండీ?! మీరు కూర్చోండి” అంటూ భర్తని బతిమాల్తుంది. గొరిల్లా శాంతించకుండానే రోమియో బస్సుదిగి వెళ్ళిపోతాడు. ఆ విధంగా అధర్మం జయించిన తరువాత గొరిల్లాగారి ఆవేశం సాయం సూర్యుళ్ళా నెమ్మదిగా కిందకి దిగుతుంది. అప్పుడు వెనకసీట్లో వాడు గొరిల్లా భుజాన్ని టప్పు టప్పుమని మూడుసార్లు తడతాడు. గొరిల్లా వెనక్కి తిరుగుతాడు. “మీరున్నారు. కాబట్టి సరిపోయింది కాని, లేకపోతే ఆ టెంపరుగాడు ఆవిడకి మొగుణ్ణని చెప్పినా దిక్కులేకపోను. అంతా నోరుమూసుకు ఊరుకుందువుఁ! మీరున్నారు, కాబట్టి సరిపోయింది!” అంటూ గొరిల్లాని మెచ్చుకొంటాడు. కాని ఆ మాటతో గొరిల్లా ఆవేశానికి తిరిగి సూర్యోదయం అవుతుంది. “వాడు దాని మొగుణ్నంటే నువ్వూరుకుంటావు. కాని నా పెళ్ళాం వూరుకోదు. చెప్పుచ్చుక్కొడుతుంది. నేనొచ్చి నీ పెళ్ళానికి మొగుణ్నన్చెప్తే, నీ పెళ్ళాం ఊరుకుంటుందా! ఊరుకుంటుంది కాబోలు అందుకే అలా మాటాడుతున్నావు! మాటాడేవు చాలా! మరింక మాటాడకు. మూతిమీద పొడిచీగల్ను,” అని కేకలేస్తాడు. వెనకవాడు గొరిల్లా జననం గురించి తిడతాడు. “నీది టెంపరైతే నాడి డబుల్ టెంపరు. ఇందాట్లాగుంటణ్ని కాను!” అంటాడు. గొరిల్లా తన వాడితో ఆ విధంగా తన్నులాటలోకి దిగుచుండగా, అక్కడ మన మంచి రోమియో మరో బస్సులో మరో బొమ్మకి సీటివ్వబోగా ఆ సీట్లో ఓ చుట్టమనిషి చేపలబుట్టతో సహా భద్రంగా కూర్చొనును. రోమియో నవ్వును. బొమ్మ (చిరు) నవ్వును. కథ ముగియును.
ఈ విధంగా ఓ లైట్ వెయిటు కథ కూడా శేఖరంగారి షివల్రీలోంచి లాగవచ్చును. ఇది నాకెలాగ తట్టింది అంటే:
శేఖరం లేచి సీటిద్దామనుకున్న ఆడమనిషికి పాతికేళ్ళుంటాయి. పెళ్ళయినట్టుగా పుస్తెలు చెప్తున్నాయి. ఆడగేట్లోంచి ఆవిడెక్కితే మగగేట్లోంచి మగడెక్కాడేమో అనిపించింది నాకు.
ఆ బస్సులోనే అతనుంటే?…. అలా ఆలోచించేసరికి… ఆ సీట్లో దబాయించి కూర్చున్న భారీ మనిషే ఆమె భర్తయితే- “చాలా తమాషాగా వుంటుందే” అనిపించింది నాకు. గమ్మత్తుగా చిన్నకథ చెప్పినట్టుంది. అవునదో కథవుతుంది రాయొచ్చు. కాని ఇది మరీ నువ్వులమూటలాటి (లేక) పేలాల బుట్టవంటి కథయిపోతుందేమో? కందులబస్తాలాటి కథేదైనా ఇందులోంచి లాగ్గలవాఁ?
అనుకొంటూ ఆ ప్రకారం ఆలోచిస్తే మరికొన్ని కథావస్తువులు దొరికేయి నాకు. అవి మీ ముందు వుంచేను.
ఆస్పత్రి డౌన్లో బస్సు దిగి తిన్నగా కె.వి. రమణగారి రూమ్ కి వచ్చేను. రమణగారు ఆంధ్రా యూనివర్సిటీలో ఇకనామిక్స్ లెక్చరర్ గా ఉంటున్నారు. ఆయనంటే నాకు ఇష్టం. ఆయన ఓ డాబా మీద వంటరి గదిలో ఉంటున్నారు. డాబామీద వంటరి గదులంటే కూడా నాకిష్టమే. తిన్నగా అక్కడికి వెళ్ళేను, వెళ్తే ఆయన రూంలో లేరు, తలుపులన్నీ బార్లా తెరిచేసున్నాయి. అక్కడ డాబా మీద ఓ వాలుకుర్చీలో కూలబడ్డాను. అలా కూర్చొని రమణగారెప్పుడొస్తారా అని ఆలోచిస్తోంటే నాకు మరో చిన్నకథ గమ్మత్తుగా పుట్టింది. అదెలా అంటే ఇప్పుడు చెప్పలేను, బద్ధకంగా వుంది. మంచి రచయిత కావాలంటే బద్దకం వుండకూడదు.
(విశాఖ రచయితల సంఘం ద్వైమాసపత్రిక ‘విశాఖ’ జనవరి 1965.)
రమణగారి డాబా గది
సాయంకాలం ఆరున్నర దాటింది. నేను ఆస్పత్రి డౌన్లో బస్సుదిగి కె.వి. రమణని కలుసుకుందికి ఆయన ‘రూం’కి వెళ్ళేను. కె. వి. రమణగారు ఆంధ్రా యూనివర్సిటీ ఎకనామిక్స్ డిపార్టుమెంటులో లెక్చరరుగా వుంటున్నారు. ఆయన సూర్యాభాగ్ లో ఓ చక్కని చిన్నని వంటరి డాబాలో అద్దెకి వుంటున్నారు. గది చల్లగా వుంది. వరండా పక్క డాబా సాయంకాలం వేళ ఎంతో చల్లగా ఉంటుంది. వరండాలో నాలుగైదు మామూలు కుర్చీలూ రెండు వాలుకుర్చీలూ పడేసి ఉంచేరు రమణగారు. ఆయన గదికి తాళం వేసుకు వెళ్ళిపోయినప్పటికీ మేం ఆ గదిముందు వరండాలో హాయిగా కూర్చొని ఆయనకోసం వెయిట్ చేయవచ్చన్నమాట.
ఆరోజు సాయంకాలం నేను డాబా మీదికి వెళ్ళేసరికి గదిలోనూ దీపం లేదు. వరండాలోనూ దీపం లేదు. రమణగారు నాకు కనిపించలేదు. గది తలుపులు మాత్రం బారుగా తీసున్నాయి. అంతటా చీకటిగా వుంది. తలుపులు తెరిచివుంచి వెళ్ళిన మనిషి . వెంటనే వచ్చేస్తారు కదా అనుకున్నాన్నేను. అప్పుడే బస్సుదిగి వచ్చేనేమో, అలసిపోయి వున్నాను. సాయంకాలంపూట విశాఖ బస్సుల్లో ప్రయాణం చెయ్యడం అంటే యుద్ధంలో పద్మవ్యూహంలోకి పదిసార్లు వెళ్ళి మళ్ళా పదిసార్లు బైటకి ఊడపీక్కొని రావడమన్నమాట. అందుచేత నేను బాగా అలిసిపోయి వున్నాను. అక్కడ వరండాలో వున్న రెండు వాలు కుర్చీల్లోనూ ఎక్కువ సౌకర్యంగా వుండే కుర్చీ ఎంచుకొని ఉస్సురంటూ అందులో కూలబడి ఆ తరవాత కొంచం సర్దుకొని సుఖంగా కూర్చున్నాను. శీతాకాలం కావడం చేత ఆరున్నరకే బాగా చీకటిపడిపోయింది. అయితే గాలిమాత్రం చలిగా లేకుండా చల్లగా వుంది. ఏ కుర్చీలో కూర్చున్నా ఆ గాలే తగుల్తుంది. మామూలు కుర్చీలో కూర్చుంటే వుండేకంటే వాలుకుర్చీలో కూర్చోడం వల్ల ఆ గాలి నాకు ఎక్కువ హాయ్ హాయ్ అనిపించింది. గాలిలో తేడా లేకపోయినప్పటికీ, కుర్చీల్లో తేడా వుంది కాబట్టి నేను సుఖంగా సిగరెట్ కాలుస్తూ రమణగారి కోసం నిరీక్షిస్తున్నాను. పావుగంటయింది, ఇరవై నిమిషాలయింది, ఒక సిగరెట్టయింది. రెండు సిగరెట్లయేయి. అయినా రమణగారు రాలేదు. “తలుపులన్నీ తీసివుంచి వెళ్ళిపోయి యింతసేపు ఉండిపోయారేం చెప్మా?” అని నేను అరగంటయేక అప్పుడు ఆశ్చర్యపోయేను. నాకు ఏం చెయ్యడానికి తోచలేదు. దగ్గర్లోనే లీలామహల్ సినిమాహాలుంది. అక్కడికిపోయి కాస్సేపు కూర్చొని వద్దామా అనుకున్నాను. కాని, పెద్దమనిషి తలుపులన్నీ తెరుచుకొని వెళ్ళిపోయేడు! నేనూ వెళ్లిపోయి అతనూ రాకపోయేసరికి ఇక్కడ ఈ గదిలోకి దొంగలెవరైనా దూరి అంతా దోచుకుపోతే?! ఆ మధ్య జగన్ గారింట్లో దొంగలుపడ్డారు కూడాను. అలాగే ఇక్కడ కూడా జరిగితే?! “అందుచేత ఆయనొచ్చేవరకూ మనం ఇక్కడ చచ్చినట్టూ ఉండవలసిందే!” అనుకొని మరో సిగరెట్టు ముట్టించేను.
అప్పుడు వేసింది నాకో అనుమానం.
నేను రాకముందే అప్పటికప్పుడే ఆ గదిలో దొంగలుపడే వెళ్ళిపోయేరేమో!? రమణగారు తలుపులకి తాళాలు వేసుకొనే వెళ్లుంటారు. తాళాలు బద్దలుకొట్టి గదిలో ప్రవేశించి దోచుకు వెళ్ళిపోయిన దొంగలే ఆ గది తలుపులు తెరిచివుంచి వెళ్ళిపోయి వుండవచ్చును. తరవాత నేనిక్కడికి వచ్చి వెళ్ళడం ఎవడైనా చూస్తే, ఆ దొంగతనం గురించి నా మీదే అనుమానపడొచ్చు.
. “గమ్మత్తుగా ఇదో కథ అవుతుంది” అనిపించింది నాకు, అక్కణ్ణించి నేను కథల గురించి ఆలోచించసాగేను. “అటువంటి కథ రాస్తే ఎలా ఉంటుంది?”అని ఆలోచించేను. కాని ఆ రకం కథలు చాలా వచ్చేయని వెంటనే నాకు జ్ఞాపకం వచ్చింది. అపరాధం చేసినవాడు చక్కాపోతే, ఆ వెనక ఆ జాగాకివచ్చిన నిరపరాధి కూడా ఆ నింద పడ్డం చాలా కథల్లో జరిగింది. చాలా సినిమాల్లో చూపించేరు. అవన్నీ నాకు జ్ఞాపకం వచ్చేయి. ఆ విషయం గురించి అన్ని కథలు రాసేక, మనం మళ్ళీ రాసినా ప్రయోజనం ఏముందనుకున్నాను. కాని ఈ విషయంలోంచి రకరకాల కథలు, లోగడ రాయబడిన వాటి కంటే భిన్నమైనవి, లాగవచ్చునేమోనని అనిపించింది నాకు. ఆ వాలుకుర్చీలో కూర్చొని ఆ విషయం గురించే అలా ఆలోచిస్తూ ఉండిపోయేను.
నిరపరాధి మీద నిందపడ్డం, ఆ నిందనుంచి అతను తప్పించుకొని బైటపడ్డం…. ఇది ఇతివృత్తంగా చాలా కథానికలూ, నాటకాలూ, నవలలూ వచ్చేయి. వాటిలో కొన్ని వందలు సినిమాలుగా కూడా తీయబడ్డాయి. వాటితో ఆ కథలు సరి అయితే, “నింద నుంచి బైటపడి నిట్టూర్చాక ఆ తరువాత వాళ్ళ జీవితాలు ఏమౌతాయి?” అని ప్రశ్నించుకుంటే సమాధానంగా చాలా కథలు వస్తాయనిపించింది నాకు.
ఓ మంచివాడుంటాడు. ఎక్కడో చిన్న నౌఖరీ చేసుకుంటున్నప్పటికీ, మర్యాదగా, గౌరవంగా జీవిస్తుంటాడు. అతను ఓ పెద్ద యింట్లో ఓ చిన్న వాటాలో అద్దెకి వుంటాడు. ఆ ఇంట్లోనే మరో తొమ్మిది వాటాల్లో మరో తొమ్మిది సంసారాలుంటాయి. అందులో ఓ సంసారం మన మంచి వాడి పక్క వాటాలోనే ఉంటుంది. అదొక రేషనింగు గుమాస్తా సంసారం. ఆ రేషనింగ్ గుమాస్తాకి కస్పీలెక్కువ. నీలుగెక్కువ. భార్యయెడల గౌరవం ఎక్కువ. ఆమె యెడల భయం ఎక్కువ. ఆ రే, గు. గారి భార్యకి అందం ఎక్కువ. షోకు ఎక్కువ, ఖరీదైన నగలెక్కువ. చవకబారు వగలెక్కువ. పొగరు పొగరు పొగరెక్కువ. తను తప్ప ఇతరులంతా నీచులనే నమ్మకం ఎక్కువ. అందుచేత ఎవర్ని చూసినా అనుమానం ఎక్కువ.
మంచివాళ్లో ఒకటే దుర్గుణం ఉంది. అదేమిటంటే తను మంచివాణ్ణనే గర్వం ఉందతనికి. ఆ దుర్గుణం వుండటంవల్ల అతనికి రే. గుమస్తా.రే.గు. భార్య శత్రువులవుతారు. అంతేకాదు. మరో విషయం వుంది. రే.గు. భార్య, మంచి (వాడి) భార్యా – ఇద్దరూ పతివ్రతలే. కాని మంచి భార్య తను రే.గు. భార్యకంటే ఎక్కువ పతివ్రతని గొప్ప పడుతూంటుంది. గొప్పవాడి భార్య పతివ్రతగా వుండటంకంటే పేదవాడి పెళ్ళాం పతివ్రతగా వుండటం ఎక్కువ కష్టం ఎక్కువ గొప్పా అని కాబోలు మంచి భార్య అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ఆమె రేషనింగు గుమస్తా (గారి) భార్యని “మీకేంటమ్మా! ఏం కొనుక్కున్నా కొనుక్కోగలరు! గొప్పవాళ్ళు!’ అని అంటూండటం ఆ గొప్పావిడకి ఇష్టం లేకపోయింది.తనని ఆ మంచి భార్య దెప్పుతూందని ఆమె అపోహపడింది. మంచివాడు లంచాలు పుచ్చుకోకపోవడం వల్ల బీదవాడిగా ఉండిపోయాడనీ, తన భర్త లంచాలు తిని బలిసేడనీ ఆమెకు బాగా తెలుసు. “మీరు గొప్పవాళ్ళు!” అని మంచావిడ అన్నప్పుడల్లా ‘మీరు లంచాలవాళ్లు’ అని వెక్కిరిస్తోందనే గొప్పావిడ ఊహించుకోనారంభించింది. అందులోనూ ఆ రే. గుమస్తా గారి అబ్బాయి కొనుక్కున్న చందమామ పత్రికలు మంచివాడి గుండు కొడుకు ఎత్తుకుపోయి అందరికీ ఇచ్చేస్తుండటంతో రెండు సంసారాల మధ్యా వేడిగాలి వీయనారంభించింది.
అంతలో ఓ రోజున గొప్పావిడ బంగారు దుద్దులూ, బంగారపుటుంగరమూ పోయేయి. స్నానం చేసే ముందు తీసి గదిలో అల్మారాలో పెట్టిందట. స్నానం చేశాక తలారబెట్టుకుందామని కూర్చుందిట. టేబిల్ ఫాన్ వేసుకుని మంచం మీద మేను వాల్చేసరికి మగతగా నిద్ర వచ్చిందట. కళ్ళు తెరచి చూసేసరికి మంచావిడ హడావిడిగా తన గదిలోంచి వెళిపోతూ తను లేవడం చూసి ఆగి “అక్కయ్యగారూ!” అని సంబోధించి (‘నాకంటే ఆవిడే పెద్ద! అయినా నన్ను అక్కయ్యా అనే పిలుస్తుంది!”) “ఓ చటాకు మినప్పప్పుంటే ఇద్దురూ!” అని కంగారుగా అడిగిందట. “అడుగుదాం అని వస్తే నిద్రపోతున్నారు! వెళ్ళిపోదాం అనుకొంటూ వుంటే ఇంతలో మీరు లేచేరు!” అని మంచావిడ ఏదో సంజాయిషీ చెప్పుకున్నట్టుగా కూడా చెప్పిందట. అప్పుడు గొప్పావిడ లేచి వెళ్ళి వెనగ్గదిలో డబ్బాలు చూసి వచ్చి “మినప్పప్పు లేదండీ అక్కయ్యగారూ!” అని ఆ మంచావిణ్ణి పంపించేసిందట. అప్పుడు తన ఉంగరం గురించి కాని, దుద్దుల గురించి కాని ఆమెకి గుర్తురాలేదుట. మంచావిడ వెళ్ళేక కాస్పేటికి గొప్పావిడ అద్దంలో ముఖం చూచుకొన్నాక దుద్దులు గురించి జ్ఞాపకం వచ్చి అల్మారాలో చూస్తే అక్కడ దుద్దులూ లేవు, ఉంగరమూ లేదు!
రేషనింగాడింట్లో పోయిందంటే పోయిందన్చెప్పి అన్ని వాటాల్లోనూ హడావిడి వీచింది. ఇంట్లో దొంగతనం జరగడం జీవితంలో పెద్ద ‘ఈవెంటు!’
ఈ ఇతివృత్తం తీసుకొని కథ రాయొచ్చు.
“గదిలోకి ఎవరొచ్చారండీ?” “గదిలోకి ఎవరొస్తారండీ?” అయినా అలా తలుపులు తీసుకుపడుకోవచ్చా వదినా? “అయ్యో ఇదేం చోద్యమమ్మా?” “ఎవరికొచ్చిందమ్మా పోయేకాలం?’ అని ఇలా నలుగురూ గొప్పావిడ్ని అడిగేసరికి మంచావిడ చాలా ఆందోళనపడుతుంది. అంతలో ఆవిణ్ని గొప్పావిడ “ఏం అక్కయ్యా! మీరుకాక మా గదిలోకి రావడం మీరు చూసేరా?” అని ఎంతో బేలగా అడిగినట్లుగా అడుగుతుంది.
ఆ ప్రశ్నతో మంచావిడకి మతిపోతుంది. వణుకు పట్టుకుంటుంది. ఆమెకి నాలిక పిడచకట్టుకుపోతుంది. గొంతుకలో ఏదో అడ్డుపడినట్టవుతుంది. ముఖం మీద నిప్పులు జల్లినట్టుగా ఎర్రగా కందిపోతుంది. ఆమె “నాకు తెలీదక్కయ్య గారూ! నేను చూళ్ళేదు. నేను తియ్యలేదు!” అంటూ వలవల ఏడుస్తుంది.
“చూసేరా పిన్నిగారూ? చూసేవా వదినా? చూసేరా అత్తయ్యా? ఆవిణ్ని నేనేమైనా ” అన్నానా?” అని గొప్పావిడ ముక్కు మీద మూడుసార్లు వేలేసుకొని ఆ తరవాత “శుక్రవారం పూటా నగలుపోయి నేనేడుస్తుంటే ఆవిడమీద దొంగతనం కట్టేనని ఎలా నిందవేస్తోందో చూసేరా!!” అంటూ గొప్పావిడ వెక్కివెక్కి ఏడుస్తుంది.
అత్తయ్యకీ వదినకీ పిన్నిగారికీ అందరికీ కూడా గొప్పావిణ్ని చూసి జాలి కలుగుతుంది. వాళ్ళంతా మంచావిడమీద – పది మందీ పదేసి కాట్లకుక్కల్లాగ విరుచుకుపడిపోతారు. ఆ గొడవలో ఎవరోగాని “పుచ్చకాయల్దొంగా అంటే భుజాలు తడుంకున్నట్టుగా ఉంది” అనే అనేస్తుంది కూడాను! పీక్కి ఉరిపోసుకొని (“పీకకి కాకపోతే ఉరి దేనికి?!” అనేది గొప్పింటి పాఠకుడి విట్టు) చచ్చిపోదాం అనుకుంటుంది మంచివాడి భార్య. కాని అంత ఘోరం పోలీసులు రాకుండా జరగడానికి వీల్లేదు.
(అయితే పోలీసువాళ్లు వస్తారా? రేషనింగు గుమస్తాల్లాంటి వాళ్లు మరో మర్యాదస్తుణ్ని పోలీసువారికి అంతవేగం అప్పజెప్పరే. ముందుగా తప్పు తమ మీద లేకుండా మంతనాలు జరుపుతారు. అంచేత మంతనాలు జరిపిద్దాం. ఆ తరవాత పోలీసువార్ని రప్పిద్దాం.)
మధ్యాహ్నం దుక్క గుమస్తా తన ఇంటికి వచ్చి సంగతి తెలుసుకుంటాడు. ఎవరో కబురు పెట్టగా డొక్కు (మంచి) వాడు ఇంటికి వస్తాడు. దుక్క గుమస్తా అవకాశం కొంచెం వచ్చినందుకు భార్య అజాగ్రత్తగా ఉన్నందుకు ఆమెను కొంచెం కేకలు వేస్తాడు. నగలు పోగొట్టుకున్న ఆ వగలాడికి పత్రికల్లో పడే ఆడకథలన్నీ చదివే అలవాటుంది. “పురుషులు ఎప్పుడూ ఇంతే!” అవి మాటిమాటికీ అనే అలవాటు కూడా ఉంది. భర్త తన మీద కేకలు వెయ్యగానే ఆమె తన ఏడుపుకి సన్నాయినొక్కులు నొక్కి భర్త మీదికి బాణాల్లాంటి మాటలు విసురుతుంది. “నగలు పోయి చచ్చి నేనేడుస్తూంటే మీకు జాలిలేదు. మీరు రాక్షసులు. నేను చచ్చిపోయినా మీరూరుకోరు. నాశవాన్ని కుళ్ళబొడిచి కోస్తేనేగాని మీకు సంతుష్టుండదు” అని ఇంకా ఇంకా ఏడుస్తుంది. హిస్టీరికల్ గా కేకలు వేస్తుంది. “నీ నగలు నీకు ఎలా రావో చూస్తాను. ఏడవకు రాధీ!” అంటూ దుక్క గుమస్తా ఆమెని ఓదారుస్తాడు. ఆమె మంచం మీద వెల్లకిలా పడుక్కొని కాళ్ళు టపటపమని మూర్ఛ రాబోయేదాన్లా కొడుతుంది. భర్త వాటిని అభిమానంగా గాభరాగా జాలిగా భయంగా అణచిపట్టుకుంటాడు.
అవతల వాటాలో అక్కడ మన మంచివాడికి ఆవేదనతో ఆవేశం వస్తుంది. “ఛీ! నీ మినప్పప్పు మండిపోను! అది లేకపోతే మనం ఆకల్తో చచ్చిపోతావాఁ? లేక మన సంసారం చల్లారిపోతుందా? మినపప్పు లేకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయా? వెధవపప్పు అంతగా లేకపోతే, ఒక్కపూటైనా అది లేకుండా నువ్వు బతకనే లేకపోతే, అంతగా అది నీక్కావలసొస్తే మరొకరింటికీ ఇంకొకరింటికీ వెళ్ళక వాళ్ళింటికెందుకు వెళ్ళేవు ఓ పాపిష్టిదానా? జెష్టా! రాస్కెల్! అపనిందతో నేనెలా బతికేదే? నీ మీద నొందొస్తే నా మీద కొచ్చినట్టు కాదా! హోసీ రాస్కెల్ రాస్కెల్ రాస్కెల్!!!” అని పెళ్ళాన్ని (కొడతాడా? పోనీ పాపం. మంచివాడు కదా! కొట్టకుండా చేదాం) కొట్టబోయి (కొట్టబోయి కొట్టనప్పుడు ఆవేశంతో ఏం చేస్తాడు?) జుట్టు పీక్కొని నెత్తినోరు కొట్టుకొని గోల పెడతాడు. . దుఃఖపుటావేశంతో భర్త చనిపోతాడేమోనని మంచి భార్య గడగడలాడిపోయి, తన దుః ఖాన్ని దిగమింగుకొని “ఏడవకండీ, నిందవేసిన వాళ్ళ పాపాన్ని వాళ్ళేపోతారు! మననింత కష్టపెట్టినవాళ్ళు వాళ్ళేం బావుపడతారు! నిజానిజాలు భగవంతుడు కనిపెట్టగలడు! అన్నింటికీ అతనున్నాడు! అతనుండగా మనకి ఏ భయమూ లేదు” అంటూ అతణ్ణి కాగలించుకొని సముదాయిస్తుంది. అంతలో స్కూల్నుంచి మధ్యాహ్నం భోజనానికి వారి కుమారుడొస్తాడు. ఎవర్ని ఏం చెయ్యడానికి తోచని మంచివాడు కొడుకుని చూడగానే మండిపడతాడు “పుస్తకాలు, కథల పుస్తకాలు వాళ్ళని అడక్కుండా పట్టుకొచ్చి దొంగవనిపించుకొని చివరికి నన్నూ అమ్మనీ కూడా నలుగురిమధ్యా దొంగలకింద నిలబెట్టేవురా వెధవా! మా గౌరవం, మర్యాదా అన్నీ మంట కలిపేసేవురా వెధవా!” అంటూ కొడుకుని మంచివాడు చితక్కొట్టేస్తాడు. ఆ పిల్లడు “అమ్మో! అమ్మో!!” అని పెడబొబ్బలు పెడతాడు. వాళ్ళ అమ్మ అడ్డుకొని వాణ్ని కాపాడుకొంటుంది. అంతలో పక్కవాటా వాళ్ళంతా గుమ్మంచుట్టూ మూగేస్తారు. ఏమిటయిందేవిటయిందని క్యూరియాసిటి చూపిస్తారు. ఆ గలాటాలో నుంచి మంచివాడూ అతని భార్యా ఆ కొడుకూ ముగ్గురూ కూడా ఏడుస్తుండడం చూసి గుమ్మం చుట్టూ మూగినవారు పది మందీ పదేసి మాటలంటారు. అవమానంతో బాధతో మంచి కుటుంబం కుంగిపోతుంది.
ఇలా కథ రాసుకుంటూ పోవచ్చు… ఆ తరవాత పక్కవాటాల వాళ్ళలో ఓ ముసలావిడ వచ్చి “కుర్రవాళ్ళు తెలీక పొరపాటు చేస్తే చెయొచ్చు! వాణ్ణి నాలుగు కేకలేసి ఎవరి సామాను వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది కదమ్మా?!” అని మంచావిడికి సలహా ఇవ్వడం, ఆఫీస్ సేవింగ్ డివైస్ కి రేషనింగు గుమాస్తా వప్పుకుంటే బావుంటుందని కూడా ముసలావిడ సూచించడం “అప్పుడు మావాడు ఇంటిదగ్గర లేనేలేడమ్మా! స్కూల్లో ఉన్నాడు!” అని మంచావిడ అనడం. “నాయనా! ఎంత నచ్చజెప్పినా వాళ్ళు వినలేదు. వాళ్లు ఆ సరుకు తియ్యనేలేదట! ఏం చేస్తే చేసుకోండంటున్నారు. పోలీసులూ వాళ్ళూ ఒస్తే మర్యాదగా ఉండదుస్మండీ! అని చెప్పినా వినకపోతే నేనేం చెయ్యను?! మరింక నువ్వేం చేసుకుంటావో చేసుకో!” అని ముసలావిడ వెళ్ళి రే. గుమస్తాతో చెప్పడం, పోలీసువారు రావడం, వారు సీన్ ఆఫ్ అఫెన్స్ పరీక్షించడం, వారు వచ్చిన తరువాత రే. గుమస్తాకి తన ఇంట్లో (సలభై కేజీల…. అంతేనా?! బస్తాన్నర) దొంగ బియ్యం ఉందని జ్ఞప్తికి వచ్చి వాళ్ళు ఉన్నంతసేపు అతను గింజుకుపోవడం, రేషనింగు గుమస్తాగా ఉంటూ దొంగబియ్యం దాచినందుకు అది కనిపెట్టి పోలీసువాళ్ళు తనని పీడిస్తారేమోనని అతను గడగడలాడ్డం, దర్యాప్తుకివచ్చిన హెడ్డుగారు తన భార్య అంగసౌష్టవాన్ని తొంగితొంగి చూసినప్పటికీ దొంగబియ్యపు భయంతో రే. గుమస్తాకి హెడ్డు ఎడల కోపం రాకపోవడం, తన భార్య అందాన్ని చూసి ఆశపడైనా లేక కనికరించైనా హెడ్డుగారు తన నేరాన్ని కప్పిపుచ్చితే తను తిరుపతికి వెడతానని అతను మొక్కుకోడం, హెడ్డుగారు దొంగబియ్యం వైపు చూడనైనా చూడకపోయేసరికి రే. గుమస్తాకి ధైర్యం వచ్చేయడం, తిరుపతి దేవుడైతేనేవిటి మనూళ్ళో వెలిసిన వెంకట్రవణమూర్తయితే నేఁవిఁటి అని అతను తిరుపతి ఖర్చు తప్పించుకొందికి అక్కడికక్కడే అప్పటికప్పుడే ప్లాటు వేసుకోడం, హెడ్డుగారు మంచివాడి వాటాలోకి వెళ్ళడం, పక్కవాటాల జనం అంతా మూగడం. మంచివాడి కొడుకుని హెడ్డుగారు బుజ్జగించి, “నిజం చెప్తే నీకు పిప్పరమెంట్లిస్తాను! లైట్ హౌస్ చూసేవా? చూళ్ళేదూ! అయితే అక్కడికీ తీసుకెళ్ళి లైట్ హౌసు ఎక్కిస్తాను! ఏం నిజం చెప్తావా?” అని మెత్తగా అడగడం. పోలీసువాడు అంత మెత్తగా ఉండడం చూసి జనం అంతా మురిసిపోవడం. “లక్షసార్లు దుర్మార్గంగా ఉన్నవాడు ఒక్కసారి మాత్రం మంచిగా ఉంటే ఏమౌతుంది? ఈ ఒక్క మంచితనం ఆ లక్ష దుర్మార్గాలన్నీ కాపాడుతుందా? అంతమాత్రం చేత వాడు మంచివాడయినట్టే లెక్కా?” అని ఈ ఇతివృత్తం తీసుకొని ఎన్నో కథలు రాయొచ్చు. ఉదాహరణకి – ఒకడుంటాడు. వాడు పరమ కర్కోటకుడు. వాడు దార్లు కాసి దోపిడీ చేసి జీవిస్తాడు. దోపిడీకి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళను హత్య చేస్తాడు. వాడికి ఒక చక్కని కూతురుంటుంది. ఆ పిల్లని ఒక కోటేశ్వరిగా చేద్దామనేది అతని జీవితాశయం. ఆ కూతురంటే అతనికి పంచప్రాణాలూను!…. (ఆ పిల్లని మంచిదానిగా చూపిద్దావాఁ? లేక చెడ్డదానిగా చూపిద్దావాఁ? ఏదైనా ఒకటే మన కథకి)…. ఆ చక్కటి పిల్లని ఓ బ్రహ్మరాక్షసుడు ఎత్తుకుపోతాడు. మన ఖూనీకోర్ ఆ బ్రహ్మరాక్షసుడ్ని ఏం చెయ్యలేకపోతాడు. తన కూతుర్ని “చంపకు తండ్రీ!” అని ఆ ఖూనీకోర్ బ్రహ్మరాక్షసుడ్ని బతిమాలుకుంటాడు. రాక్షసుడు వినడు. ఆ ఆడకూతుర్ని కూరొండుకు తినేస్తానంటాడు. “లేకపోతే దానికి బదులు నువ్వురా” అంటాడు. ఖూనీకోర్ అందుకు సంతోషంతో అంగీకరిస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు ఆ పిల్లని విడిచిపెట్టి ఆ ఖూనీకోర్ని చంపుకు తినేస్తాడు. అపుడా తండ్రి చేసిన త్యాగానికి దేవతలు పుష్పవర్షం కురిపిస్తారా కురిపించరా? ఈ విధంగా ఇదో కథ అవుతుంది. (ఈ రకంగా కాశీమజిలీ కథగాకుండా ఇంకోలా కూడా రాయొచ్చు… పేదవాళ్ళు వెయ్యిమంది గవర్నమెంటు బంజర్లో పాకలు వేసుకొని మూడేళ్ళనుండీ ఉంటున్నారు. వాళ్ళకి తెలియకుండా ఓ పెద్ద దొంగమనిషి తన పేర ‘బి’ మెమోలు పుట్టించుకొని, చివరకి పట్టా కూడా పుట్టించుకుంటాడు. పేదల్ని తన జాగా ఖాళీ చెయ్యమంటాడు! వాళ్ళు చెయ్యరు. దావావేసి వాళ్ళను పిలకపట్టుకు ఈడ్పించేస్తాడు. దావా చాలా కాలం కోర్టులో నలగడంతో పేదలంతా చితికిపోతారు. వాళ్లు ఆ జాగా ఖాళీ చేసేక మన దొంగ పెద్దమనిషి ఆ జాగాని కొన్ని లక్షలకు అమ్ముకుంటాడు. అంతలో ఓ రోజున అతని ముద్దుల భార్య కార్ ఆక్సిడెంట్లో చనిపోయింది. దాంతో మన పెద్ద దొంగమనిషికి జీవితం అంటే విరక్తి కలుగుతుంది. అతను తన లక్షలన్నీ గోసంరక్షణకి వినియోగం చేస్తాడు. పేదలసొమ్ము పశువులకు పోయినందుకు పరమేశ్వరుడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఊళ్ళో పశువులు సంతోషించినా సంతోషించకపోయినా దేశంలో పెద్దలంతా మాత్రం మెచ్చుకుంటారు. మన పెద్ద మనిషి దొంగని వాళ్ళంతా ఘనంగా సన్మానించి వెయ్యి పడగల పాము వెయ్యి బుసలు కొట్టినట్లు వేనోళ్ళ అతణ్ణి శ్లాఘించారు. (మరో కథ ఇందులోంచి లాగలేమా? చూద్దాం ప్రయత్నిద్దాం) ఒక మనిషుంటాడు, వాడు గట్టివాడు కాబట్టి మన కథలో వాడు చాలా దిట్టంగా ఉంటాడు. వాడికి ఇనప్పెట్టెలాంటి ఛాతీ ఉంటుంది. (వాడి రూపం ఎలా ఉంటుందని చెప్తాం) వాడి తల అయ్యరు హోటల్లో రుబ్బురోలు పొత్రంలా ఉంటుంది. (వాడి కళ్లు? వాటిని కూడా రాళ్ళతోనే సరిపోల్చుదాం) వాడికళ్ళు ఎలా ఉన్నాయి – మరైతే తెల్లగా పాలరాత్తో చెక్కినట్టున్నాయి. వాటి మధ్య మెరిసే కనుపాపలు రాజుకోబోయే రాక్షసి బొగ్గుల్లా మెరుస్తున్నాయి. ఈ ఇనప్పెట్టె మనిషి ఏం చేస్తుంటాడు? మలయాకి మైకా పంపిస్తాడు. బర్మాకి బట్టలు పంపిస్తాడు. విమానం మీద మాస్కో మహానగరానికి మామిడి పళ్ళు పంపిస్తాడు. ఇమిటేషన్ రాళ్ళన్నీ ఇథియోపియాకి పంపిస్తాడు. అంతరాత్మని-అమెరికాకి!!-అమెరికాకి పంపిస్తాడు. నెలకోసారి పాపాలనన్నీ తిరుమల తిరుపతికి పంపిస్తాడు. అతని జీవితం ఒక బాంకు. అతని ఒళ్ళొకకవచం, అతని గుండె ఎప్పటికీ కరగని వజ్రం. మంచి మాటకి అతను మూగివాడు, పేదల ప్రార్థనలకి అతడు చెవిటివాడు. దానానికి అతను మొండిచేతులవాడు. ఆశకి అతను లోకంకంటే పెద్దవాడు. పరుల కష్టాల కన్నీటి ధారలకి అతను బోడికొండవాడు. అక్కడ ఏ నీరు ఇంకదు. నిలవదు. అక్కడ ఏ మొక్కా మొలవదు. ఏ ప్రాణి బతకదు. పగటివేళ అది నిప్పుల కుంపటిలా ఉంటుంది. రాత్రివేళ అది అకస్మాత్తుగా వెలిసిన అతి పెద్ద చలిపిడుగులా ఉంటుంది. అటువంటి పెద్దమనిషి ఓసారి తన బట్టల మిల్లులోని పనిమనుషులతో తగువుకి దిగి మిల్లు మూయించేస్తాడు. వాళ్ళంతా నిరాహారదీక్ష పడతారు. వాళ్ళ పిల్లలంతా బిక్కచచ్చిపోయి కళ్ళలో ప్రాణాలు పెట్టుకుంటారు. నిరాహారదీక్ష పట్టిన వర్కర్లలో ఒకడికి కడుపుమండి కేకలేస్తాడు. ఒకడు లేచినిలబడి చెయ్యెత్తి పిడికిలి లిగించి ఛాలెంజి చేస్తాడు. మరొకడెవడో మిల్లుగేటు దూకి రాయి విసురుతాడు. ఆ తరవాత లాఠీఛార్జీ జరుగుతుంది. ఆ వెంటనే కాల్పులు జరుగుతాయి. పిట్టలు రాలినట్టు పదిమంది కూలీలు రాలిపోతారు. మెట్ట పక్క శ్మశానంలోని చావుమంటలతో దుఃఖపు కేకలతో ఆ బోడిమెట్టకు సంబంధం లేనట్టు మన బట్టల మిల్లువాడు (అతని తల బట్టతల) ఆ కాల్పులతో చావులతో సంబంధం లేకుండా ఇంటికివెళ్ళిపోతాడు. అపుడు రాత్రి 10 గంటలవుతుంది. పోర్టికోలో అతను కారు ఆపి అందులోంచి దిగి నిలబడిపోతాడు. రోజూ వినబడే పలుకు, రోజూ కనబడే ఆ చక్కని రూపం – ఏవీ? ఏమయేయి? రోజూ కారు అగేసరికి ప్రత్యక్షమయే ఝాన్సీ ఏమయింది? “ఏమయిందిరా స్కౌండ్రల్?” “ఝాన్సీకి జబ్బు చేసింది బాబూ! గంటయింది. మూసిన కన్ను ఎత్తలేదు!” మిల్లు మనిషి లోనికి పరుగెడతాడు. ఝాన్సీ నీరసంగా, తోక ముడుచుకోనైనా ముడుచుకోలేక, కళ్ళు మూసుకు పడుకుంది. “ఝాన్సీ! మై స్వీట్ ఝాన్సీ!” అంటూ మరమనిషి తన పెంపుడు ఆల్సేషన్ ని జాలిగా నిమురుతాడు. అది ఆఖరిసారిగా ఒక్కసారి కన్ను తెరచి మాస్టర్ ని తనివితీరా చూసి శాశ్వతంగా కన్నుమూస్తుంది. అప్పుడు మరమనిషి కళ్ళంట నీరు కారడం చూసి ఇంట్లో నౌకర్లంతా నీరైపోతారు. బండలూ కొండలూ కూడా కరగొచ్చునని వాళ్ళకి తెలిసివస్తుంది. భగవంతుడు ఉన్నాడని వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. కాని అంతలోనే వాళ్ళ నెత్తులమీద పిడుగు పడుతుంది. ఝాన్సీకి జబ్బు చేసిందని తెలిసి కూడా వెంటనే చెప్పనందుకు వాళ్ళనందర్నీ మరమనిషి నిల్చున్నపాటునే అక్కడే అప్పుడే డిస్మిస్ చేస్తాడు…. ఈ విధంగా అనేకమైన ఇతివృత్తాలు మనం తీసుకోవచ్చు.
ఇంతకీ నేను దుక్క భార్య చేసిన ఆరోపణా, అందు గురించి మంచి భార్య పడే విడచిపెట్టేసేను. కాని ఆ కథలో అటు తరువాత ఏం జరుగుతుందో పెద్దగా చెప్పనక్కర్లేదనుకుంటాను. చిత్రించే జీవితపు స్వభావాన్ని బట్టి, చిత్రించే రచయిత భావాలని ఆ కథని ఏ విధంగా మలుచుకోవాలన్నా మలుచుకోవచ్చును. అందులోంచి కన్నీటిని దించవచ్చు. అందులోంచి మంటలు రేపవచ్చు. అందులోంచి పాఠకుణ్ని కితకితలు పెట్టవచ్చు. తొడపాశం పెట్టి వీశ గుద్దులు గుద్ది కళ్ళు తెరిచి జీవితాన్ని చూడమని పాఠం చెప్పవచ్చు. దాన్ని కథగా పత్రికలోకి, డ్రామాగా రంగస్థలానికీ, సినిమాగా జరీ తెరకీ, నవలగా పుస్తకంలోకి ఎక్కించవచ్చు. దాన్ని రచయిత రాగంతో, అనుతాపంతో, దుఃఖంతో జాలితో, నవ్వుతో, అసూయతో, అసహనంతో, సహనంతో, శాంతంతో ఎన్నింటితోనో పూర్తిగా నింపవచ్చు.
ఆ రోజున రమణగారి డాబా గదిముందు కూర్చొని ఆలోచిస్తోంటే నా ఆలోచన మరో విధంగా కూడా వెళ్ళింది.
నేను అక్కడికి రాకముందు దొంగతనం జరిగి వుంటే పర్యవసానాలు ఒక విధంగా ఉంటాయి. హత్య జరిగితే?…. హత్య జరిగితే కథలు వేరుగా ఉంటాయి. నేను ఆ గదికి రాబోయేసరికి అక్కడ రమణగారు హత్య కాబడే ఉంటే? (అమంగళం ప్రతిహతమగుగాక!) ఆ విధంగా దుష్టంగా ఆలోచిస్తుంటే – అమాయకుడైన ఓ చిన్న కాలేజీ లెక్చరర్ని లేదా ఉద్యోగస్తుణ్ణి ఎవరైనా హత్య చేయడానికి తగినంత కారణాలు ఏముంటాయా అని ఊహ పరిగెట్టింది. రమణగారికి రీడర్ గా ప్రమోషన్ రావచ్చునని కొందరు అనుకోగా నేనంతకుముందు విన్నాను. అందుచేత ప్రమోషన్ కాబోయే ఓ ఆఫీసర్ని ఆ ప్రమోషన్ కావలసిన మరో ఆఫీసరు హత్య చేయవచ్చుకదా అనిపించింది నాకు. అయితే “మర్యాదస్తులు దొరకకుండా హత్యలు చేయగలరా?” అని ఆ సాయంకాలం తీరి కూర్చొని నేను ఆలోచించ నారంభించేను. మరీ దుర్మార్గంగా ఆలోచిస్తే కథలు సహజంగా పుట్టుకొస్తాయి మరి.
ఓ చంటి పిల్లడు చెరువులో పడిపోతాడు. నువ్వు అక్కడే ఉండి చూస్తుంటావు. నీకు ఈత బాగా వచ్చును. కాని నువ్వు చెరువులోకి దిగి ఆ పిల్లణ్ని రక్షించవు. (మరెవ్వరూ అక్కడ సమయంలో ఉండరు) ఆ పిల్లడు నీట్లో మునిగిచనిపోతాడు. ప్రాణరక్షణ కోసం ప్రయత్నం చెయ్యకపోవడం నేరం అవుతుందా? అవదా?
ఈ దేశపు శిక్షాస్మృతి ప్రకారం అది నేరం కాదట. కాని ఫ్రాన్సు దేశపు శిక్షాస్మృతి ప్రకారం అది నేరం అవుతుందిట.
పైవిధంగా ‘లా’ కాలేజీలో నేను నేర్చుకున్నట్టుగా (నిజంగా అలా నేర్చుకున్నానా?? నాకు అప్పుడు గుర్తుకి వచ్చింది. ఆ థీం తీసుకొని చాలా కథలు రాయొచ్చుననిపించింది నాకు.
అరకులో ఓ ఆఫీసరూ అతన అసిస్టెంటూ ఉంటారు. ఆ ఆఫీసరు రిటైరయితే గాని ఈ అసిస్టెంటుకి ఆ ఉద్యోగం రాదు. ఆఫీసరు మరో పదేళ్ళకు కాని రిటైరవడు. వయసులో పెద్దవాడు కాబట్టి ఈ అసిస్టెంటు మరో నాలుగేళ్ళలో రిటైరయిపోతాడు. అందుచేత ఈ ఆఫీసరు బతికి ఉన్నన్నాళ్ళూ ఈ ఆసిస్టెంటుకి ప్రమోషన్ ఉండదు. ఓ రోజు పది గంటలకి అసిస్టెంటు గాడు అర్జంటుగా వైజాగ్ వెళ్ళవలసి వచ్చి ఆఫీసు జీపులో వంటరిగా బయలుదేరుతాడు. దారిలో ఘోరమైన వర్షం పట్టుకొంటుంది. ఘాట్ రోడ్డు వంకరటింకరగా చిక్కులు చిక్కులుగా ఉంటుంది. అసిస్టెంటుగాడి జీపుకి యాభైగజాలు ముందులో ఓ లారీ వెడుతుంటుంది. దారిలో ఓచోట వందల గజాల దూరంలో సడన్ మలుపుంది. ఈ మలుపులో ఓ ప్రక్క ఓ బ్రిడ్జి ఉంది. ఆ మలుపు దాటాక లారీని తప్పించుకొని ముందుకి పోదాం అనుకుంటాడు అసిస్టెంటుగాడు. అతనలా చూస్తుండగానే ఆ వర్షపుధారల్లో ఆ లారీ లోయలోకి దిగిపోతుంది. సడన్ బ్రేకువేసి జీపు ఆపిన అసిస్టెంటుకి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. జీపు ఆగిందానికి పది గజాల దూరంలో రోడ్డుకి గండి పడింది. ఆ గండి అగాధంలోకి దిగింది. దూరం నుంచి చూస్తే ఆ గండి కనిపించదు. ఆ లారీ ఆ జీపుకి ముందుగా లేకపోతే ఆ లారీవాడు చచ్చినట్టే ఈ జీపువాడు కూడా చచ్చిపోనన్నమాట! మన అసిస్టెంటుగాడు బతుకుజీవుడా అని జీపుని వెనక్కి మళ్ళించి నాలుగు మైళ్ళు వచ్చేస్తాడు. వస్తూంటే అతనికి ఆఫీసరు గారి కారు ఎదురవుతుంది. ఆఫీసరు కారు జీపుని ఆపుతుంది. ఆఫీసర్ చాలా హడావిడిగా ఉంటాడు. అతని భార్య చాలా ప్రమాదావస్థలో ఉందట. ఆవిణ్ని అర్జంటుగా అతను కార్లో తీసుకెళ్తున్నాడు రాత్రికి రాత్రే వైజాగ్ కె.జి.హాస్పిటల్లో ఆవిణ్ని చేర్పించడానికి. “రేపు నేను రాను మూడొంతులు” అని చెప్పేసి కారు స్టార్ట్ చేస్తాడు. రోడ్డుకి గండి పడ్డ మాట చెబ్దామా మాన్దామా అని ఒక క్షణంపాటు అసిస్టెంటుగాడు ఆలోచిస్తాడు. అంతలో కారు స్టార్టు చేసుకొని ఆఫీసరుగారు భార్యతో సహా అగాధం వైపు వెళ్ళిపోతారు. అసిస్టెంటుగాడు కేకవేస్తే కారు ఆగకపోదు. కాని అసిస్టెంటుగాడు ఆ కేకవెయ్యడు. ఆ ఆఫీసరుగారు భార్యతో కారుతో అగాధంలోకి దిగిపోయి అసిస్టెంటుగాడికి ప్రమోషన్ పొందే అవకాశం ఆ విధంగా కల్పిస్తారు. ఆ రాత్రి తను ఆవైపు వెళ్ళినట్టుగా అసిస్టెంటుగాడు భార్యతోనైనా సరే భగవంతుడికైనా సరే చెప్పడు. “రోడ్డుకి గండిపడ్డ సంగతి ఆఫీసర్ గారితో చెప్పేలోపున ఆయన కారు స్టార్టు వెళ్ళిపోతే నేనేం చెయ్యను?!” అని అసిస్టెంటుగాడు తన అంతరాత్మని సమాధానపర్చుకొని ఆఫీసరుగా ప్రమోట్ అయి శాంతంగా జీవితం వెళ్ళబుచ్చుతాడు. ఒక “ప్రమాదం గురించి చెప్పకపోవడం” గురించి కథ రాసినట్టే ఒక “రహస్యం చెప్పివేయడం” గురించి ఇంకొక కథ రాయవచ్చు.
ఇద్దరు ఆనర్స్ విద్యార్థులుంటారు. వాళ్ళిద్దరే ఆ క్లాసుకి తెలివైన వాళ్ళు, వారిలో ఎవరు యూనివర్సిటీలో ఫస్టుగా వస్తారో చెప్పడం కష్టం. వారిద్దరూ స్నేహితులే. వారి మధ్య అరమరికలు లేవు. ఇద్దరిలోనూ ఒకడు హుషారైన వెచ్చటి కుర్రాడు. రెండో వాడు రాచ్చిప్పలాంటి చల్లని కుర్రవాడు. వెచ్చటివాడు ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి చాలా తల తిరుగుడు మనిషి. ఆమెకి అతిశయమూ అభిమానమూ ఎక్కువ మన వెచ్చటి కుర్రవాడికి ఆమె యెడల ప్రేమ ఎంత ఎక్కువో అంతగానూ యవ్వనపు సరదాల యెడల మక్కువ ఎక్కువ. వేడి కుర్రవాడూ చలి కుర్రవాడూ పరీక్షల ముందు ‘కంబైన్డు స్టడీస్’ చేస్తూంటారు. రాత్రి పన్నెండు గంటలకి టీ తాగడం కోసం సినీమా హాలు దగ్గరికి వెళతారు. టీ తాగి వాళ్ళిద్దరూ వస్తూంటే వాళ్ళకొక వంటరి రిక్షా తటస్థపడుతుంది. ఆ వంటరి రిక్షాలో ఓ తుంటరి పిల్ల ఉంటుంది. ఆ తుంటరి పిల్ల అందంలో ఓ ప్రత్యేకత వుంటుంది. ఆ అందం ముసలివాళ్ళనీ పడుచువాళ్ళనీ మాత్రం ఆకర్షిస్తుంది. ఆ తుంటరి పిల్లతో మన వెచ్చటి కుర్రవాడు యవ్వనంవల్లా, తట్టుకోలేని ఉద్రేకంవల్లా పొరపాటు పనిచేస్తాడు. చలి కుర్రవాడు వారించినప్పటికీ కూడా ఆ వేడిపిల్లడు పాడుపని చేసి, ఆ తరువాత మాత్రం పశ్చాత్తాపం చెందుతాడు. “సుహాసినికి ఈ సంగతి తెలిస్తే కొంప మునుగుతుంది. ఛస్ ఇటువంటి వెధవపని మరింక జీవితంలో చెయ్యకూడదు!” అని తీర్మానించుకుంటాడు. అయితే సుహాసినికి ఆ విషయం తెలియదని ధీమాపడతాడు. ఇటువంటి పొరపాటు మరింక ఎప్పుడూ చెయ్యను కాబట్టి మరింక ఫరవాలేదనుకుంటాడు. తన చలి ఫ్రెండు ఈ తప్పుడు పనిని రహస్యంగా ఉంచుతాడనే నమ్మకంతో తను ఉండిపోతాడు. సుహాసినికి చెప్పనని చలిపిల్లడిచేత వేడిపిల్లడు ఒట్టు కూడా వేయించుకుంటాడు. ప్రియుడు చేసిన పాపం ప్రియురాలికి తెలిస్తే ప్రణయం పాడవుతుందనీ, ప్రణయం పాడయితే ప్రియుడి మనసు చెడుతుందనీ, మనసు చెడితే అతనా పాఠాలు చదవలేడనీ, చదవకపోతే అతను పరీక్ష తప్పుతాడని, అతని పోటీ లేకపోతే తను యూనివర్సిటీ ఫస్టు రాకతప్పదనీ చలికుర్రాడికి బాగా తెలుసు. అయితే, స్నేహితుడియెడల తనకి చాల బాధ్యతలున్నాయని అతను తనను తాను మోసపుచ్చుకుంటాడు. ఆ రాత్రి చేసినటువంటి పొరపాట్లు తన వేడిఫ్రెండు మళ్ళా రిపీట్ చెయ్యకుండా చూడవలసిన గురుతరమైన బాధ్యత తనయందు ఉన్నదని భావించుకొందికి చాలా యిష్టపడతాడు. అతను, అంటే ఆ చల్లటిపిల్లవాడు సుహాసినితో చెప్పడు. అతనికి వేరే ఓ స్నేహితురాలుంది. ఆవిడంటే అతనికీ చాలా యిష్టం. ఆవిడికి ఏం పేరు పెట్టేది? పార్వతి పేరు పెట్టొద్దు. లక్ష్మి పేరు పెడదాం. లక్ష్మి చంచల,పార్వతి అచల. అందుచేత ఈ పిల్లని చంచల అంటాం. అదీకాక చెడ్డవాళ్ళకి శివుడి సంబంధమైన పేర్లు నేను పెడతానా? ఛస్తే పెట్టను. చెడ్డవాళ్ళకి వైష్ణవనామాలే తగిలిద్దాం. ఛ! అలా చెయ్యడం తప్పే! పాపం! విష్ణుమూర్తి మనకి చేసిన అపకారం ఏముంది? అసలు దేవుడన్నవాడే అసలు ఉన్నాడా లేడా? అని సందేహిస్తూన్న సమయంలో మనకి ఈ శివకేశవ భేదాలెందుకు? బ్రహ్మపదార్థం అంటూ ఒకటుంటే దానికి శివకేశవ భేదాలు కాని అల్లా అబ్రహాముల తేడాలు కాని ఉండవు కదా! నేను ఈ ఇరవయ్యో శతాబ్దంలో ఉంటూ పెద్ద డిగ్రీ చదువులు చదివి ఇన్ని సంగతులు తెలుసుకొని యింత అనుభవం సంపాదించి నాకెన్నెన్నో విశాల భావాలు ఉన్నాయనుకొంటూ యింత మూఢంగా శివభక్తి, వైష్ణవద్వేషం పెట్టుకోవడం ఎందుకు? ఏమో! ఏమైనాసరే! నాది శివుడు పార్టీ! ఆ పిల్లని చంచలనే పిలుద్దాం. ముందుకెప్పుడైనా ఈ మూఢ ద్వేషాలని వదిలించుకొందికి ప్రయత్నిద్దాం. అయినా నాకు విష్ణువంటే నిజంగా ద్వేషం ఉందా? అబ్బే లేదే? ఆ పిల్లపేరు చంచల. చల్లపిల్లడికి ఆ చంచలంటే ఇష్టం. ఆ చంచలకి వేడి కుర్రవాడంటే ఎంతో ఇష్టం. అందుచేత ఆమెకి సహజంగా ఆ సుహాసిని యెడల చాలా అయిష్టం. చల్లనివాణ్ని చంచల పెళ్ళిచేసుకొందికి నిశ్చయం చేసుకొన్నప్పటికీ వెచ్చటివాడ్ని ప్రేమించడం మానడానికి ఆమె నిశ్చయం చేసుకోలేకపోతుంది. తన స్నేహితుడు చేసిన పొరపాటు గురించి చల్లనివాడు తిన్నగా వెళ్ళి చంచలతో చెప్తాడు. చంచల తిన్నగా వెళ్ళి సుహాసినికి ఆ సంగతి కసిగా ఊదేస్తుంది. దాన్తో సుహాసిని గర్వం, గౌరవం రెండూ దెబ్బతింటాయి. ఆమె తన వెచ్చనివాణ్ని ఒక నీచుడి కింద జమకట్టి తన ప్రేమలత మీద ద్వేషం అనే పెట్రోలు పోసి కోపం అనే అగ్గిపుల్లతో అంటించేస్తుంది. దాన్తో సుహాసిని మనసూ చెడుతుంది. వెచ్చనివాడి మనసూ చెడుతుంది.
ఇంతటితో ఈ అధ్యాయంలోని కథలన్నీ కంచికి వెళ్తాయి. ఇది చదివిన పాఠకీ (?!) పాఠకుల్లో భార్యలైతే ప్రతిభార్యా తన భర్త పక్క చేరుతుంది. ప్రతి భర్తా వెంటనే భార్యనే చూసి, కరువుభత్యం గురించీ దినవెచ్చం గురించీ ఆలోచిస్తాడు. రచయితలైతే పెదవులు విరిచి కాఫీలు తాగి సిగరెట్లు ముట్టించి కొత్త కథల గురించి నిద్ర మానుకొంటారు. రచనతో సంబంధం గల యువతీ యువకులైతే? వారు హాయిగా నవ్వుకొంటే నాకదే చాలు. కొన్నాళ్ళకి వారే రాయగలరు మంచి కథలు. వాళ్ళకి వచ్చేసారి మళ్ళీ చెప్తాను మరికొన్ని ప్రమాదకరమైన కథలు. రాయడానికి నా పాట్లు నా ప్లాట్లు, (ఇంతకీ రమణగారు ఏమయినట్టు?)
(‘ప్రజాప్రభ’ మాసపత్రిక 1966 ఏప్రిల్)
ఓ కథ కథ
కథలు ఎలా రాస్తారండీ అని నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు. లోకం అంతటికీ ఒక్క మనిషి ఏకవచనంగా ఉండిపోతే “నీతి” అనే మాట ఉండదని స్పైనోజా అనే మహాశయుడు అన్నాడని నేను విన్నాను. మనిషి బహువచనంగా ఉంటూ, సంఘజీవిగా ఉన్నాడు కాబట్టి నీతి నియమాలకి అవసరం ఏర్పడింది. ఆ మాటలు పుట్టడం జరిగింది.
అలాగే కథలు కూడా లోకంలో ఒకడే మానవుడుంటే పుట్టి ఉండవని నేననుకుంటాను. మానవులంటూ ఉండడంవల్లనే వారు సంఘజీవులుగా ఉండటం చేతనే కథలంటూ పుట్టేయని నేననుకొంటున్నాను. మానవ జీవితంలోంచే మహిలో కథలు పుడతాయి.(నా ఉద్దేశం ప్రకారం)
కథలు ఎలా రాయడం? అని నేననుకొంటున్న రోజుల్లో ఓ చిన్న సంఘటన జరిగింది.
నేను చెన్నపట్నంలో లా కాలేజీలో చదువుతూ సెంథోమ్ లో ఓ హాస్టల్లో ఉంటూండేవాణ్ణి. లా కాలేజీ మాకు చాలా దూరం. వెళ్తే బస్సులో వెళ్ళాలి. లేకపోతే ట్రాములో వెళ్ళాలి. ట్రాములు చీమ నడకల్తో వెళ్ళేవి. బస్సులో పది గంటలకి సీట్లు దొరకడం చాలా కష్టం ఉండేది. ఆలస్యంగా వెళ్ళినా ఫరవాలేదు కాబట్టి మేమంతా నెలవారీ పాసులు కొనుక్కొని ట్రాములమీద కాలేజీకి వెళ్తూండేవాళ్ళం.
మామూలు రోజుల్లో అయితే ఆలస్యంగా వెళ్ళినా ఫరవాలేదు కాని పరీక్షలకి వెళ్తే మాత్రం ఠంచన్ గా టైముకి వెళ్ళాలి కదా! అటువంటపుడు చాలా వేగిరంగా బయల్దేరనైన బయల్దేరేవాళ్ళం లేదా, నలుగురైదుగురు చేరి టాక్సీమీదైనా వెళ్ళే వాళ్ళం.
మా హాస్టల్లో మా క్లాస్మేట్ ఒకాయన ఉండేవాడు. పై పేరాల్లో ఒకదానిలో ఒక “చిన్న సంఘటన” అని చెప్పేను కదా. ఆ సంఘటన ఆయన విషయంలో జరిగింది. అందులోనుంచి నేను రాసిన “మెరుపు మెరిసింది” అనే కథ వచ్చింది.
“మెరుపు మెరిసింది” చాలా చిన్న కథ. అందులో నీరజ అనే ఓ స్కూలు టీచర్ వుంటుంది. ఆమెకి ముప్పయ్యయిదేళ్ళు వెళ్లేయి. పెళ్ళి మాత్రం కాలేదు. అది ఆమె చాలా చింతగా ఉంటుంది. అందులోనూ ఆవిడ చాలా అనాకారి. తనకి పెళ్లి కావాలనీ పిల్లలు పుట్టాలనీ ఆమెకి చాలా కోరికగా ఉంటుంది. ఆ కోరిక తీరదని ఆమెకి చాలా నిరాశగా ఉంటుంది. ఇలా ఉంటుండగా హెచ్చుగా వర్షాలు పడే రోజుల్లో ఒక రోజున ఆమె స్కూల్ కి వెళ్ళడానికి బస్సు కోసం చాలాసేపు నిరీక్షిస్తూ బస్సులో సీట్లు లేక స్టాండులో బాధపడుతూ ఉండిపోయిన సమయంలో ఓ నడికాలపు సుందరాంగుడు తన కార్ ఆపి అందులో ఆమె లిఫ్ట్ ఇచ్చి స్కూల్ దగ్గర విరుస్తాడు. దాంతో ఆమె పులకరించిపోతుంది. ఆ చిన్న సంఘటన మీద ఆమె బరువైన కలల భవనాలు కట్టేసుకొంటుంది. ఆ చిన్న స్నేహం పెద్దదయి పెళ్ళిగా పరిణమించకూడదా అని అశలు పెట్టుకొంటుంది. ఆ మర్నాడు . కూడా వర్షం కుండపోతగా కురుస్తుండడంతో అదే టైంకి అదే బస్సు స్టాండు దగ్గర అదే కారుకోసం ఆమె ఆశలన్నీ మూటకట్టుకుని నిరీక్షిస్తుండగా అదేకారులో అదే సుందరాంగుడు అదే దారంట వెళ్తూ ఆమెని చూసికూడా చూడనట్లు నటించి, వయసులోనూ అందంగానూ ఉన్న మరి నలుగురు ఆడపిల్లలకి లిఫ్ట్ ఇచ్చి ఈమెను మాత్రం వర్షానికి నిరాశకే వదిలేసి వెళ్ళిపోతాడు.
ఇది కథ. ఇది జరగని విషయం.
ఇక జరిగిన విషయం ఏమిటయ్యా అంటే,
నా క్లాస్మేట్ అని చెప్పేను కదా. అతను నెమ్మదైనవాడు. మంచివాడు. ఎవరి జోలికి పోయేవాడు కాడు. అలా అన్చెప్పి ఒంటిపిల్లి రాకాసిలా ఉండేవాడు కాడు. పలకరిస్తే సరదాగా పలికేవాడు. డబ్బు దగ్గిర మాత్రం కొంత పిసినారిగా ఉండేవాడేమోనని నేననుకొనేవాణ్ణి. అతను సిగరెట్లు కాల్చేవాడు కాదు, పేకాట ఆడేవాడు కాడు, చాలా సినిమాలు చూసేవాడు కాడు. హాస్టల్లో దొరికిన మేరకే భోజనం చేస్తూ ఇంటినించి అందిన మేరకి డబ్బు జాగ్రత్తగా వాడుకొంటూ అతను చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేసేవాడు.
ఇలా ఉండగా పరీక్షలొచ్చేయి. పరీక్షలకి మేమంతా ఏవిధంగా సకాలానికి చేరుకున్నామో గుర్తులేదు కాని ఇతను మాత్రం బస్సులో వద్దామని బయల్దేరేడట. తొమ్మిది గంటలకే బస్ స్టాండుకి వచ్చి నిల్చున్నా అతనికి ఏ బస్సులోనూ సీటు దొరకలేదట. తొమ్మిదన్నరకి అతనికి బస్సులో సీటు దొరకలేదు. మరింక అప్పుడు ట్రాం దొరుకుతుందికాని, అందులో వస్తే కాలేజీకి అరగంట ఆలస్యంగా చేరుకుంటాడు. బస్సులో సీటు దొరక్క ఆ పరీక్ష తిప్పుతాననే బాధతో, ఏడాది పొడుగుకాలం, ఏడాది పొడుగు డబ్బు అన్నీ వేస్టు అయిపోతున్నాయనే వేదనతో అతను బస్సుస్టాండు దగ్గిర నిల్చుండిపోతే…
ముక్కూ మొహం తెలియని పెద్దమనిషెవరో అతనికి తన కారులో కాలేజీ దాకా లిఫ్ట్ ఇచ్చేడు అందువల్ల అతను పరీక్ష రాయగలిగాడు.
అందుకతను భగవంతునికి వెయ్యి వేల నమస్కారాలు పెట్టుకున్నాడనుకుంటాను. ఆ కష్ట సమయంలో ఆ లిఫ్ట్ పొందగలిగినందుకు అతను త్రిల్ అయిపోయేడనుకుంటాను. జీవితంలో మొదటిసారిగా ఆడదాన్ని పొందినవాళ్ళా, పుట్టిన పదహారేళ్ళకి తొలిసారి సినిమా చూసిన వాళ్ళా అతను పులకరించిపోయేడు. ఆకలి చావుని కేకులు తిని తప్పించుకున్న వాళ్ళా అతను పొంగిపోయేడు.
ఆ విషయం అంతా అతను అడిగిన వాడితోనూ, అడగని వాడితోనూ ఇద్దరితోనూ చెప్పేడు.
ఇంతా చేస్తే మేం వెళ్ళిన పరీక్షలు యూనివర్సిటీ పరీక్షలు కావు. సెలక్షన్ పరీక్షలు, పరీక్షల్లో అందరం సెలెక్ట్ అయిపోతాం అని దాదాపు అందరికీ తెలుసు, అతనికి మాత్రం తెలిసి ఉండకపోవచ్చు. కాని, అంత చిన్న లిఫ్ట్ గురించి అతనంత పెద్దగా పొంగిపోవడం నాకు చాలా వింతగా తోచింది. ఆ విషయం గురించి ఆలోచిస్తూ,
“కారులో ఓ మొగోడు లిఫ్ట్ ఇస్తేనే ఈ కుర్రోడింత పొంగి పోతున్నాడు! మరింక వయసులో వున్న ఆడదేకాని లిఫ్ట్ ఇస్తే కుర్రోడింకెంత పొంగిపోనో!” అని నేననుకున్నాను.
అలా అనుకోగానే “అహాయ్! అదో కథవుతుందే” అని నాకు అనిపించింది.
అది మెరుపు మెరిసింది కథకు నాంది.
కథ ఎలా పూర్తయిందో తరవాత చెప్తాను.
(అనామిక మాసపత్రిక జనవరి 1975)
* * *

