దేశమంతా ఇవ్వాళ ‘చూపుడు వేలు చుట్టే’ తిరుగుతోంది. అది చూపుడు వేలుకు ఇంకు గుర్తు పెట్టే ఓట్ల రాజకీయాలు కావొచ్చు. ఆ రాజకీయాభిప్రాయాలను ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియా కావొచ్చు. అన్నీ చూపుడు వేలుతో బంధం అంటి పెట్టుకున్నవే! ఎందుకంటే సోషల్ మీడియాలో ఏం చేయాలన్నా మొబైల్ స్క్రీన్‌పై అడేది మొదట చూపుడు వేలే!
మనం`వాళ్లు అని ప్రజల మధ్యన విభజన రేఖలు గీస్తూ విధ్వంసాలకు, విద్వేషాలకు ఈ చూపుడు వేళ్ళే సోషల్ మీడియాలో పాదులు తీస్తున్నాయి. అయితే వీటన్నింటినికి ఇంకా చెప్పాలంటే విద్వేషానికి జవాబు జ్ఞానము పంచడమే విరుగుడు అని చెప్పే అంబేడ్కర్ చూపుడు వేలు చూపిస్తున్న మార్గాన్ని ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే సమాజంలోని మెజారిటీ అయిన బహుజన సమూహానికి, అందులో భాగమైన మైనారిటీ ముస్లిం సమాజానికి అంత మేలు జరుగుతుంది.
దేశంలో ప్రజాస్వామ్యానికి రక్షణనిచ్చేది ఈ చూపుడు వేలే! ఈ చూపుడు వేలు రూపొందించిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం, ఐకమత్యతని ప్రోది చేసి, భిన్నత్వంలో ఏకత్వాన్ని బోధించే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఇవ్వాళ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 ఏండ్ల పండుగ జరుపుకుంటున్నాం. ఒక వైపు పండుగ జరుపుతున్న ప్రభుత్వాలే అదే రాజ్యాంగ భావనలను పాతర వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్’, ‘సామ్యవాదం’ తొలగించే ఎత్తుగడలు వేస్తున్నాయి. భారతీయ జనతాపార్టీకి చెందిన నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి ఈ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకెక్కిండు. ఈ విచ్ఛిన్నకర ప్రయత్నాలకు అడ్డుకట్టను ఎవరి శక్తి మేరకు వారు వేయాలి అనే సాహిత్యాచరణలో భాగమే హుమాయున్ సంఫీుర్ కథల సంపుటి ‘మేరా బాప్ ఖయ్యూం’.
ఇవ్వాళటి బాధ్యతయుతమైన ముస్లిం యువతరం ఆలోచనలకు, వారి సాహితీ ప్రతిస్పందనలకు ప్రతినిధి హుమాయున్ సంఫీుర్. 15 కథల ఈ సంపుటిలో మెజారిటీ కథలు మైనారిటీల గురించి ఉన్నాయి. మిగతా వాటిలో దుర్మార్గమైన విభజన రాజకీయాలు, సామాజిక చింతనాతాత్వికత, కులోన్మాదానికి బలవుతున్న ప్రేమను, ప్రేమించే మనుషులను చిత్రించాడు. అవును.
అయితే మెజారిటీ మతోన్మాదం కాదంటే ఆధిపత్య కుల ఉన్మాదం ఎట్లా సమాజాన్ని విద్వేషపూరితం చేస్తున్నదో, విధ్వంసం సృష్టిస్తున్నదో కండ్ల ముందుంచిండు.
కథలు చదువుతూ ఉంటే వాస్తవ ఘటనలు బ్యాక్‌గ్రౌండ్‌లో కండ్ల ముందు కదలాడుతుంటాయి. కర్తవ్యాన్ని బోధిస్తూ ఉంటాయి. రోజూ పత్రికల్లో కథనాలుగా, వార్తలుగా, హృదయవిదారకంగా పరుచుకుంటున్న వాస్తవాంశాలను ఆ ఒక్క రోజుకే పరిమితం గాకుండా వాటికి చరిత్రలో శాశ్వత స్థానం కల్పించి, పాఠకుడిని విద్వేషపు ఆలోచనల్లోంచి బయటపడేసి ప్రేమవైపు మళ్లించడాన్ని స్వీయ బాధ్యతగా స్వీకరించి సంఫీుర్ నిర్వర్తించిండు.
ఈ అవసరమైన పనిని అరుంధతి రాయ్, రానా అయూబ్, ఆకార్ పటేల్, శశిథరూర్ లాంటి హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు నవలల ద్వారా చేస్తే దాదాపు అలాంటి పనినే సంఫీుర్ కథల ద్వారా చేస్తున్నడు. హిందూ-ముస్లిం సమాజాల మధ్యన కొత్త వంతెనలను మజ్బూత్‌గా నిర్మించే ప్రయత్నంలో భాగమిది.
తుకుడే తుకుడే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్, ఇస్లామోఫోబియా, వాట్సప్ యూనివర్సిటీ, హలాల్, హిజాబ్ పేరిట సమాజంలో చీలికలు తీసుకొచ్చి, పోలరైజేషన్ ద్వారా ఓట్లు దండుకోవాలని కుట్రలు పన్నే వారికి, ఎన్నికల్లో ఫలానా (సంఫీుర్ అభిప్రాయం ప్రకారం జాఫ్రానీ) పార్టీ తరపున పోటీ చేయడానికి టికెట్టు రాబట్టుకోవడానికి పోటీదారులు తొక్కే అడ్డదారులు, సాక్షాత్తు ప్రధానమంత్రే విద్వేష విషం జిమ్ముతూ రాజకీయాలను, ఓటర్లను ప్రభావితం చేయడాన్ని, సమాజాన్ని ముక్కలుగా విడగొట్టడాన్ని సంఫీుర్ కథలుగా మలిచిండు.
ముస్లిం సమాజం పట్ల హిందూత్వ పేరుతో సోషల్ మీడియా ఎట్లా ఏహ్యతను పెంచి పోషిస్తున్నదో, స్థిరీకరిస్తున్నదో ఈ కథల్లో రికార్డు చేసిండు.
ఇందులోని కథలని ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించవచ్చు. మొదటిది ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న అంతర్-బహిర్ సమస్యలు, స్వీయ సంస్కరణలు. రెండోది ఆధిపత్య కులోన్మాదం ‘పరువు నష్టం’ పేరిట దానికి లెజిటమసీని తెచ్చే ప్రయత్నం చేస్తున్న ఆధిపత్య వర్గాలు, వాళ్లు ముక్కలుగా నరికేస్తున్న ప్రేమ, ప్రేమికులు.
మూడోది ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన వ్యవస్థలే భక్షించే తక్షకులుగా ఎట్లా మారినాయో, వాటి సంస్కరణకు చేయాల్సిన కృషి. అట్లాంటి కృషిలో ఈవిఎంల స్థానంలో బ్యాలట్ వినియోగం తేవాలనేది ఒకటి.
ఇవి మూడు కూడా ఇవ్వాళ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాల్సిన అంశాలు. అందుకే సంఫీుర్ ఈ పరిష్కారానికి తన వంతు అక్షర బాధ్యతను నిర్వహించే క్రమంలో ఈ కథలల్లిండు. వాటిని చదివించే విధంగా చెప్పిండు. చెప్పిన దాన్ని పాఠకుడు చెవినెక్కించుకొని ఆచరించే విధంగా డ్రయివ్ చేసిండు.
అందుకే ఇవి చూపుడు వేలు బాటలో నడిచే ‘దిశా నిర్దేశ’ కథలు. సమాజం పట్ల బాధ్యతగల ప్రతి ఒక్కరినీ ముందుకు నడిపించే ‘చూపు’న్న కథలు.
ఇందులోని చాలా కథలు ఇప్పటి కామారెడ్డి జిల్లా గోపాలపేట దాని చుట్టుపక్కల గ్రామాల్లో, మరికొన్ని హైదరాబాద్ మహానగరంలో, ఒకటి నల్లగొండ కేంద్రంగా సాగినాయి. మొత్తమ్మీద అన్నీ తెలంగాణ జీవితాలే. 15 శాతం (దేశంలో ముస్లిం జనాభా శాతం) కథలో బ్యాక్‌గ్రౌండ్‌లో 2010 సంవత్సరానికి ముందు ఫోన్లు అందరికీ అందుబాటులో లేని సమయంలో, సైకిల్లు, సైకిల్ రిపేరు షాపులు బతికున్న కాలంలో పరిఢవిల్లిన అమ్జద్-సీనుల దోస్తానీ ఇయ్యాల రాజకీయ స్వార్థం కోసం ఎట్లా విచ్ఛిన్నం అవుతున్నదో చిత్రిస్తుంది.
ముస్లింలను మరకలని, పత్తర్‌బాజీ గాళ్లని, తుకుడే తుకుడే గ్యాంగ్ అని సోషల్ మీడియా ఎవరికోసం, ఎందుకు ప్రచారం చేస్తున్నదో, దానికి తోడుగా రాజకీయ పార్టీలు ఎట్లా అండగా నిలుస్తున్నాయో, అట్లా ప్రచారం చేసే వారికే ఎలా పార్టీ ప్లాట్‌ఫామ్‌ల మీద ప్రాధాన్యత దక్కుతుందో లెక్కలేసుకొని కార్యకర్తలు, నాయకులు పనిచేయడాన్ని, అంతిమంగా అది ముస్లింలపై ఏహ్యతను ఎట్లా స్థిరీకరిస్తున్నదో చెప్పిండు.
ఇట్లా చెప్పడమంటే సామాజిక బాధ్యతను సాహిత్యం ద్వారా నెరవేర్చడమే! బుద్ధిజీవులను జరగబోయే ప్రమాదాల గురించి హెచ్చరించడమే! అలర్ట్ చేయడమే!!
‘జోక్’, ‘ఖల్‌బలి’ కథల్లో వాట్సప్ యూనివర్సిటీ ద్వారా పెయిడ్ న్యూస్, కాంటెంట్ క్రియేటర్లు ఎట్లా నిత్యం అదే పనిగా సమాజంలోని ఒక వర్గం పట్ల ఏవగింపునే ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నాయో/రో రాసిండు. ఇది వరకు ఇట్లాంటి పనులు చేయాలంటే మీడియా కొంచెం సిగ్గు పడేది. విలువలున్నట్లు కనీసం నటించేవి. ఇప్పుడలాంటి అవసరం లేకుండానే ‘సుదర్శన్’ లాంటి చానళ్లు యూపీలోని ‘సంభల్’ లాంటి సంఘటనలను బాధితులపైనే బండలు మోపే విధంగా ప్రచారం చేస్తున్నాయి.
ట్రోలింగ్‌ని ఒక టూల్‌గా ఉపయోగిస్తూ మైనారిటీలను, వారి పక్షాన మాట్లాడే ప్రజాస్వామిక, లౌకిక వాదులపై దాడులు చేయడం సహజ చర్యగా మారింది. ముస్లింల దగ్గర ఏవీ కొనొద్దు అనే దాకా ఈ అంశం పోయింది. అయితే పెట్రోలియం ముస్లిం దేశాల నుంచి కొనకుంటే ఇండియాకు నడవదనే విషయాన్ని సంఫీుర్ గుర్తు చేస్తడు.
ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నుపుర్ శర్మపై భారతీయ జనతాపార్టీ చర్యలు తీసుకున్న విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే ఎన్నికల రాజకీయాలకు, ఓటర్ల పోలరైజేషన్‌కు ఏ మేరకు విద్వేషం అవసరమో ఆ మోతాదు ఉన్మాదాన్ని మెయింటెయిన్ చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ‘పింకీలు’, ‘కాంగీలు’, ‘కమ్మీలు’, ‘బత్తాయిలు’ ఇట్లా పార్టీల పరంగా విడిపోయి ఎవరి టెక్నాలజీ, మనీ పవర్ ఎక్కువుంటుందో వారి మాటే చెల్లుబాటయ్యే వికృత క్రీడలో అనివార్యంగా అందరూ భాగస్వాములు అవుతున్నారు. ఆఖరి ఫలితం తెలిసినా ఆట ఆడాల్సి రావడమే విషాదం. ఆ విషాదాన్నే సంఫీుర్ అక్షరాలుగా మలిచిండు.
15 శాతం కథలో శ్రీను, ‘ఖల్‌బలి’ కథలో నరేష్‌లు తమ విద్వేష ప్రచారాన్ని వదిలి ప్రేమ తత్వంలోకి రావడాన్ని ఆశావాహ దృక్కోణంతో చిత్రించిండు. ‘ఖల్‌బలి’ కథలో నరేషు తల్లి కరోనా సమయంలో చనిపోతే అప్పటి వరకు తాను అంటకాగిన మతోన్మాదులు ఆదుకోలేదు. అయితే అదే సమయంలో ముస్లిం దోస్తులు ముందుకొచ్చి హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిని ఖననం చేసి అండగా నిలిచిన విషయాన్ని రికార్డు చేసిండు. ఈ దృక్కోణమే భవిష్యత్‌కు భరోసా కల్పిస్తున్నది.
ఖననం చుట్టూతా ఉండే సంప్రదాయాలు, రాజకీయాల గురించి కూడా తన కథల్లో సంఫీుర్ చెప్పిండు. ఖల్‌బలితో పాటుగా, బేగమక్క, చెదపురుగు కథల్లోనూ ఖనన, కబ్రస్తాన్ రాజకీయాలున్నాయి.
ముసల్మాన్లకు ‘కబరస్తాన్ యా పాకిస్తాన్’ రెండే మార్గాలు అనే నెరేషన్ ఎనుకటి నుంచి సాగుతూ ఉన్నదే!
‘చెదపురుగు’ కథలో రాజకీయ ప్రాపకం కోసం గోపాల్‌పేట సర్పంచ్ ముస్లింల పదెకరాల కబ్రస్తాన్‌ని కబలించాలని చూస్తే దాన్ని చాకచక్యంగా ముస్లింలు పరిష్కరించిన తీరు, అదే సమయంలో దళితులతో ప్రేమాభిమానాలను చూరగొన్న తీరుని చదివి తీరాలి. విషయం చెబితే ఆ ఉత్కంఠ, ఉద్వేగం రాదు.
ముస్లిముల్లో అంతర్గత సంస్కరణ రావాలని ఆత్మగౌరవం తమ హక్కు అని చాటి చెప్పిన కథ ‘మేరా బాప్ ఖయ్యూం’. ఇందులోనూ ఖననం, చావు ఉన్నప్పటికీ ఇది ప్రధానంగా ఆస్తి కోసం గాకుండా ఆత్మగౌరవం కోసం జరిగింది. తాహెరా బేగం కొడుకు కోర్టుకు పోయి కొట్లాడి తన తండ్రి ఖయ్యూం అని నిర్ధారింపజేసి తన ‘జాయిజ్’ పుట్టుకను చెప్పుకున్నాడు. ఈ కథ నల్లగొండలో కేంద్రంగా జరిగినట్టుగా కథకుడు చిత్రించిండు. తండ్రి స్పర్ష ఎరుగని సంఫీుర్ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న కథ ఇది. తల్లి పేరు తాహెరా బేగమ్ అని చెప్పుకోవడం ద్వారా కూడా ఇది అర్థమవుతుంది.
‘మేరా బాప్ ఖయ్యూం’ మాదిరిగానే ‘సైతాన్’లోనూ ఇద్దరు భార్యల సమస్య/సంఘర్షణ చిత్రితమయింది. హృదయపూర్వకంగా మంచి చేయాలని తాను చేసిన పనులకు మానసిక ఘర్షణ ఎదుర్కొన్న ఒక తండ్రి ఐదుగురు పిల్లల కథ ఇది. ఇందులో అందరూ ఉన్నత చదువులు చదువుకున్నవారే అయినా ఒక తండ్రిని రెండు పెండ్లిండ్లు చేసుకున్నందుకు అనుమానితుడిగా, విలువలు లేని వ్యక్తిగా ‘సొంత’ సంతానమే చూడ్డం చాలా విచారకరం. అయితే బంధువు గౌస్ చెప్పిన వాస్తవాలతో అనుమానాలు నివృత్తి అయితాయి. ఇట్లా ముస్లిం జీవితాల్లోని విస్మృత కోణాన్ని చిత్రిస్తాయి.
‘మై చాయిస్’ కథలోనూ షాహిన్ ఉన్నత విద్యావంతురాలు. అయితే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేయాలంటే ‘హిజాబ్’ ధరించకూడదనే విషయంలో రాజీ పడలేదు. కరోనా సమయంలో ఉద్యోగం అత్యవసరమైనా అట్లా రాజీపడక పోవడం, అందుకు రచయిత చివర్లో వివరణ ఇస్తూ వ్యక్తిగత ‘స్వేచ్ఛ’ను ప్రస్తావించి కొంత తన పాయింట్‌ని సమర్ధించుకునే ప్రయత్నం చేసిండు. ‘స్వేచ్ఛ వర్సెస్ సంప్రదాయం’ గురించి లోతైన చర్చకు ఈ కథ తెరతీసింది. తళుకు బెళుకుల సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు పొందుతున్న ముస్లిములు చాలా తక్కువ. అందునా మహిళలు మరీ తక్కువ. అట్లాంటి సమయంలో వచ్చే ఉద్యోగాన్ని తన ‘హిజాబ్’ మూలంగా నిరాకరించడం బహుశా ఆత్మగౌరవ అంశంగా చూస్తే కరెక్టే కావొచ్చు, కాని కొత్తవారికి దారి చూపే అంశంగా చూసినప్పుడు ఆ అంశాన్ని సమర్ధించలేము. ఏదీ ఏమైనా ఈ విషయాన్ని చర్చకు పెట్టడం ద్వారా ‘హిజాబ్’ ధారణ మరోసారి ప్రధానాంశమైంది.
‘నిర్మాణం’ కథలోనూ తాజ్‌మహల్ కింద ‘శివాలయం’ ఉందనే ప్రచారంతో రాజకీయాలు చేసేవారి మానసిక స్థితిని గురించి, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితికి అద్దం పడుతుంది. యూపీలోని ‘సంభల్’లో ఇప్పుడిదే జరుగుతోంది. అందుకే సంఫీుర్ ముందుచూపున్న కథకుడు అని చెప్పాలి. ‘విద్వేషానికి ప్రేమనే జవాబు’, ‘ప్రేమ గొప్పది, శాశ్వతమైనది’ అని సూఫీతత్వాన్ని ఈ కథలో చెప్పిండు.
బాటలు, ఫేమ్, రంగుల కళ, స్వచ్ఛత, నిరాకరణ కథల్లో సినీ, సాంస్కృతిక రంగాల్లో కళామతల్లి ఒడిలో ఎట్లా కులోన్మాదం పడగ విప్పుతోందో చెప్పిండు.
38 ఏండ్ల తన కూతురుకు ఒక సాహితీవేత్త తాను కథల్లో చెప్పే అభ్యుదయ భావాలకు భిన్నంగా తమ కులానికే చెందిన అల్లుడు కావాలని అర్రులు చాచి బిడ్డ గొంతు కోయాలని చూడడాన్ని సంఫీుర్ కథగా మలిచిండు. తాను కూడా సినిమా రంగంలో పనిచేస్తున్నాడు కాబట్టి దగ్గరగా చూసి వాస్తవానికి దర్పణంగా చిత్రించాడు.
‘స్వచ్ఛత’ కథలో మరీ దారుణంగా ఆధిపత్య కులానికి చెందిన అమ్మాయిని పెండ్లి చేసుకున్న దళితుడు తన పెండ్లికి తల్లిదండ్రులను రావొద్దని శాసించడం, అంటే పెండ్లికి ముందే ఆధిపత్యం కులం వారికి అల్లుడు ‘జీ హుజూర్’ అనే తీరుకి అద్దం పడుతుంది. ఎటు తిరిగీ అజమాయిషీ ఆధిపత్య కులాల వారిదే ఎట్లా చెల్లుబాటవుతాయో ఈ కథలు చెబుతాయి.
సినిమా రంగంలో గుర్తింపు రావాలంటే ఉన్న ఐడెంటిటీని ఏమార్చి కొత్త ముసుగు వేసుకోవడం పరిపాటి. అందుకే సబాల్టర్న్ వర్గాలు పేర్లు మార్చుకొని గుర్తింపుని రద్దు చేసుకుంటారు. అదే సమయంలో కులాధిపత్యం ప్రదర్శించే వారికి వారి పేర్లలోని రావు, చౌదరి, శర్మ, శాస్త్రి, రెడ్డి అదనపు ప్రయోజనాలను చేకూరుస్తూ ఉంటే ఖళీల్, సాహిల్ లాంటి ముస్లింలకు ఆ పేర్లే అడ్డంకిగా ఉంటాయి అని గుర్తిస్తూనే ఆఖరికి ఒరిజినల్ ముస్లిం పేరుతోనే రాణించాలనే పట్టుదలను ఈ కథలు రికార్డు చేస్తాయి.
ఈ కథలతో పాటుగా గతంలో ఎయిడ్స్ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో రాసిన ‘సౌందర్య’, ప్రస్తుతం ప్రధాన స్రవంతిలో ఎక్కువగా వినిపిస్తున్న ట్రాన్స్ జెండర్‌లపై రాసిన ‘సుగంధ’ కథలు కూడా ఇందులో ఉన్నాయి.
‘సుగంధ’గా మారిన కిట్టూ కథ చదివినట్లయితే ట్రాన్స్‌జెండర్ల మానసిక సంఘర్షణ, సమాజం వారి పట్ల ఎంత ఇన్‌సెన్సిటివ్‌గా వ్యవహరిస్తుందో తెలుస్తుంది.
ఇక్కడే ఒక విషయాన్ని చెప్పుకోవాలి. సమాజాన్ని ఇంత ఇన్‌సెన్సిటివ్‌గా మారుస్తున్నదెవరు?
ఏహ్యతను పెంచడం ద్వారా ఎవరికి మేలు జరుగుతోంది?
రాజ్యాంగ రక్షణ బాధ్యత ఎవరిది?
వ్యవస్థలను కాపాడవలసిన వారే కాలరాస్తే నిలదీయాల్సిన యువత ఎందుకు నిర్లిప్తంగా ఉంటుంది?
ఇవన్నీ చర్చించాల్సిన అంశాలే. ప్రధానంగా ఇంటర్నెట్ అతి చవకగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్రాధాన్యత పెరిగింది. దానికి తోడు విజువల్ మీడియాపై ఆధిపత్యం సాధించిన వారే రాజకీయాల్లో రాణిస్తున్నారు.
ఇవ్వాళ అంబానీ, ఆదానీలదే మీడియాలో రాజ్యం. వాళ్లు చెప్పిందే శాసనంగా చలమాణి అవుతున్నది. మీడియాలోనే విచారణ చేసి తీర్పులిచ్చి ముస్లిం సమాజాన్ని దోషులుగా చిత్రిస్తున్నారు.
హిందూత్వ నెరేషన్ ద్వారా ప్రజలకు నీరక్షీర వివేకంతో ఆలోచించే అవకాశాన్ని నిరాకరిస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని ఛానళ్లు ఏహ్యతను పెంచడానికే పనిచేస్తున్నాయి. అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో బుద్ధిజీవులు నిలదీత పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తున్నారు.
అంతెందుకు లౌకిక దృక్కోణంతో పనిచేయాల్సిన ‘సంసద్’ టీవీ ఛానల్ సైతం రోజూ పొద్దున్నే ఆధ్యాత్మికతను లైవ్‌గా చూపిస్తోంది. ఇట్లాంటి సమయంలో ప్రజలని సెన్సిటైజ్ చేసి, విచక్షణతో ఆలోచించేలా చేయడానికి ఎవరికి వారు ఉన్మాదాన్ని ప్రశ్నించాలి. నిలదీయాలి. ఆ పనిని సాహిత్యం ద్వారా చేస్తున్న సంఫీుర్‌కు అభినందనలు.
ఇప్పటికే 15 కథలతో ‘కాముని కంత’, మరో 14 కథలతో ‘ఇల్లింతపండ్లు’ అనే రెండు కథా సంకలనాలు తీసుకొచ్చిన సంఫీుర్ రెండేండ్లల్లో తీసుకొస్తున్న మూడో సంపుటి ఇది.
ఒక వైపు జీవిక కోసం సినిమా, టెలివిజన్ రంగాలతో నడుస్తూనే, మరోవైపు సామాజిక బాధ్యతల్లో భాగంగా సాహితీ సృజనలోనూ రాణిస్తున్నాడు. నిజానికి ఉమ్మడి నిజామాబాద్ నుంచి కథలు రాస్తున్న వాళ్లు చాలా అరుదు. ఒకప్పుడు సిహెచ్ మధు లాంటి వారు విరివిగా రాశారు. ఆ పరంపరను కొనసాగిస్తున్న వారు చాలా అరుదు. ఆ అరుదైన వ్యక్తి సంఫీుర్. ఈ నడక ఆగకుండా సాగాలని ఆశ.